ఒక నడక ..- రమాసుందరి బత్తుల

నా చిన్నప్పుడు రహదారులు…
వృక్షాలు ఆకాశంలో పెనవేసుకొన్న నీడలో సేద తీరుతూ ఉండేవి. ఆ దారుల్లో నెత్తి మీద గడ్డి మోపుతో ఒకస్త్రీ ఆదరా బాదరా నడుస్తుండేది. ఆమె కొంగుకు కట్టి ఉన్న తాయిలాలు ఆమె పిల్లల ఆరగింతల కోసం ఎదురు చూస్తూ ఆ నడకలో ఎగిసెగిసి పడుతుండేవి. ఆ పక్కనే సైకిలు మీద చిగురు మీసాల కుర్రాడొకడు జనపనార సంచిలో వంకాయలు, రామ్ములక్కాయలు వేసుకొని వెళుతుండేవాడు. ఆ సంచి నుండి వేలాడుతున్న తోటకూర కాడలు పచ్చగా, కుతూహలంగా లోకాన్ని చూస్తూ ఊగుతుండేవి. సైకిలు హాండిల్‌ కి తగిలించిన దబరా… వాసన గుడ్డ కట్టుకొన్న మూతితో పాల పలవరింతలు పోతుండేది. బర్రె గొడ్డులను మళ్లించుకొంటూ బుడ్డోళ్ళు రోడ్డుకు అటూ ఇటూ పరుగులు పెట్టేవాళ్ళు.

ఆ దృశ్యంలో అక్కడెవరో ఒక చిన్న పిల్ల, వాళ్ళ అమ్మ కోసం ఏడుస్తూ నడుస్తోంది. ఒక జడ అల్లి, ఇంకో జడ ఊడిపోయి ఆ పిల్ల చిట్టడివిలో పెరిగిన చిట్టీత చెట్టులాగా ఉంది. బెంగతో బెక్కుతూ అమ్మ అడుగులు వెతుక్కొంటోంది. ఏవైపు నుండో అమ్మ అదాటుగా వచ్చి వాటేసుకొంటుందని పక్క చూపులు చూస్తోంది. ఆ ఒంటరి నడక ఆ పిల్లకు భయం కలిగించలేదు. ఎందుకంటే దారి పక్కనే మోటారు సైకిలు మీద కాలు మీద కాలు వేసుకొని పుస్తకం చదువుకొంటూ మధ్యలో తల పైకెత్తి ప్రేమతో నవ్వుతున్న యువకుడి కళ్లలాగా అడుగడుగునా కళ్ళు ఆ పిల్ల కోసం ఎదురు చూస్తున్నాయి. ఆపద రాకుండా ఆదుకొంటామని హామీ ఇస్తున్నాయి. వర్షం వేళల్లో కనిపించే తెల్లటి, నల్లటి మేఘాల్లా వస్తున్న గొర్రెల మందలో ఒక గొర్రె పిల్ల పరిగెత్తుకొంటూ వచ్చి ఆమ్మ చన్ను లాక్కొని పాలు తాగుతున్న చోట ఆ పిల్ల చప్పున ఆగిపోయింది. ఏడుపు మర్చిపోయి నోరు తెరుచుకొని కాసేపు చూసింది. బుగ్గలకంటిన కన్నీళ్లు ఆవిరి అయ్యేదాకా అక్కడ నుండి కదలలేదు. ఇంకా ముందుకు వెళితే భూమి నుండి పొడుచుకొని వచ్చిన మొక్క, దాని క్రింద శిధిలమవుతున్న మావిడి టెంకను అబ్బురంగా చూసింది. దొంగచూపులు చూసి పక్కనున్న కంది చేల్లోకి దూకింది. పచ్చి కందికాయల్ని నాలుగు పీక్కొని మళ్ళీ రోడ్డు మీదకు వచ్చింది. కంది యిత్తుల వగరు గొంతులోకి జుర్చుకొని ఇంతకు ముందు అదే గొంతులో తిష్ట వేసుకొని వున్న ఏడుపుని దిగమింగింది. ఆ పిల్ల ఒంటరిగా వున్నా ఆ ఊళ్ళ దయ మధ్యన భద్రంగా ఉంది. ఆ ఒంటరి సంచారం ఆమె స్పృహకు జ్ఞానాన్ని అందిస్తుందే కానీ భయం కలిగించటం లేదు.

