స్త్రీవాద కవిత్వంలో శిల్ప విశేషాలు

.’డా.వై .కామేశ్వరి

‘సుఖం అంటే ఏమిటి?’ అని పూర్వం ఎప్పుడో ఒక నిర్భాగ్యుడు తన గురువును అడిగాడట. ‘నీకాలి కంటే తక్కువ కొలత ఉన్న చెప్పులను వేసుకొని, కాసేపు ఆగాక దాన్ని విడచివెయ్యి. అప్పుడు సుఖం ఏమిటో తెలుస్తుంది’ అన్నాడట ఆ గురువు.

 
స్త్రీవాద కవిత్వాన్ని గురించి మాట్లాడుకునే సందర్భంలో ఈ కథను చెప్పుకోక తప్పదు.  వెనకటి కాలంలో స్త్రీలు తమ కాలికంటే తక్కువ కొలత గల చెప్పులనే ధరించి జీవితాలను గడిపివేశారు. 

వాటిని ఒక్క క్షణమైనా విడచివెయ్యటం జరగలేదు.  వారికి ఆ అవకాశమూ లేదు.  ఆలోచనా లేదు . అందుచేత ‘సుఖం’ అంటే తెలిసే అవకాశం లేదు.  అది తమకు లేదనే జ్ఞానమూ లేదు.  అజ్ఞానం వల్ల కూడా ఒకరకం శాంతి కలుగుతుంది.  అందువల్ల స్త్రీల శాంతిగా ఉన్నారు.  పురుషులశాంతిగా ఉన్నారు.
ఇప్పటి సమాజంలో ఒక విచిత్రస్థితి ఏర్పడింది.  స్త్రీలకు ‘సుఖం’ ఏమిటో తెలుస్తోంది.  సుఖం లేనితనం తమకు మాత్రమే ఎందుకో అర్థంకాక వారికి అశాంతి కలుగుతోంది.  తమ తల్లులూ, తల్లుల తల్లులూ చేసిన నిరంతర అవిశ్రాంత నిరూపేక్ష శ్రమను, శ్రమ అనే స్పృహ కూడా లేకుండా గాలి వీచినంత సహజంగా చేసిన శ్రమను చెయ్యడానికి, ‘స్త్రీసహజ’ జీవితాన్ని గడపటానికి ఈ తరం స్త్రీలు ఎందుకు ‘అసుఖం’గా భావిస్తున్నారో అర్థంకాక, పురుషులు తికమకపడుతున్నారు.  స్త్రీలు ఎదుగుతున్నారు.  ఎదుగుదలకు అనుగుణమైన చెప్పులను ధరిస్తున్నారు.  కానీ వారిపట్ల, వారికి అనుగుణంగా సమాజం ఎదగటం లేదు.  సమాజపు విలువలు ఎదగటం లేదు.  సహజీవన సౌభాగ్యాన్ని అందించవలసిన పురుషులు ఎదగడం లేదు.  తగిన కొలతలో చెప్పును ధరించడానికి అలవాటుపడిన స్త్రీకి వివాహం పేరిట సమాజం ఆమె కొలత కంటే తక్కువ కొలతగల చెప్పును అందిస్తోంది.  ఉద్యోగం చేసే చోట కూడా ఆమె అటువంటి చిన్న పాదరక్షలను మాత్రమే ధరించాలని అభిలాషిస్తోంది.  ఆమె మేధోజీవితాన్ని మరచి శరీరమాత్రంగా మిగలవలసిన పరిస్థితి సర్వత్రా నెలకొని ఉంది.
సమాజం ఎన్ని రంగాలలో ఎంత ఎదిగినా స్త్రీ పట్ల అనాగరికంగానే ఉంటోంది.  స్త్రీపట్ల సగటు పురుషుడి దృక్పథం కొన్ని శతాబ్దాల వెనుకనే ఉంది.  కుల, మత, వర్గ, వయోభేదం లేకుండా స్త్రీ నిరంతరం అపాయంలోనే బ్రతుకుతోంది.  సమాజంలోనే కాదు, స్వంత ఇంట్లోనే తన కుటుంబసభ్యుల వల్ల కూడా చాలాచోట్ల అపాయానికి గురౌతోంది.  21వ శతాబ్దంలో కూడా స్త్రీహింసనీ, స్త్రీసమస్యనీ వైయక్తిక కుటుంబ వ్యవహారంగా భావించడం జరుగుతోంది.  కళ్ళ ఎదుట ఎంత ఘోరం జరిగినా స్త్రీకి సహాయపడటానికి సంస్కారవంతులు సైతం జంకుతున్నారు.  అంతేకాదు సహాయపడేవారిని ఆటంకపరుస్తున్నారు.
అయితే సమాజంలో చైతన్యవంతులైన కొద్దిశాతం మహిళలు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొని స్పందిస్తున్నారు.  తమ పరిస్థితిని గ్రహించి, తమతోటి మహిళలను కూడా చైతన్యపరుస్తున్నారు.  ఎదగని స్త్రీలు, ఎదగని పురుషులు అందరూ కలసి సమాజంలో, కుటుంబ జీవితంలో స్వయంగా నరకాన్ని సృష్టించుకొంటున్నారు.  తామూ బాధపడి ఇతరులను బాధిస్తున్నారు.  చైతన్యవంతులైన స్త్రీలు తమ అణచివేతను ప్రశ్నిస్తున్నారు.  తమతోపాటుగా సమాజాన్నీ ఎదగమని బోధిస్తున్నారు.  ఈ నేపథ్యంలో స్త్రీలకలాలనుండి వైవిధ్యభరితమైన శిల్పబంధురమైన బలమైన కవిత్వం వెలువడుతోంది.  అట్టడుగుస్థాయిలోని స్త్రీనుండి, బి.పి.వొలలో పనిచేసే స్త్రీ వరకు, బాల్యదశ నుండి వృద్ధాప్యం వరకు వివిధ వర్గాల స్త్రీలు వివిధ దశల్లో ఎదుర్కొంటున్న సమస్యలన్నింటిని స్త్రీలు ఈ కవిత్వంలో వ్యక్తీకరిస్తున్నారు.  పురుషుల ఆలోచనలనే కాక, స్త్రీలపట్ల తోటి స్త్రీల ఆలోచనలను కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.
కవితా శిల్పదృష్టితో చూసినపుడు కవితను అక్షరం అక్షరం జాగ్రత్తగా చెక్కి ప్రతిపొల్ల చివరకు హైఫన్‌తో సహా కవిత్వ శిల్పానికి దోహదం చేసేలా ఒక వర్గం వారు రచిస్తున్నారు.  మరొక వర్గంవారు సహజ సుందర సునిశిత శిల్పంతో ఉద్వేగభరితమైన రచనలను చేస్తున్నారు.
సగటు భారతీయ కుటుంబంలో కోడలిగా ప్రవేశించిన స్త్రీ ఎదుర్కొనే పరాయీకరణను కొండేపూడి నిర్మల వధూగీతంలో ఇలా వ్యక్తీకరిస్తుంది.
 ”స్వాగతగీతంలో స్వగతాలే ఎక్కువ
 కర్పూరం వెలిగించి తర్పారబెట్టడం మక్కువ
 కాళ్ళయినా కడుక్కోకుండా కఠినమైన ప్రశ్నాపత్రం ఇస్తారు.
 సెర్చివారంటైనా లేకుండా శిక్షవేస్తారు
 ఎప్పటికప్పుడు అసంతృప్తి
 దప్పిక చాలని అహంతృప్తి”…..
ఒక స్థాయిని దాటిన పరాయీకరణ బలవన్మరణాలకు, వరకట్నపు చావులకు కూడా చాలాచోట్ల దారితీస్తుంది.  అది ఈ సమస్యకు పరాకాష్ఠ.  కొత్తగా పెళ్ళయిన ఆడపిల్లకు కొత్త ప్రదేశానికి, కొత్త జీవితానికి అలవాటుపడటానికి తగిన సమయమైనా ఇవ్వరు అనే వాస్తవాన్ని సరళసుందరంగా ‘కాళ్ళయినా కడుక్కోకుండా కఠినమైన ప్రశ్నాపత్రం ఇవ్వడం’ అనే వ్యక్తీకరణ చెపుతుంది.  సాధారణంగా ఒక స్థాయి కుటుంబాలలో అత్తవారింటి కుటుంబసభ్యులనుండి ఎదుర్కొనే ఒత్తిడికి మూలం అహంకారమే.  ‘దప్పిక చాలని అహంతృప్తి’ అనే వ్యక్తీకరణ ఎంత అప్రయత్నంగా వచ్చిందో గమనిస్తే ఆ కవిత ఎంత ఉద్వేగం నుండి ఉద్భవించిందో అర్థం అవుతుంది.  సమాజంలో ఏ స్థాయిలో ఉన్న మహిళకైనా తాగుబోతు భర్త పెద్దసమస్య.  తుర్లపాటి రాజేశ్వరి ‘ఊసరవెల్లి’ అనే కవితలో ఈ సమస్యను చిత్రీకరిస్తుంది.
 వాడు దేవభాషలో దీవించి దీవించి
 పాపం! అలసి సొలసి గాఢనిద్రలోకి జారిపోతాడు
 వాడికి ఏ కష్టాల కడలి
 బాష్పనదాల భోగట్టాలక్కరలేదు
 అనంత సుఖ శయ్యభోగాలే కావాలి
 ఏ బాధ్యతలూ వద్దు
 నమ్రసేవా పూజనలే కావాలి
 ఆ హరిణ నయనాలలో
 భవదీయ పాదసరోజాలే గతి….
 పురుషుడి నిర్దాక్షిణ్య కర్కశ ప్రవర్తనతో సున్నితమైన స్త్రీ ఎలా నలిగిపోతుందో ‘మల్లెమొగ్గను మందారంగా మార్చడంలో వాడు నేర్పరి’ అనే ఒకే ఒక వర్ణనతో సమర్థవంతంగా చెప్పటం జరిగింది.  ”గార్థభాకృతి వీడి గజరాజంగా వీథిమొగలో దర్శనం” ఇవ్వడం పురుషుడి ద్వంద్వప్రవృత్తిని బహిరంగపరచడం.  పూర్వపు కథలో అత్తవారింట్లో ఆడపిల్ల ‘మోచేతికి దెబ్బతగిలినంత సుఖంగా ఉంది నా జీవితం’ అందిట.  సరిగా అలా ‘మల్లెమొగ్గ మందారంగా మారటం’ అనే వ్యక్తీకరణ క్లుప్తంగాను, భావస్ఫోరకంగాను ఉంది.  ఆధునిక కవిత్వంలో పునరుక్తి, క్లిష్టత, అతివిస్తృతి, వాచ్యత ప్రతికూల లక్షణాలుగా చెప్పుకుంటున్న రోజుల్లో క్లుప్తత, భావస్ఫోరకత, సరళత అనే అనుకూల విషయాలను స్త్రీవాదకవిత్వం ఆధునిక కవిత్వంలో వికసింపచేసింది.
 ‘ఉద్యోగం చేసి ఇంటికి వచ్చిన స్త్రీ పొద్దుటి నుంచి నాలుగిళ్ళు తిరిగి వచ్చిన న్యూసుపేపరు’లా ఉంటుందట.
 ‘కనిపించినప్పుడల్లా
 కంపరం పుట్టేలా
 వంటిమీద చూపులు
 చెదల్లా పాకుతూ ఉంటాయి.’ అని జయప్రభ అవాంఛితమైన అపరిచితుల పరికింపులను వర్ణిస్తే,
 కాళ్ళ కడాలు పెట్టుకోని చంద్రన్న
 కలుపుదియ్య నేను బోతిరో చంద్రన్న
 వాడు చూసే చూపులకు చంద్రన్న
 కాళ్ళకడాలు పాములాయెరో చంద్రన్న
అని తెలంగాణ ప్రజలు పాడుకున్నారు.  వదలని ఈ చీదర గురించి ఏ వర్గస్త్రీకైనా అనుభవపూర్వకంగా తెలుస్తుంది.
ఓల్గా వర్ణించిన యంత్రికస్త్రీజీవనాన్ని అనుభవించని ఆధునికస్త్రీ లేదంటే అతిశయోక్తి లేదు.
 ”చేసిన పనే మళ్ళీ మళ్ళీ వందసార్లు
 వెయ్యిసార్లు అంతులేనన్నిసార్లు
 చేసీ చేసీ – అది చెయ్యడం కోసమే
 బతకాలని తెలిసి నిద్రగన్నేరైన మనసు
 అర్థరాత్రి నువ్వు తుమ్మితే ఉలికిపడదు
 నీ ముక్కు దిబ్బడకు చలించదు-” మొరటు యంత్రిక జీవనం స్త్రీని స్పందనారహితంగా తయారుచేసి, ప్రేమరాహిత్యంలో ముంచెత్తుతోందన్న మాట వాస్తవం.  నిద్రగన్నేరు పూర్తిగా విచ్చుకోకుండానే రాలిపోతుంది.  స్త్రీ మనసూ అంతే!
 ”రుబ్బుడు పొత్రంలా
 తల తిరుగుతూనే వున్నా
 ఆలోచనల పప్పు మెదగదు”
 ”కలల అలల తుంపరలు
 హృదయపు పెనంపై చుయ్యిమంటూనే వుంటాయి”
    గృహలక్ష్మి – ఓల్గా
ఇలాటి పోలికలు జానపద అభివ్యక్తికి దగ్గరగా ఉంటాయి.  అవును.  జానపద కవిత్వం ఎంత అనుభవజనితమో, స్త్రీవాద కవిత్వమూ అంతే.  అందువల్లే కురిసి, భూమిని ఫలవంతం జలవంతం చేసే నీలిమేఘాన్ని స్త్రీగా, కురవని మేఘాన్ని పురుషునిగా సంకేతించటం స్త్రీవాద కవిత్వానికి సాధ్యపడింది.
జయప్రభ రచించిన ”నేనే వర్షించి నేనే మొలకెత్తి” అనే పద్యంలో ఆరోపక పరంపరలో స్త్రీలోని భావ పరిణామాన్ని సూచించేందుకు ఉపయెగపడింది.
 నేనా
 నేనిక్కడ వేప చిగుళ్ళలోకి
 చూపుసారించి వేడెక్కిన ఆకాశాన్ని చూస్తున్నాను
 నడిమధ్యాహ్నం నీటికోసం
 పక్షుల వెతుకులాటనీ
 ఎండిపోయి కురియటానికి చుక్కనీరు కూడాలేని
 మబ్బుల లోతైన కళ్ళలోని జీరనీ చూస్తున్నాను
 అంతేకాదు దాహంతో రెక్కలార్చుకుంటూ కూడా
 బతకటం కోసం మబ్బుల నీడలకు చేరుతున్న
 వాటి జీవితాన్ని చూస్తున్నాను
 వాటిలాగే నేనూ మౌనంగా ఉన్నాను
 కడలి కన్నీటిలా ఉప్పుగా ఉన్నందుకు
 బాధగా ఉన్నాను
 ఈ నల్లని అక్షరాల్లా ఏకాంతంగా ఉన్నాను
 తియ్యగా స్పందించిన క్షణంలోనే
 చేదుగా చలించే జ్ఞాపకాల్లో
 ఏ రుచికీ అందని భావంలా కొత్తగానూ ఉన్నాను
 ……….. పంటలేక ఎండిన పొలంలా
 దిగుళ్ళేసి ఉన్నాను (గమనించండి పగుళ్ళేసి కాదు)
 ఏమో చెప్పలేను లెండి
 మంచు పుష్పాలను ధరించి మళ్ళీ నవ్వనూగలను
 ఏమో ఏం చెప్పను ఒక్కసారిగా నేను వర్షించి
 మళ్ళీ నేనే మొలకెత్తగలనేమో…..

 మొదటి పాదాలలోని స్త్రీ పక్షుల దీనత్వాన్ని పరిశీలిస్తూ తీపిచేదుస్పందనలను కలబోసుకున్న స్త్రీ.  స్త్రీలకు పక్షులు ప్రతీకలు.  ‘నీరులేని మబ్బుల లోతైన కళ్ళలోని జీర’ స్త్రీలపట్ల కర్కశంగా వ్యవహరించే పురుష దృక్పథం – అయినా నీడకోసం వాటికిందకే చేరే పక్షుల మూర్ఖత్వం లేదా అమాయకత్వం స్పష్టంగానే ఉంది.  తన సహజస్పందన తియ్యదనమైతే, తగిన ప్రతిస్పందన లేకపోవటం చేదు.  ఈ రెండ ఏకకాలంలో స్త్రీకి అనుభవంలోకి వస్తూనే ఉంటాయి.  తమకు ఇలా జరుగుతోందనే స్పృహ కలగడం కొత్తదనం-ఇక వర్షించేది మేఘమైతే, మొలకెత్తేది బీజం.  తానే వర్షించి తానే మొలకెత్తటమంటే తనకు తానే ప్రోత్సహించుకుని, తన అభ్యున్నతికి తానే శ్రమపడటం-మరోరకంగా వ్యాఖ్యానించాలంటే తన తోటిస్త్రీలను జాగృతపరచడం-అందరూ కలసి అభ్యున్నతికి కృషిచేయడం ‘నేను’ను స్త్రీగా వ్యాఖ్యానించుకున్నప్పుడు వ్యక్తిగత అభ్యున్నతి, ‘నేను’ను స్త్రీజాతికి ప్రతీకగా వ్యాఖ్యానించుకుంటే స్త్రీజాతి అభ్యున్నతి సంకేతించబడ్డాయని చెప్పవచ్చు.
జయప్రభ మరోరచన ‘చిత్రగ్రీవుడా! రా!’ మొక్కపాటి సుమతి ‘మిత్రవైరుధ్యవ’, కె. గీత ‘పరపరాగవిరాగం’, కె. జయ ‘కట్టుకొయ్య’ ఇవన్నీ శిల్పపరంగా ప్రతి అక్షరం సార్థకతను పొందిన రచనలే.  ప్రాచీన కవిత్వంలో విశేషమైన పద్యాలకు ప్రతిపదార్థతాత్పర్య విశేషాలను వివరించినట్లుగా వీటిని వ్యాఖ్యానించవచ్చు.
గుజరాత్‌లో జరిగిన దురాగతాలపై కవితను వ్రాస్తూ షాజహానా ఇలా అంటుంది.
 ”కానీ ‘నన్ను’ హత్యచేయలేవు
 అనంతంగా సాగే జీవనదిని
 నేను బతకడమే కాదు
 నిన్ను పుట్టించి బతికించేది నేనే
 అయినా
 స్త్రీ తప్ప మగాణ్ణి క్షమించేదెవరు?
 ఎప్పటికీ ఈ ప్రపంచం
 నా రొమ్ము తాగుతున్న పసిబిడ్డే”
తన బ్రతుకు పట్ల, తన కష్టసుఖాల పట్ల, తన స్పందనల పట్ల, తన జీవితపు నాణ్యత పట్ల చెప్పలేనంత ఉదాసీనతను ప్రదర్శించే ప్రపంచాన్ని, వీలైనంత అణచివేసే ప్రపంచాన్ని, తన ప్రయత్నాలకు వేటికీ సహకరించని ప్రపంచాన్ని ఇందుకే ప్రేమిస్తుంది స్త్రీ.  మాతృహృదయంతో క్షమిస్తుంది.  తన పోరాటాన్ని జాగ్రత్తగా సహనంతో చేస్తుంది.  వసంత కన్నాభిరాన్‌ అన్నట్లుగా ‘తాను మూసలో మెలిదిప్పి బిగించబడి ఉన్నప్పటికి తాను, తనతోపాటు పురుషుడు, కుటుంబం, సమాజం నాశనం అవుతాయనే భయంతో, బాధతో వీధిపోరాటానికి దిగకుండా సంస్కరణతో మార్పుతెచ్చే ప్రయత్నం చేస్తుంది.  నడిచే ఎడపిల్లకు చేయూతనిస్తూ, నడవటంచేతగాని పసిపిల్లను చంకన వేసుకొని, జీవితమనే కొండను ఓర్పుగా ఎక్కాలి చైతన్యమూర్తియైన స్త్రీ.  అంటే ఎదిగీ ఎదగని సమాజాన్ని తనతోపాటుగా ఊర్ధ్వముఖంగా నడిపించాలి

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో