ప్రకృతి – జీవనం – వ్యవసాయం : అవగాహన – – డా|| వెంకట్‌

పర్మాకల్చర్‌, సేంద్రీయ వ్యవసాయం, సుస్థిర వ్యవసాయం మొదలైన పదాలన్నీ చాలా కనబడుతుంటాయి. కానీ అసలు వ్యవసాయం అంటే ఏమిటి అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మానవ సమాజంలో వ్యవసాయంలోని సామాజిక నైతిక విలువల్ని తిరిగి తీసుకురావాలనే తపనకి పర్యాయపదమే పర్మాకల్చర్‌, అంటే పర్మనెంట్‌ అగ్రికల్చర్‌, శాశ్వత వ్యవసాయం. ఏదైనా ఒక సమస్య వచ్చినపడు, మనం బైటకి వ్యక్తమయే చిహ్నాలను మాత్రం గమనించి, దానికి పరిష్కారాలు వెతుకుతాం. అంతే కానీ సమస్యను లోతుగా సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించము. ఒక సమస్యకు అంతర్లీనంగా ఎన్నో కోణాలుంటాయి. ఉదాహరణకి, విద్యుత్‌ శక్తి తక్కువ ఉత్పత్తి అవుతుంది అనుకుంటే ప్రత్యామ్నాయంగా అణుశక్తి గురించి మాట్లాడడం మొదలుపెట్టాము. ఇది ఖరీదైన ప్రక్రియేకాక, దీని విష పరిణామాలు 20000 ఏళ్ళ వరకు భూమిని బండబారుస్తాయి. మన ప్రాధాన్యతలు, వాటి లోతుపాతులు, ఔచిత్యం మొదలైనవన్నీ కూలంకషంగా నిర్థారించుకుని సమాజ గతిని నిర్ణయించుకోవాలి. మానవజాతి చేసిన మరో తప్పుడు ఆలోచన – ప్రపంచంలోని అన్ని సమస్యల్ని మనం పరిష్కరించగలమనే అపోహ. వ్యవసాయం – ఆహార కొరత – ఆకలి సమస్యలు తీసుకుంటే, మనం పరిష్కారదిశలో ఎంత ముందు కెళ్ళగలిగాం?

ధాన్యాల్ని ఎగుమతి చేయగలిగితే సమస్య తీరిపోతుందనే ఆలోచనా దృక్పథంలో ఉన్నాం. అభివృద్ధి చెందిన పశ్చిమ దేశాలలోనూ ఆకలీ, దారిద్య్రం ఉన్నాయనే విషయం గమనించకుండా, వాటి విధానాలనే గుడ్డిగా అనుకరిస్తున్నాం. ఈ సమస్యలు పరిష్కరించగలిగితేనే మానవజాతి పురోగమించ గలుగుతుంది. లేదా అవే వినాశన కారకాలవుతాయి.

వ్యవసాయం గురించి ఆలోచించాలంటే కొన్ని ప్రామాణిక సూత్రాలను అర్థం చేసుకోవాలి. ఈ భూగోళంపై చరిస్తున్న ఏ ప్రాణీ, మానవులతో సహా, తమ శరీరాలను తింటూ జీవించలేవు. అన్ని జీవితావసరాలను బయట ప్రపంచం నుంచే పొందాలి, అంటే మన చుట్టూ అల్లుకుని వున్న పర్యావరణం నుంచి. మానవ మస్తిష్కం కనిపెట్టిన సాంకేతిక పరిజ్ఞానం ఈ ప్రాథమిక సూత్రాన్ని ఎప్పటికీ అధిగమించలేదు. ఇది ప్రకృతి సహజం. ప్రకృతి నియమం. జీవన శాసనం. ఈ నిజాన్ని అర్థం చేసుకుంటే గాలి, నీరు, నేల, ప్రాణంతో నిండిన పర్యావరణానికి, మనకు ఉన్న సంబంధాన్ని మనం గుర్తించగలుగుతాము.

అన్ని జీవులు, జంతుజాలం జీవించడానికి ఏకైక ఆధారం చెట్లు, చేమలు. ఏ విజ్ఞానశాస్త్రం దీనికి మించి ఏ సాధనం, ఆధారం కనుగొనలేకపోయింది. అన్ని జీవ పదార్థాలు ఈ పచ్చని ప్రకృతి నుంచే ప్రారంభమైనాయి. వృక్షసంపద ప్రాణాధారం. జీవనాధారం.

అయితే చెట్లు, మొక్కలు కూడా జీవపదార్థాలే. అంటే ఇందాక అనుకున్న సూత్రం ప్రకారం అవి కూడా జీవించడానికి బయటి ప్రకృతిమీదే ఆధారపడాలి. అవి నేల, గాలి, నీరు, సూర్యరశ్మి మొదలైనవి.

ఈ మూడు ప్రాథమిక సూత్రాలను కలిపి చూస్తే, మానవ జాతికి భూమి పరిరక్షణ బాధ్యత ఎంత ఉందో మనకి అవగత మౌతుంది. మానవులుగానీ, ఇతర ప్రాణికోటిగానీ నిరంతరంగా భూమిపై సంచరించగలగాలంటే, మానవజాతి భూమిని కాపాడుకో వాలనేది తప్పించుకోలేని వాస్తవం. ఈ జీవ చక్ర నియమావళి నుంచే మానవులు తమ మనుగడ విలువల్ని బేరీజు వేసుకోవాలి. భూమి, నీరు, ప్రకృతి పర్యావరణాల్ని కాపాడుకుంటే తప్ప మానవులు తమ మనుగడ కొనసాగించలేరు.

అయితే మనం ఏం చేశాం? ఏటికేడాది చెట్లు పచ్చిక బయళ్ళు పూర్తిగా అంతరించిపోతున్నాయి. నదీజలాలు కలుషితమై పోయాయి. అఖరికి సూర్యరశ్మి కూడా దుష్ట్రభావాలు కలగజేసే పరిస్థితికి వచ్చాం. ప్రకృతిపై అన్ని విధాలా చేయగూడని దాడులు ఎన్నో చేశాం. ఈ మానవ చరిత్ర గతిని అర్థం చేసుకుని సరిదిద్దాలంటే ప్రకృతి పట్ల వినమ్రత, అణుకువ అలవర్చుకోవాలి. ఉదాహరణకి ఒక్క యూనిట్‌ ఇంధన శక్తి ఉత్పత్తి చేయాలాంటే మనం 10 యూనిట్లు శక్తిని ఖర్చు పెడుతున్నాం. ఈ విధంగా ఎక్కువ కాలం సాగలేదు. ప్రస్తుత పారిశ్రామిక ఉత్తత్తి ప్రక్రియలో మనం భవిష్యత్‌ తరాలవారి సంపద పూర్తిగా కొల్లగొడుతున్నాం. వారి అనుమతి లేకుండా హరించి వేస్తున్నాం.

ప్రపంచ చరిత్రలో గత 50 సంవత్సరాల్లో ఉత్పత్తి చేసినంత ఆహారపు రాశులు, అంతకు ముందెపుడూ ఉత్పత్తి కాలేదు. ఆహారపు పర్వతాల్ని, క్షీరసాగరాల్ని ఉత్పత్తి చేశాం. అయితే ఆకలి సమస్య తీరిందా? ఇప్పుడు ప్రపంచపు నలుమూలలకి వ్యాపించిన భయంకరమైన ఆకలి సమస్య కూడా మునుపెన్నడూ లేదు. ఈ పరిస్థితిలో మరింత ఆహారాన్ని ఉత్పత్తి చేసినా, ఆకలి సమస్య తీరుతుందనే నమ్మకం ఏమిటి?

అయితే  ఇలా ఎందుకు జరిగింది? ఎందుకంటే, ఆహారానికి ఉన్న ముఖ్యమైన విలువ ఆకలి తీర్చడం. అది దాని సహజకార్యం. అయితే ఆకలి తీర్చడమనే ప్రాథమిక లక్ష్యం పూర్తిగా దెబ్బతిని, మరెన్నో ఇతర కార్యకలాపాలు దీనిలో చేర్చబడ్డాయి. కాబట్టే ఆకలి తీర్చడమనేది ఇపుడు మన లక్ష్యం కాదు. ప్రస్తుత సామాజిక రాజకీయ వ్యవస్థలో ఆహార ఉత్పత్తి, అమ్మకాలు, పంపిణీ మొదలైనవన్నీ లాభాలనార్జించే వ్యాపార సాధనాలు. లాభాలు, అధికారం, నియంత్రణ, బానిసత్వం మొదలైన ఎన్నో నైతిక ప్రయోజనాలకు ఆహార ఉత్పత్తి సాధనమైంది. ఈ వ్యవస్థకి ఉన్న ఆకలి లాభార్జన. కాబట్టి ఆకలి సమస్యను కొనసాగించడమే లాభార్జనకు మార్గమైంది. అయితే ఆహార ఉత్పత్తి దానికదే ఒక లక్ష్యం కాకూడదు. వ్యవసాయానికి ఒక సాంఘిక బాధ్యత ఉంది. మనం భవిష్యత్తు కోసం ఒక ఉత్తమ జగతిని ఊహించవచ్చు, నిర్మించవచ్చు. ఇది కష్టసాధ్యమే అయినా, మానవులు తప్పించుకోకూడని బాధ్యత. ఎందుకంటే మానవాళి ఆకలి తీర్చలేని వ్యవసాయం, ఆహార ఉత్పత్తి అసలు ఎందుకు?

వ్యవసాయం చెట్ల ఆధారంతో భూమి మీద సాగించే ఆహార ఉత్పత్తి ప్రక్రియ. మొక్కలకి కూడా నేల, నీరు, పోషక పదార్థాలు కావాలి మనుషులకిమల్లె. ప్రకృతిని, భూమిని మానవులు పరిరక్షించే పనిలో కొన్ని ముఖ్య విషయాలను గ్రహిం చాలి. భూమి నిరంతరంగా ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కోల్పోకూడదు. ఉత్పత్తి ప్రక్రియ కొనసాగించాలి. ఉత్పత్తి ప్రక్రియ ఏ విధంగా అదే పనిగా కొనసాగగలుగుతుంది? భూసారాన్ని పెంచడంతోటే అది సాధ్యపడుతుంది. సర్‌ అల్బర్ట్‌ హోవార్డ్‌ అన్నట్లుగా, ”భూసారాన్ని కాపాడుకునే విధంగా మానవులు తమ కార్యకలాపాల్ని నిర్దేశించుకోవాలి. కీలకమైన ఈ ప్రశ్న మీదే నాగరిక సమాజ భవిష్యత్తు ఆధారపడి వుంది.” గమనించాల్సిన ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. భూమి, చెట్లు, జంతువులు, మానవులు కూడా పరస్పర సంబంధమున్న గొలుసుకట్టులో భాగాలే. ఎక్కడైనా ఏ కీలక సంబంధమైనా చెడితే, గొలుసు చెదిరిపోతుంది. ముక్కలౌతుంది.

వ్యవసాయంలోని ముఖ్య సమస్యలకి మనం ఏనాడూ ప్రాధాన్యతనివ్వలేదు. 90 శాతం ప్రజలు (భూమిలేనివారు కాక) పూర్తిగా మెట్ట ప్రాంతాలలో నివసించే చిన్న, సన్నకారు రైతులే. అయితే వీరి సమస్యలు వ్యవసాయ అజెండాలకి ఎంతవరకు వచ్చాయో సమీక్షించుకోవాలి. ఈ వ్యవస్థ మానవీయమైనదా/అమానవీయమైనదా అని ప్రశ్నించుకోవాలి. అట్లాగే భూసార పరిరక్షణ అతి ముఖ్యమైన అత్యవసరమైన కర్తవ్యం. మన వ్యవసాయ అవగాహనలో అతి కీలకాంశం. మిగతావన్నీ అనుబంధాలే. నీరు, గాలి, వెలుతురు భూసారాన్ని కాపాడటంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. అయితే ఇవన్నీ కలుషితం కాకుండా మనం ఏం చేస్తున్నాం? ఈ విభిన్న అంశాలపై దృష్టి సారిస్తే తప్ప మనం ఆహార ఉత్పత్తులను గురించి ఆలోచించలేం. భూసారం తగ్గించే అధిక ఉత్పత్తులు అవసరమా? నిజానికి నానాటికీ భూ ఉత్పాదకత కూడా తగ్గిపోతోంది. భూసారం నశించడంవల్ల కలుగుతున్న విపరీత పర్యవసానమే ఇది. ఉన్నట్లుండి ఆహారపు గుట్టలు కరిగిపోతే మనం నివ్వెర పోనవసరం లేదు.

గొలుసు కట్టులో అత్యంత కీలకమైన చిన్న రైతులను ఏరిపారేసే విధంగా విధాన సృష్టి జరుగుతోంది. మన సమిష్టి వ్యవస్థలో పెద్ద, చిన్న, సన్నకారు రైతులందరూ ప్రధాన పాత్ర పోషించేవాళ్ళే. కాబట్టి చిన్న, సన్నకారు రైతుల జీవన పోరాటాలకి మద్ధతు పలకకుండా మనం వ్యవసాయం ఉన్నతిని గురించి ఆలోచించలేము.

అతి ముఖ్యమైన మూడో అంశం – వ్యవసాయ ప్రక్రియలు. ప్రస్తుత వ్యవసా యానికి కావలసిన అన్ని సాధనాలు, పని ముట్లు, పదార్థాలు, ముడిసరుకులు, సాగు భూమి నుంచి కాక బయటి నుండి వస్తు న్నాయి. విత్తనాలు, పోషక పదర్థాలు, నీరు మొదలైనవన్నీ. విత్తనాలు మిగిల్చే సంప్రదా యం మర్చిపోయి మార్కెట్లలో కొంటున్నారు. పోషకాలు కొంటున్నారు. వర్షపునీటిని మడుగులు, తటాకాలుగా పరిరక్షించుకోక కాలువల మీద ఆధారపడుతున్నారు. కప్పలు, పక్షులు వంటి సహజ క్రిమి సంహారకాలని నిర్మూలించి, కృత్రిమమైన రసాయనిక మందులను జల్లుతున్నారు. ప్రగతి, అభివృద్ధిపేరిట వ్యవసాయ వ్యవస్థ సమూలంగా నాశనమైపోతోంది. రైతులు తమ సంప్రదాయ వనరులను, సాధనాలను, పద్దతులను విడిచి ఆధునికత, అధిక ఉత్పత్తి వెంట పరుగులు తీస్తున్నారు. కార్పోరేట్‌ వ్వయసాయం పేరిట వ్యవస్థ రైతులను లొంగదీస్తోంది. అయితే ఇంకా సంప్రదాయ వ్యవసాయ వ్యవస్థ పూర్తిగా ముక్క చెక్కలవకపోవడం అదృష్టం. మనం పైన చెప్పిన రెండు-మూడు విషయాలు పట్టించుకుంటే, 10000 – డబ్ల్యుటిఓలు, పేటెంట్లు కూడా మనని ఏమీ చేయలేవు. అయితే ప్రజలు, ముఖ్యంగా రైతులు, అడుగు ముందుకు వేయకపోతే, పరిస్థితి చేయిదాటిపోవచ్చు.

మన జీవితాలను మన చేతుల్లోకి తీసుకుని, మనలో పర్యావరణాన్ని కాపాడుకోవటం మన ప్రథమ లక్ష్యం కావాలి. స్థానిక వనరులతో, స్థానికంగానే ఆలోచించి, స్థానికంగానే పని మొదలుపెట్టాలి. మన ప్రాధాన్యతలు పెడ మార్గాలు పట్టినపుడు భవిష్యత్తు శూన్యం. ఉదాహరణకి, పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నపుడు అందరూ నష్టపరిహారమనీ, కల్తీలేని పురుగు మందులు పంపిణీ చేయాలని వాదించారే గానీ, మన వ్యవసాయ పద్దతులు, విధానాలు, అవగాహనల్లో మార్పు రావాలని ఆలోచించలేదు.

అభివృద్ధికి మనం ఇచ్చుకున్న తప్పుడు నిర్వచనాలే ఈ పరిస్థితికి కారణం. వినియోగదారీ వస్తు ప్రపంచంలోకి అడుగుపెట్టాం. దీనికి మూల స్థంభం వనరులను, లాభాలను పరస్పరం పంచుకోకపోవటం. మనం మన సంప్రదాయరీతిలోని ‘కలిసి  పంచుకుందామనే’ భావనలను ఎప్పుడో వదిలిపెట్టేసాము. మన పని చేసుకోవడం మనకి రాదు. ఉదాహరణకి, నగరాల్లో ప్రజలు టన్నుల టన్నుల వ్యవర్థ పదార్థాలను సృష్టించి, ఈ చెత్తను మునిసిపాలిటీలో, మరెవరో వచ్చి పరిశుభ్రం చేయాలని కోరుకోవడం.

ఆహారం ఎలా ఉత్పత్తి అవుతుంది? అది మన వంట గదుల్లోకి ఎలా వస్తుంది అనే విషయం ఎంత మంది ప్రజలకి తెలుసు? ఇవి పట్టించుకోవాల్సిన అంశాలుగా ఎవరూ అనుకోరు. ప్రభుత్వేతర సంస్థలు కూడా సమయానుకూలంగా చిన్న ప్రయత్నాలకి తోడ్పడతాయే తప్ప వారికి సరియైన అవగాహన, దృక్పథం లేవు. మొదటి అడుగుగా ఆ పని మంచిదే గానీ, దీర్ఘకాలిక ప్రయోజనాలకి అంత లాభం చేకూర్చదు.

ఎందరో ప్రజలు ప్రత్యామ్నాయ ప్రగతి మార్గాలు వెదుకుతున్నారు. అయితే అవి అక్కడక్కడా చిన్న ప్రయత్నాలుగా మిగిలిపోకూడదు. ఆ ప్రయత్నాలకు ఊపిరి పోసి, మద్దతు పల్కితే, ఆశాకిరణాలు కనిపిస్తాయి. మన దేశం విషయానికి వస్తే, మెట్ట భూములను పునరుజ్జీవనం చేస్తేనే కానీ, వీటి మీద ఆధారపడ్డ అధిక శాతం జనాభాకి మనుగడ అసాధ్యం. అట్లాగే భూసారం తగ్గించే ఏ అధిక ఉత్పత్తులని ఆహ్వానించకూడదు. 7-8% ఉత్పత్తి తక్కువైనా సరే రైతులు భూసారాన్ని కాపాడాలి.

(ఇంటర్వ్యూ: పి. శైలజ, కె. సత్యవతి)

(భూమిక మే-ఆగస్టు 2000 సంచిక సౌజన్యంతో…)

 

డా. వెంకట్‌, పర్మాకల్చర్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా వ్యవస్థాపకులు, మెట్ట వ్యవసాయంలో దశాబ్దాల నుంచి విశేష కృషి చేస్తున్నారు.

భూసారాన్ని కాపాడుకునే విధంగా మానవులు తమ కార్యకలాపాల్ని నిర్ధేశించుకోవాలి. కీలకమైన ఈ ప్రశ్న మీదే నాగరిక సమాజ భవిష్యత్తు ఆధారపడి వుంది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో