వేదోదయుడు- ఆదూరి హైమావతి

తూర్పు ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. నిద్రపోతున్న నగరం ఇంకా బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూనే ఉంది. నేను కార్లో చతుర్వేదం చయన్లు గారిల్లు వెతుక్కుంటూ బయల్దేరాను సకుటుంబంగా. గేటు వద్ద గూర్ఖా, నా వివరాలు వ్రాయించుకుని, సంతకం పెట్టాక, ‘రైట్‌, అగైన్‌ రైట్‌’ అని చెప్పి నోరు దులుపుకున్నాడు. అతడు చెప్పిన దిక్కుగా వెళ్ళి, కార్‌ పార్కే ్చసి, తలెత్తి నూతన గృహాన్ని చూడగానే కాస్త విస్తు, మరి కాస్తంత వినోదం, వింత, కొంత అసూయ, ఆనందం, ఆహ్లాదం తదితరాలు చాలానే కలిగాయి. కళ్ళముందు మహారాజులా మూడంతస్తుల పాలరాతి భవనం, పోలిక చేయకూడదు కానీ పాలరాతి ‘తాజ్‌’లా ఉంది, బయటనుంచీ చూస్తుంటే! ‘వేదనిలయం’ అనే ఇంటిపేరు రంగురంగుల దీపాల మధ్య వెలిగిపోతున్నది. నగరం నిద్రలేవకున్నా చతుర్వేదం చయన్లుగారిల్లు ఎప్పుడో నిద్రలేచినట్లుంది. సన్నాయిమేళాలతో, వేదనాదంతో ప్రతిధ్వనిస్తున్నది. ఆ రోజు చతుర్వేదం చయన్లుగారి నూతన గృహప్రవేశమూ, కవలలైన మనవలిద్దరికి ‘ఉపనయన’ సంస్కారమూ! వారి ఆహ్వానం మేరకు సకుటుంబ సపరివార సమేతంగా నా ‘పుష్పకవిమానం’లాంటి కార్లో విచ్చేశాను.

చతుర్వేదం చయన్లు గారంటే జగమెరిగిన బ్రాహ్మణులు! నలుదిశలా అందరికీ ఎరుకే! పున్నమి వెన్నెల్లా ఆయన కీర్తి వ్యాపించింది. ఆయన వేదం పాడటం మొదలెట్టారంటే వినపడేంతమేరకూ నిశ్శబ్దం. అంతా శిలల్లా నిల్చుని వినాల్సిందే! ఆయన కంఠం, పలికే తీరూ అందరినీ అలా ఆకర్షిస్తాయి. రాముని పాదరేణువులకు శిలారూపంలో ఉన్న అహల్య తిరిగి స్త్రీమూర్తిగా మారిందికదా!, చయన్లుగారి వేదనాదానికి మానవులు శిలల్లా నిల్చి ఆస్వాదిస్తారు. నాల్గువేదాలు ఆయనకు కంఠోపాఠం. అందుకే ఆయన చతుర్వేదం చయన్లయ్యారు. ఆయన తాతముత్తాతల నుంచీ వేదవంశం వారిది. ఆయన వేదం చదవడం విన్నవారంతా ఆయన శిష్యులైపోయి పాఠాలు చెప్పించుకున్నారు. కులమతభేదాల్లేకుండా, స్త్రీపురుష తేడాల్లేకుండా, అందరికీ ఒకే రీతిలో వేదం, అర్థంతో నేర్పడం ఆయన ప్రత్యేకత! నేనూ వాళ్ళలో ఒకడ్ని. ఆయన ప్రియశిష్యుడ్ని! అందుకే కామోసు కాస్తంత అహమూ తలకెక్కినవాడ్ని. మరి ఆయన నూతన గృహప్రవేశమూ, మనవళ్ళ ‘ఉపనయన’మంటే ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు, చూసి తీరాల్సిందే. లోపలికి నడిచాం అందరం. చోటుచూసుకుని కూర్చున్నాం. మేం కాస్తంత లేటైనట్లే ఉంది వరస చూస్తే! తెల్లారకముందే తలంట్లు పూర్తయినట్లున్నాయ్‌, మహిళలందరి జుట్లూ జారుముడులతో ఉన్నాయి. గృహప్రవేశం ఐపోయినట్లుంది, ఉపనయన సుముహూర్తం దగ్గర పడుతున్నదని, చయన్లుగారి చూపులను బట్టే ఇంట్లో ఆడవారంతా, కాశి పోసి కట్టుకున్న కంచిపట్టుచీరల పరపరలతో ఏర్పాట్లకై గబగబా తిరగసాగారు. ఒక పక్కగా కూర్చున్న వేదపండితులు వేదాన్ని చదువుతూనే ఉన్నారు. నేనూ వెళ్ళి వారి సరసన చేరి గొంతువిప్పి కలిపాను. పంచశిఖలతో, బంగారురంగులో అపర వామనమూర్తుల్లా ఉన్న ఎనిమిదేళ్ళ బాలురిద్దరు, నారవస్త్రాన్ని అంగవస్త్రంగా ధరించి, జింక తోలును

ఉత్తరీయంగా వేసుకుని, ముంజ కసవుతో (ముంజ గడ్డి) పేనిన ముప్పేట మొలత్రాడుతో, బిల్వదండాన్ని తల వరకు ఉండేలా కుడిచేత్తో పట్టుకుని, వచ్చి తాతగారి ఎదురుగా, తండ్రి పక్కనే కూర్చున్నారు. గురుస్థానంలో ఉన్న తాతగారైన చయన్లుగారి సూచనల మేరకు

శుభఘడియలో తండ్రి వేదాద్రి, పట్టు కండువా ఇద్దరి చెవులపై కప్పి ‘గాయత్రీ మంత్రాన్ని’ వారి కుడిచెవిలో ఉపదేశించాడు. పిల్లలిద్దరూ ఉత్తరీయాన్ని జోలెవలె పట్టుకుని వరుసగా ముందు తల్లి వద్దా, తండ్రి వద్దా, తాత, అలా వస్తూ మగవారి వద్ద, ‘శబాన్‌ భిక్షాన్‌ తధాతు’ అని, స్త్రీల వద్ద భిక్ష తీసుకునేప్పుడు ‘భవతీ భిక్షాందేహి’ అని అడిగారు. ముద్దుకారే ఆ చిన్నారులను చూసి అందరూ మందహాసంతో ‘భిక్ష’ వేశారు వారి జోలెల్లో. ఒక అంకం పూర్తైంది. ఆ తర్వాత అందరికీ కూర్చున్న చోటికే కమ్మని కాఫీ అందజేస్తున్నారు ఇంటికోడళ్ళు ముగ్గురూ.

అదీ ఆ ఇంటి మర్యాద. ఆ కాఫీ పరిమళం పరిసరమంతా వ్యాపించగా అంతా ముక్కులు ఎగపీల్చి, గ్లాసులు అందుకుని పొగలుగక్కే ఆ కాఫీ సిప్చేయసాగారు తన్మయంగా. చయన్లుగారికి ముగ్గురు కొడుకులు. మూడో కొడుకు పిల్లలే ఈ వడుగు వటువులు. దగ్గరగావచ్చి కాఫీ గ్లాసు అందిస్తున్న అమ్మాయిని మా శ్రీమతి ఎగాదిగా చూడసాగింది. చూసి, చూసి, ఆమెను, ”నీవు బీబీజాన్‌వి కదూ?!” అంటూ మెల్లిగా పలకరించింది. అంతే చేతుల్లో ఉన్న పెద్ద ప్లేట్‌లోని పది వేడి వేడి కాఫీగ్లాసులతో సహా క్రింద పడిపోయిందా అమ్మాయి. పెద్ద గోల, కోలాహలం మధ్య చయన్లు గారి శ్రీమతి, పెద్దకోడలూ వచ్చి ఆ అమ్మాయిని లేపి ఇరువైపులా ఒడిసిపట్టుకుని, నడిపిస్తూ లోపలి గదిలోకి తీసుకెళ్ళారు.

”పాపం, మూడురోజులుగా ఉపోషంట! పచ్చిమంచినీరు త్రాగలేదుట! తెల్లారగట్లే లేచి చన్నీటితో తలారా స్నానం చేసి ‘వేదం’ చదువుతూ కూర్చుంది. స్మారకం తప్పినట్లుంది” అంటోంది ఒక పెద్దావిడ. నేను మా ఆవిడవేపు కోపంగా చూసి, లేచి గుమ్మంవద్దకెళ్ళి నిల్చుని సైగ చేశాను, రమ్మని. ఆమె కాఫీ గ్లాసు పట్టుకుని వచ్చింది. మెల్లిగా గుమ్మం దాటి బయటికెళ్ళాం.

”ఏంటి మహాతల్లీ! ఆ అమ్మాయిని ఏదో అడిగి కన్‌ఫ్యూజ్‌ చేశావు? అలా విరిచుకుపడిపోయింది. ఏమడిగావు?” అన్నాను.

”అదికాదండీ! అ ఆమ్మాయి నా క్లాస్‌మేట్‌ బీబీజాన్‌, ముస్లింల అమ్మాయి! జానకి కానే కాదు.”

”అరే చాలు ఊర్కో! చతుర్వేదం చయన్లుగారి కోడల్ని పట్టుకుని ముస్లిం పేరుతో పిల్చి పైగా నీ క్లాస్‌మేట్‌ అంటావా?”

”నిజమండీ! మేము టెంత్‌క్లాస్‌ నుంచీ ఎం.టెక్‌ వరకూ కలిసి చదివాం. ఆమె పెళ్ళికీ వెళ్ళాను. నేనామాత్రం గుర్తుపట్టలేనా? అంతా ఏదో చిత్రంగా ఉంది.”

”సర్లే ఆపు. మనిషిని పోలిన మనుషులు ఎనమండుగు రుంటారంటారుట సృష్టిలో, ఎవర్నో గుర్తుతెచ్చుకుని ఎవరో అని పిల్చి, పైగా వాదిస్తావా?” కోపంగా అన్నాను.

”కాదండీ! ఆ నవ్వుముఖం, పన్ను మీద పన్ను నాకు బాగా గుర్తు, ఎడంకన్ను మెల్లకూడానూ, అదే ముఖం. నా కళ్ళు నన్ను మోసం చేయవు” అంది, ఖరాఖండీగా. చెప్పద్దూ మా శ్రీమతికి జ్ఞాపకశక్తి చాలా ఎక్కువే! మంచి స్నేహశీలి కూడానూ. ఆమె ఆల్బంలోని స్నేహితుల ఫోటోలు నెలకోమారైనా చూసుకుంటుంటుంది. చాలామందితో కాంటాక్ట్‌లో ఉంటుంది. ఆమెమాట కాదనాలేను. చతుర్వేదుల వంశాన్ని శంకించనూ లేను. సందిగ్ధావస్థ. ”నీ అనుమానం నిజమే తల్లీ! ఇలా రండి అక్కడ కూర్చుందాం” అంటూ ఒకావిడ, ఇంటి ముందున్న తోటలోని బెంచీ మీదకి వెళ్ళి కూర్చుంది,  మేమిద్దరం ముఖముఖాలు చూసుకుంటూ వెళ్ళి కూర్చున్నాం. ఆమె చెప్పసాగింది.

”జానీ పాపా మన ఇళ్ళలో ఇలా కాలేజీలకూ, ఉద్యోగాలకూ వెళ్ళేది లేదమ్మా! మా మాట విను నిన్ను హైస్కూల్‌ వరకూ చదివించిందే ఎక్కువ. బురఖా వేసుకోవడం లేదని అన్నీ వదిలేస్తామా?”

”లేదమ్మీ! నేను కాలేజీలో చేరి చదువుతాను. నాకు చదువంటే ప్రాణం, కాదనకండి ప్లీజ్‌ బాబా!”

”ఇలా అన్నం మానేసి మమ్మల్ని ఒప్పించాలని చూస్తున్నావా? నీవు నెల మానేసినా అది రంజాన్‌ మాసం అనుకుంటాం కానీ నీమాట వినేది లేదు.” ఖచ్చితంగా ఉన్న తండ్రి మాటలకు హతాసురాలైంది జానీ.

”ఏంటి మామా! ఎవరి మాట నీవు వినేది లేదంటున్నావ్‌!” అంటూ వచ్చాడు సల్మాన్‌.

”సల్మాన్‌! మంచి సమయానికి వచ్చావ్‌! చూడబ్బీ! జానీ పాప రెండురోజులుగా అన్నం మాని కాలేజీలో చేరి చదువుతానని పట్టుబట్టి కూర్చుంది.”

”చదవనీ అత్తా! జానీ పాపకి చదువంటే మహా ఇష్టం మామా! నేనూ చేరుతున్నాగా కాలేజీ! ఇద్దరం కలిసెళ్తాం, సరా! లే జానీ! లేచి అన్నం తిను, రా నేనూ నీతో కల్సి తింటాను!” అంటూ జానీ పాపను లేపాడు సల్మాన్‌.

”నీవిట్టా గారం చేస్తే రేపు షాదీ అయ్యాక నీ మాటే వినదు సల్మాన్‌” అన్న అత్తకు, ”పోన్లే జానీ మాట నేనే వింటాను, పదత్తా అన్నం పెట్టు ఇద్దరికీ” అంటూ డైనింగ్‌ టేబుల్‌ వద్ద కూర్చున్నాడు.

అలా జానీ కాలేజ్‌లో చేరి స్టేట్‌ ఫస్ట్‌ ఇంటర్లో, ఎంసెట్‌లో మూడో ర్యాంక్‌ తెచ్చుకుని బీటెక్‌ చేసి, కాన్‌పూర్‌ ఐఐటిలో ఎంటెక్‌ సీట్‌ సాధించింది, తోడుగా సల్మాన్‌ ఉండగా, ఎక్కడా ఇబ్బంది లేకుండా చదువు పూర్తై, క్యాంపస్‌ ఇంటర్వ్యూలో యాభైలక్షల ఉద్యోగం కూడా సంపాదించింది.

”జానీ! ఇహ నావల్ల కాదు నీకోసం వేచి ఉండటం, ఇహనైనా ఈ దీనుడ్ని దయచూసి షాదీ చేసుకో” నవ్వుతూ అంటున్న సల్మాన్‌ను చూసి, ”తప్పక, నా చదువుకూ, ఎదుగుదలకూ నీవే నిచ్చెనవై నిలిచావు. ఎప్పుడో ఆగిపోవాల్సిన నా చదువుకు నీవే అండవయ్యావు. నీ సపోర్ట్‌తో కొండంత ధైర్యంతో ఈరోజు ఇంతమంచి ఉద్యోగం సంపాదించాను. పూలతకు మానులా ఆలంబననిచ్చిన నీకు నా జీవితాన్ని అంకితమిస్తాను సల్మాన్‌! మీ అత్తకు చెప్పు షాదీ ఏర్పాటుచేయమని, నిఖా కట్టేయి, నీ ఒడిలో వాలిపోయి, హాయిగా జీవితమంతా గడిపేస్తాను. నీవంటివాడి భార్యనవటం నా పూర్వజన్మ సుకృతం. ఇంత దగ్గరగా ఉన్నా కూడా నీవు హద్దులు దాటలేదు చూడూ అదే నన్ను నీకు అంకితమయ్యేలా చేసింది” అంది జానీ. అలా జానీ సల్మాన్‌ ఒకటయ్యారు. వారి పెళ్ళికి చాలామంది స్నేహితులు హాజరయ్యారు. పెళ్ళికొడుకు వేషంలో సల్మాన్‌ గుఱ్ఱంమీద కూర్చుని తలకు ముఖం కనిపించకుండా పూలతోరణం కట్టుకుని వెళ్తుండగా స్నేహితులంతా తోడుగా నడిచారు. పెళ్ళికూతురి వేషంలో జానీ బురఖాలో పూర్తిగా ముస్లిం అలంకారంతో తలవంచుకుని కూర్చుని ఉండటం చూసి స్నేహితులంతా ముచ్చటపడ్డారు.

టెంత్‌ నుంచీ క్లాస్‌మేటైన అద్రి ”మీ ఇద్దర్నీ చూస్తుంటే జెలసీగా ఉందిరా! సల్మాన్‌! ఒకరికోసం ఒకరుగా, ఒకరి ఆశయం కోసం మరొకరు తపించడం, మేడ్ఫర్‌ ఈచ్‌ అదర్‌లా ఉన్నార్రా! అదృష్టవంతులు. పెళ్ళయ్యాక నన్ను మర్చిపోరుగా!” అంటున్న అద్రితో, ”ఛ అలా అనకురా! మీలో ఎవరికైనా ఎప్పుడు ఏ సాయం కావాలన్నా నేనున్నానని మరువకండి! అలాగే మాకూ ఎప్పుడూ అందుబాటుగా ఉంటావుగా! ఏదైనా సాయం అవసరమైతే చేస్తావుగా! యూ ఆర్‌ అవర్‌ బెస్ట్‌ ఫ్రండ్‌ అద్రీ!”

”మీకెందుకురా సాయం? మీరే అందరికీ సాయం చేయగల సమర్ధులు.”

”అలా అనకు అద్రీ! మనం మానవులం కదా!, దేవుళ్లం కాము. ఎప్పుడు ఎవరికి ఏ సాయం అవసరమవుతుందో ఎవరికెరుక?”

”ప్రామిస్‌ సల్మాన్‌! తప్పక మీకోసం నా ప్రాణమైనా ఇస్తాన్రా!”

”ధన్యవాదాలు అద్రీ! నేను ఉద్యోగం చేయను, మా జమీ చూసుకుంటాను, జానీకి ఉద్యోగవిషయాల్లో ఏ సాయం కావాల్సినా నీవు అండగా ఉంటానని ప్రామిస్‌ చెయ్యి!!”

”ష్యూర్‌ సల్మాన్‌”

”మనందరం ఎప్పట్లాగే కల్సి ఉందాం సల్మాన్‌! ప్రామిస్‌” అలా చిన్ననాటి మిత్రులంతా వారి వివాహానికి హాజరై పరస్పర సాయానికి ప్రతిజ్ఞ చేసుకున్నారు. హైస్కూల్లో చదివేరోజుల్లో ఒకమారు ”జానీ! నీవూ సల్మాన్‌ స్వచ్ఛమైన తెలుగు ఎలా మాట్లాడుతారు, మాకూ సరిగా కొన్ని తెలుగుపదాలు పలకడం రాదే!” అని క్లాస్‌మేట్‌ కళ అడిగిందానికి, ”మేము ముస్లింస్‌ ఐనా తెలుగుగడ్డపై పుట్టి, పెరిగి, తెలుగుగాలి పీల్చుకుంటూ, తెలుగునేలపై పండిన తిండి తింటూ తెలుగు ప్రజలతో జీవిస్తూ తెలుగు మాట్లాడటం రాకపోతే మేము కృతఘ్నులమైపోమూ? అందుకే మా మాతృభాష వేరైనా మేము స్వచ్ఛమైన తెలుగే అందరితో మాట్లాడాలని మా తాతలు తీసుకున్న నిర్ణయంట! అందుకే మా తండ్రి, తల్లి కూడా దాన్ని పాటించి మాకూ నేర్పారు. మాకంతా తెలుగుభాష మీలాగే వచ్చును. మేము తెలుగును ప్రేమిస్తాం. సల్మాన్‌ మా బంధువే! అతనికి తెలుగు మాలాగే స్వచ్ఛంగా వచ్చు. మా అమ్మా నాయనా కూడా ఆంగ్లమూ మాట్లాడుతారు. హిందూ దేవాలయాలకూ వస్తారు” అని చెప్పింది జానీ.

”మీ అమ్మా నాన్నా నీ కాలేజీ చదువుకెందుకు అడ్డుచెప్పారు?!” ఆశ్చర్యంగా అడిగిన అరుణతో, ”కాలం విపరీతంగా మారిపోయి, కాలేజీలకెళ్ళగానే తెలివి వెర్రితలలేసి, ఏమైనా చేస్తారనీ, ఏదేదో నేర్చుకుని సంస్కృతిని మంటకలుపుతారనీ వారి భయం. మా సల్మాన్‌ నాకు అండగా నిల్చి, అతడికి ఇలాంటి చదువులపై పెద్దగా మమకారమూ, అవసరమూ లేకపోయినా నాకోసం తోడుగా చదువుకున్నాడు. లేకపోతే నా చదువు ప్రాథమిక స్థాయిలోనే ఆగిపోను. వాళ్ళది జమీందారీ కుటుంబం. పొలాలూ, తోటలూ, ఆస్తులూ మస్తున్నై. నాతోపాటు చదివి నా కోరిక తీర్చిన సల్మాన్‌ అంటే నాకు ప్రాణం. అతడు లేనిదే నాకు బ్రతుకే లేదు” అంది ఆవేశంగా జానీ.

పెళ్ళయ్యాక జానీ ఉద్యోగం చేస్తుండగా, సల్మాన్‌ తన పొలాలూ, తోటలు జమీ అంత చూసుకోసాగాడు. ఒక సం||లో జానీ కవలపిల్లలకు జన్మనిచ్చింది. వారి ప్రేమ సామ్రాజ్యానికి గుర్తుగా – ఒక పాప, బాబు. రెండు కుటుంబాలూ కలసి ఒకే ఇంట్లో సల్మాన్‌ బంగళాలో జీవిస్తూ పిల్లలను అపురూపంగా చూసుకోసాగారు. మూడేళ్ళకాలం మూడుక్షణాల్లా గడిచిపోయింది. జానీకి మంచి ఉద్యోగిగా పేరు వచ్చింది. ట్రైనింగ్‌కోసం ఆరుమాసాలు అమెరికా వెళ్ళమన్నారు కంపెనీవారు. అప్పటికి పిల్లలు మూడేళ్లవారు. సల్మాన్‌ ట్రైనింగ్‌ వద్దనలేదు. జానీ ఆశయాలకెన్నడూ అడ్డుకట్ట వేయకపోవడం అతడికున్న ఉత్తమలక్షణాల్లో ఒకటి. జానీకి తోడుగా తానూ ‘రానా’ అని అడిగిన సల్మాన్‌తో ”సల్మాన్‌! ఇద్దరం లేకపోతే పిల్లలు దిగులుపడతారు, నీవు ఇక్కడే ఉండి పిల్లల్ని చూసుకో! ఐనా అడుగుతున్నావ్‌ కానీ వాళ్లను వదలి నీవు ఒక్కరోజైనా ఉండగలవా! నాకు తోడుగా మన బ్యాచ్‌మేట్‌ అద్రి ఉన్నాడులే! అతడూ ట్రైనింగ్‌కు వస్తున్నాడుగా! నాకేం దిగుల్లేదు” నవ్వుతూ టాటా చెప్పి విమానమెక్కింది జానీ.

లిలిలిలిలి

”మాజీ! నేను తోటల్లో మామిడిపళ్ళు దింపించి మార్కెట్‌కు తోలించి వస్తాను” అని బయల్దేరుతున్న సల్మాన్‌తో, ”డాడీ! నేనూ వస్తాను నీతో తోటకు తీసుకెళ్ళు, ఈ రోజు స్కూల్‌ లేదు” అంటూ వచ్చాడు ప్రీస్కూల్‌లో చదువుతున్న మూడేళ్ళ కొడుకు. ”నేనూ నీతోనే వస్తాను, నన్నూ తీసుకెళ్ళు” అంటూ కూతురూ వచ్చి కారెక్కింది. తనలా ఉండే కూతురూ జానీలా ఉండే కొడుకూ అంటే సల్మాన్‌కు ప్రాణం. వారిని వదలి ఒక్కరోజైనా ఉండలేడు. సల్మాన్‌ ప్రాణమంతా పిల్లలపైనే. ”తోటకు వాళ్ళెందుకురా! అక్కడ దుమ్ముధూళి…” అంటున్న తల్లితో, ”వాళ్లను అక్కడి మన ఔట్‌హౌస్‌లో ఏసీ గదిలో ఉంచుతాన్లే అమ్మీ” అని చెప్పి, ”ఎక్కడికెళ్ళినా మిమ్మల్ని నాతోనే తీసుకెళతాను, వదలను. పదండి వెళదాం” అంటూ బయల్దేరాడు. ఇద్దరు చిన్నారులూ తండ్రి పక్కనే సర్దుకుని కూర్చున్నారు. కాస్తసేపు కాగానే వారిని దాటుకుని ఒక కారు వెళ్ళింది. ఆ కారులోంచి ఒక ఐదేళ్ల పిల్లాడు చేయి ఊపి వెక్కిరించాడు.

పిల్లలిద్దరూ ”డాడీ! త్వరగా ఆ కారును దాటుకుని పోనీ, త్వరగా…” అంటూ తండ్రిని వేధించసాగారు. వారి ఉత్సాహం చూసి సల్మాన్‌ కారు వేగం పెంచాడు. రెండుకార్లూ పోటీగా పక్కపక్కనే వెళుతున్నై. సల్మాన్‌ కారు ముందు కారును దాటేంతలో ఎదురుగా వస్తున్న ఒక లారీ అమితవేగంగా వచ్చి గుద్దేసింది. కారు మూడు పొర్లిగింతలు పెట్టి పక్కనే ఉన్న పెద్ద నీటిగుంతలో పడిపోయింది. అందుకే పెద్దలన్నారు ‘నిదానమే ప్రధాన’మనీ, ‘అతి సర్వత్రావర్జయేత్‌’ అని, వేగం కంటే ప్రాణం విలువైనదనీ. జరగరానిది జరిగిపోయింది. వార్త అందుకుని అంతా వచ్చి చూశారు. పిల్లల్ని వదలి ఉండలేని సల్మాన్‌ వారినీ తనతో తీసుకెళ్ళిపోయాడు.

అమెరికాలో కాలిఫోర్నియాలో ట్రయినింగ్‌లో ఉన్న జానీకి విషయం తెల్సి కుప్పకూలిపోయింది. జానీతో అక్కడే ట్రైనింగ్‌లో వున్న ‘అద్రి’ తగుజాగ్రత్త తీసుకుని అర్ధాంతరంగా తన ట్రైనింగ్‌ కూడా క్యాన్సిల్‌ చేసుకుని, టికెట్స్‌ బుక్‌ చేసి, జానీని తీసుకుని ఇండియా వచ్చేశాడు. దగ్గరుండి అన్నీ వారి మతసాంప్రదాయం ప్రకారం జరిపించాడు. దుఃఖసాగరంలో మునిగిఉన్న ఆ రెండు కుటుంబాలనూ నావలా ఆదుకుని అన్నీ చూశాడు. జానీ మంచంపట్టి మోడువారిపోయింది. అన్నంనీళ్ళూ అన్నీ మానేసింది. చిక్కి సగమైంది. ఉద్యోగం మానేసి, ఇల్లు వదిలేసి అద్రి, జానీని కనిపెట్టుకుని ఉండి సల్మాన్‌, పిల్లలు ఉన్న వీడియోలు, ఫోటో ఆల్బంస్‌ చూపిస్తూ, తగురీతిగా వ్యాఖ్యానిస్తూ కాస్తంత తిండి తినిపిస్తూ, మెల్లిగా లోకంలో పడేయసాగాడు. మూడునెలలయ్యేసరికి జానీ కొంత కోలుకుంది. జానీ ఇప్పుడు అద్రితోతప్ప ఎవ్వరితో మాట్లాడ్డం లేదు. తనవారిని ఎవర్ని చూసినా తిరిగి దుఃఖసాగరకెరటాల మీదకు జానీ పడవ సాగుతున్నది. అందుకని అద్రి అందరితో మాట్లాడి ఒప్పించి, జానీని తీసుకుని కేరళ ప్రాంతానికి వెళ్ళి అక్కడ నివసించసాగాడు. ఒక కంపెనీలో ఉద్యోగంలో చేరి చిక్కుసమస్యలను ఇంట్లో జానీతో చర్చించి నివారణలు తెల్సుకుంటూ మెల్లిగా జానీని ఉద్యోగం చేసే స్థాయికి తెచ్చాడు. కాలమే గాయాలు మాన్పే చక్కని ఔషధం కదా మరి!

మూడేళ్ళు కాలగర్భంలో కలిసిపోయాయి. క్రమేపీ జానీ

ఉద్యోగంలో చేరి అనేక చిక్కుసమస్యలను విడదీసి అమోఘమైన తెలివిని ప్రదర్శించి, నష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీని లాభాల బాట పట్టించింది. ”మిసెస్‌ అద్రి! మీ మేధ అమోఘం, మిమ్మల్ని ఈ ఫ్యాక్టరీకి పార్టనర్‌గా తీసుకుంటున్నాం మా కోరిక కాదనకండి” అని కోరింది యాజమా న్యం. ఆ సంతోషంలో, తన ఘనవిజయానికి మూలబిందువైన అద్రిని గట్టిగా హత్తుకుంది. ఆవేదనలో ఆలంబననందించిన వ్యక్తి సాన్నిధ్యం, వయస్సు, ఆప్యాయత, ఆరాటం, అన్నీ ముప్పిరిగొని అద్రి సాన్నిహిత్యాన్ని మనస్సు కోరగా అతడికి అంకితమైపోయింది జానీ. అలా ఫ్యాక్టరిలోనే కాక అద్రి జీవితంలోనూ భాగస్వామ్యం పొందింది జానీ. అలా అద్రి మిసెస్‌గా అక్కడ జీవితం ప్రారంభించింది. విధి వక్రగీతలను సైతం సరిచేయగల సమర్ధత కలది కదా! అలా రిజిస్టర్‌ మేరేజ్‌ చేసుకున్న వారిద్దరూ పెద్దల దీవెనలు పొందారు?లిలిలిలి

”చతుర్వేదం చయన్లుగారు మహామహులు, దైవస్వరూపులు, ఆయన మూడో కొడుకు నా బిడ్డకు పునర్జన్మనిచ్చిన సాక్షాత్‌ దైవం, ఆ జానీయే ఈ జానకి తల్లీ! ఆ అద్రే ఈ వేదాద్రమ్మా!” అంటూ

కళ్ళు వత్తుకుంటున్న ఆ స్త్రీమూర్తిని చూసి నా శ్రీమతి కూడా కళ్ళు తుడుచుకుంది.

”అమ్మా మీరు బీబీజాన్‌ తల్లిగారు మహబూబీయే కదూ?” అంది.

”అవునమ్మా! జానీకి నాల్గు వేదాలూ నేర్పారు చయన్లు గారు. మానవత్వాన్ని మించిన దైవత్వం మరొకటి లేదని నిరూపిస్తూ చయన్లు గారు మమ్మల్ని దగ్గర చేర్చుకుని మానవీయ హృదయంతో ఆశీర్వదించారు. వేదాల సారమంతా ఆయన రూపంలో నిలువెత్తున నిల్చి ఉందమ్మా” అంది మనస్సు నిండిన కృతజ్ఞతాభావంతో ఆమె.

”ఎవరైనా హఠాత్తుగా పాతపేరుతో పిలిస్తే వెంటనే గతస్మృతులు మనస్సును కెలికి ఇలా పడిపోతుంటుంది ఫిట్స్‌లాగా. అందుకే అందరం జానీని కనిపెట్టుకుని గతం గుర్తు రాకుండా చూసుకుంటున్నాం. ఇద్దరు పిల్లల తల్లికి పునర్జన్మనిచ్చిన దేవుడమ్మా ఆయన. ఏ జన్మ బంధమో వేదాద్రి మాకందరికీ మళ్ళీ జీవం పోశాడు. చతుర్వేదం చయన్లుగారు అపరదైవం మాకు. ఆయన అండలో నిశ్చింతగా బ్రతుకుతున్నామమ్మా!” అంది ఆమె ఆనందబాష్పాలతో, కృతజ్ఞతాజలాలతో మరి, ఏరులై పారుతున్న కళ్ళు తుడుచుకుంటూ. ”మీరిక్కడున్నారా! జానకి మీకోసం చూస్తున్నది వదినగారూ! హోమం మొదలైంది” అంటూ వచ్చింది, కాశిపోసి కట్టుకున్న ఆకుపచ్చ పట్టుచీరలో అపర అన్నపూర్ణలా

ఉన్న చయన్లుగారి సతీమణి. అందరం లేచి ఇంటివైపు నడిచాం. ”నేను చాలా గొప్పవాడిననీ, మానవత్వం ఉన్న మనిషిననీ, ఎందరో పేద బ్రాహ్మణ విద్యార్థుల చదువులకు, నిరుపేద బ్రాహ్మణ వధువుల వివాహాలకు సాయం చేస్తున్నాననీ, వేదం వచ్చనీ, విశాల భావాల వైశాల్య హృదయుడిననీ, గొప్ప ఉద్యోగినైనా ఇసుమంత గర్వం లేదనీ అంతా పొగుడ్తూ అనే మాటలు ఎంతవరకూ నాకు వర్తిస్తాయో యోచిస్తూ, ఇంతకాలం వృక్షాలు లేనిచోట ఆముదపు వృక్షంలా విర్రవీగిన నేను, చతుర్వేదం చయన్లుగారి ముందు వటవృక్షం ముందు రెల్లుగడ్డిలా హోమగుండం ముందు నిప్పురవ్వలా, సముద్రం ముందు నీటిబొట్టులా, వజ్రం ముందు చెల్లని కాసులా, పున్నమివెన్నెల ముందు వడికట్టిన వత్తిలా, ఏనుగు ముందు ఎలుకలా, సిగ్గుతో అహం దగ్ధమై, మనస్సును కప్పేసిన గర్వపు మాయ పొరలు, సుడిగాలికి కొట్టుకుపోగా, హాయిగా, స్వచ్ఛమైన మనస్సుతో, వేదసారాన్ని స్మరిస్తూ, ‘ఏకమేవ అద్వితీయం బ్రహ్మ’ అనుకుంటూ గురువులూ, ఆదర్శమూర్తులూ ఐన చయన్లుగారి దర్శనానికై నడిచాను.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

One Response to వేదోదయుడు- ఆదూరి హైమావతి

  1. భూమిక సంపాదక వర్గానికి!
    నాహృదయపూర్వక ఈకధ ప్రచురించినందుకు ధన్యవాదాలండీ!
    హైమావతి.ఆదూరి.
    [అమేరికా చికాగో]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో