వర్తమాన లేఖ – శిలాలోలిత

ప్రియమైన దేవకీ మేడమ్‌ గార్కి,

నమస్తే… ఎలా వున్నారు? ఆరోగ్యమెలా వుంటోంది? శంకరయ్య సార్‌ బాగున్నారా? వికారాబాద్‌ నుంచి వచ్చేసి హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంటున్నారని విన్నాను. అప్పుడే మేలు కలుసుకునే వాళ్ళం. నగరంలోకి వచ్చాక ఇంతవరకూ మిమ్మల్ని కలవడం కుదరనే లేదు. నాకెందుకో నగరంలోని మనుషుల్ని చూస్తుంటే కరెంట్‌ స్తంభాలే గుర్తొస్తాయి. వెలుగుతాయి. వెలుగునిస్తున్నామనుకుంటాయి. కానీ ఏ స్పందనా లేని, చలనాన్ని కోల్పోయిన, ఒకేచోట పాతిపెట్టబడ్డ జడుల్లాంటివన్పిస్తుందొక్కొక్కసారి.

మేడమ్‌! మన తొలి పరిచయం స్పాట్‌ వ్యాల్యుయేషన్‌లోనే కదా! మీరంటే ఎంతో ఆరాధన ఉండేది. ఏటేటా కల్సుకునే మన స్నేహం కాస్తా, ఎప్పటికీ కలుసుండ గలిగే మిత్రస్థాయికి చేరుకున్నాం. మీకు ప్రిన్సిపాల్‌గా ప్రమోషన్‌ వచ్చిన సందర్భంలో, మిమ్మల్ని ఆ చైర్లో కూర్చొని ఉండగా చూడాలనే కోర్కెతో మిత్రులం వికారాబాద్‌ వచ్చాం.  మీరు పిహెచ్‌డి చేస్తున్న క్రమంలో గంటలు గంటలు ఫోన్లలో టాపిక్‌ గురించి చర్చించుకుంటూ ఉండేవాళ్ళం. ఆ రోజులే వేరు. మీ ఓపిక, జ్ఞాన తృష్ణ నన్నెంతో ఆకర్షించేవి. మీ ఇంట్లో ఉన్న సందర్భంలోనే స్నేహలత మీద నేను రాసిన కాలమ్‌ని వినిపించాను కదూ! మా మున్నాకి కూడా, మీ ఆప్యాయత, మీ ఇల్లూ బాగా నచ్చాయప్పుడు. రిటైర్‌ అయిన తర్వాత కూడా మీలో ఉత్సాహం ఏ మాత్రం తగ్గలేదు. ‘లా’ పూర్తి చేసారు. మీరూ సారూ కూడా నాకెంతో స్ఫూర్తినిచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తు. తెలంగాణా ఉద్యమంలో మీరు పాల్గొన్న తీరు మరొక ఎత్తు. ఉద్యమ కాలమంతా, ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు, దూరాభారాలు కూడా లెక్క చెయ్యక, అనారోగ్య సమస్యలున్నా పట్టించుకోక, తెలంగాణా కోసం మీరు పోరాడిన వైఖరి నన్ను మిమ్మల్ని మరింతగా ప్రేమించేట్లు చేసింది. మీ జీవనానుభవం, వాక్పటిమ, మీ ఇన్‌వాల్వ్‌మెంట్‌ ఎందరినో ప్రభావితం చేసిందనడానికి ప్రత్యక్ష నిదర్శనం నేను. జిలకర శ్రీనివాస్‌ లాంటి మిత్రులనేకులు మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. అవి విన్నప్పుడల్లా మీ పట్ల గౌరవం, ఇష్టం మరింతగా పెరిగేవి. ఎట్టకేలకు ఎందరెందరి త్యాగ ఫలితంగానో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగాం. మీరేమన్నా అనండి. మేధావులకు రావాల్సిన గుర్తింపు గానీ, స్థానాలు కానీ రాలేదు. నేనిలా అంటే మీరేమంటారో కూడా నాకు తెలుసు. మేము వాటిని, పదవులను ఆశించి ఉద్యమం చెయ్యలేదు కదా! అంటారు. మీరు కోరుకోక పోవడం మీ ఔన్నత్యం. గొప్పతనం. కానీ మిమ్మల్ని గుర్తించాల్సిన బాధ్యతైతే ఉంది కదా!

అన్నట్లు మేడమ్‌! ‘నవత’ ఎలా

ఉంది? ఈమధ్యేమన్నా వచ్చి వెళ్ళిందా? ‘రాహుల్‌’ ఎలా ఉన్నాడు? స్టూడెంట్‌ యూనియన్‌లో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉండేవారు కదా! మీకు గుర్తొచ్చిందా మేడమ్‌! ఒకసారి విద్యార్థులకు, పోలీసులకు ఘర్షణ జరుగుతున్న సందర్భంలో, ఒక ఇన్‌స్పెక్టర్‌ను ఎదిరించి ఆ రోజుల్లోనే చెంపచెళ్ళుమనిపించారు. అన్యాయాన్ని ఎదుర్కొనేశక్తి, తీవ్రమైన ధర్మాగ్రహం ఆ పనిని మీచే చేయించి ఉంటుంది. ఆ రోజుల్లోనే మీరు చేసుకున్న కులాంతర వివాహం చర్చనీయాంశం కదా! నిజాయితీగా నిబద్ధతతో జీవించిన మీ జీవన విధానమంటే ఎంతో గౌరవం నాకు. మన మధ్య ప్రేమ, స్నేహం పెరగడానికి మీ వ్యక్తిత్వం, మంచి మనసే కారణమయ్యుంటుంది. చెప్పేదొకటీ, చేసేదొకటీ కాకుండా, నిప్పులాగా జీవించారు కాబట్టే, ఉద్యమ కాలంలో సైతం, కణకణమండే నిప్పులాంటి ఆశయాలతో, ఆదర్శాలతో తెలంగాణ ఉద్యమ పోరాట కాలమంతా మీరు ఎంతో కృషి చేశారు. బంగారు తెలంగాణాను సాధించుకున్నాం ఎట్టకేలకు. ఇక ప్రారంభం నుంచి అనేకమైన పనులు చేయాల్సి వుంది. మీరు మళ్ళీ కార్యోన్ముఖులు కావాల్సిన అవసరం ఎంతైనా వుంది. పదవులకే ప్రకాశవంతమైన మీలాంటి వాళ్ళ అవసరం, పేదలకు, దోపిడీకి ఇంకా గురవుతున్నవాళ్ళకు ఎంతో ఉంది. ఆలోచించండి మేడమ్‌! నేను ఎక్కువ చొరవ తీసుకున్నాన్నని మీరు అనుకున్నా సరే!

తెలంగాణా మీద మీరు రాసిన కవితలు, స్త్రీల స్థితిపై రాసిన కవితలకు తొలి శ్రోతను ఫోన్‌లో నేనే కదా! మీరు రాసే వ్యాసాలు కూడా ఎంతో ఆలోచనాత్మకంగా ఉంటాయి. తెలంగాణ విమోచనోద్యమం నవలల్లో స్త్రీ చైతన్యం పేరిట మీరు చేసిన పిహెచ్‌డి ఎంతో ప్రామాణికమైనది. 2008లో అనుకుంటా పుస్తకంగా కూడా వేసారు. చాలా విలువైన పరిశోధన అది. కొత్త కోణంలో ప్రతిపాదించిన సిద్ధాంత గ్రంథం అది. క్షణం తీరుగబాటు దొరకని ఉద్యోగ బాధ్యతల్లో సహితం పూర్తి చేసిన మీ పట్టుదల సర్వదా అభినందనీయం. బతుకమ్మ మీద మీరు మొదలు పెట్టిన ప్రాజెక్ట్‌ పని ఎంతవరకు వచ్చింది? వాకపల్లి వెళ్ళినప్పుడు మనం గడిపిన బాధాకర క్షణాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. మీరు కూడా అప్పుడు బాగా డిస్టర్బ్‌ అయ్యారు. ఉండనా మరి.

– శిలాలోలిత

Share
This entry was posted in వర్తమాన లేఖ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో