మాంసం ఒడియా మూలం : ప్రతిభరాయ్‌, అనువాదం : జయశ్రీ మోహన్‌ రాజ్‌

ఠక్‌… ఠక్‌ …. ఠక్‌…. బుదెయి పుర్రె మీద సుత్తితో ఏకాగ్రతతో కొడ్తున్నాడు సంధు నాయక్‌. బుదెయి చిక్కిన యెముకల గూడు లాంటి శరీరం కటిక నేల మీద వెల్లకిలా పడి ఉంది. ముండ్లపొదలతో, రాళ్ళూ రప్పలతో నిండి ఉన్న నేల అన్నా, గుచ్చుకుంటున్న ముండ్లన్నా బుదెయికి పట్టట్లేదు, సంధు నాయక్‌కి కూడా పట్టట్లేదు. పై నుంచి యెండ నిప్పులు చెరుగుతూంది. వైశాఖ మాసపు తక్షణమైన ఎండ, ధూళితో నిండిన గాడ్పు శరీరాన్ని కాలుస్తూంది. ఇదేమీ పట్టనట్లు బుదెయి వెల్లకిలా పడి ఉంది. సంధు నాయక్‌ బుదెయి పుర్రె మీద కత్తి ఆన్చి సుత్తితో అదేపనిగా కోడ్తున్నాడు. పుర్రెను పగల గొట్టి లోపలి సుత్తితో అదేపనిగా కొడ్తున్నాడు. పుర్రెను పగల గొట్టి లోపలి మెదడుని బయట పడేస్తే సంధునాయక్‌ పని అయిపోతుంది.
కొంతదూరంలో ఇద్దరు పోలీసులు నిలబడి ఉన్నారు. బీడీ దమ్ము పీలుస్తూ సుఖదుఃఖాలు మాట్లాడుకుంటున్నారు. మనసులో సంధుని తిట్టుకుంటున్నారు, ఇంకెతసేపు యెండలో నిలబెడ్తాడని, ఆడదాని పుర్రె పగుల గొట్టడానికి యింతసేపు పడ్తుందా అని. యువకుడు డాక్టరు ఇంకొంత దూరంలో నిలబడి ఉన్నాడు. అతని ముఖం వాడిపోయి ఉంది, మనసులో ఉత్సాహం లేదు. కొత్తగా పెళ్ళయింది, నిన్న రాత్రే భార్య తిరిగి కాపురానికొచ్చింది. ఆమె ఒంట్లో బాగులేదు. మొదటి సంతానం పుట్టె ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. అడవి మధ్య ఉన్న ఈ చిన్న ప్రైమరి హెల్త్‌ సెంటర్‌లో ఆమెను ఉంచే ధైర్యం లేదతనికి. అందుకే పుట్టింట్లో ఉంటూంది. నాలుగైదు రోజులు ఉండిపోదామని తమ్ముడితో వచ్చింది. తొందరగా పని ముగించుకుని డాక్టరు ఇంటికి వెళ్ళి భోజనం చేద్దామని కూర్చున్నాడు. ఈ రోజు మధ్యాహ్నం కొంచెం విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడు. తనులేనప్పుడు కంపౌండరు ఆస్పత్రిని చూసు కుంటాడు. భోజనం ముగించి లేచాడో లేదో ఈ గొడవొచ్చిపడింది. పట్టణంలో కష్టపడి ఆరు సంవత్సరాలు చదువుకుని ఈ మారుమూల, ఈ అడవి జంతువుల మధ్య పడి ఉండాల్సి వస్తుందని యెవర నుకున్నారు? కొత్త ఉద్యోగం. మంచి చోట పోస్టింగ్‌ చేయించు కోడానికి అతని దగ్గర అర్థబలంలేదు, పై నుంచి రికమెండేషన్లు లేవు. అందువల్ల ఈ మారుమూల ప్రదేశంలో ఎన్నాళ్ళు ఉండాల్సి వస్తుందో చూడాలి. అప్పుడప్పుడు యిలాంటి బీభత్సం చూడాల్సి ఉంటుంది. ఇలాంటి యిష్టలేని పనులు చేయాల్సి ఉంటుంది. సర్కారు ఉత్తర్వు చేయక తప్పదు. ముక్కుకి రుమాలు అడ్డం పెట్టుకుని బుదెయి శరీరాన్ని, పనిచేస్తున్న సంధు చేతులవైపు చూస్తూ నిలుచున్నాడు. అక్కడ యింట్లో భార్యకు చిరాగ్గా ఉంటుంది. కాని అతనేం చేయలేడు.
మరికొంత దూరంలో చెట్ల నీడల్లో ఓ ఆరేడుగురు మధ్య వయస్కులు కూర్చుని ఉన్నారు. ఉలుకూ పలుకూ లేకుండా, రాతిమొద్దుల్లా ఉన్నారు. మత్తులో చిత్తైన వారి కళ్ళు యింకా చిన్నగా అయ్యాయి. రెండ్రోజుల్నుంచి కడుపులోకి ఆహారమెళ్ళ లేదు. తెచ్చుకున్న సారా దారిలోనే ఖర్చయిపోయింది. లోయలో ఉన్న ఊళ్ళో నుండి కొంతకొని తెచ్చుకుందామంటే పైసల్లేవు. కడుపుకి తిండిలేక గొంతులోకి సారాలేక అల్లాడుతూ కొండెక్కి తమ ఊరుకి వెళ్ళాలి. సూర్యదేవుడు దిగిపోయేలోగా సంధు నాయక్‌ తన పని ముగించిన తర్వాత డాక్టరుబాబు పోలీసులకు కాగితం యిస్తాడు, శవం తమ చేతికొస్తుంది. ఆ కుళ్ళిపోయిన  కోసేసిన శవాన్ని తిరిగి ఊళ్ళోకి తీసుకెళ్ళరు. అడవిలో యెక్కడో పాతేసి వెళ్ళిపోతారు. పాతిపెట్టకపోతే సర్కారు నియమాన్ని పాటించలేదని జైలుకెళ్ళాల్సివస్తుంది.
బుదెయిపోరి శవం నుంచి కుళ్ళిన, నీచు వాసనతో కూడిన గాలి వారి మొహాలమీద కొచ్చి కొడుతూంది. ఆ ఘాటు వాసనకు ఈగలు కాదు కదా ఆకాశంలో గెద్దలు కూడా యిటువైపు రావడం లేదు. ఊరకుక్కలు రెండు తోకలు ముడుచుకుని పారిపోయాయి, శవం నుండి దూరంగా ఆ దుర్గంధం చెట్లనూ, ఆకులనూ అలముకుంది. ఆకులు కూడా చెట్లను విడిచి దూరంగా ఎక్కడికో అడివిలోకి యెగిరిపోదామా అన్నట్లు అనిపిస్తున్నాయి. ఎండతో కూడిన దుర్గంధం. కడుపులో దేవినట్లుంది, వాంతికొస్తున్నట్లుంది. కాని సర్కారు పని, అక్కడ నిలబడే ఉండాలి, తప్పదు.
పోలీసులు బీడీ తర్వాత బీడీ, సిగరెట్టూ కాలుస్తూ ఆ పొగతో తమ చుట్టూ ఓ దుర్గంధ నిరోధక వలయాన్ని యేర్పరచుకున్నారు. సంధు నాయక్‌ మాత్రం ముక్కుకి గుడ్డ కట్టుకోలేదు. చేతులకు మాత్రం తొడుగులున్నాయి. అతనికి యేవాసనా పట్టట్లేదు. శవం మొహం మీదకు వంగి పుర్రెను పగలగొట్టే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నాడు.
కిందటి ఆదివారం బుదెయి కొండమీంచి చీపుళ్ళు, పనసకాయలు తలమీదతెత్తుకుని ఖయిరిపుట సంతకు అమ్మేందుకు వచ్చింది. ఆమెతో భర్త సోమకిర్సాని కూడా ఉన్నాడు. బొండా జాతి అమ్మాయిలందరూ దూరం నుండి ఒకేలా కనిపిస్తారు. అందరి తలలూ గుళ్ళే. రకరకాలైన పూసలు తాటి, ఈత రేకులతో తయారైన పట్టీలను గుండ్లను చుట్టుకుని ఉంటారు. బొండా జాతి ఆడపిల్లల తలకు పూసలతో తాటి రేకుల్తో చేసిన ఆభరణాలతో తలను అలంకరించుకుంటారు గాబట్టి యేడాది పిల్లలుగా ఉండగానే తలబోడించుకుని తిరుగుతారని తెలియదు. వారి మొహాలు లేతగా ఉంటాయి. కళ్ళు సిగ్గుతో వాలిపోతూ, పెదాలపై యెల్లప్పుడూ చిరునవ్వు పూస్తూ ఉంటాయి. మాటలు చాలా నెమ్మది, గట్టిగా మాట్లాడడమే తప్పు అన్నట్లు. బొండా జాతి మగవాళ్ళు యెంత కోపిష్టులో, హింసకు వెనుకాడనివారో, దూకుడు ఉన్నవారో వారి ఆడవాళ్ళు అంత నెమ్మదస్తులు, శాంతిప్రియులు, కోమల మనస్కులు, ఓర్పుకలవారు. ఊరంతా వెదికినా పట్టుమని యిద్దరు దూకుడుగల అమ్మాయిలు కనిపించరు. అందరూ ఒకే మూసలో పోసినట్లుంటారు. మెడనిండా ఓ పది పన్నెండు పూసలతో చేసిన తొడుగులుంటాయి. ఆ పూసల తొడుగులతో నిటారుగా ఉన్న మెడపై పెదాలు మొహం. తలపై బుట్టగాని నీటి కుండగాని పెట్టుకుని చేతులు విడిచి నడిచేందుకు ఆ మెడ తొడుగులు ఉపయోగ పడ్తాయో యేమో మరి. బొండా బిడ్డలు నగ్నంగా జన్మిస్తారు. బట్టలు లేకనే తిరుగుతారు. చీరా జాకెట్టు వారెరగరు. నడుము నుండి తొడల దాకా రంగు రంగుల పూసల సరాలు వేలాడుతుంటాయి, దేహాన్ని కప్పుతూ. కొందరేమో నాణేలతో, రూకలతో వేసిన మాల మెడలో వేలాడదీసి ఉంటారు. చూసిన వారికి లోపల బట్టల్లేవని తెలియనే తెలియదు సన్నని రంగురంగుల దారంతో తయారైన బట్టలేసుకున్నట్లు అనిపిస్తుంది. నడుముకి ఓ సన్నని చెయిను వేలాడుతుంటుంది. ముందరివైపు ఓ అడుగు వెడల్పున ‘కెరంగ’ గడ్డితో తయారైన కటి వస్త్రం నడుముకి ఉన్న చెయిన్‌లో దోపుకుని ఉంటారు. వెనుకభాగంలో ఎత్తైన పిరుదులపైన ఈ ‘కెరంగ’ గడ్డి వస్త్రం కప్పి ఉంటుంది. ఈ కట్టి వస్త్రం కుడివైపు నడుము దగ్గర ముడివేసి ఉంటుంది. వీపుపై ఆచ్ఛాదనం ఉండదు.
బొండా జాతి యువతులు నది ఒడ్డు సంత నుండి వరసగా నడుస్తూ వస్తుంటే వెనుక నుండి వారిని చూడ ముచ్చటగా ఉంటుంది. వారి పొడవైన కాళ్ళు, బలిష్టమైన పిక్కలు, తొడలు, ఆపైన రంగు రంగుల కటివస్త్రం ‘రింగ’ వారి కాలి పాదాల లయతో ఊగుతూ పొడవైన చేతులు, ముంజేతి వరకూ తొడిగిన దంతాల గాజులు, వారి కొలతకే చేయించినట్లుంటాయి.
బొండాజాతి యువతులు సంతలో కూర్చుని వ్యాపారం చేస్తున్నప్పుడు అది ఏదో నాట్య భంగిమ అనిపిస్తుంది. కట్టుకున్న ఆ చిరు ‘రింగ’ ఎక్కడ చెదిరిపోతుందో అన్నట్లు మోకాళ్ళు దగ్గరగా పెట్టుకుని ప్రార్ధిస్తున్నట్లు కూర్చుంటారు. మొత్తం శరీరం ఒకవైపుకి వంగిపోయుంటుంది, తొడలపై భాగం ఒక్క పిసరు కూడా కానరాదు. బొండా జాతి అమ్మాయిలు కూర్చునే భంగిమ చూడముచ్చటగా, అందంగా ఒకే రకంగా ఉంటుంది.
బొండా జాతి యువతులు దూరంనుండి చూడ్డానికి ఒకే రకంగా కనిపించినా దగ్గరకు వస్తే వేర్వేరుగా ఉంటారు, కళ్ళకు యింపుగా ఉంటారు. సంధు నాయక్‌ చాలాసార్లు బొండాల సంతకు వెళ్ళాడు. వస్తువులు కొన్నాడు. బుదెయి వద్ద వస్తువులు కొన్నప్పుడు ఆమెతో మాట్లాడి ఉన్నాడు కూడా. ఆమె మొహం మీంచి కళ్ళు తిప్పుకోవడం కష్టమే. అయితే ఆమెతో ఉన్న భర్త సోమ కిర్సాని యెర్రని తాగిన కళ్ళు చూస్తే తాతలు దిగి వస్తారు. బుదెయికన్నా వయసులో సోమ పది పన్నెండోండ్లు చిన్నవాడు. బొండా జాతి లో యిది సహజం. వరుడికన్నా వధువులు వయసులో పెద్దవారై ఉంటారు. సోమ వయసు ఇరవై, ఇరవై ఒకటి ఉండొచ్చు. బుదెయి వయసు ముఫ్పై ముప్పై రెండోళ్ళుండొచ్చు. వారికి పెళ్ళై పది పన్నెండేళ్ళయి ఉంటుంది. పెళ్ళప్పుడు సోమ సన్నగా, పీలగా ఉండేవాడు. బుదెయి చిన్నపిల్లలా ఉండెది.తన కడుపు కట్టుకుని సోమకి పెట్టి అతి జాగ్రత్తగా సాకింది బుదెయి. పొదలు కొట్టి భూమి సాగు చేయడంతో సహా అడవిలో కెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి వంట చేయడం వరకూ అన్నిపన్లూ బుదెయి చేసేది. సోమ యింకా చిన్నవాడు. భారి పన్లు చేయలేడు. ఎల్లప్పుడూ తాగి మత్తులో ఉంటాడు. చేతిలో బాణం, కత్తి, కొడవలితో తిరుగుతుంటాడు. చిన్న చిన్న విషయాలకే కోపం నసాళ్ళాన్నంటుతుందతనికి. బాణం వేయడం, కత్తి తిప్పడం, కటారులతో నరకడం – ఇవి రోజూ జరిగేవే. బొండాలకు చావంటే భయం లేదు. బొండా చంపుతాడు లేక చస్తాడు. చచ్చినవాడు ఆవలివైపుకి వెళ్తాడు చంపినవాడు కూడా కొండ ఆవలివైపుకి, జైలుకి వెళ్తాడు – పది, పన్నెండు, పద్నాలుగేళ్ళ శిక్ష పడ్తుంది.
ఎందుకు బొండాలు చీటికీ మాటికీ చంపడమో చావడమో చేస్తారు? చంపడం నరకడం మంచిపని కాదు. ఈ మాట బొండా అనేక మార్లంటాడు కాని ప్రతీ చిన్న మాటకూ కత్తి దూస్తాడు. అతని బుద్ధి వశంలో ఉండదెప్పుడూ. అందువలనే బొండా వంశం కడతేరుతూ ఉంది.
బుదెయి తన భర్తకు అడుగడుగునా జాగ్రత్త చెప్తూ ఉంటుంది. మాట మాటకూ సరిదిద్దుతూ ఉంటుంది. ”నువ్వు ఎవర్నీ చంపకూడదు. మనం పిల్లా పాపలతో సుఖంగా ఉండాలి. మనం బోలెడు తాటిచెట్లు నాటుదాం, కల్లు తయారు చేద్దాం, పండగ చేసుకుందాం.”
అయితే ఆ రోజు సోమ బుదెయి మాటను ఖాతరు చేసాడా? ఆ రోజు మత్తులో జోగుతూ ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఇంటిముందర పడెయిగుడలో ఉండే మంగళుడితో మాట్లాడుతూ కనిపించింది బుదెయి. బుదెయి నవ్వుతూ యేదో చెప్తూంది.
