రేపటి ప్రశ్న

వారణాసి నాగలక్ష్మి

రాజారాం ఈ మాత్రం సంతోషంగా ఉండి ఎన్నాళ్ళైందో.  రిటైరయినప్పటి నుంచి జీవితం చాలా నిరాసక్తంగా అయిపోయిందతనికి.

ఉద్యోగంలో  ఉన్న న్నాళ్ళూ రిటైరవగానే చెయ్యాల్సిన పనుల గురించి ప్రణాళికలు వేసేవాడు!  చివరికి ఎదురుచూసిన సమయం వచ్చేసరికి జీవితమే తల్లక్రిందులైనట్టనిపిస్తోంది.  జానకిలో ఎందుకింత మార్పు వచ్చింది?  ఎప్పుడు గతం తవ్వుకుంటూ, దుఃఖ పడుతూ, ఆవేశపడుతూ అనారోగ్యం కొనితెచ్చు కుంటోంది.  కష్టాలెవరికి లేవు?

‘అందరికీ ఉంటాయి.  కానీ కోరి కష్టాలెవరు కొనితెచ్చుకోరు.  మీరలా చేసి మనింటికి అరిష్టాన్ని తెచ్చారు’ అంటుంది.  ఉద్రేకపడి బి.పి., దిగులుపడి షుగరు తెచ్చుకుంటోందని గ్రహించదు!  ఇన్నాళ్ళకి కొడుకు సురేంద్ర ఇండియా వచ్చాడు.  ఏదైనా సంబంధం కుదిర్చి ఈసారైనా పెళ్ళి చేసి పంపాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు తామిద్దరూ.  ఒక సంబంధం కుదిరి పోతుందనుకున్నదే చేయి దాటిపోయింది.  ఆడపిల్ల గలవాళ్ళ కోరికలు ఆకాశాన్నంటుతున్నాయి!  వాడి అందచందాలు, ఉద్యోగ వివరాలు సరిపోలేదో, లేక తమ స్తోమత వాళ్లకి నచ్చలేదో!  సురేంద్ర మళ్ళీ ఆస్ట్రేలియ వెళ్లిపోవాలి.  పదిరోజుల కోసం వచ్చాడు, ఈ పెళ్ళి కుదిరిపోతుందనుకుని.  అది కాస్తా జారిపోయింది.  మొన్న ఈపాటికి ఇల్లంతా ఏదో దిగులు.  పెళ్ళి సందడితో కళకళలాడాల్సిన ఇల్లు నిశ్శబ్దంగా మబ్బు ముసిరినట్టు అయిపోయింది!

పోనీలే… అన్నీ మన మంచికే.  నిన్న తన క్లాస్‌మేట్‌ గురుమూర్తి కనిపించాడు.  వాళ్ళ అన్నయ్యకొక పెళ్ళీడు కూతురుందిట.  మనుషులు చాలా మంచి వాళ్ళు.  ఇవాళ సాయంత్రం వాళ్ళింటికి వెళ్ళి సంబంధం మాట్లాడాలని జానకీ, తను అనుకున్నారు.  ఇది కుదిరేలా అనిపించి కాస్త మనశ్శాంతిగా, స్థిమితంగా ఉందీవాళ.  ”ఏం కావాలి సార్‌?” గట్టిగా వినిపించి, ఆలోచనల నించి తేరుకున్నాడు రాజారాం.  కూరగాయల మార్కెట్‌లో ఉన్నాడు తను.  సురేంద్రకి కాప్సికమ్‌ కూరంటే ఇష్టం.  పిచ్చివెధవ పదేళ్ళుగా వండుకు తింట ఒంటరి జీవితం గడుపుతున్నాడు!  వయసు చూస్తే ముప్ఫై అయిదు దాటిపోయింది.  వాడికి పాతికేళ్ళు వచ్చేదాకా రాబోయే కోడలి గురించి తనకీ, జానకికీ ఎన్నో ఆశలుండేవి!  ఒక్కడే కొడుకైనందుకు ఎంతో బాగా పెంచుకున్నారు.  వాడు ఉద్యోగంలో చేరగానే పెళ్ళి చేద్దామని ప్రయత్నాలు సాగించారు.  ఒక్కటీ కుదరలేదు.  మరీ కులగోత్రాలు, శాఖతో సహా కలవాలంటే కష్టమని కొంచెం సర్దుకోవడానికి సిద్ధపడ్డారు.  అబ్బే… ఏదీ క్లిక్‌ అవలేదు!  కట్నాలు అక్కరలేదన్నారు, లాంఛనాలు కూడా అక్కరలేదన్నారు… అయినా కుదరలేదు.  పోనీ పెద్ద అంద చందాలు లేకపోయినా కాస్త తమతో కలుపు గోలుగా ఉండి, సామాన్యమైన చదువూ ఉద్యోగం ఉంటే చాలనుకున్నా అలా కూడా కుదరలేదు.  ముప్ఫై దాటిపోతుంటే ”తెలుగు పిల్లయితే చాలు, లవ్‌మారేజ్‌ అయినా చేసుకోరా! మాకు అభ్యంతరం లేద”న్నారు.  అలా కూడా కుదరలేదు.

”కొంచెం పక్కకి తప్పుకోండి సార్‌” మళ్ళీ అదే గొంతు.  అయ్యో అడ్డంగా ఉన్నాడు కాబోలు తను.  తల విదిలిస్తూ ”బుంగమిరపకాయలు ఎంతోయ్‌?” అడిగాడు రాజారాం.
”నలభై” నిర్లక్ష్యంగా అన్నాడతను.
”ఏమిటి? కిలో నలభయ్య?”
”భలేవారు సార్‌. పావుకిలో” వేరే బేరం చూసుకుంటూ అన్నాడతను.
”పావుకిలో  నలభైయ్యా??” ఆశ్చర్యంగా అడిగాడు.
”అవున్సార్‌! మార్కెట్‌లో ఎక్కడా కాప్సికం లేదు.  నా దగ్గరా కొంచెమే ఉన్నాయి.  కావాలంటే వెంటనే తీసుకోండి” అన్నాడు.
అటూ ఇటూ ఊగిసలాడి, మళ్ళీ కొడుకు వెనక్కి వెళ్ళిపోతాడని గుర్తొచ్చి, సరే అన్నాడు.  వంగి, బుట్టలో సగానికున్న కాప్సికమ్‌ ఏరబోయడు.  లేతగా నవనవ లాడే కాప్సికమ్‌ కోసం చూస్తే అవి సొట్ట పిందెల్లా ఉన్నాయి.  అంత డబ్బు పోసి కొనాలనిపించలేదు.  ఏరిన నాలుగు వెనక్కి బుట్టలో పడేసి, “టమాటో ఎలా?” అన్నాడు.
”పావుకిలో ముప్ఫై” అన్నాడు షాపువాడు
”ఏంటయ్యా? అన్నీ కిలో ఇరవై, ముప్ఫై ఉంటే ఇవి పావుకిలో ధరలే అంతంతున్నాయి?”
”ఏం చేసేది సారు? డిమాండ్‌ అట్టాగుంది!  ఆ పంటలు పాడైపోయి దిగుబడి లేదు.”
రాజారాంకి ఏం కొనకుండా ఇంటికి పోదామనిపించింది.  ఏవో కూరలు ఇంట్లో ఉన్నాయి.  జానకి కాప్సికమ్‌ తెమ్మందని తను మార్కెట్‌కి వచ్చాడు!  వెనక్కి తిరిగి పదడుగులు వేశాడు.  ఇంటి దగ్గర ఎదురుచూస్తున్న జానకి మొహం గుర్తొచ్చింది.  ‘కాప్సికమ్‌ ఎందుకు తేలేదని’ అడుగుతుంది వెళ్ళగానే.  ‘కాయలు బాగాలేవు, ధర మరీ ఎక్కువ చెప్పాడు’ అని తనంటాడు.  తనని ఛీత్కారంగా చూస్తూ, గతాన్ని తవ్వి, ములుకులతో గుచ్చుతుంది!  చూస్తూండగానే జానకిలో ఎంత మార్పొచ్చింది!  ఏదైనా సైకలాజికల్‌ ప్రాబ్లెమా?  అర్థం కావడం లేదు.  రెండుమూడేళ్ళకోసారి సురేంద్ర వస్తాడు.  వాడున్నన్నాళ్ళూ బానే ఉంటుంది.  తామిద్దరే ఉన్నపుడు మాత్రం ఉన్నట్టుండి అగ్నిపర్వతంలా విరుచుకుపడుతుంది!
మళ్ళీ వెనక్కెళ్ళి అరకిలో కాప్సికం, అరకిలో టమాటో తీసుకుని ఇంటిదారి పట్టాడు రాజారాం.  సురేంద్ర పెళ్ళి కుదురుతుందేమో అని జానకి అక్కా, ఆవిడ కూతురు చందన వచ్చారు నాలుగురోజుల క్రితం.  అది తప్పిపోయింది.  రెండ్రోజు లుండి నిన్ననే వెనక్కి వెళ్ళిపోయారు.  చందన ఇంట్లో తిరుగుతుంటే ఎంత బావుండిందో!జాతివజ్రంలా తళతళలాడి పోతూ, ‘పిన్నీ’, ‘బాబాయ్‌’ అంటూ ఇంట్లో తిరుగుతూ, అన్నీ చక్కదిద్దుతుంటే ఇల్లంతా ఎంత ఆహ్లాదకరంగా అనిపించిందో!  తను వెళ్ళిపోగానే తమ ఆవరణంతా బోసి పోయింది!  ”ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మిరా” అనేది అమ్మ.  అపుడు తనకర్థం కాలేదు.  అప్పట్లో ఎటుచూసినా ఆడవాళ్ళే కనిపించినట్టు విసుగ్గా ఉండేది.  ఇంట్లో అమ్మ ఉండేది.. జానకి ఉండేది.  పుట్టింటికి వస్తూ పోతూ చెల్లెళ్ళిద్దరూ!  అంతా తలోపనీ అందుకుంటూ సందడిగా విశాలమైన ఆవరణలో తిరుగొతూ పండగలూ, పబ్బాలపుడు పిండివంటలతో, పరిహాసాలతో, నవ్వులతో తమ ఇల్లు ప్రతిధ్వనిస్తుంటే అదెంత అదృష్టవమో తనకర్థం కాలేదు.  చెల్లెళ్ళ పెళ్ళిళ్ళకి తనెంతో అవస్థ పడ్డాడు సరిపడా డబ్బులేక.  తన నిర్ణయం తప్పని సాధించి పోసేముందు జానకి ఇవన్నీ గుర్తుచేసుకోదు!  అశాంతిగా గుండెమీద రాసుకున్నాడు రాజారాం.
చందనని చూసినపుడల్లా అలాంటి కూతురు లేదనీ, కనీసం చక్కని కోడలైనా తన గడప తొక్కుతుందా అనీ బెంగపడుతుంది జానకి.  తనకి లేద బెంగ? ”మీకేం బెంగ?” అవహేళనగా, అసహ్యంగా చూస్తుంది.  అంతకన్నా శూలాలతో గుచ్చినా నయమే!

తను రిటైరయి నాలుగేళ్ళయింది.  ఎక్కడికి వెళ్ళినా కాసేపు తిరిగి ఇంటికొచ్చేస్తాడు.  ఎవరింటికి వెళ్ళినా ఎంతసేపు గడుపుతాడు?  ఎవరు మాత్రం రోజూ వచ్చిపడేవాణ్ణి గౌరవంగా చూస్తారు?  ఇంటికి వెళ్తే మనశ్శాంతి దొరకదు.  ”చేతులారా చేసుకున్నదానికి అనుభవించా ల్సిందే” అంటుంది జానకి.  అంత కసి ఎలా ఏర్పడింది?  ఎంత చక్కగా ఉండేది మొదట్లో?  ఎంత ప్రేమగా ఉండేది తనతో?  అమ్మ పోయాక మారిపోయిందా?  బీపీ, షుగరు రావడంతో అనారోగ్యం వల్ల ఇలా తయరైందా?  రాజారాంకి నిస్సత్తువగా అనిపించింది.

ఏమిటీ జీవితం?  ఒక్కగానొక్క కొడుకు ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉంటాడు.  మగపిల్లాడు పుట్టాలని, వాడు విదేశాల్లో ఉద్యోగం చెయ్యాలనీ తనే కోరుకున్నాడు గానీ, తీరా కోరినది జరిగేసరికి ఏదో కోల్పోయినట్టు బాధ.  పోనీ ఎక్కడున్నా చక్కగా పెళ్ళి చేసుకుని పిల్లాపాపలతో సంసారజీవితం గడుపుతుంటే అంత బాధ లేదు.  ఎక్కడో ఒకచోట వాళ్ళు హాయిగా ఉండి అపుడపుడు వచ్చి వెళుతుంటే తమ జీవితం ఇంత నిస్సారంగా ఉండేది కాదు!  ఎందుకు వాడికి పెళ్ళి కుదరటం లేదో తెలీదు.  తెలీదంటే మరీ తెలీకా పోలేదు.  ఏరీ ఆడపిల్లలు?  ఆంధ్రదేశంలోనే కాదు దేశం అంతటా వెయ్యిమంది యువకులకి అయిదువందలో, ఆరువందలో మాత్రమే అమ్మాయిలున్నారు!  ఈ పరిస్థితి ఎందువల్ల వచ్చిందో తనకి తెలియంది కాదు!
పూర్వం అబ్బాయి ఎలా వున్నా, అమ్మాయి మాత్రం ఇంత అందంగా ఉండాలి, అంత చదువుండాలి, పనిపాటలు అద్భుతంగా వచ్చి ఉండాలి, కట్నం కానుకా పెద్ద ఎత్తున ఇవ్వాలి అని షరతులు పెట్టేవాళ్ళు మగపెళ్ళివారు.  అంతెందుకు?  జానకి తన ఇంటికి యభైవేల కట్నంతో వచ్చింది!  ఇపుడంటే ఇలా ఉంది గాని అప్పట్లో బాపుబొమ్మలా ఉండేది.  ఎంత ఉత్సాహం ఉండేదో తనలో!  ఆ రోజుల్లో తనకి ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళాలంటే మనసు ఉరకలు వేసేది!  అమ్మ ఒకవైపు, జానకి మరోవైపు ఇంటిని స్వర్గతుల్యంగా చేసేవారు!  తనెంత మూర్ఖుడు!  అప్పట్లో తెలుసుకోలేకపోయాడు స్వర్గమంటే అదే అని!

తలొంచుకుని నడుస్తున్న రాజారాం భుజాన ఎవరిదో చెయ్యిపడింది.  తలెత్తి చశాడు.  గురుమూర్తి! రాజారాం మొహం విప్పారింది.
”అరే గురూ! నీ గురించే ఆలోచిస్తున్నారా! సాయంత్రం మీ అన్నయ్య గారింటికి వద్దామనుకుంటున్నాం నేనూ జానకీ” అన్నాడు.
”తప్పకుండా రండిరా రాజా! ఊరికేనా? ఏమన్నా విశేషమా?” నవ్వుతూ అడిగాడు గురుమూర్తి.
”ఊరికే రాకూడదా?… విశేషం కూడా ఉందనుకో” ముందుకి నడుస్తూ అన్నాడు రాజారాం.
”ఎందుకు రాకూడదూ?  నిన్న నిన్ను కలుసుకున్నానని చెపితే అన్నయ్య కూడా అన్నాడు తీసుకురాకపోయవా మనింటికి అని.”
”ఏం లేదురా… మీ అన్నయ్య గారమ్మాయికి సంబంధాలు చూస్తున్నా మన్నావు కదా. మా సురేంద్ర కోసం అడగాలనుకున్నాం” సంకోచాన్ని వదిలి అడిగాడు రాజారాం.
”ఓ… వసుధ కోసమా?  తప్పకుండా అడగండి.  దానికీ ముప్ఫై దాటాయి.  పెళ్ళి చేసుకోనని ఇన్నాళ్ళూ హఠం చేసింది.  ఇపుడు ఒప్పుకుంది.”  రాజారాంతో పాటు నడుస్తూ అన్నాడు గురుమూర్తి.  కబుర్లు సాగిస్తూ ఇల్లు చేరారు.
గేటు తలుపు తెరిచేసరికి లోపల్నించి అరుపులు వినిపిస్తున్నాయి.  అవాక్కయి పొయాడు రాజారాం.  గురుమూర్తిని వెళిపోమని ఎలా చెపుతాడు?  అలవాటైన ఇల్లు కావడంతో అతనే తనకన్నా ముందు లోపలికి అడుగులు వేశాడు!  ఛీ.. తన ఖర్మ.. చివరిదాకా తన జీవితాన్ని ఇలా లాగించాల్సిందే.  కాళికలా తనని దుమ్మెత్తి పోస్తున్న భార్య… దిగ్భ్రాంతిగా నిలబడి పోయిన మిత్రుడు!

తనకి  ఎందులోనైనా పడి చావాలని పించింది!  సన్యాసం పుచ్చుకు పోదామని పించింది.  తన సంసారం పట్ల తనకే రోత కలిగింది.  గురుమూర్తి మంచినీళ్ళు కూడా తాగకుండా వెళ్ళిపోయడు!  ఇంకేం పెళ్ళి సంబంధం?!  తెచ్చిన కూరలసంచి అక్కడ పెట్టేసి, వెళ్ళి, మామిడిచెట్టు నీడలో కూర్చున్నాడు రాజారాం.  మనసంతా అవ్యక్తమైన బాధతో నిండిపోయింది.  దిక్కుతోచని వాడిలా అయోమయంగా కూర్చుండిపోయడు.
గంట తర్వాత సురేంద్ర రావడంతో నిశ్శబ్దంగా ఉన్న ఇంట్లోకి వచ్చాడు రాజారాం.  శోష వచ్చినట్టు పడుకుని ఉంది జానకి.  తల్లిని చూసి ఆందోళనగా ”ఏమైంది నాన్నా?” అనడిగాడు సురేంద్ర.  గట్టుతెగిన ప్రవాహంలా రాజారాం బాధంతా బయటికి వచ్చింది.  మ్రాన్పడిపోయి విన్నాడు సురేంద్ర.  ”ఇదంతా నాకెందుకు చెప్పలేదు?  ఇదొక జబ్బు నాన్నా!  దీన్ని ఎవరిమీదో కోపం అనో, బీపీ, షుగరు అనో అనరు!  ఇదొక సైకలాజికల్‌ డిజార్డర్‌!  ఇలాంటివి ఎంత త్వరగా గుర్తించి ట్రీట్‌మెంట్‌ ఇస్తే అంత త్వరగా నయం అవుతాయి!  ఇన్ని సంవత్సరాలుగా ముదరపెట్టారు!” అని కళ్ళనీళ్ళ పర్యంతమయ్యడు.

”చిక్కిపోయింది.  దిగులుగా కనిపిస్తోంది.  ఎందుకనడిగితే నా పెళ్ళి గురించి బాధపడుతోందన్నారు.  అవునను కున్నాను గాని ఇలా అని ఊహక్కూడా రాలేదు” బెంగగా అన్నాడు.
ఇద్దరూ కలిసి, కుక్కర్‌లో అన్నం, పప్పు పెట్టి, బంగాళాదుంపలు ఉంటే తరిగి వేపుడు చేశారు.  రెండుగంటలవుతుంటే భోజనం వడ్డించి, జానకిని లేపారు.  రాజారాంకి తాము ముగ్గురూ చందనతోనూ, వాళ్ళమ్మతోనూ కలిసి భోజనం చెయ్యడం, చందన కబుర్లూ, హడావుడీ గుర్తొచ్చాయి.  మనసు కలుక్కుమంది.  శాపగ్రస్తమై పోయింది తనిల్లు! భర్తా, ఇన్నాళ్ళకి ఇండియా వచ్చిన కొడుకూ కలిసి వండి వడ్డిస్తే, నిస్తేజంగా కూర్చుని తింటున్న భార్య తన జానకేనా?
ఎవరి ఆలోచనల్లో వాళ్ళు మౌనంగా భోజనం ముగించారు.  సురేంద్ర తల్లి చెయ్యిపట్టుకుని తీసుకెళ్ళి పడుకోబెట్టాడు.  శక్తంతా లాగేసినట్టు హాల్లోనే దీవాన్‌ మీద నడుం వాల్చిన రాజారాం కొద్దిసేపట్లో గాఢంగా నిద్రపోయాడు.  కనుచీకటి పడుతుంటే మెలకువ వచ్చిందతనికి.  వంటింట్లోంచి టీ వాసన, మంచి పకోడీల వాసన.  అతని మనసు ఒక్కసారి పదేళ్ళు వెనక్కిపోయింది.  అమ్మా, జానకీ వంటింట్లో ఉన్నట్టనిపించింది.  లేచి ఉత్సాహంగా వంటింట్లో కొచ్చాడు.
సురేంద్ర! పకోడీలు వేయిస్తున్నాడు.  రెండో స్టవ్‌ మీద టీ!  ఆర్ద్రమైన కళ్ళతో తండ్రిని చూసి, వేడి పకోడీల ప్లేటు అందించాడు.  ఆఖరి వాయ తీసి ఆపేసి, డైనింగు టేబుల్‌ దగ్గర తండ్రి పక్కగా కూర్చుంటూ ”నాన్నా! ఇవాళ ఏడింటికి అమ్మని డాక్టర్‌ దగ్గరకి తీసుకెళ్ళాలి.  అపాయింట్‌మెంట్‌ తీసుకున్నాను” అన్నాడు.
”ఏ డాక్టర్‌?” భారంగా అడిగాడు పకోడీ నోట్లో వేసుకుంట.  సురేంద్ర రెండు కప్పులతో టీ, తనకీ ఒక ప్లేటు పకోడీ పట్టుకొచ్చాడు.
”సైకియట్రిస్ట్‌ నాన్నా! డాక్టర్‌ నళినీమోహన్‌ అని చాలా పేరున్న సైకియట్రిస్ట్‌.  నా ఫ్రెండ్‌ వాళ్ళ మేనమామ.  అడగ్గానే అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు” అన్నాడు.
మరో అరగంటకి జానకి లేచింది.  ఇపుడు కాస్త తేటగా ఉంది ఆమె మొహం.  టిఫిన్‌ తిని, టీ తాగి, కొడుకు చెప్పినట్టుగా తయరైంది.  ముగ్గురూ డాక్టర్‌ దగ్గరకెళ్ళారు.  ఆయన ముందుగా కొంతసేపు సురేంద్రతో మాట్లాడారు.  తర్వాత రాజారాంని లోపలికి పిలిచారు.  సురేంద్ర బయటికి వచ్చి తల్లితో కూర్చున్నాడు.
లోపలికెళుతూనే రాజారాం చాలా సంవత్సరాలుగా తనలో పేరుకుపోయిన బాధనంతా డాక్టర్‌ దగ్గర వెళ్ళగక్కాడు.  ఎవరికీ చెప్పుకోలేక అతను పడుతున్న బాధంతా అతని మాటల్లో వ్యక్తమైంది.  సడన్‌గా మారిపోయే జానకి మూడ్స్‌ గురించి, గోరంత విషయాన్ని కొండంత చేసి రాద్ధాంతం చేసే పద్ధతి గురించి, ఇంట్లో కరువైన మనశ్శాంతి గురించి వివరంగా చెప్పుకొచ్చాడు.  డాక్టర్‌ విన్నకొద్దీ అతనికి చెప్పాలనిపించిన సంఘటనలెన్నో ఆవేదనగా బైటపెట్టాడు.  భార్య, కొడుకు పెళ్ళి గురించి తీవ్రమైన విచారంలో మునిగిపోతోందనీ, ఇల్లు దుర్భరంగా తయరైందని పదేపదే చెప్పాడు.  డాక్టర్‌ అడిగిన ప్రశ్నలన్నిటికీ ఆత్రంగా జవాబులు చెప్పాడు.  మునిగిపోతున్న నావికుడు నీటిలో తేలుతున్న దుంగని అందుకున్నట్టు, డాక్టర్‌ నళినీమోహన్‌ని ఆపద్బాంధవుడిలా, తమ రక్షకుడిలా భావించాడు.
దాదాపు  ముప్పావు గంట తర్వాత జానకిని కూడా లోపలికి రమ్మని పిలిచారు.  కొంతసేపు కుశలప్రశ్నలు వేసి, ఆమె ఆరోగ్యం గురించి కొన్ని ప్రశ్నలు అడిగారు.  ‘సురేంద్ర ఒక్కడే కొడుకా? తర్వాత వద్దనుకున్నారా లేక కలగలేదా?’ అనడిగారు.  జానకి మొహం అదోలా అయిపోయింది ఆ ప్రశ్నకి.  రాజారాం గాభరాగా ”సురేంద్రకి ముందూ, తర్వాత రెండు అబార్షన్స్‌ అయ్యాయి డాక్టర్‌!” అన్నాడు.
అంతే… జానకి ఒక్కసారిగా జేవురించిన మొహంతో ”దరిద్రుడా! నికృష్టుడా! అవి అబార్షన్స్‌ కావురా! భ్రణహత్యలురా! ఓరి హంతకుడా!” అని అరిచింది లేచి నిలుచుని.
డాక్టర్‌ విస్మయం చెందినా అలాంటి రియాక్షన్స్‌ అలవాటైనవే కావడంతో మౌనంగా చూస్తూ ఉన్నాడు.
కందిపోయిన మొహంతో రాజారాం ”జానకీ! ప్లీజ్‌!” అన్నాడు.
”డాక్టర్‌! ఈ నరహంతకుడు ఆడపిల్ల అని తెలిసి నా మొదటి గర్భాన్ని తీయించే శాడు డాక్టర్‌! ఎంతో వేడుకున్నాను.  కాళ్ళా వేళ్ళా పడ్డాను.  తోసేసి, నా బంగారు పాపాయిని చంపేశాడు!  తనకి ఆడపిల్లలు వద్దని చేతులారా నా పాపని చంపేశాడు!” ఉద్రేకంలో మారిపోయిన ముఖకవళికలతో ఆవేశంగా చేతులూపుతూ అంది జానకి.
”జానకీ! అలా అనకు!” దీనంగా అన్నాడు రాజారాం.  ”దాన్ని పాప అనకు ప్లీజ్‌! అది మూడునెలలు కూడా లేని గర్భం!  దాన్ని పాప అనద్దు… ప్లీజ్‌” అన్నాడు.
అతని మాటలు వినకుండా ”డాక్టర్‌! ఈ పెద్దమనిషి ఒక హంతకుడు! బాబు తర్వాత మళ్ళీ రెండేళ్ళకి నేను ప్రెగ్నెంట్‌ అయ్యాను.  నా అనుమతి లేకుండా డబ్బిచ్చి, మోసంతో నా కడుపు తీయించేశాడు.  ఇలాంటి నీచుల వల్ల ఎందరు బంగారు పాపాయిలు పుట్టకుండానే చచ్చిపోయారో?  ఇలాంటి వాళ్ళవల్లే ఇవాళ ఇళ్ళల్లో ఆడపిల్లలు కన్పించని స్థితి వచ్చింది డాక్టర్‌!” కూలబడిపోయి భోరున ఏడ్చింది జానకి.
”మా అక్కకి కూతురుంది.  మా అన్నకి కోడలుంది.  నా యింట్లో ఆడపిల్లే లేదు.  నా కూతుర్ని, కాదు… నా కూతుళ్ళని వాళ్ళ తండ్రే చంపేశాడు! ఇపుడు నా కొడుక్కి పిల్ల కావాలని పదేళ్ళుగా వెతుకుతున్నాం.  వాడు ముసలి బ్రహ్మచారి అయిపోతున్నాడు.  కులం గోత్రం వదిలేసి తెలుగు పిల్ల అయితే చాలనుకున్నాం.  తెలుగుపిల్ల కాకపోతే కనీసం ఇండియన్‌ అయినా చాలని ప్రయత్నించాం.  ఒక్కటీ కుదరలేదు.  మంచి కోడలొస్తే పువ్వుల్లో పెట్టి చసుకుంటా.  ఖర్మ కాలి మనదేశంలోనే ఆడపిల్లల కరువొచ్చింది!  పుట్టకుండానే చంపబడ్డ పాపాయిలిద్దరు మాకు శాపం ఇచ్చారు డాక్టర్‌! మా ఇంట్లో ఆడపిల్లలు తిరగకుండా శాపం పెట్టారు!” వెక్కివెక్కి ఏడ్చింది జానకి.
డాక్టర్‌ రాజారాం వైపు చూశాడు.
రెండు చేతుల్లో మొహం పెట్టుకుని రాజారాం కూడా మౌనంగా ఏడుస్తున్నాడు!  కొద్ది నిముషాలు డాక్టర్‌ కూడా నిశ్శబ్దంగా ఉన్నాడు.  కాసేపయ్యాక రాజారాం కళ్ళు తుడుచుకుని, ఎదురుగా ఉన్న గోడకి చెపుతున్నట్టుగా యంత్రికంగా.
”అవును డాక్టర్‌! షి ఈజ్‌ రైట్‌! నాలాంటి మూర్ఖులవల్లే ఇవాళ మనదేశంలో ఆడపిల్లల సంఖ్య అన్యాయంగా తగ్గి పోయింది.  భవిష్యత్తు గురించి, రేపటి తరం గురించి, ప్రకృతి నియమాల గురించి ఆలోచించలేని నాలాంటి దౌర్భాగ్యులవల్లే ఇలాంటి స్థితి ఏర్పడింది!  ఇద్దరాడపిల్లలతో కళకళలాడాల్సిన నా ఇల్లు రోగనిలయమై పోయింది!  ఆడపిల్లకి తండ్రి కాకూడదనుకున్నవాడికి మరో ఆడపిల్లకి మామగారయ్యే అర్హత లేదు!  నా వల్లే నా భార్య ఇలా అయిపోయింది.  నా వల్లే… నాలాంటి వాళ్ళ వల్లే నా కొడుక్కి పిల్ల దొరకని స్థితి ఏర్పడింది!” అన్నాడు రాజారాం డగ్గుత్తికతో.
గాజుకళ్ళలాంటి కళ్ళతో చూస్తూ ఉండిపోయింది జానకి.
డాక్టర్‌ ఆలోచనలన్నీ వాళ్ళకి ఇవ్వాల్సిన ట్రీట్‌మెంట్‌ వైపు కదిలాయి.  సమాజమే రోగగ్రస్తమైతే ట్రీట్‌మెంట్‌ ఎవరివ్వగలరు?

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో