పేదల అన్నవాహికకు కన్నం వేసే క్యాష్‌ ట్రాన్ఫర్‌ స్కీమ్‌ – కె.సత్యవతి, పి.ప్రశాంతి

తిండి గింజలకు బదులు కరెన్సీ… నోట్లు మగవాళ్ళ మనసుల్లో మెదిలే సారాకొట్లు… ఆడవాళ్ళ గుండెల్లో గుబులు కుంపట్లు… పౌరసరఫరాల శాఖతో ప్రజలకున్న ఆత్మీయ, ఆహార సంబంధాల్ని పుటుక్కున తెంపే తెంపరితనం… ఫక్తు వ్యాపార వ్యవహారం… బ్యాంకుల వేపు వేలల్లో, లక్షల్లో జనాలను మళ్ళించే కుట్రపూరిత పథకం కరెన్సీ సరఫరా చెయ్యాలనే ప్రభుత్వ ఆలోచన. ఆహార ధాన్యాల స్థానంలో కరెన్సీని ప్రజల కివ్వాలనే ఈ దుర్మార్గపు ఆలోచనను ఆదిలోనే అడ్డుకొనకపోతే… ఈ దేశంలో పేదలకి ఒక్కపూటైనా దొరుకుతున్న తిండి వారాల తరబడి దొరకకపోయే ప్రమాదం… ఆకలితో మరణించే మహోపద్రవం అతి సమీపంలో కోరలుసాచి దూకడానికి సిద్ధంగా ఉంది.
మన దేశంలో 2005 నుండి ఆహార ధాన్యాలకు బదులు డబ్బును పేదలకివ్వాలనే ప్రపంచ బ్యాంకు కూృర ఆలోచనల్ని తలల్నిండా నింపుకున్న ప్రభుత్వం, అధికారులు… పౌర సరఫరాల మంత్రిత్వ శాఖనే సమూలంగా పెకిలించి వేయాలని పావులు కదుపుతున్నారు. దానికి చూపిస్తున్న కారణాలు…. ప్రస్తుతం పిడిఎస్‌ నిర్వహణ ప్రభుత్వానికి తలకు మించిన భారంగా వుందని, ప్రభుత్వం సేకరించి, సరఫరా చేస్తున్న ఆహార ధాన్యాలు సగం కూడా పేదల ఇళ్ళకు వెళ్ళకుండా దారి మళ్ళుతున్నాయని, వేస్టేజి చాలా వుంటోందని, అలా కాకుండా డబ్బునే ప్రజలకు ఇచ్చేస్తే వాళ్ళకు కావలసినవి వాళ్ళు హాయిగా కొనేసుకుంటారని, రుచికరంగా వండేసుకుని పండగ చేసేసుకుంటారని రంగురంగు కలల్ని ప్రజల మీదికి వదులుతున్నారు. ఈ ఈస్ట్‌మన్‌కలర్‌ కలల్ని నమ్మడానికి, కలల్లో తేలడానికి
మగవాళ్ళు సిద్ధంగా వుండి వుండొచ్చు కానీ ఈ దేశంలోని ప్రతి పేద స్త్రీ ఈ పనికిమాలిన కలని నిర్ధ్వంద్వంగా వ్యతిరేకిస్తున్నారు. 92% స్త్రీలు ఆహార ధాన్యాల సరఫరా స్థానంలో ప్రభుత్వం ప్రవేశ పెట్టదలిచిన నగదు బదిలీ మాకొద్దని తెగేసి చెబుతున్నారు.
ఈ దేశంలో అడుక్కోబడి లేదు కాని గజానికో వైన్‌షాప్‌ వుంది. సారాకొట్లున్నాయి. కల్లు కాంపౌండులున్నాయి. మగవాడి సంపాదనలో ఎక్కువ మొత్తం ఈ షాపులకే అర్పించడం అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా పేద స్త్రీల జీవితాల్లోని హింసకి, ఈ తాగుడుకి చాలా దగ్గర సంబంధం వుంటుంది. పురుషులు తాము సంపాదించిన కూలిని సారాకొట్లకు అప్పచెప్పినా, వొక్కపైసా కుటుంబానికి ఇవ్వకపోయినా, స్త్రీలు తాము చెమటోడ్చి, శ్రమచేసి సంపాదించిన సొమ్ముతో దగ్గరలోని రేషన్‌ షాపు కెళ్ళి సబ్సిడీలో దొరికే తిండి గింజల్ని తెచ్చుకుని కుటుంబాన్ని నడపించుకోగలుగుతుంది. కుటుంబంలోని సభ్యులందరికీ ఆఖరికి తాగొచ్చి తన్నే మొగుడికి కూడా కొంతలో కొంత తిండి సమకూర్చగలుగుతుంది. ఆ విధంగా అరకొరగానైనా కుటుంబానికి ఆహార భద్రత వుంటుంది.
హఠాత్తుగా తనకెంతో పరిచయమైన, తన కుటుంబ ఆకలిని తీర్చే రేషన్‌ షాప్‌ తన సమీపంలోంచి మాయమైపోయి, తన బ్యాంకు అకౌంట్‌లో పడిన సొమ్ముతో బహిరంగ మార్కెట్‌లో ఆహారధాన్యాలు కొనుక్కోవడానికి పోవడమంటే??? అసలు ఆ సొమ్ము తిండి గింజల కోసం మిగులుతుందా? ఆ ఇంటి యజమాని తాగుడు సీసాలో కరిగిపోతుందా? ఆ ఇంటి మగపిల్లవాడి బండిలో పెట్రోలుగానో, సెల్‌ఫోన్‌ రిచార్జ్‌కూపన్‌గానో, మాల్‌లో వేలాడే బ్రాండెడ్‌ టీ షర్ట్‌గానో మారిపోతుందా? కుటుంబం మొత్తం ఆకలి తీర్చడానికి వచ్చే నగదు.. కుటుంబంలో అధికారం చలాయించేవాళ్ళ కబ్జాలోకి వెళ్ళిపోతుంది…. ఆ కుటుంబ ఆహార భద్రత గాల్లో దీపమై మినుకు మినుకు మంటుంది. ఒక వేళ ప్రభుత్వాలు ‘స్త్రీ సాధికారిత’ మేలిముసుగేసి ఆ నగదును స్త్రీల బ్యాంకు ఖాతాల్లో జమచేసినా…. కుటుంబ సభ్యులెవరైనా ఆమెపై దౌర్జన్యం చేసి దానిని లాక్కుపోవడం తథ్యం… తద్వారా స్త్రీల మీద కుటుంబ హింస మరింత పెరగడం ఖాయం.
నగరీకరణ అనూహ్యంగా పెరిగిన, పేదలు చాలా తక్కువ శాతంలో వున్న దేశాల్లో నగదు బదిలీ పథకం బ్రహ్మాండంగా అమలవుతోందని మభ్యపెట్టడం కూడా వుంది. భారతదేశంలో 75% ప్రజలు గ్రామాల్లోనే బతుకుతున్నారని, 41% కుటుంబాలు అత్యంత పేదరికంలో మగ్గుతున్నరనే ఇంగితం లేని ప్రభుత్వం పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు అత్యంత ప్రజా వ్యతిరేకమైన, స్త్రీల వ్యతిరేకమైన, స్త్రీల మీద మరింత హింసను ప్రేరేపించే నగదు బదిలీ పథకాన్ని తలకెత్తుకుని ఆ బరువును ప్రజలమీద దింపేయాలనుకోవడంచాలా దారుణమైన విషయం.
భారత రాజ్యాంగం ప్రకటించిన సంక్షేమ స్ఫూర్తికి చిల్లులు పొడిచి, ప్రజల అన్నవాహికకు కన్నం పెట్టాలనుకుంటున్న ఈ ప్రజావ్యతిరేక నగదు బదిలీ పథకాన్ని అందరం పెద్ద ఎత్తున వ్యతిరేకించాలి. తన పౌరులందరికీ ఆహార భద్రత కల్పించాల్సిన గురుతర బాధ్యత నుండి తాను తప్పుకుని ప్రజల్ని బహిరంగ మార్కెట్‌కి బలిపెట్టాలని ప్రయత్నిస్తున్న ప్రభుత్వ పద్ధతుల్ని కలిసికట్టుగా ఎదొర్కోవాలి. ఇంట్లో ఎలుకలున్నాయని ఇల్లు తగలబెట్టాలనే అశాస్త్రీయ ధోరణితో, పిడిఎస్‌లో లోపాలున్నాయి కాబట్టి దాన్ని సమూలంగా పెకిలించి నాశనం చేస్తామనడం మూర్ఖత్వం తప్ప హేతుబద్ధంగా అనిపించదు. దేశవ్యాప్తంగా… ప్రతి ఇంటికీ ఆహారధాన్యాలు చేరేలా కఠిన చర్యలు తీసుకోవాలి కానీ…. డబ్బులిస్తాం మీకు కావాల్సినవి కొనుక్కోండి అనడం, వినడానికి సొంపుగానే వుండొచ్చుగానీ… ఆ కొనుక్కునేవి ఏమిటి? తాగుడా? జూదమా? ఫ్యాన్సీ వస్తువులా?.. దీనిమీద ఎలాంటి అదుపు, అధికారం లేని స్త్రీ బతుకుల మీద నగదు బదిలీ పథకం పెనుభారం మోపబోతోంది.
నగదు బదిలీ పథకం నేరుగా రైతుల నవనాడుల్ని కుంగదీస్తుంది. పిడిఎస్‌ లేకపోతే ప్రభుత్వం ఆహార ధాన్యాలు కొనాల్సిన అవసరం లేదు. ఫుడ్‌ కార్పోరేషన్‌ గోడౌన్‌లు గబ్బుపట్టిపోతాయి. రైతులకు మద్దతుధర ప్రకటించాల్సిన అవసరం లేదు. రైతులారా! హాయిగా మీమీ ఉత్పత్తులను బహిరంగ మార్కెట్‌లో మీ కిష్టమైన ధరలకు అమ్ముకోండి, అంటూ తేనెపూసిన మాటల్ని వల్లిస్తూ వ్యవసాయ రంగంలో వున్న రైతులందరిని అత్యంత ప్రమాదకరమైన, ఎగుడు దిగుళ్ళుతో నిలకడలేని, నియంత్రణలేని ధరలతో కప్పల తక్కెళ్ళా ఊగిసలాడే ఓపెన్‌ మార్కెట్‌లోకి నెట్టేస్తోంది. తద్వారా మల్టీ నేషనల్‌ కంపెనీల కబంద హస్తాల్లోకి రైతు ప్రపంచాన్ని నిర్దయగా తోసేస్తోంది.
ఇప్పటికే విధ్వంసం అంచున వున్న వ్యవసాయరంగాన్ని, వేలాదిగా బలవన్మరణాల పాలవుతున్న రైతు ప్రపంచాన్ని మరింతగా కుంగిపోయేలా, కుదేలయ్యేలా ఈ సంవత్సరం సెప్టెంబరు నెల నుండే నగదు బదిలీ పథకాన్ని అమలు చెయ్యాలని ఎన్‌ డి యే ప్రభుత్వం ఉరకలేస్తోంది. ఆరుగాలం కష్టించే రైతుల్ని రుతువులు దగా చేస్తున్న అంశం మన కళ్ళ ముందు కనబడినా అది ప్రకృతికి మనం చేస్తున్న అపచారం మాత్రమే. ప్రకృతి తల్లి లాంటిదే. తన బిడ్డలికి తల్లి అన్యాయం చేయనట్లే… ప్రకృతి కూడా అన్యాయం చెయ్యదు. పర్యావరణ విధ్వంస ప్రభావం నేరుగా తాకుతున్నది రైతునే. దీనివల్ల భీభత్సంగా మారిన రైతుజీవితంమీదకి పులి మీద పుట్రలా నగదు బదిలీ పథకం పంజా విసరబోతోంది. బహిరంగ బజారులో రైతును ఉరి తియ్యబోతోంది.
ఏరుల్లా ప్రవహిస్తున్న మద్యం వల్ల తాగుబోతులై ఇంటినే కాకుండా తమ వొంటినీ గుల్లచేసుకుంటున్న పురుషుల ఆరోగ్యాలు బాగు చెయ్యడానికి దేశ వ్యాప్తంగా ప్రభుత్వం ఒక కొత్త ఆరోగ్య పథకం తేవాల్సి వుంటుంది. నగదు బదిలీ సొమ్ము సారాకొట్లకి పోతే, తాగితాగి తూగే పురుషులు ప్రభుత్వాసుపత్రుల పాలవ్వడం కళ్ళ ముందు కనిపిస్తూ భయపెడుతున్న నగ్న సత్యం.
ఈ దేశంలో స్త్రీలందరూ దాదాపుగా పిల్లలకి, మగవాళ్ళకి తిండి పెట్టిన తర్వాత మిగులు, తగులు తాము తింటారు. దీనివల్ల లక్షలాది పేద స్త్రీలు పోషకాహార లోపంతో రక్తహీనత బారినపడి అనేక రోగాల పాలవుతున్నారు. నగదు బదిలీలో ప్రభుత్వం వారిచ్చే సొమ్ముకు బహిరంగ మార్కెట్‌లోని రేట్లకి పొంతన కుదరక, కొనుకోగల శక్తి తగ్గిపోయి, ఆ తరుగుదల నేరుగా స్త్రీ ఆహార స్వీకరణ మీద పడుతుంది. ఫలితం… కడుపునిండని, పోషకాలు లేని పిడికెడు ఆహారం… రక్తహీనత… రోగాల విజృంభణ. ఆపై మాతా, శిశు మరణాల పెరుగుదల…
నగదు బదిలీ పథక భవిష్యత్‌చిత్రపటం నన్ను మహాభయపెడుతోంది. రేషన్‌ షాపుతో ప్రజలకున్న ఆత్మీయ సంబంధాన్ని పుట్టుక్కున తేంపేసే దృశ్యం నా ముందు భీతావాహంగా నిలబడుతోంది.
”ఇంతకు ముందుకొన్ని ధాన్యాలైనా రేషన్‌ షాపు ద్వారా దొరికేవి. రేసన్‌ షాపుండదా? అయితే మేము ఆకలికి చావాల్సిందేనా?” అని ఓ పెద్దాయన అన్నమాట అక్షర సత్యం. నిజం.. రేషన్‌ షాప్‌లో ఇచ్చే కిరోసిన్‌తో పొయ్యి వెలుగుతుంది. అక్కడ దొరికే బియ్యంతో అన్నం, పప్పుతో కూర… కొంతైనా దొరుకుతుంది. మరి రేషన్‌ షాప్‌ మాయమైపోతే….?
రాజ్యాంగం సాక్షిగా దేశంలోని పౌరులందరికీ ఆహార భద్రత, ఆరోగ్య భద్రత… ఇంకా ఎన్నో భద్రతలను కల్పిస్తానని ప్రమాణం చేసిన పాలకులు పేద ప్రజల అన్నవాహిక మీద దాడిచేసి వాళ్ళని ఆకలి కరాళత్వం వేపు కౄరంగా తోసేస్తుంటే మన బాధ్యత ఏంటి? ఇంతటి విధ్వంసకరమైన పథకాన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత అందరిదీ. గొంతెత్తి అరవండి… కలాలు కదిలించి రాయండి…
We don’t want Cash Transfer Scheme.
నగదు బదిలీ పథకం మాకొద్దు…

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

3 Responses to పేదల అన్నవాహికకు కన్నం వేసే క్యాష్‌ ట్రాన్ఫర్‌ స్కీమ్‌ – కె.సత్యవతి, పి.ప్రశాంతి

  1. Y RAJYALAKSHMI says:

    నిజమే కదా. చాలా బాగా చెప్పారు

  2. Chandrika says:

    మీరు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజం. చిన్నప్పటి నుంచి బదిలీలు,ఇల్లు మారడం జరిగేది. అలాగే ఇంటి పని చేసే అమ్మాయిలు మారేవారు. కానీ ప్రతి అమ్మాయిది ఒకటే జీవిత కథ. అది మాత్రం మారేది కాదు. మొగుడు తాగడం కొట్టడం. పిల్లలకి మిగిలిన అన్నం ,కూరలు పట్టుకెళ్ళడం. మేము పిల్లలం ఏదో సిన్మా కథ విన్నట్టు వినేవారం. మా అమ్మ టిఫిన్, టీ పెట్టి ఇస్తే ఎందుకు ఇంత ప్రాముఖ్యం ఇవ్వడం అనుకునే వారం. ఆ చిన్న పని వారికి ఎంత స్వాంతన ఇస్తుంది అని అర్ధం అయేది కాదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎవరు వచ్చినా వారి కష్టాలు పెరుగుతున్నాయే కానీ తగ్గట్లేదు.

  3. siri says:

    మనుషుల్లో మానవత్వం నిండిన మనసున్న మనుషులకు మనసారా చెప్తున్న నమస్సులు …….సమస్య ఎలాంటిది అయినా కాని తప్పు ఎవరిదైనా కాని నిజానిజాలు మాట్లాడే ధైర్యం ఉండేది కొందరికే అలాంటి గొప్ప మనసుతో స్త్రీ మూర్తుల కోసం పోరాటం జరుపుతున్న కొండవీటి .సత్యవతి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ………సిరి .లాబాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో