నల్లమల అడవుల్లో చెంచుల మౌనఘోష- కొండవీటి సత్యవతి

మద్దూర్‌ వెళ్ళి వచ్చిన ఉదయం కాఫీ తాగుతూ ఆంధ్రజ్యోతి తిరగేస్తుంటే… వివిధలో ఒక చిన్న వార్త కళ్ళనాకట్టుకుంది. ప్రోఫెసర్‌ జయధీర్‌ తిరుమల రావుగారిచ్చిన ప్రకటన అది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నల్లమల చెంచుపెంటల్లో మూడు రోజుల కార్యక్రమం వావ్‌ !! అంటూ అరిచాను. కంప్యూటర్‌ ముందు కూర్చుని పని చేసుకుంటున్న ప్రశాంతి ఏమైందమ్మూ! ఎందుకలా అరిచావ్‌ అంది. ”అరేయ్‌! ఈ వార్తచూడు… భలే…  నల్లమల అడవుల్లో మూడురోజులు.. చెంచులతో మీటింగ్‌ వెళ్ళాలి…” ”అవునా… ఆదివారం నాకు వేరే పనుంది…  నేను మిస్‌ అవుతాను” అంటూ తన పనిలో పడింది.

అప్పటి నుండి నల్లమల నా ఊహల్లో నిలిచిపోయింది. ఏ పని చేస్తున్నా… వెళ్ళాలి… తిరుమల రావుగారితో మాట్లాడాలి. నంబర్‌ దొరకలేదు నా ఫోన్‌లో. శిలాలోలితని అడిగితే, యాకూబ్‌ ఎసెమ్మెస్‌ చేసాడు తిరుమలరావుగారి నంబరు. వెంటనే ఆయనతో మాట్లాడాను. నేను రావచ్చా అని అడిగాను. ”అయ్యో! రండి.. తప్పక రండి మేము ముందే వెళ్ళిపోతాం” ”నేను ఆదివారం వస్తాను అని చెప్పాను” రండి… మన్ననూర్‌లో మీ కోసం రూమ్‌ బుక్‌ చేసి వుంచుతాము” అని మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. హమ్మయ్య… హాయిగా వెళ్ళొచ్చు అనుకున్నాను కానీ ఆదివారం దాకా ఎందుకు.. శనివారం సెలవే కదా! వెళ్ళిపోతే…. బుర్రలో ఆలోచనలు. డ్రైవర్‌ కోసం వెతకాలి.

శనివారం తెల్లారిందో లేదో మంజుల ఫోన్‌ చేసింది. ‘ఎలా ఉన్నారు? ఉదయమే కళ్ళ తెరవగానే మీరు గుర్తొచ్చారు… ఎలా ఉన్నరంటూ నిద్రగొంతుతో మాటలు… నాకు విపరీతంగా నవ్వొచ్చింది. మొన్కొక రోజు ఉదయమే ఢిల్లీ నుంచి వీణఫోన్‌ చేసి ఎలా వున్నారు? పొద్దున్నే మీరే గుర్తొచ్చారు… బావున్నారు కదా అని అడిగింది. అది గుర్తొచ్చి ”బావున్నాను మంజులా నేనెందుకు మీ అందరికీ గుర్తొస్తాను… అదీ నిద్రలేవగానే… నా మీద కలలు కంటారా?” అంటే ”అంతే కదా! ఇష్టమైన వాళ్ళు నిద్రమేల్కొనే ఉదయాల్లో గుర్తొస్తే ఆ రోజంతా హ్యపీ కదా… ఏం చేస్తున్నారు?” అంది. ”నల్లమలకి పోతున్నాను” ”అవునా! నన్ను తీసుకుపొండి” అంటూ ఉత్సాహపడింది. ”రా..పోదాం… పదకొండింటికి బయలు దేరదాం… డ్రైవర్‌ దొరికితే చూడు” అన్నాను ”ఓకె… అని వెంటనే డ్రైవర్‌ని దొరికించుకుని నంబర్‌ పంపింది. ”హుర్రే!!!”.. హడావుడిగా బ్యాగ్‌ సర్దేసాను. అడవిలో వుండడానికి అవసరమైనవన్నీ సర్దేసాను. ప్రశాంతికి మెసేజ్‌ చేసాను. ఈ రోజే పదకొండింటికే బయలు దేరిపోతున్నానని. వెంటనే తను కాల్‌ చేసింది… రేపు కదా వెళతానన్నావ్‌ అని … లేదు ఈ రోజే వెళ్ళాలన్పించింది.” ”జాగ్రత్త అమ్మూ! అని గొడుగు, టోపి, అగిపెట్టె, కొవ్వొత్తి తీసుకెళ్ళు.. కొండలు, గుట్టలూ ఎక్కకు” అంటూ హెచ్చరికలు చెప్పింది. ”అలాగే… అడవిలో ఫోన్‌ పనిచేయదు.. నెట్‌వర్క్‌ దొరికినప్పుడు ఫోన్‌ చేస్తాలే.. డోంట్‌ వర్రీ” అని చెప్పాను పదిన్నరకి మంజుల ఫోన్‌ చేసి” రావడంలేదు..” అని డల్‌గా చెప్పింది.” ఏం? ఎందుకు? ”తర్వాత చెప్తాలే.. అంది.” సరే అయితే… నేను 11.30 వరకు చూస్తాను రావాలనిపిస్తే వచ్చేయ్‌.. అన్నాను కానీ తను రాదని అర్థమైపోయింది. 11గంటలకి డ్రైవర్‌ పృధ్విరాజ్‌ వచ్చాడు.

”చల్‌… అకేలా… చల్‌ అకేలా” అనుకుంటూ నల్లమలకి ఒక్కర్తినే బయలుదేరాను. మనసంతా మహాఉత్సాహంగా వుంది. ఈ ప్రయాణాలతో ప్రణయం ఎప్పుడు తగ్గుతుందో? అనంతపూర్‌, మహబూబ్‌నగర్‌ తిరిగొచ్చాను. అయితే నేం? నల్లమల వెళ్ళకుండా ఎలా? అడవుల్లోకి ప్రయాణమంటే.. మనసు ఆగమేఘాల మీద ఉరకదా? నల్లమల గుండా ప్రయాణం చేసాను కానీ నల్లమల అడవి గర్భంలోకి వెళ్ళలేదుగా.. చెంచుల ఆవాసాల్లోకి.. వారి జీవన చిత్రాల్లోకి వెళ్లడం… మహా ఉద్వేగంగా వుంది. క్రితం సంవత్సరం కుప్పం యూనివర్సిటీకి అతిధిగా వెళ్ళినప్పుడు బెల్లి యాదయ్యగారు సమర్పించిన పత్రంలో” చెంచుస్త్రీల వైధవ్యం – దీనస్థితి” గురించి విన్నపుడు మనసు నీరయిపోయింది. ఆయన నడిగి ఆ పేపర్‌ తీసుకుని భూమికలో వేసాను.. చెంచు ఆవాసాల ఫోటో కవర్‌ పేజీగా వేసాం కూడా. ఆ తర్వాత ఆయనతో చాలా సార్లు మాట్లాడాను. చెంచుస్త్రీల సమస్యల మీద ఏమైనా చేయండి మేడం… అని చాలా సార్లు అడిగారు కూడా, ఇప్పటికి చెంచులను కలిసే అవకాశం వచ్చిందని సంతోషపడ్డాను.

”మేడం మాది … వెల్దండ … ఇపుడొచ్చేది మా ఊరే” డ్రైవర్‌ పృధ్విరాజ్‌..” అవునా! అయితే నీకు ఈ ప్రాంతమంతా తెలుసన్నమాట.” ”తెలుసు… మేం లంబాడొళ్ళం మేడం” అంటూ కబుర్లు మొదలెట్టాడు వాళ్ళింట్లో ఎవో గిరిరాజ్‌ కోళ్ళ వున్నాయట… ఇంట్లోనే పెంచొచ్చట మన వెనకే తిరుగుతాయట. ఇంట్లో రెట్టలు కూడా వెయ్యవట. మీకు తెచ్చి ఇస్తాను..” అన్నాడు ”మాకు స్థలం లేదుగా పృధ్విరాజ్‌ …” అంటే ”ఇంట్లోనే పెంచుకోండి”. ఈలోగా తిరుమలరావుగారి నుండి ఫోన్‌ వచ్చింది. ఎక్కడి దాకా వచ్చారు” అంటూ. ”డిండి దాటుతున్నామండి…” ”అయితే వచ్చేయండి… మేము మీకోసం ఎదురుచూస్తున్నాం అన్నారు. హమ్మయ్య… వాళ్ళు అడవిలోకి వెళ్ళిపోలేదన్న మాట… వాళ్ళు వెళ్ళిపోయుంటే రూమ్‌లో కూర్చుని ఏం చెయ్యాలా అని తెగ ఆలోచించాను.

మూడు గంటలకి మన్ననూర్‌ చేరాం. భ్రమర అనే చిన్న హోటల్‌ దగ్గర తిరుమలరావుగారిని కలిసాను. తిరుమల రావుగారితో పాటు బెల్లియాదయ్యగారు, పాలమూరు యూనివర్సిటీ కల్చరల్‌ స్టడీస్‌ ప్రొఫెసర్‌ మనోజగారు, నమస్తే తెలంగాణ విలేఖరి చందూ నాయక్‌ తదితరులు అక్కడున్నారు. నా కోసమే ఎదురుచూస్తున్నారు. వేడి వేడి టీ తాగి మన్ననూర్‌ రిజర్వ్‌ఫారెస్ట్‌ వేపు బయలు దేరాం. మన్ననూర్‌ గ్రామం నుంచి టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ ఇరవై కిలోమీటర్లుంటుంది. అక్కడి నుండి శ్రీశైలం అరవై కిలోమీటర్లు.

మేం తిరుమలరావుగారి కార్లో రిజర్వ్‌ ఫారెస్ట్‌ దగ్గరి కెళ్ళి అక్కడ జీప్‌ ఎక్కేం. కమాండర్‌ జీప్‌ డ్రైవర్‌ పేరు నరశింహ. మనోజ డ్రైవర్‌ పక్కన నేను ఆమె పక్క ఒక కాలు బయటకు వేలాడేసి ఓపెన్‌లో కూర్చున్నాను. జీప్‌ బయలుదేరింది. అక్కడింకా సెంట్రల్‌ యూనివర్సిటీ రెసెర్చిస్కాలర్‌ రాజేష్‌, యాదయ్యగారి స్టూడెంట్స్‌ కూడా జీప్‌ ఎక్కారు.

అడవి గర్భంలోకి వెళుతుంటే మనసంతా మహోద్విగ్నంగా అయిపోతోంది! క్రితం రాత్రి కురిసిన వర్షానికి అడివంతా శుభ్రంగా, పచ్చగా మెరిసిపోతోంది. కంకర రోడ్డు మీద చక్కటి బురద నీళ్ళ గుంటల్లోపడి ఎగిరిపడుతోంది జీప్‌. కొంచెం దూరం వెళ్ళగానే జింకల గుంపొకటి చెంగు చెంగున దూకూతూ కనబడింది మరి కొంత దూరం వెళ్ళగానే అడవి పంది గంపెడు పిల్లలతో రోడ్డు దాటుతూ కనబడింది. ఏవేవో పక్షుల కూతలు వినిపిస్తూనే వున్నాయి. అనంతంగా అటూ ఇటూ చెట్లు… మళ్ళీ ఓ పెద్ద సాంబార్ల గుంపు కంటపడింది. జీప్‌ నడుస్తున్నంత సేపు మావేపు చూస్తున్నాయ్‌. జీప్‌ ఆగగానే తుర్రుమని పరుగులు తీస్తున్నయ్‌ ”అమ్మో ఇన్ని జింకలు, సాంబార్‌లు ఎప్పుడూ కనబడలేదు. ఇవన్నీ సత్యవతిగారి కోసమే ఎదురుచూస్తూ, ఎగురుతున్నట్టున్నాయ్‌ ”అంటూ తిరుమలరావుగారు నవ్వారు. ఏమో!!! ఖానాపూర్‌ అడవిలో ఎదురైన అనుభవం గుర్తొచ్చి అడవులు జంతువులు నాకోసం ఎదురుచూస్తాయేమో!!! అనిపించి నాకూ నవ్వొచ్చింది.

కొంచెం దూరంగా కన్పించిన దృశ్యం నా పెదవి మీది నవ్వును మధ్యలోనే ఆపేసింది. మా జీప్‌ ఆ దృశ్యం సమీపాన ఆగింది. ఓ చిన్న నీటి మడుగు. బహుశా రాత్రి కురిసిన వాన తాలూకు నిలిచిన నీటి ఆనవాలు. బెత్తడులోతు కూడా లేదు. అక్కడ ఇద్దరు స్త్రీలు.. చెంచుస్త్రీలు బిందెకి బట్టవాసినిగా కట్టి చిన్న చెంబుతో ఆ నీళ్ళను పట్టి బిందెలో పోసుకుంటున్నారు. బురద నీళ్ళు… చూస్తున్న నా కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. వాళ్ళతో మాట్లాడాలని ప్రయత్నం చేసాం. ముందు సిగ్గుపడ్డారు. తర్వాత మెల్లగా మాట్లాడారు. నీళ్ళకోసం చాలా దూరం నడిచి వెళ్ళాలని.. వాన నీరు నిలిచింది. కదా పట్టుకుంటున్నాం అన్నారు. తాగడానికి అవే నీళ్ళు. కొంచెం సేపు మాట్లాడాక కొంచెం దగ్గరయ్యారు. పాటపాడవారా అంటే… ఓ లచ్చగుమ్మడీ పాట పాడింది ఒకామె. నేను చప్పట్లు కొడుతూ ఉత్సాహపరుస్తుంటే నవ్వుకుంటూ పాడింది. అక్కడికి దగ్గరలోనే వాళ్ళ ఇళ్ళు కనబడుతున్నాయి. వెళదామనుకున్నాం కానీ అప్పాపూర్‌ వెళ్ళడానికి ఆలస్యమవుతుందని వాళ్ళకి వీడ్కోలు చెప్పి ముందుకు కదిలాం. వాటర్‌ ఫిల్టర్లు, ఆర్‌వో సిస్టమ్‌తో అతి జాగ్రత్తగా వడపోసే నీళ్ళతాగే మనం…. బురదనీళ్ళు … అవి కూడా దొరకని స్థితిలో చెంచులు.. ఉద్విగ్నమంతా ఆవిరైపోయింది. చెట్లు, పిట్టలు కళ్ళకి, చెవులకి ఆనందం కలిగిస్తున్నా మనసు నిండా ఆ బురదగుంట నిండిపోయింది.

మా జీప్‌కి ముందు గురవయ్యగారు సెక్యురిటీలాగా మోటార్‌బైక్‌ మీద వెళుతున్నారు. ఆయనది మేము వెళుతున్న అప్పాపూర్‌. జీప్‌ దిగేసి ఆయన బండి ఎక్కేద్దామా అని మనసుకాసేపు ఊగింది. కానీ నేను చీరకట్టుకున్నాను. రోడ్డు చూస్తే గతుకులమయం. పెద్ద పెద్ద గుంతలు… నిండా బురదనీళ్ళు. ఒకేవైపు కూర్చుంటే నడుములు గోవిందా… అప్పటికీ తిరుమలరావుగారు అన్నారు కానీ రోడ్ల పరిస్థితి చూసి జీప్‌లోనే కూర్చున్నాను. జీప్‌లో కూడా ముందుసీట్లో సగం బయటకే కూర్చున్నాను. నల్లమల అడవుల్లోకి… లోపల్లోపల్లోకి వెళ్ళగలుగుతానని నేనెప్పుడూ అనుకోలేదు. కొంత దూరం వెళ్ళేటప్పటికి వ్యూపాయింట్‌ అని బోర్డు కనబడింది. (విస్తారంగా విస్తరించిన అడివి కనిపిస్తుంది. తిరిగి వచ్చేటప్పుడు ఆ అద్భుతాన్ని చూసాం) మామూలుగా పబ్లిక్‌ని ఈ పాయింట్‌ వరకే అనుమతిస్తారు. మెయిన్‌ గేటు నుండి ఇక్కడి వరకు జీప్‌లు నడుస్తాయి. అది దాటి ఇంకాలోపలికి వెళ్ళాలంటే కేంద్రప్రభుత్వ వైల్డ్‌లైఫ్‌ విభాగం నుండి అనుమతి తీసుకోవాలి. మేము దాదాపు 25 కి.మీ లోపలికెళ్ళాం.

తెలంగాణా రచయితల వేదిక అధ్యక్షులుగా జయధీర్‌ తిరుమల రావుగారు, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మూలవాసులైన చెంచుకమ్యూనిటితో ఒక సమావేశం ఏర్పాటుచేయాలనే ఉద్దేశ్యంతో అడవి లోపలికి వెళ్ళడానికి వైల్డ్‌లైఫ్‌ డిపార్ట్‌మెంట్‌ నుండి అనుమతి తీసుకున్నారు. ఆ సమావేశం ఆదివారం నాడు జరపాలని, చాలా మంది రచయితలు, మీడియా మిత్రులు వస్తారని, మెడికల్‌ క్యాంప్‌ కూడా వుంటుందని చెప్పారు. ”రేపటి సమావేశంలో ముఖ్య ఆకర్షణ, చెంచులకు వారికి దూరమైన ‘కిన్నెర’ వాయిద్యాన్ని బహూకరించడం. కొత్త ‘కిన్నెర’ కోసం ప్రయత్నిస్తున్నం’  అని చెప్పారు ఆయన. మేం మాట్లాడుకుం టున్నాం… జింకలు అటూ ఇటూ దూకుతున్నయ్‌ నెమళ్ళ గుంపు కనబడింది. కనుచూపుమేరంతా పరుచుకున్న పచ్చదనం.

అడవి మధ్యలో ఒక్క సారిగా జీప్‌ ఆగిపోయింది. దారికట్టంగా చెట్టు పడిపోయింది. అందరం జీప్‌ దిగాం. దగ్గర కెళ్ళి చూస్తే జీప్‌ వెళ్ళేట్టుకనబడలేదు. ఎమర్జెన్సీ.. ఫోన్‌లు పనిచెయ్యవు జీప్‌ నుంచి దిగిన వాళ్ళే చెట్టును లాగడానికి ప్రయత్నించారు. పడిపోయిన చెట్టుకి బలుసుకాయల్లాంటి కాయలు, ముళ్ళ వున్నాయ్‌. ఓ ముల్లు నా ఎడం కాలు చిటికెన వేలును చేరేసింది. కొంత ప్రయత్నం తర్వాత చెట్టును పక్కకి లాగారు… జీప్‌ బయలదేరింది. ఐదు ఐదున్నర ప్రాంతాల్లో మేము అప్పాపూర్‌ చేరాం. నలభైఐదు ఇళ్ళున్న చెంచుపెంట అప్పాపూర్‌ గురవయ్య స్వగ్రామం. వెళుతూనే స్కూల్‌లోకి వెళ్ళాం. స్కూల్‌కి ఆరోజు శెలవు… రెండో శనివారం పిల్ల్లల హాజరీ గురించి మాష్టారు గందరగోళంగా చెప్పారు. పిల్లలు రారని, వచ్చినా కూర్చోరని, కూర్చున్నా భోజనం పెట్టగానే తినేసికానీ, ఇంటికి పట్టుకెళ్ళిగానీ వెళ్ళిపోతారని, తల్లితండ్రీ తాగుతారని, పిల్లల్ని స్కూల్‌కి పంపరని చెప్పుకొచ్చారు. స్కూల్‌కి పిల్లల్ని ఎలా రప్పించగలం అనే దానికి ఆయన దగ్గర సమాధానం లేదు.

అక్కడి నుండి చెంచుల ఇళ్ళున్న ప్రాంతానికి వచ్చాం. గురవయ్య మాతోనే వున్నారు. మర్నాటి మీటింగ్‌ ఎక్కడ పెట్టాలా అని తిరుమలరావుగారు పరిశీలిస్తున్నారు. ఓ పెద్ద చింతచెట్టు… చాలా అందమైన మరో పెద్దచెట్టు వున్నాయక్కడ. ఎదురుగా దట్టమైన అడవి. సూర్యాస్తమయంకాబోతోంది. పడమటి దిక్కు ఎర్ర బారుతోంది. మేము ఆ మునిమాపు వేళ… విశాలాకాశం కింద చాపపరుచుకుని కూర్చున్నాం. తిరుమలరావుగారు, మనోజ, యాదయ్య, చందు, గురవయ్య, నేను ఆరుబయట అలా కూర్చోగానే మెల్లగా కొంతమంది పురుషులు వచ్చారు. మహిళలు రాలేదు. వయసులో కొంచెం పెద్దాయన మరో ఇద్దరు మౌనంగా వచ్చి కూర్చున్నారు. యాదయ్య ఆ పెద్దాయనతో మాట్లాడించే ప్రయత్నం చేసారు. ప్రభుత్వం మారింది కదా ఏమైనా తేడావుందా? అని అడిగితే ఎవ్వరైనా వొక్కటే.. మా బతుకులింతే.. ఎవరెవరో వస్తారు. ఏమేమో అడుగుతారు. మేము చెబుతాం…. అంతే ఎవ్వరూ ఏమి చెయ్యరు మాకు మా అడవే రక్ష. నీళ్ళులేవు. కరంట్‌ లేదు. డాక్టర్‌ లేడు.. ఆయన చెప్పుకుపోతున్నారు. అడవి వొదలి వెళతారా? అంటే ‘మేము పోముసార్‌.. నగరం మమ్మల్ని మింగేస్తది… అడవి మాకు అన్నీ ఇస్తది… కాయపండు, కట్టె అన్నీ ఇస్తది… మేమెందుకుపోతాం. మాటలు నడుస్తున్నయ్‌ పెళ్ళిళ్ళ గురించి అడిగితే ఈ కాలం పిల్లలు మాటింటారా? అడవుల్లోకి పోతారు… తిరిగేసివస్తరు. మేంపెళ్ళిచేస్తం ఇద్దరికీ ఇష్టమైతే మేం అడ్డుచెప్పం. బాల్యవివాహాలు నేరం కాదా చేస్తున్నారా?’ మాకేంటి నేరంలేదు. మేము చేసేస్తాం… అన్నాడు. నాకు బెల్లియాదయ్యగారి వ్యాసం గుర్తొచ్చి భర్త చనిపోతే ఆడవాళ్ళు మళ్ళీ పెళ్ళి చేసుకుంటారా? ‘ఆమె ఎవరినైనా ఇష్టపడితే పెళ్ళి చేస్తారు. పునర్వివాహంవుంది’ అని గురవయ్య చెప్పారు.

ఎపుడో మధ్యాహ్నం బయలుదేరాం. బాత్‌రూమ్‌కి వెళ్ళలేదు. మెల్లగా మనోజగారి చెవిలో ఊదితే ఫర్వాలేదు ఆ వెనక్కివెళ్ళండి అని చెప్పారు. ఆ వెనక్కివెళితే అక్కడో ఆవుల మంద… కొంత మంది మగవాళ్ళు కన్పించి వెనక్కివచ్చేసాను. నా అవసరాన్ని అర్థం చేసుకున్న గురవయ్య మా ఇంటికెళదాం రండి మేడం! అని వాళ్లంటి వైపు తీసుకెళ్ళి బాత్‌రూమ్‌లో నీళ్ల పెట్టమని ఎవరికో చెప్పారు. చుట్టు గుడిశలోంచి ఒకామె వచ్చి బకెట్‌తో నీళ్ళు తీసుకెళ్ళి బాత్‌రూమ్‌లో పెట్టింది. దానికి తలుపులేదు. అలాగే వెళ్ళి బయటకొచ్చాను. ”మా ఇల్లు ఇదే మేడం… అమ్మ నాన్న పడుకున్నారు” అని వాళ్ళింట్లోకి తీసుకెళ్ళాడు. లోపల చీకటిగా వుంది. నెగడు మండుతోంది. ఆ నెగడుకి ఇటు వాళ్ళ అమ్మ, అటు వాళ్ళ నాన్నగార్లు పడుకుని వున్నారు. సగానికి పైగా గదిలో దేవుడిపటాలు, బల్లెం, శూలాలు, ఇంకా ఏవేవో ఆక్రమించాయి. పెద్దవిడ పక్కన పడుకున్న పసిగుడ్డు హఠాత్తుగా కంటబడి నా గుండె జల్లుమంది. భయమేసింది. పెద్ద వాళ్ళు నిద్రపోయాక బిడ్డపాక్కుంటూ నెగడు వేపు వస్తే… ఊహే… ఊపేసింది. గుడిశెలోంచి బయటకొచ్చాను. సగం పూర్తైన ఇల్లు చూపించి ”ప్రభుత్వం కట్టబోయిన ఇల్లు. మా నాయన కట్టనీయలేదు. మేము అందులో వుండమని చెప్పి గుడిశెలో వుంటున్నారు.” ”అలాగా! ఎందుకని” అంటే ”ఆ నెగడు రాత్రంతా మండుతుందా?” అని అడిగాను. ”రాత్రంతా కాలుతుంది. అది వుంటే జంతవులేమీరావు. మద్ది, దేవదారు చెక్కలైతే ఆరకుండా కాలుతూనే వుంటాయి” అన్నారు. మేం మాట్లాడుకుంటూ అందరూ కూర్చున్న దగ్గర కొచ్చాం హఠాత్తుగా ఏదో పిట్ట కమ్మటి గొంతుతో పాడసాగింది. ఆ స్వరం మనసుని వెంటాడేలాగా ఉంది. రికార్డు చేద్దామంటే కుదరలేదు. హఠాత్తుగా గొంతెత్తుతుంది. టక్కున ఆపేస్తుంది.  ఏం పిట్ట అది అద్భుతంగా కూస్తోంది. (కానీ ఆ గోంతులో ఏదో విషాదపు జీరవుంది అనిపించింది నాకు) అదే… కోయిల అన్నాడు పెద్దాయన… కోయిల కాదు.. కోయిల రాత్రిళ్ళు కూయదు. అన్నారెవరో… అది పాడుకుంటూ, విషాదాన్ని చిమ్ముకుంటూ అడవిలోకి వెళ్ళిపోయింది.

మిణుగురు పురుగుల వెలుతురులో చాలా సేపు కూర్చున్నాం.. బాగా చీకటిపడిపోయింది. గమ్మత్తుగా ఆకలి దాహంలేదు. మధ్యాహ్నం తాగిన టీనీళ్ళే… అస్సలు ఆకలన్పించ లేదు. మా చుట్టూ కూర్చున్న వాళ్ళు వొక్కరొక్కరూ వెళ్ళసాగారు. ”అత్యవసరంగా ఇక్కడ కావాల్సినవేంటో చెబుతావా పెద్దయనా” అడిగారు యాదయ్య.” ఏంకావాలి? అన్నీ కావాల… నీళ్ళు లేవు… అన్ని బోర్లేసారు. వొక్కచుక్క నీళ్ళుపడలేదు. చుట్టూ కంచెలేదు. కరెంటులేదు. ఆసుపత్రిలేదు. డాక్టర్‌ లేడు… మాకన్నీ కావాలి” గవర్నమెంటోళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళి మంచి ఇళ్ల కట్టించి అక్కడ పెడతారుట… మీరడిగనవన్నీ ఇస్తారట… పోతారామరి…”

”మేం పోం… అడవినొదిలి ఎక్కడికీపోం… అడివే మాకు రక్ష” అన్నాడాయన” ”ఇన్ని బోరవెల్స్‌ వేసారు… నీళ్ళ పడలేదు కదా! ఒక బావి తవ్వితే బావుండేది కదా ”అన్నాన్నేను”. ఇక్కడంతా భూమిలోపల పెద్ద చెట్ల పెద్ద వేర్లు. బోర్లు వేసేటపుడు వేర్లు అడ్డం పడి బోర్‌వెల్‌ మెషినరీ చాలా పాడైంది. రామ్‌ పూర్‌లో బావివుంది. కానీ…అది సరిగా లేదు. రేపు చూద్దాం  లెండిసార్‌. ”అన్నాడు గురవయ్య అన్ని బోర్‌ వెల్స్‌ నిజంగానే నీళ్ళ కోసం వేసారా? లేక అక్కడ అపారంగా వున్న యురేనియం తవ్వకాల కోసం పరీక్షలు చేసారా? అనిపించింది నాకు ఆ ప్రాంతంలో యురేనియం నిక్షేపాలు వున్నాయనే వార్త చదివిన గుర్తొచ్చి నాకలా అనిపించింది. ఇది నిజమని మర్నాడు తెలిసింది. యురేనియం వెలికితీత కోసం పెద్దఎత్తున మైనింగ్‌ చేపట్టే యోచనతోనే చెంచుపెంటల్నించి చెంచుల్ని వెళ్ళగొట్టాలనే దుర్మార్గపు కుట్ర జరుగుతున్నట్టుగా అన్పించింది నాకు.

చీకటి దట్టమైపోయింది. చిమ్మ చీకటిలో అడవి మధ్యలో వున్నామన్న భావన.. చెంచుల ఇళ్ళన్నీ చీకటిలో కలిసిపోయాయి. సెల్‌ఫోన్‌లు, టీవీలు చప్పుడు చేయని ఒక గాఢమైన నిశ్శబ్దం.. ఈల కోళ్ళు… ఇంకేవో జంతువుల అరుపులు తప్ప ఇంకేమీ వినబడని నిశ్శబ్దం. అప్పాపూర్‌ పెంట అడవిలో కలగలిసిపోయింది. మేము వెళ్ళడానికి సిద్ధమయ్యాం. గురవయ్య అక్కడే వుండిపోయి మర్నాటి కార్యక్రమం ఏర్పాట్లు చూస్తానని చెప్పారు. మేము జీప్‌ ఎక్కాం.

చీకటిని చీల్చుకుంటూ జీప్‌ హెడ్‌లైట్స్‌.. రోడ్డు… లైట్లు పడిన మేర కనిపిస్తూంది. అప్పుడప్పుడూ ఏవో జంతువులు రోడ్డు దాటుతున్నాయి. కళ్ళు గుచ్చి గుచ్చి చీకట్లోకి చూస్తూ కూర్చున్నాను. ఇంత రాత్రి వేళ నల్లమల అడవుల్లో ప్రయాణం చేయడం… అదీ ఓపెన్‌ జీప్‌లో… (నేను మరీ బయటకే కూర్చున్నాను) మహా థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఎన్నింటినో తన గర్భంలో యిముడ్చుకున్న అడవి… ఎంతో గుంభనంగా, మిస్టిక్‌ అనిపించింది. ఈ అడవి నిండా ఎన్ని రహస్యాలున్నాయో…. ఎన్ని వేల రకాల జంతువులు… ఎంతో వైవిధ్యం కలిగిన మహా వృక్షాలు.. అడవి …. మూడక్షరాల మహాద్భుతం. నాకు ‘వనవాసి’ నవలలోని అడవి… ఆ వెన్నెల రాత్రులు గుర్తొచ్చాయి. అబ్బ! ఓ పౌర్ణమి రాత్రి ఈ అడవిలో తిరగగలిగితే… నా ఆలోచనలను గమనించినట్లు మనోజ అన్నారు. ”క్రితం సారి వచ్చినప్పుడు వెన్నెల రాత్రి.. ఎంత అందంగా వుందో అడవి. ఎక్కడైనా ఆగాలని ఎంత అనిపించిందో!!! కానీ రాత్రిపూట… జంతువులు స్వేచ్ఛగా తిరిగే వేళ… అయినా సరే అగమని అడిగితే ఐదు నిమిషాలు ఆపారు. జీప్‌ చేసే శబ్దం కూడా ఆగిపోయి… మహనిశ్శబ్దం. అడవి మీద జాలువారుతున్న వెన్నెల … మేడం… మీరు తప్పక చూడాలి ”మనోజ మహా ఆనందంగా చెపుతున్నారు… నేను విజువలైజ్‌ చేసుకున్నాను. ఈ సారి తప్పక రావాలి, పౌర్ణమి రాత్రి రావాలి… ఎంత తమకంగా అనిపించిందో… ఓ పెద్ద జింకలగుంపు రోడ్డు దాటుతోంది. జీప్‌ ఆగింది… చెంగు చెంగున ఎగురుకుంటూ దాటుతున్నాయి. అలా అడవిలో ఆ రాత్రి ప్రయాణం సాగింది.

మన్ననూర్‌ గెస్ట్‌హౌస్‌ చేరేటప్పటికి తొమ్మిదైంది. మా కాటేజ్‌ పేరు చెన్నంగి కాటేజ్‌… రూమ్‌ బావుంది. ఒకటే ఇబ్బంది. గీజర్‌లో వేడినీళ్ళురాలేదట. పాపం! మనోజగారు చాలా ఇబ్బంది పడ్డారు. నాకు ఏ సీజన్‌లోను వేడినీళ్ళ అవసరంలేదు. అర్థ రాత్రి అయినా సరే హాయిగా చల్లటి నీళ్ళతో స్నానం చేసేస్తాను. నా ప్రయాణాల్లో నాకున్న గొప్ప వెసులుబాటు ఇది. మా పక్క రూమ్‌లోనే తిరుమల రావుగారు, యాదయ్యగారు వున్నారు.” తినేద్దామా? ”అని అడిగారు తిరుమలరావు. అంతకు ముందు కారులో కొబ్బరి కజ్జికాయ ఇచ్చారు. ఆకలనిపించలేదు. అయినా తిండి కోసం ఎక్కడి కెళతామో అర్థంకాక ”ఇక్కడ క్యాంటీన్‌ లాంటి దేమైనా వుందా? ”అని మనోజనడిగాను. ”లేదండి… ఫుడ్‌ వుంది సార్‌ తెచ్చారు” అన్నారు. స్నానం ముగించి పక్కరూమ్‌లో కెళ్ళాం. తిరుమలరావు గారు డబ్బాల మూతలు తీస్తున్నారు. అన్నం, చపాతీలు, పప్పు, పచ్చడి, చికెన్‌ వేపుడు… అందరం కబుర్లాడుకుంటూ తినడం పూర్తి చేసాం. ”ఇవన్నీ మేడం చేసారు” (తిరుమలరావు గారి సహచరి) అన్నారు మనోజ. ఆయన అందరినీ గమనించుకుంటూ ”మంచిగ తినండి.. చికెన్‌ వేసుకొండి” అంటూ కొసరికొసరి తినిపించారు. కడుపు నిండా తినేటప్పటికి కంటి మీదికి నిద్ర వాలిపోసాగింది. నేను తెచ్చుకున్న దుప్పట్లు పరుచుకుని మంచం మీద, వాలిపోయాను. వెంటనే నిద్రపట్టేసింది. మూసుకున్న రెప్పల వెనక ఆనాటి దృశ్యాలు… పచ్చదనం.. బురదనీళ్ళని పట్టుకుంటున్న ఆడవాళ్ళు.. చదువు సంధ్యల్లేని పిల్లలు.. నెగడు పక్కన పడుకున్నపసిబిడ్డ… గాఢంధకారం కలలు.. కలలు.. నిద్ర గాఢమైన నిద్ర.. కలత పెట్టే కలలు.. కన్నీటి చారికలు.

ఉదయం ఐదున్నరే మెలుకువ వచ్చేసింది. తలుపు తీసుకుని బయటకొస్తే… చల్లటి గాలి ప్రేమగా తాకింది. రాత్రి కురిసిన వర్షానికి చెట్లన్నీ శుభ్రంగా, పచ్చగా మెరిసిపోతున్నాయి. కాసేపు ఆ చెట్లలో అటు ఇటు తిరిగి రూమ్‌లో కెళ్ళేటప్పటికి మనోజ కూడా లేచారు. ఇద్దరం నడుచుకుంటూ మెయిన్‌ గేటు దగ్గర కొచ్చి మంచి అల్లంటీ తాగాం. ఎనిమిదికంతా తయారై అందరం మెయిన్‌ రోడ్డుమీద కొచ్చాం. దారిలో బంగారం రంగులో మెరుస్తున్న పళ్ళను గంపలో పోసుకుని ”నకిరి పళ్ళు… నకిరి పళ్ళు.. బి.పి.. షుగర్‌ బంద్‌” అంటూ అమ్ముతోంది ఒకామె ఓ పది రూపాయలవి కొని గబుక్కున ఓ పండు నోట్లో వేసుకున్నాను. చేదుగా వుంది… అయ్యో! అలా కాదు.. ఇలా తినాలి అంటూ నల్లద్రాక్ష తిన్నట్టు తినాలి అంది. తొక్క తినకూడదట. పుల్లగా పండు భలేవుంది. గింజలో పప్పు బాదం పప్పు కన్నా రుచిగా వుంది. కొన్ని పళ్ళు బాగ్‌లో వేసుకున్నాను… ప్రశాంతికి ఈ పండ్లు తెలుసోలేదో… చూపించాలి. మెయిన్‌ రోడ్డుమీద లక్షీ ్మ టిఫిన్‌ సెంటర్‌ దగ్గర జీప్‌ ఆగింది. ఆ సెంటర్‌ నడుపుతున్న పార్వతమ్మ చకచకా తిరుగుతూ పనులు పురమాయిస్తూ టిఫిన్లు తయారుచేస్తోంది. మొదట ఇడ్లీల పనిపట్టి తర్వాత పూరీలు తిన్నాం. చాలా శుచిగా, రుచిగా వున్నాయి. ”ఇంకేమైనా తినండి… చాలా తిరగాలి.. లంచ్‌ ఎప్పుడో..” తిరుమలరావుగారు. ఇంక చాలండి.. తినలేను” అని నేను చేతులు కడిగేసుకున్నా. చాలా మంచి టీ చేసిచ్చింది పార్వతమ్మ.” అన్నీ చాలా బావున్నాయని…” ఆమెకు చెప్పి బయలుదేరా. తిరుమలరావుగారు బిజీగా ఫోన్‌ల మీద ఫోన్లు చేస్తున్నారు. అప్పాపూర్‌లో జరగబోయే కార్యక్రమానికి చాలా మంది రచయితలు, మీడియా మిత్రులు వస్తున్నారు. వాళ్ళకి వెహికల్స్‌, పర్మిషన్స్‌… చూస్తున్నారు. ఎక్కడో చోటు చూసుకుని జీప్‌ ఎక్కమని పృధ్వీరాజ్‌కి చెప్పాను

మళ్ళీ అడవిలోకి ప్రయాణం దారిలో నిన్న గురవయ్య చెప్పిన బావిని చూద్దామనుకున్నాం. రామ్‌పూర్‌ పెంటకి వెళ్ళమని నరశింహకి చెప్పారు. రామ్‌పూర్‌లో పది పదిహేను చుట్టుగుడిసెలున్నాయి. ఆకాశం మబ్బుపట్టివుంది. చలిగావుంది. ఆరుబయట మంటేసుకుని కూర్చున్నారు. అక్కడ మమ్మల్ని గురవయ్య కలిసారు. బావిని చూపించారు. చాలా పెద్ద బావి. పెద్ద బండ అడ్డొచ్చిపని ఆగిపోయిందట. చుట్టూ కట్టిన గోడలు కూడా కూలిపోయాయి. కొన్ని బురదనీళ్ళున్నాయి. లోతు చాలా ఎక్కువట. ”మిషన్‌ కాకతీయ కిందికి ఈ బావులురావా”? అన్నాన్నేను. ఈ బావిని బాగుచేసి, పైప్‌లైన్‌లు వేస్తే చుట్టుపక్కల పెంటలన్నింటికి పుష్కలంగా నీరు అందుతుంది. సగంలో బావి ఆగిపోయింది అని గురవయ్య చెప్పినప్పుడు అందరం కాంట్రిబ్యూట్‌చేసి… ఫ్రెండ్స్‌నడిగి విరాళాలు సేకరిద్దాం… బావిని బాగుచేయిద్దాం అనుకున్నాం కానీ… బావిని చూడగానే.. అది మనవల్లకాదని… ప్రభుత్వం నిధులు కేటాయించి చెయ్యాల్సిన పని అని అర్థమైంది. ఐటిడిఏ డిపార్ట్‌మెంటుకి ఒక రిప్రజెంటేషన్‌ ఇస్తే బావుంటుందని అనుకున్నాం ఆ బావిని ఏవిధంగా తాగునీటి యోగ్యం చేద్దామా అని చర్చింకుంటూ రామ్‌పూర్‌ నుండి అప్పాపూర్‌ బయలుదేరాం. మీటింగ్‌ టైమ్‌ అవుతోందని తిరుమలరావు గారు కంగారుపడ్డారు. బయట నుండి ఎవరైనా వచ్చారేమో… ఫోన్‌ కలవదుకాబట్టి ఏమైన ఇబ్బంది పడుతున్నారేమో అనుకున్నాం. దారిలో ఒకతను కనబడ్డాడు. మాసిన జుట్టు, గెడ్డం, బట్టలు… ఎక్కడికి పోతున్నావని అడిగితే అప్పాపూరని అన్నాడు. అయితే జీప్‌ ఎక్కు మేము అటే పోతున్నాం అంటే అనుమానంగా చూసాడు. ”మేడం! నిన్న పాటపాడిందే… బురదతగుంట దగ్గర ఆమె మొగుడు. ఈయనకి ముగ్గురు పెళ్ళాలు” అన్నాడు డ్రైవర్‌ నరశింహ ”ఆ… ” అని నోరెళ్ళబెట్టాం నేను, మనోజ మీటింగ్‌కి పోతున్నాంలే ఎక్కు అంటే ఎక్కాడు.

మేము అప్పాపూర్‌ చేరినతర్వాత వొక్కరొక్కరే  రాసాగారు. నాలుగు పెద్ద వాహనాల నుంచి బిలబిలమంటూ రచయితలు, మీడియా దిగారు. మెడికల్‌ క్యాంప్‌ పెడుతున్న డాక్టర్‌, మందులు తెచ్చిన మందుల షాపునడిపే భార్యభర్తలు దిగారు. ఆ పెద్ద చింతచెట్టుకింద మహా కోలహలం నెలకొంది. బ్యానర్‌ కట్టి, నేలమీద చాపలు, జంబకానాలు పరిచారు. కిన్నెరవాయిద్యం చేతబట్టి డక్కలి పోచయ్య వచ్చారు. కొంతమంది చెంచుమగవాళ్ళ వచ్చి కూర్చున్నారు. స్త్రీలు తడకల్లోంచి చూస్తున్నారు. కానీ రావడానికి బిఢియపడు తున్నారు. అప్పాపూర్‌ అంగన్‌వాడి టీచర్‌ చాలా కలివిడిగా వున్నారు. ఆవిడ పేరు పార్వతమ్మ. అందరినీ మీటింగ్‌కి రమ్మని పిలుస్తున్నారు. బయట నుంచి వచ్చిన వారంతా సర్దుకు కూర్చున్నారు. ”మేడం! బావున్నారా” అని ఆంధ్రజ్యోతి నుంచి వచ్చిన బమ్మెర పల్కరించారు.

సెంట్రల్‌ యూనివర్సిటీ నుంచి వచ్చిన రాజేష్‌ చాలా ఫోటోలు, వీడియోలు తీస్తున్నాడు. ముందురోజు రికార్డు చేసిన నీళ్ళను సేకరించినామె పాటను, మాతో జీప్‌ ఎక్కివచ్చినాయనకి చూపించాడు. లాప్‌టాప్‌లో తన భార్య పాడుకున్న దృశ్యాలను చూసి గుబురు గడ్డంలోంచి ఆయన నవ్విన నవ్వును నేనెప్పటికీ మర్చిపోలేను. ఏ భావమూ లేని ఒక నిస్తేజం నిండిన ఆయన ముఖం భార్యని లాప్‌టాప్‌లో చూసి విప్పారిన విధం భలేవుంది. ఆ నవ్వు తర్వాత ఆయన ముఖం మళ్ళీ ముడుచుకుపోయింది.

జయధీర్‌ తిరుమలరావుగారు సమావేశం ప్రారంభిద్దాం అంటూ డక్కలి పోచయ్యను పిలిచారు. అంతకు ముందు నడవ లేక నడవలేక యిబ్బంది పడుతూ వచ్చికూర్చున్న ఓ పెద్దాయనని పిలిచారు. మీటింగ్‌ మొదలైంది. చాలా మంది స్త్రీలు వచ్చి కూర్చున్నారు.

సమావేశానికి వచ్చిన వారికి స్వాగతం చెప్పి తాము ఈ మీటింగ్‌ ఎందుకు నిర్వర్తిస్తున్నారో వివరించారు. ఆగస్టు 9 అంతర్జాతీయ ఆదివాసుల దినోత్సవమని, తెలంగాణ రచయితల వేదిక ఈ కార్యక్రమాన్ని మూలవాసులైన చెంచులతో నల్లమల అడవుల్లోని చెంచుపెంటల్లో నిర్వహించాలని తలచారని, ఆ సందర్భంగా వారి మౌఖిక చరిత్రను రికార్డు చేయాలని సంకల్పించామని చెప్పారు. అంతే కాకుండా చెంచుల వాయిద్యమైన ‘కిన్నెర’ వారికి దూరమైందని, చెంచులెవ్వరూ దానిని వాయించడం లేదని, దానికి కారణం ఆ వాయిద్యం తయారుచేసుకోవడానికి కావలసిన సొరకాయ విత్తనం కూడా వారి దగ్గర లేదని, అడవిపందులు నాశనం చేసేసాయని చెబుతూ వారి కిన్నెరను వారికి బహుకరించేందుకు కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. డక్కలి పోచయ్య అద్భతంగా కిన్నెర వాయిస్తూ పాడతారని, ఆయన ద్వారానే ఈ బహూకరణ జరిగి, ఆయనే వాళ్ళు మర్చిపోయిన దాన్ని నేర్పిస్తారని చెప్పారు. తాము క్రితం సారి వచ్చినపుడు ఎవరైనా కిన్నెర వాయిస్తారా? అని అడిగితే ఈ పెద్దాయన ముందుకొచ్చి వాయిస్తానన్నాడని ఆయనకే కిన్నెరను బహూకరిద్దామని మీడియా కోలాహలం మధ్య నడవలేని స్థితిలో మీటింగ్‌కు వచ్చిన పెద్దాయనకి కిన్నెరను బహుకరించారు.

కిన్నెరను అందుకుని దానిని వాయించడానికి ప్రయత్నిస్తున్న పుడు ఆ పెద్దాయన ముఖంలో కనబడిన వెలుగు విస్మయపరిచింది. ఎంతో ప్రేమగా కిన్నెరను పట్టుకుని చిన్నగా వాయించసాగాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత కిన్నెరను తాకినా గానీ ఆయన దానిని వాయించడం మర్చిపోలేదు. అయితే ఆయన చాలా బలహీనంగా వుండి ఎక్కువ సేపు కూర్చోలేకపోయాడు. కిన్నెర నాదం కూడా ఆయనంత బలహీనంగానే వెలువడింది. పోచయ్య కిన్నెరను తీసుకుని ఆరోహణ, అవరోహణ, మెట్లు అంటూ ఆయనకు వివరించి తాను తీగను మీటగానే ఖంగుమంటూ తంత్రి మోగింది. ఆ శబ్దం వినసొంపుగా వుంది. ఆ పెద్దయన పెదాల మీద లీలగా చిరునవ్వు వాలినట్టనిపించింది. ఎంతో ఆర్తితో, ప్రేమగా వారి వాయిద్యాన్ని తిరిగి వారికి బహూకరిస్తున్న సమయాన చెంచులందరి ముఖాల్లో గొప్ప సంతోషం వెల్లి విరిస్తుందని, అది వ్యక్తమవుతుందని నేను ఆశించాను గానీ, అలాంటి సంబర దృశ్యాలేవీకానరాలేదు. చెంచుల ముఖాల్లో ఒక నిస్తేజం, ఒక నిర్వేదం.. మనసును పిండేసే ఒక విషాద సాక్షాత్కారం…. ఎలాంటి భావాలూ వ్యక్తం కాని నిరామయస్థితిలోనే అందరూ కనిపించారు. ఒకతను మాత్రం పదే పదే మీటింగ్‌కు అడ్డుపడుతూ… అందరూ వస్తారు.. ఏమో చెప్తారు… ఎవ్వరూ ఏమీ చెయ్యరు.. అంటూ కొంత కోపం ప్రదర్శన చేసాడు. తిరుమలరావుగారు మీటింగ్‌కి వచ్చిన వారిని పరిచయం చేస్తుంటే… శ్రీనివాసరావని చెప్పావ్‌.. ఆయనెవరో నిలబడమనండి చూస్తాం కదా! అని డిమాండ్‌ చేసాడు. నా పేరు చెప్పినపుడు నేను చెయ్యి ఊపితే.. నువ్వు సత్యవతివా అంటూ నవ్వాడు. అతని డిమాండ్‌ నిజమే కదా అనిపించింది. అతని నవ్వు చాలా బావుంది. చెంచుల కళ్ళ చాలా పెద్దగావుంటాయి. కంటిలోపలి నల్లగుడ్డు పెద్దగా వుండి కళ్ళ చాలా విశాలంగా, మిలమిల మెరుస్తుంటాయి. మీటింగ్‌ జరుగుతున్నంత సేపు అతనొక్కడు తప్ప మిగిలిన వారెవ్వరూ ఎలాంటి ప్రతిస్పందనా చూపించకుండా నిశ్శబ్దంగా కూర్చున్నారు.

మీటింగ్‌లో చాలా తక్కువ మంది మాట్లాడారు. మనోజ, డాక్టర్‌, సెంట్రల్‌ యూనివర్సిటీ నుంచి వచ్చినాయన, మరి కొందరు మాట్లాడారు. నన్ను పిలిస్తే మాట్లాడదామనుకున్నాను. నేను ఏం చెప్పాలనుకున్నానంటే.. ఇలాంటి భిన్నమైన సమావేశానికి రాగలిగినందుకు సంతోషం వ్యక్తం చేయాలనుకున్నాను. ముఖ్యంగా తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి రమ్మని ఆహ్వానించిన జయధీర్‌తిరుమలరావుగారికి థాంక్స్‌ చెబుతామనుకున్నాను. ఎందుకంటే రాష్ట్రం విడిపోయాక ఇలాంటి సమావేశాలకి ఎవ్వరూ ఆహ్వానించని విషయం ప్రస్తావించి ‘నేను నలభైఏళ్ళుగా ఇక్కడే వున్నాను. నా పనంతా ఇక్కడే… భూమిక పుట్టింది ఇక్కడ… పెరిగింది ఇక్కడ.. వుండబోయేది ఇక్కడే.. భూమికను కలుపుకోండి’ అని చెబుదామనిపించింది. ఈ మాట చెప్పాలని అనిపించడానికి కారణం … గత సంవత్సర కాలంలో ఏ సాహిత్య సమావేశానికి భూమికను పిలవకపోవడమే. నాకు వొక్క ఆహ్వాదం కూడా అందకపోవడమే. నాలో సుళ్ళు తిరుగుతున్న భావాలను చెబుదామనుకున్నాను కానీ అవకాశం రాలేదు. అలా అని అక్కడ నన్ను వేరుగా చూసారని నేను చెప్పబోవడం లేదు. అందరూ చాలా స్నేహంగా, సరదాగా వున్నారు. తెరవే సెక్రటరీతో ఈ మాట అంటే ”అయ్యో! అలాంటి దేమీ లేదు మేడం… మీరు మాతో వుంటే మాకు చాలా బలం కదా!” అన్నారు. నామనసులోనే అనుమానాలున్నాయోమో ఏమో!!!

1.30కి సమావేశం ముగిసింది. అందరం భోజనాల వేపు వెళ్ళాం. పాఠశాల భవనంలో వంటలు చేసి వడ్డించారు. పప్పు, సాంబారు, బెండకాయ కూర, పచ్చడి… చాలా రుచికరమైన భోజనం. భోజనం చేసాక అక్కడికి పది కి.మీ దూరంలో వున్న బైర్‌పూర్‌ పెంటకి వెళ్ళి రమ్మని తిరుమలరావుగారు చెప్పారు. నాకు చాలా సంతోషమైంది. ఎందుకంటే అక్కడున్న చెరువు, ఆ చెరువు నిండా వుండే పెద్ద పెద్ద తామరపువ్వుల గురించి మనోజ చాలా సార్లు చెప్పారు. సెంట్రల్‌ యూనివర్సిటీ బ్యాచ్‌తో కలిసి బైర్‌పూర్‌ వెళ్ళాను. దట్టమైన అడవి గుండా జీప్‌ వెళుతోంది. బైర్‌పూర్‌ రాగానే చాలా మంది పిల్లలు కనబడ్డారు. ఆరేడు సంవత్సరాల వయసున్న పిల్లలు తప్ప అడాల్సెంట్‌ వయసు పిల్లలు దాదాపుగా ఎక్కడా కనబడలేదు. ఏమయ్యారో…. హాస్టల్స్‌లో వున్నరేమో… అడగాలి అనుకుంటుంటే ఓ పాడుపడిన ఆలయం, ఎదురుగా పెద్దపెద్ద తామారాకులు, అక్కడక్కడా తెల్లటి పూవ్వులతో కళకళలాడుతున్న చెరువు ముందు జీప్‌ ఆగింది. వావ్‌… అద్భుతం… ‘గుడి చాలా వరకు పాడుపడింది. విశాలమైన ఆవరణ గోడల్లోంచి చెట్లు మొలుచుకొచ్చాయి. గుడిలోపలికి గర్భగుడిలోకి వెళ్ళి చూస్తే శివలింగం, ఎదురుగా నందిబొమ్మ చెక్కు చెదరకుండా వున్నాయి. పూజల్లేవుకానీ సంవత్సరానికి ఒక సారి ఉత్సవం జరుగుతుందట… కర్నాటక

వాళ్ళు వస్తారు అని చెప్పారెవరో… అక్కడి నుండి చెరువు వేపు వెళ్ళాం. చాలా పెద్దగా వుంది. ఇద్దరు స్త్రీలు బిందెలతో నీళ్ళ ముంచుకుంటూ కనబడ్డారు. మాట్లాడడానికి ప్రయత్నించినా మాట్లాడలేదు. అందులో ఒకమె నిండుగర్భంతో వుంది. నీళ్ళ నింపుకుని వెళ్ళిపోయారు. అదే చెరువులో ఓ పక్క బట్టలుతుకు తున్నారు. మరోపక్క పశువులు కనబడ్డాయి. ఈ నీళ్ళే తాగుతామని వాళ్ళు చెప్పారు. నేను అక్కడున్న బండమీద కూర్చున్నాను సెంట్రల్‌ యూనివర్సిటీ నుంచి వచ్చిన కృష్ణగారు నా పక్కనే కూర్చున్నారు. మిగతా గ్యాంగ్‌ పువ్వులు కోసే ప్రయత్నంలో వున్నారు. అది చాలాలోతైన చెరువని, కిందంతా తామర తూడలు అల్లుకుపోయి వుంటాయని, పువ్వులు కోయబోయి చాలా మంది మునిగి చనిపోయా రని మాతోవచ్చిన స్థానికుడు చెప్పగానే నాకు వొళ్ళు జలదరించింది. పువ్వులొద్దులెండి… వచ్చేయండి అని గట్టిగా అరిచాను కానీ ఎవ్వరూ వినిపించునేలేదు. ఓ పెద్ద కర్ర సాయంతో ఓ పువ్వులాక్కొచ్చి నా చేతుల్లో పెట్టి ఫోటోలుతీసారు. పువ్వు భలేగా వుంది పెద్ద పెద్ద చేపలున్నాయ్‌ మేడం… అని చెబుతుంటే కృష్ణగారు పట్టుకోలేక పోయారా? ఇక్కడే కాల్చుకునేవాళ్ళం అని జోకులేసారు. ”వద్దులెండి… ఆ చెరువు చాలా లోతట… ప్రమాదమట … ఎలాంటి హెచ్చరికాలేదు. ”అడవి మేడం… ఇలాగే వుంటుంది… ఇంక వెళదామా” అన్నారు కృష్ణ. తిరుగు ప్రమాయాణంలో మళ్ళీ పిల్లలు కనబడ్డారు. చిన్న పిల్లల చేతుల్లో చిన్న చిన్న మూటలు.. బట్టలా? ఉతకడానికి చెరువు కెళతారు కాబోలు… ”హమ్మో!! అనిపించింది. ఏంచేస్తాం… అది వాళ్ళ జీవితం … సమాధానపడ్డాను.

మేం తిరిగి అప్పాపూర్‌ చేరేటప్పటికీ మనోజ కొంతమంది స్త్రీలతో మాట్లాడుతూ కనబడ్డారు. ”మేడం… మీరు మిస్‌ అయ్యారు.. ఈమె భయమ్మ… ఒక ఎన్‌సైక్లోపీడియా భలే మాట్లాడుతోంది అన్నారు. అయ్యో! అనిపించింది. అప్పటివరకు స్త్రీలెవ్వరు సరిగా మాట్లాడలేదు… వినివుండాల్సింది అనిపించింది. అంగన్‌వాడి సెంటర్‌ టీచర్‌ పార్వతమ్మ మాట్లాడింది. ఆమె భర్త చిన్న వయసులో చనిపోయాడట. అరుగురు పిల్లలు ముగ్గురిని హాస్టల్‌లో వేసి చదివిస్తోందట.. ఆమెకు ఈ సంవత్సరం బెస్ట్‌ అంగన్‌వాడీ టీచర్‌ అవార్డు వచ్చిందట… పిల్లల్ని బాగా చూసుకుంటుందట… ఆమెకు అభినందనలు చెప్పాను.

కృష్ణగారు చెంచుల చుట్టుగుడిసెని చూడాలనుకుంటున్నామని చెప్పగానే అక్కడే వున్న గురవయ్య మేనకోడలు నేను చూపిస్తానంది. నేను కూడా వాళ్ళతో వెళ్ళాను. ఆమె గురవయ్య గారింటికి తీసుకెళ్ళింది. క్రితం రాత్రి చీకటిలో చూసాను. ఫోటోలు తీసుకోలేదు. లోపలి కెళ్ళి చూసాం. పెద్ద వాళ్ళిద్దరూ కూర్చుని కనబడ్డారు. గుడెశలో సగంపైనా స్థలం పూజ కోసమే కేటాయించారు. రకరకాల

దేవుళ్ళు, పెద్దవాళ్ల ఫోటోలు అక్క డ అమర్చారు. ”మామయ్య వాళ్ళ నానమ్మ” ఓ ఫోటోని చూపించింది. వెంకటలక్ష్మి దేవుళ్ళ విగ్రహాలతో సమంగా పెద్దల ఫోటోలున్నాయక్కడ. ఓ పక్కగా ఇనపబీరువా, మంచం వున్నాయి. ”వంట బయట చేసుకుంటారు” అంది. పెద్దలిద్దరికీ నమస్కారం చెప్పి బయట కొచ్చాను. అప్పటికే నాతోవచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. వెంకటలక్ష్మి హాస్టల్‌లోవుండి చదువుకుంటోందట. ఇంటర్‌లో ఒక సబ్జక్ట్‌ వుండిపోయిందట. రాస్తుందట. ”బాగా చదువుకో మంచి ఉద్యోగమొస్తుంది. రిజర్వేషన్‌ వుంది కదా! కొంచం కష్టపడితే చాలుకదా” అన్నాను. ”ఉట్టిదే.. ఏమీ ఉద్యోగం రాదు. ఎస్‌టిలంటే చెంచులే కాదు.. లంబాడోళ్ళు, గోండోళ్ళు ఇంకా ఎందరో ఉన్నారు కదా! వాళ్ళకొస్తాయి. మా కెక్కడొస్తాయి” అంటూ ఫెడీల్మని కొట్టినట్టు చెప్పింది. నిజమే.. లంబాడా కమ్యూనిటీ చాలా చాలా ఎదుగుతోంది. అవకాశాలు చేజిక్కించుకుంటోంది. ఎస్‌టిలలో కూడా ఎ.బి.సి.డి ఉద్యమం వస్తుందేమో అనిపించింది వెంకటలక్ష్మి మాటలు విన్నాక. ఈ విషయాలన్నీ గురవయ్యతో చర్చించాలన్పించింది. ఆయన కల్పనా కన్నబిరాన్‌తో కలిసి సెంటర్‌ ఫర్‌ సోషల్‌ డెవలప్‌మెంటు అనే సంస్థలో పనిచేస్తున్నారు. ఆయనతో మాట్లాడితే చాలా విషయాలు అర్థమౌతాయినిపించింది. అప్పాపూర్‌ లాంటి గ్రామం నుండి ఆయన ప్రయాణం? ఎదుగుదల ఎలా సంభవించాయో… అలా ఎదిగిన మరెవరైనా స్త్రీలున్నారా అని కూడా ఆయననడగాలి.. ఇప్పుడు కాదులే.. ఆ తర్వాతైనా తెలుసుకోవాలి అనుకుంటూ మీటింగ్‌ స్థలం దగ్గర కొచ్చాను. దాదాపు అందరూ వెళ్ళిపోతున్నారు. నేను కూడా బయలుదేరుతానని మనోజకి, తిరుమలరావుగారికి, యాదయ్యగారికి చెప్పాను.

గురవయ్యగారికి వీడ్కొలు చెప్పి, అప్పాపూర్‌ అనుభావాన్ని భద్రంగా గుండెల్లో దాచుకుని, అందరికి బై చెప్పి వ్యూపాయింట్‌ వేపు వెళ్ళుతున్న జీప్‌లో ఎక్కేసాను. పృధ్విరాజ్‌ని కూడా ఎక్కమని చెప్పాను. ఓ అరగంట తర్వాత మహాద్భుతమైన వ్యూపాయింట్‌కి చేరాం. కిందికి చూస్తే… వావ్‌ …. పచ్చదనం జాలువారుతున్న లోయలాగా నల్లమల ఎదురుగా… పశ్చిమాకాశం… సింధూరవర్ణంలో మెరుస్తోంది. అడవి మధ్యలో హృదయాకారంలో ఓ చెరువు… అస్తమిస్తున్న ఎర్రటి సూర్యబింబం, ప్రతి బింబం చెరువులో రిఫ్లెక్టు అవుతోంది. అబ్బ! ఏమి సౌందర్యం… నేనా సౌందర్యపు మత్తులో మునిగి వున్నవేళ పృధ్విరాజ్‌ నాపక్కకొచ్చి ”ఎంత దారుణంగా వుంది మేడం” అన్నాడు. ”దారుణంగా? అదేంవ్యక్తీకరణ..” దారుణ మేంటయ్యా అంటే” ఏమోమేడం… చాలా బాగుంది. భలేగా వుంది. ఇవన్నీ నాకు చూపించినందుకు థాంక్స్‌ మేడం ”అన్నాడు. ఫోటో తియ్యమని అడిగితే తీసాను. నేను తీయించుకున్నాను. ఆ సంజవేళ.. కనుచూపు మేరంతా విస్తరించిన నల్లమల అందాన్ని, ఆ పచ్చదనాన్ని, ఆ చెరువుని, ఆ చెరువులోని ఏటవాలు కిరణాల్ని ప్రేమిస్తూ

ఉండిపోవాలనిపించింది. మేమెంత ఎతైన ప్రదేశంలో వున్నామో అర్థమై… ఇంతకు ముందు తెలియనే లేదు అని ఆశ్చర్యపడ్డాను. కింద కనిపించే దంతా ఆత్మకూరు అడివట… ఎవరో అంటున్నారు. ”మేడం! వెళదాం! లేటవుతుంది” కృష్ణగారు పిలిచారు. ”అయ్మో !

ఉండండి … సరిగా చూడనే లేదు” అంటే ఎంత చూసిన అదేసీను కదండి” అనేసాడు. అదేసీనా? అంతేనా? చూసిన ప్రతిసారీ నాకెందుకు భిన్నంగా కనబడుతోంది ఆకుపచ్చటి కొలనులో పూసిన తెల్లకలువలాగా చెరువు కనబడుతోంది ఒక సారి. మరోసారి నల్లమల హృదయంలా కనబడుతోంది. సూర్యుడు కిందికి జారుతుంటే ఆ వెలుతురులో ఎన్ని భిన్నమైన రంగులు కనబడుతున్నయ్‌… ఆ రంగులు కిందపరుచుకున్న పచ్చదనం మీద ఎంత సుందరంగా రిప్లెక్ట్‌ అవుతున్నాయి. ఆ సాయం సంధ్యలో అక్కడే.. అలాగే కూర్చుని ఆ నిశ్శబ్దాన్ని ఆవాహన చేసుకోవాలనిపించింది. కాని ఉరుకులు… పరుగులు… ఇక్కడకూడా… మనుష్యులింత యాంత్రికంగా ఎలా వుండగలరా? అని ఆశ్చర్యపడుతూ… లోయమీద చంచలంగా, సంబరంగా తిరుగుడుతున్న చూపుల్ని బలవంతంగా లాక్కొచ్చి జీప్‌ ఎక్కాను.

రెండు రోజులుగా నాతో పెనవేసివున్న అడవిని వొదిలే క్షణాలు దగ్గరపడే కొద్దీ లోపలేదో దిగులు కమ్మినటైంది. మళ్ళీ వస్తాను… రావాలి అనుకుంటూ డ్రైవర్‌ నరశింహ ఫోన్‌ నెంబరు తీసుకున్నాను. ”నిజంగా మళ్ళీ వారం వస్తారా” కృష్ణగారి ప్రశ్న… ‘వచ్చేవారం కాకపోతే పైవారం నా ఫ్రెండుతో కలిసి వస్తాను మళ్ళీ” అన్నాను. అడవికి వీడ్కొలు చెప్పలేదు… మళ్ళీవస్తాగా…

మేం గేటు దగ్గరికి వచ్చేటప్పటికే, కొంచం ఆలస్యంగా వస్తామని చెప్పిన తిరుమలరావుగారు, మనోజ యాదయగార్లందరూ వచ్చేసారు. అందరం కలిసి గెస్ట్‌ హౌస్‌కి బయలుదేరాం. నారూమ్‌ కెళ్ళి బ్యాగ్‌ తీసుకుని మనోజగారికి నా కాంట్రిబ్యూషన్‌గా కొంత మనీ ఇచ్చి నా కారులో హైదరాబారు బయలుదేరాను. అప్పటికి టైమ్‌ ఎనిమిదైంది పృధ్విరాజ్‌ని అడిగాను వెళ్ళిపోదామా?  కొన్ని చోట్ల రోడ్లు బాలేదు. వర్షం పడుతోంది.. జాగ్రత్తగా వెళ్ళతావా? ”అంటే… ”మీ ఇష్టం మేడం… నేను జాగ్రత్తగా మిమ్మల్ని తీసుకెళతానన్నాడు.”

సన్నగా వానపడుతోంది. బయలుదేరాం. ”పాపం! మేడం… ఆ చెంచులేంటి మేడం.. అంత అన్యాయమా? నీళ్ళులేవు… కరెంట్‌లేదు.. ఓ డాక్టరులేడు. మందుల కొట్టులేదు. చాలా ఘోరం ”అంటూ మాట్లాడడం మొదలుపెట్టాడు పృధ్విరాజ్‌” తెలంగాణ గవర్నమెంటొచ్చింది కదా! వాళ్ళకేమైనా చెయ్యొచ్చు కాదా! వాళ్ళని అక్కడి నుండి పోమ్మంటున్నరంట ఒకాయన నాతో చెప్పాడు వాళ్ళను తరిమేయాలనీ ఏమీ ఇవ్వడం లేదట. నేనెప్పుడూ ఇలాంటోళ్లను చూళ్ళేదు. నాకు ఇవన్నీ చూపించారు థ్యాంక్స్‌ మేడం!” అతని బాధ నాకు అర్థమైంది. అతనూ ఎస్‌.టీనే. లంబాడా… తన తోటి ఎస్‌.టి లైన చెంచుల దుర్భర జీవన స్థితి అతన్ని కదిలించిందనిపించింది.

మధ్యలో ఒక ఢాబాదగ్గర డిన్నర్‌ చేసాం. మాగన్నుగా నిద్ర… నిద్రలోనే ఆలోచనలు. అడవి… చెంచు స్త్రీలు… బురదగుంటల్లోంచి మంచి నీళ్ళు, చుట్టు గుడిశెలు, దీర్ఘ జ్వరాలు, ఖంగుఖంగున దగ్గులు నవ్వురాల్లేని నిస్తేజమైన ముఖాలు, చావుకి బతుకుకి వెరవని జీవితాలు… ఎన్నోసార్లు అయితేనేం చస్తాం అని చెప్పిన మాటలు.. మాకు అడవే దేవుడు.. చెట్టే దేవత… మేమే దేవుళ్లం… మేమే దెయ్యాలం… అడవి వదిలితే పట్నం మమ్మల్ని మింగేస్తుంది… మేము ఏడకీ రాం.. ఏడంతస్తులు మాకెందుకు? మా గుడిశే చాలు ఈడనే సస్తాం కానీ యాడికీ పోం… మాటలు, మాటలు, దుఃఖం నిండిన గొంతులు.. సంతోషం వ్యక్తం కానీ ముఖకవళికలు… కారు సడన్‌ బ్రేకుతో కళ్ల ముందు దృశ్యాలు చెదిరిపోయాయి.

”ఏమైంది?” ”రోడ్డు వేస్తున్నారు కదా! ఎక్కడ డైవర్షన్‌ వుందో బోర్డే లేదు… వర్షంలో సరిగా కనబడలేదు” అన్నాడు పృధ్విరాజ్‌. ”జాగ్రత్తగా వెళ్ళు… ” అని చెప్పి మళ్ళీ కళ్ళ మూసుకున్నాను. నా ఫోన్‌ కోసం వెయిట్‌ చేసినట్టుంది ప్రశాంతి మెసెజ్‌ చేసింది. వచ్చేస్తున్నానని తిరిగి మెసేజ్‌ ఇచ్చి బయటకు చూస్తే కడ్తాల్‌ దాటుతున్నం … వచ్చేసాం లే… అనుకుని కళ్ళు మూసుకున్నాను.

నగరంలోకి వచ్చాకా చాదర్‌ఘాట్‌ దగ్గర జనసంద్రంలో ఇరుక్కుపోయాం. ఈ రోడ్డు ట్రాఫిక్‌కి మూసేసి కోఠీవైపు వెళ్ళమంటే సరిపోయేది… అలాంటి దేమీ లేదు. పోలీసుల్లేరు. అరగంటపైగా ఆగిపోయాం. 100 కి కాల్‌ చేసి కంప్లయింట్‌ ఇచ్చాను. బోనాల ఊరిగింపు రేపుకదా! ఈ బీభత్సమేంటి? ఒకమ్మాయి లారీ మీదెక్కి మంటల చక్రంతో విన్యాసాలు చేస్తోంది. ఎక్స్‌పోజింగ్‌ డ్రస్‌లో వుండడం… నిప్పుతో చెలగాటం జనాలు సెల్‌ఫోన్లతో మూగిపోయారు. ఏవేవో ఆకారాలతో ఊరేగింపు.. ఫాన్సి డ్రస్సులేసుకున్నట్టు మనుషులు ఏవోవో ఆకారాలతో చిందులేస్తున్నారు. ”’ఇదేంటి మేడం! ఈ ఆకారాలేంటి? శబ్దాలకి చెవులు పోతున్నాయ్‌… ఆ అమ్మాయేంటి లారీ ఎక్కి అలా ఎగురుతుంది… ఇదేం బోనాలపండగ” అంటున్నాడు పృధ్విరాజ్‌ ఈ పండగ చేసుకోమని పదికోట్లుచ్చాడుగా కె.సి.ఆర్‌… ఖర్చు చెయ్యాలిగా” అన్నాను ”పదికోట్లా… అంతడబ్బు ఇలాంటి వాటికా? నిజంగా అంత డబ్బిచ్చాడా మేడం” అన్నాడు అనుమానంగా. ”నేను పేపర్లో చదివాను… ఇచ్చేవుంటారు” అన్నాను. ”అన్యాయం మేడం … అక్కడ చెంచోళ్ళకి తాగనీకి నీళ్ళు లేవు… రోగమెస్తే దవాఖానలేదు.. వాళ్లకీయొచ్చు కదా! మనం చూసిన బాయి బాగుచేయించొచ్చు కదా!” ఎంత కరక్టుగా చెప్పాడు… ఒక డ్రైవర్‌ … ఎంత లోతుగా ఆలోచించాడు. చెంచులు అతని గుండెల్లో నిలిచి పోయారనిపించింది నాకు. ”నిజమేకానీ.. అలా చెయ్యరు… నీలాగా ప్రభుత్వం ఆలోచిస్తే ఎవ్వరికీ సమస్యలుండవు”… అన్నాను” మేడం! మీరు ఫోన్‌ చేసారు కదా! పోలీసులు వచ్చారుచూడండి…” నిజమే పెద్ద తాడుతో పోలీసులు కన్పించారు అప్పటికి మేల్కొని వుంటారు.. ట్రాఫిక్‌ కదిలింది మైకు లోంచి మాటలు వినిపిస్తున్నాయ్‌…” జై శ్రీరామ్‌ అనండి.. నుదిటి మీద బొట్టు పెట్టు కోండి. హిందువులుగా పుట్టినందుకు గర్వపడండి.. ఇలాంటి పండగలప్పుడు రోడ్ల మీద కొచ్చి మన బలాన్ని చూపించండి. హమ్‌సే జో ఠకరాయేగా ఓ మిట్టీ మే మిల్‌ జా యేగా… .జై శ్రీరామ్‌ …..” ఇలా ఉద్రిక్తంగా సాగుతోంది ఉపన్యాసం. ఇసకేస్తే రాలనంత జనం…. డి.జెల మోత… బొమ్మలాటలు.. ఎదురుగా రాముడి బొమ్మ. సీతా, లక్ష్మణ సహితంగా వుండే  రాముడిని విడగొట్టి కండల వీరుడిగా, చేతిలో విల్లంబులు ధరించిన ధీరుడిగా, ముఖంలో ప్రశాంతతకి బదులు అసహనాన్ని  చూపించిన విగ్రహం. జనాలందరూ జై శ్రీరామ్‌ అంటూ చిందులు. మొత్తానికి ఓ అరగంట తర్వాత మేము ఆ జనప్రవాహంలోంచి బయటపడ్డాం.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో