ముదిమిసిమి- ఓల్గా

తలుపు తాళం వేసి బైటికి నడుస్తూ కన్నీళ్ళు తుడుచుకుంది సుజాత. తలుపు వెనక గదిలో ఒంటిరిగా బలహీనంగా ముడుచుకుని పడుకున్న తల్లిని తలుచుకుంటే తుడిచిన చెంపలు మళ్ళీ తడిశాయి.

వెనక్కు వెళ్దామని అనిపించింది. శెలవులన్నీ అయిపోయాయి. చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. జీతం తీసుకుంటూ పనులు పూర్తి చేయకపోవటం న్యాయం కాదు. కదలనంటున్న కాళ్ళను ముందుకు నడిపించింది సుజాత.

ఇంకా పదేళ్ళ సర్వీసుంది. పిల్లల బాధ్యతలు పూర్తయినాయంటే తల్లి జబ్బు పడింది. జబ్బు తగ్గిందిగానీ వృద్ధాప్యం వల్ల అది రంగమణిని బాగా బలహీన పరిచింది. వాడిన ఝాటైన మందులు తాము చూపవలసిన ఇతరేతర ప్రభావాలనన్నింటినీ చూపి గాని జబ్బుని తగ్గించలేకపోయాయి. దానివల్ల రంగమణి శరీరం పిప్పి అయింది. ఈ జబ్బు రాకముందు రంగమని బాగానే ఉంది.ఎనభై ఏళ్ళ వయసులో తన పనులు తను చేసుకోవటమే గాక ఇంటి ముందున్న చిన్ని ఆవరణలో పూల మొక్కలు పెంచే పని కూడా చేసేది. నిండా పది గజాల లేని ఆ చోటుని చిన్న రంగు పూల ప్రపంచం చేసుకుని సగంరోజు అక్కడే గడిపేది. కొంత సమయం రంగు దారాలతో తెల్లని పలుచని బట్టల మీద రంగు రంగుల పూలు, లతలు, పక్షులు, సీతాకోక చిలుకలు, దీవెనలతో, ఆశీర్వాదాలతో కూడిన మాటలూ ఎన్నో కూడుతూ ఉండేది. ఈ ఏడాదిగా చూపు బాగా తగ్గింది. డయాబటిస్‌ వల్ల కాబట్టి అదలా తగ్గక తప్పదన్నారు డాక్టర్లు. చేతులలో ఒణుకు మొదలయింది. నడక కూడా కష్టమైంది.

‘వయసు పైబడ్డాక అంతే’ అన్నారందరూ – అదెప్పుడు పైబడుతుందోననే భయంతో ఉన్నవాళ్ళే వారందరూ. వైద్యానికి లోటులేదు గానీ ఈ వయసులో ఇంతకంటే చేయగలిగింది లేదని డాక్టర్లు కూడాచేతులెత్తేవారు.

ఇన్ని మార్పులు జరిగినా రంగమ్మ అని ఇప్పుడందరూ పిల్చే రంగమణి ఆ ఒణికే చేతులతో కుడుతూనే ఉంటుంది. ఎవరైనా చేయి పట్టుకు నడిపిస్తే వచ్చి కళ్ళు చించుకుని మరీ పూలను చూస్తుంది. సున్నితంగా చేతులతో తాకుతుంది. ఇన్ని బాధలనూ, నొప్పులనూ చిరునవ్వు చెదరకుండా భరించే తల్లి పరిస్థితి చూసి తట్టుకోవటం సుజాతకు చాలా కష్టంగా ఉంది.

బాధ్యతలు పెరిగిన ఉద్యోగ పరిస్థితి. ఇంటిపనీ తప్పదు. తల్లి పనులన్నీ చేయటానికి మనిషిని పెట్టింది గానీ ఒక్కరూ నిలవలేదు. సంవత్సరంలో పదిహేనుమంది మారారు. రంగమ్మ వాళ్ళతో మంచిగా మాట్లాడేది. కుట్ల నేర్పాలని చూసేది. ఒకరిద్దరు చదువురాని వాళ్ళు వస్తే అక్షరాలు నేర్పటానికి ప్రయత్నించింది. వాళ్ళలో ఉన్న ప్రతి మంచి లక్షణాన్నీ చెప్పి వాళ్ళను సంతోష పెట్టాలని చూసేది. తనకో తోడు నిలుపుకోవాలని తల్లి చేసే ప్రయత్నాలన్నీ జాలిగా చూసేది సుజాత. ఎవరి ఇబ్బందులు వారివి. రోజంతా ఒక ముసలమ్మతో ఒంటరిగా గడపలేకపోయారో ఏమో రంగమ్మ, సుజాతల మంచితనంగానీ, వారి అవసరం గానీ వాళ్ళను ఆపి ఉంచలేకపోయాయి.

రాను రానూ పరిస్థితి అధ్వాన్నమవుతోంది. మధ్యాహ్న భోజనం, మందులూ మరీ సమస్య అవుతున్నాయి. ఒక్కతే బాత్‌రూంకి వెళ్ళటానికి పడిపోతానేమోనని భయపడుతోంది. డైపర్‌ వేసారు. అది రంగమ్మకు అసలు ఇష్టంలేదు. ”వొద్దమ్మా” అంది రంగమ్మ వేడుకోలుగా.

”మరి ఎలాగమ్మా – పొరపాటున పడితే..” అంది సుజాత బేలగా సాయంత్రం సుజాత రాగానే ఆదుర్దాగా తల్లి గదిలోకి పరిగెత్తి నట్టే వెళ్ళేది. తల్లిని పరీక్షగా చూసేది.

ఒణికే చేతుల్తో తిన్న భోజనం చీరెమీద పడి మరకలు కట్టి కనిపించేది. చీరెను నలగకుండా, శుభ్రంగా ఉంచుకునే అమ్మ తీరూ, పద్దతీ గుర్తొచ్చి సుజాత మనసు కలుక్కుమనేది.

ఒకోరోజు మందుబిళ్ళలు కిందపడి ఉండేవి.

”కాస్త జాగ్రత్తగా వేసుకోమ్మా” సుజాత ఆఫీసు నుంచి ఒచ్చిన అలసటతో విసుగ్గానే అనేది.

”మరీ చిన్నవమ్మా.పట్టు చిక్కటం లేదు. జారి పోతున్నాయి” తల్లి స్వరంలో సంజాయిషీ వింటే సుజాతకుమనసంతా వికలమయ్యేది.

వెళ్ళి పక్కన కూచుని వీపు నిమిరేది.

”పోన్లేమ్మా. ఈ మందులు పని చెయ్యటం లేదు. పాడూలేదు. ఓ పూట వేసుకోకపోతే ఏం కాదు.” రంగమ్మే సుజాతను ఓదార్చేది. సీసాలోంచి గ్లాసులోకి ఒంపుకోబోతున్నపుడు చేతులు ఒణుకుతో ఒకోసారి నీళ్ళు కింద పడేవి. ఒకోసారి సీసా జారి నీళ్ళన్నీ నేలపాలయ్యేవి.

సుజాత వచ్చి తుడుచుకుంటుంటే రంగమ్మ తప్పు చేసిన దానిలా ముడుచుకు కూర్చునేది.

ధీమాగా, ప్రశాంతంగా ఉండే తల్లి ముఖంలో అనవసరంగా వచ్చి కూచున్న అపరాధ భావనచూసి సుజాత గుండె చిక్కబట్టేది. సుజాతకు ఈ మధ్య గుండెలు చిక్కబట్టే ఉంటున్నాయి.

కళ్ళు సరిగా కనిపించకపోయినా సుజాత నిస్సహాయత, నీరంవ, దిగులు రంగమ్మకు అర్థమవుతూనే ఉంది. తల్లి కదా – కూతుర్ని చదవటం ఆమెకు అలవాటైన విద్యే.

ఆ రోజు సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చి రంగమ్మకు టీ తాగించి తనో కప్పు తీసుకుని కుర్చీ తల్లి మంచం పక్కకు లాక్కుని కూచుంది సుజాత. ”నీకు మూడేళ్ళు నిండేవరకూ నేను ఉద్యోగం మానేశా. మంచి ఉద్యోగం చాలా సరదాగా, ఇష్టంగా వెళ్ళేదాన్ని. నువ్వు కడుపున పడ్డావు. అంతే – ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చున్నా. నీకు మూడేళ్ళు నిండాక బళ్ళో చేర్పించి మళ్ళీ ఉద్యోగం వెతుక్కున్నా. రెండేళ్ళకు గాని కాస్త మంచి ఉద్యోగం దొరకలా. చివరికి దొరికింది. వెనకటంత మంచిది కాదనుకో – కానీ అన్నీ కావాలనుకుంటే ఎల్లూ – మనం మనుషులమే గాని మరేం కాదు గదా!”

రంగమ్మ ఒక్కోమాట చెబుతుంటే సుజాత నివ్వెరపాటు పెరుగుతూపోయింది. కళ్ళు పెద్దవి చేసి తల్లిని చూసింది. రంగమ్మ ఉద్దేశం ఆమెకర్థమైంది. ‘తల్లి తనను ఉద్యోగం మానెయ్యమంటోంది. మానేసి ఆమెను చూసుకోమంటోంది.’ సుజాతకు తలంతా నొక్కుకుపోతున్నట్లు నరాలు బిగిశాయి. రంగమ్మ మెల్లిగా పడుకుని అటు పక్కకు ఒత్తిగిలి కళ్ళు మూసుకుంది. సుజాత మెదడు మెల్లిగా పని చెయ్యటం మొదలు పెట్టింది. తనకోసం తల్లి మూడేళ్ళు ఉద్యోగం మానేసింది. అందుకు తనిప్పుడు మానెయ్యాలా? మానేసి తల్లిని పెంచాలా? నెలకు దాదాపు యాభైవేల రూపాయల ఉద్యోగం మానేసి – ”నీకు పిల్లలు పుట్టేసరికి నేను రిటైరయ్యా – వాళ్ళనూ పెంచా” రంగమ్మ మెల్లిగా ఇటు ఒత్తిగిల్లి మెత్తగా అన్నది. నిజమే. అందుకే రంగమ్మ ఎంత మెత్తగా అన్నా అది సుజాత గుండెలో కత్తిలానే దిగింది.

”అమ్మ తన పిల్లలిద్దర్నీ పెంచింది. అమ్మ పిల్లల సంగతి చూసుకోకపోతే ఈ ఉద్యోగం ఇన్నాళ్ళు ఇంత హాయిగా చేయగలిగేదా ఇన్ని మెట్లు – ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇన్ని సాధించగలిగేదా? అమ్మ చెప్పేవరకూ అదెంత ముఖ్యమో తనకు అర్థంకాలేదు.

కానీ – ఉద్యోగం మానేసి – ఇంట్లో – ముసలితల్లిని పెంచుతూ ”పిల్లల్ని పెంచటం బాగుంటుంది. చాలా మంచి అనుభవం కష్టమే ననుకో – కానీ ఆ పిల్లల మెత్తటి స్వర్శ, ముద్దు మాటలు, తప్పటడుగులూ, పడుతూ లేస్తూ తీసే పరుగులు చాలా ఆనందంగా ఉంటుంది. నీకది అంతగా తెలియదు. నేనే పెంచాగా. పోనీ తల్లుల్ని పెంచటం ఎలా ఉంటుందో చూడరాదూ?” రంగమ్మ పెదవులు విప్పి కట్టుడు పళ్ళు మెరుస్తూ కనపడేలా నవ్వింది.”

సుజాత కళ్ళు పెద్దవి చేసి చూసింది.

”నీ బాధ నే చూడలేకపోతున్నా. పనితో అలిసిపోయి, మనసులో దిగులు పెట్టుకుంటే ఆరోగ్యం పాడవుతుంది. ఉద్యోగం మానెయ్యి. నన్ను చూసుకో”.

సుజాత రంగమ్మను పట్టుకుని బావురుమంది.

”పిచ్చిపిల్లా ఏడుస్తావెందుకు? అట్లా నలిగిపోగూడదు. నన్ను ఏ వృద్ధాశ్రమంలోనన్నా చేర్పించి నిశ్చింతగా ఉండగలిగితే ఉండు. కానీ నువ్వు అలా ఉండలేవు. అది నాకు తెలుసు. అందుకే ఉద్యోగం మాని నన్ను చూసుకో” సుజాత చట్టుక్కునలేచి తన గదిలోకి వెళ్ళి పడుకుంది. బాగా దుఃఖం వచ్చి తనివితీరా ఏడ్చింది.

”తనకీ ఆలోచన ఎందుకు రాలేదు? తననూ, తన పిల్లల్నీ పెంచిన తల్లిని పెంచాలని తనెందుకు అనుకోలేదు? బోలెడు డబ్బు,హోదా గల ఉద్యోగం ఒదిలి ఇంట్లో ముసలి తల్లితో ఉండగలదా? తనకు డిఫ్రెషన్‌ వస్తే – కానీ ఇప్పుడు మాత్రం తనకు డిప్రెషన్‌ లేదా. రాత్రిళ్ళు ఒళ్ళెరగకుండా నిద్రపోయి ఎన్ని రోజులయింది? మనసారా నవ్వి ఎన్నిరోజులయింది అమ్మ చెప్పినట్లు చేస్తే –

అమ్మో పిల్లల్నిపెంచటం వేరు. పెద్దవాళ్ళను చూసుకోవటం వేరు. కానీ అమ్మ. ఎప్పుడూ ఏమీ మాట్లాడని అమ్మ. ఒంట్లో ఉన్న ఓపికంతా తనకోసం తన పిల్లల కోసం ఖర్చు చేసిన అమ్మ! ఇవాళ ఇంత స్పష్టంగా నోరు తెరిచి అడిగింది. వివరంగా చెప్పింది. ఏమవుతుంది ఉద్యోగం మానేస్తే. డబ్బు ఇబ్బందులు రావు. భర్త సంపాదిస్తున్నాడు. పిల్లల బాధ్యతలు లేవు. తన జీతం లేకపోతే కటకటలాడే పరిస్థితేం లేదు. జీతం బ్యాంక్‌లో జమ అవుతోంది. ఈ మధ్య అది తీసే అవసరమే ఉండటం లేదు. బ్యాంక్‌ ఎకవుంట్‌ పెంచటం మానేసి అమ్మను పెంచితే – ఏమి తేడా రాదు. కానీ ఆ భారం తను మొయ్యగలదా? ఆఫీసులో అంతంత బాధ్యతలు మోసే తను తల్లి బాధ్యత మొయ్యలేదా? అవి అలవాటైన పనులు. అలవాటు – చేసుకుంటే అయ్యే అలవాటు – మానేస్తే పోదూ – మనుషులు ఎన్నో అలవాట్లు పోగొట్టుకుంటున్నారు. కొత్త అలవాట్లు చేసుకుంటున్నారు. దానికి కష్టపడుతున్నారు. తనూ అంతే – కష్టపడుతుంది.

అమ్మ. పండిపోతున్నది. పండుటాకు. రాలితే మరి కనిపించదు. ఎంతో అపురూపమైన ఈ కొద్ది సంవత్సరాలు.

ఎంత అపురూపమైనది అమ్మ స్పర్శ. ఆ తర్వాత కావాలన్నా దొరకదు. ఈ సంగతి కూడా అమ్మే చెప్పాల్సి వచ్చింది.

సుజాత ఉద్యోగానికి రాజీనామా చేసే కార్యక్రమానికి నాంది పలికింది. అందరూ అది తెలివితక్కువ పని అన్నారు. బంగారంలాంటి ఉద్యోగం ఇవాళో, రేపో అంటున్న ముసలితల్లి కోసం ఒదులుకోవటం పిచ్చితనం కాక మరేమిటన్నారు.

ఇవాళో, రేపో కాబట్టే అది అత్యవసరం అన్న సుజాత మాట ఎవరికీ అర్థం కాలేదు.

”హెచ్చు. బడాయి. తనకేకాంగ తల్లి మీద ప్రేమ కారిపోతున్నదని – జరుగుబాటు ఉంది. డబ్బుంది. ఇంట్లో కూచుంటే కూచుంటుంది. దానికి అమ్మ మీద వంక పెట్టటం దేనికి? తనకే తల్లి మీద ప్రేమ కారిపోతున్నట్లు. మిగిలినవాళ్ళకు లేనట్టు – ”అన్నారు అన్నిటినీ అపార్థం చేసుకోవటం టి.వి. సీరియళ్ళ ద్వారా చురుగ్గా నేర్చుకున్న మరికొందరు బంధుమిత్రులు. ఎన్నో విమర్శలు. వంకర మాటలు. వ్యంగ్యబాణాలు. తగవులు క్రమంగా అర్థమైంది. లక్షల విలువ చేసే మనుషుల కంటే లక్షలకే విలువని.

మనిషి స్పర్శ కంటే పచ్చ కాగితాల స్పర్శే సుఖమని సుజాతను మంచిపని చేస్తున్నావని అన్నవారూ ఉన్నారు. ఐతే వాళ్ళు వేళ్ళమీద లెక్కపెట్ట గలిగినంత మంది. రాజీనామా మూడు నెలలలో ఆమోదం పొందింది. సుజాత పెండింగ్‌ పనులన్నీ పూర్తిచేసి మరీ రిలీవ్‌ అయింది.

”ఎంత స్వేచ్ఛ!” అనిపించింది.

ఇపుడు అమ్మ కోసమే మెలకువ. అమ్మతోటే నిద్ర. అమ్మ పసిపాప. తను తల్లి. కాదు కాదు అమ్మ ఎప్పుడూ అమ్మేతనే పసిది. చాలా తేలికగా ఉంది సుజాత మనసు.

ఈ దారి చూపింది అమ్మే కదా అనుకుని ఆమెకు తనమీదున్న నమ్మకానికి ఆశ్చర్యపోయింది.

అమ్మ మాటలకు తను కోపం తెచ్చుకుంటాననో, విసుక్కుంటాననో అనుకోకుండా ఆలోచిస్తాననీ అంగీకరిస్తాననీ అనుకోకపోతే తనను ఈ కోరిక కోరేది కాదు. ఆ నమ్మకమే గదా తనకు చిన్నతనంలో ఎదుగుదలనీ, యవ్వనం లో ఉత్సాహాన్ని, ఆ తర్వాత ఆత్మ విశ్వాసాన్ని ఇచ్చింది!

”అమ్మకు నాకు మధ్య ఎంత దగ్గరితనం.” అనుకుంటే సుజాతకు హాయిగా అనిపించింది.

ఉదయాన్నే అమ్మకు ముఖం కడిగించింది.

”నేను చూడు ఎంత బుద్ధిగా నీ మాట వింటున్నానో. నువ్వు ముఖం కడగాలి లెమ్మనగానే లేస్తున్నా. చిన్నప్పుడు నీకు ముఖం కడిగించే సరికి తాతలు దిగొచ్చేవారు.” అంటుంది రంగమ్మ. ”నీ కసలు ముఖం కడిగించటం రాదు. అందుకే నేనొచ్చేదాన్ని కాదు. నే చూడు ఎంత బాగా కడుగుతున్నానో” అమ్మ కట్టుడు పళ్ళు బ్రస్‌తో రుద్దుతూ సుజాత అనే తీరుకి ఇద్దరికీ నవ్వాగేది కాదు.

పాలు తాగటానికి రంగమ్మ మారాం చేసేది. సుజాత బతిమాలేది. ”నేను గ్లాసెడు పాలు గటగటా తాగేదాన్ని. నువ్వింత పేచీ ఏంటి?” బతిమాలటం ఆపి కసురుకునేదాకా వచ్చేది సుజాత.

”పాలల్లో పంచదార వేసిస్తే నేనూ తాగుతా” బుంగమూతి పెట్టేది రంగమ్మ.

”సుగర్‌ తెచ్చుకున్నావు. పంచదార కావాలా? బుద్ధి లేకపోతే సరి” బుగ్గమీద చిన్నగా పొడిచేది సుజాత.

”నేనేం తెచ్చుకోలా. అదే వచ్చింది.”

”ఔను. నువ్వంటే ఇష్టం పట్టలేక వచ్చి కావలించుకు కూచుంది”

”మరే ! కావలించునేవాళ్ళు ఎవరూలేక వచ్చిన దాన్ని పొమ్మనటమెందుకని నేనూ తియ్యగా కావలించుకున్నా”

”అందుకే ఈ చేదు మింగు” ఉగ్గిన్నెడు కాకరరసం నోట్లో పోసి ఉక్కిరిబిక్కిరవుతున్న తల్లి తలమీద చిన్నగా తట్టి గొంతు మీద చేత్తో రాసి, ఛాతి మీద నిమిరి –

”ఇప్పుడు నేనున్నా నిన్ను కావలించుకోటానికి. పోమ్మను దాన్ని.నాకు అదంటే చాలా అసూయగా ఉంది.”

”పోతుందిలే. నీ ధాటికి అదెక్కడ తట్టుకుంటుంది” కూతుర్ని ప్రేమగా దగ్గరికి అదుముకునేది రంగమ్మ. నిజంగానే నెలరోజుల్లో రంగమ్మ సుగర్‌ లెవెల్‌ తగ్గింది. సుజాత సంబరంతో ఒక కె.జి. బరువు పెరిగింది. రంగమ్మకు అన్నం తినిపించటం ఒక ఆటయింది సుజాతకు.

”ఇది అమ్మ ముద్ద. ఇది నాన్న ముద్ద” అని సుజాత అంటే ”మీ అమ్మా మా అమ్మా – మీ నాన్నా మా నాన్నా? ముందది చెప్పు” అని చెయ్యి చాపకుండా మొండికేసేది. ”మీ అమ్మా నాన్న లేమ్మా – విసిగించకు”

”నువ్వే మా అమ్మవు. ముందు నీ ముద్ద పెట్టు” అని నాలుగు ముద్దలు తిని.

”ఇది మా మామగారి ముద్దలాగాఉంది. చేదు విషం.” అని నోట్లోంచి ఆ ముద్దను తీసి కింద పారేసేది.

”బాగుందమ్మా. మీ మామ మీద కోపం నా మీద చూపిస్తావా? ఇప్పుడిదంతా ఎవరు బాగు చేస్తారు?” సుజాతకు నిజంగానే కోపం వచ్చేది.

”అబ్బో – నువ్వు ఎన్నిసార్లు కంచం బోర్లించి ఇల్లంతా అలికేశావో. నేనెన్నిసార్లు ఇల్లంతా కడుక్కున్నాడో.ఈ కాస్తకేనా?”

”మరి అట్లా చేస్తే నన్నెప్పుడూ కొట్టలేదా?”

”ఎందుకు కొట్టను. రెండు చెంపలూ వాయించేదాన్ని.”

‘మరి నీకు దెబ్బలు కావాలా?” సుజాత చెయ్యెత్తేది.

”కొడతావా?” భయంగా చూస్తున్న తల్లిని చూసి సుజాత ఫక్కున నవ్వితే రంగమ్మ ముసిముసిగా నవ్వేది.

ఒక ఆటా! – ఒక పాటా! ఆ తల్లీ కూతుళ్ళవి.

మధ్యాహ్నం అన్నాలు తిన్నాక కుట్టు నేర్పుతానని కూర్చునేది రంగమ్మ.

”అబ్బా – నాకు బోరు. సూది పట్టుకోటం కూడా రాదు.” భయపడింది సుజాత.

”అదే వస్తుంది. ఇదుగో సూదిలో దారం ఎక్కించివ్వు. కాడకుట్టు ఎంతలో వస్తుంది?”

వారం పదిరోజుల్లో కాడకుట్టు, ముద్దకుట్టు, క్రాస్‌స్టిచ్‌ అన్నీ నేర్పేసింది.

కుట్టు కార్యక్రమం పూర్తయ్యాక వైకుంఠపాళి ఆడదామనేది. తీరా నాలుగు పందాలు వేసీ వెయ్యికముందే ”అదుగో – నాకు సరిగా కనపడదని మోసం చేస్తున్నావు. నిచ్చెనెక్కాల్సినదాన్ని పామునోట్లో పడేస్తున్నావు.” గోల గోల మొదలు పెట్టేది.

సుజాత కళ్ళు పెద్దవి చేసి

”అరే – నా కసలు మోసం చెయ్యాలనే ఆలోచనే రాలేదు. చెప్పావుగా. ఇక చూడు. నాలుగు పందాల్లో నేను పండకపోతే” రంగమ్మ గవ్వలు విసిరికొట్టి వాకర్‌ పక్కకు తోసేసి మంచం మీదకు ఒరిగి మూతి బిగించుకునేది.

”సరే కాసేపు నిద్రపో. రేపు మళ్ళీ వైకుంఠపాళీ ఆడదామను. అప్పుడు చెప్తా.”

”ఏం చెప్తావు?”

”చూద్దూగాని”

ఇద్దరూ కోడిపుంజుల్లా పోట్లాడుకుని అలిసిపోయి పడుకుని నిద్రపోయేవాళ్ళు.

సాయంత్రం సుజాత లేచి చిన్న చిన్న పనులు చేసుకుని టీ తాగి తల్లికి పాలు తీసుకుని వెళ్ళి లేపేసరికి ఐదున్నర దాటేది. రంగమ్మ బుద్ధిగా పాలు తాగినరోజు

”గుడ్‌ గర్ల్‌” మూతి తుడుస్తూ మెచ్చుకునేది.

”చాక్లెట్‌” రంగమ్మ ఆశగా చెయ్యి చాపేది.

కాసేపు తటపటాయించి సుగర్‌ ఫ్రీ స్వీటొకటి తెచ్చిచ్చేది సుజాత.

”ఇవాళొక్కరోజే – మళ్ళీ వారం దాకా అడక్కు” హెచ్చరించేది.

”అడిగితే” రెట్టించకుండా ఊరుకోదు రంగమ్మ.

”నాలుగిస్తా”

”ఏంటి? స్వీట్లా!”

”కాదు. మొట్టికాయలు”

”తల్లిని మొట్టే కూతుర్ని నిన్నే చూస్తున్నా”

”మరి నీ అల్లరి భరించలేకపోతున్నా-”

రాత్రి మంచి పాటలు సిడిలో పెట్టి వినిపించి తల్లిని నిద్రపుచ్చి దుప్పటి కప్పి నుదుటి మీద ముద్దపెట్టి తనూ పక్కనున్న మంచం మీద పడుకునేది.

ఒక రాత్రివేళ తల్లి అరుపులకు ఉలిక్కిపడి లేచేది.

”ఏంటా మొద్దు నిద్ర. ఇవతల నాకు అర్జంటుగా బాత్రూం వస్తోంది”

సుజాత హడావుడిగా లేచి ఆ పని ముగించేది.

అంతసేపు రంగమ్మ గొణుగుతూనే ఉండేది.

”నీ చిన్నప్పుడు ఊరికే పక్క తడిపేదానివి. ఎప్పుడు ఉచ్చపోస్తావో అలాగే ఆ గుడ్డల్లో ఉంచకూడదని నేను నిద్రపోకుండా కూచునేదాన్ని నువ్వ ఉచ్చ పొయ్యగానే ఆ బట్టలన్నీ మార్చి శుభ్రంగా తుడిచి పౌడర్‌ వేసి మళ్ళీ నిద్రబుచ్చేదాన్ని. ఇంత చాకిరి చేయించుకుని ఇపుడు నేను అరుస్తున్నా వినకుండా దున్నపోతులా నిద్రపోతున్నావు.”

”నీ పుణ్యం ఉంటుంది ఊరుకోమ్మా. రేపు ‘సు’ అనగానే లేస్తాగా” సుజాతకు నిద్ర తూలుతోంది.

”ఆఁ! లేస్తావు.లేస్తావు. మొద్దు నిద్రని. మొద్దు నిద్ర. అంతా తండ్రి పోలిక”

సుజాత ఆ గొణుగుడు వినిపించుకోకుండా చెవులు మూసుకు పడుకునేది.

సుజాతకు తల్లితో, ఆ ముసలావిడతో కాలక్షేపం చేయుటంలో ఆ పనులన్నీ, చేయటంలో ఇంత ఆనందం ఎందుకొస్తుందో అర్ధమయ్యేది కాదు సుజాత భర్త ఈశ్వర్‌కు ఐతే తనకు సంబంధించిన పనుల్లో ఏ లోటూ జరగక పోవటంతో అతనికి పెద్ద అభ్యంతరంకూడా లేకపోయింది. పైగా అతను ఉదయం పదింటికి వెల్తే రాత్రి ఎనిమిదింటికి వస్తాడు. ఆదివారం మాత్రమే తల్లీ కూతుళ్ళ సరాగాలను చూసే అవకాశం ఉండేది.

సుజాత మొదట్లో వైకుంఠపాళీ అష్టాచెమ్మా ఆడుకుందాం రమ్మని పిలిచింది గానీ అతను చాలా కాలంనుంచే సుడొకొ కూ బానిసయ్యాడు. అతని ఆదివారాలు సుడొకొ కు అంకితం.

”తోటకూర పులుసుకూర తిని ఎన్నేళ్ళయిందో” అంది రంగమ్మ. రంగమ్మకు చూపు తగ్గిన దగ్గర్నించీ వంటింట్లోకి వెళ్ళటం లేదు. ఐదేళ్ళుగా సుజాతే వండుతోంది. ఆమెకు ఓ పది రకాల కూరలు చేయటంవచ్చు. వాటినే మార్చిమార్చి ఒండుతుంది. ఆకుకూరలంటే పప్పులో వెయ్యటం తప్ప మరో రకం చెయ్యదు. తల్లి వండే తోటకూర పులుసుకూర తల్చుకుంటే సుజాతకూ నోట్లో నీళ్ళూరాయి.

”నాకు వండటంరాదు” అది నిరుత్సాహంగా

”నేను చెప్పినట్టు ఒండు.అదేం బ్రహ్మవిద్యా”

”ఔనుగదా – నిన్నడిగి ఆ వంటలన్నీ నేర్చుకోవచ్చుగా. నాకు ఆ మాత్రం తోచలేదు. అసలు తిండంటేనే ఆసక్తిపోయింది నా వంటతో. ఇవాళే ఒండుకుందాం. నే వెళ్ళి తోటకూర తెస్తాను.”

రంగమ్మ ఆధ్వర్యంలో సుజాత చేతుల మీదుగా జరిగిన తోటకూర పులుసు యజ్ఞఫలం బ్రహ్మాండంగా ఉంది.

ఇద్దరూ లొట్టలేసుకుంటూ తిన్నారు.

ఆ తర్వాత కాకరకాయలు మజ్జిగ, చింతపండులతో ఉడికించి ఎండబెట్టి, ఉల్లికారంతో వేయించే కూర, బొచ్చె చేపల పులుసు, యులక్కాయకూర – ఇట్లా రకరకాల కూరల ఘుమఘుమలతో వాళ్ళ వంటిల్లు శోభిల్లింది. తల్లీ కూతుళ్ళిద్దరూ ఒకరిని మించి ఇంకొకరు రుచులు కోరుకుంటున్నారు.

దాని ప్రభావం రంగమ్మ ఆరోగ్యం మీద పడింది. బి.పి. పెరిగింది. డాక్టరు ఉప్పు కారం లేని చప్పిడి కూరలే తినమన్నాడు. ”అమ్మాయ్‌ – ఆ చప్పిడి కూరలు తిని నాలుగేళ్ళు ఎక్కువ బతకటం అవసరమంటావా?” అంది రంగమ్మ.

”అనవసరమే గాని – ఎసిడిటి, బి.పి.లతో బాధలు పడాలిగా”.

”అదేదో నేను పడతా – అబ్బో అమ్మో అని అరిచి గోల చెయ్యనుగాని నువ్వు రుచిగా ఒండిపెట్టు” అని బతిమాలింది.

సుజాతకు మనసొప్పలేదు. ఉప్పుకారాలు తగ్గించేసింది. నూనె అసలే లేదు. రోజూ అన్నం పెట్టేటప్పుడు ఆ పంచాయితీ తప్పటం లేదు.

ఏదో కబుర్లలో పెట్టి తల్లికి అన్నం తినిపించటం పెద్ద పనయింది.

”అమ్మాయ్‌. రాత్రి బాత్‌రూంకి లేచిన తర్వాత నిద్ర పట్టటంలేదు. ఏం చెయ్యాలో తోచటంలేదు.” అంది రంగమ్మ. సుజాత ఆలోచించి సుబ్బలక్ష్మిగారు పాడిన జో అచ్యుతానంద జోజో ముకుందా పాటను వెంట వెంటనే గంటసేపు వచ్చేలాసి.డిలో రికార్డు చేయించి, చిన్న సి.డి. ప్లేయిర్‌ కొని తల్లికిచ్చింది. ”నిద్ర రానపుడు ఇదినొక్కు. పాట వింటూ నిద్రొస్తే నిద్రపో లేకపోతే సంగీతం హాయిగావింటూ పడుకో” తాత్కాలికంగా ఆ సమస్య తీరింది.

”ఒక్కపాట ఎన్ని రోజులు విననూ?” రంగమ్మ నిర్లిప్తత. ఇంకా మంచి పాటలను ఎంచి కంప్యూటర్‌లోంచి సి.డి.లోకి ఎక్కించి వాటిని తల్లికి వినిపించటం ఒక పనయింది.

”ఇంత హాయిగా పాటలు ఆనందించి ఎన్నాళ్ళయిందో – అమ్మ పుణ్యమా అని సంగీతానికి దగ్గరయ్యాను” అనుకుంది.

రంగమ్మకు మధ్యాహ్నాలుకూచుని ఆటలాడే ఓపిక కూడా తగ్గిపోయింది. ”నువ్వు పడుకోమ్మా. నేను నీ దగ్గర కూచుని ఏ కథలన్నా చదివి వినిపిస్తా”

ఆటల సమయం కథాసమయం అయింది.

తల్లికి నచ్చే కథలు ఎంపిక చేయటానికి సుజాత చాలా పుస్తకాలు కొని చదవాల్సి వచ్చింది. తల్లికి చదవి వినిపించటంతో పాటు తల్లి నిద్రపోయాక తనూ చదవటం వ్యసనంలా మారింది. రెండేళ్ళు ఎలా గడిచాయో తెలియకుండా వెళ్ళిపోయాయి.

రంగమ్మకిపుడు ఎనభైఎనిమిదేళ్ళు. మరో రెండేళ్ళుకు తొంభై. అపుడు అందరినీ పిలిచి పండగ చేయాలనుకుంది సుజాత. రంగమ్మతో చెప్తే ”ఇంకా రెండేళ్ళు నేనుంటానో లేదో ఇప్పుడే చేయరాదా.”అనేసింది.

”నువ్వెక్కడికి వెళ్తావే. రెండేళ్ళు ఎంతలో గడుస్తాయి”అన్న కూతురి మాటలు ఒప్పుకోకుండా సతాయించటం మొదలు పెట్టింది. ”నీ పుట్టినరోజులు ఎన్ని చేశాను? సంవత్సరానికి రెండు నక్షత్రం ఒకటి, తేదీ ప్రకారం ఒకటి. ఒకపండగ పూర్తయిన మర్నాటి నుంచే వచ్చే సంవత్సరం అలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి అని నా ప్రాణం తీసేదానివి. ఇప్పుడు ఈ సంవత్సరమే నా పుట్టినరోజు చెయ్యి. చేస్తాననేదాకా నేను అన్నం తినను.”అని బెదిరించింది.

”నీ పుట్టిన రోజు నెలా పదిహేనురోజులే ఉంది. నా పిల్లలిద్దరూ అమెరికా నుంచి రావాలా? ఎలా కుదురుతుంది?”సుజాతకు అసలిప్పడే ఈ ఆలోచన తల్లికెందుకు చెప్పానా అని పశ్చాత్తాపం పట్టుకుంది. ”వాళ్ళు వస్తారనుకుంటే వస్తారు. లేకపోతే లేదు. నేను నా వాళ్లందరినీ పిల్చుకుంటాను.”

”నీ వాళ్ళెవరే – నా పిల్లలకంటే నీకెవరున్నారు?”

”నా స్నేహితురాళ్ళున్నారు. నా చెల్లెళ్ళున్నారు. నాతోపాటు ఉద్యోగం చేసినవాళ్ళున్నారు. వాళ్ళందరినీ చూడాలని ఉంది. పిలువు.”

”వాళ్ళందరూ ఎక్కడున్నారో”

”కనుక్కో. ఒకళ్ళు దొరికితే ఇద్దరి గురించి చెబుతాను. నా స్నేహితురాలు సామ్రాజ్యలక్ష్మి నిజామాబాద్‌లో ఉంటుంది. వాళ్ళబ్బాయి అనిల్‌ కుమార్‌ పెద్ద డాక్టరు నిజామాబాద్‌లో పెద్ద ఆస్పత్రి – ఆయన్ని తెలియని వారుండరు. ముందు వాళ్ళ ఫోన్‌ నంబరు సంపాదించు.” సుజాత నిజామాబాద్‌లో తనకు పరిచయం ఉన్నవాళ్ళకు ఫోన్‌చేసి అనిల్‌కుమార్‌ని, సామ్రాజ్య లక్ష్మిని లైన్లోకి తెచ్చింది. అలా అలా పదిహేను మంది స్నేహితులు దొరికారు. ”అమ్మాయ్‌ – ఒక పుట్టినరోజు చాలదే – నా స్నేహితులను ఒకరోజు పిలుద్దాం. బంధువుల్ని ఒకరోజు పిలుద్దాం. ఇంక నిన్నేం అడగను ఈ ఒక్క కోరికా తీర్చవే – తల్లి ఉత్సాహాన్ని ఎలా కాదంటుంది సుజాత. ఇక ఆ నెలా పదిహేను రోజులూ రంగమ్మను పట్టుకోవటం, తట్టుకోవటం సుజాతకు చాలాకష్టమైంది.

రంగమ్మ స్నేహితురాళ్ళకు ఫోన్లు చేసి ఎవరి ఆరోగ్యం ఎలా ఉంది?ఎవరికి ఏం జబ్బులున్నాయి? ఏ మందులు వాడుతున్నారు? ఏం తినొచ్చు? ఏం తినకూడదు? కనుక్కుని అందరికీ సరిపోయే మెనూ తయారు చేసే సరికి సుజాతకు నీరసం వచ్చింది.

అందరికీ వంట ఇంట్లోనే చేయించాలి. మనుషుల కోసం వెతకటం. వారితో మాట్లాడి అన్నీ సెటిల్‌ చేసేసరికి చాలా కష్టమైంది. చివరికి సుజాత చిన్నాన్న కూతుళ్ళిద్దరు వచ్చి ఆరోజు సాయంగా ఉంటామన్న తర్వాత కాస్త కుదుటపడింది.

పదిహేనుమంది స్నేహితులు. అరవైమంది బంధువులు

ఒక ఆదివారం స్నేహితులతో. మరో ఆదివారం బంధువులతో – అమెరికానుంచి సుజాత పిల్లలు కూడా వస్తామన్నారు. స్నేహితులతోనే ముందు సంబరం కావాలంది. నలుగురు స్నేహితులు పొరుగూరివాళ్ళు. ముందు రోజు రాత్రి వచ్చి మర్నాడు సాయంత్రం వెళ్తామన్నారు.

ఆ నలుగురికీ సదుపాయంగా ఉండేలా పడకలు అమర్చే సరికి సుజాత పని అయిపోయింది.

”ఐదుగురు పిల్లల్ని కని పెంచిన తల్లులు లేరూ? ఒక్కరోజుకు ఐదుగురు అమ్మల్ని చూసుకోవటం పెద్ద కష్టమయిపోయిందినీకు. అన్నీ వేషాలు” రంగమ్మ మాటలు వొపక్క.

వచ్చే వాళ్ళందరూ ఎనభైలు పైబడినవాళ్ళు. వాళ్ళను మంచిగా చూసుకుని సురక్షితంగా పంపటం ఎంత పెద్ద బాధ్యత.

చూస్తుండగానే ఆ రోజు వచ్చేసింది.

సాయంత్రానికి కార్లలో ఒక్కోరు వచ్చి దిగారు. నలుగురికి చేతి కర్రలు. ఒకరికి వాకర్‌.

తన కూతురి మొదటి పుట్టిన రోజు నాడు ఇద్దరు పిల్లలు అఏడాది వయసు వాళ్ళే నడక రాక బేచి వాకర్లలో ఇల్లంతా తిరిగిన దృశ్యం జ్ఞాపకం వచ్చింది సుజాతకు. ఆపిల్లలు ఏది కొట్టుకుని కింద పడతారో అని తల్లులు వాళ్ళ వెనక వెనకే తిరిగారు. సుజాత ఇపుడీ వృద్ధమాతల వెనకాల వారిని హెచ్చరిస్తూ అలాగే తిరిగింది.

రాత్రి వచ్చిన నలుగురూ ముందు స్నానాలు చేసి రంగమ్మ గదిలోకి వెళ్ళారు. ఐదుగురు బోసినోళ్ళ నవ్వులతో ఆ గది వెలిగిపోయింది. సుజాత వాళ్ళ నవ్వుల్ని కెమెరాకు అప్పగించింది.

అప్పుడు మొదలైన వాళ్ళ సందడి. మరింత మంది రావటంతో సాయంత్రం దాకా సాగింది.

ఆ వయసులో ఈ కలయిక వాళ్ళకెంత బలాన్నిచ్చిందో చూస్తే ఆశ్చర్య మునిపించింది.

వంటలన్నీ బాగా కుదిరాయి. అందరూ ఇష్టంగా తిన్నారు.

చిన్ననాటి కబుర్లు, ఉద్యోగపు కష్టాలు, పై ఆఫీసర్లను ”ఆ సచ్చినాడు” అని దీవించటాలు, వాడు చచ్చేపోయాడని నవ్వు కోటాలు – గోలగోల చేశారు. అలసట అనిపించినపుడు ఎవరి పద్ధతిలో వాళ్ళు విశ్రాంతి తీసుకున్నారు.

”ఇల్లంతా వృద్ధాశ్రమం చేశావు”అన్నాడు ఈశ్వర్‌.

”కానీ ఎంత బాగుంది. వాళ్ళ సంతోషాలు చూడండి” అంది సుజాత. నిజంగానే ఆ పండు ముదుసలి స్త్రీలు నోరారా నవ్వారు. ఒకరిద్దరు మనసారా ఏడ్చారు. మిగిలిన వాళ్ళు కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ వాళ్ళను ఓదార్చారు. బాత్రూంలు కడిగీ, కడిగించీ అలిసిపోయింది సుజాత. ఆ రాత్రి చివరికారు వచ్చి కోటేశ్వరమ్మను తీసికెళ్ళాక రంగమ్మ సుజాత, ఆమె చిన్నాన్న కూతుళ్ళు ఒళ్ళెరగకుండా నిద్రపోయారు. ఆ అలసట తీరకుండానే బంధువుల ఆదివారం వచ్చింది. చాలా మంది ఊళ్ళోవాళ్ళే. భోజనాలకు వచ్చి వెళ్తారు. సుజాత పిల్లలు రెండ్రోజులు ముందొచ్చారు.

రంగమ్మ మనవరాళ్ళును దగ్గర కూచోబెట్టుకుని సుజాతా, తనూ రెండేళ్ళుగా ఎలా హాయిగా కాలం గడిపింది వైనవైనాలుగా చెప్పింది. సుజాత మీద బోలెడు కంప్లయింట్లు చేసింది.

”మీ అమ్మ చేసినట్లు కాకుండా మీ అమ్మను ఇంకా బాగా చూసుకోండి” అంది. ఆదివారం బంధువులతో ఇల్లంతా కళకళ లాడింది. రంగమ్మకు కొత్త చీరెలు గుట్టగా వచ్చిపడ్డాయి. ”నాకెందుకీ చీరెలు. ఉండండి” అని అప్పటికప్పుడే ఒకరు తెచ్చిన చీరె మరొకరికి ఇచ్చి ”అమ్మా! ముసలమ్మ తెలివి” అనిపించుకుంది.

రెండింటికల్లా భోజనాలయ్యాయి. తొందరగా వెళ్ళాల్సిన వాళ్ళు అందరి దగ్గరా శలవు తీసుకుంటున్నారు. హడావుడి. సందడి. సంతోషాలు. రంగమ్మ మేనగోడలు, ఆమని వీడ్కోలు తీసుకుందామని వచ్చి రంగమ్మను లేపింది.

పన్నెండింటికి కాస్త అన్నం తిన్న ఆవిడ కాసేపు పడుకుంటానని వెళ్ళి పడుకుంది. మేనగోడలు పిలిస్తే లేచి కూచుని పక్కన కూచోబెట్టుకుంది. ”అప్పుడప్పుడూ వస్తుండవే. సుజాతకి నువ్వంటే ఇష్టం.”

”వస్తానత్తయ్యా. మొత్తానికి నువ్వ అదృష్టవంతురాలివి. సుజాత ఎంత బాగా చూసుకుంటోంది నిన్ను.” అంది మనస్ఫూర్తిగా ఆమని. ”ఔను. నా కూతురే నాకన్న తల్లయింది. నేనే దాన్నట్లా చేశా. అందరూ నా అదృష్టం అంటారు గానీ అసలదృష్టం సుజాత దేనే” అంటూ మనసారా నవ్వి మేనగోడలి ఒళ్ళో వాలిపోయింది.

(అనేకానేక ఆర్ధిక, సాంఘిక, మానసిక, శారీరక, ఆరోగ్య కారణాల వల్ల తలిదండ్రుల వృద్ధాప్యాన్ని ‘మిస్‌’ అవుతున్న , అందుకు బాధపడుతున్న పిల్లలందరికీ, ఎంతో కష్టపడుతూ తలిదండ్రులను పెంచుతున్న పిల్లలందరికీ ఈ కథ అంకితం.)

 

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

2 Responses to ముదిమిసిమి- ఓల్గా

  1. Chimata Rajendraprasad Prasad says:

    ఓపిక,డబ్బుకు ఇబ్బంది లేని తల్లీ కూళ్ళ కు సంతోషంగా ఉండ డానికి ఎన్ని చెయ్యచ్చో గొప్పగాచూ పించారు. ఉద్యోగ బాధ్యతల్తో జీవితంలో సంగీతం, సాహిత్యం ఇంకాచిన్న చిన్న సంతోషాలకు ఎలా దూరమవుతారో , అవి మళ్లీ తిరిగి జీవితం లోకి తెచ్చేటట్టు చేసిన తల్లి కూతురే అదృష్ట వంతురాలని అనడంలో ఔచిత్యం ఉంది. పెద్ద వయసులో, పాత స్నేహితులను కలవాలను కోడం అది కూతురు అమలు పరచడం అపురూపంగా కాల్పనికంగా ఉంది.

  2. పేరుమొదట చదివితే అర్ధం కాలేదు. కధ చదివాక పేరు అర్ధమైంది.ఇలాంటి బిడ్డలుంటే వృధ్ధాశ్రమాలు ఖాళీ కావూ!పాపం ఆఆస్రమాలు నడిపేవారికింత అన్యాయం చేయడం ధర్మా మా ఓల్గాగారూ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.