వాళ్లు మరిచిపోలేరు!

 లతాశర్మ (మూలం : హిందీ కథ)
అనువాదం: శాంతసుందరి

”ఏమిట్రా నువ్వనేది?” ఆనంద్‌ హడిలిపోయడు.

  ఆ కంగారులో ఎదురుగా వస్తున్న బస్సుని ఢీకొట్టబోయి వెంట్రుక వాసిలో తప్పించుకున్నాడు.

ముకుల్‌కి భయం వేసింది, ”ముందు నువ్వు కారుని రోడ్డుకి పక్కగా ఆపు!” అన్నాడు.
లోకంలో ఏ మార్పూలేదు, అంతా అదివరకులాగానే ఉంది. ఆఫీసుల్నించి ఇళ్లకెళ్తున్నారు.  కార్లూ, లారీలూ, బస్సులూ రోడ్డుమీద వేగంగా పరిగెత్తుతున్నాయి.  బజారులో జనసముద్రం.  పువ్వులూ, బెలన్లూ, ఐస్‌క్రీములూ, కూల్‌డ్రింకులూ ముమ్మరంగా అమ్ముడుపోతున్నాయి.  అయినా ఈ పగలు రాత్రిలాగా భయం గొలుపుతూ, నిశ్శబ్దంగా, నిర్జనంగా అనిపిస్తోందెందుకుని?  శ్మశాననిశ్శబ్దం అంతటా తాండవిస్తోందేం?
”నువ్వు నిజమే చెపుతున్నావా?” ఆనంద్‌ గొంతు బావిలోంచి వస్తున్నట్టు బలహీనంగా ఉంది.
”అవును ఆనంద్‌! నాకా పిల్ల గురించి బాగా తెలుసు.  అసలు నాకే ఏమిటి?  కాన్పర్‌లో ప్రతి ఒక్కరికీ నేహావర్మ గురించి తెలుసు!  నువ్వు మర్చిపోయవా?  మేమిద్దరం ఆ ఊళ్లోనే చదువుకున్నాం కదా!  నేను ఐ.ఐ.టీ.లో చదివేవాడిని, తను ఆర్ట్స్‌ కాలేజీలో ఉండేది.”
”లేదు… అలా జరిగి ఉండటానికి ఆస్కారం లేదు.  అలాటిదేదైనా జరిగుంటే నేహా స్వయంగా నాతో చెప్పేదే.”
అసలు నమ్మదగిన విషయమైతే కదా ఎవరైనా నమ్మటానికి!  కానీ ముకుల్‌ కూడా తక్కువ తినలేదు, చాలా మొండివాడు.
”సరే… నేను నీకు తేదీ కూడా చెప్తాను.  ఏప్రిల్‌ ఇరవై ఎనిమిది, పంతొమ్మిది వందల తొంభైతొమ్మిది… ఆ రోజు మా ఫైనల్‌ పరీక్షల్లో ఆఖరి పేపర్‌ రాశాం!  అందుకే గుర్తుండిపోయింది.  హాస్టల్లో రాత్రి బాగా పొద్దుపోయేదాకా పార్టీ జరిగింది.  ఆ గొడవలో మాకేమీ తెలీలేదు.  కావాలంటే నువ్వు ఆ మర్నాటి పేపర్‌ సంపాదించి చెక్‌ చేసుకో.  ఏడెనిమిదిమంది కుర్రాళ్లు… గ్యాంగురేప్‌ జరిగింది!… క్షమించరా, నీకు చెప్పటం నా డ్యూటీ అనుకుని చెప్పాను.  ఇంక ఏం చేస్తావో నీయిష్టం!”
”కానీ తనని చూస్తే అలా అసలు అనిపించదే…”
”ఆ పిల్ల ఎప్పుడూ అంతే.  చాలా చలాకీగా, జోకులేస్తూ, నవ్వుతూ, తుళ్లుతూ ఉంటుంది.  చాలా పాపులర్‌ తెలుసా?  కాలేజీలో స్టూడెంట్స్‌ యూనియన్‌కి జాయింట్‌ సెక్రెటరీగా ఉండేది.  కానీ, ఒక్కటి మాత్రం చెప్పాలి, తనకి చాలా పొగరు.  ఎవ్వరినీ లెక్కచేసేది కాదు.  బహుశా అందుకే…, సర్లే, నా సలహా విని, మళ్లీ ఒకసారి ఆలోచించుకో.  సరిగ్గా గమనించు… ఏడెనిమిదిమంది కుర్రాళ్లు! ఊరంతా తెలిసిన వ్యవహారం.  పేపర్లకి కూడా ఎక్కింది!”
కాసేపు ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు.  మళ్లీ ముకులే నోరు విప్పాడు, ”ఆఁ… ఆపు… నేనిక్కడ దిగిపోతాను.  నాక్కాస్త పనుంది.”  కారు దిగి చెయ్యి ఊపుతూ, ”వస్తారా!… ఏమనుకోకేం, నా ఫ్రెండువని అన్నీ చెప్పేశాను… లేకపోతే నాకేం పట్టింది?… మళ్లీ కలుద్దాం!” అని ముకుల్‌ వెళ్లిపోయాడు.
ఆనంద్‌ స్టీరింగు వీల్‌ మీద తలానించి ఎంతోసేపు, ఏం ఆలోచించాలో తెలీని పరిస్థితిలో కూర్చునుండిపోయాడు.  వేళ్లు కాలేసరికి చేతిలో సిగరెట్టుందని జ్ఞాపకం వచ్చింది.
‘నేను నేహాని ప్రేమిస్తున్నాను!’ ఈ మాటలు తనెవరితో అన్నాడు?  ముకుల్‌ వెళ్లిపోయి చాలాసేపయింది.  కానీ మనసే మొండితనం చేసే చిన్నపిల్లల్లాగ మాటి మాటికీ ఒకేమాటని వల్లిస్తోంది.  ముకుల్‌ బాంబులాంటి ఈ విషయన్ని పేలుస్తాడని ఏ మాత్రం తెలిసినా, వాడిని నేహా దగ్గరకి తీసుకెళ్లేవాడే కాదు.  ‘నేను నేహాని ప్రేమిస్తు న్నాను!’ ఎంత అందంగా ఉంటుంది, ఎప్పుడూ నవ్వుతూ, సరదాగా ఉండే స్వభావం.  ఆమెని చూస్తే తెల్లవారగట్ల మంచుపొగలో గంగ ఒడ్డున నిలబడి సూర్యోదయాన్ని చూస్తున్నట్టుగా ఉంటుంది!  నేపథ్యంలో శంఖం ధ్వనీ… దూరంగా గుడిలో గంటల చప్పుడూ… అంత పవిత్రంగా, ఏ పాపమూ ఎరగని అమాయకమైన మనిషిలా ఉంటుంది.  పువ్వులా నవ్వుతుంది.  తను నేహాని చూసి ఎంత గర్వపడేవాడు!  ఆమె తనకి దొరకటం గొప్ప అదృష్టంగా భావించేవాడు.  ఎన్నెన్ని కలలు కన్నాడో! మరిప్పుడు? ….ముకుల్‌…. కాదు, నేహా తన కలలన్నిటినీ ముక్కలు చెక్కలు చేసేసింది.  ముకుల్‌ ఒక మంచి స్నేహితుడు చెయ్యవలసిన పనే చేశాడు.  వాడు చెప్పి ఉండకపోతే… పెళ్లయ్యాక, ఇంకోరెవరో చెప్పి ఉండేవారు.  లక్నోకీ కాన్పర్‌కీ మధ్యదూరం ఎంతని?  అక్కడ తన బంధువులు బోలెడంత మంది ఉన్నారు.  ఇటువంటివి దాస్తే మట్టుకు దాగుతాయా?  నేహాని గ్యాంగురేప్‌?… అబ్బా…!
అయినా, ముకుల్‌ ఈర్ష్యతో ఇలాటి కట్టుకథ చెప్పలేదు కదా!  నేహాని తనతో చూసి ఈ ప్రపంచమంతా ఈర్ష్య పడుతుంది.  పువ్వులతో నిండిన జాజిరెమ్మలా ఎంత అందంగా ఉంటుందో!
ఆనంద్‌ కారుని వేగంగా పోనిచ్చాడు.  అవును ఆ పేపరు సంపాదించాలి, దాన్లో ఏముందో చూడాలి.  ఎందుకు? ఊరికే! ఇంత సీరియస్‌ విషయాన్ని ముకుల్‌ కల్పించి చెప్పి ఉండడు!  అయినా చెప్పనీ… అందరూ చెప్పనీ! నేను మాత్రం నేహాని ప్రేమిస్తున్నాను!… ముకుల్‌ బదులు నేహాయే చెప్పి ఉండచ్చే?  అలా చేస్తే తను ఆమెని క్షమించి ఉండేవాడు.  తన ప్రేమలో ఎటువంటి లోటూ వచ్చేది కాదు.  కానీ నేహా ఈ సంగతి ఎందుకు దాచిపెట్టింది?  తనమీద నమ్మకం లేదా?  కనీసం తనకైనా చెప్పాల్సింది.  పెళ్లి చేసుకుందామని ఇద్దరం నిర్ణయించుకున్నాక, ఇంకా ఈ దాగుడుమూతలేమిటి?  అమ్మకీ నాన్నకీ కూడా చెప్పటం అయిపోయింది.  వాళ్లకి కూడా నేహా నచ్చింది.  ఇప్పుడు వాళ్లకేం చెప్పాలి?  నేహా ముందే చెప్పి ఉంటే ఇంత బాధ కలిగేదు కాదు కదా!  తను ఆమెని ప్రేమలో ముంచెత్తి ఉండేవాడు.  దాంతో తనకి జరిగిన ఆ దుస్సంఘటనని ఆమె మర్చిపోయి ఉండేది.  తన స్వభావమే అంత, కష్టాల్లో ఉన్నవాళ్లని చూస్తే చాలా సానుభతి కలుగుతుంది.  ఎప్పుడూ కష్టాల్లో ఉన్నవాళ్లకి సాయం చేస్తూ ఉంటాడు.  మరి తనని ఇలా మోసగించిందేమిటి?
ఆనంద్‌ నిట్టర్పు విడిచాడు… నేహా తనకి దొరికినందుకు ఎంత సంతోషించాడు!  మంచి కుటుంబంలోంచి వచ్చిన పిల్ల, డబ్బు కూడా బాగా ఉన్న కుటుంబం.  నేహా తమ్ముడు కెనడాలో డాక్టరు.  ఆమె కూడా గర్ల్స్‌ కాలేజీలో లెక్చరర్‌.  పసిమి ఛాయ, మంచి కనుముక్కుతీరు!  ఇల్లు చక్కగా పెట్టుకోవటంలో కూడా నేర్పు ఉన్నది.  తన బంగళా చక్కపెట్టుకునే తీరుచస్తే భలే ముచ్చటేస్తుంది.  తోటలో మొక్కల దగ్గర్నించీ, వంటింట్లో గిన్నెలదాకా అన్నీ పొందిగ్గా సర్దుకుంటుంది…. కానీ ఆమె జీవితంలో జరగకూడని సంఘటన జరిగిపోయింది!
ఆనంద్‌ నేరుగా లైబ్రరీకి వెళ్లాడు.  ముకుల్‌ చెప్పిన తేదీ పేపరు తీసి చూస్తే, ముకుల్‌ చెప్పింది నిజమేనని తేలింది.  నేహా ఐ.ఐ.టి. బాయ్‌స్‌ హాస్టల్‌కి ఎవరిని కలవటానికి వెళ్లిందో, లేక ఏదో సాకుతో ఆమెని అక్కడికి పిలిపించుకున్నారో, అక్కడే అందరూ కలిసి ఆమెని…..
అసలు ఆశ్చర్యం ఏమిటంటే, నేహా పోలీసులకి రిపోర్టు చెయ్యలేదు, ఎటువంటి ప్రతిస్పందనా కనబరచలేదు.  పరీక్షలు అయిపోయాయి, ఇంటికెళ్లిపోయింది.  ఈ వార్త ఆస్పత్రిలో లీక్‌ అయింది.  నమ్మకమైన సాక్ష్యాధారాలతో పేపర్లకెక్కింది.  ఆమె వారం రోజులపాటు ఆస్పత్రిలో ఉండవలసి వచ్చింది.  నేహా చాలా ధైర్యస్తురాలు.  మరి పోలీసు రిపోర్టెందుకివ్వలేదు?  ఎప్పుడూ స్త్రీవాదిలాగా పెద్దపెద్ద మాటలు మాట్లాడుతుందే!  మరి ఆ లోఫరుగాళ్లని అలా ఎలా వదిలేసింది?  తనంతటతానే బాయ్‌స్‌ హాస్టల్‌కి ఎవరినైనా కలవటానికి వెళ్లి ఉంటుందా?  అక్కడ తెలిసిన వాళ్లెవరైనా ఉన్నారా?  ఎవరయుంటారు?  అన్నట్టు ఆమెను రేప్‌ చేసిన వాళ్లలో ముకుల్‌ కూడా ఉండి ఉంటాడా?  ఆనంద్‌ తల గిర్రున తిరగసాగింది.  ఇంటికెళ్దామని అనుకున్నాడు.
లైబ్రేరియన్‌ అనుమతితో ఆ వార్త పడిన పేజీ జిరాక్స్‌ చేయించుకొని వెళ్లిపోయడు.
రాత్రంతా నిప్పులకుంపటి మీద పడుకున్నట్టుగా గడిచింది!  రకరకాల దృశ్యాలు అతని కళ్లముందు కదులుతూ అతన్ని కలవరపెట్టాయి.  ఎప్పటిలా నేహాని సన్నజాజి పూవులా ఊహించుకోలేక పోయాడు.  శోభనం గదిలో కొత్తపెళ్లికూతురి రూపంలో ఆమె అతని కల్లోకి రాలేదు.  రౌడీ కుర్రాళ్ల మధ్య చిక్కుకున్న అసహాయస్థితిలో… ఒళ్లంతా రక్కుల, గాయలతో… ఈమె తన ప్రియురాలు నేహా కాదు!  తన కలల్లోని నేహా అందమైన రూపం ఇలా అయిందేమిటి?
అతను ఎంతో నిబ్బరంగా నేహా యింటికి వెళ్లాడు.  బెల్లు వేశాడు.  కూనిరాగాలు తీస్తూ నేహా వచ్చి తలుపు తీసింది.
”అరె, నువ్వా?  బెల్లెందుకు వేశావు?  తలుపు తీసే ఉంది!” అని వెంటనే లోపలికెళ్లిపోయింది.  బహుశా వంట చేస్తున్నట్టుంది.
ఆనంద్‌ మౌనంగా సోఫాలో కూర్చున్నాడు.  సన్నటి వెదురుబద్దలతో అందంగా తయారుచేసిన ఫర్నిచరు.  ఫ్లవర్‌వాజుల్లో పువ్వుల అమరిక అత్యాధునికంగా ఉంది.  గోడలమీద అందమైన పెయింటింగ్సు.  ఏమీ మారలేదు!  కానీ ఇవాళెందుకు ఇవన్నీ జీవకళ పోయినట్టు కనిపిస్తున్నాయి?
”ఇంద, కాఫీ!” అందంగా నడుస్తూ వచ్చింది నేహా.  ఆనంద్‌ మొహం చూడగానే ఆమెలోని ఉత్సాహమంతా ఆవిరైపోయింది.  మొహంలో ఆందోళన కనబడింది.  ”ఏమైంది? ఒంట్లో బాగానే ఉందా? చాలా డల్‌గా ఉన్నావెందుకు?… కాఫీ తీసుకో, చల్లారిపోతుంది,” అంది నేహా.
అతను కాఫీ కప్పుని ముట్టుకోలేదు.  హఠాత్తుగా, ”నేహా, నీకు ముకుల్‌ తెలుసా?” అని అడిగాడు.
”ఆఁ నిన్న నీతో వచ్చినప్పుడు, ఎక్కడో చూసిన మొహంలాగే ఉందని అనిపించింది.  ఆ తరవాత గుర్తొచ్చింది, అతను కాన్పర్‌ ఐ.ఐ.టి.లో చదివేవాడు.  రెండుమూడుసార్లు యూత్‌ ఫెస్టివల్‌లో కలుసుకున్నట్టున్నాం.  ఏం? ఎందుకడుగుతున్నావ్‌?”
ఎలా చెప్పటం? ఎంత మామూలుగా అడుగుతోందో!
”నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు?”
”ఏమిటి? ఏం చెప్పలేదు?” ఆమె కాఫీ నెమ్మదిగా చప్పరిస్తూ చిరునవ్వు నవ్వుతూ అడిగింది.
”అంటే… ఓహ్‌… నేహా!” అతను ఆమెని కౌగిల్లోకి తీసుకుని ఓదార్చాలని ప్రయత్నించాడు.  కానీ ఆమె దూరంగా జరిగింది.
”నేను నీకు చెప్పని విషయం ఏమిటి?”
”అదే… అంటే…” నేహా ఇంకా దాచాలనే చూస్తోందా?  ఇలాటి విషయలు దాచినా దాగుతాయా?  అతను పేపరు జెరాక్స్‌ కాపీ నేహాకి అందించాడు.
నేహా చాలా శ్రద్ధగా ఆ వార్త మొత్తం చదివింది.
”ఏం చెప్తాను నీతో?  నేను సంగతి పూర్తిగా మరిచిపోయాను.  ఇప్పుడు నువ్విది చూపిస్తే గుర్తొచ్చింది.”
ఇది మరీ బావుంది! ఇలాటి సంఘటనలని ఎవరైనా అసలు మరిచిపోగలరా?  ఎంత బాగా అభినయిస్తోంది!  ఎంత పెద్ద అబద్ధం!  హుఁ!  మర్చిపోయిందిట, భలే ఎత్తు!  ఈ జిLove affair
రాక్స్‌ కాపీయే లేకపోతే ఏమీ జరగలేదని బుకాయించి ఉండేది!
నేహా తదేకంగా ఆనంద్‌ మొహంలోని భావాలని గమనిస్తూ కూర్చుంది.  ”కాఫీ తాగవా?” అని అడిగింది ఉన్నట్టుండి.
ఆనంద్‌ కప్పు చేతిలోకి తీసుకుని మళ్లీ కింద పెట్టేశాడు.  చల్లారిన కాఫీ అతనికిష్టం లేదు.
నేహా మాట్లాడకుండా లేచి రెండు కప్పులూ తీసుకుని లోపలికి వెళ్లింది.  వంటింట్లో అయ్యే చప్పుళ్లు నేహా గిన్నెలు కడుగుతోందని తెలియజేశాయి.  అతను కూర్చుని దిక్కులు చూడసాగాడు.
మళ్లీ వచ్చి నాముందెలా కూర్చుంటుంది, నేహా? ఏం మాట్లాడుతుంది?  ఇంకా అలాగే గలగలా నవ్వుతుందా?  కవ్వింపులూ, ప్రేమగా స్పృశించటం అన్నీ ఎప్పట్లాగే ఉంటాయా?
తువ్వాలుతో చేతులు తుడుచుకుంటూ నేహా వచ్చింది.  ఎప్పట్లాగే వచ్చి, అతన్ని ఆనుకుని కూర్చుంది.  చాలా మృదువుగా తన కుడిచేత్తో అతని నుదిటిమీద ఎడంపక్క అర్ధచంద్రాకారంలో ఉన్న మచ్చని తాకింది.  ”ఇదేమిటి?” అని అడిగింది.
ఆ మచ్చని తడుముతూ, ”ఇదా? చిన్నప్పుడు మెట్లమీంచి పడిపోయాను.  నుదురు చిట్లింది.  లోతుగా గాయమయంది.  కుట్లు కూడా పడ్డాయి.  ఆ గాయం తాలూకు మచ్చ” అన్నాడు.
”నువ్వెప్పుడూ చెప్పలేదే?”
”ఆఁ, ఇదేమంత చెప్పవలసిన విషయం?  మగపిల్లలు పడుతూనే ఉంటారు కదా!  హాకీ, ఫుట్‌బాల్‌ ఆటల్లో ఎన్నోసార్లు దెబ్బలు తగిలాయి.  ఎన్నని చెప్తాను?  గాయం మానింది, మచ్చ మిగిలింది, అంతే!”
”సరిగ్గా చెప్పావు!” నేహా లేచి, అతనికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది.  రెండు క్షణాలు ఆగి, ”ఇలాటివి జరగటం మామూలే.  మగపిల్లలేనా, ఆడపిల్లలూ పడి దెబ్బలు తగిలించుకుంటారు.  ఇంటా బైటా ఎన్నో చిన్నా పెద్దా దెబ్బలు తగుల్తాయి.  ఎన్నని చెప్పగలం?  గాయం మానుతుంది.  మచ్చ ఉండిపోతుంది.  అది కూడా గుర్తుండదు… నేను అడక్కపోతే నువ్వు చెప్పేవాడివా?”
ఆనంద్‌ అవాక్కయడు.  నా మాటకి ఇదా తనిచ్చే జవాబు?  తప్పుచేసి, పైగా దబాయిస్తోంది!
”నుదిటికి తగిలిన దెబ్బా… నీకు… నీకు జరిగిన సంఘటనా ఒకటేనా?”
”ఎందుకు భయం?  అడిగేదేదో స్పష్టంగా అడుగు!  నీకు జరిగినది అనకు.  గ్యాంగు రేప్‌ అనే అను.  ఆ మాటే కదా రాశారు ఈ పేపర్లో?  ఇక నీ ప్రశ్నకి జవాబు, లేదు… రెండిటికీ ఏమీ తేడాలేదు… రెండ ఒకలాటివే!” నేహా స్పష్టంగా అతని కళ్లలోకి చూస్తూ అంది.
”రెంటికీ ఏమీ తేడా లేదా?” ఆశ్చర్య పోతూ మళ్లీ అడిగాడు.
”నువ్వు మెట్లమీంచి పడ్డావు, నుదురు చిట్లింది.  నేను మృగాల పాలపడ్డాను, నా పొర చిరిగింది! ఏమిటి తేడా?  మన ప్రమేయం లేకుండా, అనుకోకుండా గాయం తగిలింది, నెత్తురు వచ్చింది, కుట్లుపడ్డాయి.  వైద్యం జరిగింది, గాయం మానింది… కాస్తంత మచ్చ ఉండిపోయింది.  అది గుర్తుకూడా ఉండనంత చిన్నది!”
లేదు… లేదు… ఈమె నటిస్తోంది!  నిర్భయంగా ఉన్నట్టు నటిస్తోంది కానీ లోలోపల బెదిరిపోతోంది!
”అయ్యో, నేహా! ఎంత కష్టమొచ్చింది నీకు! ఇలారా… నాపక్కకిరా! నాకంతా వివరంగా చెప్పు.  మొదట్నించీ… అసలిదంతా ఎలా జరిగింది?  ఎవరా రాక్షసులు?”
 ”ఓహో! అయితే నువ్విప్పుడు మాటలతో నన్ను రేప్‌ చెయ్యబోతున్నావన్నవట!  మానిపోయిన గాయన్ని మళ్లీ రేపటంలో నీ ఉద్దేశం?” నేహా కనుబొమలు పైకి లేచాయి.  కానీ ఆమె మొహంలో చిరునవ్వు!
”అబద్ధం చెప్తున్నావు, నేహా! ఇటువంటి అనుభవాన్ని ఎవరూ మరిచిపోరు!” అన్నాడతను విసుక్కుంటూ.
”లేదు, నేను చెప్పేది నిజం.  నిజానికి ఈ రోజుల్లో నేను చెప్పేదే నిజం.  ఈ రోజుల్లో ఎన్నో రకాల దెబ్బలు తగులుతూంటాయి.  అన్నిటినీ గుర్తుంచుకోవటం సాధ్యం కాదు.  పెంపుడు కుక్క దగ్గర్నించి వీధికుక్కల దాకా, అన్నింటికీ పదునైన వాడి దంతాలుంటాయి.  కుక్క మీద పడని ఒక్క మనిషిని చూపించు!  ఖర్మకొద్దీ పిచ్చికుక్క కరిచిందా… పద్నాలుగు ఇంజక్షన్ల తప్పవు! తరువాత? ఆ విషయం మర్చిపోతారు.
 ….అన్నట్టు, తమరు మరిచిపోనిస్తే!… అసలు ఓదార్పు కావలసింది తమరికి.  ఎందుకంటే సమస్య మీకే, నాకు కాదు!  తమరు మర్చిపోరు, అవతలివాళ్లని మర్చిపోనీయరు!”
 ”ఇందులో గుర్తుంచుకోవటానికేముంది?  నేనెందుకు గుర్తుంచు కుంటాను?” ఆనంద్‌ ఇంకా ఏదో చెప్పాలనుకున్నాడు, కానీ ఏమనాలో తెలీలేదు.
”నువ్వనేదే నిజమైతే, ఈ జెరాక్స్‌ ఎందుకు?  నేనేమైనా నేరస్తురాలినా?  సాక్ష్యం చూపించి నేరం ఒప్పించాలనుకున్నావా?  నువ్వేమైనా మతాచార్యుడివా?  నా పాపాలు నా నోటంటే విని నాకు క్షమాభిక్ష పెడతావా?  స్వర్గంలో నాకు చోటు కల్పించటానికి….”
 ”అదేం కాదు, నేహా!” ఆమె మాటలకి అడ్డొస్తూ, ”నేను మునుపటి లాగే…” అనబోయడు ఆనంద్‌.
”చాలు… ఇంక చాలు! ఇంకేం మాట్లాడద్దు! ఆశ్చర్యం నీలో ఉన్న ఈ బలహీనతని ఇంతవరకూ పట్టుకోలేక పోయాను!  అబ్బ! ఎంత పెద్ద తప్పు చెయ్యబోయాను!” నేహా రెండు చేతులతో తల పట్టుకుంది.  ”వెంట్రుకవాసిలో నాకు ప్రమాదం తప్పింది,” అంది చాలా నెమ్మదిగా.
”ఏమంటున్నావు నువ్వు?” ఆనంద్‌కి పిచ్చి కోపం వచ్చింది.
తనలో తాను మాట్లాడుకుంటున్నట్టుగా నేహా ఏదో గొణుగుతూనే ఉంది, ”ఎవరైనా పది రూపాయలకి కుండ కొనేప్పుడు కూడా ఓట్టిదా, గట్టిదా అని తట్టి చూస్తారు.  నేను ఏమీ పరీక్షించకుండా ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నాను?  ఇదొక్కటే నాకు చాలా బాధగా అనిపిస్తోంది…!”
”ప్లీజ్‌, నేహా! నా బాధని కూడా కొంచెం అర్థం చేసుకోటానికి ప్రయత్నించు.  ఏమీ కొంప మునగలేదు.  నేనింకా నీ పాత ఆనంద్‌నే…” ఎండిపోయిన పెదవుల్ని నాలికతో తడుపుకుంటూ మళ్లీ ఇలా అన్నాడు, ”నీకు కలిగిన కష్టాన్ని పంచుకునే ఉద్దేశంతోనే ఈ ప్రస్తావన తెచ్చాను.”
”చాల్లే, ఇంక ఆపు! ఒక్క దెబ్బకే నీ అసలు రంగు బైటపడింది.  ఎందుకూ పనికిరాని ఓట్టికుండవని తెలిసిపోయింది!”
”నన్ను నమ్ము, నేహా! నేను నీ కన్నీళ్లని తుడవాలనుకుంటున్నాను, నీ కష్టాలనీ, అవమానాలనీ నేను తీసుకుని నీకు సుఖాన్నివ్వాలనుకుంటున్నాను.”
తోకతొక్కిన తాచులా లేచింది నేహా, ”ఎవరి అవమానాన్ని? ఎవరి కన్నీళ్లని? నేనెవరినైనా రేప్‌ చేశానా? నాకెందుకుండాలి బాధ? నేనేం నేరం చేశానని? నేనెందుకేడవాలి?”
”నేహా! ఇంత జరిగినా నా ప్రేమలో ఏమాత్రం మార్పులేదు!”
”ప్రేమా?… నువ్వు ఆ మాట ఉచ్చరించటానిక్కూడా పనికిరావు.  నువ్వు ఎవర్నీ వేటాడలేకపోయవు, అందుకని అలాంటి కథలు వినీవినీ నువ్వే వేటాడిన అనుభూతిని పొందాలని చూస్తున్నావు!  లేదా గాయపడ్డ పక్షికి సేవలు చేసి గౌతమబుద్ధుణ్ణి అనుకోవాలని ఉద్దేశమా?… గాయపడిన ప్రాణి నీ ఒళ్లో వచ్చి వాలి, బాధనిండిన అమాయకపు కళ్లని ఎత్తి నీవైపు చస్తూ, సానుభతి చూపమని వేడుకుంటే, నీ గుండెల్లో మొహం దాచుకుంటే, నువ్వు నీ మొగతనంతో దాన్ని కాపాడతావు… అంతేగా? దీన్నే నువ్వు ప్రేమ అంటున్నావా?” కోపంతో ఊగిపోతూ నేహా అతన్ని కొంతసేపు రెప్పవాల్చకుండా చూసి, లేచి తలుపు తెరిచింది… బార్లా తెరిచిన తలుపులు…
ఏమిటిది? తనెందుకిలా ఓడిపోతున్నాడు? ఆనంద్‌ ఆందోళనగా లేచి పచార్లు చెయ్యసాగాడు.  మళ్లీ ప్రయత్నించటంలో తప్పులేదనిపించింది.
”నీకు ఎలా నచ్చచెప్పేది నేహా?  నాకు దురుద్దేశమే ఉంటే ఈ విషయం నీతో ఎందుకు మాట్లాడతాను, చెప్పు?”
”చెప్పకుండా ఎలా ఉండగలవు?  కుక్కలైతే కాసేపు మొరిగి ఊరుకుంటాయి.  మనుషులు వేలకి వేల ఏళ్ల తరబడి వాగుతూనే ఉంటారు!”
”నువ్వు విషయాన్ని తప్పుదారి ఎందుకు పట్టిస్తున్నావు?”
”ఇప్పుడే విషయం దారిలో పడింది.  ఇక నువ్వు వెళ్లచ్చు… ఇంకెప్పుడూ రావద్దు!  నువ్వు చేసిన గాయం కూడా మానుతుంది.  బహుశా దీని తాలూకు మచ్చకూడా మిగలకపోవచ్చు!”
నెమ్మదిగా ఆనంద్‌ని చేత్తో బైటికి నెట్టి నేహా తలుపుల్ని ధడాలుగా మూసేసింది.

Share
This entry was posted in అనువాదాలు. Bookmark the permalink.

3 Responses to వాళ్లు మరిచిపోలేరు!

  1. anonymous says:

    చాలా మంచి కథ. మూలం ఏ పత్రిక / పుస్తకం లో వుందో వివరాలు దయచేసి ఇవ్వండి.

  2. Anonymous says:

    సరి అయిన ముగింపు.

  3. Shyamala says:

    అద్భుతమైన కధ , చాలా చక్కని ముగింపు . జీవితానికి ప్రతిబింబమ , ఆధునిక మహిళకి జీవన మర్గమ చుపించిన రచయిత్రికి అభినందనలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.