ఇప్పుడు అవే రహదారులు..

ఎర్రటి ఎండకు భగ భగ మండుతున్నాయి. నల్లటి తారూ, దానిమీద తెల్లటి గీతలు ఆది నుండి అంతం వరకూ పాకుతూ సమస్త ప్రపంచాన్ని తమ చెప్పు చేతల్లోకి తీసుకొన్నాయి. వింత వింత వాహనాలను మెరుపువేగంతో కనుచూపుమేరలో కనబడకుండా మాయం చేస్తున్నాయి అవి. అక్కడక్కడా వాహనాలు బోర్లా పడి ఉన్నాయి. వేగం పోటీకి ఓడిపోయి చేతులెత్తేసిన వస్తాదుల్లాంటి లారీలు అవి. ఎన్ని రోజులు అయ్యిందో అవి పడిపోయి? వాటి క్రింద ఎవరైనా ఉన్నారేమో? క్రింద శవాలు కనబడకపోయినా ఆ వ్యక్తుల తాలూకూ చాలా బ్రతుకులు అక్కడ సమాధి అయిపోయి ఉంటాయి. చూసే దమ్ముండే వాళ్ళకు అవి తప్పక కనబడతాయి. టౌనుకి పోయి తలపని చేయించుకొస్తానని ఇంట్లో చెప్పి, పదేళ్ళు తనకు సేవ చేసిన సుజుకి వేసుకొని బయలుదేరిన ఒక నడి వయసాయన… ఊరికి, టౌన్‌కి మధ్య… బోర్లా పడ్డ సుజికి పక్కన… నడిరోడ్డు మీద పడి ఉన్న దృశ్యం ఎవ్వరినీ కదిలించటం లేదు. ఊళ్ళ మధ్య ఆటోలు నడుపుతున్న గ్రామ పునాదులు గల  యువకులు కొద్దిగా వేగం తగ్గించి చూస్తున్నారంతే.

ఆ పిల్ల మళ్ళీ ఆ రహదారెమ్మట వెళుతోంది. ఎక్కడ మానవ వాసన ఆమె ముక్కు పుటాలకు తగలటం లేదు. నర సంచారం లేని మిట్ట మధ్యాహ్నం, కాళ్ళకు చెప్పులు లేకుండా నడుస్తోంది ఆమె. మానవ స్పర్శ మర్చిపోయి, కేవలం రక్తపు స్పర్శ మరిగిన రహదారుల వెంట ఆమె నడక ఆమెకే భీతి కలిగిస్తుంది. చుట్టూ ఇనుప కంచె వేసుకొన్న రహదారులు. తడి తెలియని రహదారులు. ఆకు పచ్చదనాన్ని… యింకా అన్ని రంగుల్నీ మింగేసిన నల్లటి రంగు రహదారులు. ఆమె కళ్ళు దేని కోసమో వెదుకుతున్నాయి? ఆ దయగల కళ్ళ కోసం! తనకు భద్రత భరోసా యిచ్చిన కళ్ళ కోసం. కనబడగానే చేతులు చాచి ఆలింగనం చేసుకొనే కళ్ళ కోసం. ఆ కళ్ళు మాయం. ఆ కళ్ళను రహదారులు మింగేసాయి. ఫ్లై ఓవర్లు మింగేసాయి. ఊళ్ళను మింగి రహదారులు బలిశాయి. దాహంతో దారి తప్పి ఇంకా ఆ పిల్ల వెదుకుతూనే ఉంది.

(అభివృద్ధి కాముకులకు క్షమాపణలతో…)

Share
This entry was posted in moduga poolu. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో