రాజా బొగ్గుగని – రమణిక గుప్తా, అనువాదం: సి. వసంత

లగ్గు కొండ ఛోటా నాగపూర్‌లో పారశ్‌నాధ్‌ తరువాత అన్నింటికంటే పెద్దకొండ. కొండలన్నింటికి తల మానికమైనది. సత్‌పుడారేంజ్‌లో ఈకొండ ఎంతో ప్రసిద్ధి పొందింది ఈ కొండ సాధుసంత్‌లకు, తాంత్రికులకు నిలయమయింది. వీళ్ళందరు ఇక్కడ ధ్యానమజ్ఞులై ఉంటారు. ఇళ్ళ నుండి పారిపోయిన వారికి శరణం ఇస్తుంది. ఈ కొండ దీని చుట్టు పట్ల బొగ్గుల నిధులు ఉన్నాయి. ఆకాశం అంతటా పయనిస్తున్న మేఘాలు, ధూళి, పొగల మధ్య తన శిరస్సును రాచుకున్న ఈ కొండ, దట్టమైన అడవులు గుబురు-గుబురుగా ఉన్న జటలను తల నుండి పాదాలదాకా ధరించిన ఈ కొండ, ఎన్నో ఎన్నెన్నో నదుల సెలమళ్ళ నాగులకు  పెనవేసుకున్న ఈ కొండ ఎంతో అద్భుతమైనది. అందమైనది. సాత్‌పుడా రేంజ్‌ అంటే తనే అంతా అన్నగుర్తింపు ఉన్న ఈ కొండ శాశ్వతంగా నిలిచిపోయింది.
గుహలతో, లోయలతో, కొండలు – కోనలతో తన గర్భంలో ఎన్నో నిధులు దాచుకున్న ఈ భూమిపైన దామోదర్‌ నది పన్నెండు నెలలూ పైకి కిందికి పడే 111 కెరటాలతో ప్రవహిస్తు ఉంటుంది. ఈ నది అక్కడ ఉన్న గ్రామాలకు ధన-ధాన్యాలను సమకూరుస్తుంది. ఈ దామోదర్‌ నది ఈ నాటికి ప్రవహిస్తూనే ఉంది. కాని నేడు ఇది చిన్నది. నల్లగా మారిపోయింది. ఈ ధరణిపైన చుట్‌ కావాలా, దూధీ, కోనార్‌ లాంటి ఎప్పటికీ ఎండిపోని నదులు కూడా ప్రవహిస్తూనే ఉన్నాయి. ఇక్కడి రాజు ఆదివాసి అయిన బిర్‌హార్‌ (ఖర్‌బార్‌) కొడుకు. అతడు రాజు కాబట్టి క్షత్రియ కులంకి అంటే పైకులంకి చెందినవాడుగా భావింపబడేవాడు. హజారీబాగ్‌లోని ‘పద్మ’ అనే ఊరు రాజధాని. రాజుసాహెబ్‌ పేరు కామాఖ్యా నారాయణ సింహ్‌. బసంత్‌ నారాయణ సింహ్‌ ఆయన సోదరుడు. రాజుగారిని అందరు పద్మారాజు అనిపిలిచేవారు. పద్మా ఊరు హజారీబాగ్‌ – బరహీరోడ్‌ (ఎచ్‌.ఎస్‌.31) పైన ఉంది. అక్కడే ఆయన రాజభవనం ఉంది.రాణి నేపాల్‌ రాజుల కుటుంబానికి చెందినది. రాజా కాముఖ్య నారాయణ్‌ గురించి కొన్ని పుకార్లు ఉన్నాయి. అతడు బిర్‌హర్‌ ఆదివాసీల కుటుంబానికి చెందినవాడు అన్న పుకారు కూడా ఉంది. ఆంగ్లేయులు వీళ్ళని రాజులుగా నిలబెట్టారు. ఘట్‌వార్‌ (ఖర్‌వార్‌) కులం వాళ్ళు ఈయనని తన కులంవాడేనని అంటారు, ఛోటా నాగపూర్‌లో ప్రసిద్ధి చెందిన ‘ఘటలే ఘట్‌వార్‌, బఢ్‌లే టికైల్‌’ అన్న సామెత ఉంది. ఈయన రాజ్యం అయిన ఉత్తరఛోటా నాగపూర్‌లోనే ధన్‌బాద్‌, హజూరీబాగ్‌లు ఉన్నాయి. ఇంతకు ముందు గిరీడీహ్‌, బొకారో, చతరా, కోడరమా మొ||లైనవే కాక రాంచీలోని మాండర్‌ జిల్లా కూడా ఉండేది. రాజా దగ్గర పనిచేసే సిబ్బంది ఇక్కడి అడవులను, భూములను చూస్తూ ఉండేవారు. ఆదివాసీలు వీళ్ళని ఎంతో గౌరవించేవారు. రాజాకామాఖ్య నారాయణ్‌ స్వరాజ్యం వచ్చాక రాజకీయాలలో కూడా హస్తక్షేపం చేయడం మొదలు పెట్టారు. ఆయన జనతా పార్టీ పేరన ఒక రాజకీయ పార్టీ పెట్టారు. కాంగ్రెస్‌కి విరుద్ధంగా తను, తన కుటుంబం వారు ఎన్నికలలో నిల్చొన్నారు.రాజ్యాధికారాలను రక్షించాలన్న ఉద్దేశ్యం ఆయనది. ఒకవైపు పెద్దపెద్ద వ్యాపారస్తుల దగ్గర ధనం తీసుకుని విధానసభ సీట్లని అమ్మేసేవారు. తన పరపతితో ఎన్నికలలో కాంగ్రెస్‌వాళ్ళ విరుద్ధంగా నిల్చొపెట్టి వాళ్ళని గెలిపించేవారు. ఎక్కువ ఓట్లతో గెలవడానికి ఆయన తన డ్రైవర్‌కి, మంగలివాడికి, చాకలివాడికి టికెట్‌ ఇచ్చి గెలిపించేవారు. ఆయన ఎన్నికల ప్రచారం కోసం ఒక హెలికాప్టర్‌ కొన్నారు. ఆదివాసీలపైన హెలికాప్టర్‌ని చూడగానే సాష్టాంగ ప్రమాణం చేస్తూ జోహార్‌… జోహార్‌ అని అరిచేవారు. ప్రభుత్వం కె.బి. సహాయ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారాయణ్‌ రాజ్యంలోని అడవులను, భూములను జప్తు చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు ఆయన కోర్టులో దావాలు వేయడం మొదలు పెట్టారు. ఎన్నో సంవత్సరాలు కేసులు నడిచాయి. ఆయన రాజు అయినా వ్యాపారదృష్టి కలవాడు. ఆయన వ్యాపారం చేయడంలో దిట్ట. పద్మాలో ఆయన దర్‌బార్‌ని ఏర్పాటు చేసేవారు. ప్రతిసంవత్సరం అక్కడి వాళ్ళకు జాగీర్లు ఇచ్చేవారు. బహుమతులు పంచిపెట్టేవారు. అడవులపైన కేంద్ర ప్రభుత్వం, రాజ్యప్రభుత్వం తను హక్కును ప్రకటించినప్పుడు ఆయన అందరికి పట్టాలు, దస్తావేజులు ఇచ్చి ప్రజలకి అడవులను భూములను పంచిపెట్టసాగారు. నిజానికి అడవులు కాని భూములుకాని ఆ సమయంలో ఆయనని కానే కావు.
1926 సం||లో ఆంగ్ల ప్రభుత్వం రైళ్ళ కోసం లైన్‌ వేయడానికి ఈ ఊళ్ళుల్లో నుండే కేదలా నుండి లయియోదాకా ఉన్న భూములను తీసేసుకుంది. ఆ రోజుల్లో అక్కడి భూములలో బొగ్గు గనులను తవ్వడానికి రైల్వే వాళ్ళకే అధికారం ఉండేది. వేరే గవర్నమెంటు కంపెనీలు ఉండేవి కావు. బొగ్గుగనులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోడానికి డ్రిల్లింగ్‌ అయింది. బొగ్గు గనుల ఆచూకీ ఆంగ్లప్రభుత్వం అప్పటికే కనిపెట్టింది. కాని రైల్వేలైన్‌ వేసే ప్రణాళిక అట్లానే ఉండిపోయింది. అందువలన క్వారీల్లో పని ఆగిపోయింది. నిజానికి భూములు రైతులకి వెనక్కి తిరిగి ఇవ్వాలి. కాని అట్లా జరగలేదు. ఆంగ్ల కలెక్టర్‌ వాళ్ళ చేత ఒక ఎగ్రిమెంట్‌ చేయించాడు. ఒకటి రెండు సంవత్సరాలు ఎవరి భూములనైతే తీసుకున్నారో వాళ్ళకే లీజ్‌కి ఇచ్చినట్లు ఎగ్రిమెంట్‌ అయింది. కొన్నేళ్ళు గడవడం వలన కొత్తతరం, వాళ్ళకి అసలు వాళ్ళ భూములను గవర్నమెంటు తీసుకుంది అన్న సంగతి మరచిపోయారు. వాళ్ళు పక్కన ఉన్న భూములను కూడా కలుపుకుని సాగు చేయడం మొదలుపెట్టారు.
రాజుసాహెబ్‌కి అంతా తెలుసు. అయినా మౌనంగా ఉన్నారు.
లగ్గు, చురచు కొండల మధ్య కేదలా ఝర్‌ఖండ్‌, లయియో, రాహే, పచమో, బసంత్‌పుర్‌, బుంజీ, బారు ఘట్టు, ఝరనా, పరసాలేడా, నాలా డీహ్‌, ఘసీ, తాపిన్‌, కజరల అడవులలో రాజా
కామాఖ్యా నారాయణ గారికి నల్లబంగారం నిధి దొరికింది. ఎక్కడో భూగర్భంలో నిధులున్న చిత్రాలు కనిపిస్తే చెప్పరాని ఆనందం కలుగుతుంది. ఆశ్చర్యం కలుగుతుంది. గౌరవభావం కలుగుతుంది. అదేవిధంగా తన భూములలో బొగ్గులనిధి ఉందన్న విషయం తెలియగానే ఒక్కసారిగా ఎగిరి గంతేసారు. 1952 సం||లో పాతడ్రిల్లింగ్‌, సర్వే రిపోర్ట్‌ల సహాయంతో ఆయన ప్రభుత్వ చట్టాలను పక్కన పెట్టి ఇంకా చెప్పాలంటే ఈ చట్టాల నుండి రక్షించుకోడానికి చేయవలసిందంతా సిద్ధం చేసుకుని ఎన్నో బినామి కంపెనీల ద్వారా గనులను తప్పించే పని మొదలుపెట్టారు. కుజుక్షేత్రంలో బయట కంపెనీలకు ముఖ్యంగా బెంగాలీ, మర్వాడీ, పంజాబీల కంపెనీలకు లీజ్‌పైన ప్లాట్‌ ఇచ్చారు. ఇవన్నీ ఆయన అధికారంలో ఎంతమాత్రం లేవు. ధన్‌బాద్‌ నుండి, ఝరియా నుండి పెద్ద-పెద్ద కంపెనీల వాళ్ళని పిలిపించి పట్టాలు కూడా ఇచ్చారు. బొగ్గు గనులలో తవ్వకాలు మొదలు పెట్టడానికి 111 పెట్టుబడితో పాటు మానవ శ్రమ, సరియైన ఏర్పాటు కూడా కావాలి. దీనికోసం ఎంతో కష్టపడాలి. తన రాజసంతో పాటు ఒక వ్యాపారి వ్యాపార కుశలత, కోమటి బుద్ది గల రాజాసాహెబ్‌ తన దర్‌బార్‌లో కాంట్రాక్టరుల ఒక గుంపును తయారు చేసారు. తన జమీందారిలో ఉన్న సిబ్బందితో పాటు కోర్టు – కచహారీలోని సిబ్బందికి జడ్జీలకు ప్లాట్లను పంచి పెట్టారు. వీళ్ళందరిని తన ఈ అవినీతి వ్యాపారంలో భాగస్థులుగా చేసారు. తన రాజ్యంలోని పెద్ద పట్టణాలు, అభివృద్ధి చెందిన నగరవాసుల నుండి భూస్వాములు, జమీందారులు, సర్‌పంచ్‌ల వరకూ విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్స్‌లర్‌, తన భవనంలో తన కింద పనిచేసే నౌకర్లు, చాకలాళ్ళు మొదలైన వాళ్ళందరికి వాళ్ళ అంతస్థులను బట్టి ప్లాట్లకు పంచారు. ఆయన తన బినామీ కంపెనీల ద్వారా పెద్ద-పెద్ద వాళ్ళతో ఉత్పత్తి అమ్మకాలకు సంబంధించిన అగ్రిమెంటు చేసి తవ్వకాల నియమాలను చట్టబద్ధంగా పాటించినట్లుగా అయిందనిపించారు. ఈ అధికారులతో పాటు ఇంకా ఎందరో కాంట్రాక్టర్లు కలిసి ఉన్నారు. కార్మికుల నోట మట్టికొట్టి వాళ్ళ నోళ్ళు మూయించి రాజాగారి బొక్కసాన్ని నింపడానికి వాళ్ళ శ్రమను దోపిడీ చేసేవారు. తమ కడుపులు నింపుకునేవారు. ఈ విధంగా రాజుగారు ఇంట్లోనే కూర్చుని రాయలిటీని పొందే మార్గం చూసుకున్నారు. ఆయన ఒక్క నయాపైసా పెట్టుబడి లేకుండా తనకోసం నెలకు లక్షలక్షల రూపాయలు ఆదాయంగా పొందేవారు. ఆయన పరేజ్‌ బంగ్లా దగ్గర తన చెక్‌పోస్టు పెట్టించారు. బొగ్గు తీసుకువెళ్ళే ట్రక్కుల ట్రిప్పులను నోటు చేసుకుని, తూచడానికి రసీదు ఇచ్చేవారు. ఆ రసీదు ప్రకారం రాజ్‌సాహెబ్‌ ద్వారా పెట్టుబడిన తూచే యంత్రం పైన బొగ్గును తూచేవారు. రాజాసాహెబ్‌ దగ్గర ఉండే నమ్మకస్తులు కొంత సొమ్మును రాబట్టుకునేవాళ్ళు. రాజాసాహెబ్‌ దగ్గర ఉండే నమ్మకస్తులు కొంత సొమ్మును రాబట్టుకునేవాళ్ళు. రాజాసాహెబ్‌ మైనింగ్‌ మేనేజర్‌ని కూడా నియమాకం చేసారు. ఈ నియమకం రక్షణకోసం కాదు, నియమాలను అమలుపరచడానికి కాదు, నియమాలను ఉల్లఘించడానికి ఖనన సురక్షా విభాగ్‌ కళ్ళల్లో దుమ్ము కొట్టడానికి మాత్రమే. ఒక్క నయాపైసా పెట్టుబడి లేకుండా లేశమాత్రం శ్రమ లేకుండా పద్మామహల్‌లోకి ధనం చేరిపోయేది. కొంత భాగాన్ని రాజాసాహెబ్‌ దగ్గరి నమ్మకస్తులు తమ జేబులలో నింపుకునేవారు. ఊళ్ళో పెద్ద మనుషులుగా చెలామణి అయ్యే వాళ్ళకు కూడా రూపాయిలో నాల్గు అణాలు లాభించాయి.
గనుల తవ్వకాలు ఎక్కువ అవుతున్నాయి. అడవులలోని చెట్లన్నీ కొట్టేస్తున్నారు. అడవులు మాయం అవుతున్నాయి. గనులు గ్రామీణ ప్రజల పొలాలు మించేస్తున్నాయి. ఎవరు తిరుగుబాటు చేయకుండా, ఎదిరించకుండా వ్యవహార దక్షత గలరాజు ముందు చూపుతో పనులన్నీ చక్కపెట్టారు. గ్రామంలో పేరు ప్రతిష్ఠలు కలవారికి నాలుగు అణాల భాగస్వామ్యంకి సంబంధించిన పట్టాలను కాంట్రాక్టర్ల ద్వారా ఇప్పించారు. గ్రామంలోని భూమిహీనులకి అందులో పని ఇప్పిస్తానని చెప్పారు. ఈ పని చాలా కష్టతరమైనది. ఎనిమిది అణాలు ఇస్తానన్నారు. సమృద్ధ మహతోలు, సాల్‌-సూడీ కాంట్రాక్టర్ల బాగస్వాములు, పట్టేదారులయ్యారు. శ్రమ జీవులైన బీద మహతోలు, సూడీ-సాబ్‌, కర్‌మాలీ, తూరీ, అంసారీ, జులాహే, గంఝా, ఘాసీ, భుమివాసం, మాంఝీ మొ||వారు ఆ గనులలో సీజనల్‌, కాజ్యుయల్‌ లేబర్‌గా పనిచేయడం మొదలుపెట్టారు. వర్షాకాలం ఈ కార్మికులే ధనవంతులైన మహాతోల, సుడీ-సాల్‌ల పొలాలలో పొలం పనికి కూలీలుగా వెళ్ళేవారు. నారు పోయ్యడం, మొక్కలు నాటడం, కోతలు కోయడం, వంటి పనులు చేసేవారు. ఈ ఊళ్ళల్లో ఆర్ధికంగా, సామాజికంగా, సమృద్ధమహతో, సుడీ-సాబ్‌, అంసారీ పొలాలో పనిచేసే మహాతోలు, అంసారీ,సుడి-సాత్‌ల మధ్య పెద్ద తేడాలేదు. కాని క్షయుత్రులు, భూమిహార్లు, బ్రహ్మణకుటుంబాలు తక్కిన జాతుల మధ్య ఆర్ధికంగా స్థితిలో ఎంతో తేడా ఉండేది. ఈ విధంగా నాలుగు వర్గాల వ్యవస్థ తయారయింది. కంపెనీ రాజాసాహెబ్‌ది. ఏజెంట్లు, అధికారులు క్షత్రియులు కాంట్రాక్టర్లు. పెద్ద వ్యాపారస్థులందరు భూమిహార్‌, బనియా (కోమట్లు) బ్రాహ్మణులు. పై కులాల వాళ్ళందరు అంతో ఇంతో ధనవంతులు కూలి-నాలి చేసేవాళ్ళందరు వెనకబడ్డ తరగతి వాళ్ళు, దళితులు-ఆదివాసీలు, పై కులాల వాళ్ళు లారీలు తీసుకుని అహంకారంతో తిరుగుతూ ఉంటారు. తక్కువ కులాల వాళ్ళపై తమ బలప్రదర్శనను చూపిస్తూ వాళ్ళను భయపెట్టి బాధపెట్టి తమకింద అణిగి మణిగి ఉండేలా చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూలిపని చెయ్యరు. కూలిపని చెయ్యడం, పొలం పనులు చేయడం అంటే కులం నుండి బహిష్కృతులు కావడమే. ముఖ్యంగా ఛోటా నాగ్‌పూర్‌లో వంద ఎకరాలు ఉన్న యజమాని చపరాసి పని చేయడానికి సిద్దపడతాడు కాని బీడుపడ్డ పొలాన్ని దున్నడం తన గౌరవానికి భంగం అని అనుకుంటాడు. నాన్‌-మెట్రిక్‌, మెట్రిక్‌, ఇంటరు, గ్రాజుయేట్‌ అయిన యువకులు బిరకాయ పీచు సంబంధం ఉన్న బాబాయిలు, పెదనాన్నలు, మామయ్యలు, బావమరుదులను, బావగార్లను వెతికి-వెతికి వాళ్ళ దగ్గర ఏభై వంద రూపాయాలకు గుమాస్తా పని చేయడానికి బయలు దేరేవారు. కూలీలను ఏర్పాటు చేయడానికి దలాల్‌ (మధ్యస్థులు) వర్గం ఒకటి కొత్తగా తయారయింది. ఈ కూలీ వాళ్ళని గుంపులు-గుంపులుగా తీసుకురావడానికి దగల్‌-సర్‌దార్‌ వర్గం మరొకటి తయారయింది. కాంట్రాక్టర్లు తమ-తమ బంధువుల చేత రేషన్‌ దుకాణాలను తెరిపించారు. తమ కూలీలకు అక్కడే అప్పుమీద సరుకులు ఇప్పించేవారు. ఈ విధంగా సరుకులను తక్కువ తూస్తూ అప్పులు  మీద వడ్డీ వసూలు చేస్తూ వీళ్ళు తమ ఆదాయాన్ని ఇంకా పెంచుకున్నారు. దంగల్‌ సర్‌కార్‌ ఏపని చేయకుండా పదిశాతం కమీషను పొందేవారు.
సాధారణంగా మొదట్లో ఊళ్ళోని మహతోలు, ఆదివాశీలు బొగ్గు గనులలో పనిచేయడానికి భయపడేవాళ్ళు. అందువలన గనులలో పని చేసేవాళ్ళు కారు. అసలైతే అంతో-ఇంతో పొలంపైన అడవిలో దొరికే మహవా పైన ఆదాయం వచ్చేది. ఇంకా కొంత అడవులలో ఉత్పత్తి అయ్యే వాటిమీద కూడా సంపాదించేవారు. కాని సంవత్సరంలో మూడు నెలల ఖర్చుకు మాత్రమే ఈ సంపాదన సరిపోయేది. వర్షాభావం వలన బయట పనులకు వెళ్ళేవారు. తక్కువ కూలీ వలన గనులలో పనిచేసినా వాళ్ళకు గడిచేది కాదు. ఈ గనులకు చుట్టు పక్కల ఉన్న గ్రామాలు, ముఖ్యంగా మాండూ, గోమియాలలో చాలామంది రైతులకు రిజిస్టర్‌లో భూమిని సాగుచేసే హక్కు ఉంది. దీనికింద కుటుంబం పెద్ద దౌతుంటే సరిహద్దులలో ఉన్న అడవిలోని చెట్లు చేమలు కొట్టి (రిజిస్టర్‌ ప్రకారంగా) భూమిని సాగుచేసి ధాన్యాన్ని పండించవచ్చు. వీళ్ళని అక్కడి నుండి తొలిగించే అధికారం ప్రభుత్వానికి కూడా లేదు. ప్రభుత్వం దీనిపై కూలీ కూడా నిర్ధారణ చేయాలి. కొన్ని రిజిస్టర్లలో ఇట్లా రాసి ఉంది- ”రైతు అనుమతి తీసుకోకుండానే భూమిని సాగుచేసి పొలాన్ని చేసుకోవచ్చు”. కొన్నిట్లో కలెక్టర్‌ అనుమతి తీసుకోవలన్న షరతుఉంది. కాని రైతు ప్రభుత్వానికి సూచన ఇచ్చినా ఇవ్వకపోయినా అక్కడి నుండి తొలగించే అధికారం ప్రభుత్వానికి లేదు. రైతుకి తన భూమి ప్రభుత్వానికి చెందదు అన్న ఒక నమ్మకం ఏర్పడింది. సర్‌నిషన్‌ 1908 సం||లో హజారీబాగ్‌ జిల్లాలో (ఆరోజుల్లో గిరీడీహ్‌ హజారీబాగ్‌కి సబ్‌ డివిజన్‌గా ఉండేది) పర్యటించారు. అక్కడి రైతుల బీదరికాన్ని చూసి, రాజులు, జమీందారులు చేస్తున్న అత్యాచారాలు-అన్యాయాలను రైతులు ఎదిరించకుండా వీళ్ళ భూముల మీద చాలా తక్కువ శిస్తు వేసారు. రైతుకి ‘ఖుంట్‌ కట్టీ’ అనే అధికారం ఉండేది. వాళ్ళు అడవులను  కొట్టడానికి, నదులకు ఆనకట్టలు వేయడానికి స్వతంత్రులు. ఈ విధంగా వాళ్ళు సంత్సరానికి పరిపడే ఉత్పత్తి చేసుకుంటూ ఉండేవాళ్ళు. కొంత అడవులపైన కూడా ఆధారపడేవాళ్ళు. వీళ్ళ ఆదాయం క్వారీలతో కూలి కన్నా ఎక్కువగా ఉండేది. నిజానికి తక్కిన పనులకన్నా ఈ బొగ్గు గనులలో పని చేయడం కష్టదాయకం. అక్కడి వాతావరణం వలన వాళ్ళకు కడుపులో తిప్పేది. అందువలన ప్రారంభంలో ఆదివాసీలు, ఆదివాసీలు కానివారు వీటిల్లో పనిచేయడానికి ఇష్టపడేవాళ్ళు కాదు.
బొగ్గు గనుల తవ్వకాలు చాలా పెరిగాయి. దీనివలన ఒకవైపు అడవులు మాయం అవుతుంటే, పొలాలలో బొగ్గుల పొగ అంతటా వ్యాపించడం వలన పంటలు పండటం లేదు. అసలే బావులలో ఎక్కువగా నీళ్ళు లేవు. అందులోనూ విస్ఫోటం జరగడం వలన ఇంకా ఎండిపోసాగాయి. ఒకవైపు నీటి గొడవ ఇట్లా ఉంటే మరోవైపు ప్రభుత్వం కొత్త-కొత్త చట్టాలు ప్రవేశపెట్టి అడవులలో వాళ్ళకి ప్రవేశం లేకుండా చేసింది. దానివలన వీళ్ళమీద, అడవుల వనరులమీద, భూమిమీద తరతరాల నుండి వస్తున్న హక్కులు లేకుండా పోయాయి. ఏడాదిలో దాదాపు తొమ్మిది నెలలు అడవి తల్లి ఇచ్చే సంపద మీద వాళ్ళ బతికేవారు వర్షాకాలం, మహవా (ఇప్పుపూలు) దొరికే సమయం వదిలేస్తే ఊరి ప్రజలు కూడా గనులలో పనులు చేయడం ప్రారంభించారు.
తక్కిన కూలి వాళ్ళలాగా కాకుండా వీళ్ళు పొద్దుటి నుండి సాయంత్రం దాకా పని చేసి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. అందువలన వీళ్ళకు కూలి చాలా తక్కువగా దొరికేది. గనులలో పర్మినెంట్‌గా పనిచేయడానికి కార్మికులు కావాలి. అందుకని ఏజెంట్లు దూరదూర ప్రదేశాలలో ఉండేవారిని తీసుకు వెళ్ళేవాళ్ళు. ఎక్కడైతే కరువు-కాటకాలు వచ్చేవో అక్కడ తిండికి గతిలేకపోవడం వలన, అక్కడి నుండి కూలీలను తీసుకువచ్చేవారు. మధ్యప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌, రాయగఢ్‌, బెంగాలులోని పురూలియా, బిహారులోని గయ, ఛోటా నాగపూర్‌లోని పలామా, రాంచి, చాయ్‌బాసా, సింహ భూమ్‌ మొ||లైనవి, దుముకా జిల్లా కూలీలను సప్లై చేసే అడ్డాలుగా ప్రసిద్ధి చెందాయి. ఉత్తరప్రదేశ్‌లో బలియా, గోరఖ్‌పుర్‌ల నుండి అధిక సంఖ్యలో కూలీలు ఏజెన్సీల ద్వారా వచ్చేవాళ్ళు. వీళ్ళని కాంపులలో ఉంచేవాళ్ళు. వీళ్ళకి కాష్‌ ఇచ్చే వాళ్ళు కాదు. రాకపోకలకి అయ్యే ఖర్చుని కట్‌ చేసి వాళ్ళ – వాళ్ళ ఇళ్ళకి మని ఆర్డర్‌ ద్వారా డబ్బులు పంపించేవారు. కాంపులో ఉండే సూపర్‌వైజర్‌ వాళ్ళకి ‘గాడ్‌ ఫాదర్‌’. వాళ్ళకి శిక్షలు కూడా వేసేవాడు. బయట ప్రపంచంలో వాళ్ళకి సంబంధాలు ఉండకూడదు. ఇటువంటి ఏజెన్సీలకి ప్రభుత్వం లైసెన్స్‌ ఇచ్చేది. ఈ లైసెన్స్‌ ఒకరకంగా వాళ్ళ చేత వెట్టి చాకిరీ చేయించడానికి మాత్రమే అని స్పష్టం అవుతోంది.
ఒరిస్సాలోని గంజామ్‌ జిల్లా కూడా కూలీల అడ్డాకి ప్రసిద్ధి చెందింది. వాళ్ళపై సర్‌దారులదే పెత్తనం. సర్‌దార్‌ తనకు ఇష్టమైన వాళ్ళకే పని ఇస్తాడు. ఈ కార్మికుల వేతనంపై వాళ్ళకు పూర్తి హక్కు ఉంది. కార్మికుల వేతనాలని వాళ్ళు వసూలు చేసి తమ-తమ కమీషన్‌ను తీసుకుని తక్కినవి వాళ్ళకు ఇచ్చేవాడు. సంపాదనలో పదిశాతం సర్‌దార్‌ తీసుకుంటాడు. ఒరిస్సా కూలీలు ఒక గుంపుగా వచ్చేవాళ్ళు రాంచి, చాయ్‌బాసా నుండి కేవలం ఆడవాళ్ళే కూలి పనికి వచ్చేవారు. తట్టలు ఎత్తడానికి, అన్నం వండడానికి తమతోపాటు మహా అయితే ఒక మొగవాడిని తెచ్చుకునేవారు. బిలాస్‌పూర్‌, రాయగఢ్‌ ల నుండి రవిదాసు-సతానయే జంటలు – జంటలుగా వచ్చేవారు. పలామాకి చెందిన కెవట్‌, చౌధరీలు ఒంటరిగా వస్తూ వుండేవాళ్ళు. కాని గయకి చెందిన నునియా, భుయియాం, చౌహాన్లు జంటలు జంటలుగా వచ్చేవాళ్ళు, గోరఖ్‌పూర్‌, బలియాల నుండి మొగకూలీలే వచ్చేవారు. గనులలో ఎంత లోతుకైనా కూడా వీళ్ళు వెళ్ళే వాళ్ళు. బిలాస్‌పూర్‌ కూలీలు గనులలోతుల్లోకి వెళ్ళే వాళ్ళు కాదు. వాళ్ళు ‘పోఖరియా’ గనులలో జంటలుగా పని చేసేవాళ్ళు. వీళ్ళని బొగ్గు పురుగులు అని అనేవారు.

(ఇంకావుంది)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో