జేమ్స్‌ జాయిస్‌- కె. సదాశివరావు

1.I have put in so many enigmas and puzzles that it will keep the Professors busy for centuries arguing over what I meant.

2. As an artist I’m against every state.

-James Joyce

జేమ్స్‌ జాయిస్‌ పుట్టినరోజు ఫిబ్రవరి రెండవ తేదీ నాటికి ”యులిసిస్‌” నవల పుస్తకాన్ని సిద్ధం చేయమని సిల్వియా బీచ్‌, ప్రింటర్‌ డారంటియెర్‌ని కోరింది. అన్నీ కాకపోయినా కనీసం నాలుగు కాపీలను ఎక్స్‌ప్రెస్‌ ట్రెయిన్‌లో పారిస్‌ పంపిస్తే అవి మర్నాడు చేరాలని చెప్పింది. కాని జాయిస్‌కి అవి తన లక్కీడే నాటికి చేరతాయో లేదోనన్న అనుమానం వుంది. అతడు సిల్వియాకి ఫోన్‌ చేసి మరోసారి తన పుట్టినరోజు నాటికి కాపీలు రావటం ఎంత ముఖ్యమో తెలియజేశాడు. ఆ ట్రెయిన్‌ వచ్చే ఉదయం ఏడుగంటలకి పారిస్‌ రైల్వేస్టేషన్‌కి సిల్వియా బీచ్‌ వెళ్ళింది. ప్రింటర్‌ అంతకు ముందే తెలియజేశాడు. ఆ ట్రెయిన్‌ గార్డ్‌కి రెండు కాపీలు ఇచ్చి పంపిస్తున్నానని. సిల్వియా బీచ్‌ ఆ రెండు కాపీలను తీసుకుని టాక్సీలో వెళ్ళి మొదటి కాపీని జేమ్స్‌ జాయిస్‌ చేతిలో పెట్టింది. దానికోసం జాయిస్‌ ఆదుర్దాతో ఎదురు చూస్తున్నాడు. కాపీని జాయిస్‌కి ఇచ్చాక సిల్వియా అక్కడి నుండి వెళ్ళి తన పుస్తకాల షాప్‌ ”షేక్స్‌పియర్‌ అండ్‌ కంపెనీ” విండోలో రెండవ కాపీని వుంచి ఇంటికి చేరింది.

పారిస్‌ వచ్చిన కొద్ది రోజులలోనే ఎజ్రా పౌండ్‌ ఓ మధ్యాహ్నం పార్టీని జేమ్స్‌ జాయిస్‌ కోసం తన మిత్రుడు ఆండ్రే స్పైర్‌ ఇంటిలో ఏర్పాటు చేశాడు. అక్కడ జాయిస్‌ మొదటిసారిగా సిల్వియా బీచ్‌ని కలిశాడు.

ఆమె అమెరికాలో ప్రిన్స్‌టన్‌లో వున్న ఓ ప్రీస్ట్‌ కూతురు. ఆమె తన పుస్తకాల షాప్‌ని – ”షేక్స్‌పియర్‌ అండ్‌ కంపెనీ” పేరుతో పారిస్‌లో సీన్‌ నదికి లెఫ్ట్‌ బాంక్‌లో తెరిచింది. ఆ రోజులలో ఇంగ్లీషు పుస్తకాల షాపులు… బ్రెంటానోస్‌… గాలిగ్నియాస్‌… డబ్ల్యు హెచ్‌ స్మిత్‌ వంటి అన్నీ రైట్‌ బాంక్‌లో వుండేవి.

ఆ రోజులలో వేలాదిమంది అమెరికన్స్‌ పారిస్‌ వచ్చేవారు. అమెరికాలో ఆనాడు అమలులోవున్న మద్యపాన నిషేధం నుండి పారిపోవటానికీ దానితోపాటు డాలర్‌కి ఫ్రాంక్‌కీ వున్న మంచి మారకపు విలువ ప్రత్యేక ఆకర్షణగా వుండేది. వచ్చిన వారిలో రచయితలు, కవులు, చిత్రకారులు వున్నారు. రానున్న రోజులలో వారినందరినీ కలిపి ఒకే గాటను కట్టే విధంగా గెర్ట్రూడ్‌ స్టెయిన్‌ అభివర్ణించింది. The Lost Generation – దారి తప్పిన తరం – ఇది ప్రపంచ సాహిత్య చరిత్రలో ముఖ్య సంఘటన.

వారిలో షెర్‌వుడ్‌ ఆండర్సన్‌, ఎర్నెస్ట్‌ హెమింగ్వే, జాన్‌ డాస్‌ పాసోస్‌, ఇ.ఇ. కమింగ్స్‌, ఆర్చిబాల్డ్‌ మెక్‌లీష్‌, హార్ట్‌ క్రేన్‌, టి.యస్‌. ఎలియట్‌, ఎజ్రా పౌండ్‌, విలియం ఫాక్నర్‌, ఎఫ్‌ స్కాట్‌ ఫిట్జెరాల్డ్‌, జాన్‌ స్టీన్‌ బెక్‌, థామస్‌ వుల్ఫ్‌ వున్నారు.

మొదటి ప్రపంచ యుద్ధానంతరం వచ్చిన కవిత్వంలో పెను మార్పులు తెచ్చిన కవి ఎలియట్‌, ఆనాటి విమర్శకులలో ముఖ్యులు. హెచ్‌.ఎల్‌.మెన్‌ కెన్‌, ఎడ్మండ్‌ విల్సన్‌, మాల్కామ్‌ కాలీ, లయనల్‌ ట్రిలింగ్‌, అలన్‌ టేట్‌, రాబర్ట్‌ పెన్‌ వారెన్‌ ఇంకా ఎందరో.

ఆ రోజున జాయిస్‌ తన మిత్రుల అభినందనలలో మునిగిపోయాడు. ఎన్నో ఫోన్‌కాల్స్‌, టెలిగ్రాములు, పుష్పగుచ్ఛాలు వచ్చాయి. మిత్రుడు మైరాన్‌ నటింగ్‌ అతడి భార్య పుష్పగుచ్ఛాలు పంపారు. అతడి అభిమానులు మిస్‌ వీవర్‌, జాన్‌ క్విన్‌, ఎజ్రా పౌండ్‌ అందరికీ కేబుల్‌ ద్వారా ఈ అద్భుత నవల తన రచయిత చేతికి రావడం గురించి తెలిసింది. ప్రింటర్‌ డారెంటియర్‌కి థాంక్స్‌ చెబుతూ ఓ టెలిగ్రాం వెళ్ళింది.

సిల్వియా బీచ్‌కి ప్రత్యేకంగా యులిసిస్‌ స్కీమా కాపీని తన చేతి రాతతో రాసి పంపాడు జాయిస్‌.

ఆ రాత్రి ఫెరారీ కఫెలో ఓ ప్రైవేట్‌ పార్టీని చేసుకున్నారు. దానిలోని ముఖ్య అతిథి యులిసిస్‌ మొదటి కాపీ!

జాయిస్‌ కుటుంబ సభ్యులతోపాటు మిత్రుడు రిచర్డ్‌ వాలెస్‌ అతడి భార్య లిలియన్‌, నట్టింగ్‌ దంపతులు, హెలెన్‌ ఫీఫర్‌, వారి మేనకోడలు, కుమార్తె లూసియా మిత్రురాలు ఇంకా కొంతమంది ఇతరులు వున్నారు.

తన డైరీలో హెలెన్‌ నట్టింగ్‌ ఆనాటి సీన్‌ని వర్ణిస్తూ ఇలా రాసింది-

”జాయిస్‌ హెడ్‌ ఆఫ్‌ ది టేబుల్‌గా కూర్చుని ఓ ప్రక్కకి తలని వాల్చి నిట్టూరుస్తూ దాదాపు ఏమీ తినకుండా డిన్నర్‌లో ఎక్కువ పదార్థాలను ఆర్డర్‌ చేస్తున్నాడు. భార్య నోరా, కొడుకు జార్జియో, కూతురు లూసియా ఏమీ మాట్లాడకుండా కూర్చున్నారు. అందరూ ఆత్రుతతో చూడాలనుకుంటున్న పుస్తకం మాత్రం జాయిస్‌ కూర్చున్న కుర్చీ క్రింద వుంది.

మొదట్లో ”యులిసిస్‌” నవలని కొనటానికి ఎవరూ ముందుకు రాలేదు. జాయిస్‌ తన మిత్రులతో తన నిరాశనీ నిస్పృహనీ పంచుకునేవాడు. సిల్వియాకు గుర్తుంది. ఓనాడు జాయిస్‌ నిట్టూరుస్తూ.

”నా పుస్తకం ఎన్నటికీ బయటకు రాదు” అన్నాడు.

అప్పుడు సిల్వియా ఉద్వేగంతో అడిగింది.

”షేక్స్‌పియర్‌ అండ్‌ కంపెనీ” యులిసిన్‌ నవలని ప్రచురించటానికి మీరు వొప్పుకుంటారా?”

అలా ప్రపంచ సాహిత్యంలోని ఓ ముఖ్యమైన నవల ఓ పుస్తకాల షాపు నడుపుతున్న యువతి చేతులతో బయటకు వచ్చింది. అంతకు ముందు ఆమెకు ఏ పుస్తకాన్ని ప్రచురించిన అనుభవం లేదు.

చివరికి తినటం అయిపోయాక పార్సెల్‌ని వూడదీశారు. ఆ పుస్తకం నీలిరంగు, తెలుపు రంగున్న కవర్‌లో వుంది. దానిని ఎంతో ప్రేమపూర్వకంగా జేమ్స్‌ జాయిస్‌ తీసి తన టేబుల్‌ మీద పెట్టాడు. ఆ క్షణంలో జాయిస్‌ ఎంతో కదలిపోయినట్లుగా కనిపించాడు. పార్టీలో వున్నవారు అందరూ యులిసిస్‌ పుస్తకానికి టోస్ట్‌ చేసి తాగారు.

ఆ రోజు విందు పూర్తయాక అందరూ కలసి పారిస్‌లో రూ రోయల్‌లో వున్న కఫె వెబర్‌కి వెళ్ళారు. అక్కడ జాయిస్‌ హెలెన్‌ నటింగ్‌కి, మిసెస్‌ వాలెస్‌లకి నవలలో వాళ్ళ పేర్లు ఎక్కడ వున్నాయో చూపించాడు. వారితోపాటు ఎజ్రా పౌండ్‌ పేరు కూడా వుంది. తర్వాత ఎక్కడికైనా వెళ్ళాలని నట్టింగ్‌ దంపతులు, ఇతరులూ అనుకుంటూంటే భార్య నోరా ఓ క్యాబ్‌లో బలవంతంగా తన కుటుంబీకులను ఇంటికి తీసుకుపోయింది. వెళ్ళేప్పుడు వాలెస్‌తో ఆమె ఇలా అంది.

”ఈ సన్నివేశాల నుండి నన్ను నేను రక్షించుకోవాలి.”

నోరాకి తెలుసు. అతణ్ణి ఇంటికి తీసుకుపోకపోతే ఆ సాయంత్రానికి అంతం ఉండదని, కొద్దిరోజులలో మిగిలిన కాపీలు కూడా పారిస్‌ వచ్చాయి.

జాయిస్‌ తన సంతకం పెట్టిన కాపీని సోదరుడు స్టానీకి… అతడు ట్రియెస్ట్‌ నగరంలో వున్నాడు…. పంపాడు.

కాపీ నంబర్‌ ఒన్‌… ఇది డీలక్స్‌ ఎడిషన్‌… దీనిని మిస్‌ వీవర్‌కి పంపాడు. దానిమీద ఇలా రాశాడు-

“In conception and technique I tried to depict the earth which is prehuman and possibly post human.”

అతడు ఎంతో ఆనందంతో ఆమె తన హీరోయిన్‌ పేరుని తన పేరుగా పెట్టుకోవటం ఎంతో వుంది అన్నాడు.

Penelope the weaver.

పెనెలపి – యులిసిస్‌ భార్య… యులిసిస్‌ లేని సమయంలో తనని పెళ్ళి చేసుకోమని వెంటబడుతున్న వ్యక్తుల బారి నుండి తప్పించుకోవడానికి ఓ ఎత్తుగడ వేస్తుంది ఆమె. తాను ఓ వస్త్రాన్ని నేస్తున్నాననీ అది పూర్తవగానే తాను పెళ్ళికి సిద్ధమవుతానన్న నిబంధనతో యులిసిస్‌ వచ్చేవరకూ ఆమె నేస్తూనే వుంటుంది.

”షేక్స్‌పియర్‌ అండ్‌ కంపెనీ” సిల్వియా బీచ్‌ వద్ద వున్న కాపీ మీద తన ధన్యవాదాలు తెలుపుతూ రాశాడు. అందులో ఓ చిన్న కవర్‌ పెట్టాడు. దానిలో “Who is Sylvia” అన్న పాట వుంది. కాపీ నంబర్‌ 3 మార్గరెట్‌ ఆండర్సన్‌కి వెళ్ళింది.

తన జీవితంలో ముఖ్యంగా యులిసిస్‌ నవల రచనా కాలంలో, ప్రచురణలో ముఖ్యపాత్రలు పోషించిన ముగ్గురు స్త్రీమూర్తులకు ఆ విధంగా జేమ్స్‌ జాయిస్‌ తన ధన్యవాదాలు తెలుపుకున్నాడు.

కాపీ నంబర్‌ వెయ్యి అతడు తన భార్య నోరాకి బహూకరించాడు. ఆమె వెంటనే దానిని ఆర్థర్‌ పవర్‌కి అమ్మటానికి ప్రయత్నించింది. ఇది జాయిస్‌కి ఫన్నీగా, ఓ జోక్‌లా తోచింది.

నిజానికి నోరా యులిసిస్‌ నవలని చదివి వుండదనే అందరూ నమ్మారు. కాని ఆమె నిజంగానే ఆ నవలని చదివింది. ఈ విషయాన్ని నోరా మెకల్మన్‌కి చెప్పింది.

”అతగాడు ఓ జీనియస్‌ అని నా ఊహ. కానీ అతడికి ఎంత డర్టీమైండ్‌ వుంది. నిజంగా!” అన్నది నోరా.

అప్పుడు మెకాల్మన్‌ ఆమెతో

”నీ అతి సాధారణ సమక్షం నీ భర్తని, మాటలని అందంగా కూర్చే కవిగా మార్చింది. అతణ్ణి ఓ స్టీఫెన్‌ డెడాలస్‌గా మార్చింది” అన్నాడు.

అప్పుడు నోరా

”వెళ్ళవయ్యా నువ్వు! ఇకమీదట మీరంతా ఈ తెలివితక్కువ ఆడది లేకుంటే అతడు ఇంకెంతో గొప్పవాడు అయ్యేవాడోనని అంటారు. అయితేనేం, నెవర్‌ మైండ్‌! ఇరవై ఏళ్ళ కాపురం తర్వాత నేనూ ఒకటో రెండో ముక్కలు చెప్పగలను.”

వచ్చిన కాపీలు వచ్చినట్లుగా ”షేక్స్‌పియర్‌ అండ్‌ కంపెనీ” షాపులో నుండి అమ్ముడుపోతున్నాయి. కానీ ఇంకా పుస్తకం మీద రాయల్టీలు రావటం ప్రారంభం కాలేదు. జాయిస్‌ కూడా మరో యాభై పౌనులు అప్పు తీసుకున్నాడు.

ఆ రోజు రాత్రి జాయిస్‌కి ఆలోచనలతో నిద్ర పట్టలేదు.

యులిసిస్‌ నవలని ఏడేళ్ళపాటు 1914 నుండి 1921 వరకు రాయటం జరిగింది. ఈ నవలని మూడు దేశాలలో ఇటలీ… స్విట్జర్‌లాండ్‌… ఫ్రాన్స్‌… మూడు నగరాలలో… ట్రియెస్ట్‌… జూరిచ్‌… పారిస్‌… ఇరవై చిరునామాలలో ప్రతిచోటా చిన్నచిన్న అగ్గిపెట్టెలలాంటి ఇరుకు గదులలో వుంటూ దారిద్య్రంతో బాధలు పడుతూ కంటి జబ్బులతో న్యూరాల్జియాతో ఆల్కహాలిజమ్‌తో కుస్తీ పడుతూ పిల్లల పెంపకంలో ఇబ్బందులు పడుతూ రాయటం జరిగింది. దానిని 1918 నుండి 1921 వరకూ అమెరికన్‌ సాహిత్య పత్రిక ”ది లిటిల్‌ రివ్యూ”లో సీరియల్‌గా ప్రచురించారు. ఆ పత్రికని మార్గరెట్‌ ఆండర్సన్‌, జేన్‌ హీప్‌ అన్న మహిళలు కలసి నడిపేవారు. వీరిద్దరికీ ప్రోత్సాహం ఇచ్చినది కవి ఎజ్రా పౌండ్‌. 1921లో అమెరికన్‌ పోస్టు ఆఫీస్‌ వారు ఈ పత్రిక కాపీలను పట్టుకుని పంచనీయకుండా పత్రికలో అశ్లీలమైన సాహిత్యం వున్నదన్న కేసు బనాయించారు. అందువల్ల ఎడిటర్లు మార్గరెట్‌ ఆండర్సన్‌, జేన్‌ హీప్‌లు చెరొక ఏభై డాలర్ల ఫైన్‌ కట్టవలసి వచ్చింది.

ఆ రోజులలో అమెరికన్‌ లాయర్‌ జాన్‌ క్విన్‌ – ఇతడు ఆధునిక చిత్రకళ అంటే ఇష్టపడేవాడు. వారిని డిఫెండ్‌ చేశాడు. కాని వారు ఓడిపోవటం జరిగింది. ఆ రోజులలో ”లిటిల్‌ రివ్యూ” పత్రిక ఫెమినిస్ట్‌ ఉద్యమాలనూ, ఆధునిక కవిత్వాన్నీ, కళలనీ ఆదరిస్తూండేది.

ఆ శిక్ష విధించటానికి కారణం యులిసిస్‌ నవలలోని ”నాసికా” అధ్యాయంలో లియోపోల్డ్‌ బ్లూమ్‌ హస్తప్రయోగం చేసుకునే సంఘటన ఆ నవలని బాన్‌ చేయటానికి దారితీసింది. కానీ ఈ విషయం ఎక్కువమంది పాఠకులకు అర్ధం కాదు. దీనికి కారణం జాయిస్‌ వాడిన క్లిష్టమైన భాష… ఇమేజెస్‌… భావప్రాప్తి వచ్చిన సమయంలో వర్ణించటంలో నేర్పు… దానిలోని ప్రతీకలు… ఇవన్నీ ఎంతో సమర్థవంతంగా వాడబడ్డాయి. అది ఆధునిక సాహిత్యంలోని ఓ ప్రముఖ ప్రయోగం. నిజానికి ఈ నవల మీద అశ్లీల ఆరోపణలు రావటానికి ముఖ్య కారణం బారనెస్‌ ఎల్లా అన్నావిడ రాసిన Very Explicit కవిత్వం అప్పుడు ”న్యూయార్క్‌ సొసైటీ ఫర్‌ ది సప్రెషన్‌ ఆఫ్‌ వైస్‌… (The New york society for the supression of vice) 1921లో కోర్టులో వేసిన కేసులో ఈ నవలని నిషేధించటం జరిగింది. 1920 దశకంలో అమెరికాలోని పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌వారు పోస్ట్‌లో వచ్చిన యులిసిన్‌ కాపీలను తగులబెట్టడం జరిగింది.

కానీ 1931లో రాండమ్‌ హౌస్‌ పబ్లికేషన్‌ వారి లాయర్‌ మారిస్‌ ఎర్నెస్ట్‌ ఓ కేస్‌లో ఈ విధానాన్ని ప్రశ్నించాడు.

ఈ కేసు అంతర్జాతీయ సాహిత్య చరిత్రలో ఓ మైలురాయి.

యునైటెడ్‌ స్టేట్స్‌ vs (one book called Ulysses) ఒన్‌ బుక్‌ కాల్‌డ్‌ యులిసిస్‌ కేసులో ఆ నాటి జడ్జి జాన్‌ ఎమ్‌. వూల్సే 1933 డిసెంబర్‌ నెలలో ఈ రూలింగ్‌ ఇచ్చాడు.

”ఈ పుస్తకం పోర్నోగ్రఫీ కాదు. అందువలన అది అశ్లీలమైనది కాదు.”

జడ్జి వూల్సే ఇంకా ఇలా అన్నాడు-

”యులిసిస్‌ నవలను అంత సులభంగా చదివి అర్థం చేసుకోగల నవల కాదు. ఈ పుస్తకం మీద ఎంతో రాయటం జరిగింది. దానిని సరిగా అర్థం చేసుకోవటానికి ఇంకా ఎన్నో పుస్తకాలను చదవవలసిన అవసరం వున్నది. ఆ పుస్తకాలన్నీ ఈ పుస్తకానికి గ్రహాలవంటివి. అందువలన యులిసిస్‌ చదవటం అన్నది ఓ బరువైన బాధ్యత.”

సాహితీ ప్రపంచంలో యులిసిస్‌ నవలకి వున్న ప్రసిద్ధి వలన నేను ఎంతో కాలం తీసుకుని రచయిత ఏ                 ఉద్దేశ్యంతో ఈ పుస్తకాన్ని రాశాడో తెలుసుకోవటానికీ నా విషయంలో ఓ పుస్తకం అశ్లీలమైనది అంటే మొదట నిర్ణయించవలసినది రచన… ఆ రచన రాసినప్పటి   ఉద్దేశం… పోర్నోగ్రఫీని రాయాలని రచయిత రాశాడా… అది సాధారణమైన పదం… అశ్లీలానికే పట్టం కట్టాలన్న ఉద్దేశం వుంటే అది పోర్నోగ్రఫీ అవుతుంది. చివరి అభిప్రాయంగా ఓ పుస్తకాన్ని పోర్నోగ్రఫీ అనాలంటే అవునా కాదా అన్నది తేల్చాలి. కానీ యులిసిస్‌ నవలలో అసాధారణమైన అంశాలున్నప్పటికీ ఎక్కడా నాకు వాటిలో వెకిలితనం, అశ్లీల భావాలున్న మనిషి చూపులోని వెకిలి నవ్వులూ కనిపించలేదు. అందువలన అది పోర్నోగ్రఫీ కాదు.”

ఆ విధంగా యులిసిస్‌ నవల అశ్లీల ఆరోపణల నుండి బయటపడింది.

ఆ నవల మీద సమీక్షలు రావటం మొదలు పెట్టాయి.

”అబ్జర్వర్‌” పత్రికలో సిస్లే హడిల్‌టన్‌.. ఇతడు జాయిస్‌కి స్వయంగా సిల్వియా బీచ్‌ ద్వారా తెలుసు. లిటరరీ సర్కిల్స్‌లో జాయిస్‌ ఓ జీనియస్‌ అన్న నమ్మకం వుంది. తన నమ్మకం మీద హడిల్‌టన్‌కి గురి వుంది.

”ఈ పుస్తకంలో అశ్లీలమైన పేజీలున్నాయి. కానీ స్త్రీ పురుషుల మనసుల్లోని ఆలోచనలని… ముఖ్యంగా సెక్స్‌ సంబంధించిన వాటిని ఎలా చిత్రించాలి? అది పోర్నోగ్రఫీ కాదు. అతడి గద్య రచనా విధానం అతడి ప్రతిభకి అద్దం పడుతుంది.

కానీ అందులోని ‘పెనెలపి’ విభాగంలోని మోలీ బ్లూమ్‌ మోనలాగ్‌ ప్రపంచ సాహిత్య విభాగంలో అత్యంత నీచమైనదిగా పేరు మోసింది. దానిలోని అశ్లీలం ఒక విధంగా ఎంతో సుందరంగా వుంటుంది. అది ఆత్మని పవిత్రమైన లోకాలకి మోసుకుపోతుంది.”

ఆ విధంగా ఈ సమీక్ష జాయిస్‌ దృష్టిలో 136 కాపీలకి ఆర్డర్స్‌ వచ్చేలా చేసింది. మరో 140 కాపీలకి ప్రోస్పెక్టస్‌ కావాలన్న ఆర్డర్స్‌ వచ్చాయి.

కానీ జాయిస్‌ దృష్టిలో ”మోలీ బ్లూమ్‌ ఓ సాధారణ ఐరిష్‌ స్త్రీ” ఆమెలో అంత సంస్కారం నాగరికతలు లేవు. ఆమె స్ట్రీమ్‌ ఆఫ్‌ కాన్షస్‌నెస్‌ వంటి ప్రక్రియలో ఆలోచించలేదు!

ఓ వారం రోజులలో 150 ఫ్రాంక్‌ ధరలో వున్న మొదటి ఎడిషన్‌ పూర్తిగా అమ్ముడుపోయింది.

”డెయిలీ హెరాల్డ్‌” పత్రికలో జార్జి స్కొలాబ్‌, నవలని పొగడుతూ ఇలా రాశాడు.

”జేమ్స్‌ జాయిస్‌ మనకి మనుషుల మనసుల్లోకి చూడటం నేర్పాడు. ఆలోచనా విధానాలు పవిత్ర అపవిత్రమైన ఆలోచనలు… స్పష్టమైనవీ… అత్యంత అశ్లీలమైనవీ… మురికివీ… మానవులకి వారికి ప్రకృతి సిద్ధంగా సంతరించిన సెక్స్యువల్‌ కోరికలు… పశువుల వంటి ఆకలితో.. కానీ రాస్తున్నప్పుడూ, మాట్లాడుతున్నప్పుడూ ఎంతో జాగ్రత్త వహించవలసిన అవసరాలను సాంఘిక కట్టుబాట్లు నిర్దేశిస్తాయి. మంచి మనుషులు, పవిత్ర మానవులుగా మారిపోయి వారి రాతలూ చేతలూ రెండు నాలుకల తత్వంతో వుంటాయి… చిత్తశుద్ధి లేకుండా… వారి ప్రవర్తనలో కపటం… నటనలూ ప్రవేశిస్తాయి.

ఈ ఎనిమిది వందల పేజీల నవలను రచయితలూ, రచయితలు కాదలచుకున్నవారూ తప్పక చదివి తీరాలి.

సాహిత్యాన్ని ఔపోసన పడదాం అనుకునేవారికి ఈ నవల మంచి గుణపాఠం నేర్పుతుంది.

పుక్కిటి పురాణాలను తెగ చదివి జీర్ణించుకుని వాటిలోని అంశాలను నిజాలని నమ్మే అమాయకులు అగస్త్యుడు సముద్రాలనీ, నదులనీ నీళ్ళన్నీ తాగేసి ఔపోసన పట్టేశాడన్న విషయాన్ని నిజమేననుకునేవారికి నిజానికి ఆగస్త్యుడే ఓ రెండు లీటర్ల సముద్ర జలాలను తాగితే రెండు రోజులలో తన తల్లి ఊర్వశి దగ్గరకు అర్జంటుగా టపాకట్టి వెళ్ళిపోవటం ఖాయమన్న విషయం తెలియదు. మానవ మేథకి ఉన్న పరిమితుల్ని ఈ నవల విడమర్చి చెబుతుంది. జీవిత కాలాలు గడిచిపోయినా ఈ నవల పేజీలలో అమర్చిన అనంతమైన భాషా సంబంధిత పజిల్స్‌… విప్పడానికి ఏ ఒక్క మానవునికీ సాధ్యం కాదు. దానిలోని హాస్యం మానవత్వం… అనంతమైన ఊహల పరవళ్ళు తొక్కే సముద్రాలు మనం ఓ అద్దాల గదిలోకి ప్రవేశించినట్లుంటుంది. అన్నిదిశలా కనిపించే ఎన్నో దృశ్యాలు ప్రతి క్షణమూ మారుతూ వుండే ప్రతిబింబాలు… అవన్నీ ఓ నిర్దుష్టమైన పద్ధతిలో ఇమడవు. మనం వాటిని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలంటే ఎన్నో భాషలలోని Neologisms కొత్త కొత్త మాటలు… పన్‌లు… నానార్థాలు… ఇవన్నీ పుడుతున్నది సామాన్య మానవుల మనసులలోనే… వారి దైనందిన జీవిత కాలాలలోనే… ఈ పుస్తకాన్ని మనం మరచిపోకుండా… ప్రతి మానవ జీవితంలోనూ బహుశా… ప్రతి రోజూ ఇటువంటి అనుభవాలే పునరావృతం అవుతుంటాయేమోనన్న అనుమానం వస్తుంది.

జార్జి స్కోలబ్‌ ”యులిసిస్‌” నవలని ఇలా చదవాలి అని సూచించాడు. అతడు చివరి భాగాన్ని ముందుగా చదవమని సలహా ఇచ్చాడు. మధ్యలోని క్లిష్టమైన భాగాలను మెల్లగా చదవాలని చెప్పాడు.

”యులిసిస్‌” నవల ప్రచురణానంతరం జాయిస్‌కి ఓ ప్రముఖ సాహిత్యకారుడిగా పేరుప్రఖ్యాతులు వచ్చాయి. పారిస్‌లో జరిగే ముఖ్యమైన సోషల్‌ ఈవెంట్స్‌లో జాయిస్‌ కుటుంబీకులు పాలుపంచుకునేవారు. ప్రపంచంలో అత్యంత ధనికులలో ఒకరైన స్త్రీ పెగ్గీ గుగెన్‌హీమ్‌ చిత్రకారుడు లారెన్స్‌ లాయెల్‌ని వివాహం చేసుకున్నప్పుడు ఆ పెళ్ళిరిసెప్షన్‌ ప్లాజా ¬టల్‌ ఎథీన్‌లో జరిగినప్పుడు జాయిస్‌ దంపతులు హాజరయ్యారు.

జాయిస్‌ సాహిత్య రంగంలో సూపర్‌ స్టార్‌ అయినప్పటికీ అతడి కుటుంబం చిన్నచిన్న ఇరుకు గదుల్లో సూట్‌కేసులతో, సామానులతో జీవించేది.

పారిస్‌లో ఓసారి ఓ యువకుడు జేమ్స్‌ జాయిస్‌ వద్దకు వచ్చి

”యులిసిస్‌ నవల రాసిన చేతిని నేను ముద్దుపెట్టుకోవచ్చా” అని అడిగాడు.

దానికి జాయిస్‌

”ఓ! నో! అలా చేయవద్దు. ఈ చేయి ఇంకా ఎన్నో ఇతర పనులు కూడా చేసింది” అన్నాడు.

యులిసిస్‌ మీద ఇంగ్లండ్‌ నుండి విమర్శ వచ్చింది. లండన్‌ డైలీ ఎక్స్‌ప్రెస్‌ ఇలా అన్నది.

”మిస్టర్‌ జాయిస్‌ రచనని చదవటం అంటే బోల్షివిక్‌ రష్యాని పరిశీలించటంలా వుంది. అన్ని విలువలూ కూలిపోయాయి”.

ఓ వారం తర్వాత ”స్పోర్టింగ్‌ టైమ్స్‌”లో దాని సాహిత్య విభాగపు విమర్శకుడు ”అరామిస్‌” ఇలా రాశాడు-

”యులిసిస్‌ నవల జాయిస్‌ జీవితంలోని ప్రాథమిక సభ్యతలను అన్నింటినీ పూర్తిగా రద్దుచేసింది. ఎక్కువ భాగం వెర్రి నవ్వులు వచ్చే కోతి చేష్టల వంటివి… ఈ పుస్తకంలోని ముఖ్య విభాగాలలోని విషయాలు హాటెన్‌టాట్‌ జాతీయులలో కూడా అసహ్యం కలిగించేలా వున్నాయి.”

ఈ విమర్శకీ పూర్తిగా భిన్నంగా ఫ్రాన్స్‌లో విమర్శ ఇలా వచ్చింది.

”ది యులిసిస్‌ ఆఫ్‌ జేమ్స్‌ జాయిస్‌” అన్న పేరుతో  Laraud NRF పత్రికలో విమర్శకుడు ఇలా రాశాడు-

”జాయిస్‌ ఈనాడు బ్రతికి వున్న ఆంగ్ల రచయితలలో ఎంతో ఉన్నతమైనవాడు.. ది గ్రేటెస్ట్‌… అతడు జోనధన్‌ స్విఫ్ట్‌… లారెన్స్‌ స్టెర్న్‌… హెన్రీ ఫీల్డింగ్‌, గుస్తావ్‌ ఫ్లాబె… బొదిలేర్‌ వంటి రచయితల కోవకు చెందినవాడు.

”కొందరు అశ్లీలాలూ, అసభ్యం అనుకునే అంశాలను జాయిస్‌ రచయితగా మానవుల సుగుణాలతోపాటు, దుర్గుణాలనీ, ఔన్నత్యాన్నీ… దౌర్భాగ్యాన్నీ సమగ్రంగా చూపాలనుకున్న ప్రయత్నంలోని భాగాలివి.”

”ఈ పుస్తకంతో ఐర్లండ్‌ దేశం ఉన్నతమైన యూరోపియన్‌ సాహిత్య రంగంలోనికి ప్రవేశం చేస్తున్నది.”

ఓసారి జాయిస్‌ తన మిత్రుడు బడ్జెన్‌ని అడిగాడు.

”నీవు సాహిత్యాన్ని ఎంతో చదివావు. దానిలో నీకు సంపూర్ణ పురుషుడు అనదగినవాడు ఎవరు?”

దానికి బడ్జెన్‌ ఎక్కువ ఆలోచించకుండా

”ఫాస్ట్‌… హామ్లెట్‌” అని సమాధానమిచ్చాడు. అప్పుడు జాయిస్‌ అన్నాడు.

”ఫాస్ట్‌ సంపూర్ణ మానవుడు కానే కాదు. అతడు అసలు మానవుడే కాదు… ఇంతకీ అతడు వృద్ధుడా… యువకుడా? అతడిలో ఇల్లూ… కుటుంబం ఎక్కడున్నాయి? అతడు సంపూర్ణంగా వుండే అవకాశం లేదు. ఎందుకంటే అతడిలో మెఫిస్టోఫిలిస్‌ ఎల్లప్పుడూ వుంటూనే వుంటాడు. ఇక హామ్లెట్‌ విషయానికి వస్తే అతడు కేవలం ఓ…. పుత్రుడు మాత్రమే… అన్ని విధాలా ఆ అర్హత వున్నది యులిసిస్‌… అతడు లాయెర్టెస్‌కి పుత్రుడు… టెలిమాకస్‌కి తండ్రి… పెనెలపికి భర్త… కలిప్సోకి ప్రియుడు… గ్రీకువీరులకి సోదర సైనికుడు… ఇథాకాకి రాజు… అతడు ఎన్నో కష్టాలను అనుభవించాడు. ధైర్యసాహసాలలో శక్తియుక్తులతో అన్నింటినీ అధిగమించాడు… అన్నింటికన్నా ముఖ్య విషయం ఏమిటంటే ట్రాయ్‌ కథ ముగియగానే యులిసిస్‌ సాహసగాథ ప్రారంభమవుతుంది” అన్నాడు.

జాయిస్‌ తన యులిసిస్‌ నవలలో ఓ సామాన్య మానవుడి జీవితంలో ఓ రోజు జరిగే సంఘటనలను చిత్రీకరించాడు. ఈ నవల గురించి ఓ మిత్రురాలికి ఇలా రాశాడు-

”నేను డబ్లిన్‌ నగరాన్ని గురించి ఓ సంపూర్ణమైన చిత్రాన్ని సృష్టిస్తున్నాను. ఒకవేళ ఆకస్మికంగా భూమి మీద నుండి డబ్లిన్‌ నగరం మాయమైపోతే దానిని నా పుస్తకం సాయంతో పునర్నిర్మించవచ్చు.”

ఆ రోజు రాత్రి పార్టీ తర్వాత జాయిస్‌కి తన నవలకి ఏ క్షణంలో అంకురార్పణ జరిగిందో గుర్తుకు వచ్చింది. అతడు తన సోదరుడు స్టానీకి ఉత్తరం రాశాడు. అందులో తనకి ఓ కొత్త కథకి ఐడియా వచ్చిందని… అది మిస్టర్‌ హంటర్‌ని గురించినది అని. మిస్టర్‌ హంటర్‌ యులిసిస్‌ నవలలో లియొపోల్డ్‌ బ్లూమ్‌గా అవతరించాడు.

ఎన్నో ఏళ్ళనాడు డబ్లిన్‌లో ఓ రాత్రి వస్తుండగా తనని గుర్తు తెలియని వ్యక్తులు కొడుతూ వుంటే రక్షించి తన ఇంటికి తీసుకుపోయి సపర్యలు చేసిన వ్యక్తే ఆల్‌ ఫ్రెడ్‌ హంటర్‌. ఇతను పొడుగాటి మనిషి. జాయిస్‌ తండ్రికి మిత్రుడు.

తన ప్రియురాలు, భార్య నోరా బార్నకుల్‌ని జాయిస్‌ 1904లో ఓ గార్డెన్‌ పార్టీలో మొదటిసారిగా కలిశాడు. ఆమె తన జీవితకాల భాగస్వామిని కాబోతున్నదని జాయిస్‌కి తెలియదు. ఆమె దట్టమైన ఎర్రటి జుత్తుతో, సన్నగా, అందంగా వున్నది. ఆమె అక్కడ ఓ బార్‌ మెయిడ్‌.

It was a love at first sight.

ఆమె పేరు ఇబ్సెన్‌. నాటకం డాల్స్‌హౌస్‌ లోని హీరోయిన్‌ పేరూ ఒక్కటే… నోరా… ఆమె ఊరు గాల్వే

అప్పుడు డాంటే ఆఫ్‌ డబ్లిన్‌ నోరా ఆఫ్‌ గాల్వేని కలుసుకున్నాడు.

వారిద్దరూ కలియటం ప్రపంచ సాహిత్య చరిత్రలోనే ఓ ముఖ్య సంఘటన. ఇద్దరూ కలియటానికి ఓ డేట్‌ నిర్ణయించుకున్నారు. కానీ ఆనాడు అది సాధ్యం కాలేదు.

కానీ వారు కలసినది

16 జూన్‌ నెల 1904 సంవత్సరంలో, నోరా తనకు తెలియకుండానే ప్రపంచ సాహిత్య చరిత్రలో భాగమైపోయింది.

ఆ రోజుననే యులిసిస్‌ నవలలోని సంఘటనలు జరుగుతాయి.

ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఓ సామాన్య పౌరుడు డబ్లిన్‌ వీధులలో విహరించిన అనుభవాలను జేమ్స్‌ జాయిస్‌ తన మహత్తర నవలలో ఆవిష్కరించటానికి ప్రయత్నించాడు.

ఆ రోజున ప్రపంచంలోని వేలాదిమంది జాయిస్‌ అభిమానులు – వీరిని జాయిసియన్స్‌ అంటారు. ”బ్లూమ్స్‌ డే”గా ప్రతి ఏటా జరుపుకుంటారు.

ఆ నవలలోని బ్లూమ్‌ ఇంటి ఎడ్రస్‌

7,  ECCLES,  STREET

అత్యంత ప్రసిద్ధి చెందినది.

సాహిత్యంలోని ఇతర ప్రముఖ ఎడ్రస్‌లు

221 బి బేకర్‌ స్ట్రీట్‌

ఇది షెర్లాక్‌ ¬మ్స్‌ ఎడ్రస్‌

V. Kulla, టాప్‌ ఫ్లోర్‌

Fiskar Gatan

ఇది మిలెనియమ్‌ ట్రిలజీ హీరోయిన్‌ లిస్‌బెత్‌ సలాండర్‌ ఫిక్షనల్‌ అడ్రస్‌. అయినా వేలాదిమంది బస్సులలో పోయి వీటిని ప్రతిరోజూ చూస్తూనే వుంటారు.

నోరాని పెళ్ళి చేసుకుంటానంటే జాయిస్‌ కుటుంబ సభ్యులు ఒప్పుకునే అవకాశం లేదు. అందువల్ల వారిద్దరూ కలసి లేచిపోయారు. జాయిస్‌ తండ్రి జాన్‌కి ఇది ఎంతో విషాదకరమైన సంఘటన. తన కొడుకు ఇలా ఓ బార్‌ మెయిడ్‌తో వెళ్ళిపోవటం అతడికి రుచించలేదు. ఇలా అన్నాడు-

”అలాంటి పేరుతో వున్న ఆమె వీణ్ణి ఎన్నటికీ వదలదు”

అలా వెళ్ళిన జాయిస్‌ దంపతులు – ఇటలీ, స్విట్జర్‌లాండ్‌, ఫ్రాన్స్‌ దేశాలలో రకరకాల అడ్రస్‌లలో నివసించారు. వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు.

1905లో జాయిస్‌ తన కుటుంబంతో రోమ్‌ వెళ్ళాడు. అక్కడ స్పానిష్‌ మెట్లకి సమీపంలో ఓ రూమ్‌ తీసుకుని నివసించారు. దగ్గరలోనే ప్రముఖ ఆంగ్ల కవులు షెల్లీ, కీట్స్‌ తాలూకు స్పిరిట్స్‌ తిరుగాడుతుండేవి. కీట్స్‌ స్టెప్స్‌ దగ్గరలో వున్న ఓ ఇంటిలో మరణించాడు. షెల్లీ వయా కార్లోలో వున్న ఓ ఇంటిలో నివసించేవాడు. తన కవితలు Censi, Prometheus Unbound అక్కడే రాశాడు. జాయిస్‌కీ కీట్స్‌ మీద అంత ఆసక్తి లేదు. అతడు షేక్స్‌పియర్‌, వర్డ్స్‌వర్త్‌, బైరన్‌, షెల్లీలను అభిమానించేవాడు.

అప్పుడు అతడి కథాసంకలనం ”డబ్లినర్స్‌” చివరకు వచ్చింది. దానిలోని చిట్టచివరి కథ ”ది డెడ్‌”.

ఈ కథలో ఐరిష్‌ పెరాలిసిస్‌ మీద జాయిస్‌ రాసిన ఒక కథాసంకలనం పూర్తవుతుంది. దానిలోని ”ది డెడ్‌” అతి ముఖ్యమైనదీ… అత్యద్భుతమైనదీ…

ఈ కథని రాయటానికి జాయిస్‌ ఎంతో శ్రమపడ్డాడు. పూర్తయ్యాక తన సోదరుడు స్టానీకి చదివి వినిపించాడు. స్టానీ అన్నని మెచ్చుకున్నాడు. ఈ కథ చాలా గొప్పదనీ తాను అమితంగా గౌరవించే రష్యన్‌ రచయితలు టాల్‌స్టాయ్‌, టర్జినీవ్‌ల సరసన వుండగల కథ అనీ అతడు భావించాడు.

‘డబ్లినర్స్‌’ కథా సంకలనంలో… అది ఫీస్ట్‌ ఆఫ్‌ ఎపిఫనీలూ, ఐరిష్‌ పెరాలసిస్‌లను దాటిపోయి ఏవేవో సాహితీ తీరాలకు తీసుకుపోతుంది. ప్రతి కథలోనూ జీవితాంశాలు అలవోకగా ప్రతిఫలిస్తూ, కవిత్వం అంతర్భాగంగా వుండిన కథా గమనంలో ప్రతి కథలోనూ ఓ ప్రత్యేకమైన మూడ్‌ని పట్టుకుని సాగాయి. కథల మీద కొందరు రచయితల ప్రభావాలున్నాయి. ముఖ్యంగా ఎమిలి జోలా, మపాసా వంటి ఫ్రెంచ్‌ రచయితల రియలిజమ్‌ వాసనలున్నాయి. అంతవరకూ ఐరిష్‌ సాహిత్యంలో ఈ విధమైన కథా రచనలు లేవు. ఈ కథలన్నీ ఒరిజినల్‌వి కానీ కాస్త వివాదాస్పదమైనవి అన్న విషయం పబ్లిషర్‌కి అర్థమయింది.

ఈ కథలలో జాయిస్‌ తన బలీయమైన వ్యక్తిగత భావాలు, మోసపోతున్నామేమోనన్న భయాలు, పూర్తిగా విజయవంతం కాని వివాహాలు, సెక్సువల్‌ ఫ్రస్టేషన్‌, తీరని కోరికలు, ఊపిరాడకుండా గొంతుకలను నొక్కే ఎఫెక్ట్‌ వున్న మత మౌఢ్య పరిష్వంగాలూ, అతి కౄరంగా వుండే మూఢనమ్మకాలూ, వృధా అయిన జీవితాలలోని అసహాయ దైన్యం, నిశితంగా నిర్దాక్షిణ్యంగా కోస్తున్నట్లుగా వుండే రాజకీయ వాతావరణం…

ఐర్లండ్‌ దేశంలో… డబ్లిన్‌ నగరంలో తన పాత్రల అంతర్లోకాలలో వుండే రహస్య భావాలను జాయిస్‌ తన కథలలో ప్రతిఫలించే ప్రయత్నం చేశాడు.

డబ్లిన్‌ నగరంలో మతిభ్రమణం కలిగించే విచిత్ర వాసనలూ… దానిలోని అస్పష్ట మానవ జీవన విధానాలూ ఆ నగరపు బార్లలో వుండే వాతావరణం ఏ మాత్రం మార్పు లేని సాంఘిక స్థిరత్వమూ ఇవన్నీ ఆ కథలలో కనిపిస్తాయి.

ఈ విషాదకరమైన జీవితాలలోని రహస్య కోణాలని ఎంతో సమర్థవంతంగా లేస్‌ పరదాల వెనక వుండే విలాసాలూ మురికిగా వుండి దుర్వాసనలు వెదజల్లే బోర్డింగ్‌ హౌసులలో ఆఫీసులలో వుండే పరిస్థితులూ మరణించినవారి స్మృతులతో నిండిన పాడుబడిన ఇళ్ళూ వీటిలో వుండే వాతావరణాన్ని అతడు తన గద్యంలో ఎంతో సమర్ధవంతంగా పట్టుకుని ఎతో సున్నితంగా, నైపుణ్యంతో ఆ కథలకి విశ్వనీనతనీ సమగ్రతనీ తెచ్చాడు జాయిస్‌.

ఈ సంకలనంలోని చివరి కథ ”ది డెడ్‌”. ప్రపంచ కథా సాహిత్యంలో ముఖ్యమైన ఓ వంద కథలలో ఈ కథ వుండి తీరుతుంది.

ఈ కథలో గాబ్రియెల్‌ కాన్రాయ్‌ తన భార్య జీవితంలోని ఓ మరపురాని బాల్యప్రియుణ్ణి గురించి తెలుసుకోవటం ముఖ్యమైన అంశం.

గాబ్రియెల్‌ భార్య గ్రెటా తన చిన్నతనంలో ఓ టీనేజ్‌ కుర్రాడు ప్రేమించటం… అతడి పేరు మైకేల్‌ ప్లూరీ… ఓ రాత్రి వణికించే చలిలో వర్షంలో తన ప్రేమని ఆమెకు తెలియజేయడానికి ఆమె ఇంటి ముందు గేటు వద్ద నిలుచుని వుంటాడు. ఆ మర్నాడు అతడు జ్వరంతో న్యూమోనియాతో చనిపోతాడు. బ్రతికివున్న రోజులలో అతడు గ్రెట్టా కోసం ఓ ఐరిష్‌ బాలడ్‌ “THE LASS OF AUGHRIN”. పాడుతూ వుండేవాడు. డెడ్‌ కథలో ఆ పాట ప్రస్తావన రావటంతో గ్రెటాకి అతడు జ్ఞప్తికి వస్తాడు. అతడు తనకోసమే ప్రాణాలను పోగొట్టుకున్నాడని ఆమె నమ్ముతుంది. ఈ విషాద జ్ఞాపకం ఆమెని జీవితాంతమూ వెంటాడుతూనే వుంటుంది. ఈ సంఘటనని సమన్వయం చేస్తూ వాతావరణాన్ని సృష్టించటంలో జేమ్స్‌ జాయిస్‌ అద్భుతమైన తన రచనా సామర్థ్యాన్ని చూపుతాడు.

ఆ సమయం పార్టీ సమయం… సంగీతం.. డాన్స్‌.. డ్రింక్స్‌.. భోజనాలు.. ఆనందం వెల్లివిరిసే సమయం… అంతటా చీర్‌… ఆ రోజున గాబ్రియెల్‌ కాన్రాయ్‌కి తన జీవితంలోని చేదునిజం తెలుస్తుంది.

ఈ విధంగా ”ది డెడ్‌” కవి డబ్లినర్స్‌ కథా సంకలనానికి ఓ ఉదాత్తమైన ఆలోచనల్ని రేకెత్తించే విషాదాంతాన్ని ఇస్తుంది. ఈ సున్నితమైనవెంటాడే కథ పేరు మాత్రం బ్రెట్‌ హార్ట్‌ రాసిన నవల పేరు హీరోకి వాడుకున్నాడు జాయిస్‌.

ఆ రోజున గాబ్రియెల్‌ ఆంటీలు, మోర్కాన్‌ సోదరీమణులు ప్రతి సంవత్సరం లాగానే జనవరి మొదటి వారంలో ఓ పార్టీ ఇస్తారు… అది ఫీస్ట్‌ ఆఫ్‌ ఎపిఫనీ.. డిన్నర్‌.. పనిమనిషి లిలీ అన్ని పనులూ చకచకా ఆనందంతో చేస్తుంటుంది. అతిథులను ఆహ్వానించటం… ఇల్లంతా ఆనందంతో.. నవ్వులతో.. సంగీతంతో నిండి వుంటుంది.

రాత్రి పది గంటలకు మేనల్లుడు గాబ్రియెల్‌ కాన్రాయ్‌ తన భార్య గ్రెటాతో ఆలస్యంగా వస్తాడు. అతడు లిలీని ఆమె అందచందాల మీద కామెంట్‌ చేస్తాడు. త్వరలో పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతావా అని అడుగుతాడు. ప్రతి పండుగ సందర్భంలో లాగానే ఆమెకు కొంత డబ్బు ఇస్తాడు… గాబ్రియెల్‌ పొడుగ్గా, లావుగా వుంటాడు. అతడు ఆ రోజు డిన్నర్‌ సమయంలో తాను ఇవ్వవలసిన స్పీచ్‌ గురించి మననం చేసుకుంటూ వుంటాడు. అంట్స్‌ జులియా, కేట్‌ అతడిని ఎంతో ఆదరంగా ఆహ్వానిస్తారు. ఆ రాత్రి పార్టీ తర్వాత గాబ్రియెల్‌ అతడి భార్య ఓ ¬టల్‌లో వుండి మర్నాడు ఇంటికి పోవాలని అనుకుంటారు. గాబ్రియెల్‌ అంటే అతడి ఆంటీకి ఎంతో ప్రేమ.

పార్టీకి ఫ్రెడ్డీ మనన్స్‌ అనే అతిథి బాగా త్రాగి వస్తాడేమోనని భయపడుతుంటారు.

అప్పుడు మిస్‌ డాలీ ఓ వాల్ట్‌ ్జని వాయిస్తుంది. విని అందరూ మెచ్చుకుంటారు. అనుకున్నట్లుగానే ఫ్రెడ్డీ బాగా తాగి వస్తాడు. ఇక అతడికి డ్రింక్‌ ఇవ్వవద్దని నిమ్మరసం ఇవ్వమని ఆంట్‌ కేట్‌ చెబుతుంది.

గాబ్రియెల్‌కి తన తల్లి గుర్తుకొస్తుంది. ఆ కుటుంబంలో సంగీత జ్ఞానం ఏమీ లేనిది ఆమె. గ్రెటాని పెళ్ళి చేసుకోవటం ఆమెకు ఇష్టం వుండదు. గాబ్రియెల్‌ ”ది డెయిలీ ఎక్స్‌ప్రెస్‌” పత్రికలో ఓ సాహిత్య కాలమ్‌ రాస్తుంటాడు. వచ్చే జీతంతో గాబ్రియెల్‌ కుటుంబం జీవిస్తున్నది. ఇంకా ఎన్నో సంఘటనలు జరుగుతాయి.

ఆంట్‌ జూలియా ఓ పాట పాడుతుంది. ఆమె కంఠం ఎంతో శ్రావ్యంగా వుంటుంది. కానీ చర్చిలో స్త్రీలు పాడరాదని పోప్‌ ఓ నిబంధన పెట్టటంతో ఆమె కంఠం ఎక్కువమంది వినే అవకాశం లేకుండా పోతుంది.

అందరూ డిన్నర్‌కి సిద్ధమవుతారు. గాబ్రియెల్‌ టేబుల్‌ మీద వున్న ఓ పెద్ద బాతుని కోసి ముక్కలు అందరికీ పంచుతాడు. డిన్నర్‌ పూర్తయ్యాక గాబ్రియెల్‌ తన స్పీచ్‌ ఇస్తాడు.

ఆ తర్వాత అందరూ కలసి “For they are a jolly good fellows” పాటని పాడుతారు.

ఇంకొంతకాలం గడుస్తుంది. ఎవరో ఓ పాట పాడతారు. గ్రెటా అడుగుతుంది ఆ పాట ఏమిటని…

అది “THE LASS OF AUGHRIN”.

ఈ పాటలో గ్రెటాకి తన బాల్యంలోని ఓ యువ ప్రేమికుడు గుర్తుకొచ్చి ఏడవటం మొదలుపెడుతుంది. గాబ్రియెల్‌ అడిగితే అంతా చెబుతుంది. ఈ సంఘటనని కథతో కలుపుతూ జాయిస్‌ వాతావరణాన్ని సృష్టించటంతో అద్భుతమైన రచనా సామర్థ్యాన్ని చూపుతాడు.

”ఆ రోజు మంచు కురుస్తున్నది. ఐర్లండ్‌ దేశం మొత్తం మీదా మంచు కురుస్తున్నది. నల్లటి మైదానాల ప్రతి భాగం మీదా కురుస్తున్నది. చెట్లు లేని కొండల మీదా.. అలెన్‌ ప్రాంతపు బొగ్గు గనుల మీదా, ఆ పైన పడమట దిక్కున నల్లగా తీవ్రంగా తిరుగుబాటు చేస్తున్న షానన్‌ నది అలల మీదా మెత్తగా మంచు కురుస్తోంది. ఒంటరిగా వుండే చర్చ్‌ యార్డ్‌లో.. మరుభూముల మీదా, మైకెల్‌ ప్లూరీని పూడ్చిపెట్టిన భూప్రదేశం మీదా మందంగా మంచు కురుస్తున్నది. వంగిపోయిన శిలువల మీదా తల దగ్గర పెట్టే శిలాఫలకాల మీదా, చిన్న గేటుకి వున్న ఇనుప మేకుల మొనల మీదా, బంజరు భూములలోని ముళ్ళ కంచెల మీదా… అతడి ఆత్మ మెల్లగా మూర్ఛపోయింది. మంచు ఈ మహావిశ్వంలో ఉధృతంగా కురుస్తోంది.. అది చివరికి జీవించిన వారి మీదా… మరణించిన వారి మీదా అందరి మీదా కురుస్తోంది.”

”ది డెడ్‌” కథ ఇలా ముగుస్తుంది.

ఈ కథకీ భార్య నోరాకీ సంబంధం వుంది. నోరా జీవితంలో ఇద్దరు టీనేజ్‌ ప్రియులున్నారు. ఇద్దరి పేరూ మైకేల్‌ – ఒకడు మైకేల్‌ ఫేనీ…. మరొకడు మేకైల్‌ బడ్‌కిన్‌… ఇద్దరూ వేరు వేరు కారణాలతో యవ్వనంలో మరణించారు. ఈ ఇద్దరు ప్రేమికులు కాంపోజిట్‌ పిక్చర్‌ మైకేల్‌ ప్లూరీ… ”ది డెడ్‌” కథలోని భార్య గ్రెటా ప్రేమికుడు.

కవులకి ప్రయాణాలంటే ఇష్టం. జాయిస్‌ స్వభావ సిద్ధంగా ఓ నిత్య ప్రయాణికుడు. డబ్లిన్‌ నగరాన్ని వదిలి వెళ్ళిపోవటానికి ముఖ్య కారణం అతడికి తెలుసు. ఎప్పుడూ జాయిస్‌ అనుకునేవాడు. తన నచ్చే పనిలోనికి బలవంతంగా తాను నెట్టబడ్డాడని.

”నీవు నీ తండ్రి ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళావు” అని అడుగుతాడు లియోపోల్డ్‌ బ్లూమ్‌ యులిసెస్‌ నవలలో.

”దురదృష్టాన్ని వెదుక్కోవటానికి” అంటారు స్టీఫెన్‌ డెడాలస్‌.

తిన్నగా డబ్లిన్‌ నుంచి జాయిస్‌ నోరా జూరిచ్‌ వెళ్ళారు. అక్కడ జాయిస్‌కి ఉద్యోగం లేదు. అందువల్ల ట్రియెస్ట్‌ వెళ్ళవలసి వచ్చింది. అక్కడ కొద్దిరోజుల తర్వాత ఓ ఉద్యోగం దొరికింది. అక్కడికి వెళ్ళకముందు జూరిచ్‌తో ఓ మిత్రుడి ఇంటిలో సామాన్లు పెట్టి ఓ రెండు సూట్‌కేసులలో వారు ట్రియెస్ట్‌ చేరారు. డబ్బు లేక ట్రియెస్ట్‌లో అందరి వద్దా అప్పులు చేశాడు. అవి తీర్చలేక దాదాపు ప్రతి రోజూ ఇల్లు మారుస్తూ వుండేవాడు. అక్కడ జాయిస్‌ తన నవలలోని ఓ అధ్యాయాన్నీ, ఓ కథ ”క్రిస్‌మస్‌ ఈవ్‌” ప్రారంభించాడు. ఆ కథ అతడి మామ విలియమ్‌ ముర్రేని గురించినది.

చివరికి ఉద్యోగం వచ్చింది. అతడి క్వాలిఫికేషన్‌ బి.ఎ. దానిని ఇటాలియన్‌లో dottore in filosofia అనేవారు. ఆ రెండు ఇటాలియన్‌లో సమానమైనవి.

ట్రయెస్ట్‌లో ఆ రోజులలో ఇటాలియన్స్‌, సెర్బియన్స్‌, జర్మన్స్‌ వుండేవారు. ఎన్నో భాషలు ఆ నగరపు వీధులలో వినిపించేవి. జాయిస్‌ నావల్‌ ఆఫీసర్లకి వారానికి పదహారు గంటలు ఆంగ్ల పాఠాలు చెప్పాలి. దానికి అతడికి రెండు పౌండుల జీతం ఇచ్చేవారు. వారు ఓ గదీ, వంటగదీ వున్న చిన్న ఫ్లాట్‌ని అద్దెకు తీసుకుని పాట్స్‌, పాన్స్‌, కెటిల్స్‌ కొని జీవితం మొదలుపెట్టారు.

నోరా ఫ్రెంచ్‌ నేర్చుకోవటం మొదలుపెట్టింది.

ఆ నగరాన్ని గురించి జాయిస్‌ ”ఫినెగాన్స్‌ వేక్‌”లో ఇలా రాయబోతున్నారు.

”అండ్‌ ట్రయెస్ట్‌, ఆ ట్రయెస్ట్‌ ఏట్‌ ఐ మై లివర్‌!”

అక్కడ ప్రశాంతంగా దాదాపు పదకొండేళ్ళున్నారు. జాయిస్‌ జీవితంలో డబ్లిన్‌లో సమయానికి ఇది దాదాపు సగం అన్నమాట. ఈ కాలంలోనే అతడు ”ఛాంబర్‌ మ్యూజిక్‌” పబ్లిష్‌ చేశాడు. ”డబ్లినర్స్‌” పూర్తి చేశాడు. రాసిన ”స్టీఫెన్‌ హీరోని” ”పొట్రైయట్‌ ఆఫ్‌ ది ఆర్టిస్ట్‌ యాజ్‌ ద యంగ్‌ మాన్‌”గా తిరగరాశాడు. ”ఎక్సైల్స్‌” నాటకాన్ని రాశాడు.

మే 1915లో ఇటలీ మొదటి ప్రపంచ యుద్ధంలో కాలు పెట్టడంతో జేమ్స్‌ జాయిస్‌ జీవితంలో మార్పు తెచ్చింది. అతడికి తెలుసు ఇటాలియన్స్‌ జర్మన్లని ఓడించి వియన్నాకి తీరికగా నడిచి పోదామనుకుంటే అది సాధ్యమయ్యేది కాదని.

పొట్టివాడైనా ఇటాలియన్‌ అధినేత విక్టర్‌ ఇమాన్యుయేల్‌ – అదే సమయంలో జర్మన్‌ నేత కెయిజర్‌కి గొంతుక పోయింది.

అందువల్ల అది ఇరవై అడుగుల దూరాన కనిపించని మనిషికీ అదే దూరంలో వినిపించని మనిషికీ మధ్యన జరిగే ద్వంద్వ యుద్ధమని అన్నాడు జాయిస్‌.

ఎవరో జాయిస్‌ని అడిగారు యూరోపియన్‌ దేశాల మహాపాపాలు (The Seven Deadly Sins) ఏవి అని – దానికి జాయిస్‌ చెప్పిన సమాధానం ఇది.

తిండిపోతు తనం ఆంగ్లేయులది, గర్వం ఫ్రెంచి వారిది, ఆగ్రహం స్పానిష్‌ వారిది, కామం జర్మన్స్‌ది, మురికితనం శ్లావిక్‌ జాతులవారిది, అత్యాస ఇటాలియన్లది, అసూయ ఐరిష్‌ వారిది అన్నాడు.

…. ఆ యువకుడు జాయిస్‌ని అడిగాడు.

”యూదులు చేసిన పాపం ఏమిటి?”

”ఏమీ లేదు. ఒకే ఒక పాపం… వారు జీసస్‌ని శిలువ వేశారు.”

జాయిస్‌ ఉటోపియాలను కొట్టి పారేసేవాడు. అతడు ఆస్ట్రో హంగేరియన్‌ రాజ్యాన్ని ఓ విచిత్రమైన వ్యవస్థగా వర్ణించేవాడు.

“I WISH TO GOD THERE WERE MORE SUCH  EMPIRES!” యుద్ధ సమయంలో జేమ్స్‌ జాయిస్‌ కుటుంబీకులు జూరిచ్‌ వచ్చి 1915లో ఓ చిన్న ¬టల్‌లో దిగారు. ఏళ్ళనాడు ఐర్లండ్‌ నుండి లేచిపోయి వచ్చిన ప్రేమికులు దిగినది కూడా ఆ ¬టల్లోనే.

రానున్న నాలుగేళ్ళలో వాళ్ళు వుండబోయే అడ్రస్‌లలో అది మొదటిది. ట్రియెస్ట్‌లో తన వస్తువులు, పుస్తకాలు, నోట్‌బుక్స్‌ అన్నీ వదిలి ‘యులిసిన్‌’ నవల తాలూకు మొదటి Fragment మాత్రం తనతో తెచ్చుకున్నాడు.

యుద్ధ సమయంలో జూరిచ్‌ నగరంలో రకరకాల భాషలవారు… కళాకారులూ.. విప్లవకారులూ రాజకీయ వాదులూ… ఎన్నో జాతులవారూ.. ఎన్నో దేశాలవారు ఉండేవారు.

డబ్లిన్‌ లాగానే జూరిచ్‌ని లిమ్మట్‌ నది మధ్యలో ప్రవహిస్తూ రెండు భాగాలుగా విభజిస్తున్నది.

డబ్లిన్‌ లాగానే జూరిచ్‌లో మంచి థియేటర్‌. ఆపెరాలకి ఆదరణ వుంది. పైగా అది హాట్‌ బెడ్‌ ఆఫ్‌ గాసిప్‌… రూమర్స్‌!

ఇదే సమయంలో టి.యస్‌. ఎలియట్‌ తన మహత్తర దీర్ఘకవిత ”ది వేస్ట్‌ లాండ్‌”ని రాస్తున్నారు. దానిని ఎడిట్‌ చేసి ఓ రూపాన్నిచ్చినది కవి ఎజ్రా పౌండ్‌. అది 434 లైన్స్‌ వున్న కవిత… ఏప్రిల్‌ ఎంతో కౄరమైన నెల… పిడికెడు ధూళిలో నేను నీకు భయాన్ని చూపిస్తాను… వంటివి పంక్తులు వున్న కవిత.

కార్ల్‌ యంగ్‌ తన ప్రత్యేకమైన సైకో ఎనాలసిస్‌ని సృష్టిస్తున్నాడు. వ్లాదిమిర్‌ లెనిన్‌ అక్కడే వుంటూ పిలుపుకోసం, రష్యాలో తన సమయం కోసం ఓపికగా ఎదురు చూస్తున్నాడు. సాంస్కృతికంగా విధ్వంసక డాడాయిస్టులు ట్రిస్టాన్‌ జారా ఇతరులు రకరకాల ప్రయోగాలు చేస్తూ ఆ పైన చిత్రమైన పోకడలలో మార్గాలు వెదుకుతున్నారు. ఈ అస్తవ్యస్త పరిస్థితులలో స్టిఫాన్‌ జ్వెయిగ్‌, రోమా రోలాలు, తమ యుద్ధ వ్యతిరేక పత్రిక ‘ఇంటర్నేషనల్‌ రివ్యూ’లో సాంస్కృతిక, రాజకీయ రంగాలలో తమ ప్రత్యేక ముద్ర వేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

జూరిచ్‌ నగరంలో మొజార్ట్‌, గొధె వాగ్నర్‌ల స్పష్టమైన నీడలున్నాయి. కాసనోవా ఆ వీధులలో తిరుగాడిన జాడలున్నాయి. ఆ నగరంలో మ¬జ్వలమైన సంగీత వారసత్వానికి చిహ్నాలుగా ఆపెరా కంపెనీలు ప్రదర్శనలిస్తుండేవి.

జాయిస్‌ తన కంటి జబ్బు నుండి కొద్దిగా స్వస్థత చెందుతున్నాడు. కాని అతడి పవర్‌ ఆఫ్‌ రికలెక్షన్‌ ఎంతో నిశితంగా ఉండేది. కంటి చూపు మందగిస్తున్నప్పటికీ అతడు మనసులో నిక్షిప్తమైన దబ్లిన్‌ నగరం, దానిలోని మనుషుల జీవితాలు ఎంతో స్పష్టంగా అతడి మానసిక ప్రపంచంలోకి ప్రవహిస్తున్నాయి.

ఏప్రిల్‌ 7వ తేదీన వ్లాదిమిర్‌ లెనిన్‌ జూరిచ్‌ వదిలి రష్యా వెళ్ళిపోయాడు. ప్రపంచ చరిత్రలో తన ముద్ర వేయటానికి, రానున్న కాలంలో అది జరుగబోత్నుది.

జాయిస్‌ గ్లాకోమా, లంబాగో వంటి పలు వ్యాధులతో సతమతమవుతున్నాడు. ఆల్కహాలిక్‌ సమస్యలతో అప్పుడప్పుడు అతడి కళ్ళనుండి రక్తపు చుక్కలు ఎంతో బాధాకరంగా రాలేవి. జాయిస్‌ తన నవలా రచన కోసం వాల్టర్‌ లీఫ్‌ రాసిన ”ట్రాయ్‌ ఎ స్టడీ ఇన్‌ ¬మరిక్‌ జాగ్రఫీ”ని క్షుణ్ణంగా చదివాడు. తర్వాత విక్టర్‌ బెర్నార్డ్‌ రచన – ”ది ఫోనీషియన్స్‌ అండ్‌ ఒడిస్సియస్‌” అన్న పుస్తకం చదివాడు. ఒడిస్సియస్‌కి యూదు జాతి సంబంధాలున్నాయని అతడికి తెలిసింది. అందువలననే తన నవలలోని లియోపోల్డ్‌ బ్లూమ్‌ ఓ వాండరింగ్‌ జ్యూగా తిరుగాడుతుంటాడు.

డబ్లిన్‌ నగరం తన నవలలో జీవం పోసుకోవటానికి అతడు ఆనాటి – భాషా, శ్లాంగ్‌ వున్న పుస్తకాలను చదివి, తన నోట్‌బుక్‌లో పేజీల నిండా మాటలు, ఫ్రేజులు… తన పాత్రల మాటలకు సరిగా వుండే పదాలను ఏరి… వాటిని చిన్న కాగితం ముక్కల మీద… రంగు రంగుల పేపర్‌ల మీద… మెనూ కార్డుల మీద… సిగరెట్‌ పెట్టెల మీద… రాసి… ఇవన్నీ అతడి షర్ట్‌… కోట్‌ జేబులలో దొరికేవి. ఇంటిలో బొమ్మల క్రిందా… ఇతర వస్తువుల క్రిందా దొరికేవి. ఈ నోట్స్‌ అతడు కాగితాల మీదకు ఎక్కించేవాడు. వాడేసిన వాటిని రంగు రంగుల క్రేయాన్స్‌తో కొట్టేసేవాడు. అవన్నీ ఏదో ఓ ఎపిసోడ్‌లోవాడటం జరిగేది.

మే 18, 1922వ తేదీన ఇంగ్లీష్‌ నవలా రచయిత స్టీఫెన్‌ హడ్సన్‌ జేమ్స్‌ జాయిస్‌ని ఓ డిన్నర్‌ పార్టీకి రమ్మని ఆహ్వానించాడు. ఆ పార్టీని మ్యూజిక్‌ కంపోజర్‌ ఇగార్‌ స్ట్రొవిన్‌స్కీ, డాన్సర్‌ డియాగిలెవ్‌ల కోసం ఇచ్చినది. వారి కొత్త బాలే ప్రదర్శనానంతరం జాయిస్‌ లేట్‌గా వచ్చి క్షమాపణ కోరారు. అతడు ఫార్మల్‌ డిన్నర్‌ డ్రెస్‌ వేసుకోలేదు. అతడికి ఆ రోజుల్లో ఫార్మల్‌ డ్రెస్‌లు… టక్సెడోలు వంటివి లేవు. ఈ అసందర్భపు ఎంబరాస్‌మెంట్‌ని కప్పి పుచ్చుకోవటానికి అతడు ఎక్కువగా తాగటం మొదలుపెట్టాడు.

అప్పుడు తలుపు తెరుచుకుని ఫ్రెంచ్‌ నవలా రచయిత మార్సెల్‌ ఫ్రూస్ట్‌ (Maroel Proust)వచ్చాడు. అతడు ఎంతో అందంగా, ఫాషనబుల్‌గా వున్న ఫర్‌తో కుట్టిన ఫార్మల్‌ డిన్నర్‌ జాకెట్‌లో వున్నాడు. జాయిస్‌ తర్వాత అతడిని ఇలా వర్ణించాడు.

”మార్సెల్‌ మేరీ కొరెల్లీ నవల ‘సారోస్‌ ఆఫ్‌ సాటన్‌’లోని హీరోలా వున్నాడు”.

నిజానికి స్టీఫెన్‌ హడ్సన్‌ ప్రూస్ట్‌ని పార్టీకి రమ్మని ఆహ్వానించాడు. కానీ అతడు వస్తాడో రాడోనన్న అనుమానం వున్నది. అతడు తన ఫ్లాట్‌ని వదిలి బయటకు రావటానికి ఎన్నో సందేహాలుంటాయి. జాయిస్‌ హడ్సన్‌తో సహా ద్వారం దగ్గరకు వెళ్ళాడు. హడ్సన్‌ వారిని ఒకరికొకరికి పరిచయం చేశాడు.

ఆ రోజు జరిగిన సంఘటన తర్వాత రకరకాలుగా వర్ణించారు.

ఆ నాటికే ప్రూస్ట్‌ రచన ”ఇన్‌ సెర్చ్‌ ఆఫ్‌ లాస్ట్‌ టైమ్‌ (IN SEARCH OF LOST TIME) ప్రచురణ జరిగివుంది. అది ఇరవయ్యో శతాబ్దపు ముఖ్య నవలలో ఒకటిగా పేరు సంపాదించినది.

ఓ వెర్షన్‌ ప్రకారం… విలియమ్‌ కార్లోస్‌ విలియమ్స్‌… ఇతడు అమెరికన్‌ కవి… వాళ్ళు కూర్చున్న తర్వాత జాయిస్‌ అన్నాడు.

”నాకు ప్రతి రోజూ తల నొప్పులు వస్తాయి. నా కళ్ళు భయంకరంగా వున్నాయి.”

దానికి ప్రూస్ట్‌ అన్నాడు.

”మై పూర్‌ స్టమక్‌! నేనేం చేయను? అది నన్ను చంపేస్తున్నది. నిజానికి నేను ఇక్కణ్ణుంచి వెళ్ళిపోవాలి.

”నేనూ అలాంటి పరిస్థితిలోనే వున్నాను. ఎవరైనా నన్ను ఇంటికి తీసుకుపోతే బావుణ్ణు! గుడ్‌ బై!”

”చార్మ్‌!” అన్నాడు ప్రూస్ట్‌ ”ఓ! నా పొట్ట”

మార్గరెట్‌ ఆండర్సన్‌ మాటలలో ప్రూస్ట్‌ అన్నాడు.

”మిస్టర్‌ జాయిస్‌ రచనలను నేను చదవలేదని బాధపడుతున్నాను.”

జాయిస్‌ దానికి అన్నాడు.

”నేనూ అంతే, మిస్టర్‌ ప్రూస్ట్‌ రచనలను నేనూ అసలు చదవలేదు.”

వారి సంభాషణ అలా ముగిసింది.

ఆర్ధర్‌ పవర్‌తో జాయిస్‌ తర్వాత చెప్పాడు.

ప్రూస్ట్‌ అడిగాడు.

”జాయిస్‌ మీకు ట్రూఫుల్స్‌ (ఓ రకమైన ఆహార పదార్థం) అంటే ఇష్టమేనా?”

దానికి జాయిస్‌ అన్నాడు.

”యస్‌ నాకు అవంటే ఇష్టమే”

అప్పుడు పవర్‌ ఇలా కామెంట్‌ చేశాడు. ”ఇక్కడ ఇద్దరు గ్రేట్‌ లిటరరీ ఫిగర్స్‌ – మన కాలంలోని ముఖ్యులైన ఇద్దరు లిటరరీ ఫిగర్స్‌ కూర్చుని ఒకరినొకరు ట్రూఫుల్స్‌ గురించి అడుగుతున్నారు.”

జాయిస్‌ తర్వాత జాన్‌ మెర్‌కాంటర్‌తో చెప్పినది ఇది.

”ప్రూస్ట్‌ మాట్లాడినది అంతా డచెస్‌ల గురించి. కానీ నేను ఛాంబర్‌ మెయిడ్స్‌ని గురించి మాట్లాడడానికి ఇష్టపడ్డాను.

బడ్జెన్‌కి మరో వెర్షన్‌ని చెప్పాడు.

”మా సంభాషణలో ఎక్కువ భాగం ‘నో’ అన్న పదాన్ని వాడటం జరిగింది.

ప్రూస్ట్‌ నన్ను మీకు ఫలానా డచెస్‌ తెలుసా అని అడిగితే నా సమాధానం ‘నో!’

ఆనాడు డిన్నర్‌ ఇచ్చిన గృహిణి ప్రూస్ట్‌ని ‘యులిసెస్‌’లోని ఫలానా అధ్యాయాన్ని చదివారా అని అడిగితే అతడు ‘నో’ అన్నాడు.

అలా జరిగింది.

వారి జీవన విధానాలలో ఎంతో తేడా వుంది.

పగలంతా జాయిస్‌ పనిచేస్తాడు.

రాత్రంతా పని చేయటం ప్రూస్ట్‌కి అలవాటు.

ఒకరి దినసరి కార్యక్రమం పూర్తవుతుండగా మరొకరి రాత్రి సమయపు కార్యక్రమం ప్రారంభమవుతుంది. వారి జీవన విధానాలు పూర్తిగా విరుద్ధం.

టాక్సీలో తన ఫ్లాట్‌కి వెళదామని ప్రూస్ట్‌ చెప్పినప్పుడు పార్టీ అంతమయింది. జాయిస్‌ కూడా టాక్సీలో ఎక్కాడు. కాని అతడు చేసిన పెద్ద తప్పు ఏమిటంటే టాక్సీ తలుపు తెరవటం. కానీ మరొకరు వెంటనే దానిని మూసివేశారు. అందరూ ప్రూస్ట్‌ అపార్ట్‌మెంట్‌ చేరాక ప్రూస్ట్‌ జాయిస్‌ని టాక్సీలో ఇంటికి వెళ్ళమన్నారు. కాని జాయిస్‌ ఇంకా వుండాలని ప్రయత్నించాడు. కాసేపు కబుర్లు చెప్పుకుందామని. కాని ప్రూస్ట్‌ బయటవుంటే అతడికి అనారోగ్యం అన్న భయం – జుఞజూశీరబతీవ అని త్వరగా లోనికి వెళ్ళిపోయాడు. ఇక హడ్సన్‌ జాయిస్‌ని ఇంటికి పంపక తప్పలేదు.

జాయిస్‌ తర్వాత అన్నాడు.

”మేమిద్దరం కలిసి ఎక్కడేనా ఓ చోట కాసేపు మాట్లాడుకోగలిగితే బావుండేది.”

జాయిస్‌కి ప్రూస్ట్‌ జీవన విధానాలంటే కాస్త అసూయ.

ప్రూస్ట్‌కి ఎంతో సౌకర్యంగా వుండే ప్లేస్‌ వుంది. గోడలకీ, నేలకీ కార్క్‌లతో ఏ శబ్దాలు రాని గదిలో అతడు పని చేసుకుంటాడు. నేను రాసుకునే ప్రదేశంలో మనుషులు వస్తూ పోతూ వుంటారు. నేను యులిసిస్‌ని ఎలా పూర్తి చేశానో నాకు అర్థం కాదు” అన్నాడు జాయిస్‌.

(ఈ రచనలో వాడిన పుస్తకాలు 1. డబ్లినర్స్‌ (కథాసంకలనం), 2. యులిసిన్‌ (నవల), 3. ఫిన్నెగాన్స్‌ వేక్‌ (నవల), 4. జేమ్స్‌ జాయిస్‌ బయోగ్రఫీ : గార్డన్‌ బౌకర్‌, 5. జేమ్స్‌ జాయిస్‌ బయోగ్రఫీ : రిచర్డ్‌ ఎల్‌మన్‌)

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.