మద్యం మీద పోరాటానికి మహిళలే ముందుకు రావాలి- సిహెచ్‌. మధు

ఒక గ్రామంలో మహిళలంతా కల్సి షాపును చిందర వందర చేసి మద్యం సీసాలను రోడ్డుమీద పగులగొట్టారని అప్పుడప్పుడు కథలు వ్రాసాను. కానీ నిజం చూడలేదు, ఇటువంటి నిజం చూస్తాననీ నమ్మకం కూడా లేదు. అయితే ఒకటి నిజం. మొత్తం మహిళా లోకానికి మద్యం అంటే అసహ్యం. కోపం. తగులబెట్టాలన్నంత కోపం వారి అంతరాలలో ఉంటుంది. కానీ పురుషాధిక్య సమాజానికి తలవంచినట్టు – మద్యం త్రాగే మగవాళ్ల కంపును భరిస్తున్నారు. మద్యం వ్యాపారంలో బ్రతుకుతున్న ప్రభుత్వాన్ని భరిస్తున్నారు. ఏమి చేయగలరు? – మద్యం మహిళల పాలిట శాపమే కాదు ఈ సమాజం పాలిట శాపం. ఈ జనం ఆరోగ్యం పట్ల శాపం. శాంతియుత సమాజానికే శాపం.

అయితే – రెండు రోజుల క్రితం రెండు వార్తలు చూశాను. ఈ వార్తలతో ఒరిగేదేమీ వుండకపోవచ్చు. మార్పు ఏమీ రాకపోవచ్చు. కానీ మామూలు చైతన్యానికి నిదర్శనంగా మహిళలలో వస్తున్న పోరాట ధోరణి కొంత సంతృప్తినీయవచ్చు. భవిష్యత్తు మీద కొంత ఆశ కల్గించవచ్చు. ఈ రెండు వార్తలు మహిళాలోకానికి కొంత స్ఫూర్తి కల్గించవచ్చు. ఆలోచనలలో పోరాట ధోరణి కల్గించవచ్చు. ఈ రెండు వార్తలు ఒక మెట్టుగా పనిచేయవచ్చు తప్ప మద్యం వ్యతిరేక పోరాటానికి దారితీయకపోవచ్చు. ఆ వాతావరణం రావాలని కోరుకోవటమే కానీ ఇప్పుడిప్పుడే రాకపోవచ్చు.

ఒక వార్త

ఆదిలాబాద్‌ జిల్లా భైంసా మండలంలోని మాట్‌గాం గ్రామ ప్రజలు సర్పంచ్‌ నేతృత్వంలో ఒక తీర్మానం చేసారు. గ్రామంలో పూర్తిగా మద్యనిషేధాన్ని అమలు పర్చాలి. ఎవరూ మద్యం త్రాగకూడదు. ఎవరూ మద్యం అమ్మకూడదు.

రెండో వార్త

తెలంగాణా ప్రభుత్వం చీఫ్‌ లిక్కర్‌ మద్యాన్ని తీసుకు రావాలనుకుంటోంది. గ్రామాలలోకి చీఫ్‌ లిక్కర్‌ రాగానే షాపులను సీసాలను విధ్వంసం చేస్తాం.

మొదటి వార్తకు నేపథ్యం పూర్తిగా మద్యం మీద వ్యతిరేకత. గ్రామప్రజల ఏకగ్రీవ తీర్మానం. గ్రామం చిన్న గ్రామం కాదు. 295 కుటుంబాలున్న గ్రామం 1150 జనాభా వున్న గ్రామం. నాకు తెల్సినంతలో నా అంచనా ప్రకారం ఒక గ్రామంలో మద్యానికి దూరంగా వున్న కుటుంబాలు పదిశాతం మించి వుండకపోవచ్చు. మద్యం త్రాగేవారు పూర్తిగా మగవారే. మహిళలలో ఒకటి అరశాతం త్రాగితే త్రాగవచ్చు. మగవారిలో పదిశాతం త్రాగకపోవచ్చు. మిగతావారు ఏదో ఒక మద్యం త్రాగుతుంటారు. బీరు, విస్కీ, కల్తీ కల్లు, నిషేధించిన గుడుంబా, సారా ఏదో ఒకటి త్రాగుతుంటారు. కొందరు చిత్తుగా త్రాగుతారు. కొందరు మత్తుగా త్రాగుతారు. కొందరు లిమిట్‌గా త్రాగేస్తారు. ఎలా త్రాగినా పైకి ఏమీ అనకున్నా- మహిళల మనసులలో ఈ త్రాగుడు యిష్టంగా వుండదు. అంతరంగికంగా అసహ్యించుకుంటారు. అయినా తప్పని సరిగా తలవంచుతారు. ఎందుకంటే ఎంత చదివినా- ఎంత ఎదిగినా- ఇప్పటకీ మహిళల బ్రతుకులు తలవంచే బ్రతుకులే. రాజీపడే బ్రతుకులే. స్త్రీ స్వాతంత్య్రం గూర్చి సరిక్రొత్తకోణంలో మారిన-మారుతున్న ప్రపంచకోణంలో అర్థం చేసుకోవల్సిన అన్వయించాల్సిన అవసరముంది.

భైంసా మండల మాటేగాం గ్రామ ప్రజల తీర్మానం ఆదర్శమైనది. అమలులో పెడితే చరిత్రలో నిలుస్తుంది. అది అమలులో పెట్టటం వాళ్లకు సాధ్యం కాదు. ఈ గ్రామ ప్రజలకే కాదు మద్యం సీసాలను ధ్వంసం చేస్తామన్న మహిళలకు కూడా అది సాధ్యం కాదు. ఎందుకంటే ఈ వ్యవస్థ స్వరూపం అలాంటిది. ఈ వ్యవస్థ వ్యాపారం అలాంటిది. ఈ వ్యవస్థ దోపిడీ అలాంటిది. ఈ దోపిడీ వ్యవస్థలో మగవారితో సమానంగా ఎదిగిన మహిళల అభిప్రాయాలకు ఆలోచనలకు విలువలేదు. ఎందుకు ఆచరణలో సాధ్యం కాదో ముందు ముందు చెపుతాను. ఈ సందర్భంలో మాటేగాం ప్రజలు మద్యపాన నిషేద అవసరాన్ని గుర్తు చేస్తూ కొన్ని నిజాలు చెప్పారు. ఈ నిజాలు ఆ ఒక్క గ్రామంకే కాదు. అన్ని గ్రామాలకు అన్ని నగరాలకు వర్తిస్తుంది.

”మద్యం మహమ్మారిలా గ్రామంలో సమస్యలు నెలకొంటు న్నాయి. తగాదాలు పెరుగుతున్నాయి. మందుబాబులు పగలు రాత్రి అనే తేడా లేకుండా మద్యానికి అలవాటు పడ్డారు. అతిగా మద్యం త్రాగి చాలామంది అస్వస్థతకు గురి అయ్యారు. ఇది వారు చెప్పిన వాస్తవం. తీర్మాన రూపం.. నిజానికి ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా తీసుకొన్న నిర్ణయంగా చెప్పవచ్చు. ఒక సాహసోపేత నిర్ణయంగా ఆ గ్రామ ప్రజలను ప్రశంసించవచ్చు. వారంతటవారే స్పందించి- బాధపడి తీసుకొన్న నిర్ణయం కనుక కచ్చితంగా ఆచరణలో పెడితే తెలుగు రాష్ట్రాలలో ఆదర్శగ్రామంగా వుంటుంది. అది సాధ్యమా?- అయితే ఇందులో కొసమెరుపు ఒక ఆనంద విషయం చెప్పాలి. ఆ గ్రామ సర్పంచు ఓ మహిళ.

తమ వూరులో త్రాగుడు మూలంగా ఇన్ని అనర్థాలున్నాయని అందుకే మద్యనిషేధాన్ని అమలు చేస్తున్నామని ఒక గ్రామం తీర్మానం  చేయటం చాలా గొప్పదే అయితే వాళ్లు చెప్పిన అనర్థాలే వున్నాయా?- ఈ ‘త్రాగుడు’ మూలంగా రెండు తెలుగు రాష్ట్రాలలో (ఈ రాష్ట్రాలలోనే కాదు మద్యపానం జోరుగా అమలు చేస్తున్న అన్ని రాష్ట్రాలలో) ఎన్నో అనర్థాలున్నాయి. అసలు మనదేశంలో సర్వ అనర్థాలకు మద్యం త్రాగుడే కారణం. ముఖ్యంగా మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలకు, చిత్రహింసలకు, రేప్‌లకు, కుటుంబ కలహాలకు, విడాకులకు మద్యం త్రాగుడే కారణం. స్త్రీలపై అత్యాచారాలకు త్రాగుడే కారణమనేది నిర్థారణ. ఇంకా చాలా లోతుగా ఆలోచిస్తే- మగవారితో స్త్రీలు సమానంగా ఎదిగినా అన్ని రంగాలలో వారిని మించిపోయినా, ఈ మద్యం మూలంగా ‘పురుషాధిక్యత’ సమాజంలో కొనసాగుతుంది. నిజంగా మద్యం నిషేధిస్తే పురుషాధిక్యత తగ్గటానికి అవకాశముంది. భార్యాభర్తలు ఇద్దరు సంపాదిస్తున్నా- సమానంగా సంపాదిస్తున్నా- భర్త కంటే భార్య ఎక్కువ సంపాదిస్తున్నా- భర్త మద్యం త్రాగటం మూలంగా ఆధిక్యుడయిపోయాడు. సమాజ నీతి అలావుంది. త్రాగటాన్ని స్త్రీలంతా అసహ్యించుకున్నా ఒక మాట ఈ సమాజంలో వుంది. ఆ మాటను స్త్రీలు కూడా ఎదిరించటం లేదు. పురుషులకు మద్యం త్రాగే హక్కు వుంది. త్రాగి వచ్చి తిట్టే హక్కు వుంది. కొట్టే హక్కు వుంది. పురుషునికున్న ఈ హక్కును ఆధునిక స్త్రీలోకం గుర్తిస్తూ వుంది. ఇదొక వింత. ఇది గుర్తించటమంటే-పురుషాధిక్యతను గుర్తించినట్టే లెక్క. ఆధునిక ప్రపంచంలో పురుషాధిక్యత ఇలా జెండా ఎగిరేస్తూవుంది. ఇక్కడొక వింత చెప్పాలి. ఈ సమాజపు పురుషకోరలు చూపించాలి. మగవాడు త్రాగి తందానా ఆడుతున్నా తప్పులేదు. వాడు మగవాడు! ఒక స్త్రీ అలా చేసిందనుకోండి! ‘ఛీ ఆడదానికి బుద్ధి లేదు’ అనేస్తారు. త్రాగినా లోపల్లోపల త్రాగాలి. మగవాడు ఎక్కడ త్రాగినా రోడ్డు మీద త్రాగినా రోడ్డు ప్రక్క త్రాగినా ఫర్వా లేదు. కల్సి జల్సాలు చేసుకున్నా – విందులు చేసుకున్నా పండుగ చేసుకున్నా – త్రాగి తిట్టినా కొట్టినా రేప్‌ చేసినా మాఫీ ఎందుకు? ‘త్రాగినోడు’ అంటారు.

సమాజం వేల కోట్ల రూపాయలు త్రాగుడుకు ఖర్చు చేస్తూ వుంది. మద్యం త్రాగటం మూలంగా డబ్బు నష్టం. ఆరోగ్య నష్టం.. మనసు నష్టం.. సంసార నష్టం. సంసారంలో శాంతి నష్టం. ఇంత నష్టం భరిస్తూ త్రాగుడు ఎందుకు?

ఏ కష్టాలు ఎలా వున్నా ‘మగవాడు’ మద్యం త్రాగటం వలన స్త్రీ ఎన్నో అవమానాలకు, అభద్రతకు, చిత్రహింసకు గురి అవుతూ వుంది. ఈ విషయం స్త్రీ లోకం గుర్తించాలి. స్త్రీ లోకమే ఎదిరించాలి.

ఒక మహిళా సర్పంచు ఒక మామూలు మహిళ చైతన్యవంతమైన ప్రకటన చేసినంత మాత్రాన పెద్ద మార్పు కాదు. వాళ్ల ఆశ-ఆలోచన- అమలులోకి కూడా రాకపోవచ్చు. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు మద్యాన్ని ప్రోత్సహిస్తున్నాయి. మద్యం ఆదాయమే ప్రభుత్వం ఊపిరిగా మారింది. ప్రజలు ఏమైతేనేమి? రోగాల పాలవుతేనేం… స్త్రీలు చిత్రహింసలకు గురైతేనేం.. వారికి అంటే సర్కారుకు ఫర్వాలేదు. నీతి-అవినీతి ఇక్కడే వుంది. పరిపాలకులు ఎంత దుర్మార్గులో అర్థమైతుంది. ప్రభుత్వాలు ఆదాయం కొరకే మద్యాన్ని ప్రోత్సహిస్తున్నారనేది ఎంత నిజమో- మనకు తెలియని ఇంకో నిజముంది. సహజంగా ఇప్పటి పరిపాలకులు దారి తప్పారు. ప్రజలను మద్యంలో ముంచితే తమను ప్రశ్నించరని సర్కారు ధీమా.

మహిళలు తమ హక్కుల కొరకు, పోరాటాల కొరకు ఎన్నో సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. పోరాడుతున్నారు. కానీ అతిహేయమైన, సామాజిక విషయమైన మద్యం పోరుకు ఒక్క సంఘాన్నైనా ఏర్పాటు చేసుకోలేదు. నాకైతే కనబడలేదు.

ఒక్క హెచ్చరిక చేసి ఈ వ్యాసం ముగిస్తాను.

మహిళలు పురుషులకంటే ఎంత ఎదిగినా ఎన్ని రంగాలనేలినా, ఎంత ప్రతిభావంతంగా తమ జెండాను ఆకాశంపై ఎగిరేసినా- ఈ త్రాగుడువున్నంత సేపు మగవాడి క్రింద బానిసగానే బ్రతకాల్సి వుంటుంది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.