హర్‌ కదమ్‌ పర్‌

అనిశెట్టి రజిత

ఎప్పుడైతే నేను ఆడపిల్లనన్న
భావన నాకు కలిగించారో.

క్రమక్రమంగా నాలోకి నేను
కుంచించుకపోవడం ప్రారంభమయింది.

మెలకువలో నిద్రలో స్వప్నాల్లో
నాపై అఘాయిత్యమేదో జరగబోతుందని
అత్యాచారం జరుగుతున్నట్లుగానో
అంతులేని అవమానాలు అమానుషమైన
గుర్తులు తేలినట్లుగా కంపించిపోతుంటాను
మృగాల నడుమ లేడిపిల్లలా
ఒక ఆడపిల్లను…
నేను రోజూ మరణించి
మళ్లీ బలిపశువుగా జన్మిస్తున్నట్లుగా
నాకీ ఆడబతుకెందుకనిపిస్తుంది
మొదట ఏడ్చాను గింజుకున్నాను
ప్రతిఘటించాను ఎలుగెత్తి అరిచాను
గొంతెత్తి నినదించాను
న్యాయం కావాలని సమానత్వం రావాలని
విసిగి విసిగి మళ్లీ మూగనై
ముడుచుకపోయాను నెత్తురు ముద్దలా…
ఎంతకాలం గడిచినా
ఈ పరిస్థితి మారదని
స్త్రీజాతికి శాంతి అందని సుఖమని
తెలిసిన తరవాత నన్ను తొలుచుకుంటూ
నా మనస్థితిని కమ్ముకుంటూ
ఒక్కటే ఆలోచన! ఒక్కటే భావన!
ఒక్కటే మార్గం! ఒక్కటే గమ్యం!
బతకాలంటే అనుక్షణం చావాలని
మనిషికి మరణించడం తెలియాలని
అడుగడుగునా పోరాటం చేయాలని
కలిసికట్టుగా ఒక్కటిగా అందరం
బతుకు పోరాటం చేయాలని
నిత్యం పోరాటమే లక్ష్యంగా జీవించాలని
రొట్టెకోసం! గులాబీల కోసం! స్వేచ్ఛకోసం!

ఆచార్య దేవోభవ

 జి. విజయలక్ష్మి

మాతృదేవోభవ
పితృదేవోభవ
ఆచార్య దేవోభవ
అతిథి దేవోభవ
మా అవ్వలకు అమ్మలకు దొరకని విద్యారత్నం మాకు దొరుకుతుందని
మాలాటి వాళ్ళందరికీ చదువు పంచాలనే రంగుల కలతో
మా గూడేల్ని గుడిసెల్ని వదిలి విశ్వవిద్యాయాల్లో అడుగుపెట్టాం
మేం ప్యాంటుషర్టులు వేసుకున్నా మాలో ఆడవాసన కోసమే వెతికారు
కులాల కుళ్ళు వాసనని ముక్కు మూసుకున్నారు
మాకు ఎంత మేధస్సు వున్నా మాంసపు ముద్దలుగానే చూశారు
మా ఆత్మవిశ్వాసాన్ని ఇగోలతో ఈసడించారు
పట్టెడన్నం దొరకని మాకు అందమైన ఆకృతి రాదు
సుతిమెత్తని శరీరమూ లేదు
మాది ముఖాల్లో దాగని అమాయకత్వం
ఎర్ర బస్సెక్కి వచ్చామని హేళన చేశారు
మమ్మల్ని రాగింగులు చేసి మీరు మగంగులయ్యారు
ప్రొఫెసర్ల స్పెషల్‌ ప్రాక్టికల్స్‌లో పాసైతేనే మార్కులు వేస్తామన్నారు
పాతివ్రత్యమా, పాండిత్యమా తేల్చుకోమన్నారు
నేర్పే విద్యావిలువ కంటే మా శీలం విలువ చాలా తక్కువన్నారు
గురుశిష్యుల సంబంధం శారీరక సంబంధమేననే నిర్వచనమిచ్చారు
శిరియాళుడి తలవండి వడ్డించమన్న శివుడికన్నా
ఏకలవ్యుడి వేలుమాత్రమే అడిగిన ద్రోణాచార్యుడి కన్నా
గొప్ప గురుదేవులు మీరు
గురుఃబ్రహ్మ గురుఃవిష్ణు గురుదేవో మహేశ్వరా!
కొందరు మాత్రం
గురుఃకామం గురుఃస్వార్థం గురువు పశువుతో సమానం!!
ద్రౌపది చీర విప్పిన దుశ్శాసనుడు
సైరంధ్రిని అనుభవించాలనుకున్న కీచకుల వారసులు మీరు
దిగంబరంగా వండి వడ్డించమన్న త్రిమూర్తులనే
చంటిబిడ్డలు చేసి ఊయల్లో ఊపిన అనసూయలం మేము
మా శ్రమనించి పుట్టిన సంస్కారం ముందు
మీ దిగజారిన నాగరికత విద్య తలదించుకుంది
రిజర్వేషన్లతో సమానమౌతామని రివల్యూషన్‌ పేరుతో అణచివేస్తారు
కిడ్నీలు అమ్ముకునే డాక్టర్లకి, బ్రిడ్జిలు కూల్చే ఇంజనీర్లకి
దేశాన్ని తాకట్టుపెట్టే నాయకులకూ మేం ఎపుడూ పోటీ రాం
మా రక్తవంసాలతో పెరిగి మాకు సాధికారతనిస్తారా?
మీకు ఉగ్గుపాలతో జ్ఞానాన్ని రంగరించి పోసింది మేము
మమ్మల్ని బానిసత్వంలోకి తోసెయ్యాలని మీరు
మేం అమ్మతనాన్ని మరిచి మెదడు, మనసు కాళ్ళ దగ్గర పరిచినా
మళ్ళీ మళ్ళీ మమ్మల్ని అణచివేసే ఉక్కుపాదమౌతారు
మా త్యాగాల్ని అబలత్వం అనుకుంటే
మా సహనాన్ని చేతగానితనమనుకుంటే మా ధీరత్వాన్ని చూపిస్తాం
లంచాలు తీసుకుని మంచాలు మార్చే మహిళా కమీషన్లు
అమ్మాయిల్ని అమ్ముకునే అమ్మలాంటి గురువుల్ని చూసి
స్త్రీజాతే సిగ్గుపడుతున్నది
మానాల్ని దోచుకునే గురువులకు
మహిళల్ని అమ్ముకునే గురువులకు శతకోటి వందనాలు
రేపటి పౌరుల్ని తీర్చిదిద్దకపోయినా ఫరవాలేదు
మానవ మృగాలుగా వున్న మీరు మనుషులుగా మారండి
విలువల్ని చంపి వలువలు విప్పకండి
శిశువులుగా పుట్టి పశువులుగా మారి
మానభంగ పర్వంలో మహిళల్ని మట్టుబెడితే
మహిళాసుర మర్దినులమై మీ మదమణుస్తాం
మీ నెత్తుటి చుక్కలు నేలరాలకుండా
మా చనుబాలతో కడుగుతాం.

తెరిపి

ముకుంద రావరావు

అసలే రైలు ఊయలూపుతుందేమో
పగలైనా అందరూ హాయిగా నిద్రపోతున్నారు
నా ఎదురుగా తల్లితో బాటు
ఒడిలో పాప కూడా
నీటిలో మెరుస్తున్న చంద్రుడిలా
పాప నవ్వు
మబ్బులతో ఆడుతున్న సూర్యుడిలా
విప్పీ విప్పని గుండ్రటి కళ్లు
అంతకుముందే
పాప తిన్న అరటిపండు ముక్కలు
తాగిన పాలు
చుట్టుపక్కలంతా వాంతులు చేసుకున్న తాజా వాసన
పాప
వాళ్లమ్మ
నిద్రలో కూడా
ఏమి మాటాడుకుంటున్నారో
ఒకరినొకరు హత్తుకుంటూ
పాప కళ్లు తెరిచిందో లేదో
ఆమె నిద్ర ఎగిరిపోయింది
పాప నవ్విందో లేదో
ఆమె ఆనందంతో తేలిపోయింది
దారంతా
ఆ తల్లీ పిల్లా
ఎంత దూరాన్నీ భారాన్నీ తగ్గించారో

కంచె చేను మేస్తే


డా. విజయలక్ష్మి పండిట్‌
కనురెప్పలు కంటికి
రక్షక భటులై
ఏ నలుసు కంటిని బాధించకుండా
కాపలా కాయల్సిన
కనురెప్పలే కంట్లో పడి బాధిస్తే
ఎవరితో చెప్పుకుంటుంది కన్ను?
కనుపాపలా కాపాడుకోవాల్సిన
కన్నతండ్రే కన్న కూతురిని కాటేస్తుంటే
ఆ కామంధునికి కూతురైన పాపానికి
ఎవరితో చెప్పుకుంటుంది ఆ కన్నె?

విశ్వరపం

కోపూరి పుష్పాదేవి

”ఆడదానికి చదువెందుకు…” అన్న నోళ్లు
”అమ్మో ఆడవాళ్ళా…?” అంటున్నాయి
అబలగా భావించి అణగద్రొక్కు అలవాట్లు
అదిరిపోతున్నాయి… బెదిరిపడుతున్నాయి…
ఇందుగలరందులేరని ఏల సందేహం?
వెతకనవసరం లేదు…
అంతా మేమే… అన్నిటా మేమే…
”అంతరిక్షానికీ సై” అంటాము
”అంటార్కిటికాకూ ఛలో” అంటాము
ఆత్మవిశ్వాసం మా ఆయుధం
అణకువ, ఆదరణ మా నినాదం
భయనికే మేమంటే భయం…
కష్టజీవులకు మేమిస్తాం అభయం…
మాకూ కొద్ది చోటివ్వండని
బతిమాలుకోవాలి ఈ పురుషపుంగవులు…!

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.