యాలీస్‌ వాకర్‌

పి. సత్యవతి

దాదాపు పదిహేను సంవత్స రాల కిందట వసంతలక్ష్మి నాకు ”కలర్‌ పర్పుల్‌” అనే నవలని నేను అడక్కుండానే ఇచ్చి ”చదవండి బావుంటుంది” అని చాలా మామూలుగా చెప్పారు.

అప్పటికి ఆ పుస్తకానికి పులిట్జర్‌ బహుమతి వచ్చిందని తెలుసుకానీ అది నాకు దొరకలేదు. కలర్‌ పర్పుల్‌ చదివాక నాకు ఆఫ్రికన్‌, అమెరికన్‌ రచయిత్రుల మీద ప్రేమ కలిగి పెరిగింది. యాలీస్‌ వాకర్‌ తరువాత నేను అంతగా ప్రేమించిన మరో రచయిత్రి టోనీ మారిసన్‌. ఆమె వ్రాసిన బిలవ్డ్‌. నాకు మరింత నచ్చిన తార ఊపీ గోల్డ్బర్గ్‌. అలాగే ఓప్రా విన్‌ ఫ్రీ. వీనస్‌, సెరీనా సోదరీ”మణులు”. మంచి సాహిత్యం సృష్టించిన, కవయిత్రులు నవలా కారులు, యక్టివిష్టులు చాలామంది వుండగా వీరే ఎందుకు ఇష్టమంటే చెప్పటం కష్టం.

యాలీస్‌కి ఎనిమిదేళ్లప్పుడు, ఆమె తమ్ముడు ఒక బి.బి. తుపాకితో అనుకోకుండా ఆమె కంటిమీద కాల్చినప్పుడు ఆమెకి ఆ కన్ను కనపడకుండా పోయింది. ఈ విషయం గురించి ఆమె ఒక పుస్తకంలో ప్రస్తావిస్తూ, ఇటువంటి మచ్చలే స్త్రీలను తమ అణచివేతపై యుద్ధానికి ప్రేరణ కలుగచేస్తాయంటుంది. తల్లిదండ్రులకు ఎనిమిదవ సంతానమైన యాలీస్‌ జార్జియలోని ఈటెన్టన్‌లో జన్మించింది. అక్కడే హైస్కూల్‌ చదువు ముగించి అట్లాంటాలోని స్పెల్‌మెన్‌ కాలేజీలో పూర్తి స్కాలర్‌షిప్‌తో చేరింది. ఆమె తల్లిదండ్రులు షేర్‌ క్రాపర్స్‌. 1965లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. అప్పుడే ఆమె పౌరహక్కుల ఉద్యమంపట్ల ఆసక్తురాలైంది. అందుకు కొంత స్పెల్మన్‌ కాలేజిలో అప్పుడు పని చేస్తున్న హొవర్డ్‌ జిన్‌ కారకుడు, ఒక పౌర హక్కుల కార్యకర్తగా ప్రొఫెసర్‌గా ఆయన ప్రభావం యాలీస్‌ మీద ఎక్కువగా ఉంది. ఆమె దక్షణాది రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ వోటర్ల నమోదు కార్యక్రమాలలో పని చేసింది. పిల్లలగురించిన సంక్షేమ కార్యక్రమాలు కూడా చేసింది. తరువాత ఆమె మెల్‌ లెవెంథాల్‌ అనే జ్యూయిష్‌ న్యాయవాదిని వివాహం చేసుకుంది. మిసిసిపి రాష్ట్రంలో న్యాయసమ్మతంగా వివాహం చేసుకున్న భిన్న జాతి దంపతులు వీరు. అందువల్ల వీళ్లకి చాలా బెదిరింపులు, ముఖ్యంగా ”కుక్లక్స్‌ క్లాన్‌” (kuklux klan) ద్వారా ఎదురయ్యాయి.

1969లో వీరికి రెబెక్కా పుట్టింది. తరువాత ఎనిమిదేళ్లకి యాలీస్‌ ఆమె భర్త లెవెంధాల్‌ విడిపోయారు. 1970లో కాలిఫోర్నియాకు వెళ్ళే ముందు యాలీస్‌ Ms పత్రికకి ఒక సంపాదకురాలిగా పనిచేసింది. అప్పుడే ఆమె ప్రఖ్యాత రచయిత్రి జోరానీల్‌ హర్‌స్టన్‌ పైన ఒక ఆలోచనాత్మకమైన వ్యాసం వ్రాసి అప్పటివరకు విస్మృతంగా వుండి పోయిన ఆమె ప్రతిభను లోకానికి చాటింది. అంతేకాక జోరా సమాధిని వెతికి పట్టుకుని ఒక పలక కూడా వేయించింది. ఆ తరవాతే జోరా గురించి చాలామందికి అవగాహన కలిగింది. హార్లెమ్‌ రినైజాన్స్‌ కాలానికి చెందిన జోరా ఆఫ్రికన్‌ అమెరికన్‌ సంస్కృతి తిరిగి పునజ్జీవనమ్‌ చెయ్యడానికి రచనలు చేసింది. అనేక నవలలు, కథలు, వ్యాసాలు వ్రాసిన యాలీస్‌ రచనల్లో ప్రసిద్ధమైనదీ సంచలనాత్మకమైనదీ, వివాదాస్పదమైనదీ కూడా కలర్‌ పర్పుల్‌. ఈ నవలకు 1983లో పులిట్జర్‌ బహుమతి ఇచ్చింది. నేషనల్‌ బుక్‌ అవార్డ్‌ కూడా వచ్చింది. తరువాత చలనచిత్రంగా రపొందడమేకాక బ్రాడ్వే మూజికల్‌గా కూడా వచ్చింది. 1930 ప్రాంతాలలో దక్షిణాది రాష్ట్రాలలో ఆఫ్రికన్‌ అమెరికన్‌ స్త్రీల దుర్భర జీవితాలను చిత్రించిన ఈ నవల లేఖల రూపంలోనూ డైరీ రపంలోనూ, ఆఫ్రికన్‌ అమెరికన్లు మాట్లాడే యాసలో నడుస్తుంది. ఇందులో చిత్రించిన హింస, ఒక కారణంగా, పురుషుల్ని అటు పరమ దుర్మార్గులుగానో ఇటు బఫూన్లు గానో చిత్రించిందని విమర్శలొచ్చాయి.

1990, 2000ల మధ్య వచ్చిన అత్యంత వివాదాస్పదమైన నవలగా పేర్కొనబడింది. పేదరికం, అభద్రత, చదువులేకపోవడం, జాతివివక్ష, పురుషాధిక్యత, ఇన్నింటిని భరిస్తూ, పోరాడుతూ, మానవీయవిలువల్ని కాపాడుకుంటూ, ఒక ధ్యేయన్ని సాధించటం ఎంతకష్టమో, ఆ క్రమంలో, పీడితులైన స్త్రీలమధ్య స్నేహం, అనుబంధం ఎలా ఏర్పడి స్థిరపడతాయో, హృద్యంగా కళ్ల ముందుంచుతుంది కలర్‌ పర్పుల్‌. కష్టాలలో నుంచి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన పధ్నాలుగేళ్ల సెలె కథ ఇది. విస్తృతంగా వున్న వాకర్‌ సాహిత్యంలో నాకు ఎక్కువగా నచ్చిన మరొకటి, ”ఇన్‌సెర్చాఫ్‌ అవర్‌ మదర్స్‌ గార్డెన్స్‌” అనే పెద్ద వ్యాసం. ఈ వ్యాసంలో వర్జీనియ వుల్ఫ్‌ని ప్రస్తావిస్తూ, నల్ల జాతి స్త్రీలలో ఎంత కళాత్మకత, తెలివీ, మానవీయగుణాలు ఉన్నప్పటికీ బానిసత్వమూ, జాతి వివక్ష, అవకాశలేమి వలన అవ్వన్నీ అణగారి పోయాయనీ ”మా అమ్మమ్మల కాలంలో ఒక స్త్రీకి ఎంత కళానైపుణ్యం వున్నా ఏమి లాభం? ఒక శ్వేతజాతి యజవని కొరడా కింద నలిగిపోవల్సిందేకదా? పది పన్నెండు మంది పిల్లల్ని కంటూ వాళ్లతో పాటు తన ఆత్మని కూడా అమ్ముకుంటూ బతుకు వెళ్ళమార్చడమే కదా? చాలా కాలం నల్లజాతి వారు చదువుకోడంకూడా శిక్షర్హమైన నేరమేకదా?” అంటుంది.

”మేము వేసుకునే బట్టలన్నీ ఆమే కుట్టేది. మా పక్క దుప్పట్లు, తువ్వాళ్ళు అన్నీ ఆమె తయారు చేసేది. వేసవిలో పళ్ళు, కూరలు నిలవ చేసేది. చలికాలంలో మేము కప్పుకోవడానికి బొంతలు తయారు చేసేది. పొలంలో మా నాన్నతో పాటు పని చేసేది. పొద్దు పొడవక ముందే ఆవిడ పని మొదలయ్యేది. రాత్రి ఎంతకీ పనయ్యేది కాదు. ఒక్క నిమిషం తీరికగా కూర్చుని తనగురించి పట్టించుకునే వెసులుబాటే లేకపోయేది. ఇంకెక్కడ తన సృజనాత్మక శక్తిని బయటపెట్టుకునే అవకాశం?” తన తల్లి గురించీ ఇంకెంతోమంది తల్లుల గురించీ అంటుంది.

వాషింగ్టన్‌ డి.సి లోని స్మిత్సో నియన్‌ మ్యూజియంలో ఒక క్విల్ట్‌ వుంది. చాలా అపురపమైనది. దాని క్రీస్తుని శిలువ వెయ్యడం దృశ్యాలుంటాయి. పనికి రాని రంగురంగుల గుడ్డ ముక్కలతో చేసిన ఈ బొంతని చస్తే చాలా గొప్ప ఊహాశక్తి, ఆధ్యాత్మిక చింతన కల వ్యక్తి తయారు చేసిందని తెలిసి పోతుంది. దీనికి అంటించిన గమనిక మీద ”వంద సంవత్సరాల కింద, అలబామా రాష్ట్రానికి చెందిన ఒక ‘అనామక’ నల్లజాతి స్త్రీ మన అమ్మమ్మల్లో ఒకరేకదా!” అని అంటుంది.
ఆఫ్రికన్‌ అమెరికన్‌ రచయిత్రుల రచనల్లో నాకు చాలా నచ్చే విషయం వారి పోరాట పటిమ, జీవన వాత్సల్యం, పోరాడి, నిలచి, బ్రతకగలగడం.

Share
This entry was posted in రాగం భూపాలం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.