మూతలు పడుతున్న సోమ కళ్ళు నిప్పులు చెరిగాయి – సందేహంతో, కోపంతో, ప్రతీకార వాంఛతో. బొండా మగవాడి మనస్సులో యెల్లప్పుడూ సందేమమనే నాగుపాము చుట్టుముట్టుకుని ఉంటుంది. బొండా మగాళ్ళు చిన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళు భార్యలు వారి కంటే వయసులో పెద్దవారు. వయసులో, పొడవులో, బలంలో, రంగులో, యవ్వనంలో, పనీ పాటల్లో, సంపాదనలో, అన్ని విషయాల్లోనూ మగవాడికన్నా ఆడది ముందుంటుంది, బొండా మగవాడు వాళ్ళ ఆడవాళ్ళముందు దిగదుడుపే. అయితే అతని తప్పేంలేదు. అతను చిన్నవాడు – బుద్ధిలో, వయస్సులో, బలంలో కూడా, చిన్న వయస్సులో భార్యాభర్తల సంబంధం గురించి తెలుసుకుంటాడు – భార్య ఎదుట అన్ని విషయాల్లోనూ చిన్నతనమే. అంత చిన్న వయసు నుండే సాలీడులా సందేహం అతన్ని చుట్టివేస్తూ వస్తుంది. చీటికీ మాటికీ తల్లిదండ్రులనూ, అన్నదమ్ములనూ, ఊళ్ళో వాళ్ళనూ, బంధువులనూ సందేహంతోనే చూస్తాడు. తాను దగ్గర లేనప్పుడు పరాయివాడితో భార్యకేంపని? ఈ సందేహం వలలో పడి ఒకవేళ ప్రాణాలు తీసుకుంటాడు లేకపోతే తీస్తాడు, జైలు కెళ్తాడు.
సోమ చేతిలోంచి బాణం దూసుకెళ్ళి మంగళ ధంగర మరి వీపుకి గుచ్చుకుని ఉండేది. బొండా మగవాడి గురి తప్పదు. బుదెయి ‘ఆగు, ఆగు’ అంటూ ముందుకొచ్చింది. మంగళను బాణం నుండి రక్షించేందుకో, మగాడ్ని జైలు నుండి రక్షించేందుకో ఆమె బతికి ఉంటే తన ఉద్దేశ్యం చెప్పి ఉండేది. కాని బుదెయి బతకలేదు. మగడి బాణం ఆమె గుండెల్లో యెడంవైపు గుచ్చుకుంది. నాలుక కరుచుకుని నేలకొరిగింది బుదెయి. విప్పారిన కళ్ళతో మగడివైపు చూస్తూంది. ప్రాణం ఎగిపోయింది.
మంగళ పరుగెత్తుకెళ్ళి కొండదిగి కింద మహలిగడ పోలీసు స్టేషన్‌లో విషయం చెప్పాడు. పోలీసులొచ్చారు. సోమను తీసుకుని వెళ్ళారు. సోమ చేసింది ఒప్పుకున్నాడు. ”నేను బుదెయిని చంపాలని అనుకోలేదు. మంగళను చంపాలనుకున్నాను. బుదెయి అడ్డం వచ్చింది. నా పెళ్ళామంటేనాకు ప్రేమ. పనిమంతురాలు. నన్ను బాగా చూసుకునేది. మధ్యాహ్నంలో మంగళకు నా పెళ్ళాంతో యేం పని? మంగళ కోసం నా పెళ్ళాం నా బాణానికి గురైంది.” సోమ యేడ్చాడు.
నిజానికి బొండాలలో అంతచావులూ చంపడాలూ జరిగినా భార్యలనెప్పుడూ ఎవరూ చంపలేదు. బొండా పడుచులు ఆప్రాంతంలో నిర్భయంగా తిరుగుతారు. మగవాళ్ళనే చావు తరుముతూ ఉంటుంది. కక్షలూ, చంపుకోవడాలూ మగవాళ్ళ మధ్యనే. బొండా పడుచుల వైపు వేలెత్తేందుకు సాధ్యం కాదు ఎవరికీ. స్త్రీజాతిని బొండాలు గౌరవిస్తారని, కాపాడతారు. స్త్రీలకు తమ భర్తల ప్రాణాల పట్ల మాత్రమే భయం.
సోమ జైలుకెళ్ళాడు గాని బాగా భయపడ్డాడు. పులిని చంపబోయి మేకను చంపినట్లయింది సోమ యింట్లో. బుదెయి ప్రాణం కోల్పోయిపడి ఉంది. గుండెల్లో బాణం యింకా గుచ్చుకునే ఉంది. పోలీసులొచ్చారు. సోమ తండ్రి, అన్న భయంతో బిగుసుకుపోయి నిల్చుని ఉన్నారు. వాళ్ళకు తెలుసు ఆ తర్వాత జరిగే తంతు. బుదెయి సంపాదన పోయింది. దానికి తోడు ఇప్పుడు యెంత చేతి చమురు వదుల్తుందో యేమో! బొండాలు యొక్కణ్ణించి తెస్తారంత డబ్బు! మామిడి, పనస తాటిచెట్లు, పశువులు అన్నింటినీ తాకట్టుపెట్టాలి. లేదా యాజమాని యింట్లో పిల్లాజెల్లా అందరినీ పాలేర్లుగా చేర్చి డబ్బు తేవాలి. శవాన్ని కొండ కిందకు మోసుకెళ్ళాలి. దాన్ని డాక్టరుగారు కోసి లోపలేముందో చూస్తారు. కాగితం రాసిస్తారు. ఆ కాగితాన్ని పోలీసులు చూసిన తర్వాతే కుటుంబంలో వాళ్ళు తిరుగు ముఖం పడ్తారు. లేకపోతే ‘ఖూనీ’ కేసులో అందరూ యిరుక్కుంటారు. బొండాలకు ఇలా జైలులో యిరుక్కోవడమంటేనే భయం. జైల్లో రెండు పూటలూ అన్నం, పప్పు ఇస్తారు. కాన సారా ఉండదు. ఇల్లూ వాకిలీ పండగలూ ఉండవు. బొండాలకు జైలు నరకం.
సంధు నాయక్‌ తనపని చేస్తూపోతున్నాడు. ‘సోమ తండ్రి యెంత అప్పు చేశాడో యేమో’. సంధు నాయక్‌కు తెలియదు. ఊళ్ళో పోలీసుకి యెంత ఇచ్చాడో కూడా తెలియదు. డబ్బులివ్వకపోతే పోలీసులు బొండాలను విడిచిపెట్టరు. ఖూనీకేసు చిన్నదేంకాదు. డబ్బు తీసుకుని పోలీసులు సోమ తండ్రి లచ్మకిర్మానితో అన్నారు ”శవాన్ని తీసుకుని కొండ కిందకు వచ్చెయ్‌. మేం ముందు వెళ్ళాం. నిన్ను విడిపించే ప్రయత్నం చేస్తాం. కంగారు పడొద్దు”.
సోమ తండ్రి, అన్నలు ఊళ్ళో ముగ్గురికి తిండిపెట్టి బతిమాలుకున్నారు శవాన్ని మోసుకుని కొండ కిందకు వెళ్ళేందుకు సాయం చేయమని. శవాన్ని పాడికట్టి కొండకింద వరకు మోసుకెళ్ళేందుకు నలుగురైనా కావాలి. దార్లో భుజాలు మారాలి. అండ్రాహాలు ఊరి నుండి ఖయిరీపురానికి ఎంత లేదన్నా ఇరవై అయిదు కిలోమీటర్ల దూరం ఉంటుంది. చీకటి పడ్తోంది. బొండాల కొండల్లో సూర్యుడు అస్తమించే దాకా నీడ కూడా పడదు. సూర్యుడు గయకొండ వెనక జారుతూనే హఠాత్తుగా అంతటా చీకటి కమ్ముకుంటుంది.
దివిటీలు పట్టుకుని ఆరుగురు మనుషులు శవాన్ని మోసుకుని ఆ భుజానికీ ఈ భుజానికీ మార్చుకుంటూ యెంత దూరమని నడుస్తారు? బొండాల కొండల్లోసంవత్సరం పొడుగునా చీకటే, కొండల్లో, చెట్లలో, ఊళ్ళలో, బాటల్లో, వాగుల్లో చీకటి దట్టంగా సిరాలా పరుచుకుని ఉంటుంది. చీకట్లో చీకటి తప్ప మరేం కనిపించదు. రాత్రి ముదులిగుడ పోలీస్‌ స్టేషను చేరుకుని శవాన్ని తప్ప మరేం కనిపించదు. రాత్రి ముదులిగుడ స్టేషను చేరుకుని శవాన్ని దించి అందరూ అక్కడే బయట కూర్చున్నారు. సూర్యోదయం కాగానే తిరిగి శవాన్ని భుజాలకెత్తుకున్నారు. ఆస్పత్రి చేరేసరికి శవం ఉబ్బి శరీరంలోంచి ద్రవం కారడం మొదలెట్టింది. శవాన్ని మోసుకుని వచ్చిన వారంతా ఆ ద్రవంతో తడిసిపోయారు. కోడలు చనిపోయిందని గాని కొడుకు జైలు పాలయ్యాడనిగాని సోమ తండ్రి లచ్మకిర్సాని దుఃఖించేందుకు తీరిక యెక్కడ? పోలీసుల బారి నుంచి కుటుంబాన్ని ఎలా రక్షించుకోవడమా అన్న చింతతో అతనికి ఆకలి దప్పులు గాని, దుఃఖంగాని, వాసనలుగాని తెలియడం లేదు.
మధ్యాహ్నం నుండి పోలీస్‌ స్టేషన్‌ దగ్గరున్న మొగలి పొదల దగ్గర పడి ఉంది శవం. అటువైపు నుండి వెళ్ళేవాళ్ళంతా రుమాలుతో ముక్కు మూసుకుని మొహం చిట్లించుకుని వెళ్తున్నారు. ఖూనీఖోరు బొండాలంటే మరింత చిరాకు పెరుగుతోంది. బాణంతో గాయపడిన కుళ్ళిన శవాన్ని పోస్ట్‌మార్టమ్‌ కోసం ఎందుకు మోసుకుని వస్తారో యేమో ఈ మూర్ఖులు! పోస్ట్‌మార్టమ్‌ చేసే బాధ్యత పోలీసులది. బొండా కుటుంబాలది కాదు. శవాన్ని కొండదించే బాధ్యత కూడా పోలీసులదే. శవాన్ని జీపులో వేసుకుని వచ్చి ఉంటే ఒకే రోజులో పనైపోయి ఉండేది. కాని ఇప్పటికే రోజున్నర గడిచిపోయింది. డాక్టరు వెనకాల, స్వీపర్‌ వెనకాల తిరగడానికి ఇంకా ఒకరోజు పడ్తుంది.
గాలి వీస్తున్నకొద్దీ శవం ఉబ్బుతూంది. కుళ్ళిపోతూంది. డాక్టరు రాననేశాడు. రాత్రివేళ ఏమీ చేయలేరు. అదికాక ఇలా కుళ్ళిపోయిన శవాన్ని అతని ముందుంచితే అతనైనా యేం చేస్తాడు? ఊరికే భీభత్సం చేయడం తప్ప. డిడాయి, గడబ, బొండాజాతి
ఆదివాసులందరిదీ ఒకే సమస్య – శవాల్ని ఆస్పత్రికి తేవడానికి మూడు రోజులు పడ్తుంది. కుళ్ళిపోయిన మాంసం ముద్దలాంటి శరీరాన్ని తెచ్చి డాక్టరు ముందు పడేస్తారు, ఏదో డాక్టరంటే మనిషి కాదు, వాసన, కంపుపసిగట్టలేని జీవిఅన్నట్లు!
రాత్రంతా చెట్టు కిందే పడి ఉంది శవం. ఆరుగురు బొండా జాతి వాళ్ళు కాపలా కాసేరు, నక్కలూకుక్కలూ శవాన్ని యూడ్చుకునిపోతే మళ్ళా పోలీసులు వాళ్ళనే పట్టుకుంటారు శవాన్ని మాయం చేశారని కేసుపెడ్తారు.
మధ్యాహ్నం వరకు డాక్టరు రావడం కుదరదు అనే అన్నాడు. లచ్మ కిర్మాని పోలీసుస్టేషను ఆస్పత్రిల మధ్య తిరిగి తిరిగి అలసిపోయాడు. ఆఖరికి డాక్టరు ఒప్పుకున్నాడు. ఇందులో అతనికి ఒరిగేదేం లేదు. బొండా జాతి వాళ్ళ కోసమని మండే యెండలో నిల్చుని కుళ్ళిన శవాన్ని కోయిస్తున్నాడు. ఎంత డబ్బుకి బేరం కుదిరిందో సంధునాయక్‌కి తెలియదు.ఇంతకు ముందున్న డాక్టరు కనీసం నాలుగైదు వందలగ్గాని శవాన్ని కోయించడానికి ఒప్పుకునేవాడుకాదు. ఈ డాక్టరు గారికి ఇక్క కొత్త చిన్నవాడు. యాభై, వంద తక్కువే అడిగుంటాడు.
తెల్లవారు ఝామున సంధు నాయక్‌ని వెదుక్కుంటూ మనుషులొచ్చారు. సంధు నాయక్‌ బయిగారిగుడ ఆస్పత్రిలో ఊడ్చేపని చేస్తాడు. అంతకుముందు ఖయిరిపుటలో ఉండేవాడు. ఇప్పుడు ఖయిరిపుటలో ఉండేవాడు పిల్లవాడు. శవం కోయడానికి భయపడ్డాడు. సంధు నాయక్‌ ధైర్యమున్నవాడు. పోలీసులు అతన్ని బస్సులో తీసుకువచ్చారు.
సంధు నాయక్‌ ఒక్కమాటూ శవం ఉన్న స్థితిని చూశాడు. ఆ పని తనవల్ల కాదన్నాడు.పోలీసులు బెదిరించడంతో ఒప్పుకున్నాడు. కాని రెండువందలకు తక్కువ తీసుకోనన్నాడు. అసలు పని అతను చేయాలి. డాక్టరుగారు కాగితంమీద సంతకం పెడ్తారంతే. పోలీసులు కాగితం తీసుకెళ్తారు. ఎవరూ శవాన్ని ముట్టుకోవాల్సిన పనిలేదు. వారే అంతంత కావాలని అడుగుతున్నప్పుడు సంధు నాయక్‌ మాత్రం ఎందుకు దిగిరావాలి? ఒక్కసారి తక్కువకి ఒప్పుకుంటే అంతే. ప్రతీమాటూ అంతే యిస్తారు. లచ్మకిర్సాని సంధు నాయక్‌ పాదాలద్ద నూట యిరవై రూపాయలు పెట్టి చేతులు జోడించి అన్నాడు. ”నిన్ను వేడుకుంటున్నాను. ఇంక నా దగ్గర అస్సలు డబ్బులేదు. ఉంటే ఇచ్చి ఉందును. దీంతో సర్దుకో మళ్ళీసారి సంతలో కోడి, రెండు పనస పండ్లు ఇచ్చుకుంటాను.”
అప్పటికీ సంధు ఒప్పుకోలేదు. పోలీసులు మళ్ళా బెదిరించారు, ”నువ్వు శవాన్ని కోసి పెట్టకపోతే ఇంకెవరు చేస్తారీపని? నువ్వే గొప్ప అని యెందుకు అనుకుంటున్నావు? పోలీసులు, డాక్టరు అసలు బాధ్యతగలవారు. ఎవరంటే వారు డాక్టరు పనీ పోలీసుల పనీ చేయలేరు. డాక్టరు గారు రాయక ఇంకెవరైనా కాగితం మీద సంతకం పెడ్తే సర్కారు ఒప్పుకుటుందా? ఇకచాలు. చాలానే సంపాదించావు. బీదవాళ్ళని కాస్త కనికరించు.”
సంధు భయపడి ఒప్పుకున్నాడు. ఆశవల్ల పాపం, పాపంతో చావు వచ్చి పడ్తుంది. ఎక్కువ ఆశ చూపుతే లంచం తీసుకున్నాడని పోలీసులు కేసు పెట్టినా పెడ్తారు. నూట యిరవై రూపాయలు మరీ తక్కువ కాదు. సంధు నాయక్‌ జీతం నెలకు మూడువందలు. ఒక్కరోజుకి నూట యిరవై రూపాయల సంపాదనయెక్కువే.
సంధునాయక్‌ బొండాలనడిగి ఓ సగం సీసా కల్లు తాగేశాడు. బొండాలు తమ దగ్గర అయిపోయాయని అన్నారు. అది వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు కావాలి. సంధు కోపంతో అన్నాడు, ”కుళ్ళిన శవాన్ని మనుషులెవరైనా కోస్తారా? నాక్కూడా కంపూ, వాసనా తెలుస్తాయి. కళ్ళు నషాయెక్కకపోతే శవం దగ్గరకు వెళ్ళగలనా? చేతిలోంచి డబ్బులు ఖర్చుపెట్టి మీ శవంపని చూడాలా ఏం?” బొండాలకు అర్థమైంది సంధు చెప్పేది సబబేనని.
సంధుకి వాసన, కంపు తెలియట్లేదు. బుదెయి ఉబ్బిన శవం అచేతనంగా పడి ఉంది. రెండు రోజుల క్రితంయిదే బుదెయి ఎంత అందంగా ఉండేది! ఆమె శరీరం నున్నగా చామన ఛాయలో ఉండేది. రెండు రోజుల్లో అదే నల్లగా కమిలినట్లయిపోయింది. నాలుక కరుచుకుని చనిపోయింది బుదెయి. అందుకే నాలుక నల్లగా ముదురునీలంరంగు సిరాలా ఉంది. ఉబ్బిపోయిన పెదాల మధ్య నుండి లోపలున్న ఉబ్బిన నాలుక గుండ్రని వంకాయలా కనిపిస్తూంది, నిజంగా ఆమెపళ్ళతో ఓ వంకాయను కరుచుకుని ఉందా అన్నట్లనిపిస్తూంది. కళ్ళు రెండూ తెరుచుకుని ఉన్నాయి. కనుగుడ్లు రెండూ బయటకు పొడుచుకుని ఉన్నాయి. శరీరమంతా నాలుగింతలు ఉబ్బిపోయి ఉంది. కడుపు ఉబ్బి ఉంది. రొమ్ములూ కడుపూ ఒకేలా ఉన్నాయి. కడుపు కోసి లోపలి పేగులు బయటకు తీశాడు సంధు. కుళ్ళిన చేపలా కొంత భాగంపేగు బయట పడింది ఆమె కట్టెలా గట్టిగున్న చేయి మీద, ఆమె మర్మాంగాలు యింకా భయంకరంగా ఉన్నాయి. సంధు నాయక్‌ కళ్ళు తిప్పుకున్నాడు. చూస్తే ఇక ఆడాళ్ళమీదే విరక్తి పుడుతుంది. అతనికి, మనిషి జన్మపైనే విరక్తి పుడ్తుంది. ఛీ మనిషి శరీరం ఇంత నరక ప్రాయమా!? ఈ శరీరాన్ని గురించే యింత సందేహం, ఇంత పాపం, ఇంత హింసాకాండ, ఇన్ని ఖూనీలా! ప్రాణం అంటే కంటికి కనిపించని గాలి నూలుపోగు. ఆ గాలి నూలుపోగు ఉన్నంత వరకూ శరీరం యెంత అందంగా ఉంటుందో మనస్సు కూడా అంతే లోభం, మోహం, మాయ, అసహ్యం, సందేహాలతో నిండి ఉంటుంది. ఆ ప్రాణం కాస్త గాల్లో కలిసి పోతూనే శరీరం భయంకరంగా తయారవుతుంది. మనస్సు శూన్యంగా మిగులుతుంది.
శవాన్ని కోస్తున్న కొద్దీ సంధునాయక్‌ మనస్సు విరక్తితో నిండిపోసాగింది. పుర్రెపగలగొడ్తూనే అక్కడ్నుంచి పారిపోవాలని అనుకున్నాడు. రెండు చేతుల్తో గట్టిగా పట్టుకుని పుర్రెను రెండు ముక్కలు చేశాడు సంధు. కొబ్బరికాయ కొట్టినట్లు ఫట్‌మని శబ్దం చేస్తూ పుర్రె రెండు ముక్కలైంది. విరిగిన భాగంనుండి నీలం రంగులో ఉన్న కుళ్ళిపోయిన మెదడు బయటకు వచ్చింది. అందులోంచి ద్రవం పిచికారిలా సంధు మొహం మీద పడింది. అప్పుడు ఒక విధమైన ఘాటైన కుళ్ళు వాసన సంధు ముక్కులోంచి నరరకాల్లోకి పాకిపోయింది, శరీరమంతా. భయంతో, అసహ్యంతో, విరక్తితో ఒళ్ళంతా జలదరించింది. కళ్ళ ముందు బుదెయి మొహం కదలాడింది. నిజంగా యీ కుళ్ళిపోయిన శరీరం బుదెయిదేనా అసలు!
పనైన వెంటనే ఒక్కసారి వెనుదిరిగాడు సంధు నాయక్‌. బొండాలు శవాన్ని మోసుకుని అడవిలోకి వెళ్ళారు. ఆ మాంసం ముద్దను మట్టి తవ్వి పూడ్చేసి బతకు జీవుడా అని ఊరు చేరతారు. ఒక్క ఖూనీతో బొండాలకు ఏడెనిమిది వందల రూపాయలు వదులుతుంది. పిల్లలు జీవితాంతం వెట్టి చాకిరి చేయాలి.
సంధు నాయక్‌ ఇంటి కొచ్చి సబ్బుతో ఒళ్ళంతా రుద్దిరుద్ది కడుక్కున్నాడు. మనస్సు తేలిక చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ రోజు అతని అదనపు సంపాదన వందాయిరవై రూపాయలు. అందులోంచి కొంత డబ్బు ఖర్చు పెట్టేస్తే యింతగా అనిపించక పోవచ్చు. వెట్టిగా వచ్చేది వెట్టిగానే ఖర్చవుతుంది మరి. అనవసరపు ఖర్చు చేసేవారంతా ఈ బాపతువాళ్ళే. చెమటోడ్చి సంపాదిస్తే జాగ్రత్తగా ఖర్చుపెడ్తారు. అయితే ఈ రోజుసంధునాయక్‌ చెమటోడ్చి సంపాదించలేదని యెవరైనా అనగలరా? ఈ రోజు శవంకోసే టప్పుడు చెమట కాదది, సంధు నాయక్‌ శరీరంలోని రక్తమే చెమటగా మారికారింది. ఇటువంటిపనిలో శారీరక కష్టం సంగతేమోగాని మనస్సుకి చాలా బాధ కలుగుతుంది. అయితే ఈ వందాయిరవై రూపాయలు అతని నెలసరి ఆదాయంలో, ఖర్చుల్లో చేరవు. ఇవాళ పెళ్ళాం పిల్లలకు కడుపునిండా అన్నం మాంసం కూర తినిపించి సంతోషపెడ్తాడు. ఎప్పడూ సగం కడుపు మాత్రమేనిండే సంసారంలో ఎప్పుడైనా చేపలు, మాంసం తెచ్చుకుంటేసంబరమే మరి. అతని భార్య ఓ రెండు ముక్కల మాంసంపెట్టి బోల్డు నీళ్ళు పోసి కూర చేస్తుంది. మాంసం తినాలన్న కోరిక ఆ నీచు నీళ్ళతో సరిపెట్టుకోవాల్సి వచ్చేది. ధరల మండిపోతున్న ఈ రోజుల్లో మాంసం తెచ్చుకుని తినడం గగనమే అయింది సంధు లాంటివారికి.
సంధు నాయక్‌ ఓ కిలో మాంసం కొని యింటికి తీసుకెళ్ళాడు. దానితో ఓ మిఠాయి పొట్టం కూడా కొన్నాడు పిల్లలు తింటారని, తాగినంత తాగిరాత్రి కోసం ఓ బాటిలు కూడా కొన్నాడు. ఇంటికి చేరుతూనే పిల్లలకు మిఠాయి ఇచ్చాడు. భార్య చేతికి మాంసం పొట్లం ఇచ్చి అన్నాడు, ”ఒక్కసారి కిలో కొనేశాను. ఎంత తింటారో తినండి. పిసినారితనంతో సగంవండి రేపటికి సగం అట్టేపెట్టకు. పిల్లలు కడపునిండా తిననీ డబ్బు కోసం ఆలోచించకు.దేవుడు దయతలిస్తే ప్రతీనెలా జీతంకాక కొంత సంపాదించొచ్చు. అన్నట్టు ఈ వేళ కాస్త యెక్కువ నూనె వేసి బాగా మసాలాదట్టించి ఒండు. చాలా రోజులైంది మంచి మాంసం కూరతిని. నువ్వెప్పుడూ నూనె మసాలకు కూడా పిసినారితనం చేస్తావు. ఎంత నూనె, మసాలా కావాలో పిల్లవాడిచేత దుకాణం నుండి తెప్పించు. ఇంద డబ్బు…”
సంధు నాయక్‌ ఓ పదిరూపాయల నోటు భార్య చేతిలో పెట్టాడు. ఇవాళ పండగే! పిల్లలు ఆనందంతో గంతులేస్తున్నారు. మాంసం వేపుడు వాసనతో కళ్ళతో నిద్ర నిలువలేదు. చీకటిరాత్రి సంధు నాయక్‌ కళ్ళు మూసుకుని బీడి దమ్ము లాగుతున్నాడు. కళ్ళు మూస్తూనే అతని యెదురుగా శవం కదలాడింది, భీబత్సంగా, పేగులు బయటపడి, పుర్రె పగిలి మెదడు బయటకి వచ్చి… ఆ కుళ్ళు వాసన ముక్కు పూటాల్లో దూరి అక్కడే తిష్టవేసినట్లుంది. ఎంత నీళ్ళేసి కడుక్కున్నా ఆ కంపు ఉండి ఉండి కడుపు దేవినట్లు చేస్తూంది. సంధు నాయక్‌ ఇంకా తాగేడు. పిల్లలు మాంసం కూర వైపే కళ్ళార్పకుండా చూస్తూ కూర్చున్నారు. ఎప్పుడెప్పుడు తిందామా అని. సంధు ఓ గుక్క కల్లు తాగి అన్నాడు, ”ఉండండి. మరికొంత నషాయెక్కనీ, ఇంకొంత ఆకలి కానీ…”
భార్య బలవంతంగా చేయిపట్టి లేపింది. అన్నం కంచం ముందు కూర్చోబెట్టింది. ఎక్కువ ఎక్కిపోతే పాపం యేమీ తినలేడు. కంచంలో సగం భాగం ఎర్రని మాంసం ముక్కలతో నింపింది. భర్త తినాలని. నూనెలో తేలుతున్నాయి ఎర్రని ముక్కలు. సంధుకి అది చాలా యిష్టం. అతని భార్య పెద్దపెద్ద ముక్కలేరి మరీ పెట్టిందతనికి, కంచంలో సగం వరకూ నిండా మాంసం కూర. ఎర్రని మసాలాలో తేలుతున్న మాసం ముక్కలు భార్య చూస్తూ కూర్చుంది. అతను తిని ముగిస్తే అదే కంచంలో తింటుందామె. మొత్తం కూర అతని కంచంలో వేసేసింది. ఎంత తింటాడో తిననీ.పాపం అంతయెండలో పనిచేస్తాడు కాని ఇంత తినేందుకు నోచుకోలేదు. తన గురించిన ఆలోచన తేనేలేదు. దుంపలుంటే చాలామెకు. కాని సంధు తప్పక ఆమె కోసంకొన్ని మాంసం ముక్కలు మిగిలిస్తాడు. అదే అతనికి అలవాటు. సంధు నోట్లో ఓ ముద్ద అన్నంపెట్టుకుని మాంసం కూరలో చేయి పెట్టాడు. చేతినిండా ఎన్రి ముక్కలు అదే ఎర్రని రంగు, అదే ముక్కుపగిలే కుళ్ళు వాసన, అదే జిగటగా బయటకొచ్చిన కుళ్ళు మెదడు, అదే బీభత్సమైన మాంసం… కంచంలో బుదెయి ఉబ్బిన మొహం.. బెలూన్‌లా వంగపండులాంటి నాలుక…కుళ్ళిన మెదడు.. బుదెయి కుర్రదాని శవంకోసిన డబ్బుతో మాంసం కొని తెచ్చాడు. కంచంలో బుదెయి మాంసం! మనిషి మాంసం! మనిషి మాంసాన్ని మనుషులు తింటారా యెక్కడైనా! సంధు కంచంలో బుక్కు బక్కుమని వాంతిచేసుకున్నాడు. కడుపులో ఏదో కెలికినట్లు తెలియని బాధ. పొత్తి కడపుని పట్టుకుని సంధు అక్కడే పడిపోయాడు, తెలివి తప్పింది.
భర్తను కడిగి , తుడిచి మంచంమీద పడుకో బెట్టింది, కోపంతో బాధతో గొణిగింది. ‘దొంగ సచ్చినోడా పూటుగాతాగేసావు కదా. వెధవ నాయాల తాను తినలేదు వేరేవాళ్ళను తిననివ్వలేదు. కంచం నిండా ఉన్న మాంసం కూరలో వాంతి చేశేసాడు!’.

Share
This entry was posted in అనువాదాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో