భూమి మీద హక్కు… లేకపోతే చిక్కు – డాక్టర్‌ ఎస్‌. సీతాలక్ష్మి

దళితుల సామాజిక అభివృద్ధి సాధనే ప్రధాన ధ్యేయమని ఎన్నికల ప్రణాళికలోనే తెరాస చాటిచెప్పింది. ప్రత్యేకించి దళిత మహిళల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యమిచ్చి, వీలైనన్ని అధిక నిధులు కేటాయిస్తామని వాగ్దానం చేసింది. హామీల అమలులో భాగంగా- సేద్యం ఆధారిత ఎస్సీ కుటుంబాలకు మూడు ఎకరాల భూమి పంపిణీ ప్రక్రియ గత సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా మొదల యింది. తెలంగాణలో సరికొత్త ఆశలు రేకెత్తించే ఈ భూమి ప్రదానం ఆ మహిళలకు హక్కుగా మారితేనే ప్రభుత్వ లక్ష్యం పూర్తిగా ఫలిస్తుందంటున్న వ్యాసమిది.

భూమిలేని నిరుపేద దళిత వ్యవసాయాధారిత కుటుంబాల మహిళలకు తలా మూడు ఎకరాలు అందించాలని తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం గణనీయమైనది. కేసీఆర్‌ ఎన్నికల సమయంలో చేసిన ఈ వాగ్దానాన్ని ముఖ్యమంత్రిగా ఆగస్టు 15 నుంచే అమల్లోకి తెస్తున్నారు. ఇందుకు హైదరాబాద్‌ మినహా మిగతా తొమ్మిది జిల్లాలకు తలా రూ. అయిదు కోట్ల వంతున మొత్తం రూ. 45 కోట్లు విడుదల చేశారు. ఈ నిధులతో జిల్లాల కలెక్టర్లు ఎకరాకు రూ. రెండు లక్షల నుంచి రూ. ఏడు లక్షల ధర చెల్లించి వ్యవసాయ భూములు సేకరణ జరపాలి. భూముల ధర, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, నీటిపారుదల ఖర్చులు, విద్యుత్‌ మోటార్లు, పంపుసెట్లు వాటి కరెంటు వ్యయాలను ప్రభుత్వమే భరిస్తుంది. రాష్ట్రంలోని ప్రతి గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 98 పైలట్‌ గ్రామాలను ఎంపిక చేశారు. అక్కడ సెంటు భూమి సైతం లేని షెడ్యూల్డ్‌ కులాల కుటుంబాలకు మూడేసి ఎకరాలు ఇస్తారు. అంతకన్నా తక్కువ భూమి ఉంటే కొరవ భూమి ఇచ్చి మొత్తం మూడు ఎకరాలూ సమకూరేట్లు చేస్తారు. ఆయా కుటుంబాలకు వ్యవసాయ విస్తరణ సేవల సహకారం ఏడాదిపాటు అందించి వారి కాళ్లపై వారు నిలబడేట్లు చేస్తారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులతో భూ కొనుగోలు కార్యక్రమాన్ని చేపడతారు.

అనుభవాలు నేర్పే పాఠాలు

ఈ కార్యక్రమానికి కావాల్సిన భూమిని తెలంగాణ ప్రభుత్వం మార్కెట్‌ నుంచి ఏ విధంగా కొనుగోలు చేస్తుందో చూడాలి. భూమిలేని పేదలకు ప్రభుత్వం కొనుగోలు చేసి ఇవ్వడమన్నది కొత్తదేమీ కాదు. 1980లలోనే అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇదే మాదిరి పథకం చేపట్టింది. నిరుపేద దళిత మహిళలు భూమి కొనుగోలు చేయడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూల్డ్‌ కులాల సహకార ఆర్థిక సంస్థ రుణరూపంలోను, గ్రాంటు పేరిటా నిధులు ఇచ్చేది. కాలక్రమంలో ఈ మొత్తాలను పెంచుతూ పలు ఉత్తర్వులు విడుదల అయ్యాయి. ఈ పథకం ఇప్పటికీ అమల్లో ఉంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం (సెర్ఫ్‌) కింద చేపట్టిన ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) కార్యక్రమం దళిత మహిళలకు భూ పంపిణీని లక్షించి 2004లో వాటి కొనుగోలు చేపట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో 128 మండలాల్లోని 190 గ్రామాల్లో ప్రపంచబ్యాంకు నిధులతో చేపట్టిన ఈ కార్యక్రమం 2009 సెప్టెంబరులో ముగిసింది. ఇందులో భాగంగా 5303 మంది పేద దళిత మహిళల కోసం రూ. 2937.45 లక్షల వ్యయంతో 4539.24 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఆయా పథకాల కింద భూముల కొనుగోలులో ఎదురైన సమస్యలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు జిల్లాల్లో స్థితిపై యాక్షన్‌ఎయిడ్‌ ఇండియా సంస్థ సహకారంతో సాగిన క్షేత్ర పరిశోధన తెలంగాణ ప్రభుత్వ తాజా పథకానికి ఉపకరించే అంశాల్ని వెలుగులోకి తెచ్చింది. క్షేత్రస్థాయి అధ్యయనం జరిపిన గ్రామాల్లో సుదన్‌పల్లి (హసన్‌పర్తి మండలం, వరంగల్‌ జిల్లా) తెలంగాణకు చెందినది. అల్లూరు (నందికొట్కూరు మండలం, కర్నూలు), దిబ్బగూడ (సీతంపేట మండలం, శ్రీకాకుళం), సొలస (ఎడ్లపాడు మండలం, గుంటూరు జిల్లా) సీమాంధ్ర ప్రాంతంలోనివి.

ఐకేపీ కోసం ప్రభుత్వం తానుగా భూములు కొనకుండా అందుబాటులో ఉన్న భూమిని, విక్రేతలను గుర్తించే బాధ్యతను స్వయం సహాయక బృందాలకు (ఎన్‌హెచ్‌జీ) అప్పగించింది. భూ సంస్కరణల అమలు ద్వారా మిగులు భూములను ఈ పథకానికి నియోగించాల్సి ఉండగా ప్రపంచ బ్యాంకు ప్రవచనాల ప్రకారం భూ వనరుల పునఃపంపిణీకి మార్కెట్‌పై ఆధారపడింది. సంబంధిత గ్రామాల్లో ఈ పథకం కోసం ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు భూములు అమ్మేందుకు ముందుకొచ్చిన భూస్వామ్య కుటుంబాలు అతి స్వల్పం. ఐకేపీ కింద ప్రభుత్వం పేద దళిత కుటుంబాలకు భూములు పంపిణీ చేయబోతోందని తెలిసిన వెంటనే సంబంధిత ప్రాంతాల్లో భూముల ధరలు ఉన్నపళాన పెరిగిపోయాయి. కౌలు రేట్లూ పెరిగిపోయాయి. ఐకేపీ కోసం భూములు విక్రయించడానికి మొదట్లో సుముఖత వ్యక్తం చేసిన పెద్ద రైతులు సైతం వాటి రేట్లు ఇంకా పెరుగుతాయన్న ఆశతో అమ్మకాలకు నిరాకరించారు. ఒకవేళ అమ్మినా, అవన్నీ చాలా తక్కువ భూములే. ఉదాహరణకు చెంచు (ఎస్టీ)లు నివసించే గుంటూరుజిల్లా సొలస గ్రామంలో ఎస్‌హెచ్‌జీకి మొదట 34 ఎకరాలు అమ్ముతామన్న భూస్వాములు చివరకు కేవలం 17 ఎకరాలను విక్రయించారు. ఫలితంగా ఐకేపీ కింద ఎంపిక చేసిన 23 మంది ఎస్టీ మహిళలకు తలా అర ఎకరమే పంపిణీ చేయగలిగారు. ఈ అరకొర భూమితో వారు జీవనం సాగించలేరు కనుక. సమీప పొలాల్లో కూలీకి వెళ్లక తప్పడంలేదు. కర్నూలు జిల్లా అల్లూరు గ్రామంలో ఐకేపీ కోసం 150 మంది ఎస్సీ మహిళలు భూములకు దరఖాస్తులు చేశారు. కానీ 81 మంది మాత్రమే తలా ఎకరం చొప్పున కొనుగోలు చేయగలిగారు. సువిశాల విస్తీర్ణంలో భూములు ఉండి కూడా సాగు చేయని భూస్వాముల నుంచి అవి విముక్తమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మహారాష్ట్ర, గుజరాత్‌లలో మాదిరిగా వ్యవసాయంమీద ఆధారపడినవారికే భూముల కొనుగోలు హక్కును దఖలుపరుస్తూ చట్టం చేయాలి. భూ రికార్డులను నవీకరించాలి. సీలింగ్‌ పరిమితులను సవరించాలి. అనర్హుల చేతుల్లో ఉన్న అసైన్డ్‌ భూములను, సాగుకు యోగ్యమైన ప్రభుత్వ భూములనూ స్వాధీనం చేసుకోవాలి. ఈ చర్యల ద్వారా వ్యవసాయ భూ విపణిలో ధరలను నేలకు దించాలి. లేదంటే పేదలకు పంపిణీ చేయడానికి మిగులు భూమంటూ దొరక్కుండా పోతుంది. అధ్యయనం సాగిన గ్రామాలన్నింటిలో(ఐకేపీ-సెర్ఫ్‌ ఎపీఎస్‌ సీసీఎఫ్‌ సి) భూ కొనుగోలు కార్యక్రమాల లబ్దిదారులంతా అంతకుముందు అవే భూముల్లో పనిచేసినవారే. భూ సంస్కరణల చట్టంకింద ఈ భూములను యజమానుల నుంచి స్వాధీనం చేసుకొని కౌలుదారులకు, కూలీలకు ఎన్నడో పంపిణీ చేసి ఉండాల్సింది. అలా కాకుండా స్వయంసహాయక బృందాల సభ్యులు సంబంధిత అధికారులు కలసి ప్రభుత్వ నిర్ణీత ధరకు భూములకు విక్రయించాల్సిందిగా యజమానులతో చర్చలు సాగించేవారు. బేరం కుదిరినా ఇవన్నీ అయ్యేసరికి ఎంతో సమయం పట్టేది. ఉదాహరణకు వరంగల్‌ జిల్లా సుదన్‌పల్లి రైతు సదస్సులో ఒక యజమాని తన భూమిలో 22 ఎకరాలను 35 దళిత కుటుంబాలు సాగుచేస్తున్నాయనీ, ఆ భూములను వారికి విక్రయిస్తామని ప్రకటించారు. ఇప్పటికీ ఆ కుటుంబాలకు పట్టాలు అందనే లేదు. యజమాని తన భూములకు ఏపీఎస్‌ సీసీఎఫ్‌ సి నుంచి ఎక్కువ ధరను ఆశించడమే ఈ జాప్యానికి కారణం. ఈ భూమి సాగు రికార్డులో యజమాని పేరే ఉంది. కౌలుదారీ దళిత కుటుంబాలు, స్థానిక దళిత హక్కుల సంస్థ

ఉద్యమించిన తరువాతే సాగు రికార్డుల్లో అసలైన సాగుదార్ల పేరు నమోదయ్యాయి. ఈ పథకంవల్ల దళిత మహిళలకు ఆర్థికంగా కొంత సాధికారత సమకూరినా సంబంధిత గ్రామాల్లో అంతరాలు కొనసాగుతూనే ఉన్నాయి. అల్లూరు, సుదన్‌పల్లి గ్రామాల్లో దళిత మహిళలు భయంభయంగా పొలాలు సాగుచేసుకొంటున్న పరిస్థితి కనిపిస్తోంది.

భూ కొనుగోలు పథకం వల్ల కొన్నిచోట్ల ఎస్‌హెచ్‌జీ మహిళల మధ్య సంఘీభావం బదులు సంఘర్షణ వైఖరి పెరుగుతోంది. ఎస్‌హెచ్‌జీ సభ్యులందరూ భూములను ఆశించినా వాటి కొరత వల్ల కొద్దిమందికే భూ పంపిణీ అవకాశం ఉంటోంది. ఇది మిగిలినవారిలో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది. శ్రీకాకుళం జిల్లా దిబ్బగూడ గ్రామంలో ఒకరికి చెందిన 17 ఎకరాలపైగా భూమిని చాలా కాలంనుంచి కొందరు ఎస్టీ మహిళలు సాగుచేస్తున్నారు. సంబంధిత కార్పొరేషన్‌ ఈ భూములను కొనుగోలు చేసి పొరుగు గ్రామం చిన్నబుగ్గకు చెందిన 22 మంది ఎస్సీ మహిళలకు పంపిణీ చేయడంతో ఉభయుల మధ్య వైరభావం ఏర్పడింది. ఈ తరహా వాటిని భవిష్యత్తులో నివారించడానికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టాలి. భూమిలేని కుటుంబాల వివరాలను ఖచ్చితంగా సేకరించి పారదర్శకంగా భూపంపిణీ ప్రక్రియ సాగించాల్సి ఉంది. పథకాల పేరిట దళిత మహిళలకు భూములు అందజేసినా వాటిపై తదుపరి తరంలో హక్కులు తిరిగి ఆ కుటుంబ సభ్యులకే లభిస్తాయన్న భరోసా లేదు. ఈ పరిస్థితిని సరిదిద్దడం తక్షణావసరం. పథకాల కింద కొనుగోలు చేసిన భూములపై యాజమాన్య హక్కులు దళితులకు నామమాత్రంగా దఖలు పడుతున్నాయి. ఐకేపీ-సెర్ఫ్‌ భూములు పొందిన మహిళలు పది లేదా పదిహేనేళ్లలో రుణాలు తీర్చేంతవరకూ, సదరు భూమి ఎస్‌హెచ్‌జీ మహిళల సమాఖ్య ‘విలేజ్‌ ఆర్గనైజేషన్‌’ (వీఓ) తనఖాలో ఉంటోంది. ఏపీఎస్‌ సీసీఎఫ్‌సి పథకంలోనూ మహిళలు అప్పును పూర్తిగా తీర్చిన తర్వాతే దస్తావేజులు ఇస్తున్నారు.

విస్తరణ సేవలే మూలం

భూమిని ప్రభుత్వం పంపిణీ చేసిన వెంటనే వారికి హక్కు ఏర్పడేలా చూడాలి. భవిష్యత్తులో ఈ భూములను ఇతర ప్రయోజనాలకు ఉపయోగించుకోకుండా చట్టపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటివరకూ భూ కొనుగోలు పంపిణీ పథకాల వల్ల లబ్ధిపొందినవారి సంఖ్య తక్కువగానే ఉంది. ఈ పథకాలకింద భూములు విక్రయించిన వారికి వందల ఎకరాలు ఉన్నాయి. వారు వ్యవసాయం కాక ఇతర రకాల ఆదాయ మార్గాలు చేపడుతున్నారు. పట్టణాల్లోనో, విదేశాల్లోనో నివసిస్తున్నారు. అంటే వీరు భూ సంస్కరణల ఉల్లంఘనదారులన్న మాట. ఈ సమస్యలు పూర్తిగా పరిష్కరించనిదే భూ కొనుగోలు కార్యక్రమానికి కావలసిన మిగులు భూములు దొరకడం కల్ల. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ మహిళలకు కొనుగోలు చేసి ఇచ్చిన భూముల సాగుకు ఏడాదిదాకా తోడ్పాటు ఇవ్వదలచింది. ఈ విస్తరణ సేవలను మూడు లేదా నాలుగేళ్ల వరకు కొనసాగిస్తే మొదటిసారిగా సొంత భూమిలో సాగు చేపడుతున్న దళిత మహిళలకు ఉపయోగకరంగా ఉంటుంది. పేద దళిత కుటుంబాలు ఇకముందు వ్యవసాయ కుటుంబాలుగా మారడానికి తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం అండదండలు అందించాల్సి

ఉంటుంది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.