భూమి పుత్రిక

యం.ఆర్‌. అరుణకుమారి

 ”చిన్నా! నువ్వు బాగా సదివి… పోలీసై… ఎక్కడా తప్పులు జరక్కుండా సూసుకోవల్లగాని… నువు యా తప్పూ సెయ్యగూడదు.”
 జలజలా…రాలుతున్న కన్నీటి చుక్కలు! గుండెకు బాధనే చిల్లుపడి ఉబుకుతున్న కన్నీరు.  వేదనాసుడులు తిరుగుతూ సాగుతున్న కన్నీరు.  ఎద లోతుల్లోంచి ఎగిసిపడ్తూ కళ్ళ కాసారాల్లోంచి ఎదపైకి దూకుతున్న కన్నీటిప్రవాహం!  మనసు మంటల్తో కలసి బడబాగ్నులు చిమ్ముతున్న కన్నీరు.  ఎంత చింతపడితే కారేను అన్ని కన్నీళ్ళు?  ఏ చితినెక్కితే ఆగేను ఆ కన్నీళ్ళు!

*     *      *
 ”చిన్నా! యేమైంది నాయ్నా?”
 పాఠం గడగడా చదువుతన్న చిన్నాను మురిపెంగా చూసుకొంటూ మట్టి పిసుకుతున్న లచ్చుమమ్మ వాడు చదవటం ఆపేసి ఆలోచనల్లో పడడం చూసి ఒకింత ఆందోళనగా అడిగింది.
 ”ఆ ఏంలేదు లేవా!” చిన్నా ఉలిక్కిపడి ఉదాసీనంగా జవాబిచ్చేడు.
 ”ఆకలైతాందా? సద్ది కలిపిస్తానుండు” లచ్చుమమ్మ లేచి తొట్టి దగ్గరకు నడిచింది కుంటుకుంటూ.  ‘కూసుంటే లేసేది, లేస్తే కూసునేదే కష్టమైపోతాంది.  యాడ నరాలాడే పట్టకపోతాండాయి.  ఏం నొప్పులో…ఏం కర్మమో!’ గొణుగుతూనే గుడిసె లోపలికి వెళ్ళి సత్తుగిన్నెలో సద్ది కలిపి తెచ్చి చిన్నా ముందు పెట్టింది.
 ”నంచుకోను గదా ఏం ల్యా! ఎర్రగడ్ల యెల సుక్కల్లో వుండాది.  మిరపకాయ కారమంటావు.  అట్నే తాగీ చిన్నా! మొత్తంగా పిసిక్నా. బాంటాదిలే” చిన్నా సద్దిగిన్నె ముట్టకపోవడంతో బాధపడ్తూ చెప్పింది.
 ”వొద్దువా. నాకాకలిగాలే! నువ్వు తాగీ, నే యిస్కూల్లో తింటా గదా!”
 ”నా బిడ్డే! మంచి మద్దేనం ఎబ్బుడో గదా పెట్టేది యిస్కూల్లో అన్నం?  అంచేపు పస్తెట్టా వుంటావుగానీ తాగీ చిన్నా! నా బంగారుకొండ గదా!” లచ్చుమమ్మ మనవడి పక్కన కూచుని తల వీపు నిమురుతూ లాలనగా చెప్తూ, వాడి కళ్ళల్లో నీళ్ళు చూసి గాబరాపడింది.
 ”ఏం చిన్నా! ఏం తండ్రీ…ఏమాయ? జొరమా? తల్నొప్పా? కడుపునొప్పా?” నుదురు, మెడ, పొట్ట ఆతృతగా తడిమింది.
 ”కాదువా! లేదువా! నాకేంగాలే!” అంటూనే అవ్వను వాటేసుకొని ఏడ్చేసాడు చిన్నా.
 ”యింగెందుకు నాయ్న…..”
 ”మాయమ్మ గ్యాపకమొచ్చీ…..” చిన్నా వెక్కుతుంటే లచ్చుమమ్మ నివ్వెరపోయింది.  ‘అమ్మొదిలి పోయి రెండేండ్లాయ.  నాయన వుండీ లేనట్టే గదాని కండ్లల్లో పెట్టుకొని సాకుతున్యా అమ్మ గ్యాపికానికొచ్చిండాదంటే….తను బాగా సూసుకోలేదన్న మాటే గదా!’ లచ్చుమమ్మ తల్లడిల్లిపోయింది.
 సంక్రాంతి పండుగ వస్తోంది.  కొత్త కుండలు, ముంతల్లో పొంగలి వండుతారని, కనుమనాడు కొత్త చట్టిలో అన్నం వండి, వేటను బలిచ్చి, ఆ నెత్తురు కలిపిన ‘పొలి’ అన్నాన్ని పొలాల్ల్లో చల్లుతారని…కనీసం ఈ సాంప్రదాయాల కోసమన్నా కొత్తకుండలు, చట్లు కొంటారన్న ఆశతో భర్తను పోరింది.
 ”నీ పిచ్చిగానీ…గాస్‌పొయ్యిలు, అయేంటో నిముసాల్లో వుడికే కుక్కలో, కుక్కరులో…కాదని మన సట్లెవురు కొంటార్లేమే!” అన్నా విన్పించుకోలేదు.
 మట్టిమోసింది.  చేతులు బొబ్బ లెక్కేలా బోరుకొట్టి నీళ్ళు మోసింది.  మోకాళ్ళ నొప్పులంటూనే మట్టి తొక్కింది.  బుల్లిబుల్లి కుండలు, చట్లు, ముంతలు భర్త దగ్గరుండి చేయించింది.  మిగిలిన మన్ను మెత్తగా పిసికి పెచ్చులూడిన గుడిసెగోడలు, అరుగులు, గచ్చుగుంతలు మెత్తుతోంది.
 ‘నిజమే గదా! యీ మద్దె… యీ పన్లతో నిముసం తీర్బాటు లేకుండా పోయ.  ఏందో నాల్గు దుడ్లొస్తే… ‘అందురికీ యూనిపాం వుండాది. నాకే ల్యా’ అని యాడస్తావుండాడే… కుట్టిద్దారి… అను కొనిందేగాని… వీడికి వాల్లమ్మ గ్యాపకానికి వొస్తొండాదని, వొస్తాదని గదా అనుకోలా మల్ల!’ లచ్చుమమ్మ నిట్టూర్చింది.
 ”’సూడువా! ఈ పాటంలో కోడిపిల్ల వాల్లమ్మను ఎతుక్కొంటా….ఆవును, మేకను, కాకిని, బాతును, పావురాన్నీ అడుక్కొంటా… అడుక్కొంటా పోయి… కడాన మల్లమ్మను కల్సుకొంటాది.  అబ్బుడు వాల్లమ్మ ‘మీకు బువ్వ తెచ్చేదాన్కే కదా నేనొచ్చిండాను.  అంతలోకే నువ్వేల వొస్తివి.  దావ్ల్లో నీకేమన్నా అయ్యుంటే ఎట్టా’ అని బాదపడ్తాది.  అమ్మలంతా…బిడ్లు బాగుండల్లని ఎన్నో కస్టాలు, బాదలూ పడ్తారని మా మేడం చెప్పినురు నిన్న ఈ పాటం చెప్పేనబ్బుడు.  అది గ్యాపకమొచ్చినాదివా!” లచ్చుమమ్మ మనసు ద్రవించిపోయింది.  చిన్నాను గాఢంగా గుండెకు హత్తుకొంది.
 ”నిజమే గదా నాయనా! అమ్మల బాదలంతా బిడ్లు బాగుండల్లనే!”
 ”ఈ పాటం చెప్తా…మా మేడం ఒగ కత గదా చెప్పిండారువా” చిన్నా వుత్సాహంగా చూశాడు.
 ”అవునా చిన్నా! నువ్వు కతలు బలే బాగా సెప్తావు. సెప్పు. సెప్పు. యిందారి” చిన్నా దుఃఖం మర్చిపోవాలని లచ్చుమమ్మ ప్రోత్సహింపుగా అంది.
 ”అనగనగా ఒగ కొడుకు ఆ కొడుకు అమ్మానాయ్నల మాట యినకుండా సానా సెడ్డోడుగా తీరిపోయ్నడు. వాడు ఎంత సెడ్డోడంటే… ఆ… అచ్చం… మా నాయ్న… ఛీ… ఛీ… మా నాయ్న కాదు… నీ కొడుకంత సెడ్డోడన్నమాట.  సిన్నబ్బుడు బిడ్లు ఎంత అల్లరి చేస్నా, పెద్దోల్లై ఎంత వుడకాడ్పిస్తున్నా అమ్మలు బలే ఓర్చుకొని వుండేదేగాక.. వాల్లేమడిగినా యిచ్చేస్తాంటారు గదా… నీమాద్రే! సరే! ఒగదినం ఆ కొడుకు వాల్లమ్మను ఏమడిగ్నాడో తెల్సావా?”
 ”ఏమడిగ్నాడు?” లచ్చుమమ్మ ఆసక్తి ప్రదర్శించింది.
 ”ఆ దొంగముండాకొడుకు వాల్ల పెల్లామడిగిందని గుండికాయే కోసీమన్యా డంట.”
 
”నిజమా చిన్నా?” ఆశ్చర్యం నటించింది.
 ”అవునువా.  వుప్పుసట్లో, సూర్లో, బొంతలో, దొంతిలో… నువ్వేడ దాసిపెట్నా నీ కొడుకు దుడ్లెత్తుకుపోతాండ్లా… ఆ మాద్రి ఆ కొడుకు వాల్లమ్మ గుండికాయనే చేతిలో పెట్టుకొని పరిగెత్తతా… ఎదుర్రాయి తగిలి పడిపోయ్నంట”.”అబ్బుడు వాల్లమ్మ గుండికాయ ఏమనిందో తెల్సావా?” చిన్నా ఉద్విగ్నత  చూసి  చిన్నగా  నవ్వింది లచ్చుమమ్మ.
 ”అయ్యో కొడకా! దెబ్బేమన్నా తగిల్నానికదా?”
 ”పోవా! నీకీ కత తెల్సని నాకు ముందర్నే సెప్పలేదు” అంతలోనే చిన్నా అలిగాడు.
 ”ఏయమ్మ గుండికాయన్నా అట్లనే బాదపడ్తాదని సెప్పిన చిన్నా! నిజంగా! ఐనాగదా… నువ్వు సెప్తేనే గదా… లేపోతే నాకీ కతలు, కాకరకాయలూ ఏం దెల్సు సెప్పు! నేనేమన్నా నీమాద్రి యిస్కోలుకు పోయ్ననా? సదకొన్యానా?”
 ఊరడింపుగా చెప్పింది లచ్చుమమ్మ మనవడు నొచ్చుకోకూడదని! కానీ డిగ్రీలతో కొలిచే చదువులు చదవకపోయినా, జీవితం బడిలో అనుభవ పాఠాలు నేర్పే జ్ఞానం కూడా ఎక్కువే గదా!
 తను చెప్తేనే అవ్వకు తెల్సేది అన్న మాటతో చిన్నా మొహం విప్పారింది.  ”ఆ! అట్లా సెప్పు మల్ల!” ఠీవిగా చూశాడు.  అంతలోనే చిన్నా మొహం ఏదో గుర్తొచ్చి తాకగానే ముడుచుకుపోయే ‘టచ్‌మీనాట్‌’ ఆకులా చిన్నబోయింది.  ”కానీ… మా యమ్మ నన్నొదిలేసి పూషింది గదా! నేనంటే యిస్టంల్యా!  సెల్లిని మటుకు ఎత్తకపాయ!” వాడి గొంతులో బాధ గరగరలాడింది.
 ”అయ్యో! అట్టనిగాదు చిన్నా! సెల్లి పాల్దాగే బిడ్డ గదా….”
 ”అట్టయితే నేం గదా అన్నం తినల్ల గదా!” చిన్నా చురుకైనవాడు.  వాడి మాటలు ముద్దుగానే కాదు ఆలోచనాత్మకంగా వుంటాయి.  ”మా నాయ్న… అదే నీ కొడుకు అన్నానికి దుడ్లీడని, ఎబ్బుడూ తాగేసొచ్చి కొడ్తాంటాడని మాయమ్మ వాల్లమ్మొలింటికి పూడిస్తే… నేనేడకు బోవాలమల్ల?”
 ”నేనూ, తాతా వుండాం గదా చిన్నా!”
 ”తాత లేనబ్బుడు నిన్ను గదా కొడ్తాడు గదా… నువ్వు గదా మీయమ్మొల్లింటికి పూడిస్తే?” చిన్నా మాటల్లో అభద్రత, భయం.
 ”నిన్నిడిసిపెట్టి నేనేడకూ పోను చిన్నా!”
 ”ఈ బుద్ది మాయమ్మకు ల్యా కదా!  నువ్వు, తాత లేపోతే నన్నెవురు సూసుకొనేటోల్లు?  మీరిద్దురూ గదా ముసిలోల్లయిపోయ్న… యింగా కస్టపడి మమ్మల సాకుతుండారు గదా మల్ల!”
 మనవడి తెలివి మాటలకు మురిసిపోవాలో, తమ ఖర్మానికి వగవాలో తోచక చిన్నగా నిట్టూర్చింది లచ్చుమమ్మ.  ”యా జనమంలో యా పాపం చేస్తినో… అట్టాంటి కొడుకు పుట్నాడు.  ఏం చెయ్యాల నాయ్న!  కరమం అనుబగించాలగదా!  అందుకే నాయ్న నువ్వన్నా బుద్దిగా, బాగా సదువుకొని మీయమ్మ సెల్లి, నాయ్న, బతికుంటే మమ్మల బాగా సూసుకోవల్ల?  లెయ్‌ చిన్నా!”
 ”ఆ! నేను బాగా సదువుతానువా.  మా క్లాసులో నేనే పస్టు గదా!  కావల్నంటే వొచ్చి మా మేడంను గదా అడుక్కో.  పెద్ద సదువు సదివి నేను పోలీసవుతా.  నిన్ను, తాతను బాగా సూసుకొంటా.  నీ కొడుకును మాత్రం తుపాకీతో కాల్చేస్తా.  అసలందుకే నేను పోలీసయ్యేది.  పోలీసోల్ల దెగ్గిర తుపాకీ వుంటాది గదా.  డాం డామ్మని కాల్చి సంపేస్తా.  అబ్బుడు మనకింగ యా బాదలూ వుండవు. నువ్వు, తాత సంతోసంగా వుండొచ్చు.  మనింటికాడ యా రచ్చా రంపూ వుండదు.  మనల్ని యెవురూ గేలిసెయ్యరు” చిన్నా ఉద్రేకపడ్డాడు.  వాడి మాటల్లో తండ్రిపట్ల అసహ్యం, కోపం, కసి.
 ”అయ్యో! అదేం మాట? తప్పు చిన్నా…” లచ్చుమమ్మ బాధగా ఏదో చెప్పబోతున్నా విన్పించుకోలేదు చిన్నా.
 ”ఆ తాగుబోతు ముండాకొడుకు మనకొద్దు.  పోవా!” పుస్తకాల సంచి భుజానేసుకుని విసురుగా వెళ్ళిపోయాడు.  దార్లో తూలుతూ, ఏడ్తూ, తాస్తూ ఎదురొచ్చిన తండ్రివేపు చూడకుండా తల పక్కకు తిప్పుకొన్నాడు చీదరగా.
 ”ఏయ్‌ పెండ్లికూతురా… యిట్రాయే!”
 మనవడు సద్ది కూడా తాగకుండా వెళ్ళిపోయాడే అని బాధపడ్తూ సద్ది గిన్నె తీయబోతున్న లచ్చుమమ్మ కొడుకు మాటలకు తిరిగిచూసింది.  ‘అబ్బుడే వొచ్చేస్నాడే!  యింగ మల్లా మొదులు నరకం’ అనుకొంటూ.
 ”ఏం నాయ్న! అయిపోయ్నాయా దుడ్లంతా? మొత్తమంతా తాగేస్నావా? యిదో… యీ సద్ది గడా తాగేసి గమ్మున పడ్కో.  నన్నూరికే సతాయించబాకు.”
 ఇంట్లో నూకలు కూడా లేవు.  నిన్నా మొన్నా పక్కూర్లలో రోజంతా తిరిగి కుండలు, సట్లు అమ్మగా వచ్చిన దాంట్లో యిరవై రూపాయలిచ్చి యింకో పల్లెకెళ్ళాడు భర్త.  ఇంట్లో ఎక్కడ పెట్టినా కొడుకు తీసేస్తాడని జాకెట్లో పెట్టుకొంది.  కొడుకెళ్ళిపోయాక పచారికొట్టుకెళ్ళి బియ్యం, పప్పు తెచ్చి వంట చేద్దామని.  నిద్ర లేవంగానే రోజులాగే మొదలెట్టాడు డబ్బులిమ్మని గొడవ…తల్లిని లాగుతూ, తోస్తూ.  ఈ సందిట్లో ఆ యిరవై నోటు కాస్తా జాకెట్‌ అంచుకు రావటం, అది అతని కంటపడ్డం ”దొంగముండా. లేదు లేదంటనే దుడ్లీడ దాసుకొంటుండావా” అంట అడ్డుపెట్టుకొంటన్న తల్లి చేతులు లాగేస్తూ… జాకెట్లో చెయ్యిదూర్చి నోటును తీస్కొని నానా బండబూతులూ తిడ్తూ వెళ్ళిపోయాడు.  తాగి తిరిగి యింటికొచ్చాడు.  భర్త కూడా లేడు.  ‘యింగ వీడి పోరు ఎట్టా బరించేదో! బరించలేక పెండ్లామెల్లిపోయ.  కొడుకు కాల్సి సంపుతానంటుండాడు.  అయినాగదా…యీడిట్టా తాగతావుంటే… చిన్నా పెద్దోడై సంపేదాకా బతికుంటాడా?’ తన ఆలోచన తనకే రోతగా అన్పించింది.  ‘సీ! సీ! ఏందిది. బిడ్డ సావు కోరతాండానా?’ తనను తనే తిట్టుకొంది.
 ‘బెల్టు సాపులో… గిల్టంగళ్ళో… ఆ సారాయంగడి పెట్టినకాడ్నించీ వూర్లో సగం మంది మొగోళ్ళు ఆడనే సస్తాండారు.  పెండ్లాం బిడ్లు, కన్నోళ్ళు, కూడా పుట్టినోల్లు, అయినోల్లు, పొయినోల్లు… ఎవురూ వొద్దు… సారాయి వుంటే సాలనుకొంట… యిల్లు, ఒల్లు, బతుకులు గుల్ల చేస్కొంటుండారు.  ఈల్లకు బుద్దెబ్బుడు వొస్తాదో?’ లచ్చుమమ్మ కొడుకు వేపు జాలిగా చూస్తూ చెప్పింది.
 ”తిండే లేకండా యిట్లా తాగతాంటే కడుపులో పేగులు సస్తాయిరా.  ఈ సద్ది తాగరా!”
 ”అవును. పానం సస్తాంది రా.” చెయ్యి పట్టుకు గుంజాడు లోపలికి. 
 ఆ విసురుకు పడబోయి అరుగుపట్టుకొని నిలదొక్కుకొంటూ చెప్పింది లచ్చుమమ్మ ”యాటికొచ్చేది? యింగేడ వుండాయిరా దుడ్లు? బీం దెచ్చి అన్నం సెయ్యమని మీ నాయ్న యిచ్చేసి పోయిన దుడ్డంతా పెరుక్కొనిపోయి ఆ సారాయోడి వాతపెట్టేసి వొస్తాండావు గదరా సచ్చినోడా! వొదల్రా సెయ్యి!” లచ్చుమమ్మ చేతినొప్పికి విలవిల్లాడింది.
 ”దుడ్లేడ వుండాయో… వుంటాయో తెల్సెగదా! రా సద్దారి.”
 కొడుకు పట్టులో, మాటలో, నవ్వులో, చూపులో… తేడా… శరీరం గ్రహిస్తోంది కానీ… తల్లిమనసు కాదు కాదని మొరాయిస్తోంది.  కాకూడదని భయ పడ్తోంది.
 బిగుస్తున్న ధృతరాష్ట్ర కౌగిలిలో నలుగుతున్న విలువలు… నైతికవిలువలు… మానవవిలువలు… వావివరుసలు… మానవసంబంధాలు! రాళ్ళ మధ్య రాపిడిలో అగ్గి పుడుతుందని కనిపెట్టిన మేధస్సు… అవాంఛనీయ శరీరాల మధ్య రాపిడిలో జాతి నీతినియమాలే దగ్ధమవుతాయని గ్రహించలేదా?  నాగరికత, సభ్యత, సంస్కారం… వేషభాషల వరకేనా?  వ్యక్తిత్వ విలువల్లేవా?  తెలివి చంద్రమండలాన్నేలు తున్నా బుద్ధి బురదలో పొర్లాడ్డం… పురోగమనమా?  ఆటవికత వేపు తిరోగమనమా?  ఏది మన గమనం?  ఏ ప్రస్థానానికీ చీకటిదారులు?  ఏ వెలుగులు ఈ చీకటికళ్ళకు చూపునిస్తాయి?
 లచ్చుమమ్మకు యిదంతా ఆలోచించేంత మేధాశక్తి లేదు. ప్రపంచంలో ఏ తల్లికీ రాకూడని విపత్తు నుంచి బయటపడాలన్న ఆరాటం తప్ప, ఒంట్లో వున్న శక్తినంతా కూడదీసుకొని బలంగా తోసింది కొడుకును.  ఏమరుపాటున వున్నాడేమో… దబ్బున కింద పడిపోయాడు.  చేతికేదో తగిలింది.  తీసుకొన్నాడు.  ”వస్తావా…చస్తావా?” అంటూ తల్లెనక పడ్డాడు.
 అసలే కోతి.  కల్లు తాగింది.  ఆపై నిప్పు తొక్కింది.  ఆ పిచ్చి బలానికి అడ్డం పడే సాహసం వాడలో ఎవరూ చెయ్యలేదు.  వీడిన జుట్టు, దిగకారుతున్న చెమటలు, కాళ్ళకు అడ్డం పడుతున్న చీరకుచ్చిళ్ళు, జారిపోతున్న పైటకొంగు…ఐనా పరుగు ఆగలేదు.  ఎవరి ఆసరా, ఆదరణ, ఆశ్రయం… లభించనూలేదు.  తనకు తానే రక్షణ అన్న విషయాన్ని గ్రహిస్తూ… ఎగశ్వాసలో ధైర్యాన్ని, దిగశ్వాసలో భయాన్ని… రొప్పుతూ… ఆగింది లచ్చుమమ్మ.  కొడుకు చేతిలోని కత్తి తీసుకొంటూ నిర్వేదంగా చెప్పింది ”యింట్లోకి పద”.
 ”అట్రాయే దాట్లోకి” సంబరంగా, విజయహాసంతో లోపలికొస్తున్న కొడుకువేపు జాలిగా చూస్తూ తలుపువేసింది లచ్చుమమ్మ.
*     *      *
 ”చిన్నా! పద్దన నువు చెప్పిన కతలో మాదిరి గుండికాయను కోసిమ్మనుంటే యిచ్చేసుందును కానీ మీ నాయ్న… నన్నే…” లచ్చుమమ్మ మనవడి భుజం మీద తలాన్చి ఏడుస్తోంది.  ”నాయ్న… చిన్నా! నీకు నాయ్న లేకుండా చేస్నానో, నువ్వు పెద్దోడై తప్పు సెయ్యకుండా చేస్నానో గానీ… పెపంచకంలో ఏ బిడ్డా సెయ్యకూడని తప్పు నా బిడ్డా సెయ్యకూడదని… చంపేస్తి.  పదినెల్లు మోసి నొప్పులుపడి కని… ఎంతో కస్టపడి సాకిన ఈ సేతుల్తోనే వాడ్ని నరికేసినా… నాయ్న… చిన్నా! యింగ మనింటికాడ రచ్చారంపూ వుండదు.  మీ నాయ్న తాగుబోతోడని నిన్ను నీ యిష్టకాపులెవురూ గేలిసెయ్యరు.  చిన్నా… యింగ నువు ఆయిగా, సంతోసంగా ఆడుకో.  సక్కంగా సదువుకో.  బాగా సదివి పోలీసవ్వు.  పోలీసై… తాగుబోతోల్లను సంపడం కాదయ్య… వుచ్చనీచం మరిపించే తాగుడు లేకుండా… కల్లంగళ్ళు, సారాయంగళ్ళు లేకుండా సూడు.
 నాయ్న… చిన్నా! మీ తాతను సతాయించబాకు.  నువ్వు బంగారుకొండ.  ఎవుర్నీ సతాయించవులే.  బాగా సదూకో చిన్నా…” లచ్చుమమ్మ పోలీసుజీపు ఎక్కింది.
 అవ్వ కన్నీళ్ళు తుడవాలనో, వెళ్ళొద్దని వారించడానికో గాల్లోకి లేచిన చిన్నా చేతివేళ్ళు నెమ్మదిగా… బిగుసు కొంటున్నాయి పిడికిలిగా వణుకుతున్న తాత చేతివేళ్ళకు ఆసరాగా.

 

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.