కేన్యా టు కేన్యా – ఆర్‌. శాంతసుందరి

ఆరి సీతారామయ్య అమెరికాలో స్థిరపడ్డ తెలుగు డయాస్పోరా కథా రచయిత. రాశిలో కాకపోయినా వాసిలో పేరొందిన రచయిత. అమెరికా తెలుగు కథ మొదటి సంకలనంలో ”సావాసం- సహవాసం” వచ్చింది. ఈ స్త్రీవాద కథ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. కథలోని స్త్రీ పాత్ర తన జీవితం గురించి స్వయంగా నిర్ణయించుకునే ఆధునిక యువతి. ఆ కథలో కథకుడు పెళ్ళైన చిన్నప్పటి స్నేహితురాలిని చూడబోతే ఆమె భర్తతో కాకుండా మరొకరితో ఉంటూ ఉంటుంది, ”మేం సావాసగాళ్ళం, సహవాసులం గాదు.. సావాసంతో పని లేని సహవాసం సులభం, సావాసమే కష్టం” అంటుంది. ఈ కథని ‘హంజోలీ’ అనే పేరుతో హిందీలోకి అనువదించాను. మంచి స్పందన వచ్చింది.

వాసిరెడ్డి నవీన్‌ కథా సంకలనంలో చోటుచేసుకున్న కథ ” గట్టు తెగిన చెరువు”. అదే పేరుతో వీరి మొట్టమొదటి కథా సంకలనం 2005 లో వెలువడింది. ఈ కథలన్నిటికీ అంతస్సూత్రం: విచ్ఛిన్నమైన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ స్థానంలో మిగిలిన భార్యా భర్తల సంబంధాలలో – భర్త యజమానిగా మారి, భార్యను పీడించడం, స్వేచ్చని హరించడం. ఈ కథలన్నిటికీ నేపథ్యం ప్రవాస భారతీయ జీవన విధానమే, అందులోని సంక్లిష్టతని అర్థం చేసుకుని, అక్కడి వారు మాత్రమే రాయగల కథా వస్తువులని తీసుకుని రాయడంలో వీరు అద్వితీయులు. ఆలోచింపచేసే కథలు, మన హృదయాల్లో చోటు చేసుకునే పాత్రలు సృష్టించిన వారిలో చెప్పుకోదగ్గవారు ఆరి సీతారామయ్య.

పదేళ్ళ తర్వాత వస్తూన్న వారి ఈ రెండవ కథా సంకలనంలో ఆణిముత్యాలెన్నో ఉన్నాయి. అమెరికాకి పై చుదువుల కోసం వెళ్ళే పిల్లల సమస్యలు మనందరికీ తెలీవు. అమెరికా వెళ్ళడమే ధ్యేయంగా కొందరు పోటీ పడి మరీ చదువుతున్న ఈ కాలంలో సీతరామయ్య రాసిన కథ ”పై చదువు”, చదువు గురించి గురుజాడ, కొ.కు., చాసో లాంటి వాళ్ళు ఎందరో రాశారు. అప్పలనాయుడు, గౌరునాయుడు కథల్లో పిల్లల్ని ప్రేమించి, పిచ్చి వాళ్ళయిన ఉపాధ్యాయులున్నారు. పిల్లలకి పాఠాలు చెప్పటానికి టైము లేక వేరే పనులు చేస్తున్న టీచర్లు, విద్యార్థుల మూగ వేదన నిండిన కథలున్నాయి. కొ.కు.’చదువు’లో సీత ‘చదువని వాడజ్ఞుండగు’ అన్న హిరణ్యకశ్యుపుని పద్యం గుర్తుకు తెచ్చుకుంటుంది. ఆ రాక్షసుడి దృష్టిలో చదువంటే చండామార్కుల చదువే. తన విధానం అమలు జరిపే చదువే! సీతారామయ్య గారి కథలోని రాధ సమస్యా చదువే, అయితే కాలమాన పరిస్థితులు మారాయి. ఆమె అమెరికాలోని చట్రంలో ఇమడలేదు, ఆమెదో విశాదకరమైన పరిస్థితి. మంచి గ్రేడ్‌ తెచ్చుకోలేదు, కారణం ఇండియాలో అమెరికాలో అడిగే ప్రశ్నలు ఎవ్వరూ ఆమెని అడగలేదు, బట్టీపట్టి పరీక్షలు రాసింది, సొంతంగా ఆలోచించలేదు, ల్యాబ్‌లో పని, చలిలో అర్థరాత్రి రూంకి నడిచొచ్చాక వంట పని, చదువుకోటానికీ, లైబ్రరీకి టైమెక్కడ? రూంలో పనిచేసుకోటానికి ల్యాప్‌టాప్‌ కావాలి, కొనడానికి డబ్బేదీ? చా.సో. కథలోని పిల్లాడికి పెన్నులేనట్టే! మరి గ్రేడ్లు రాకపోతే, ఉద్యోగం పోతుంది. ‘వెనక్కి వెళ్ళిపోతే ఎంత నామర్దా! ఆలోచిస్తుంటేనే భయం వేస్తుంది’ అని రాధ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంది. ఆమె అమెరికన్‌ ప్రొఫెసర్‌ సహృదయుడే, కాని అక్కడి విద్యా వ్యవస్థలో ఆయన అసహాయుడు. చదువు గురించీ, మనుషుల్నీ తయారు చేసే చదువు గురించీ ఎంత చెప్పినా తక్కువే! సమీర్‌ పాత్ర ద్వారా మంచి ముగింపు ఇస్తారు సీతారామయ్య. మల్లిపురం జగదీష్‌ ‘అక్షరాల దారిలో..’ కథలో గిరిజన బాలుడు రాధ స్థితిలోనే ఉంటాడు, మాస్టర్లు ఏవో పనులు చెపుతూనే ఉంటారు, చదువుకుంటేనే కదా పాఠాలు అర్థమయేది? ఇంట్లో వుడికీ వుడకని అన్నం, అందులో రాళ్ళూ పురుగులూ! వాడికిష్టమైన పాటలు పాడుకోనివ్వరు. వెక్కి వెక్కి ఏడుస్తున్న వాణ్ణి చెట్టునున్న కాయని కొట్టివ్వమంటే మాస్టారు అడిగితే, ఒక దెబ్బకి పడగొట్టి ఇస్తాడు. ‘చూశావా… ఆ కాయ ఎన్ని కొమ్మల మధ్య ఉందో? నువ్వు నిల్చున్న దగ్గర ఎన్ని ముళ్ళున్నాయి.

బండరాళ్ళున్నాయి.. అవన్నీ నీకు అడ్డమయ్యాయా?.. చదువు కూడా అంతేన్రా..’ అని ధైర్యం చెపుతాడు మాస్టారు.

చదువు సమస్య మీద పాత తరం రచయితల కథలతో పాటు, ఎక్కడో గిరిజన తండాలో బాలుడి గురించి నేటి యువతరం రచయిత రాసిన కథతో సీతారామయ్య గారు రాసిన ‘పైచదువు’ ని పోలుస్తూ వాటిలోని పోలికలను ప్రస్తావించటంలోని నా ఉద్దేశం ఆ కథలన్నిటీలోనూ ఉన్న విశ్వజనీనతే! ఈ కథలు పేరుకు డయస్పోరా కథలే అయినా అవి స్టోరీస్‌ వితౌట్‌ బోర్డర్స్‌. కథలకి సాహిత్యం ప్రయోజనం ఉండాలంటారు.. వీరి కథల్లో మనకి కనిపించే జీవిత సత్యమే ఆ ప్రయోజనం..మనిషిని మనిషిగా గౌరవించే జీవితం… బానిస విధేయతను నిరసించే జీవితం! ఈ కథల్లో పట్టిచ్చేవి మరికొన్ని ఉన్నాయి:  ఆర్భాటాలూ అలంకారాలూ లేకుండా సూటిగా కథ చెప్పడం, కథనానికీ మనకీ మధ్య అడ్డుపడకుండా చెప్పే తీరు. ఇతర డయస్పోరా రచయితల కథల్లో కన్నా వీరి కథల్లో అమెరికాలోని భారతీయుల జీవితం, మనస్తత్వ విచారణ కనబడుతుంది. ఎక్కడో గాని – జీతగాళ్ళు లాంటి కథల్లో కథ – ఇండియా లో జరగదు. ‘కేన్యా టు కేన్యా’ వీరి రెండో కథా సంపుటి, అది కూడా పదేళ్ళ తరువాత వచ్చింది. మొదటిది ‘గట్టు తెగిన చెరువు’ 2005లో ప్రచురితమై పాఠకుల విశేషాదరణ పొందింది. ఈ కథలన్నీ పత్రికల్లోనూ అన్తర్జాలంలోనూ అందరూ చదివినవే అయినప్పటికీ అన్నిటినీ ఒక చోట చదవగలగడం ఒక గొప్ప అనుభవం.

ఈ సంపుటిలో మొత్తం 15 కథలున్నాయి.  వీటిలో రెండు అనువాద కథలు. ఆ రెండూ ఇండోనీషియన్‌ రచయిత రాసినవే. సీతారామయ్య వీటిని ఆంగ్లం నుంచి అనువదించారు. మొదటి కథ సుచిత్రాచంద్ర నిదివి ముప్ఫైమూడు పేజీలు. రెండే పాత్రలు. ఇద్దరితో అంత పెద్ద కథ నడిపించడం అంత సులభం కాదు. అయినా మనం ఎక్కడా ఆగకుండా ఏకబిగిని చదివేస్తాం. ప్రేమకథని ఇలా కూడా రాయచ్చని అర్థమవుతుంది. ఈ కథలో స్త్రీవాదం ఉంది. రచయిత ‘ఫెమినిజం’  గురించి కూడా ప్రస్తావిస్తాడు. కానీ ఆ స్త్రీవాదం ఎంత సహజంగా కథలో కలిసిపోయిందో చూస్తే రచయిత ప్రతిభ ఏమిటో తెలుస్తుంది. చంద్రం అదేపనిగా పెళ్ళి చేసుకుందామని పోరుతూ ఉంటే సుచిత్ర తనకి తల్లిదండ్రులని చూసుకునే బాధ్యత ఉందని అంటుంది. ఆ తరవాత వాళ్ళిద్దరిమధ్యా సాగిన సంభాషణలో ఒక మగవాడు ఎలా ఆలోచిస్తాడో, తన భర్తా, పిల్లలే కాకుండా వయసు పైబడుతున్న తల్లిదండ్రుల బాధ్యత గురించి కూడా పట్టించుకునే ఒక స్త్రీ ఎలా ఆలోచిస్తుందో చూపించాడు రచయిత. సుచిత్ర తెలివైనది, తన అభిప్రాయాలు నిర్భయంగా చెప్పగలది. పెళ్ళీ, పిల్లలే కాక స్త్రీకి వేరే జీవితం కూడా ఉంటుందని నమ్మే మనిషి. చంద్రని మనస్ఫూర్తిగా ప్రేమించినా అతనికోసం అన్నీ వదులుకునేందుకు మాత్రం ఇష్టపడదు. ఆమె పాత్రని రచయిత అద్భుతంగా మలిచాడు.

ఈ సంపుటిలో ”టెస్ట్‌” అనే ఇంకొక కథ ఉంది. బ్రెస్ట్‌ క్యాన్సర్‌కి గురైన యువతి కథ. ఒక మనిషికి ప్రాణాంతకమైన వ్యాధి వచ్చినప్పుడు తన కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పాలనీ, భయంలేదు నేనున్నానని తోడుగా నిలవాలనీ అనుకుంటాడు. ఈ కథలో సుజాతకి తన భర్త నుంచి అలాంటి తోడు దొరకదు. ఆమె ఆ వ్యాధితో ఒంటరిగానే పోరాడవలసి వస్తుంది. ఎక్కడా అతిశయోక్తులు లేకుండా ఒక సీరియస్‌ ఇతివృత్తాన్ని ఎలా కథగా మలచాలో ఈ కథ చదివి ఇప్పుడిప్పుడే రాస్తున్న యువ రచయితలు నేర్చుకోవచ్చు.

ఈ పుస్తకంలో మనసుని కలచివేసే కథలు రెండున్నాయి -‘పరివర్తన’, ‘కేన్యా టు కేన్యా’. ‘పరివర్తన’ కథలో కొత్తగా పెళ్ళైన అమ్మాయిని భర్తని హత్య చేసిందన్న నేరానికి జైల్లో పెడతారు. జైల్లో ప్రవర్తన బాగుంటే శిక్షాకాలం పూర్తి కాకముందే విడుదల చేస్తారు. కానీ ఈ అమ్మాయి సాలెగూడు లాంటి రకరకాల స్థానిక సంస్థల వ్యూహాలలో చిక్కుకుని, సరైన లాయర్‌ దొరకక కేసు ఓడిపోతుంది. అమెరికా న్యాయవ్యవస్థ ఎలాంటిదో పాఠకులకి అర్థంచేయించే కథ ఇది.

‘కేన్యా టు కేన్యా’ లో కేన్యాకి దక్షిణంగా సముద్ర తీరాన ఉన్న మొంబాసా అనే ఊళ్ళో పుట్టిన ఆయెషా పూర్వీకులు గుజరాతీలు. స్టీవెన్‌ ఉగాండాలో పుట్టిన ఆఫ్రికన్‌. ఇద్దరూ ప్రేమించి పెళ్ళి చేసుకుంటారు. కానీ స్టీవెన్‌కి రిటైర్‌ అయ్యే సమయంలో పార్కిన్సన్స్‌ వ్యాధి రావటం వల్ల వాళ్ళ జీవితం తలకిందులైపోతుంది. చికిత్సకి డబ్బు లేక స్టీవెన్‌ ఆఫ్రికాకి వెళ్ళిపోతాడు. ఆయెషా ఇద్దరు పెళ్ళైన పిల్లలతో అమెరికాలోనే ఉండిపోతుంది. పుస్తకానికి ఈ కథ పేరు పెట్టడం సముచితంగా ఉంది. అంతేకాక దీన్ని చివర్లో పెట్టడం కూడా రచయిత ఆలోచించే చేశారనిపిస్తుంది. మొదటికథ ఎంత ఆహ్లాదాన్ని (ఆలోచనని కూడా) కలిగిస్తుందో ఇది అంత విషాదాన్ని నింపుతుంది. ఇద్దరు కలిసి జీవితం ప్రారంభించడం మొదటి కథలోని ఇతివృత్తమైతే, చివరి కథలో ఇద్దరు కలిసి జీవితాన్ని పంచుకుని, పిల్లల్ని కని, పెద్దవయసులో విడిపోవలసి రావడం.

ఈ కథల్లో విలన్‌ చాలామటుకు పరిస్థితులే సగటు మనిషి జీవితంలోనూ అంతే కదా! అందుకే ఇవి అమెరికాలో జరిగినట్టు రాసినప్పటికీ మనకి కూడా ఆ పాత్రలూ, పరిస్థితులూ పరిచయమైనవన్నట్టే అనిపిస్తుంది.

అమెరికా జీవితాన్నీ, అక్కడి సమస్యలనీ రచయిత ఎంత బాగా పరిశీలించాడో తెలుసుకోవాలంటే ఈ రెండు కథలూ చదవాల్సిందే. ఈ సంపుటిలో కథలన్నిటి గురించీ ఇక్కడ వివరించడం కుదరదు కనుక కొన్నిటినే ప్రస్తావించాను. ‘పెద్దా- చిన్నా, లైఫ్‌ సైన్స్‌, లక్ష్మమ్మ, విదేశీ-దేశీ, ముగింపు, ప్రయాణం’ లాంటి మంచి కథలు కూడా ఈ సంపుటిలో ఉన్నాయి. అన్నట్టు రచయిత ‘కమల’ అనే ఆమెకి ఈ పుస్తకాన్ని అంకితం చేశారు. ఆ కమల గురించి ఆయన రాసిన ముందుమాట చాలా విలక్షణమైనది. రచయితగానే కాకుండా పాఠకుడిగా కూడా సీతారామయ్య ఎంత లోతుగా ఆలోచిస్తారో, ఎంత సున్నితమనస్కులో ఈ ముందుమాట తెలియజేస్తుంది.

సీతారామయ్య రచనా వైశిష్టి ఏమిటో చెప్పాలంటే ఎంత లోతైన విషయాలని కథగా మలిచినా, ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఉన్నా, రచయిత కథలోగాని, పాత్రల్లోగాని ప్రవేశించడు. అసలు ఆయనకనబడడు. పాత్రలూ, సంఘటనలూ ఒక సినిమా చూస్తున్నట్టు కళ్ళముందు నిలుస్తాయి. బాధ పడతాయి, సమస్యలతో పోరాడతాయి, ఆత్మగౌరవం ఉన్న స్త్రీ పాత్రలు వీరి కథలన్నింటిలోనూ కనిపించే ప్రత్యేకత.

సీతారామయ్యగారు బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా బిజీగా ఉన్నా తెలుగు భాషా సదస్సులు డెట్రోయిట్‌ స్టడీ సర్కిల్‌ ద్వారా నిర్వహిస్తుంటారు, పఠనాసక్తి పెంపొందించటానికి కృషి చేస్తుంటారు. సాహిత్యం మీద వారికున్న అభిమానం ఒక సృజనాత్మక శక్తిగా మారి వారు అడపాతడపా రాస్తున్న కథల్లో అవతరిస్తోంది, ఈ డయస్పోరా కథల్లో తెలుగు జీవిస్తోంది. కవితలా సాగిన ”గింజలు” వీరికి తెలుగు భాష పైన ఉన్న పట్టుకి, ప్రయోగాలపట్ల ఉన్న మమకారానికీ ఉదాహరణ. ఈ సంకలనం తెలుగు సాహిత్యానికి మరింత బలం చేకూరుస్తుందని నా నమ్మకం.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు, Uncategorized. Bookmark the permalink.

One Response to కేన్యా టు కేన్యా – ఆర్‌. శాంతసుందరి

  1. ఆరిసీతారామయ్య గారి ‘కెన్యా టు కెన్యా’ కథల సంపుటిపై ఆర్. శాంతసుందరి గారి సమీక్ష చాలా బాగుంది. కేవలం పుస్తకాన్ని మాత్రమే కాకుండా రచయిత కథారచయితగా ఎప్పటినుండి గుర్తించవచ్చో కాలంతో సహా చెప్పారు. ‘పైచదువు’ కథలో భారతీయ విద్యావ్యవస్థలో రావాల్సిన మార్పుల్ని గుర్తించగలిగేలా చెప్తూనే, సందేశం ఇస్తున్నట్లుగా కాకుండా సమస్యను సున్నితంగా మనముందుంచారు ఆరిసీతారామయ్యగారు. వాతావరణ కల్పన కూడా చాలా బాగా వర్ణించారు. దీన్ని సమీక్షకురాలు చాలా వరకు స్పృశించారు. ‘‘సీతారామయ్య రచనా వైశిష్టి ఏమిటో చెప్పాలంటే ఎంత లోతైన విషయాలని కథగా మలిచినా, ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఉన్నా, రచయిత కథలోగాని, పాత్రల్లోగాని ప్రవేశించడు. అసలు ఆయనకనబడడు. పాత్రలూ, సంఘటనలూ ఒక సినిమా చూస్తున్నట్టు కళ్ళముందు నిలుస్తాయి. బాధ పడతాయి, సమస్యలతో పోరాడతాయి, ఆత్మగౌరవం ఉన్న స్త్రీ పాత్రలు వీరి కథలన్నింటిలోనూ కనిపించే ప్రత్యేకత.’’ అని వ్యాఖ్యానించిన భావాలు ఆయన కథలు చదివిన నాలాంటి వాళ్ళకు కూడా అలాగే అనిపించాయి. దీనితో పాటు సీతారామయ్యగారు తెలుగు వాక్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్దతీసుకుంటారనేది కూడా గమనించాలనిపిస్తుంది. మంచి సమీక్ష ప్రచురించారు.
    డా.దార్ల వెంకటేశ్వరరావు
    అసోసియేట్ ప్రొఫెసర్, తెలుగుశాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో