ఉడకని మెతుకులు చెబుతున్న ఊసులు – అత్తలూరి అరుణ

ఆయన నక్సలైటు కాదు. కానీ పోరాడాడు. కలెక్టర్‌గా ఉంటూ వర్గపోరాటం చేశాడు. ఈమాట ప్రజలకైతే పొగడ్తే కానీ, ప్రభుత్వం దృష్టిలో వర్గపోరాటం తీవ్రవాదులు చేసేది. కానీ కేఆర్‌ వేణుగోపాల్‌ గారిపై ప్రభుత్వం ఈ అభియోగం మోపింది- కలెక్టర్‌ వర్గపోరాటం చేస్తున్నాడని. అంబేద్కర్‌తో స్ఫూర్తి నొంది, అణగారిన వర్గాల పక్షపాతిగా నిలిచిన వేణుగోపాల్‌ నాడూ నేడూ అదే పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ రోజు అదే పేద ప్రజల కోసం ఉడకని మెతుకులు ఏరుకుంటూ బాలింతలకు, చిన్నారులకు నాలుగన్నం మెతుకులు పెట్టండహో అంటూ అక్షరం అక్షరం అభ్యర్థిస్తున్నాడు. కేఆర్‌ వేణుగోపాల్‌ సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌) అమలు తీరుతెన్నులపై రాసిన ‘ఉడకని మెతుకు’ పుస్తకావిష్కరణ సభ సందర్భంగా సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ.

‘రూళ్లకర్రల మీద నడవడమే కలెక్టరు తనానికి ప్రతీక. కానీ బడుగుల వెన్నంటి నడిచిన కలెక్టర్లు ఉన్నారు. ఒక్క అధికారి దళితులు, పేదలకు అండగా నిలబడితే ఎలాంటి మార్పు సంభవిస్తుందో నిరూపించిన కలెక్టర్‌ కేఆర్‌. నక్సలైట్‌ అనీ, పేదల కోసం కుట్రలు చేసేవాడనీ ఆయనకు పేర్లు. ఇంగ్లీష్‌ పాలనా వ్యవస్థ అవశేషం కలెక్టర్‌ వ్యవస్థలో కేఆర్‌ దేశీయ ముద్ర.

ప్రశ్న : ముగ్గురు ప్రధానులు- చంద్రశేఖర్‌, వి.పి.సింగ్‌, పి.వి.నరసింహారావుల దగ్గర కార్యదర్శిగా పనిచేసిన అనుభవం దేశ ప్రతినిధి వర్గానికి ఐక్యరాజ్యసమితిలో నేతృత్వం, కశ్మీర్‌ సమస్యలో ప్రత్యేకదూత… వాటిలో మీకు అత్యంత ఆనందాన్నిచ్చే అంశం?

జవాబు : వీపీ సింగ్‌ లాంటి గొప్ప ప్రధానుల దగ్గర పనిచేయడం నాకు ఆనందదాయకం. అయితే ప్రజలకు నిరంతరం మేలు చేసే గొప్ప పథకం ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌ ఐసీడీఎస్‌కి అంకురార్పణే నాకు అత్యంత ఆనందాన్నిచ్చిన అంశం. ఈ దేశంలో దీని కన్నా గొప్ప పథకం మరొకటుం టుందని నేను భావించడం లేదు. ఆరోగ్యవంతమైన భావిభారత పౌరుల కోసం నిర్దేశించిన పథకం ఇది. గర్భిణులు, బాలింతలు, శిశువులకు పౌష్టికాహారం అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావించడమే ఈ పథకం రూపకల్పనకి ప్రధాన కారణం. 1970-72 ప్రాంతంలోనే దుర్గాభాయ్‌ దేశ్‌ముఖ్‌ తెలంగాణాలోని మహబూబ్‌నగర్‌లో పైలట్‌ ప్రాజెక్టుగా దీన్ని మొదట ప్రవేశపెట్టారు. ఆ తరువాత 1975లో ఇందిరాగాంధీ మొత్తం దేశంలోని 33 బ్లాకుల్లో దీన్ని ఆచరణలో పెట్టారు.

ప్ర: ‘ఉడకని మెతుకు’ రాయడానికి ప్రేరేపించిన అంశాలేవి?

జ : గర్భిణులు పౌష్టికాహారం తీసుకోకపోతే అంగవైకల్యం కలిగి, అనారోగ్యకరమైన తరం జన్మిస్తుంది. పిల్లలే దేశ భవిష్యత్తు. దురదృష్టవశాత్తూ ఈ పథకం చచ్చిపోయింది. పథకం అమలు తీరుతెన్నులు పరిశీలించేందుకు నేనే స్వయంగా గ్రామాల్లో తిరిగాను. అవినీతి ఈ పథకాన్ని అథఃపాతాళానికి తొక్కేసింది. అంగన్‌వాడీ కార్యకర్తల నియామకమే అవినీతిలో కూరుకుపోయింది. అనంతపురంలోనైతే అంగన్‌వాడీ కార్యకర్త ఉద్యోగానికి 30 వేలు లంచం అడుగుతున్నారు. ప్రకాశం జిల్లాలో 70 వేలు, శ్రీకాకుళంలో లక్ష రూపాయల ధర పలుకుతోంది. ఇక మూడు వేల రూపాయలు తీసుకొని బానిస చాకిరీ చేసే అంగన్‌వాడీ కార్యకర్తల కష్టాలు, కన్నీళ్ళు అన్నీ ఇన్నీ కావు. మొత్తం 154 అంగన్‌వాడీలను తనిఖీ చేశాం. చివరకు బాలింతల, పిల్లల బరువుతూసే యంత్రాలు సైతం అక్కడ అందుబాటులో లేవు. ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులే కాదు అధికారులు అప్రమత్తంగా లేకపోతే, చిత్తశుద్ధితో పనిచేయకపోతే ప్రజలకు మేలు చేసే ఏ పథకం అయినా ఇలాగే నిర్జీవంగా మారిపోతుంది.

ప్ర: ఐసీడీఎస్‌తో పాటు ఇంకేదైనా ప్రభుత్వ పథక రూపకల్పనలో మీరు భాగస్వాములయ్యారా?

జ : ఇప్పుడు గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ, నేను పీవీ నరసింహారావు గారి దగ్గర సెక్రటరీగా పనిచేసేటప్పుడే ఇంతకన్నా అద్భుతమైన ఎంప్లాయ్‌మెంట్‌ అస్యూరెన్స్‌ పథకాన్ని ప్రవేశపెట్టాం. 1991 నుంచి రెండేళ్లపాటు అనేక చర్చల తర్వాత 1993లో దీన్ని తీసుకొచ్చాం. కూలితో పాటు కూలీలకు అవసరమైన తృణధాన్యాలను కూడా ప్రభుత్వమే ఈ పథకం ద్వారా అందిస్తుంది. కూలీలు తినడానికి ఎంత అవసరమైతే అంత ఇవ్వాలన్నది సూత్రం. ఇప్పుడున్నది మాత్రం ఎటువంటి హామీ లేని ఉపాధిహామీ పథకం.

ప్ర: దళితుల సమస్యల పట్ల మీకున్న నిబద్ధత, సాహసం కారణంగా మీమీద ప్రభుత్వమే కేసు పెట్టింది. ఆ అనుభవాలు చెపుతారా?

జ : గుంటూరు జిల్లా తోట్లవల్లూరులో అగ్రకుల భూస్వాములు ఆక్రమించిన లంక భూములను లాక్కొని దళితులకు స్వాధీనం చేశాను. దురాక్రమణలోని భూముల్లో పంటలను ధ్వంసం చేసే హక్కు ప్రభుత్వమే కల్పించింది. అయితే నేను భూములు పేద దళితులకు పంచటమే కాకుండా అగ్రకులస్థులు వేసిన 75 ఎకరాల్లోని పంటను సైతం దళితులకు పంచాను. భూస్వాములు కోర్టుకి వెళ్ళారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు దగ్గర దళిత మహిళలు బహిర్భూమికి వెళ్ళకుండా ప్రభుత్వ భూమికి అగ్రకుల పెత్తందార్లు కంచె వేశారు. దాన్ని పెరికివేసి దళిత మహిళల పక్షాన నిలబడ్డాను. ఈ కేసులో నన్ను కలెక్టరుగానే పనికిరానని, నేను దళితుడినని అందుకే వారి పక్షాన పోరాడుతున్నానని అభియోగం మోపారు. అది నాకు బిరుదే. ప్రభుత్వాధికారిగా ఉండేవాళ్ళు చేయాల్సింది ప్రజల పక్షం వహించడమే. పెత్తందార్లు, భూస్వాములకు కొమ్ము కాయడం కాదు.

ప్ర: నక్సలైట్ల ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో మీరు పనిచేశారు. వారిపై మీ అభిప్రాయం?

జ : 70వ దశకంలో భూసంస్కరణల చట్టం చేశారు. దళితులు, ఆదివాసీలకు ఇచ్చిన భూమిని తిరిగి తీసుకోకూడదు. కానీ ఇది ఈ రోజుకీ అమలు జరగడంలేదు. తీవ్రవాదాన్ని నేను సమర్థించను. కానీ, ప్రజల హక్కులు అణచివేసినప్పుడు తిరుగుబాటు వస్తుంది. ఎటువంటి అణచివేతకు తావులేకుండా ప్రభుత్వం పనిచేయాలి.

ప్ర: మతోన్మాదం మీద, కులం మీద మీ అభిప్రాయం?

జ : ఈ దేశంలో ఐక్యత ఉందని మీరు నమ్ముతారా? ఇక్కడ కేవలం హిందువులే బ్రతకాలా? క్రైస్తవులు, ముస్లింలు ఉండకూడదని ఎక్కడైనా రాసి ఉందా? లేదుకదా? ఈమధ్య క్రైస్తవులపై దాడులు చేయొచ్చని ఒక ప్రకటన చదివాను. ఇలాంటి ప్రకటనలు ఎటువంటి భద్రతనిస్తాయి? మతోన్మాదం, కులతత్వం దేశ అభివృద్ధికి అడ్డుగోడగా తయారయ్యాయి. దాన్ని బద్ధలు కొట్టాలి. దళితుల పక్షాన నిలబడినందుకే ఎన్నో కేసులను ఎదుర్కొన్నాను. పేదల పక్షం వహించినందుకు శంకరన్‌ గారికి, కాకి మాధవరావు గారికి నక్సలైట్‌ ముద్రవేస్తే, నేను వర్గపోరాటం చేస్తున్నానని ఆరోపించారు. ఏమైనా నాది అణగారిన వర్గాల పక్షమే, దళితుల పక్షమే. ప్రత్యేకించి దళిత మహిళల, నోరులేని చిన్నారుల పక్షమే. అందుకే వారికి ‘ఉడకని మెతుకు’ పుస్తకాన్ని అంకితం ఇస్తున్నాను.   (సాక్షి  సౌజన్యంతో..)

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో