” మా ఊరికి సారా వద్దు ” – అన్వేషి టీమ్‌

పదొమ్మిది వందల తొంభై దశకంలో ఆంధ్రప్రదేశ్‌లో పెద్దఎత్తున సారా వ్యతిరేక ఉద్యమం జరిగింది. నెల్లూరు జిల్లాలోని దూబగుంట గ్రామంలో రోశమ్మ అనే గ్రామీణ, నిరక్షరాశ్య దళిత మహిళ ప్రారంభించిన సారావ్యతిరేక ఉద్యమం కార్చిచ్చు అడివంతా వ్యాపించినట్టు ఆంధ్ర దేశమంతా విస్తరించింది. ఈ ఉద్యమం ఒక ఎత్తుగడతో, ఒక సైద్ధాంతిక దన్నుతో జరగలేదు. సారావల్ల తమ కుటుంబాల్లో నిత్యం హింసలని ఎదుర్కొంటున్న గ్రామీణ మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమంలోకి వచ్చి తమ గ్రామాల్లో తమ కళ్ళెదుట వున్న సారాకొట్లను మూయించడం ఆచరణగా తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో, ఎక్సైజ్‌ పోలీసులతో ప్రత్యక్ష సంఘర్షణకి కూడా దిగారు. వీరంతా ఏదో ఒక రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్తలు కాదు. అప్పటికప్పుడు రూపొందించుకునే వినూత్న కార్యాచరణలతో సారావ్యతిరేక ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నడిపారు.

గొప్ప ఉద్యమస్ఫూర్తితో తమ మీద అమలవుతున్న హింసలకి వ్యతిరేకంగా గళమెత్తిన ఈ మహిళల్ని స్వయం సహాయక బృందాలుగా రూపొందించిన క్రమం… ఆ పరిణామం ప్రస్తుతం ఎలాంటి దశలో వున్నదీ, హింసల్ని ప్రశ్నించిన ఆ గొంతులే, పిడికిలెత్తి నినదించిన ఆ చేతులే ఈ రోజు మైక్రోఫైనాన్స్‌ ఉచ్చులో, అప్పుల ఊబిలో దిగబడిపోవడం ఓ చారిత్రక విషాదం. ఇప్పుడు మద్యం ఏరులై పారుతున్నా, గృహహింస భయంకర స్థితికి చేరినా నోరువిప్పలేని ఓ మహామౌనస్థితి నేడు నడుస్తోంది. స్వయం సహాయక బృందాల చుట్టూ రాజకీయం, రాజకీయలబ్ది రాజ్యమేలుతున్నాయి. సంక్షేమ పథకాలను మోసే పల్లకీలుగా ఈ బృందాలు రూపాంతరం చెందడం మనం చూస్తూనే వున్నాం.

అడుగడుగునా వైన్‌షాప్‌లు, బెల్టు షాపులు, కల్లు కాంపౌండులు… ప్యాకెట్లలో సారాకూడా రాబోతోందనే భయానక వార్తలూ గుప్పుమంటున్నాయి. స్త్రీలు, బాలికల రక్షణ కోసం ప్రభుత్వం తెచ్చిన అన్ని చట్టాలు మద్యం మహాసముద్రంలో మునకలేస్తున్న వైనం క్షణక్షణం కనిపిస్తూనే వుంది. ప్రభుత్వ గణాంకాలే కళ్ళకు కట్టి చూపిస్తున్నాయి.

నెల్లూరులో సారా వ్యతిరేక ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్నపుడు అన్వేషిటీమ్‌గా మేమందరం ఆయా గ్రామాల్లో పర్యటించి…. ఆ స్త్రీలతో మాట్లాడి రూపొందించిన రిపోర్ట్‌ భూమిక ప్రారంభ సంచిక (జనవరి-మార్చి 1993) లో ప్రచురించాం.

ఈనాటి నేపథ్యంలో ఈ రిపోర్ట్‌ను పుర్ముద్రంచాల్సిన అవసరం ఉందనిపించింది. భూమిక కొత్తపాఠకుల కోసం కూడా ఈపని చెయ్యాలనిపించింది.

– ఎడిటర్‌

1992 నవంబర్‌లో హైదరాబాద్‌ నుంచి అన్వేషి రిసెర్చి సెంటర్‌ ఫర్‌ ఉమెన్స్‌ స్టడీస్‌ నుంచి వెళ్ళిన ఈ టీమ్‌లో సభ్యులుగా తేజస్విని నిరంజన, దియారాజన్‌, మేరి జాన్‌, రమా మెల్కొటే, కె. లలిత, టి.యస్‌.యస్‌.లక్ష్మి, వీణా శత్నఘ్న, కె. సజయ,

కె. సత్యవతి ఉన్నారు.

గత దశాబ్దంగా రాష్ట్రంలో తెలంగాణా జిల్లాల్లోనూ, ఇతర ప్రాంతాల్ల్లోనూ సారా సమస్య ఏదో ఒకరకంగా ఉద్యమ రూపంలో తలెత్తుతూ వస్తోందనే విషయంలో సందేహం లేదు. అయితే మిగతా ప్రాంతాలన్నింటితో పోలిస్తే నెల్లూరు జిల్లా ఉద్యమంలో ఒక విశిష్టత కనపడుతుంది.

నెల్లూరు జిల్లాలో ప్రారంభమైన ఈ సారా వ్యతిరేక స్త్రీల పోరాటం ఇవాళ రాష్ట్రమంతటా ఒక సంచలనాన్ని రేపింది. ప్రతివారినీ ఈ ఉద్యమం ఏమిటి? ఈ ఉద్యమ స్వభావం ఏమిటి? దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఉద్యమం పుట్టు పూర్వోత్తరాలేమిటి అనే ప్రశ్నలు వేధిస్తున్నాయి. కాని నిజానికి ఈ ప్రశ్నలన్నింటి కంటే ముఖ్యమైనవి మనం అడగాల్సినవి వేరే ఉన్నాయి. స్త్రీలు ఏం సాధించాలని ఈ ఉద్యమాన్ని నిర్మించారు. వాళ్ళ డిమాండ్లేవిటి, ఉద్యమ క్రమంలో వాళ్ళ అనుభవాలేమిటి, వాళ్ళెదుర్కొన్న ప్రతిబంధకాలేమిటి, మనం వారి అనుభవాల్ని ఏ విధంగా అవగాహన చేసుకోవాలి అనే ప్రశ్నలు ముఖ్యం. దాని కోసమని మేం కొంతమంది స్త్రీలం హైదరాబాద్‌ నుంచీ నెల్లూరు జిల్లా గ్రామాలకు వెళ్ళి వచ్చాం. అల్లూరు, ఆత్మకూరు, ఉదయగిరి మండలాల పరిధుల్లోని పన్నెండు గ్రామాలలోని స్త్రీలని కలిసి మాట్లాడటం జరిగింది. వారి అనుభవాల ఆధారంగా ఈ విశ్లేషణ మీ ముందు ఉంచుతున్నాం.

నెల్లూరులో ఈ ఉద్యమాన్ని ప్రప్రథమంగా మొదలు పెట్టిన గ్రామీణ పేద స్త్రీలు, సారా వల్ల కుటుంబంలో రోజూ తామెదుర్కొంటున్న బాధల కారణంగా ప్రభుత్వ సారా అమ్మకాల్ని వ్యతిరేకించడం అనేది, వారి జీవితాల మీద వారికి పట్టు దొరకటం, వారి భర్తలతో ఉన్న సంబంధంపైన ఆ ప్రభావం ఉండటమే గాక వారి సాంఘిక జీవనంలో కూడా చాలా మార్పు వచ్చింది. వారి గ్రామాలకు మాత్రమే పరిమితమైన ఈ ఉద్యమం, గ్రామాల్లో ఉన్న సారా కొట్లను మూయించటం, ఎక్సైజు డిపార్టుమెంటు ఉద్యోగులను, ఎక్సైజు పోలీసులను ఎదుర్కోవటం, ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని, దాని ఆర్థిక వ్యవస్థను ఒక ఊపు ఊపాయి. సాంప్రదాయ రాజకీయ పరిధుల్లో క్రియాశీల కార్యకర్తలుగా ఎన్నడూ స్థానం లేని ఈ స్త్రీలు, వినూత్న రీతిలో పోరాట రూపాల్ని పెంపొందించుకుని ఉద్యమానికి ఊపిర్లు పోశారు. రాజకీయాలకి కొత్త అర్థాన్ని ఇచ్చే క్రమంలో ఉన్నారని మేం భావిస్తున్నాం.

నెల్లూరులో ఉన్న ఏ రాజకీయ పార్టీగాని, గ్రూపులు గానీ ఈ ఉద్యమానికి ముందు నుంచీ ఒక సైద్ధాంతిక రూపాన్ని గానీ, కార్యాచరణని గానీ, ఎత్తుగడలని గానీ అందించినట్లు కనపడదు. ‘సారా’ చుట్టూ అల్లుకుని ఉన్న విస్తృత సమస్యలను వివరించిన ఈ స్త్రీల మాటలు ఏ వర్గపు విశ్లేషణకీ అందవు. దైనిందిన జీవితంలో – కుటుంబ ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యం, విద్య, వ్యక్తిగత జీవితం ఇవన్నీ సారా వల్ల ఎలా అణగారి పోతున్నాయో చెప్పారు. సారా సమస్యను కీలకమైన విషయంగా అర్థం చేసుకున్నారు.

వారుణి వాహిని :

మన రాష్ట్రంలో ఈ సారా అమ్మకాల గణాంక వివరాలను పరిశీలిస్తున్నపుడు, అందులో ఇమిడి ఉన్న డబ్బునీ, వచ్చే ఆదాయాన్ని, వాటి పరిణామాన్నీ గమనించిన మేము నిజంగా నిర్ఘాంతపోయాం. అధికార లెక్కల ప్రకారమే సారా అమ్మకాలపై 1981-82లో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 150.5 కోట్ల రూపాయలు. అది 1991-92కి 630.27 కోట్ల రూపాయలకు పెరిగింది. మత్తు పానీయాల అమ్మకాలపై వచ్చే ఆదాయంలో అధికభాగం సారాపై వచ్చేదే. 91-92 రాష్ట్రం పన్ను వసూలులో 28% ఎక్సైజ్‌ నుంచీ వచ్చిందే. కల్లు అమ్మకంపై వచ్చేది 65 కోట్ల రూపాయలు మాత్రమే. మన దేశంలో తయారయ్యే విదేశీ మత్తు పానీయాల అమ్మకంపై వచ్చేది 112.8 కోట్ల రూపాయలు. అసలు సారా వల్ల వచ్చే మొత్తం ఆదాయంలో ప్రభుత్వానికి వచ్చేది మూడోవంతు మాత్రమే. మిగతాది సారా కాంట్రాక్టర్ల జేబుల్లోకి పోతుంది. పోయిన సంవత్సరం దాదాపు 2000 కోట్ల రూపాయలు బడుగు వర్గాల ప్రజానీకం నుంచీ పిండుకోటం జరిగింది. రాష్ట్ర వార్షిక ప్రణాళికకు కేటాయించినది 1,724 కోట్ల రూపాయలు మాత్రమే. ఇంకా కొన్ని వివరాలు ఈ కింది పట్టికలో ఉన్నాయి.

1991-92 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రంగాల్లో ఖర్చులు రాబడులు

రాబడి రూ. కోట్లలో

సారా నుంచి ఎక్సైజు సుంకం 630.2

మత్తు పానీయాలపై మొత్తం ఎక్సైజు సుంకం 808.0

ఖర్చు రూ. కోట్లలో

గ్రామీణ ఆరోగ్యం 45.8

గ్రామీణ నీటి సరఫరా 70.6

స్త్రీ శిశు సంక్షేమం 57.5

వయోజన విద్య 9.7

(ఆధారం : 1991-92 సంవత్సరం రాష్ట్ర బడ్జెట్‌, ఆంధ్రప్రదేశ్‌)

అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావు ధర్మమా అని ‘వారుణి వాహిని’ పథకం 1980లో ప్రారంభం అయింది. ఇప్పుడు తాను మద్య నిషేధానికై నిలబడుతానని చెప్తున్న ఆయన, ఈ పోరాటాన్ని స్వప్రయోజనానికి వాడుకోవాలనుకుంటున్నాడు. ‘వారుణి వాహిని’ పథకం వల్ల అప్పటి వరకూ కుండల్లోనూ, సీసాల్లోనూ దొరికే సారా, కల్తీ లేకుండా ఉంటుందనే మిషతో పాకెట్లలో సరఫరా అవటం మొదలైంది. అసలు సంగతేమిటంటే ప్యాకెట్లలో రవాణా చేయటం సులభం, కొనుక్కుని ఇళ్ళకు తీసుకెళ్ళటానికి వీలుగా కూడా వుంటుంది. అప్పటి నుంచే జిల్లా స్థాయిలో ఒక్క చోటే వేలం పాటలు జరగటం మొదలయ్యాయి. దీనిలో పెద్ద వ్యాపారులు చిన్న వ్యాపారులకు ఊర్లలో సారా అమ్మకాలకి హక్కులు అమ్మటం జరుగుతుంది. ఈ చిన్న వ్యాపారులే నెలసరి పద్ధతిపై ప్రభుత్వానికి పెద్ద మొత్తాలు చెల్లించాల్సి ఉంటుంది. పెద్ద ఎత్తున లాభాలు పొందటానికి ఈ చిన్న వ్యాపారులు గ్రామాల్లో సారా అమ్మకాలని ఉధృతం చేశారు. దాని ఫలితంగా ఈ సారా వెల్లువ గ్రామీణ జీవితాన్ని ఛిన్నాభిన్న చేసింది. మచ్చుకి ఒకటి చెప్పాలి. భూస్వాములు కూలీలకు పైకం బదులు సారా కొనుగోలు కూపన్లు ఇవ్వటం పరిపాటి అయ్యింది. అంటే రోజంతా పనిచేస్తే ఇంటికి చేరేది డబ్బు కాదు, తప్పతాగిన మగవాళ్ళు.

మేం చూసిన గ్రామాల్లో సేకరించిన సమాచారాన్ని బట్టి తెల్సిందేమింటంటే ఈ ఉద్యమానికి విత్తనాలు అనేక రకాలుగా పడ్డాయి. అందులో ఒకటి ‘అక్షరదీపం’ కార్యక్రమం. నిరక్ష్యరాస్యతను నిర్మూలం చేస్తామని ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమాన్ని గ్రామల్లోని స్వచ్ఛంధ సేవా సంస్థలు నడిపాయి. నెల్లూరు జిల్లా ఉత్సాహంతో ముందడుగు వేసింది. 2000 మంది పైగా స్త్రీలూ, పురుషులూ స్వచ్ఛందగా విద్య నేర్పటానికి ముందుకు వచ్చారు. అందులో ఎక్కువ మంది స్త్రీలూ, యవతులూ కావటం గమనించదగ్గ విషయం. అధికారులు, ఇతర ప్రభుత్వ సిబ్బందితో కలిసి నెల్లూరు ‘జన విజ్ఞాన వేదిక” వారు ఈ అక్షరాస్యత కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఉద్యమారంభాన్ని గురించి మేము విన్న ఒక సంగతేమి టంటే అయ్యవారిపల్లి అనే ఊళ్ళో అక్షరజ్యోతి, కార్యక్రమాన్ని ప్రారంభించటానికి ఒక రాష్ట్ర మంత్రి, జిల్లా కలెక్టరు వచ్చారు. కొందరు తాగుబోతుల వలన ఆ కార్యక్రమం గల్లంతు అయింది. ఆ ఊరి ఆడవాళ్ళు, సారా షాపులను మూయిస్తే తాము ప్రశాంతంగా చదువు నేర్చుకోగలమనీ, సారాని అమ్మటం ఆపాలని అధికారులను కోరారు. కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలనే ఆరాటంలో ఆ అధికారులు దీనికి అంగీకరించారు. ఈ స్త్రీల విజయం గురించిన కథలు అక్షరాస్యతా ప్రాథమిక పాఠ్యపుస్తకాల్లోకి ఎక్కాయి. దూబగుంట గ్రామం కథ అటువంటిదే. (ఆడవాళ్ళే ఏకమైతే – అనే కథ). తప్పతాగిన ముగ్గురు కూలీలు దారి తప్పి చెరువులో పడి చనిపోతారు. ఒక వందమంది స్త్రీలు స్థానిక సారాబండిని అడ్డగించి ఊళ్ళోకి రానీకుండా చేస్తారు. తరువాత సారా ప్యాకెట్లతో నిండి ఉన్న ఒక జీపుని వెనక్కి తిప్పి పంపేస్తారు. దీని తరువాత – ఆ పాఠంలో ఏముందంటే – కాంట్రాక్టర్ల అమ్మకం హక్కును అమలు పరచటానికి పోలీసులు రంగ ప్రవేశం చేస్తారు. ఆడవాళ్ళు చెక్కు చెదరలేదు. అవసరమైతే కలెక్టరు దాకా వెళ్తామంటారు. ”ఈ సంవత్సరం మా ఊళ్ళో సారా అమ్మకాలకి ఏ కాంట్రాక్టరూ ముందుకు రాలేదు” అని చెప్తారు.

మేం కలిసిన ఆడవాళ్ళు, పుస్తకంలోని మిగితా పాఠాల సంగతీ, విషయాల గురించీ, ఛార్టుల గురించీ చెప్పారు. ఉదాహరణకి ‘సీతమ్మ కథ’, ‘ఐకమత్యం’, ‘ఈ చావుకి కారకులెవ్వరు?’ వంటివి. అక్షరాస్యత క్లాసులకి వచ్చేవారిని ఈ కథలు ఉత్తేజ పరిచాయి. ‘ఈనాడు’ వంటి న్యూస్‌ పేపరు సారాకు సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు ప్రచురించి మరింత దోహదం చేసింది. – అక్షరజ్యోతి సెంటర్లలో ఈ పేపరు చదవటం, వినిపించటం కూడా జరిగేది.

చాలామంది విషయంలో వారి జీవితాల్లోని విషాద సంఘటనలు వారిని ఈ పోరాటం వైపు నడిపించాయి. ముఖ్యంగా తమ అనుభవాల వంటివే మిగతా స్త్రీల జీవితాల్లో కూడా ఉన్నాయని తెలుసుకున్నపుడు. ఆడవాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వరకు తీసుకెళ్ళిన దారుణ అనుభవాలు కోకొల్లలు. మహిమలూరు గ్రామంలోని హరిజనవాడలో ఒక స్త్రీ తాగుబోతు భర్త ప్రవర్తన వల్ల ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామంలోని ముస్లిం స్త్రీలు ఈ వార్త విన్నప్పుడు వారి అడుగు సారా వ్యతిరేక పోరాటం వైపు పడిందని చెప్పారు. ఈ విధంగా అనేక అనుభవాలు, సంఘర్షణలూ, చర్చలూ పోరాటం వైపు దారి తీయించిన విధాన్ని మననం చేసుకుంటూ – ఏదో ఒక్క సంఘటన మాత్రం దీనికి కారణం కాదని చెప్పారు.

ఈ నేపథ్యంలో కొద్ది నెలల వ్యవధిలోనే 800 గ్రామాలకు పైగా ఈ పోరాటం వ్యాపించటం చెప్పుకోదగ్గ విషయమే. చాలా గ్రామాల్లో సారా కొట్లను ముయించేశారు. రాత్రి పగలనే బేధం లేకుండా స్త్రీలు చంకల్లో పిల్లల్నేసుకుని అన్నం మూటలు గట్టుకుని వేలం జరిగే ప్రభుత్వ కార్యాలయాల ముందు పికెటింగ్‌లు చేశారు. స్త్రీల ప్రతిఘటన మూలంగా ఇప్పటికి 32సార్లు వాయిదాలు పడ్డ నెల్లూరు జిల్లా సారా వేలం పాట జరగనే లేదు. దానివల్ల, వేలం పాట లేకుండా నెల్లూరు జిల్లాల్లో ఇప్పుడు సారా అమ్మకం చట్ట విరుద్దం అవుతుంది. అయితే ఎక్సైజ్‌ డిపార్టుమెంటు అధికారుల మద్ధతుతో దొంగచాటుగా సారా అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. మద్య నిషేధం ఉన్న రాష్ట్రాల్లో దొంగసారా అమ్మకాల్లాంటిది కాదు ఇది. ఎక్సైజు అధికారులే చాటు మాటుగా సాగిస్తున్న వ్యవహారం. ఈ స్త్రీలు సారా షాపులు మూయించటం, సారా ప్యాకెట్లు ధ్వంసం చేయ్యటం, కాంట్రాక్టర్ల దాడులనూ, ఎక్సైజ్‌ అధికారులా, పోలీసులా, ఒత్తిడులను కూడా ఎదుర్కొన్నారు. గ్రామాల్లోని యువజన సంఘాలు ముఖ్యంగా దళిత సంఘాలు ఈ పోరాటానికి బాసటగా వచ్చాయి. ఈ పోరాటానికి సంఘీభావంగా 92లో ఆగష్టు నెలలో జన విజ్ఞాన వేదిక న్యాయకత్వం కింద వివిధ సంస్థలూ, స్వచ్ఛంద సేవా సంస్థలతో సారా వ్యతిరేక కమిటీ ఏర్పడినప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలు గ్రామాల్లో ఏం జరుగుతోందో గ్రహించాయి.

ఇప్పుడీ ఉద్యమం ఆంధ్ర జిల్లాలన్నింటి లోను పుంజుకుం టోంది. ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతపు ప్రత్యేక సమస్యలను ఎదుర్కొవలసి వస్తోంది. గుజరాతు, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్న మద్యపాన నిషేధానికి, మన రాష్ట్రంలోని ఈ సారా వ్యతిరేక ఉద్యమానికీ ఉన్న తేడా ఏమిటంటే – ఇక్కడ చట్టం సహకారం లేకపోవడమే కాకుండా, ప్రభుత్వానికీి సారా కాంట్రాక్టర్లకీ ఉన్న విడదీయరాని పరస్పర సహకారంతో వచ్చిన అధికార బలంతో తలపడుతూ, ‘మా ఊరికి సారా వద్దు’ అని స్త్రీలు స్థిర నిశ్చయంతో పోరాడుతున్నారు.

సమస్యల మధ్య పరస్పర సంబంధం

మనకి కొట్టొచ్చినట్లు కన్పించేదేమిటంటే, సారా సమస్య ఇంకా ఎన్నో రకాల విషయాలతో ముడిపడి ఉందన్న విషయం. ముఖ్యంగా సంపాదనలో అధికభాగం తాగుడు కింద ఖర్చయితే దిగజారిపోయే ఆర్థిక పరిస్థితుల గురించి ఆడవాళ్ళు చాలా తీవ్రంగా మాట్లాడారు. బట్టలు, చెంబూ, తప్పేలాలు కూడా కుదవబెట్టిన సందర్భాలు ఎన్నో. వ్యవసాయ కూలీలుగా, పత్తి కోసేవారుగా, ఉప్పు కొఠార్లలో పనిచేసే వారుగా, తాము పనిచేసే పరిస్థితుల్నుంచి విడిబడ లేకపోవడం స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా హరిజన వాడల్లో, ముస్లిం పేటల్లో జీవించే స్త్రీ పురుషుల జీవితాల్లో, సంవత్సరం పొడుగూతా పని దొరక్క పోవటం అనేది సర్వ సాధారణమైంది. పనిఒత్తిడి ఎక్కువగా ఉండే రోజుల్లోనూ, మంచి కూలీ గిట్టే రోజుల్లో కూడా, పరిస్థితి ఏమాత్రం బాగుండదు. ఆత్మకూరు మండలంలోని రామస్వామిపల్లి అనే రెడ్డి గ్రామంలో ‘పిల్లలు కూడా పోగాకు కోస్తే 20రూ||ల కూలీ డబ్బుల్ని సారాకే తగలేస్తారు’. అని అక్కడి స్త్రీలు ఆవేదనతో చెప్పారు.

సారా గురించి మాట్లాడుతున్నపుడు ఎప్పుడూ ‘ఇతర’ విషయాల గురించి ప్రస్తావించేవాళ్ళు. ఉదాహరణకి బియ్యం ధరలు ఆకాశాన్నంటటం, తాగటానికి నీరూ, ఆరోగ్య సదుపాయాలు లేకపోవటం అందులో కొన్ని. నెల్లూరు పట్టణానికి 150 కి.మీ. దూరంలో ఉన్న గండిపాలెం అనే గ్రామంలోని స్త్రీలు, ప్రతిరోజూ క్రమం తప్పకుండా టంచనుగా వాళ్ళ ఊరికి సారా వచ్చి పడుతుంది కానీ, ఎవరికైనా చిన్న జబ్బు చేస్తే వైద్యం చేయించటానికి 16మైళ్ళు దూరంలో ఉన్న తాలూకా సెంటర్‌ ఉదయగిరికి తీసుకెళ్లాలంటే ఎంత కష్టమవుతుందో అంటూ స్పష్టంగా ఈ తేడాని ఎత్తి చూపారు. తోట్ల చెరువుపల్లి సమీప గ్రామాల్లోని స్త్రీలు మంచినీళ్ళు నాలుగైదు మైళ్ళ దూరం నడిచి తెచ్చుకోవాలి. అక్కడ దగ్గర్లో ఎక్కడా నీరు దొరకదు. కొండమ్మ అనే పెద్దావిడ మాట్లాడుతూ ”ఇంత పెద్ద ఊరుంది, ఊరికి దగ్గర్లోనే గండిపాలెం ప్రాజెక్టుంది. అయితేంటి? ఇక్కడ చుక్క నీళ్ళు దొరకవు. పనుల్లేవు. వ్యవసాయానికి నీళ్ళు లేవు. పిల్లలకు విరోచనాలు పట్టుకున్నా, ఆడోళ్ళు ప్రసవించాలన్నా చాలా దూరం పోవాల” అని తన ఆవేదన వెళ్ల గక్కింది. చుట్టూ మూగిన పిల్లలకేసి చూపిస్తూ వాళ్ళకి స్కూలన్నా లేకపోవటాన్ని ఎత్తి చూపింది. ”మీకు పిల్లా జెల్లా లేరా? వాళ్ళు కూడా ఇలాగే వుంటారా? వాళ్ళు స్కూలుకి పోవటం లేదా?” అని నిలేసింది మమ్మల్ని. ప్రభుత్వం తమ జీవితాన్ని బాగు చేసే, ఉపయోగపడే పని ఒక్కటి కూడా చేయకపోవటం, కానీ ఎలాగోలా సారా అమ్మటానికి చేసే ప్రయత్నం – ఈ దురన్యాయాన్ని కొండమ్మ అతి స్పష్టంగా అర్థం చేసుకుంది. ”ఆవు కూడా మేత లేకపోతే పాలియ్యదు. దగ్గరికి వస్తే తంతుంది కూడా. మేం ఇప్పుడు అదే పనిచేశాం. ఇక్కడికి సారా రాకుండా చెయ్యటానికి మేం ఏం చెయ్యటానికైనా సిద్ధమే. ప్రభుత్వానికి డబ్బు చాలకపోతే, మీ జీతాలు తగ్గించమనండి” అని మాట్లాడింది.

తప్పతాగి ఇళ్ళకు చేరే భర్తలు తమనీ, పిల్లల్నీ పెట్టే బాధల్ని వారు మాటి మాటికీ చెప్తూ వచ్చారు. ఆత్మకూరు మండలంలోని భండారుపల్లికి చెందిన జయమ్మ తాగుబోతు భర్త చేతిలో బాధలు పడలేక, రెండు సార్లు ప్రాణం తీసుకోటానికి ప్రయత్నించింది. సారా అమ్మకాలు మానేస్తే వాళ్ల జీవితాల్లో ఎంత మార్పు వస్తుందో ఆమె పదే పదే చెప్పింది. వాళ్ళ పాఠ్య పుస్తకాల్లోని దూబగుంట ఉదంతం వారిని ఎంత ప్రభావితం చేసింది? వారు నడిపిస్తున్న ఈ అసాధ్యమైన పోరాటం గురించి వింటుంటే కలిగిన దాని ఆశ్చర్యం కన్నా, వాళ్ళు పదే పదే ”ఇప్పుడు మనశ్శాంతి గున్నాం” అని అందరూ అంటుంటే నిజంగా చాలా ఆశ్చర్యపోయాం. ”పిల్లల ఏడుపులూ, సారా కంపూ, తిట్లు, తన్నులు, ఏడుపులూ పెడబొబ్బలూ పోయి ఇప్పుడు రోడ్లు శుభ్రంగా ఉన్నాయి. మగవాళ్ళు ఇంటిమీదికి తెచ్చే కొట్లాటలు తగ్గి సుఖంగా నిద్రపోతున్నాం. మనశ్శాంతి గున్నాం” ఇవీ వాళ్ళన్న మాటలు.

స్త్రీ, పురుష సంబంధాలు – పునర్విమర్శ

స్త్రీల ఆగ్రహం ప్రధానంగా సారా కొట్ల మీదే కానీ, వాళ్ళ మగవాళ్ళ మీద కాదు అన్న విషయం మేం ఊహించనిది. ఇది వరకు సారా కొట్లు ఉన్న చోట్లని వేలెత్తి చూపేవాళ్ళు. ఊరి మొదట్లోనే కొట్టొచ్చినట్టుగా బస్‌స్టాపుల దగ్గర, టీ దుకాణాల పక్కన ఈ సారా కొట్లు ఉండేవి. సారా ఉద్యమం స్త్రీ పురుష సంబంధాలపై చూపించిన ప్రభావం అనేక విధాలుగా ఉన్నట్లు మేం గ్రహించాం. మగవాళ్ళవి నేరస్థులుగా, నీతి తప్పిన వాళ్ళుగా స్త్రీలు అసలు అనుకోలేదు. ఇది మాకు చూడగానే కలిగిన అభిప్రాయం. మగవాళ్ళని సరిచెయ్యటానికి, బహిరంగంగా సారా కొట్ల ముందు ఎదుర్కొవటం, సులువుగానూ, ధైర్యంగానూ చెయ్యగలిగారు. ఇక్కడ వాళ్ళకి ఇతర స్త్రీల మద్ధతు కూడా బాగా లభించేది. కొంతమంది స్త్రీలు, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో తాగుబోతు భర్తలని కొట్టటం, హేళన చెయ్యటం వంటివి చేయటానికి చాలా సాహసం చూపించాల్సి వచ్చిందని చెప్పారు. మహిమలూరు గ్రామంలోని ఒక ముస్లిం స్త్రీ, తన భర్త గనక తాగివస్తే, తలా, మీసం సగం గొరికి గాడిద మీద కట్టేసి ఊరేగిస్తానని చెప్పింది. కానీ చాలామంది స్త్రీలకి, వాళ్ళ భర్తల విషయంలో నిస్సహాయత, భయం, ముఖ్యంగా వాళ్ల ప్రవర్తన వల్ల కల్గే అవమానం, బాధా గమనించ తగ్గవి. అందరితో కలిసి బహిరంగంగా భర్తని ఎదుర్కోటానికీ, వ్యక్తిగత జీవితాల్లో వారి మధ్య సంబంధ బాంధవ్యాలకీ గల విభేదం చాలా వాస్తవమైనది.

మేం ఆడవాళ్ళతో మాట్లాడుతున్నపుడు, ఒక్కోసారి మగవాళ్ళు కూడా వచ్చి అక్కడ నుంచునేవాళ్ళు. మా మాటాలు వింటూ ఉండేవారు తప్ప ఎక్కువగా మాట్లాడకపోయేది. వాళ్ళు ఆడవాళ్ళ ఉద్యమాన్ని వ్యతిరేకించలేదు. కోపం ప్రదర్శించలేదు. నిశబ్దంగా ఉద్యమాన్ని సమర్థిస్తున్నట్లు కనిపించారు. ఆడవాళ్ళదే ఈ విషయంలో పై చెయ్యిగా ఉందనటంలో సందేహం లేదు. ఒకోసారి, మగవాళ్ళని రమ్మని కేకేసి పిల్చి, తాగే వాళ్ళని వేలెత్తి చూపించేవాళ్ళు. అప్పుడా మగవాళ్ళు కాస్త తత్తరపాటూ, భయమూ కలసిన నవ్వుతో జవాబిచ్చే వాళ్ళు. దీనివల్ల వాళ్ళకెంత లాభం కలిగిందో కూడా తరుచూ చెప్పేవాళ్ళు. కేవలం ఆడవాళ్ళు చేపట్టిన ఈ ఉద్యమం పట్ల మీ భావాలు ఎలా ఉన్నాయని మగవాళ్ళని మేం సూటిగా ఒక ప్రశ్న అడిగాం. అందుకు సమాధానంగా రామస్వామిపల్లిలో ఒక వ్యక్తి కొంచెం చిన్నబుచ్చుకున్నట్లు మొహం పెట్టి, ”మేం ఆడవాళ్ళకి అవకాశం ఇవ్వబట్టే ఈ ఉద్యమం ఇంత విజయవంతమయింది. లేకపోతే అయ్యేది కాదు” అని మగవాళ్ళ పక్షాన మాట్లాడాడు. స్త్రీలు మగవారి ప్రవర్తన గురించి ఇప్పటికీ నిర్భయంగా నిస్సంకోచంగా మాట్లాడుతున్నారు. ఆత్మకూరు దగ్గర కచ్చేరి దేవరాయపల్లి గ్రామంలో లక్ష్మమ్మ అనే ఆమె మగవారి జీవితాలతో పోలిస్తే ఆడవాళ్ళ బతుకులు ఎంత నిస్సారమో చెప్తూ ఇలా అంది – ”మన ఆడోళ్ళకేం తెల్సు. పిల్ల, జల్ల కూలినాలి రోజంతా ఇరగబడాల. మళ్ళా కొంపకొచ్చి కూడొండి పిల్లలకు పెట్టాల. మనకి చాకిరి తప్ప ఇంకేం తెల్సు. మగోళ్ళు ఎక్కడికో పోతరు? తాగుతారు, వస్తరు. వాళ్లకంత తెల్సు. సారా జగమంతా లేకుండ జెయ్యాల. సారా మళ్ళా ఇక్కడికొచ్చిందా! ఆటో ఇటో తేలిపోవాలి. ఏం గవర్నమెంటుకి సారా లేకపోతే డబ్బులు రావా? వాళ్ళకు పిల్లా జల్లా అక్కర్లా? మాకేం ఉన్నాయి? నూకలే, బియ్యం కూడ లేవు. నా కోడళ్ళున్నారు. కొడుకులంత తాగొచ్చి కోడళ్ళను చంపుతారు. వంటి మీదున్న చీరలు కూడా ఎత్తకపోతారు. తీస్కపోనీ మామగోల్ల నందర్నీ, గవర్నమెంటు వాళ్ళనే ఏలుకోని మాకెందుకీ సంసారాలు? నా కోడళ్ళ ఒంటి మీదవన్నీ తీస్కపోయిన్రు నా కొడుకులు” ఇంతలో చుట్టూ ఉన్న గుంపులోంచి ఎవరో ఎగతాళిగా ‘నీ చెవులకి కమ్మలున్నాయిగా’ అంటే వెంటనే అందుని, ‘నా ఇంటాయన పోయాడు, అందుకే ఈ కాస్త నగా నా వంటి మీద ఇంకా వుంది’ అని చెప్పింది.

గ్రామం ఒక రాజకీయ కేంద్రం :

స్త్రీలు ఉద్యమంపై తమ అదుపు తప్పిపోకుండా ఉండాలని ఎవరి ఊరికి వారు పరిమితం చేసుకున్నారు. వారి నినాదం ”మా ఊరికి సారా వద్దు” దీనికి ప్రతీకగా నిలబడుతుంది.

ఈ థ్యేయాన్ని సాధించటానికి, ఎంతవరకు పోగలుగుతాం అనే దానికి వారు అవలంభించిన పద్ధతులు అనేకం. నిజంగా చెప్పుకోదగ్గ విషయం కూడా. రామస్వామిపల్లిలో స్త్రీలు రెండుళ్ళ కిందటే సారా అమ్మకాన్ని ఆపటానికి ప్రయత్నించారు. కానీ అధికారుల ధర్మమా అని అది కొనసాగుతూ వచ్చింది. సారా అమ్మకాలు ఆపించవలిసిందిగా మండల రెవిన్యూ అధికారులకి ఇటీవలే ఊరందరి సంతకాలతో కూడిన ఒక విజ్ఞాపన పంపుకున్నారు. దానికి వాళ్ళ నుంచీ వచ్చిన సమాధానం ”ఇది మీ (స్త్రీల) సమస్య, మీరే తేల్చుకోవాలి” అని. అది చూసిన తరువాత స్త్రీలకి ఒళ్ళు మండింది. సారా అమ్మకాలు కొనసాగించటానికి కాంట్రాక్టర్లు, ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగులు చేస్తున్న ప్రయత్నాలని ఎదుర్కోవాలని నిశ్చయించుకున్నారు. ఒక సందర్భంలో కిష్టమ్మ అనే ఆమె ఎక్సైజు డిపార్టుమెంటు పోలీసుని బెల్టు పట్టుకుని జీపులోంచి లాగి బైట పడేసి, మెయిన్‌ రోడ్డు వరకూ లాక్కు వెళ్ళింది. చివరికి ఎన్నోసార్లు సారా ప్యాకెట్లు ధ్వంసం చేసిన తర్వాత కంట్రాక్టర్లూ, ఉద్యోగులు మళ్ళీ రావటానికి ప్రయత్నిస్తే జీపు మీద కిరసనాయిలు పోసి తగబెడ్తామని హెచ్చరించారు.

భండారుపల్లి గ్రామంలో ఎక్సైజ్‌ డిపార్టుమెంటు పోలీసులు సారా ప్యాకెట్లు ఊళ్ళోదించి వెళ్లబోతుండగా స్త్రీలు వాళ్ళని ఎదర్కొన్నారు. ”మీకు సంసారాలు లేవా? ఇక్కడ సారా అమ్మకాలు చెయ్యాలనుకుంటే మా అందరికీ మీరు తిండి పెట్టండి” అని ఎదురు సవాలు చేశారు. మహిమలూరులో హరిజన స్త్రీలు వండిన అన్నం తెచ్చి షాపులో గుమ్మరించి ”సారా అమ్మకం ఆపే వరకూ ఈ అన్నం ఇలానే వుంటుంది. మేం వంట చెయ్యం, తిండి తినం” అని సారా దుకాణదారునికి సిగ్గొచ్చేలా చేసి అమ్మకాలు ఆపుచేయించారు.

తాము ఎంతవరకూ పోరాటం చెయ్యగలం అనే విషయంలో కూడా స్త్రీలు ధృడంగానే ఉన్నారు. ఈ ఉద్యమాన్ని బలపరిచే కొద్ది మంది పురుషులు దీన్ని గ్రామస్థాయి నుంచీ జిల్లా స్థాయికి, తర్వాత రాష్ట్ర స్థాయికి తీసుకెళ్ళాలని చెబితే, భండారుపల్లి గ్రామంలో టీ దుకాణం నడిపిస్తున్న ఆదిలక్ష్మి అనే ఆమె ఏ మాత్రం చెక్కు చెదరకుండా ”లేదు, మా పోరాటం ఇక్కడి వరకే. ఇక్కడ ఏం చెయ్యాలన్నా మేం చెయ్యగలం కానీ వేరే చోట చెయ్యలేం” అని అంటుండగానే ఇంకొకామె అందుకుని ”వేరే ఊళ్ళల్లో ఆడవాళ్ళు లేరా? వేరే చోటికెళ్ళి అక్కడ ఉన్న మనుషలకి వాళ్ళేం చెయ్యాలో మేమెట్లా చెబుతాం?” అని అంది.

మాకు తారసపడ్డ వాళ్ళు ఎక్కువగా నిమ్న వర్గాలకి చెందిన వాళ్ళూ, హరిజనులూ, ముస్లిములు. ఒక గ్రామంలో హరిజన స్త్రీలు స్పష్టంగా చెప్పారు. – సారా అమ్మకాలు ఆపించటంలో పూర్తి మద్ధతునిచ్చినా, ఏ ఉన్నత కులపు స్త్రీ కూడా బాహాటంగా వారితో కలిసి పోరాటంలో పాల్గొనలేదని. సారా అమ్మకాలు ఆగటం వల్ల నిమ్నజాతి స్త్రీల చేతుల్లో కాస్త పైసలు కనిపిస్తూ ఉన్నాయి. అక్షరాస్యత కార్యక్రమాల వల్ల వాళ్ళలో చాలా మనో నిబ్బరం ఏర్పడింది. కూలీల చేతుల్లో ఇప్పుడు డబ్బులు కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూసిన అగ్రకుల భూస్వాములకి కూలీలు అప్పులకి రారేమోనన్న భయం, దడ పుట్టినట్లు మనం గ్రహించవచ్చు.

కుల సంఘర్షణలు ఉన్న గ్రామాల్లో ఉద్యమం కొంత కుంటుపడ్డట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైనా ఒక కులానికి చెందిన స్త్రీలు వెనక్కి నెట్టబడ్డ గ్రామాల్లో. అల్లూరు మండలం, గోగులపల్లి గ్రామంలోని మాలపల్లిలో ఉద్యమం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు మాకు అనిపించింది. ఒక కుటుంబం ఆ గ్రామంలో తిరిగి సారాను అమ్మటం మొదలు పెట్టడంతో, ఒకే కులానికి చెందిన స్త్రీలూ, బంధువుల మధ్య ఘర్షణలు తీవ్రమయ్యాయి. మగవాళ్ళు ‘మా డబ్బుని మా ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకుంటామని’ అంటున్నప్పటికీ, కొంతమంది ధైర్యంగల స్త్రీలు సారా అమ్మకాన్ని ఆపించటానికి కృషి చేస్తున్నారు. అలాగే వాళ్ళకి ఇతర స్త్రీల నుంచి కూడా కొంత వ్యతిరేకత ఎదురయింది.

మహిమలూరు, కచ్చేరి దేవరాయపల్లి గ్రామల్లో ముస్లిం, దళిత వర్గాలకు చెందిన స్త్రీల మధ్య ఉన్న సంఘీభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇక్కడ ఈ రెండు వర్గాల స్త్రీలు కలిసి ఎక్సైజ్‌ అధికారులను గ్రామంలోకి రానీయకుండా చీపురు కట్టలూ, కారంపొడితో అడ్డుపడి, వాళ్ళు వెనక్కి మళ్ళేలా చేశారు.

స్త్రీలు – ప్రభుత్వం :

అత్యంతాసక్తి కరమైన మరో విషయం ఏమిటంటే ఈ పోరాటంలో ఎక్కడా కూడా నాయకత్వం ఒక చోటే కేంద్రీకరింపబడి లేదు. స్థానికమైన పోరాటాలు చేపట్టి ఎవరిగ్రామాల్లో వాళ్ళు ముందడుగు వేయటం వల్ల, నాయకత్వం ఒకచోటే పోగుపడలేదు. ఒక్కో గ్రామంలోనూ ఒక్కో రకమైన పద్ధతి. మేం వెళ్ళిన గ్రామాల్లో, కొన్ని చోట్ల బాగా వివరించగలిగిన వాళ్ళ వ్యక్తి వచ్చే వరకూ మమ్మల్ని ఆగమన్న సందర్భాలు ఉన్నాయి. కొన్ని చోట్ల మాకు తారసపడ్డ స్త్రీలందరూ వారి వారి అనుభవాల్ని వివరించటానికి చాలా ఉత్సాహం చూపించారు. ఒక కేంద్రీకృతమైన నాయకత్వం లేకుండానే, రాష్ట్ర, వ్యాపితంగా విస్తరించిన ఈ ఉద్యమం రాజకీయ పార్టీల్లో ఒక రకమైన ఉత్కంఠని, ప్రభుత్వానికి చికాకునీ సృష్టించింది.

నెల్లూరు జిల్లాల్లో 144వ సెక్షన్‌ను విధించి గానీ, కొంతమంది కార్యకర్తలను అరెస్టు చేసి గానీ ఉద్యమాన్ని నీరు గార్చలేని సంకట పరిస్థితిలో పడింది ప్రభుత్వం. అయితే స్త్రీలనూ, పోరాటానికి మద్ధతు నిచ్చిన కార్యకర్తలనూ అణిచి పెట్టడానికి వేరే ప్రయత్నాలు ప్రారంభించింది. అక్షరాస్యత కార్యక్రమానికి ఉన్న స్వతంత్రతని అడ్డుకోటానికి సారా దుష్ఫలితాలనూ, అవినీతిపరులైన ప్రభుత్వాధికారులనూ గురించి చెప్పే పాఠాలను ”ప్రభుత్వవ్యతిరేక” విషయాలుగా ముద్రవేసి వాటిని తొలగించే ప్రయత్నం చేస్తోంది. ఇది నిజంగా హాస్యస్పదమైన విషయమే గాక దయనీయమైన విషయం కూడా. ఇదే కాకుండా, ముఖ్యంగా తెలంగాణా జిల్లాల్లో ఉద్యమానికి బాసటగా నిలుస్తున్న వామపక్ష రాజకీయ పార్టీలకు చెందిన స్త్రీలు, కార్యకర్తల మీద విపరీతమైన హింసను ప్రయోగించి ఉద్యమాన్ని అణిచివేయటానికి ప్రయత్నిస్తోంది ప్రభుత్వం.

ప్రభుత్వానికి ఎదురైన ఇంకో సమస్యేమిటంటే, ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టి కొనసాగించింది ఏ రాజకీయ పార్టీ కూడా కాకపోవటంతో, ఎవరినీ నిందించటానికి లేకుండా పోయింది. అంతేగాకుండా, సారా అమ్మకం ఆపాలనే డిమాండు మన రాజ్యాంగానికి విరుద్ధమైనదీ కాదు, అవినీతిని ప్రోత్సహించేది కూడా కాదు. పైగా, మన రాజ్యాంగంలో పొందుపరిచిన ‘ఆదేశిక సూత్రాల్లో’ సారా నిషేధం ప్రభుత్వ విధానాల్లో ఒక భాగంగా ఉండాలి. అందువల్ల స్త్రీల డిమాండ్లను తోసిపారేయటానికి మన ప్రభుత్వానికి వీల్లేకుండా వుంది. మరో పక్క చూస్తే సారా ఆదాయం మీదే ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా ఆధారపడి ఉంది. ఈ ఆడవాళ్ళు ప్రభుత్వాన్ని ముఖాముఖి ఎదుర్కోవటం లేదు. కానీ ప్రభుత్వ యంత్రాంగాన్ని దాని అధికారాన్ని తల్లకిందులు చేశారు. మొత్తం సమస్యకు కేంద్రాలయిన సారా దుకాణాలు, సారా గోడౌన్లు, సారా వేలం పాటలు- వీటిని అడ్డుకోవటం ద్వారా ప్రభుత్వానికి సారా కాంట్రక్టర్లకీ ఉన్న విడదీయరాని బంధాన్ని దెబ్బతీసారు.

రాష్ట్రం నులుమూలల నుంచీ వస్తున్న ఒత్తిడులకు తలవొగ్గి, ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పరిచింది గానీ, ఉద్యమాన్ని ఎలాగోలా అణిచి వేయాలన్నదే దాని వైఖరి. అది నిస్సంశయం. స్త్రీల పోరాట స్ఫూర్తిని దెబ్బ కొట్టటానికీ, వాళ్ళ మనస్థైర్యాన్ని కుంగదీయటానికి, సారాని గనక నిషేధిస్తే, బియ్యం ధర విపరీతంగా పెరుగుతుందనే పుకార్లు సృష్టిస్తోంది.

సారా వేలం పాటలు ఆగిపోయనప్పటికీ, ఎక్సైజు అధికారులు, వారి పోలీసులు దొంగతనంగా సారా అమ్మకాలు కొనసాగించటం చాలా మంది స్త్రీలకి బాధనీ, నిరాశనీ కలిగిస్తోంది. బలవంతంగానైనా సరే ప్రజలు సారా తాగేలా చెయ్యాలనే ప్రభుత్వ ధోరణి వాళ్ళని అయోమయంలో కూడా పడేసింది. ”వాళ్ళని పగలు బహిరంగంగా దుకాణాల్లో అమ్మమనండి. వాళ్ళ సంగతి మేం చూసుకుంటాం. పాల డబ్బాల్లోనూ, మిరపకాయల గంపల్లోనూ దొంగతనంగా తెస్తుంటే మేం ఎట్లా ఆపగలం? ముందు మమ్మల్ని, పిల్లల్ని చంపమనండి, తర్వాత సారా పోసి మగవాళ్ళని సాకమనండి” అని నిలదీస్తున్నారు. మేం వెళ్ళిన ఒక ఊర్లో మమ్మల్ని ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళుగా భావించి ”ఎందుకొచ్చిన్రు మళ్ళీ తాపడానికా” అని నిలదీశారు. ”మనల్ని ఆపటానికి బయటెక్కడ్నంచో ఆడవాళ్ళనే పంపింది ఈ గవర్నమెంటు, మంచి ఎత్తే ఏసింది” అని అనుకోవడం కూడా మేం విన్నాం. వాళ్ళకు కలిగిన అపనమ్మకం అది.

తాగుడలవాటు మాన్పించటం :

సారా తాగటం ఒక వ్యసనంగా మారబట్టే ఈ సమస్య ఇంత తీవ్రంగా ఉందని ఇంకో అభిప్రాయం చాలా మందిలో ఉంది. వ్యసనానికి బానిసలు అయిన వాళ్ళు ఏదో విధంగా దొంగతనంగా అయినా సరే తాగటానికి ప్రయత్నిస్తున్నారు గాబట్టే దొంగ సారా సరఫరా అవుతోందని, అలవాటు పడ్డవాళ్ళు ఒక్కసారిగా మానేస్తే నరాల బలహీనతలకు గురవుతారని కొంతమంది దగ్గర నుంచీ మేం విన్నాం. మీ భర్తలకు అటువంటిదేదయినా జరిగిందా అని స్త్రీలని అడిగితే వాళ్ళు ఫక్కుమని నవ్వి ”సారా ఏవన్నా అన్నమా? అది లేకుండా బతకలేం అనుకోడానికి?” అని చెప్పారు. మధ్య తరగతి మనస్థత్వాలు ఈ తాగుడు సమస్యని మానసిక రుగ్మతగా భావించే ప్రమాదం ఉంది, ముఖ్యంగా పేదవాళ్ళ విషయంలో. ఈ సమస్యని ఉన్నదున్నట్లు చూడగలగాలి. ఇది కేవలం సాంఘిక సమస్యే కాకుండా, స్త్రీ పురుష వివక్షతకు సంబంధించింది కూడా. సంపాదించిందంతా తాగుడికి తగలబెట్టటం మగవాళ్ళ వంతయితే, బాధ్యతగా, శ్రద్ధగా సంసారాల్ని చక్కబెట్టుకోవటం ఉగ్గుపాలతో నేర్చుకున్న ఆడవాళ్ళు తాగుబోతులవటం అసాధ్యం? అయితే ఈ విషయం ఎక్కడా చర్చకు రాదు. తాగుడలవాటు తప్పించటానికి ఇవ్వవలసింది మందుల్ని కాదు. అంటే వంట, పిల్లల పెంపకం వంటి ఇంటి విషయాలు ఆడవాళ్ళవిగానే చూడకుండా, మగవాళ్ళ బాధ్యతగా గుర్తించేటట్టు చెయ్యాలి. స్త్రీలు చెప్తున్న విషయాలు శ్రద్ధతో పరిశీలిస్తే, సారా అమ్మకం ఆగిపోయిన అన్ని గ్రామాల్లోకి ఎలాంటి పద్ధతులనైనా ఉపయోగించి సారాని చేరెయ్యాలన్న ప్రభుత్వం, ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌ల ‘నేరవైఖరి’ని మనం గమనించ గలుగుతాం.

చివరగా అక్షరాస్యత కార్యక్రమం వల్ల ప్రభావితమయిన ఈ స్త్రీలు – ఆ పాఠ్య పుస్తకాల్లో స్త్రీల సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు, ఆరోగ్యం, పర్యావరణం, కుల సమస్య ఇవన్నీ చర్చించిన్పటికీ అన్నిటి కంటే చివర్లో ఉన్న ‘సారా’ సమస్యనే

వాళ్ళు తీవ్రంగా పరిగణించి పోరాటం చేపట్టటం తమకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందని ‘జన విజ్ఞాన వేదిక’ నాయకులు చెప్పారు.

చివరగా, స్త్రీవాద (ఫెమినిజం) భావాల్ని సూక్ష్మీకరిం చటానికి ఇలాంటి ఉద్యమాలు తోడ్పడక పోయినప్పటికీ, సమాజం లోని ప్రతి చిన్న అంశంలోనూ స్త్రీవాద భావాలు తలెత్తుతాయనే మాట నిర్వివాదాంశం. ముఖ్యంగా ఈ ఉద్యమంలో స్త్రీలు అవలంభించిన పద్ధతుల్ని, ఎక్సైజ్‌ అధికారుల్నీ కంట్రాక్టర్లనీ ఎదుర్కోవటానికి చీపుళ్ళూ, కారం లాంటి ఇంటి వస్తువుల్ని ఉపయోగించటం, వంట చెయ్యటానికీ తినడానికీ నిరాకరించటం, బాహాటంగా మగవార్ని సిగ్గుపడేలాగా చెయ్యటం – ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకుతీరాలి.

ఈ ఉద్యమం ప్రత్యేకతేమింటంటే, ఒకరందించిన సైద్ధాంతిక బలం, పోరాట రూపాలు అందుకుని చేయటం కాకుండా స్త్రీలు తమకు తాముగా కార్యక్రమాల్ని, పద్ధతుల్ని నిర్ణయించుకోవటం, సమస్యను తమదైన పద్ధతిలోనే సూత్రీకరించటం, తమ దైనిందిన జీవితంలోని సమస్యలన్నింటినీ ముడిపెడుతూ ‘ సారా సమస్య’ ను లేవతీయటం. స్త్రీల జీవితాల్ని, శ్రమను, ఆరోగ్యాన్నీ, మనశ్శాంతినీ అన్నింటినీ వేధింపుకు గురిచేస్తున్న కుటుంబ వాతావరణం, దాన్ని సృషించే సమాజం, వ్యవస్థ అన్నింటినీ కదిలించగలిగే శక్తి ఉన్న సారా సమస్య స్త్రీల దైనిందిన అనుభవాల్నించి పుట్టుకొచ్చిన సమస్య.

దీనిలో ఆర్థికం ముఖ్యమా, సాంఘికం ముఖ్యమా అని చర్చించటం, ఈ స్త్రీలకు నాయకత్వం వహించాలి, సిద్ధాంత అవగాహన నందించాలి అనే ధోరణిలో కాకుండా, వాళ్ళ నుంచి రాజకీయాల గురించి కొత్తగా అవగాహనలను మనం ఏ విధంగా నేర్చుకోవచ్చు అని ఆలోచించటం దాన్ని ఒక సవాలుగా స్వీకరించటం అవసరం.

(భూమిక జనవరి – మార్చి 1993 సంచిక నుండి పునర్ముద్రణ)

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.