‘కొండఫలం’ ఒక మధుర ఫలం-డా|| యు. ఝాన్సీ

వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారు రాసిన కొండఫలం ఒక ‘మధుర ఫలం’. కొండఫలం చదువుతున్నప్పుడు చిన్నయసూరి నీతిచంద్రికలో చెప్పిన ”సంసార విషవృక్షమునకు రెండు ఫలములమృత తుల్యములు కావ్యామృత రసపానమొక్కటి సజ్జన సంగతి యొకటి” అనే సూక్తి గుర్తొచ్చింది. పుస్తకం చదివాక కావ్యామృతాన్ని తాగిన అనుభూతి కలిగిందంటే అతిశయోక్తి కాదు. ఈ పుస్తకంలో మొత్తం పన్నెండు కథలున్నాయి. ఇవన్నీ స్త్రీవాదాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే మెరికల్లాంటి కథలు. ఈ వ్యాసంలో ప్రధానంగా నాలుగు కథలను విశ్లేషించడం జరిగింది.

ఒక రాత్రి గడవాలి :

స్త్రీ అస్తిత్వం అంటే ఏమిటి, కెరియర్‌ అంటే ఏమిటి, స్త్రీ స్వేచ్ఛ అంటే ఏమిటి?… మొదలైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన కథ ఇది. ఈ కథలో వినీల అనే అమ్మాయి, ‘విహయస’ అనే కలం పేరుతో రచనలు చేసిన సర్వలక్ష్మి కథలను చదివి, వాటిద్వారా చైతన్యం పొంది ఒక పైలట్‌గా ఎదుగుతుంది. వినీల ఆ ఉద్యోగంలో చేరడానికి ముందు తన లక్ష్యసాధనకు బాటలు వేసిన సర్వలక్ష్మిని కలవడానికి వెళ్లడంతో కథ ప్రారంభమవుతుంది.

వినీల, తన అభిమాన రచయిత్రి అయిన సర్వలక్ష్మి ఇంటికి వెళ్తుంది. వెళ్లిన దగ్గర నుండి ఆమెను గమనిస్తూ ఉంటుంది వినీల. సర్వలక్ష్మి జీవన విధానం వినీలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆ రచయిత్రి తన రచనల్లో చెప్పిన భావాలకు, అభిప్రాయాలకు భిన్నంగా ప్రవర్తిస్తున్నట్లు అనిపిస్తుంది. వినీల భావాలను గ్రహించిన సర్వలక్ష్మి ఆమె ప్రశ్నలన్నింటికి జవాబు చెప్పడంతో కథ ముగుస్తుంది. ఇది ఈ కథలోని ప్రధాన ఇతివృత్తం.

కథా విశ్లేషణ:

ఈ కథలో స్త్రీ అస్తిత్వాన్ని చాలా వినూత్నమైన రీతిలో పాఠకుల కళ్ల ముందు ఆవిష్కరించారు రచయిత్రి. స్త్రీ తనకు కావల్సినది పొందడం కోసం సమాజంతో పోరాడడంతో పాటు, ఆ పోరాటంలో తన వ్యక్తిగత కుటంబ జీవితాన్ని కూడా సమన్వయం చేసుకుని ఒక ఉన్నత పంథాలో పయనించడమే అసలైన అస్తిత్వం అని రచయిత్రి చిత్రించారు.

సర్వలక్ష్మి తన భర్త అయిన శంకరం గారికి అన్ని విధాలుగా సేవ చేస్తుంది. భర్త లేచేసరికి అతనికి కాఫీ అందించడం, దినపత్రిక అందివ్వడం చేస్తుంటుంది. అవసరం అనుకున్నప్పుడు భర్తకు వంటపని అప్పగిస్తుంది. ఇలా వారిరువురు సాగిస్తున్న జీవన విధానం వినీలకు అంతుపట్టదు. సర్వలక్ష్మి ఆమెకు అర్థమయ్యి అర్థమవ్వనట్టు అనిపిస్తుంది. వినీల ఇక ఉండబట్టలేక తన మనసులో ఉన్న సందేహాలన్నీ నివృత్తి చేసుకుంటుంది. మొదటిగా వినీల సర్వలక్ష్మిని ఇలా అడుగుతుంది. ‘గత పదేళ్లుగా మీరు ఏమీ రాయలేదు. ఎక్కడా ఏ సభలోనూ కనిపించడం లేదు. ఇలా వంటింటికి, ఇంటికి, ఇంటి వెనుక పూల మొక్కలకి మీ తెలివి జ్ఞానాన్ని అప్పగించి ఉండిపోతారనుకోలేదు. మీరు ఇంతకాలం చెప్పిందేమిటి? మీరు ఇక్కడ… ఇలా… ఉంటారని ఊహించలేదు. ఆడవాళ్లు వంటిళ్లు వదిలి బయటకి రాకపోతే జీవితం లేదన్న మీరే ఇలా ఇంటికి బందీ అయిపోయారంటే నాకు దిగులుగా ఉంది. మీ రచనలు చదివి నేను ఇలా బయట ప్రపంచాన్ని గెలిచాను. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే మీరూ మా అమ్మమ్మలాగా వడియాలు పెడ్తూ, పెసరట్లూ వేస్తూ, ఇల్లు సర్దుతూ, సాధారణ గృహిణి అయిపోయారు. అందుకే అర్థంకావట్లేదు’ అని అంటుంది. దానికి సమాధానంగా సర్వలక్ష్మి ‘నేను చాలా చిన్నప్పుడే వంటిళ్ల ట్రెజ్జరీని, ఇళ్ల పెత్తనాన్ని గ్రహించాను. అందుకే ఎదిరిస్తూ బయటికొచ్చాను. బయటి ప్రపంచాన్ని నువ్వు చెప్పినట్లు అర్థం చేసుకోవడమూ, గెలవడమూ చేసాను. ఆ తర్వాతనే ఇంటిని కూడా గెలవొచ్చని తెలిసింది. ‘మరి సభలూ సమావేశాలు ఎందుకు మానేశారు’ ”అదే నీ కంప్లయింట్‌! నా ఫోటో నీకు పేపర్లో కనిపించడం లేదని. అది నీ ఫ్యాన్సీ ఆలోచన కదూ! నాకు అర్థమయిందేమిటంటే బయటికి వచ్చేకొద్ది మనకి వచ్చే పాపులారిటీ, పేరు మనల్ని ‘క్యాప్చర్‌’ చేస్తాయి. మనం ఎందుకొచ్చామో మర్చిపోతాం. ఒక కెరీరిస్టుగా కాకుండా ఉండడం కోసం, ఒక మానవిగా మిగలడం కోసం నా స్వేచ్ఛని ఉపయోగించుకున్నానని అదే నన్ను ఇలాంటి జీవన విధానంలోకి తెచ్చిందని చెప్తే నీకు సులువుగా అర్థమవుతుందా?…” అంటూ తన ప్రశ్నలనింటికి సమాధానం చెప్తుంది. వినీల తన ప్రశ్నలకు సమాధానాలు ఆమె మాట్లాడిన మాటల్లో వెతుక్కుని తృప్తి పడుతుంది.

అంతేకాకుండా పెళ్లి కాకుండా కలసి జీవించే జీవన విధానాన్ని గురించి సర్వలక్ష్మి వివరిస్తూ ”ఆడవాళ్ళు ఎందుకు మోసపోతారో చెప్పనా? ఆడవాళ్లు, అన్నింటికీ మగవాళ్ల మీద ఆధారపడిపోతారు. అన్నింటికీ అంటే డబ్బు సరే, సాంఘిక భద్రత నుంచి, ఉద్వేగాల ఉపశమనందాకా! ఒక మనిషి మీద ఆధారపడకుండా సంఘ నిర్మాణం నడవదు. నిజమే. నువ్వు అతని మీద ఎంతగా ఆధారపడుతున్నావో, అదే స్థాయిలో అతను కూడా నీ మీద ఆధారపడేలా నువ్వు తయారు కాగలవా? దాన్ని అతను కూడా గ్రహించుకునే లాగా చెయ్యగలవా?” అంటూ వినీలలాను ఆలోచింప చేసింది.

ఈ విధంగా సాగిన వారిరువురి సంభాషణ వినీలలాకు సంతృప్తిని కలిగిస్తుంది. ఆమె ప్రశ్నలన్నిటికి సమాధానం దొరికినందుకు సంతోషిస్తుంది. ఈ కథలో సర్వలక్ష్మి తమ అస్తిత్వాన్ని కాపాడుకుని, ఒక మానవిగా జీవించడం గమనించదగ్గ విషయం.

తృషిత:

స్త్రీలు ఏవిధంగా పురుషుల ప్రేమకోసం పరితపించి, తమ అస్తిత్వాన్ని కోల్పోతారో ఈ కథలో వివరించడం జరిగింది.

ఇతివృత్తం:

ఈ కథలో ప్రధాన పాత్రలు తృషిత, వివేక్‌. తృషిత డిగ్రీ చదువుతున్న సమయంలో ఆమె సహ విద్యార్థి అయిన వివేక్‌ ఆమెను ప్రేమిస్తాడు. ఆమె ప్రేమను పొందడం కోసం ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తాడు. ప్రయత్నాలతో పాటు త్యాగాలు కూడా చేస్తాడు. చివరికి తృషిత హృదయంలో చోటు సంపాదిస్తాడు. పెద్దలను ఒప్పించి పెళ్ళిచేసుకుంటారు. పెళ్లయిన రెండు సంవత్సరాల వరకు ఎంతో అన్యోన్యంగా జీవిస్తారు. వారికి ఒక పాప పుడుతుంది. కాలక్రమంలో ఆమె భర్తకి ఆమె మీద ప్రేమ తగ్గిపోతుంది. ఒకప్పుడు తృషిత స్వతంత్ర వ్యక్తిత్వంకు ఆకర్షితుడైన వివేక్‌ పెళ్ళై, ఆమెపై ప్రేమ తగ్గిపోయిన తర్వాత అదే వ్యక్తిత్వం అతనికి వారి మధ్య ఉన్న ప్రేమను ఆశిస్తుంది కాని అది ఆమెకు అందని ద్రాక్షగా మిగిలిపోతుంది. అలాంటి సందర్భంలో తృషిత పిన్ని ఆమెకు ”నీ వ్యక్తిత్వం నువ్వు కాపాడుకో” అని హితోపదేశం చేయడంతో కథ ముగుస్తుంది.

కథా విశ్లేషణ:

ఇది భారతీయ స్త్రీ యొక్క అంతరంగాన్ని చిత్రించిన కథ. భారతదేశంలో దాదాపు ప్రతీ స్త్రీ వివాహానంతర జీవితం ఇదే విధంగా ఉంది అనడం అతిశయోక్తి కాదు. కుటుంబ జీవితంలో స్త్రీల కెదురయ్యే వాస్తవ పరిస్థితులకు ఈ కథ అద్దం పడుతోంది.

పెళ్ళికి ముందు ప్రతీ పురుషుడు స్త్రీని ఆరాధ్యదేవతగా చూస్తాడు. పెళ్లి తర్వాత అతనికి వ్యామోహం తగ్గి ఆమె చేసే ప్రతీ పని తప్పుగానే కనిపిస్తుంది. ఇదే విషయం తృషిత జీవితంలో కూడా జరుగుతుంది. తృషితకు పెళ్లయిన కొత్తలో ఆమెను చాలా అపురూపంగా చూసుకునేవాడు. నిద్రలేచేసరికి ఫిల్టర్‌ కాఫీ కోసం అన్నీ సిద్ధంచేసి ఉంచేవాడు. అన్నం తినిపించేవాడు. తృషిత తనకు ఎక్కడ దూరమై పోతుందో అనే భయంతో ఆమె చేతివేళ్ళ మధ్య తన వేళ్ళు ఇరికించి గట్టిగా పట్టుకునేవాడు. అలాంటి తన భర్తలో అనూహ్యమైన మార్పులు రావడం తృషిత తట్టుకోలేక పోతుంది.

తృషిత తన మనసులోని బాధనంతా పిన్నికి చెప్పుకుని భోరున విలపిస్తుంది. తృషిత పిన్ని, పెళ్ళికి ముందే తృషితకు అనేక విషయాలు చెప్తుంది. కాని ఆ సమయంలో అవేవి ఆమె మనసుకు పట్టలేదు. అందుకే ఆమె ఇలాంటి క్లిష్టపరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది.

తృషిత స్వగతంలో ‘అతని అనురాగమంతా ఆరిపోయింది. నేను ప్రాధేయపడి, లొంగివుండి, అతను అప్పుడప్పుడు కనపరిచే ఆ మెరుపులాంటి ప్రేమకోసం ఎదురుచూస్తూ నా సర్వస్వం వదులుకుంటే అతనికి ఎంతో బావుండి వుండును. కాని ఆ పని చెయ్యలేకపోయాను. ప్రేమతో పాటే అందవలసిన గౌరవం అనేది ఒకటుంది. అది కూడా కావాలి నాకు. అది దొరకదని తెలిసిపోయింది. అదిలేని వివేక్‌ ప్రేమ నాకు వద్దు. తోకాడించే కుక్కలా అతని చేతిలో బిస్కెట్‌ కోసం తిరగలేను. దాన్ని వివేక్‌ పొగరు అన్నాడు. ఔనా? పిన్ని మాత్రం పొగరుకాదంది. ‘ఆత్మాభిమానం’ అని, ఆడవాళ్లు మరచిపోయిన మాటను గుర్తుచేస్తుంది’ అని అనుకుంటుంది.

తృషిత పిన్ని, ఆమె కళ్లు తుడిచి ”మనం కోరుకున్న ప్రేమలు మనకు దొరకవు. ఈ మగవాళ్లు ఇవ్వలేరు ఎంతకీ వాళ్ల అహాలు తృప్తిపరుస్తూ ఉంటే తప్ప మనల్ని పట్టించుకోరు. నువ్వు అతని కాళ్లముందు జీవితమంతా పడి ఉన్నా జాలిపడగలడేమో గాని ఆ పూర్వపు ప్రేమ ఇవ్వలేడు. అతని హృదయంలోంచి ఆ ఆకర్షణ, ఆరాటం, పోయాయి. కనీసం నీ వ్యక్తిత్వం నువ్వు కాపాడుకుంటేనైనా ఎప్పుడైనా తిరిగి అతనికి ఆ పూర్వపు మోహం కలగొచ్చు. ఇతను కాకపోతే మరో కొత్త వ్యక్తి నీ జీవితంలోకి ఇలాగే ప్రవేశించినా కథ ఇలాగే నడుస్తుంది. ఆడవాళ్లందరమూ మనల్ని నిలువెల్లా ముంచేసే ప్రేమల కోసం ఎంతగానో ఎదురుచూస్తాం. కొందరికి కొంత కాలమయినా దొరుకుతాయి. కొందరికి దొరకనే దొరకవు. అయినా జీవితమంతా ఈ దాహం వదలదు…” అంటూ స్త్రీ జీవితానికి సంబంధించిన అనేక సత్యాలు వెల్లడిచేస్తుంది.

ఆ మాటలు విన్న తృషిత, తన తప్పు తాను తెలుసుకుంటుంది. ఈ కథలో స్త్రీలు ఏవిధంగా తమ అస్తిత్వాన్ని కోల్పోతున్నారో వివరించడం జరిగింది. ఇక ముందు జీవితంలోనైనా తన అస్తిత్వాన్ని కాపాడుకుని జీవించాలని నిర్ణయించుకుంటుంది.

ఇలా… ఉన్నాం:

ఈ కథలో ఆధునిక కాలంలో వెలసిన కార్పొరేట్‌ సంస్కృతిలో స్త్రీలు తమ ఉనికి కోసం ఏవిధంగా పోరాడుతున్నారో వివరించబడింది. నేటి సమాజంలో స్త్రీల పరిస్థితులను వివరించడానికి ప్రధానంగా నాలుగు కుటుంబాలలోని స్త్రీల జీవితాలను తీసుకున్నారు. మొదటిది లలిత, శ్రీధర్‌ కుటుంబం. వీరిది ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులులేని కుటుంబం. పిల్లలు చదువు నిమిత్తం పొరుగూళ్ళకు వెళ్లిపోవడం వల్ల లలితకు ఏమీ తోచక ఒక కాన్వెంట్లో టీచరుగా చేరుతుంది. ఉదయం తొమ్మిది గంటలనుండి సాయంత్రం నాలుగుదాకా పనిచేస్తుంది. జీతం పన్నెండు వందలు.

రెండవది విజయ, మోహనరావు కుటుంబం. విజయ జెడ్పీ హైస్కూల్‌ టీచరు. సిటీకి పొరుగునున్న పల్లెలో స్కూలు కావడం వల్ల రోజూ సిటీ బస్సులో వెళ్లి వస్తుంటుంది.

మూడవది శారద కుటుంబం. ఆమె బి.ఎస్సీ, బి.ఇడి. చేసి ప్రైవేట్‌ స్కూల్లో లెక్కల టీచరుగా పనిచేస్తుంటుంది. నెలకి మూడువేలు జీతం. భర్తది చాలా తక్కువ సంపాదన. పిల్లలు ఇంకా చదువుకుంటూ ఉండడంవల్ల, తన సంపాదన కుటుంబానికి వేణ్ణీళ్లకు చన్నీళ్లలా

ఉంటాయనే ఉద్దేశంతో ఉద్యోగం చేస్తుంటుంది.

నాలుగవది నూకాలమ్మ కుటుంబం. ఈమెకు ఒక కొడుకు, ఒక కూతురు భర్త త్రాగుబోతు. నూకాలమ్మ నాలుగైదు ఇళ్లలో పనిచేసి కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటుంది.

ఈ నాలుగు కుటుంబాల్లో ఉన్న స్త్రీలంతా తమ అస్తిత్వంకోసం తాము పనిచేసే స్థలాల్లో ఏవిధంగా అస్తిత్వ పోరాటాన్ని ఎదుర్కొంటున్నారు? కార్పొరేట్‌ సంస్థలు వారి జీవితాన్ని ఎలా శాసిస్తున్నాయి? అలాంటి పరిస్థితుల మధ్యలో స్త్రీలు ఏమి కోరుకుంటున్నారు… మొదలైన అంశాలను ఈ కథలో చర్చించడం జరిగింది.

ఒకరోజు పక్కింటి విజయ కొడుకు, లలిత దగ్గరకు వచ్చి ”ఆంటీ! అమ్మ కళ్లు తిరిగి పడిపోయింది. ఒకసారి రండి” అని అర్థిస్తాడు. వెంటనే లలిత ఒక్క పరుగున వెళ్తుంది. లలిత వెళ్లేసరికి… హాల్లో టీపాయ్‌ పక్కన పడిపోయి ఉంటుంది విజయ. విజయ భర్త మోహనరావు, లలిత కలిసి ఆమెను లేవదీసి సోఫాలో పడుకోబెట్టి డాక్టరుకి ఫోన్‌ చేస్తారు. డాక్టరు ఫస్ట్‌ ఎయిడ్‌ ఎలా చేయాలో చెప్పి, హాస్పిటల్‌కు తీసుకురమ్మని చెబుతాడు.

స్కూల్లో ఉండే పని ఒత్తిడి, అక్కడ సౌకర్యాల లేమి, మానసిక ప్రశాంతత లేకుండా నిత్యం ఉరుకుల పరుగుల జీవితం వల్ల విజయకు ఈ విధమైన పరిస్థితి ఏర్పడుతుంది. వీటికంటే ముఖ్యంగా ఆ రోజు స్కూల్లో జరిగిన సంఘటన విజయను కుంగదీస్తుంది. ఎప్పటిలాగే ఆ రోజు కూడా విజయ స్కూలు కెళ్లేసరికి ఆ ఊరి సర్పంచ్‌ స్కూల్‌ ఇన్స్పెక్షన్‌కి వస్తాడు. విజయ క్లాసురూముకి వెళ్లి టేబుల్‌ మీద ఉన్న కాంపోజిషన్‌ పుస్తకాలు చూసి, వాటి గురించి ఆరాతీసి క్లాస్‌ విద్యార్థుల సంఖ్య 62 అని కనుక్కుని కాంపోజిషన్‌ పుస్తకాలు 57 ఉండటంతో కారణం అడుగుతాడు. ఆ అయిదుగురు పిల్లలు స్కూల్‌కి ఎప్పుడూ రారని, స్కూలు హెడ్‌ మాస్టారు, తను ఆ పిల్లల తల్లిదండ్రులను కలిసి మాట్లాడినప్పటికి ప్రయోజనం లేదని వివరణ ఇస్తుంది. ఆ వివరణ అతనికి నచ్చక, ‘నీ మీద డిఇఓ కి కంప్లేంటు రాస్తాను. మీకు గవర్నమెంటు ఇన్నేసి వేలు జీతాలిస్తుంటే మీరు కుర్రాళ్లకు సదువులు ఇలాగేనా చెప్పేది’ అని పిల్లల ముందు అవమానకరంగా మాట్లాడతాడు. ఇదే రాద్ధాంతం హెడ్‌ మిస్ట్రెస్‌ రూంలో కూడా జరుగుతుంది.

నిజానికి అతను సర్పంచ్‌ కాదు. సర్పంచి భర్త. ఆమె ఎప్పుడు ఎక్కడికి వెళ్లదు కాని, అవసరమైన చోట సంతకాలు మాత్రం చేస్తుంది. మిగిలిన విషయాలన్నీ ఆమె భర్త చూసుకుంటాడు. అందులో భాగంగానే స్కూలుకి వచ్చి ఇంత రాద్ధాంతం చేస్తాడు.

ఈ సంఘటన విజయను మానసికంగా కుంగదీస్తుంది. ఆరోజు ఎలాగో స్కూలు నుంచి ఇంటికి రాగానే కళ్లు తిరిగి పడిపోతుంది. ఇదే ఆమె కళ్లు తిరిగి పడిపోవడానికి అసలైన కారణం.

ఈ సందర్భాన్ని నిశితంగా పరిశీలిస్తే అనేక విషయాలు అవగతమవుతాయి. నిజానికి జరిగిన సంఘటనలో విజయది ఎలాంటి తప్పులేదు. బడిమానేసి పొలం పనులకి వెళ్లిపోతున్న పిల్లల తల్లిదండ్రుల వద్దకు వెళ్లి, వాళ్ల గురించి మాట్లాడినప్పటికీ ఏ విధమైన మార్పూ ఉండదు. విజయ తాను చెయ్యగలిగిన ప్రయత్నాలన్నీ చేశాక కూడా ఆ పిల్లలు బడికి రాకపోవడానికి విజయను నిందించడం చాలా అసమంజసంగా అనిపిస్తుంది. చెయ్యని తప్పుకి ఆ సర్పంచ్‌ భర్త, విజయను నిందించాడు.

ఈ సంఘటన ఒక విజయ విషయంలోనే కాక, ఆ స్కూలు హెడ్‌ మిస్ట్రెస్‌ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఈ సందర్భం ఆ ఇద్దరి స్త్రీల జీవితాల్లోనే కాక, ఎక్కడైతే స్త్రీలు పురుషాధిపత్యాన్ని భరించవలసి వస్తుందో అలాంటి చోట్ల స్త్రీలు ఇలాంటి అవమానాలనే ఎదుర్కొంటున్నారు. నేటి కాలంలో భార్యాభర్తలిద్దరు ఉద్యోగం చేస్తే తప్ప కుటుంబాన్ని పోషించలేనటువంటి పరిస్థితి. కుటుంబాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలనుకునే క్రమంలో స్త్రీలు ఉద్యోగాలు చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సందర్భాలలో స్త్రీలు ఉద్యోగాలు చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సందర్భాలలో స్త్రీలు తమ అస్తిత్వం కోసం పోరాడవలసిన పరిస్థితి ఎదురౌతుంది. విజయ విషయంలో కూడా ఇదే జరిగింది. ఆమె ఎదుర్కొన్న సంఘటన ఆమెను మానసికంగా బలహీనపరుస్తుంది. తద్వారా అనారోగ్యానికి గురౌతుంది.

విజయను ఆసుపత్రిలో జాయిన్‌ చేసి, అన్ని పరీక్షలు చేయించే క్రమంలో లలిత కూడా అలసిపోతుంది. భర్త కూడా ఈ ‘రోజుకి స్కూలు మానెయ్యి’ అని చెప్తాడు. లలిత లీవ్‌ గురించి చెప్పడానికి స్కూల్‌కి ఫోను చేస్తుంది. ఆ ప్రిన్సిపాల్‌ సెలవు మంజూరు చెయ్యడానికి ఇష్టపడడు. అంతేకాక ‘ఏదోలా వీలుచేసుకొని వచ్చెయ్యండి. మీరు ఉద్యోగం చెయ్యకపోతే మానెయ్యండి. అంతేగాని మాటిమాటికి సెలవు పెడితే ఎలా?’ అంటూ ఆమెతో దురుసుగా మాట్లాడతాడు.

ఇలాంటి సందర్భం ప్రతి ఉద్యోగిని ఎదుర్కొంటుంది. అధికారంలో ఉన్న ప్రతివ్యక్తి సులువుగా చెప్పేమాట ‘ఉద్యోగం మానెయ్యండి’ అని. స్త్రీలు ఎన్నో కష్టనష్టాలకోర్చుకొని ఉద్యోగాలు చేస్తున్నారు. ఏదో అత్యవసరమై సెలవు కావాలని అడిగితే ఇక పెద్ద రాద్ధాంతమే జరుగుతుంది. ఇలాంటి వ్యవస్థ మారాలి అని రచయిత్రి ఉద్భోధిస్తున్నారు.

ఇక శారద విషయానికొస్తే… శారద పనిచేసే స్కూల్లో ఆమె ఒక్కరే లెక్కల టీచరు. అన్ని క్లాసుల వాళ్లకి ఆమే లెక్కలు చెప్పాలి. అయితే శారదకు ఇది సమస్య కాదుగాని రోజు సాయంత్రంపూట పదవ తరగతి పిల్లలకు స్పెషల్‌ క్లాసులు చెప్పమని ఆ స్కూలు సెక్రటరీ ఒత్తిడి తెస్తాడు. అంతేకాక ‘మీకు కుదరకపోతే చెప్పండి. మరో టీచర్‌ను స్పెషల్‌ క్లాసులకు వేసుకుంటాం. మీకు మాత్రం ఓ అయిదు వందలు తగ్గించాల్సి వస్తుంది…’ అంటూ చెప్తాడు. శారద ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. అందుకే ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగం చేస్తుంది. తనకు వచ్చే ఆ మూడు వేలలో అయిదు వందలు తగ్గిస్తే ఇక తన పరిస్థితినంతా నిర్మలకి చెప్పుకోవడానికి వాళ్ల ఇంటికి

వెళ్తుంది. నిర్మల టీచర్‌ పెద్దవారు గనుక ఆమె చేత చెప్పించాలని శారద అనుకుంటుంది. నిర్మల కూడా సహాయం చెయ్యడానికి ఇష్టపడుతుంది. ఇద్దరు కలిసి ప్రిన్సిపాల్‌ రూంకి వెళ్తారు. స్కూల్‌ సెక్రటరీకి నచ్చచెప్పడానికి నిర్మల ప్రయత్నించసాగింది. అది విన్న సెక్రటరీ నిర్మలతో ‘ఓ గంట ఆవిడను క్లాస్‌ చెప్పమనేకదండి మేం అడుగుతున్నది’ అంటారు. వారి మధ్య తర్జనబర్జన జరిగిన తరువాత మధ్యాహ్నం ఖాళీ టైంలో క్లాస్‌ చెప్పడానికి జీతంలో కోత లేకుండా ఒప్పందం కుదురుతుంది. ఆ విధంగా శారదకు కొంత స్వాంతన లభిస్తుంది.

ఈ కథలో చివరి కుటుంబం నూకాలమ్మ కుటుంబం. పైన వివరించిన మూడు కుటుంబాలకు, నూకాలమ్మ కుటుంబానికి చాల తేడావుంది. పై ముగ్గురికి తమ ఉద్యోగాలు ఎప్పుడు పోతాయో అనే అభద్రతా భావంతో నిత్యం కుంగిపోతుంటారు. కాని నూకాలమ్మకు అలాంటి భయమేమీ వుండదు. ఒక విధంగా చెప్పాలంటే నూకాలమ్మకి వున్నంత స్వేచ్ఛ పై ముగ్గురికి లేదనే చెప్పాలి. నూకాలమ్మ తన కూతుర్లు రామలక్ష్మిని ఎంతో గారాబంగా పెంచి, తన స్తోమతకు మించిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తుంది. రామలక్ష్మి జీవితం సుఖంగా సాగిపోతుంది.

ఒక సంవత్సరం పంట వెయ్యొద్దని ప్రభుత్వం ఆదేశిస్తుంది. ఇక చేసేదిలేక రామలక్ష్మి పుట్టింటికి వచ్చి, తన తల్లిలాగానే నాలుగైదు ఇళ్లలో పనిచెయ్యడానికి సిద్ధపడుతుంది. తన భర్త కూడా వ్యవసాయ పనులకు వెళ్లడం మొదలుపెడతాడు.

ఈ కథలో రచయిత నూకాలమ్మ పాత్ర ద్వారా ‘వృత్తి గౌరవం’ (డిగ్నిటి ఆఫ్‌ లేబర్‌) గురించి తెలియచేశారు.

ఈ కథలో వివిధ ఆర్థిక నేపథ్యాలు కలిగిన నాలుగు కుటుంబాల ద్వారా నేటి స్త్రీల స్థితిగతులను, వాళ్లు తమ అస్తిత్వం కోసం పడే పాట్లను రచయిత్రి చక్కగా తెలియచేశారు.

పేరెంట్‌:

ఈ కథలో ఒక గిరిజన స్త్రీ యొక్క కుల అస్తిత్వం గురించి వివరించబడింది.

ఇందులో ప్రధానపాత్ర బాలమ్మ. ఈమె ఒక గిరిజన స్త్రీకి, ఒక ఉన్నత కులస్తుడికి పుట్టిన అమ్మాయి. బాలమ్మ తల్లి, భూషయ్య అనే ఆసామి ఇంట్లో పనిమనిషిగా ఉండేది. ఆ సమయంలో భూషయ్య ఆమెను రేప్‌ చేస్తాడు. దానికి ఫలితంగా బాలమ్మ జన్మిస్తుంది. బాలమ్మకు అన్నీ తండ్రి రూపురేఖలు, గుణగణాలు వస్తాయి. చూసిన వారందరూ ఆమె ఎవరి కూతురో చాలా సూనాయాసంగా గుర్తుపట్టి ఏడిపించేవారు. బాలమ్మ పెరిగి పెద్దయ్యాక, ఆమెకు తన పుట్టుక సంగతి తెలుస్తుంది. తల్లి ఒక గిరిజన స్త్రీ గనుక తల్లి కులంతోనే ఆమె సమాజంలో గుర్తించబడుతుంది. ఆమెకున్న కుల రిజర్వేషన్‌ ద్వారా తన సొంత ఊరికే వి.ఏ.ఓ. (విలేజ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌) గా ఉద్యోగంలో నియమింపబడుతుంది. తనకున్న అధికారంతో భూషయ్య చేసిన అక్రమాలన్నీ బయటపెట్టి, అతనికి చెందిన ఆస్తులన్నీ ఎవరికి చెందాలో వారికి చెందే విధంగా కృషిచేస్తుంది. తను అనుకున్న పనులన్నీ నెరవేర్చి, తనలా తండ్రిలేని పిల్లలకు తండ్రిలా నిలవాలనే ఉద్దేశంతో గిరిజన పాఠశాలలో టీచర్‌గా చేరడంతో కథ ముగుస్తుంది.

కథా విశ్లేషణ:

ఈ కథలో గిరిజనులను ఉన్నత కులస్తులు ఏవిధంగా మోసగిస్తున్నారో స్పష్టంగా వివరించబడింది. అంతేకాక చదువుకున్న గిరిజనులు ఉన్నత వర్గాలవారు చేస్తున్న దోపిడీని గుర్తించి… ఏవిధంగా తమ ఉనికి కోసం పోరాడుతున్నారో ఈ కథలో చెప్పబడింది.

భూషయ్య ఉన్నత కులస్తుడు. అంతేకాక ఏభై అయిదు ఎకరాల ఆసామి. అతని ఆస్తులన్నీ అమాయకులైన గిరిజనులను మోసం చేసి సంపాదించినవే. అతని ఆగడాలను ప్రశ్నించే ధైర్యం ఎవరికీలేక అందరు మౌనంగా అతని అన్యాయాలను భరిస్తారు.

భూషయ్య దుర్మార్గపు చర్యల్లో భాగమే ‘బాలమ్మ’ పుట్టుక. బాలమ్మ రూపురేఖలు చూసినప్పుడు తల్లి హృదయం ద్రవించుకుపో యేది. సమాజం, బాలమ్మ పుట్టుకను ఛీత్కరించేది. కాని భూషయ్య మాత్రం చాలా ధైర్యంగా జీవించేవాడు. ఒక సందర్భంలో బాలమ్మ ధైర్యం చేసి, అతణ్ణి ‘నాన్నా’ అని పిలుస్తుంది. వెంటనే అతను ఆమె చెంపమీద కొడతాడు. అంతేకాక, ఇంకొక సారి అలా పిలిస్తే నీ అంతుచూస్తాను అని బెదిరించి వెళ్లిపోతాడు.

ఈ సందర్భం గమనిస్తే ఒక పసిహృదయం తండ్రి ప్రేమ కోసం ఏవిధంగా పరితపిస్తోందో అర్థమవుతుంది. ”నాన్న” అని పిలవాలని ఆమెలో ఉన్న ఆరాటం ఆమె చేత భూషయ్యను ”నాన్న” అని పిలిపిస్తుంది. తీరా ఆ పిలుపు తరువాత ఎదురైన పరిణామం ఆమెకు చేదైన అనుభవాన్ని మిగుల్చుతుంది. ఇక ఎప్పుడు అంతటి సాహసానికి పూనుకోదు. ఇవన్నీ బాలమ్మ తన అస్తిత్వాన్ని ప్రశ్నించుకునే విధంగా చేశాయి.

బాలమ్మ బాగా చదువుకొని వి.ఏ.ఓ. గా చేరిన తరువాత భూషయ్య ఇంటికి వెళ్తుంది. ఆమె అతనివన్నీ అక్రమ ఆస్తులని, అతనిపై కేసుపెట్టిందనే ఆక్రోశంతో భూషయ్య ఆమెతో ఇలా మాట్లాడుతాడు. ‘ఏమే! నీకెంత పొగరు! నామీదే పిటిషన్లు పెట్టిస్తావా! నీ అంతు తేలుస్తాను చూడు… నువ్వు నాన్‌-ట్రైబల్‌ కూతురివి అని చెప్పి నీ ఉద్యోగం పీకించేస్తాను’ అంటాడు. దీనికి సమాధానంగా బాలమ్మ ‘భూషయ్య! నేను నీ కూతుర్నే. ఆ సంగతి నువ్వు ఈ నాలుగు గోడల మధ్యే చెప్పగలవు. అది కూడా కక్షతో, కాని నాకు తండ్రి లేడు. తల్లి ఉంది. తల్లి ఒక్కతే తండ్రిని నిర్థారించేదని ప్రపంచానికీ, న్యాయస్థానానికీ అందరికీ తెలుసు. ఆమె నీ పేరు చెప్పదు, నీలాగా పరువు భయంతో కాదు. నా భవిష్యత్తు మీద ప్రేమతో’ అని సమాధానం చెప్పి, అక్కడ నుండి వెళ్లిపోతుంది. ఆ మాటలు మాట్లాడిన తరువాత ఆమెలో మరింత ధైర్యం, ఉత్సాహం, ఆనందం కలుగుతుంది. అప్పుడు తనలో తాను బాలమ్మ బేల కాదు, ధీర అని అనుకుంటుంది. తన తల్లిని మనిషిని చెయ్యగలనన్న నమ్మకంతో ముందడుగు వేస్తుంది.

ఈ మాటల్లో బాలమ్మ చైతన్యం, ఆమె కులానికి సంబంధించిన అస్తిత్వ ప్రశ్నల పరంపర నుండి తన అంతరంగంలో అంతవరకూ దాగిఉన్న బడబాగ్ని బద్దలై ఒక ప్రశాంతమైన మానసిక వాతావరణం ఆమెలో కలిగినట్టు తెలుస్తోంది.

బాలమ్మ చిన్నతనంలో తన కులం వల్ల చిన్నబుచ్చుకున్నప్పటికీ, అనేక అవమానాలు నిందలు భరించినప్పటికీ ఇప్పుడు అదే కులం ఆమెను అంత ఉన్నత స్థితిలో ఉంచడం ఆమెకు ఆనందాన్ని కలిగిస్తుంది.

వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారు ముందుమాట (మానవీయ ప్రపంచం కోసం) రాస్తూ స్త్రీవాదం తాత్విక పునాది కలిగినదని వివరిస్తూ.. ఇంతవరకు వచ్చిన స్త్రీవాదం బయట వాతావరణాన్ని మాత్రమే ప్రభావితం చెయ్యగలిగింది గాని అంతరంగాలను శభ్రపరిచేదాకా రాలేదు… అంటూ ముగిస్తూ స్త్రీవాద సాహిత్యానికి దిశానిర్దేశం చేశారు.

 

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో