లక్ష రూపాయలు ఒడియ మూలం : ప్రతిభరాయ్‌ అనువాదం : జయశ్రీ మోహన్‌ రాజ్‌

‘లక్ష రూపాయలు’. అది ఒట్టి మాటలు.నిజానికిలక్ష రూపాయలెక్కడైనా ఉంటాయా? ‘అతని మాటల్లో అమృతం ఉంది’ అంటారు. నిజానికి మాటల్లో అమృతం ఉంటుందా? ఇదీ అలాగే. అమృతాన్ని ఎవరైనా రుచి చూసారా అసలు? లక్ష రూపాయల్ని ఎవరైనా కళ్ళ జూసారా? ఎక్కడో స్వర్గంలో అమృతం ఉన్నట్లే కుబేరుని కోశాగారంలో లక్ష రూపాయలుండి ఉండొచ్చు. భూమ్మీద లక్ష రూపాయలుండడం కల్ల.

జడ మట్టిపని చేసేందుకు కటకం వెళ్ళిన రోజు నుండి వాడి తల్లి వేళ్ళ మీద లక్ష లెక్కించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. పది పదిపైసలు రూపాయలు. అలాంటివి యిరవై అయితే ఇరవైరూపాయలు పది ఇరవైలు రెండొందలు. ఇక ఎన్ని వందల ఇరవైలు లక్షరూపాయలౌతాయి? జడ తల్లికి అంతుపట్టలేదు.

తల్లీ – కొడుకు, జడ-జడతల్లి, నిజానికి జడకి చెముడు లేదు. చక్కగా వినిపిస్తుంది. మంచివాడు జడ (అంటే చెముడు) అని పేరు పెడ్తే యముడు చిరాకుపడి పిల్లవాడివైపు చూడడన్న ఆశతో ఆ పేరు పెట్టింది. జడ తండ్రి అతని చిన్నప్పుడే కన్ను మూసాడు. అడివికి కట్టెలు కొట్టేందుకు వెళ్ళినప్పుడు ఎలుగుబంటు బారిన పడ్డాడు. దాంతో, ఆ గాయాలకు బలైపోయాడు. అప్పట్నుంచి తల్లీ కొడుకులు ఎలానో కాలం వెళ్ళబుచ్చేవారు ఆకలి బారిన పడకుండా. జడయింటి పొయ్యిలో పిల్లి కూర్చుందని సూర్యుడు ఉదయించేది మానలేదు, రోజులు గడవకుండా ఉండలేదు, వయస్సు ఆగలేదు. చూస్తూండగానే వయసులో ఉన్న తల్లి ముసలిదైపోయింది జడ కూడా పెరిగి యువకుడైయ్యాడు. జడ తల్లికి అద్దంలో తన వయసుడిగిన మొహం చూసుకోడానికి సమయంలేదు. ఆమె కళ్ళకు యుక్త వయసులో ఉన్న కొడుకు యింకా చిన్నపిల్లవాడే? కొండ దిగువన కొన్ని మట్టి గోడలు గుడెసెలు, చాలీ చాలని బట్టలతో, ఎముకలు గూడల్లాంటి మనషులూ, పందుల్లా తిరుగాడే దిసమొలతో ఉన్న పిల్లలూ, కోళ్ళూ, చెట్లూ కలిపితే అది ఊరు అని ఎవరైనా అంటే అదీ ఓ ఊరే – పేరు నందియపొసి, ఢెంకనాలు జిల్లా. ఆ ఊళ్ళోనే జడతల్లి తన చిన్నవాడైన కొడుకుతో మామిడి, పనస, కెందు ఆకులు, వెలక్కాయలు, తాండ్ర, ఆకులు మూలాలు అమ్ముకుంటూ కాలం వెళ్ళ దీస్తూంది. సుఖాలనుభవించకపోయినా కష్టాలైతే లేవనే చెప్పొచ్చు. ఊళ్ళో ఆమె కన్నా ఎక్కువ సుఖంగా ఎవరూ లేరనే చెప్పొచ్చు. మట్టిపనికిగాని, పొలంపనికిగాని, కట్టెల పనికిగాని వెళ్తారు అని తప్ప వేరే పనేం ఉంది గనుక? నందియపొసిలో రాజభోగాలు అనుభవించే దేరెవరున్నారు గనుక?

జడతల్లి చూస్తూండగానే ముసలిదైపోయింది. తాటి మట్టలాగ నడుంవంగిపోయింది. కళ్ళు చెరువులోని బురదనీళ్ళ లాగ మకిలిగా తయారయ్యాయి. కనుపాపలు ఆ నీళ్ళలో తేలుతున్న నల్లని ఈగల్లాగున్నాయి. అయితే ముసల్ది ఒక్క నిముషమైనా ఊరకే కూర్చోదు. తడుముకుంటూ, తొట్రుపడుతూనే ఆడవిలోకెళ్ళి కట్టెలు ఏరుకుని తెచ్చి సంతలో అమ్ముకుంటుంది. కావల్సిన సరుకులు తెచ్చుకుంటుంది.

ఓరోజు దుకాణం హరిసాహు అడిగేడు చెట్టంత కొడుకుని పెట్టుకుని నువ్వే ఈ సగం చచ్చిన శరీరం పెట్టుకుని కట్టెలకెళ్తావు కదా?” అని జడతల్లి తుళ్ళిపడింది, తనకొడుకు అదెప్పుడు చెట్టంత ఎదిగిపోయాడు, అని అయినా వాడ్నెందుకు కట్టెల కోసం పంపాలి? తన బొందిలో ప్రాణముండగా కొడుకుని అడవిలోకి పంపదు. కొడుకుని పాము కాటేస్తే? తల్లి పురితాడుని చూసికూడా భయపడ్తుంది. జడతండ్రి కూడా వయసులో ఉన్నప్పుడు కట్టెలు కొట్టేందుకు అడవిలోకి వెళ్ళేడు, ఎలుగుబంటు పాలిటబడ్డాడు, అంతే. జడ కూలిపని కెళ్తాడు. అయితే ఆ కొండకోనలోని చిన్న ఊళ్ళో ఏడాదికి ఎనిమిది నెలలు కూలిపని ఉండదు. ఆకలి ఎక్కువౌతుంది ఆదాయం తగ్గుముఖం పడ్తుంది.

ఒకసారి జడ పని వెదుకుతూ ఢెంకనాల్‌గఢ్‌కు వెళ్ళాడు. తిరిగివచ్చి తల్లితో ”అమ్మా నేను కటకం వెళ్తాను. మహానదికి ఆనకట్ట వేస్తున్నారు. ఏడాది, రెండేళ్ళకు పని దొరుకుతుంది. రోజుకు పదిహేను రూపాయలిస్తారు. రోజూ ఎంత ఎక్కువ మట్టి మోస్తే అంత యెక్కువ సంపాదించవచ్చు. రెండేళ్ళలో నేను లక్ష రూపాయలు తెచ్చి నీ చేతిలో పెట్టకపోతే…

ముసల్ది తన వణుకుతున్న చేతుల్తో జడ మొహం, భుజాలు నిమిరింది. ”కటకం అన్నది ఏ రాజ్యంలో ఉంది? నిన్ను నా కళ్ళ నుండి దూరం చేసుకోలేనురా జడా! పధ్నాలుగు వంశాలుగా మనం ఈ ఊళ్ళోనే ఉన్నాం. ఎంత చెట్టుకి అంతగాలి. మనిషి కడుపులో ఉన్న రాక్షసి ఆకలి ఎప్పుడైనా తీరుతుందా? ధనికుడైనా పేద అయినా అర్ధాకలితో ఉంటే అసంతుష్టి. ఒకరికి రూపాయి తక్కువ పడితే ఇంకొరికి వంద తక్కువ. మన ఊరి సాహుకారి యింట్లో చూడు, ఎప్పుడు చూసినా ‘లేమి’ ‘లేమి’ అంటారు. వద్దురా జడా! నువ్వు నా కొక్కడివే నా పేగులో పేగువి. లక్షరూపాయల ఆశతో నిన్ను దూరం చేసుకొని నేబతగ్గలనా?”

తల్లిని కౌగలించుకుని జడ నవ్వేడు కటకం ఢెంకనాల్‌ నుండి రెండు గంటల ప్రయాణం అంతే. రోజూ ఎనిమిదో పదో బస్సులు అక్కడికి వెళ్తాయి. చూడాలనిపిస్తే వెంటనే ఒచ్చెయొచ్చు. ఒద్దనొద్దు. ఎంతమంది పనికి వెళ్ళట్లేదు? మహానది ఆనకట్ట పనిలో మట్టిమోసి లక్షలు గడించుకొస్తారు. ఆ పని అయిం తర్వాత కటకం పట్టణంలో ఇక వరద బాధ ఉండదు. ఏళ్ళ తరబడి అందరూ మమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు. మన రోజులు బాగు మార్తాయి. కూలి సర్దారు నాకన్నీ చెప్పేడు. పనికోసం ఎంతోమంది అతని కాళ్ళావేళ్ళా పడ్తున్నారు.అయితే అతను గట్టిగా ఉన్న యువకుల్ని మాత్రమే ఎంచుకుంటున్నాడు. నేను ఓ పక్క నుండి అంతా గమనిస్తూనే ఉన్నాను. అతని కళ్ళు నా మీద పడగానే నన్ను పిలిచి మరీ పని ఇచ్చేడు. టేకులాంటి నా గట్టి శరీరం చూసి సర్ధారు ఓ రెండుసార్లు ‘శబాష్‌’ అన్నాడు. అదృష్టమంటే అదే.” ముసల్ది కొడుకు మీద ఉమ్మివేసి దృష్టి తీసింది. ”పరాయి పిల్లాడి మీద కన్నేస్తే కళ్ళు పేలిపోతాయి అంటూ పళ్ళు నూరింది.

సర్దారు ముందే యిచ్చిన యువై రూపాయలు తల్ల చేతిలో పెట్టి జడ తల్లికి నచ్చజెప్పాడు. మిగతా కూలీలతో కలిసి లారీ ఎక్కి కటకం బయల్దేరాడు. తోటి యువకులతో లారీలో కూచున్న జడ మనసు గాల్లో తేలుతూంది. రోజుకు ఇరవై, ఇరవై అయిదు రూపాయల పదైనా చేయవచ్చు. ఆ లెక్కన రెండేళ్ళ కెంత సంపాయించొచ్చు! లక్ష రూపాయలవు తుండొచ్చు! జడ తన జీవితంలో ఇరవై రూపాయల నోటు చేత్తో పట్టుకుని చూసి యెరగడు. హరిసాహు దుకాణంలో యాభై , వంద రూపాయల నోట్లు చూసి ఉన్నాడంతే. జడ అంతకన్నా ఎక్కువ ఊహించలేకపోయాడు.

మహానదికి రెండవ ఆనకట్ట, ఇంతకు ముందున్న ఆనకట్టకు లోపలివైపుకి కడ్తున్నారు. ఆనకట్ట కాళియ బుద నుండి ఆరంభమై చహాట్‌ ఘాట్‌ మీదుగా పూరి కలెక్టర్‌ ఘాట్‌వైపు వెళ్ళి కటకంలో ఖానన్‌నగర్‌ వరకూ ఉంటుంది. అప్పుడు కటక్‌ పట్టణానికి వరద బాధ తప్పుతుంది. ఏ పిచ్చిమాలోకానికి కటకం గురించిన ఆలోచన వచ్చిందో గాని, ఆ ఆలోచన చాలా ఆకలి కడుపులకి కాస్త అన్నం దొరికేట్లు చేసింది.

నది ఒడ్డున కూలీల కోసం వరసగా గుడిసెలు వేశాడు కాంట్రాక్టరు. గుడిసెలకు గోడల్లేవు. రెండు వైపులా రాటలు పాతి ఓ ఏడడుగులపై కప్పువేసారు. గుడిసె త్రికోణాకారంలో తయారైంది. ఒక్కో గుడిసెలో ముప్ఫై మందికూలీలు ఉండాలి.

ఉండాలంటే రాత్రిళ్ళు పడుకోవాలన్న మాట. అంతే. పగలంతాపని ఉంటుంది. ఒక్కో రాత్రి పెట్రోమాక్స్‌ లైట్లేసుకుని పనిచేస్తారు. శీతాకాలమైనా నదిలో నీళ్ళు లేవు. అంత వెడల్పున్న నదికూడా ఆ కూలీల బలమైన బాహువులను చూసి ముడుచుకుని పోయి దాక్కుందా అన్నట్లుంది. రోజు రోజుకూ సన్నబడింది. ఓ చిన్న పాయ మాత్రం మిగిలింది. కూలీలు తమ ప్లేట్లు కడగడాలూ, స్నానాలూ దాన్లోనే చేసి సరిబుచ్చుకునేవారు. ఓ రెండు తాగేనీటి పైపులు కూడా పెట్టారు. ఓ వంటవాడు ఉన్నాడు కూలీలు పనికి వెళ్తే వారికి వండిపెట్టేందుకు. రోజూ రెండు పూటలా అన్నం దొరుకుతూంది వారికి.

అందరూ ఎవరి ప్లేటు గ్లాసు వారే తెచ్చుకున్నారు. పొద్దున్నే చద్దన్నం, బంగాళదుంపల కూర ఉప్పు కారం నంజుకుని తిని పనికి వెళ్తారు. ఒంటిగంటకు విరామం. తిరిగి వచ్చి వేడన్నం, పప్పు, కూర తింటారు. మళ్ళా రాత్రికి అన్నం పప్పుకూర. ఇంకేం కావాలి వారికి? ఊళ్ళో మూడు పూటలు తిండిపెట్టే వారెవరున్నారు? ఉన్న వాళ్ళింట్లో కూడాఅన్నంతో పప్పు ఉండదు రోజు కాంట్రాక్టరు బాబు సరకులు తెచ్చుపెడ్తాడు. నెలా ఖరుకి వారి ఖాతాలో రోజుకి అయిదు రూపాయలచొప్పున పట్టుకుంటారు. అయిదు రూపాయలకు మూడు పూటల తిండంటే బాగుందనే అనుకోవాలి. మిగతా డబ్బులు ఇస్తారు. కాంట్రాక్టరుకి ఒక్కొక్కరి జీతంలో పదిపైసలు చొప్పున కమీషను ముడుతుంది. ఒక్కో సర్దారు అంటే కాంట్రాక్టరు వంద, రెండు వందల కూలీలను తెస్తాడు. అతనేం పని చేయడు. ఊళ్లు తిరిగి తండలున్న యువకులను తెస్తాడు కూలి పనికి. కూలీల జీతం నుండి అతనికి వేల కొద్దీ సంపాదన వస్తుంది.

జడకి ఏవిధమైన ఇబ్బందులుగాని ఫిర్యాదులుగాని లేవు. ఊళ్ళో కన్నా ఇక్కడ ఎంతో బాగుంది. రోజు ఎనిమిది గంటలు పని చేయాలి. ఊళ్ళో మూడు పూటలు భోజనం దొరకదు. అంతే కాకుండా మట్టిపని చేసి బోలెడు సంపాదిస్తున్నాడు. ఒక్కో గుంపు ఎంత మట్టి మోస్తే వచ్చిన డబ్బులు సరిసమానంగా పంచుకుంటారు. ఒకరు ఎక్కువ మట్టి మోసారని ఎక్కువ డబ్బులూ, తక్కువ మట్టి మోసినవారికి తక్కువా అన్నది కుదరదు. ఎవరి శక్తి ఎంతో ఒళ్ళొంచి పని చేస్తారు. ఎల్లప్పుడు ఒక్కలా ఉండదు కదా, దేవుడు అందరికీ సమంగా శక్తినివ్వలేదుగదా. జడ భుజశక్తి బలంతో వారి గుంపు ఎక్కువ పని చూపెట్టగలిగారు, ఎక్కువ సంపాదించేవారు మిగతా గుంపులకు ఈర్ష్య కలిగినా ఏం చేయలేని పరిస్థితి. వారిని ఎక్కువ మట్టి మోయొద్దని ఎవరూ అనలేదె?

నది ఒడ్డున రెండు రావి చెట్లున్నాయి. దాని కింద ఓ పది పన్నెండేళ్ళ పిల్లలు యిద్దరు టీ కొట్టు పెట్టారు. కొన్ని బిస్కెట్లు కూడా అమ్ముతారు. పని మధ్యలో ఆపి కొందరు కూలీలు టీ తాగుతారు, రెండు బిస్కెట్లు తింటారు. జడకి ఈ అలవాట్లు లేవు. అతనికి ండల్లో శక్తి ఉంది. టీలు, బీడీలు వాటిని హరిస్తాయి. సిగరెట్లు, కిళ్ళీలు డబ్బుల్ని హరిస్తాయి. జడ డబ్బులు కూడబెట్టాడు. మేనేజరు దగ్గర దాచుకున్నాడు. ఇంటికెళ్ళేటప్పుడు అంతా పట్టుకెళ్తాడు. తల్లి కొంగులో దాన్ని కట్తాడు. లక్షరూపాయలు తెచ్చేనని చెప్తాడు. లక్ష రూపాయలంటే ఆ ముసల్దానికి ఏం అర్ధమవుతుందని!

సూపర్‌వైజరు కూలీల హాజరీ తీసుకుంటాడు. కూలీ డబ్బులు, తిండి ఖర్చులు, వంటవారి జీతం ఖర్చులు తర్వాత వారి వారి మందుల ఖర్చులు ఇలాంటివన్నీ పోను లెక్క కట్టి ఎవరికి కెంత ముడుతుందో తెలియజెప్తాడు. మేనేజరు ఎవరి జీతం వారికిస్తాడు. అయితే జడ జీతం తీసుకోడు, దాచి ఉంచుతాడు, ఊరికి వెళ్ళేటప్పుడు ఒక్కసారిగా అంతా తీసుకుంటాడు.

రోజంతా ఒళ్ళు హూనమయేటట్లు పని. ఆలోచించే తీరిక లేదు. ప్రతీ గుడిసె ముందరా కొన్ని రాళ్ళు పేర్చి త్రినాధ దేవుడని అన్నారు. సిందూరం పూసిన ఆ రాతి ముందర మేళా చేస్తారు. గంజాయి చిలుము, కంజీరా భజన, రామాయణ పారాయణ చేస్తారక్కడ. మేళా తిరునాళ్ళలా మారి ప్రసాదాలు యిస్తారు. ఊళ్ళో వదలి వచ్చిన పెళ్ళాం పిల్లా పాపల కోసం కూలీలు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ దేవుడ్ని మొక్కుకుంటారు. మత్తుమందు చల్లినట్లు అలా కొంతసేపు నేలమీదే పడుంటారు కొందరు. నది ఒడ్డున ఉన్న ఆ గుడిశెల చూరుమీంచి వెన్నెల వారి పక్క బట్టల మీద పడుతుంది. ఊళ్ళో కంటె ఇక్కడ చలి కాస్త ఎక్కువే. అయితే చలి ఎక్కువని సూపర్‌వైజరు దాని కోసం జీతం తగ్గించడుగా! ఒళ్ళొంచి పనిచేసే జడకు రాత్రులు బాగా నిద్ర పడుతుంది. తెల్లారకముందే మెలకువ వస్తుంది. జడ నిద్ర లేచేడంటే ఇక తెల్లవారుతుందని అందరికీ తెలుసు. ఇంకొక పనిరోజు ఉదయించిందని లెక్క!

ఆ రోజెందుకో జడకి ముసలితల్లి పదే పదే జ్ఞాపకమొచ్చింది, అమ్మకు వంట్లో బాగులేదో, యేమో! పాపం ముసల్ది ఒంటరిగా తడుముకుంటూ పనులన్నీ చేసుకుంటూ ఉంటుంది. జడ తిరిగి వచ్చింతర్వాత కోడల్ని తెస్తాడు, తాను హాయిగా

ఉండొచ్చు అనుకుని రోజుల్లెక్క బెడ్తూందేమో. నాలుగైదు రోజులు కాస్త ఎక్కువగా పని చేసేస్తే మేనేజర్నడిగి ఓ రోజు శెలవు తీసుకుని యింటికి వెళ్ళి రావచ్చు అమ్మను చూడొచ్చు అనుకున్నాడు జడ. ఊళ్ళొంచి మరో పది పన్నెండు మంది మంచి కండలున్న యువకుల్ని తేవాలని సర్దారు అంటూనే ఉన్నాడు. తల్లి తలపులతో ఊర్ని గురించిన తలపులతో జడ మనస్సు నిండిపోయింది. రెట్టించిన శక్తితో పని చేయడం మొదలెట్టాడు.

కటకం పట్టణంలోని అనవసరపు నీటిని కఠజొడినది లోకి వదలడానికి దారి చేస్తూ కాలువ తయారు చేసి ఆనకట్ట దిగువ భాగంలో తవ్వుతున్నారు. ఆ రోజు జడచేతిలో గడపార ఓ యంత్రంగా మారిపోయింది. ఎడతెరిపి లేకుండా తవ్వుతూనే

ఉన్నాడు. అతని తోటివారు మట్టిని ఎత్తుకుని ఆవల వేసేందుకు తెగ శ్రమ పడుతున్నారు. దానికి తోడు నెత్తిమీద శీతాకాలపు యెండ సూదుల్లా గుచ్చుకుంటూ చెమటతో తడిసిన శరీరాలకు యింకా ఆకలి కలిగిస్తున్నాయి. పెద్ద గొయ్యి తయారయ్యింది. తోటి శ్రమికుడు అన్నాడు ”ఏరా జడ! ఆకలెయ్యట్లేదా? ఎండ దెబ్బ కొట్టట్లేదా? చూడు సూర్యుడు నెత్తి మీద కొచ్చాడప్పుడే!”

నిజానికి జడకు యెండ తగలట్లేదు ఆనకట్ట క్రిందివైపు తవ్వుతున్నాడు. అతనున్న చోటికి ఇరవై అడుగుల ఎత్తు వరకూ మట్టి దిబ్బ ఉంది. తల దించుకుని తవ్వుతున్నాడు. తల పైకెత్తితే కదాతెలిసేది సూర్చుడెక్కడున్నాడో! అతనికి ఆకలిగా కూడా లేదు. తల్లి చేతి చద్దన్నం పచ్చడ్ల వాసనలు మనసంతా నిండిపోయింది. వంటవాడు వండిన అన్నం, దాల్మా పప్పు రుచించదు ఈ రోజు. తలవంచుకొని గడపారతో మరింత తవ్వుతూ అన్నాడు ”వస్తున్నా అన్నా – ఇంకో తట్ట కయ్యేంత మట్టి తవ్వి వచ్చేస్తా….” రెప్పపాటులో ఇరవై అడుగుల ఎత్తు మట్టి దిబ్బజారి దాని కింద నుండి అతని ఆఖరి మాటలు గాలిలోకి లేచి నదీ తీరాన సుడులు తిరిగి తిరిగి శూన్యంలో కలిసిపోయాయి. నది అవలినుండి ”వచ్చేస్తా… వచ్చేస్తా…’ అన్న మాటలు ముక్కలుగా ప్రతి ధ్వనించాయి.

ముప్ఫై గుడిసెల్లో ఉన్న వేయిమంది కూలీల మనసుల్లో ఒకే ప్రశ్న. ‘ఇవాళ జడ చనిపోయాడు, రేపెవరి వంతు? ఇంత పెద్దనది పొట్టను చీల్చినట్లు వృత్తాకారంలో కొండచిలువలా ఆనకట్టం! ఒక్క ప్రాణంతోనే నది తృప్తి పడుతుందా?

వేయిమంది పనివాళ్ళలో ఒక్క ప్రాణంపోతే ఆనటక్ట పని ఆగిపోదు కాని బీదపనివాడి కుటుంబం మంటగలిసిపోయింది. ఆ విలువ ఎవరిచ్చుకుంటారు? మేనేజరు, ఏజెంటు కూలీలను అనునయిస్తున్నారు. ‘దుర్ఘటన జరిగిపోయింది. ఎవరేం చేయగలరు? అయితే విచారణ జరుగుతుంది. మా వైపు నుండి ఏమీ తప్పు జరగలేదు. డిపార్టుమెంటు తగినంత జాగ్రత్తలు తీసుకోలేదని రిపోర్టు గనుక వచ్చిందంటే తప్పకుండా పెద్ద మొత్తం పరిహారంగా ఇస్తారు. డిపార్టుమెంటు వారు ఇచ్చినా యివ్వకపోయినా ప్రభుత్వం తప్పకుండా ఇస్తుంది. మీరంతా నిశ్చింతగా ఉండండి. మీ ప్రాణాల మూల్యం తప్పక గిట్టుతుంది.

‘ఎంత? ఎంత?” ముక్త కంఠంగా అరిచారు.

‘లక్ష అనుకోండి….

‘లక్ష రూపాయలా!’ దుంఖం, ఆశంక, హాతాశనిండిన వారి నోళ్ళలో లక్ష రూపాయల కాంతి ఒక్కసారిగా వెలిగింది. విధి వికృతం వల్ల చనిపోయిన వాడిపై కొంచెం యీర్ష్యలాంటి భావం వారి మదిలో మెదిలింది, జడతల్లి యింత డబ్బులేం చేసుకుంటుంది? ముసల్ది నిజమైన కొడుకుని కనిందని, జడ బతికి ఉన్నా లక్ష చేస్తాడు చనిపోయినా లక్ష చేస్తాడు.

మర్నాటి నుండి ఎప్పట్లానే ఆనకట్ట పని సాగింది. జడ రక్తంతో తడిసిన మట్టిని మోసేటప్పుడు పనివారు తలభారంగా అనిపించింది. అదిజడ రక్తం వల్ల బరువెక్కిందో, లేక లక్షరూపాల భారంతోనో, ఎవరికి తెలుసు!

ఇప్పుడు జడ తల్లిని చూసేందుకు వారింటికి కొంత మంది దొరలు, చిన్నా పెద్ద నాయకులు వెళ్ళి వస్తున్నారు. మొదటి రోజు వారితో ఓ పోలీసు వచ్చాడు. ఓ ఫోటో చూపెట్టి అడిగేడు ”పిన్నీ, బాగా చూసి చెప్పు. ఈ ఫోటోలో ఉన్నది నీ కొడుకు జడ యేనా?’ ముసల్ది ఆనందంతో ఫోటోని చేతితో నిమిరింది, గాజు పెంకుల్లాంటి కళ్ళకు దగ్గరగా కాగితాన్ని పెట్టుకుని అందులో కొడుకుని చూడ్డానికి ప్రయత్నించింది. ఫోటో పెద్దదే. ముసల్దానికి అస్పష్టంగా కనిపించిందేంటంటే ఓ పెద్ద గదిలో మంచం మీద పరుపు, తలగడా, దానిపైన ఓ తెల్లటి దుప్పటి, దాని మీద పడుకున్నాడు ఆమె కంటి వెలుగు జడ. కాలి నుండి మొహం వరకూ తెల్లదుప్పటి కప్పి ఉంది. మొహం మాత్రం కనిపిస్తూంది. కళ్ళు మూసుకునిపడుకుని ఉన్నాడు. పాపం పడుకోనీ. జడ చాలా కష్టపడి పనిచేస్తున్నాడని అందరూ అంటారు. ఇక తిరిగి వచ్చింతర్వాత ఊళ్ళో పెద్ద మనిషిగా చలామణి అవుతాడు. ముసల్దానికి జీవితంలో యింకేం వద్దు. ఊళ్ళో తన కొడుకు మనిషిగా తలెత్తుకుని తిరిగితే అంతేచాలు!

నీళ్ళు నిండిన కళ్ళతో ముసల్ది నెమ్మదిగా జడ ఫోటోని నిమిరింది, మునపట్లా కొడుకుని అక్కున జేర్చుకుని పడుకోవాలనిఅనిపించింది. అందరూ అనుకున్నదే నిజం. జడ పెద్దమనిషి కాకపోతే యిటువంటి పెద్ద యింట్లో తెల్లటి దుప్పటి పరిచిన శుభ్రమైన మంచం మీదపడుకుని ఉండేవాడా? జడ కాళ్ళ దగ్గర కొంతమంది చేతులు కట్టుకుని నిల్చుని ఉన్నారు. అప్పు కోసం వచ్చి ఉంటారు. అతని నిద్ర చెడపడానికి ఎవరి కంత ధైర్యం?

ముసల్ది ఆర్ధ్ర స్వరంతో అంది, ”అవునండి, వీడే నా ముద్దుల కొడుకు, నా ఒక్కగానొక్క కొడుకు జడ.. ఏం, ఎందుకడుగుతున్నారు? ఈ గుర్తుపట్టడం అంతా ఎందుకు?’

పోలీసు ఆఫీసరన్నాడు ‘ఏం కంగారు పడకమ్మా. నీకు డబ్బులోస్తాయి. నీ చేయి ఇటుతే, నీ వేలిముద్ర వేయిక్కడ. నువ్వు నీ కొడుకుని గుర్తు పట్టావు. ఇక దేనికీ కష్టపడనఖ్ఖరలేదు’.

వణుకుతున్న చేతుల్తో వేలిముద్ర తన ముందర ఉన్న కాగితంపైన వేస్తూ వ్యాకులపడ్తూ అడిగింది, ‘అయితే నా ముద్దుల కొడుకు… జడ….’

తెల్లబట్టలేసుకున్న దొరలు పోటా పోటీగా అన్నారు ‘ నీకొడుకెక్కడ ఉన్నాడో అక్కడ బాగున్నాడు. ఆకలి దప్పి, దుఃఖం, కష్టం అన్నిటికీ దూరంగా ఉన్నాడు. అతని గురించిన చింత వద్దు.నీకు డబ్బులొస్తే అదేచాలు. ఈ రోజుల్లో కొడుకులు తలిదండ్రులతో ఉంటున్నారా, అసలు?’

ముసల్ది చేతులెత్తి మొక్కుతూ మెల్లగా అంది, ‘అవును. వాడు సుఖంగా ఉండనీ, ఏనుగు అడవిలో ఉన్నా రాజే, సంపాదిస్తున్నపుడు ఊళ్ళో పడి ఉండాల్సిన ఖర్మ ఎందుకు వాడికి? కుగ్రామాల్లో ఇంతడబ్బెవరిస్తాడు? వాడిక్కడకు రాకపోతే ఫర్వాలేదు. నాకు డబ్బు అందుతూనే నేనే వాడి దగ్గరకు వెళ్ళిపోతాను. వాడి దగ్గరే ఉంటాను. నాకీ ఊళ్ళో మాత్రం ఎవరున్నారని?’

దొరలన్నారు, ‘అవునవును. మంచిది. ఇప్పుడే తొందరపడి బయల్దేరొద్దు. డబ్బులందుతూనే జడ దగ్గరకు వెళ్ళొచ్చు.’

ముసల్ది నెమ్మదిగా అడిగింది ‘ఎంత డబ్బొస్తుందేంటి?’

‘లక్ష రూపాయలనుకో’ ఎవరో అన్నారు.

‘లక్ష రూపాయలా!’ ముసల్ది అవాక్కయింది.

ఇంతలో ఎవరెవరో పెద్దమనుషులు ముసల్దాని వేలిముద్రలు తీసుకున్నారు. డబ్బువొస్తుంది ఒస్తుందని మూడు శీతాకాలాలు ముసల్ది దుప్పటి లేకనే గడిపేసింది. అడిగితే దొరలంటారు, ‘ఒసే ముసల్దానా, ప్రభుత్వం నుండి డబ్బులు రావాలంటే మాటలా ఎన్నెన్ని పత్రాలు రాయాలి. అయినా తక్కువ డబ్బులుకావు కదా.కొంత కాలం పడ్తుంది. ఓపిక పట్టు’. అని ఓపిగ్గా ఎదురు చూస్తూంది ముసల్ది. డబ్బు అందుతూనే కొడుకు దగ్గర కెళ్ళేందుకు టికెట్టు కొనాలి. ఊళ్ళో అందరూ గుసగుసలు మొదలెట్టారు. ముసల్దాన్ని చూసి ‘పాపం’ అనుకుంటున్నారు. ముసల్దానికిదేం పట్టదు. జడ ఎక్కడున్నాడో హాయిగా ఉన్నాడని అనుకుంటూంది. తన కళ్ళు తననే మోసం చేస్తాయా, ఏం? ఈ రోజుల్లో లేనివాళ్ళు ఉన్నవాళ్ళను చూస్తే భరించలేకపోతున్నారు. జడ హాయిగా ఉన్నాడు. వాడి తల్లికి లక్ష రూపాయలొస్తాయని ఓర్వలేని వారు జడ గురించి ఏదేదో చెప్పుకుంటున్నారు. ముసల్ది ఎందుకు నమ్మాలి? న్యాయం తన పని చేసుకుపోతుంది. ఇంతమంది కూలి పనికి వెళ్తున్నారు. తన కొడుకు మాత్రం మట్టి కరుస్తాడా? ముసల్ది ఇంకేం ఆలోచించదల్చుకోలేదు.

ఓ రోజు నిజంగానే డబ్బులొచ్చాయి. ముసద్దాని గడప ముందర ఊరు ఊరంతా గుమిగూడింది. ముసల్దాని కళ్ళు సరిగా కనిపించడం లేదు. అడిగింది. ‘ఎంత డబ్బు?’.

డబ్బులు తెచ్చిన పెద్దమనిషి అన్నాడు ”ఇరవైలన్నీ చేరిస్తే… అలాంటి యాభై కట్టలు..”

‘యాభై కట్టలంటే ఎంత డబ్బు బాబూ?’

దుకాణం ఉన్న హరిసాహు అన్నాడు ‘వెయ్యి రూపాయలమ్మా’

‘ఆఁ ఆఁ వెయ్యి రూపాయలా? లక్ష కాదా?’ డబ్బులిచ్చే పెద్ద మనిషి అన్నాడు ”ఓసి ముసల్దానా, కాగితం మీద రాసినవన్నీ నిజమౌతాయా? నిజంగా లక్ష రూపాయలు దొరికిపోతుందని అనుకున్నావా?’

ఊళ్ళో అందరికీ అర్థమైపోయింది. ముసల్దాన్ని సముదాయించారు ‘నిజమే లక్షంటే మాటలా? నిజంగా ఎక్కడైనా లక్ష రూపాయలుంటాయా అసలు? ఈ ఊళ్ళో లక్ష రూపాయలు కళ్ళ జూసిన వారెవరైనా ఉన్నారా? ఊరి సాహుకారు కూడా లక్ష రూపాయలు చూసి ఉండడెప్పుడూ. ముసల్ది కూడా సంతోషంగా అంది, ‘అవునవును, లక్ష రూపాయలు!’ వెయ్యి రూపాయల్ని లక్ష రూపాయలని అనుకుని ముసల్ది కొడుకు దగ్గరకు వేళ్ళేందుకు టికెట్టు కొనేందుకు ఆత్రపడింది. నోట్ల కట్టను కొడుకుని పట్టుకున్నట్లు పొదివి పట్టుకుని గద్గర స్వరంతో ‘ఎంతపని చేశావురా జడ!’ అంటూ చాప మీద ఒరిగిపోయింది. (ఇంకా వుంది)

Share
This entry was posted in అనువాదాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో