ఆహార భద్రత – మహిళాసంఘాలు – పి. ప్రశాంతి

(మహిళా సమత సొసైటి అనుభవాల ఆధారంగా) భారతదేశపు గ్రామీణ ప్రాంతాలు ఇప్పటికీ చాలావరకు వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థపైనే ఆధారపడి ఉన్నాయి. భూమి, సాగునీరు, కరెంటు, పశుసంపద వంటి వనరులు గ్రామీణ ప్రాంతాలంతటా ఒకేలా విస్తరించి లేకపోయినా దాదాపు 70% గ్రామీణ ప్రజలు భూఆధారిత లేదా సంబంధిత కార్యక్రమాలపైనే ఆధారపడి బ్రతుకుతున్నారు. వ్యవసాయాధారిత కుటుంబాలలో 80% వరకు, అంటే సుమారు 99 మిలియన్ల కుటుంబాలు 5 ఎకరాలలోపు భూమి ఉన్న చిన్నకారు లేదా సన్నకారు రైతులే. సాధారణంగా ఈ రైతుకుటుంబాలు వారికున్న ఆ కాస్త భూమిని కూడా పూర్తిగా సాగు చేయలేకపోతున్నారు. ఇందుకు కారణం వారి భూమి సారవంతమైంది కాకపోవడం లేదా పెట్టుబడి పెట్టే సామర్థ్యం రైతుకి లేకపోవడం. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఇన్నేళ్ళుగా దేశంలో దిగుబడిని పెంచి, పేదరికాన్ని తగ్గించి, దేశమంతటా ఆహార భద్రతని కల్పించడానికిగాను అనేక పథకాలు, విధానాలను ప్రవేశపెట్టడం జరిగింది. అయినా కూడా పరిస్థితిలో కొద్దిమేర మార్పు తప్పించి (2002లో 0.700 నుండి 2013లో 0.702) పెద్దగా మెరుగుకా లేదనేది ప్రస్తుత మానవాభివృద్ధి సూచిక ద్వారా వెల్లడవుతోంది. భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 21 ద్వారా ప్రతి పౌరుడు తాను మరియు తన కుటుంబం ఆరోగ్యంగా, సుఖంగా ఉండడానికి సరిపడేంత ఆహారంతోపాటు జీవనస్థాయిని పొందే హక్కు ఉందని తెలియచేస్తోంది. దీని ద్వారా దేశంలోని ప్రతి పౌరుడికి ఆహారపు హక్కు(ను పొందేలా) హామీని కల్పించాల్సిన బాధ్యత రాజ్యానిదవుతుంది. కనుక గ్రామీణ పేదలు తమ కుటుంబసభ్యులందరికీ అవసరమైన ఆహారాన్ని పొందేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను, పథకాలను ప్రవేశపెట్టింది. అయితే మన సమాజంలోని వ్యక్తుల ఆహారపు అలవాట్లు, వాడకం స్థాయి బలమైన సామాజిక మరియు సాంప్రదాయిక అంశాలచే ప్రభావితమై ఉంటుంది. ఇందులో ముఖ్యంగా స్త్రీలపై, బాలికలపై ప్రభావం చూపిస్తున్న – కొన్ని కనపడేలా, చాలావరకు కనబడకుండా, జెండర్‌ నార్మ్స్‌ కూడా ఉన్నాయి. ప్రస్తుతం వ్యవసాయాన్ని మారుతున్న వాతావరణ పరిస్థితులు నిర్దేశిస్తున్నాయి. పెరుగుతున్న కరువు పరిస్థితులు, తరుగుతున్న భూగర్భ జలాలు, అతితక్కువ వర్షపాతం… ఇవన్నీ కలిసి ఏది పండించాలన్నదాన్ని నిర్ణయించేవిగా అయ్యాయి. ప్రపంచీకరణ (గ్లోబలైజేషన్‌), స్వేచ్ఛావిపణి/వాణిజ్యం వంటివి కూడా పెద్ద ఎత్తున ప్రభావం చూపాయి. గత రెండు దశాబ్దాలలో చాలావరకు ఆహారపంటల నుండి వాణిజ్య పంటలకు మారడం కనిపిస్తుంది. దీనివలన అవసరాలకు తగ్గ ఆహారధాన్యాలు లభించక ధరల పెరుగుదలకు కారణమైంది. కుటుంబ ఆహారభద్రత విషయానికొస్తే స్త్రీల పాత్ర కీలకమవుతుంది. వ్యవసాయ పనులలో దాదాపు 70% వరకు స్త్రీలే ఉన్నా వారి శ్రమకి గుర్తింపు లేదు. ఎన్నో ఏళ్ళుగా వ్యవసాయంలో స్త్రీలను మహిళారైతులగా గుర్తించాలని పోరాడుతున్నా ఫలితం లేకపోయింది. ఇప్పటికీ వారి పాత్ర వ్యవసాయ కూలీలుగానే చూడబడుతోంది. అదే విధంగా, భారతదేశ పరిస్థితుల్లో స్త్రీలు కేవలం ఆహారాన్ని తయారుచేసి ఇంటిల్లిపాదికి వడ్డించేవారిగానే చూడబడుతున్నారు కాని ఆహారాన్ని అందించేవారిగా (ప్రొవైడర్స్‌గా) అస్సలు చూడట్లేదు. దీనికి అనేక సామాజిక, రాజకీయ, సంప్రదాయ మరియు జెండర్‌ అంశాలు కారణమవుతున్నాయి.B3 ఈ నేపథ్యంలో ఈ వ్యాసం ఆహారభద్రత లేదా ఆహార అభద్రతకు కారణమవుతున్న అంశాలు, కుటుంబ ఆహార భద్రతను సాధించడంలో స్త్రీల పాత్ర మరియు కుటుంబ, సమూహ స్థాయిల్లో ఆహార మరియు పోషక భద్రతను సాధించేందుకుగాను సుస్థిర వ్యవసాయం దిశగా సంఘాలు/స్వయంసహాయక సంఘాల పాత్రను కూలంకషంగా చర్చిస్తుంది.

ఆహార భద్రత పరిస్థితి/సందర్భం: ఆహార భద్రత ప్రపంచమంతటా విస్తృతంగా చర్చిస్తున్న విషయం. 1970ల నుండి ‘ఆహారభద్రత’కి అనేక నిర్వచనాలు వాడుకలో ఉన్నాయి. మనదేశంలో 1960లలోని హరితవిప్లవం అనేక అంశాలతో కూడిన కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. అన్ని కుటుంబాలకీ ఆహారం అందుబాటు అనేది కూడా ఇందులో ఒక భాగం కాబట్టి, ఆ సమయంలో ప్రవేశపెట్టిన విధానాల్లో ప్రజాపంపిణీ వ్యవస్థ, తగ్గింపు ధరలలో ఆహారధాన్యాలు, వ్యవసాయానికి అవసరమైన వస్తువులు, ఇంకా సంస్థాగత ఋణాలు వంటివి భాగమయ్యాయి. వ్యవసాయాధారిత సమాజం కాబట్టి వ్యవసాయంలో యాంత్రీకరణను/యంత్రాలను ప్రవేశపెట్టడంతోపాటు దిగుబడులను పెంచడం, పేదరికాన్ని తగ్గించడంపైన దృష్టి పెట్టడం జరిగింది.

విషయం/భావన: ఆహార భద్రత అంటే మామూలు మాటల్లో కుటుంబ స్థాయిలో సభ్యులందరికీ సరిపడే ఆహారం దొరకటం అనచ్చు. 1970లలో ఆహార భద్రత అంటే ”ప్రపంచమంతటా అన్నివేళలా కనీస ఆహారపదార్థాలు దొరకటం…, ఆహార వినియోగం నిలకడగా పెరగడాన్ని సుస్థిరీకరించడం… మరియు దిగుబడులు, ధరలలో హెచ్చుతగ్గులను నిలువరించడం”గా నిర్వచించారు. (UN 1975). 1983లో UNFAO పేర్కొన్న ప్రకారం ఆహార భద్రత అంటే ”ప్రజలంతా అన్నివేళలా భౌతికంగాను, ఆర్థికంగాను వారికవసరమైన కనీస ఆహారం అందుబాటులో ఉంటుందన్న హామీ కలిగి ఉండడం.” తర్వాత 1986లో ప్రపంచ బ్యాంకు దీనిని మరింత ముందుకు తీసుకెళ్తూ/బలపరుస్తూ ఆహారభద్రత అంటే ”ప్రజలందరికీ అన్నివేళలా వారు చురుకైన మరియు ఆరోగ్యవంతమైన జీవితం గడపడానికి అవసరమైనంత ఆహారం అందటం” అని వక్కాణించింది. ప్రస్తుత పరిస్థితుల్లో, ఆహార భద్రత అంటే ఆహారధాన్యాలు దొరకటం, ఆహారం అందుబాటు, వ్యక్తికి సరిపడేంత ఆహారాన్ని తీసుకోగలగడం మరియు జీర్ణించుకోగల సామర్థ్యం అని కూడా అనుకోవచ్చు. సాధారణంగా ఆహారధాన్యాల దిగుబడి పెరిగి, మిగులుధాన్యం అందుబాటులో ఉన్న పరిస్థితుల్లో ప్రతి వ్యక్తికి ఆహారం అంది తీరుతుందని అనుకుంటాము. అయితే నిజానికి గ్రామీణ పేదప్రజలు/కుటుంబాలు ఇంకా వారికవసరమైనంత పోషకాహారాన్ని తీసుకోలేకపోతున్నారు. వారి ఆదాయం, కొనుగోలుశక్తి పెరిగినా కూడా పరిస్థితి ఇలాగే ఉంది. ఈ పరస్పర విరుద్ధ పరిస్థితి ఎందుకుంది? గ్రామీణ పేద, నిరుపేద కుటుంబాలతో పనిచేసిన అనుభవం నుండి తెలుస్తున్న దేంటంటే మారుతున్న ఆహారపు అలవాట్లు, పోషకాహారం-ఆరోగ్యంపై అవగాహన లేకపోవడం, వేస్తున్న పంటలలో పెద్ద ఎత్తున వచ్చిన మార్పు, సంస్థాగత ఋణాల అందుబాటు పెరగడం వంటి విషయాలు ఈ పరిస్థితికి దారితీస్తున్నాయి. ఈ విషయాన్ని మరింత లోతుగా ఈ వ్యాసంలోని తర్వాతి భాగాలలో చర్చించడం జరిగింది. కార్యక్రమాలు/పథకాలు : దేశ పౌరులందరి సంరక్షణ బాధ్యత రాజ్యానిదే. కనుక ప్రతి పౌరుడు తన హక్కులన్నీ, ఆహారపు హక్కుతో సహా అన్ని హక్కులు అందుకునేలా చూడాల్సిన బాధ్యత ఉంది. ఈ మేరకు ప్రభుత్వం అనేక విధానాలను, కార్యక్రమాలను, పథకాలను ప్రవేశపెట్టింది. ఇవన్నీ దేశ పౌరులందరికీ – అన్ని వయసుల మరియు అన్ని వర్గాల ప్రజలకు ఆహార మరియు పోషక భద్రత కల్పించే ఉద్దేశ్యంతో ప్రవేశ పెట్టబడ్డాయి. సీడా, సిఆర్‌సి వంటి వివిధ అంతర్జాతీయ ఒప్పందాలపై సంతకం చేసిన సభ్యదేశంగా భారతదేశం తాను సంతకం చేసిన ఒప్పందాలలోని అంశాలను ర్యాటిఫై చేయాల్సి ఉంటుంది. ఇది రాజ్యంపై న్యాయపరంగా తప్పనిసరి అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆయా ఒప్పందాల కనుగుణంగా చట్టాలను, విధానాలను చేయడం, కార్యక్రమాలను, పథకాలను ప్రవేశపెట్టి అమలుచేయడం తప్పనిసరి అవుతుంది. ఈ మేరకు ఆహారభద్రత, పేదరిక నిర్మూలన మరియు ఆకలి చావులను తగ్గించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని ముఖ్యమైన, పెద్ద కార్యక్రమాలు/పథకాలు ఈ విధంగా ఉన్నాయి : 1. ప్రజా పంపిణీ వ్యవస్థ : పేదరిక రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు తగ్గింపు ధరల్లో బియ్యం, గోధుమలు వంటి ధాన్యం, చక్కెర, వంటనూనె, కిరసనాయిల్‌ వంటి వాటిని అందించాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించారు. (ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణ రాష్ట్రాలలో పప్పులు, ఉప్పు, కారం వంటివాటిని కూడా జోడించారు) 2. సమగ్ర శిశు అభివృద్ధి సేవలు : 3-5 సం||ల వయస్సు పిల్లలుకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు అవసరమైన అధిక పోషకాలను అందించేందుకుగాను ఉద్దేశించబడింది. 3. మధ్యాహ్న భోజన పథకం : అవిభాజిత ఆంధ్రప్రదేశ్‌లో 1980ల ప్రారంభంలో బడిపిల్లలకు అధిక పోషకాలను అందించడానికిగాను ప్రవేశపెట్టారు. తర్వాత విద్యకోసం పోషక సహకారంకై జాతీయ కార్యక్రమాన్ని ప్రాథమిక పాఠశాలల్లో ప్రారంభించి ప్రాథమికోన్నత పాఠశాలలకు కూడా విస్తరింప చేశారు. 4. పనికి ఆహార పథకం : ప్రభుత్వం గుర్తించి అప్పజెప్పే పనులను చేసే కూలీలకు పనిచేసినందుకు కూలీగా ఆహారధాన్యాలను ఇచ్చే పథకం. 5. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం : ఇది హక్కుల ప్రాతిపదికన భూఆధారిత పనులను అందించే భారీ నిధులతో కూడిన కార్యక్రమం. దీని ద్వారా వేతన కూలీల సమూహాలకు పనిని అందించి నిర్ణీతకాలంలో చేసిన పనికి నిర్ణీత వేతనాన్ని అందచేస్తారు. దీని ద్వారా నిర్ణీత దినాలకుగాను ఖచ్చితంగా పనిని కల్పించే హామీ ఇవ్వబడింది. 6. రాజీవ్‌గాంధీ కౌమార బాలికల సాధికార కార్యక్రమం (సబల) :  యుక్తవయసు/కౌమారస్థితిలోని బాలికలలో పోషకారోగ్యం మెరుగుపరచడానికి, ఇంటిపనులలో సామర్థ్యాలను, జీవన నైపుణ్యాలను మరియు ఒకేషనల్‌ నైపుణ్యాలను పెంచి వారు సాధికారత సాధించేందుకుగాను ఉద్దేశించబడింది. 7. అంత్యోదయ : 2000 సం||లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా నిరుపేద కుటుంబాలకు తగ్గింపు ధరలలో అదనపు ఆహారధాన్యాలు అందించాలనేది ముఖ్య ఉద్దేశ్యం. ప్రస్తుతం ఈ పథకం ద్వారా దారిద్య్రరేఖకు దిగువనున్న 2 కోట్ల కుటుంబాలు లబ్ది పొందుతున్నాయి. ఈ పథకం కోసం సంవత్సరానికి సుమారు 60 లక్షల టన్నుల ఆహారధాన్యాలు అవసరమౌతాయి. 8. జాతీయ వృద్ధాప్య పెన్షన్‌ పథకం : వేతనానికి పనిచేసే వయసు దాటిపోయిన వృద్ధులకు ఆర్థిక సహకారాన్ని అందించేందుకు ప్రారంభించిన పథకం. 9. జాతీయ ఆహార భద్రతా మిషన్‌ : వరి, గోధుమ, పప్పుధాన్యాలు, చిరుధాన్యాల దిగుబడిని పెంచడానికిగాను 2007లో ప్రారంభమైంది. 10. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ : మాతా, శిశు మరణాల రేటును తగ్గించడానికి, ప్రజలందరికీ ఆరోగ్య సేవల అందుబాటు (పోషక ఆరోగ్యంతో కలిపి) ముఖ్య ఉద్దేశ్యాలుగా 2005 సం||లో ప్రారంభమైంది. 11. జాతీయ గ్రామీణ జీవనోపాదుల మిషన్‌ : ఇది 2010 సం|| నుండి ూ+ూ్‌ కి మార్పులు చేసి ఇచ్చిన కొత్తరూపం. గ్రామీణ పేద కుటుంబాలు ఆదాయాన్ని పెంచే ఆస్తులు/ఆర్థిక కార్యక్రమాలు చేపట్టడం ద్వారా వారికి సుస్థిర ఆదాయాన్ని కల్పించి వారిని పేదరికం నుండి బైటపడేయడం కోసం ఉద్దేశించబడింది. 12. జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ప్రజలందరికీ ఆహార మరియు పోషకాల భద్రత కల్పించే దిశగా అనేక పథకాలు, విధానాలు ఉన్నా పరిస్థితి పెద్దగా మెరుగ వలేదని చెప్పచ్చు. ఎప్పటికపుడు వస్తున్న జాతీయ, అంతర్జాతీయ నివేదికల ద్వారా ఇది స్పష్టమవుతోంది. మానవాభివృద్ధి సూచి నివేదిక ప్రకారం 187 దేశాలలో భారతదేశం 185వ స్థానంలో ఉండగా 2011-12లో దేశంలోని 28 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌ 17వ స్థానంలో ఉంది. సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలలో నిర్దేశించుకున్న ప్రకారం భారతదేశంలోని తీవ్రమైన ఆకలి మరియు పేదరికంను 2015 నాటికి సగానికి తగ్గించాల్సి ఉండగా 2012 నాటికి ఇంకా 27 కోట్ల జనాభా అత్యంత పేదరికంలో మగ్గుతున్నారు. దీనివలన 2015 సం|| తర్వాతి లక్ష్యమైన 2030 నాటికి తీవ్ర పేదరికాన్ని నిర్మూలించడం, ఒక పెద్ద సవాలుగా నిలుస్తోంది (ఖచీ Iఅసఱa నివేదిక 2015). జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2005-06 (చీఖీనూ-3) ప్రకారం దేశంలోని సగంమంది పైగా (56%) స్త్రీలు రక్తహీనతతో ఉన్నారు. దాదాపు సగంమంది (47%) పిల్లలు తక్కువ బరువుతో ఉన్నారు. దాదాపు 1/3వ వంతు మంది శిశువులు (30%) తక్కువ బరువుతో పుడ్తున్నారు. ఇలా ఉండగా ప్రపంచ ఆకలి సూచి 2014 ప్రకారం భారతదేశం 76 దేశాలలో 55వ స్థాయిని సాధించి కొంత మెరుగుపడినప్పటికీ; బరువు తక్కువ పిల్లలకు సంబంధించి 128 దేశాలకుగాను 120వ స్థానానికి చేరినప్పటికీ దేశంలో నెలకొని ఉన్న ఆకలి స్థితి మాత్రం ”తీవ్రమైనది”గానే కొనసాగుతోంది. అవిభాజిత ఆంధ్రప్రదేశ్‌లోని 8.5 కోట్ల జనాభాకుగాను దాదాపు 70% మంది ముఖ్యమైన జీవనోపాధిగా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు (ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2008). రాష్ట్రంలోని సామాజిక ఆర్థిక అభివృద్ధి వలన దేశంలోనే అతితక్కువ పేదరికంగల రాష్ట్రాలలో ఒకటిగా (15%) ఎదిగింది. ఇదిలా ఉండగా, రాష్ట్రంలోని వర్షాధార వ్యవసాయ ప్రాంతాలలోని రైతులు మాత్రం వారి జీవనోపాధుల విషయంలోను, ఆహారభద్రత, మొత్తంగా మెరుగైన జీవనాన్ని గడపడంలోను ఎన్నో అభివృద్ధి మరియు వాతావరణ సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. ఇందులో పరిమిత ఉపాధి అవకాశా లు, తక్కువ ఆదాయం, దిగజారిన వాతావరణ పరిస్థితులు, సామాజిక అసమానత వంటివి కూడా భాగమై ఉన్నాయి (ఖచీఖీaూ 2010)B6 ఈ పరిస్థితుల్లో ఇంటిల్లిపాదికి ఆహారభద్రత, పోషక విలువల భద్రత కల్పించడంలో స్త్రీల పాత్ర కీలకమవుతోంది.  సాంప్రదాయికంగా ఇది స్త్రీల బాధ్యతగానే చూడబడుతోంది. ఆహారధాన్యాలు ఉన్నాయా లేవా అనే దాన్తో సంబంధం లేకుండా మొత్తం కుటుంబానికి తిండిపెట్టడం స్త్రీల పనిగా చూడబడుతోంది. ఈ పరిస్థితుల్లో సాధారణంగా మహిళలు కుటుంబంలోని వారందరికీ మూడుపూటలా కాకపోయినా కనీసం రెండుపూటలా భోజనం పెట్టడానికి అవసరమైన సరుకుల కోసం ఇటు ూణూ పైన కాని లేదా కూలిచేసి సంపాదించిన వేతనంపై కాని ఆధారపడుతున్నారు. వాస్తవానికి నలుగురో ఐదుగురో సభ్యులున్న శ్రామిక కుటుంబాలకు ూణూ లో ఇచ్చే బియ్యం/గోధుమలు, పప్పు, వంటనూనె ఏమాత్రం సరిపోదు. మిగితా అవసరాలన్నింటిని తీర్చడానికి ఆలోచించుకోడం, సరుకులు తెచ్చుకోవడం, బాగు చేసుకోడం, కుటుంబ సభ్యులందరికీ వండి వడ్డించడం స్త్రీదే బాధ్యతవుతోంది. ఇలా బలవంతాన రుద్దబడ్డ బాధ్యతవల్ల స్త్రీపై మానసికంగా భారం పడుతోంది. చాలాసార్లు కుటుంబ సభ్యులందరికీ సరిపడా ఆహారం అందేలా చూసే క్రమంలో అందరూ తిన్నాక తాను తినడంతో ఒకోసారి అర్థాకలితోను మరోసారి పస్తులుండాల్సిన పరిస్థితికి లోనవుతుంది. గ్రామీణ పేదమహిళలు ఒకవైపు ఇంటిచాకిరీతో మరోవైపు కూలీపనులతో శారీరకంగా అధికశ్రమకు లోనవుతున్నారు. అంతేకాక, వారు చేసే పనికి, తీసుకునే ఆహారానికి సంబంధం లేకపోవడంతో (పనికి తగ్గ ఆహారం తీసుకోకపోవడంతో) తీవ్ర అనారోగ్య పరిస్థితులకు గురవుతున్నారు. దీనివలన అనేక సందర్భాలలో గర్భవతులు ప్రమాదకర స్థితికి లోనవడం, మాతా శిశు మరణాలు, అతితక్కువ బరువుతో శిశువులు పుట్టడం వంటివాటికి దారితీస్తోంది. అనేక సందర్భాలలో మహిళలు అధిక రక్తస్రావం లేదా అసాధారణంగా తక్కువ నెలసరి విడుదల, తీసుకున్న ఆహారం వంటపట్టకపోవడం, పోషకాహార మరియు మల్టీవిటమిన్‌ లోపం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ పరిస్థితిలో మార్పురావాలంటే కేవలం మహిళలు తమ హక్కుల గురించి తెలుసుకుని తత్సంబంధిత అంశాలపట్ల సమాచారాన్ని, జ్ఞానాన్ని పెంచుకోవడంతో మాత్రమే సాధ్యమ వుతుంది. మా అనుభవంలో స్త్రీలతో సంఘీభావం పెంచడానికి, వారి ఆత్మస్థైర్యాన్ని ఆత్మోన్నతిని పెంచుకునేందుకుగాను ఒక వేదిక ఏర్పాటుచేసుకోడానికి, సమాజంలోను, కుటుంబంలోను మహిళల స్థితి పరిస్థితిపై అవగాహన కల్పించడానికి, వారి హక్కులపట్ల వారికి ఎరుక కల్గించడానికిగాను స్త్రీలను సమూహాలుగా/సంఘాలుగా ఏర్పాటుచేయడం ఒక విజయవంతమైన వ్యూహంగా చెప్పవచ్చు. మహిళాసంఘం/స్వయం సహాయక బృందం పరిస్థితి / సందర్భం : కొన్ని భారతీయ పురాణాలు స్త్రీలను శక్తి రూపిణులుగా చూపించాయి కాని తర్వాతి కాలంలో చారిత్రాత్మకంగా, రాజకీయం గా,  సాంస్కృతికంగా మహిళలే వివాదాలకు మూలకారణంగా భావించడంవల్ల క్రమేపీ తరతరాలుగా స్త్రీలను ఇంటి అంతర్భాగాలకు పరిమితం చేశారు. వారి చలనం, జ్ఞానం, నైపుణ్యాలు, నిర్ణయాధి కారం…. అన్నింటినీ నియంత్రించారు. సమాజం అనేక అలిఖిత నిబంధనలను విధించింది. ఫలితంగా బాలికలు మహిళలపట్ల చిన్నచూపు, అసంబద్ధ ప్రవర్తన, వివక్షాపూరిత పద్ధతులననుసరించడం ప్రారంభమైంది. తద్వారా బాల్య వివాహాలు, చదువుకు దూరం చేయడం, తక్కువ కూలిరేట్లు, శ్రమదోపిడి, భూమి, పశువులవంటి ఉత్పాదక వనరులపై హక్కు లేకపోవడం వంటి వాటికి గురవుతు న్నారు. ఇది పునరుత్పత్తి ఆరోగ్యం, స్వశక్తి మరియు ఆర్థిక కార్యకలాపాల ఆధారంగా లెక్కగట్టే జెండర్‌ అసమానతా సూచి ద్వారా స్పష్టమవుతోంది. దీని ప్రకారం భారతదేశం 152 దేశాల పట్టికలో 127వ స్థానంలో ఉంది. ఇది భారతదేశపు జనాభాలో 55.3% మంది అంటే సగానికి పైగా ప్రజలు బహుముఖీన (Multi Dimensionally Poor) పేదలు, కాగా అదనపు 18.2% ప్రజలు బహుముఖీన పేదరికంతో (Multi Dimensional Poverty) మగ్గుతున్నారని పునరుద్ఘాటిస్తోంది 1970వ దశకంలో దేశంలో స్త్రీల ఉద్యమం ఎంతో బలీయంగా ఉంది. దీని ప్రభావంతో రాజ్యం మహిళానుకూల విధానాలను, చట్టాలను చేయడంతోపాటు స్త్రీలకు ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించక తప్పలేదు. ”మహిళా & శిశు వికాస విభాగ”పు ఏర్పాటు, తదుపరి సమగ్ర శిశు అభివృద్ధి పథకాన్ని ప్రారంభించడం కూడా దీని ఫలితమే. 1980ల మధ్య వరకు కూడా మహిళాభివృద్ధి అనేది వ్యక్తిగత వ్యవహారంగానే చూడబడింది. అయితే, రాజకీయ మరియు వ్యవసాయ ఆర్థికవేత్తలు దేశ ఆర్థిక వ్యవస్థకు మహిళల భాగస్వామ్యం, సహకారం అత్యంత కీలకమన్నది గ్రహించి, వేగవంతమైన ప్రభావం కోసం మహిళల్ని బృందాలుగా (సంఘాలుగా) ఏర్పాటు చేయడం ప్రారంభించారు. బాంగ్లాదేశ్‌ లోని స్త్రీలు స్వయం సహాయక సంఘాలుగా/బృందాలుగా ఏర్పడి అద్భుతంగా చేసుకున్న సూక్ష్మ ఋణ కార్యక్రమాల అనుభవాల నుండి నేర్చుకున్న విషయాల ఆధారంగా 1980లలో మనదేశంలో డ్వాక్రా కార్యక్రమాన్ని రూపొందించి ప్రారంభించారు. విషయం/భావన : భారతదేశంలో మహిళల్ని సమీకృతం చేయడమనే భావన కొత్తదేమీ కాదు. స్వాతంత్య్రానికి ముందునుండే మహిళలు ఒకర్నుండి ఒకరు నేర్చుకోడానికి, కొన్ని కీలకమైన విషయాలను చర్చించుకోడానికి మహిళా మండళ్ళు వేదికగా ఒక దగ్గరికి చేరేవారు. డ్వాక్రా కార్యక్రమ అమలుతో స్త్రీలు బృందాలుగా ఐకమత్యంతో ఒక దగ్గర చేరి చిన్న మొత్తాలను పొదుపు చేసుకోవడం ప్రారంభించారు. తద్వారా బ్యాంకుల నుండి తక్కువ వడ్డీ రేట్లకు ఋణాలను పొంది ఆర్థిక కార్యక్రమాలను చేపట్టారు. దీనివలన వారు ఆర్థికంగా లబ్ది పొందడంతోపాటు అధిక వడ్డీలతో ప్రైవేటు ఋణదాతల నుండి అప్పులు తీసుకోవడం నుండి తప్పించుకోగలుతారన్నది ఆలోచన. ఇది స్త్రీలు సంఘటితంగా భాగస్వాములై, చర్చించుకుని, వారు తీసుకున్న నిర్ణయాలను ఆచరణలో పెట్టే దిశగా ఒక ముందడుగు. దీనివల్ల మహిళల అభివృద్ధి అంటే ‘సంక్షేమ కోణం’ నుండి ‘అభివృద్ధి కోణం’ దిశగా అర్థం చేసుకోవడంలో పెద్ద మార్పే వచ్చింది. ఈ మార్పు క్రమేపీ స్త్రీల సంక్షేమం కోసం ఉద్దేశించిన ప్రభుత్వ విధానాలు, పథకాలు, కార్యక్రమాల రూపాన్నే మార్చేసింది. కాని మన దేశంలో లోతుగా వేళ్ళూనుకుపోయిన పితృస్వామ్య వ్యవస్థ నేపథ్యంలో లింగవివక్ష, జెండర్‌ అసమానతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జెండర్‌ అసమానతకు అంతర్లీనంగా ఉన్న కారణాలు సామాజిక, ఆర్థిక నిర్మాణాలకు సంబంధించినది. ఇవి అధికారిక, అనధికారిక నిబంధనలపై, ఆచారాలపై ఆధారపడి ఉన్నాయి (నేషనల్‌ పాలసీ ఫర్‌ ఎమ్‌పవర్‌మెంట్‌ ఆఫ్‌ ఉమెన్‌ 2001). మన సమాజంలో కుల, వర్గ, సంస్కృతి అంశాల ఆధారంగా ప్రజల మధ్య స్పష్టమైన విభజన కనిపిస్తుంది. ఇది మన సమాజంలో వెనుకబాటుతనానికి, అభివృద్ధికి నోచుకోపోవడానికి, అసమానతలకు దోహదకారక మయ్యంది. దీనివల్ల వారు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకో లేకపోతున్నారు, పథకాలు అందుకోలేకపోతున్నారు. ఫలితంగా వారి హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. ఇవన్నీ కలిసి సమాజంలోని ఒక భాగం బహుముఖీన పేదరికంలో కూరుకుపోయేలా చేస్తున్నాయి. అందులోనూ మహిళలు మరింత ఘోర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తోంది. సంఘటితత్వం – మహిళా సమాఖ్య విధానం మహిళల్ని తమ హక్కులపట్ల చైతన్యవంతుల్ని చేయడం, సమాజంలో, కుటుంబంలో తమ స్థితి, పరిస్థితిని అర్థం చేసుకోవావడం, వెనుకబాటుతనాన్ని అధిగమించేందుకు సంఘటిత చర్యలను చేపట్టేలా సహకరించడం మరియు అభివృద్ధి కార్యక్రమాలలో కీలక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని గుర్తించి భారత ప్రభుత్వం 1980ల చివర్లో మహిళా సమాఖ్య కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గ్రామీణ పేద స్త్రీలను చైతన్యపరచి, సమూహాలుగా ఏర్పాటు చేయడం ముఖ్య వ్యూహంగా ఈ కార్యక్రమం దేశంలోని 11 రాష్ట్రాలల్లో 130 జిల్లాలలో సుమారు 14.5 లక్షల మంది మహిళలను చేరుకోగలిగింది. వీరంతా విషయావగాహన కలిగి మార్పుకై పనిచేసే క్రియాశీలక కార్యకర్తలుగా తయారయ్యారు. ఈ క్షేత్రస్థాయి మహిళా సంఘాలు ప్రస్తుతం వారివారి ప్రాంతాలలో నెలకొని ఉన్న జెండర్‌ కట్టుబాట్లను చాలావరకు బద్దలు కొట్టగలిగే స్థాయికి చేరుకున్నాయి. ఇంకా గ్రామపంచాయితి వంటి నిర్ణయాలు చేసే వ్యవస్థలలోకి కూడా చొచ్చుకుపోతున్నాయి. ఈ మహిళా సంఘాలు దీర్ఘకాలంపాటు సుస్థిర జీవనోపా దులు పొందేందుకు పెద్ద కార్యక్రమాలైన పనికి ఆహారపథకం, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారీ, గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి వాటిని విజయవంతంగా అందుకుని వినియోగించు కోగలిగాయి. అయితే ఇది అన్ని రాష్ట్రాలలోను మొత్తం కార్యక్రమ మంతటా ఒకేలా లేదు. ఏది ఏమైనా, ఎక్కువమంది సంఘం సభ్యులు చిన్న, సన్నకారు రైతులో లేక వ్యవసాయ కూలీలో అయినందున వారు భూఆధారిత కార్యక్రమాలపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడం ద్వారా తమ కుటుంబాలకు ఆహార భద్రత కలగచేయగలమని, వలసలను నివారించవచ్చని భావించారు, అధికశాతం సాధించారు కూడా. విస్తృత సందర్భంలో, మహిళలు వ్యవసాయ భూముల యజమానులు కాదు కనుక వారిని రైతులుగా గుర్తించడంలేదు. యాజమాన్యం, వేతనాల చెల్లింపు, నిర్ణయాధికారం, క్రయవిక్రయాలు/అమ్మకాలు, ఆదాయంపై నియంత్రణ వంటి విషయాలకొచ్చేసరికి స్త్రీలపట్ల వివక్ష స్పష్టంగా కనిపిస్తోంది. గత కొన్నేళ్ళుగా వివిధ స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంస్థలు, ప్రభుత్వం చేసిన ప్రయత్నాలవల్ల వ్యవసాయంలో స్త్రీల స్థితి, హోదాలో కొంత మార్పు వచ్చింది. అయినప్పటికీ గ్రామీణ మహిళా రైతులు, వ్యవసాయ కూలీలు సమానత్వం దిశగా ముందుకెళ్ళడానికి, సాధికారతను సాధించడానికి ఈ మార్పును సమగ్రమైనదిగా చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. భారతదేశపు సందర్భంలో చాలావరకు వ్యవసాయదారులు చిన్న కమతాలు కలిగి ఉండడం వలన సంఘటిత వ్యవసాయం ఒక కీలకమైన వ్యూహం అవుతుంది. ఈ దిశగా గత ఒకటిన్నర దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమత సొసైటి ప్రయత్నాలు సాగిస్తూ ఉంది. వ్యవసాయంలో సంఘటిత ప్రయత్నాల ద్వారా ఆశించిన మార్పును సాధించేందుకుగాను చేసే ప్రక్రియలన్నింటికి క్షేత్రస్థాయిలోని మహిళా సంఘాలు కేంద్రబిందువుగా ఉన్నాయి. ‘మహిళా సంఘాలచే సంఘటిత వ్యవసాయం’ అన్న ఈ విజయవంతమైన మోడల్‌కు సంబంధించి మహిళా సమత అనుభవాలనుండి కొన్ని వివరాలు ఇలా ఉన్నాయి. సంఘటిత వ్యవసాయం – మహిళా సమత అనుభవం : విద్య ద్వారా స్త్రీలను స్వశక్తివంతులను చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమత సొసైటీ రాష్ట్రంలో 1992లో ప్రారంభమైంది. ఇది జాతీయ మహిళా సమాఖ్య కార్యక్రమంలో భాగం. భూమి, నీరు, వంటచెఱకు వంటి సహజ వనరుల ప్రాథమిక వినియోగదారులు మహిళలే. వ్యవసాయంలో స్త్రీల ప్రత్యక్ష ప్రమేయంతోపాటు సహజవనరులైన నీరు, పశుగ్రాసం, వంటచెఱకు సేకరించడం వంటి అనేకం కూడా స్త్రీల కార్యకలాపాలకు సహకరిస్తున్నాయి. ఇట్టి సహజ వనరులు క్షీణించిపోవడం వల్ల స్త్రీలపై ప్రత్యక్షంగా ప్రభావం పడుతోంది. మరోవైపు వ్యవసాయంలో పాటిస్తున్న అనేక పద్ధతులు సుస్థిరమైనవి కాకపోవడంతో, సహజవనరులకు కోలుకోలేని నష్టం జరుగుతోంది. లాభాలార్జించడమే ధ్యేయంగా ప్రస్తుతం వ్యవసాయంలో సాంప్రదాయిక ప్రధాన పంటలపై కాక వాణిజ్యపంటల పెంపకంపై దృష్టి ఉంది. దీని ప్రభావం స్త్రీలపై నేరుగా పడుతోంది. వారు ఋణాలు, సమాచారం, సాంకేతికత వంటి వనరులని సమీకరించుకో లేకపోవడం వల్ల ఈ పరిస్థితిని వారు సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతున్నారు. ఈ పరిస్థితే మహిళా సంఘాలు భూమిని లీజుకి తీసుకుని వ్యవసాయాన్ని చేపట్టే వ్యూహానికి దారితీసింది. దీనికోసం సంఘంనిధిని, సంఘం సభ్యులం దరూ కలిసి జమచేసుకున్న మొత్తాన్ని వినియోగించుకున్నారు. మొట్టమొదటిగా దీనిని మెదక్‌ జిల్లాలోని సంఘాలు చేపట్టి చూశాయి. దీని ఫలితాలు మిశ్రమంగా వచ్చాయి, స్త్రీల అనుభవాలు వేరువేరుగా ఉన్నాయి. స్త్రీలకు ఋణసౌకర్యం, సాంకేతిక సమాచారం అందుబాటు వంటివి ఇంకా సమస్యలుగానే ఉండిపోయాయి. మహిళా సమత చైతన్య పరచి, అవగాహన కల్పించే కార్యక్రమం కనుక సంఘాలకు పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయాన్ని అందించే ఆస్కారం లేకపోయింది. ఈ కారణంతో ”మహిళా సంఘాలచే వ్యవసాయం” దిశగా ఒక ప్రాజెక్ట్‌ రూపకల్పనకు దారితీసింది. ఇదే ‘సమతా-ధరణి’ అని స్త్రీలచే నామకరణం చేయబడ్డ ”ఆంధ్రప్రదేశ్‌లోని మహిళా సంఘాలచే సుస్థిర మెట్ట వ్యవసాయం” అనే పైలట్‌ ప్రాజెక్ట్‌. దీనికి కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వశాఖ ద్వారా యుఎన్‌డిపి ఆర్థిక సహకారాన్ని అందించింది.

సమతా-ధరణి ముఖ్య ఉద్దేశ్యాలు : ్న సుస్థిర వ్యవసాయం కోసం ఉత్పాదక వనరులను స్త్రీలు అందుకునేలా చేయడం ్న ఈ కార్యక్రమ పరిధిలోని సహజవనరులను పునరుద్ధరించడం ్న కుటుంబ ఆహార భద్రతను సాధించేందుకు మహిళా రైతులకు సహకారం ్న మహిళా రైతుల సమాచార అవసరాలను తీర్చుకునేందుకు ఒక ప్రభావవంతమైన వ్యవస్థ ఏర్పాటు ్న వ్యవసాయ విధానాల ఏర్పాటు ప్రక్రియల్లో వ్యూహాత్మక జెండర్‌ అవసరాలను అంతర్లీనం చేయడం ఈ ప్రాజెక్ట్‌ క్రింద చేపట్టాలనుకున్న ముఖ్యమైన కార్యక్రమాలు – సంఘాల ద్వారా సంఘటిత వ్యవసాయం, ప్రధాన ఆహార పంటలను పండించేందుకు ప్రాధాన్యత. సంఘాలు వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలైన పశువుల పెంపకం, ఎర్రల ఎరువు తయారీ, సహజ ఎరువుల తయారీ, సామూహిక ధాన్యాగారాలు, విత్తన భాండాల ఏర్పాటు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉన్నాయి. ఇది 2000 సం. నుండి 2005 సం. మధ్యకాలంలో మెదక్‌, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని 500 గ్రామాల్లో అమలు చేయబడింది. ఈ ప్రాజెక్ట్‌ కోసం సంఘం స్త్రీలు తమ స్వంత భూములను, వారికి యస్‌.సి. కార్పొరేషన్‌ కేటాయించిన భూములను, కొన్ని చోట్ల భూస్వాములనుండి దీర్ఘకాలానికి లీజుకు తీసుకున్న భూములను ఉపయోగించుకున్నారు. ఈ 500 గ్రామాలలో 3475 మంది స్త్రీలు సుమారు 4000 ఎకరాల భూమిని అందుబాటులోకి తెచ్చుకొని సంఘటితంగా సాగులోకి తేగలిగారు. ఇలా భూమిని వారి ఆధీనంలోకి తెచ్చుకునే క్రమంలో లీజు మొత్తం, లీజు కాలం వంటి అంశాలపై వారి బేరమాడే శక్తి, నైపుణ్యాలు విస్తృతంగా పెరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా స్త్రీలు సాగును ప్రారంభించేం దుకు భూమిని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడంలో వారికి విధానపరమైన నిబంధనలు ఎన్నో రకాల కష్టాలని తెచ్చిపెట్టాయి. నిరంతర పితృస్వామ్య నమ్మకాలవల్ల భూమి హక్కుల బదలాయింపు ఏ మాత్రం తేలికకాదు. ఈ వైఖరిలో మార్పు తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలవల్ల పురుషులనుండి కొంతవరకు సానుకూల స్పందన లభించింది కాని భూమి రిజిస్ట్రేషన్‌ ధరలు ఎక్కువగా ఉండడం వల్ల మహిళలు భూములను తమ పేరు మీదో లేక సంఘం పేరు మీదో రిజిస్టర్‌ చేసుకోడానికి బదులు బాండ్‌ పేపర్‌పై రాసుకుని సరిపుచ్చుకోవలసి వచ్చింది. ఉమ్మడి పట్టాల విషయంలోనూ ఇదే జరిగింది. పరిపాలనాపరమైన ఇబ్బందుల కారణంగా ఉమ్మడి పట్టాలకోసం జరిగిన ప్రయత్నాలు సఫలంకాలేదు. ఇది సమాజంలో, అధికార సమీకరణాలలో మార్పువైపుగా ఉన్న భయాలను స్పష్టం చేస్తుంది. దీనివల్ల ప్రతిస్థాయిలోను సంఘాలు ఈ అంశాలను మాట్లాడడం, చర్చలు చేయడం, బేరమాడడం అనేది ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగించాల్సి వచ్చింది. భూమిని కౌలుకు తీసుకునే క్రమంలో నిరంతర చర్చల అనంతరం కూడా భూమిని దీర్ఘకాలానికి కౌలుకివ్వాలంటే ఆ భూమి తమ చేజారి పోతుందేమోనన్న భయాలు పురుషుల్లో కొనసాగాయి. అయితే, అనేకసార్లు చర్చించిన తర్వాత భూమిని ఎక్కువ కాలంపాటు బీడు పెట్టటంవల్ల భూసారం తగ్గి, ఉత్పాదకత తగ్గిపోయే ప్రమాదం ఉందని గుర్తించారు. అంతేకాక, తమ కుటుంబ మహిళలే భూమిని సాగుచేయడం వల్ల ఆహారధాన్యాలలో వారికీ కొంతభాగం వస్తుందని, అది వారి కుటుంబ వినియోగానికి ఎంతో ఉపయోగమని భావించారు. ఇలా ఒప్పందానికొచ్చి భూములను దీర్ఘకాలానికి కౌలుకివ్యడానికి ముందుకొచ్చి సంఘాలకు సహకరించారు. సూక్ష్మ పెట్టుబడి సహాయం/మైక్రో కాపిటల్‌ అసిస్టెన్స్‌ (యంసిఏ) – సంఘటిత వ్యవసాయం : ఈ ప్రాజెక్ట్‌ ప్రారంభించడానికి ముందు చాలామంది మహిళా రైతులు తమ భూములను బీడుగా వదిలేశారు. సాగు చేసినా కూడా మంచి దిగుబడిని సాధించలేకపోయారు. కరువు కాలాలలో వారు పెద్ద రైతుపై ఆధారపడేవారు. వారినుండి ‘నాగు’ పద్ధతిలో (అంటే ధాన్యానికి వడ్డీగా మరికొంత ధాన్యాన్ని జోడించడం) ధాన్యాన్ని అప్పు తీసుకుని వారి కుటుంబ ఆహార అవసరాలను తీర్చుకునేవారు. ఒకవేళ పంట నష్టం జరిగినట్లైతే ఆ పెద్ద రైతుల వ్యవసాయ భూముల్లోనే పనులు చేసి ఎటువంటి కూలి తీసుకోకుండా వారి అప్పులను తీర్చే ప్రయత్నం చేసేవారు. కొన్నిసార్లు ప్రైవేటు ఋణదాతలనుండి అధిక వడ్డీరేట్లతో అప్పుతీసుకొని ఆ అప్పుని తీర్చలేక ఋణగ్రస్తులైపోయేవారు. ఈ పరిస్థితులన్నీ కలిసి స్త్రీలను ఒకవైపు అప్పులను తీర్చాల్సిన ఒత్తిడి మరోవైపు కుటుంబ సభ్యులందరికీ ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత వంటి క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేవి. అయితే, సమత-ధరణి ప్రాజెక్ట్‌లో భాగంగా సంఘానికి 35,000/-ల చొప్పున 500 సంఘాలకు ఆహార పంటల సాగుకోసం రివాల్వింగ్‌ ఫండ్‌ రూపంలో మైక్రోకాపిటల్‌ అసిస్టెన్స్‌ను అందించడం జరిగింది. దీని ద్వారా వారికి వ్యవసాయం కోసం పెట్టుబడి అందుబాటులో ఉండడంవల్ల వారికి సాగుదిశగా ప్రోత్సాహం లభించింది. ఇలా ఆర్థిక సహకారం అందడంవల్ల సరైన సమయంలో నిర్ణయాలు తీసుకుని వ్యవసాయ పనులను ప్రారంభించగలిగారు. దీనివల్ల వారికి చాలా సమయం ఆదా అయింది. లేకపోతే ఈ సమయమంతా వారు అప్పుకోసం బ్యాంకుల చుట్టూ, ఋణదాతల చుట్టూ తిరగాల్సివచ్చేది. అంతేకాక, వ్యవసాయంలో వాడిన విత్తనాలు స్థానికరకం కావడంతో దుర్భర వాతావరణ పరిస్థితులను తట్టుకుని కనీస దిగుబడినైనా పొందారు. ఈ రకంగా వచ్చిన పంట ఎంతైనాకాని సంఘం సభ్యులందరూ వారి వారి కుటుంబ అవసరాల నిమిత్తం దానిని పంచుకొనేవారు. పైగా, శ్రమను పంచుకోవటంవలన కూలీలపై పెట్టుబడిని నివారించుకోడంతోపాటు వారి వారి స్వంత భూముల్లో పనికి, సంఘటితంగా వ్యవసాయం చేసుకుంటున్న భూమిలో పనికి మధ్య వారి సమయాన్ని, పనిని సమర్థవంతంగా నిర్వహించుకోగలిగారు. సంఘాలు అదనపు ఆదాయం పొందడానికి గాను పొలాల్లో గట్ల మీద, పెరటితోటల్లోను కూరగాయలను పెంచేవారు. దీని ద్వారా స్త్రీలు వారు పెంచుతున్న రక రకాల కూరగాయలను వండడం, ఆహారంలో భాగం చేసుకోవడంవలన వారి వారి కుటుంబసభ్యుల పోషకారోగ్యం మెరుగుపడడానికి ఎంతో దోహదపడింది. ఈ ప్రాజెక్ట్‌ కాలంలో వరస కరువు, అకాల వర్షాల కారణంగా పంట దిగుబడి ఆశాజనకంగా లేకపోయింది. కాని యంసీఏ వలన సంఘం స్త్రీలు భారీ అప్పులు, అధిక వడ్డీల బారి నుండి తప్పించుకోగలిగారు. ఇది వారు స్వావలంబన దిశగా ముందుకు సాగడానికి ఎంతగానో ఉపయోగపడింది. కొన్నిసార్లు వారు తీసుకున్న మొత్తాన్ని సక్రమంగా బ్యాంకులో కట్టలేకపోయేవారు. కాని, వచ్చిన పంట దిగుబడి ఏ మాత్రం వచ్చినా దానిలో కొంతభాగం వారి కుటుంబ అవసరాలకు వాడుకుని, మిగిలిన భాగాన్ని తర్వాతి సీజన్‌కి పెట్టుబడిగా వాడేవారు. దీనివల్ల వారికి కొంతైనా ఆహార భద్రత సమకూరడంతోపాటు వారి మీద అన్ని రకాలుగానూ ఒత్తిడి తక్కువగా ఉండేది. సంఘాలు, వారు అప్పుటికే సంఘటితంగా చేపట్టిన  పనులలోని సానుకూల అనుభవాలు ఈ సంఘటిత వ్యవసాయ ప్రాజెక్ట్‌కు బలమైన మూలాలు అయ్యాయి. సంఘటిత వ్యవసాయంలో కలిసి పనిచేయడమంటే కేవలం శ్రమను పంచుకోవడం, జమాఖర్చుల నిర్వహణ, క్రయవిక్రయాలు, బ్యాంక్‌ పనులు చూసుకోవడమే కాదు. ఇందులో వానపాముల ఎరువు తయారీకి, ధాన్యాన్ని నిలవచేసు కోడానికి అవసరమైన నిర్మాణాలను కట్టడంతోపాటు నిర్వహించడం, విత్తన భాండాలను నిర్వహించడం, సౌర లాంతర్ల వాడకం వంటివి కూడా భాగంగా ఉన్నాయి. భూ అభివృద్ధి కార్యక్రమాలు : చాలా సందర్భాలలో మహిళలు పొందిన భూమి బీడుపడి, వ్యవసాయానికి/సాగుకు అనుకూలంగా లేనిదిగా ఉండి, ముందుగా ఈ భూమిలో అదనపు నిధులుపెట్టి అభివృద్ధి పరచాల్సి వచ్చేది. అలాంటి సమయాలలో భూ అభివృద్ధి కార్యకలాపాలను చేపట్టడానికి ముందు సంఘాలను సంప్రదించి కొన్ని నియమాలను రూపొందిం చడం జరిగింది. అవి- ్న మొత్తం భూమంతా ఒకే దగ్గర ఉండేలా చూసుకోవడం ్న ఆ భూమి సంఘం స్త్రీల కుటుంబ సభ్యులదై ఉండాలి ్న భూమిని దీర్ఘకాలానికి లేదా పరిమిత కాలానికి సంఘం పేరు మీదకి బదిలీ చేయాలి (న్యాయ సలహాననుసరించి) ్న సంఘాలు ఆహార పంటలనే సాగుచేయాలి ఆసక్తికరంగా, దాదాపు 10వ వంతు గ్రామాలలోని (51) సంఘాలు పై నియమాలన్నింటిని అనుసరించగలిగాయి. మిగిలిన సంఘాలు రెండు లేదా మూడు నియమాలను మాత్రమే పాటించగలిగాయి. కనుక ఆ 51 గ్రామాలలో భూ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా రాళ్ళు, రప్పలతో, ముళ్ళ పొదలతో నిండి ఉన్న సంఘం స్త్రీల భూములను మెరుగుపరచుకుని సాగుకు అనుకూలంగా మార్చుకోగలిగారు. ఈ భూములన్నీ దాదాపు అసైన్డ్‌ భూములే లేదా ఎస్‌సి కార్పొరేషన్‌ ద్వారా మహిళలు పొందిన భూములు. వీటిని భూ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా సాగులోకి తీసుకురావడంతో సుమారు మరో 100 ఎకరాలకుపైగా వ్యవసాయ భూమి పెరగడం, దానిపై మహిళలు హక్కు పొందడం, కందులు, జొన్న వంటి పంటలు వేసుకోవడం ద్వారా ఆహార ధాన్యాల లభ్యత పెరగడంవంటి వివిధ ప్రయోజనాలు కలిగాయి. వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలు : భూ ఆధారిత వ్యవసాయ కార్యక్రమాలపై ఆదాయం ఎప్పుడూ కూడా వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. దీనిపై రైతుకు ఎటువంటి నియంత్రణకి అవకాశం లేదు. ఇలా ప్రకృతి వైపరీత్యాలు సాగుదిగుబడిపైన, యంసీఏ చెల్లింపులపైనా ప్రభావాన్ని చూపాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్త్రీలు వ్యవసాయంలో వారి సంఘటిత ప్రయత్నాలను కొనసాగించడానికి ఎంతో ప్రయాసపడేవారు. ఈ నేపథ్యంలో స్త్రీలకు వ్యవసాయ పనులు తక్కువగా ఉండే కాలంలో సాగు ఖర్చును తగ్గించి ప్రత్యామ్నాయ ఆదాయాన్ని అందించే సమగ్ర వ్యవసాయాన్ని చేపట్టేందుకు చర్చలు జరిగాయి. తర్వాత కొన్ని సంఘాలకు ఈ కార్యక్రమాలను చేపట్టేందుకుగాను రెండోసారి యంసీఏ కేటాయించడం జరిగింది. అయితే ఇది భూ అభివృద్ధి కార్యక్రమాలు కోసం సహకారాన్ని అందించిన సంఘాలకు కాకుండా ఇతర సంఘాలకు మాత్రమే ఇవ్వడమైంది. ఈ నిధులను వినియోగించుకుని కొన్ని సంఘాలు వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలైన పాడి పశువుల పెంపకం, కోళ్ళఫారం పెట్టడం, గొర్రెల పెంపకం, మేకల పెంపకం, వానపాముల ఎరువు తయారీ, పప్పుల మిల్లు, పిండి గిర్ని ఏర్పాటు చేయడం వంటి వాటిని చేపట్టారు. దీని ద్వారా కుటుంబ అవసరాలకు అలాగే సుస్థిర ఆదాయాన్ని పొందడానికి మార్గం ఏర్పడినట్లయింది. ఈ కార్యక్రమాలను చేపట్టడం ద్వారా సంఘాలు ఇద్దరు ముగ్గురు (కొన్ని సందర్భాలలో ఎక్కువమందికి) సంఘం సభ్యులకి నిరంతరం పని కల్పించగలిగారు, తద్వారా సుస్థిర ఆదాయాన్ని పొందగలిగారు. ఇది వ్యవసాయంలో మారుతున్న స్త్రీల పాత్రకు అద్దం పడుతోంది. సామర్థ్యాల పెంపుదల మరియు వ్యూహాలు : సమత ధరణి ద్వారా సంఘం స్త్రీలకు, మహిళా రైతులకు వివిధ స్థాయిల్లో, వివిధ రూపాల్లో వ్యవసాయ పద్ధతులపైన, మారుతున్న వాతావరణ పరిస్థితులపైన, సేంద్రీయ వ్యవసాయంపైన, క్రయవిక్రయాలకు సంబంధించిన అంశాలపైన సామర్థ్యాలను పెంచడం జరిగింది. ఇందులో భాగంగా సమావేశాలు, కార్యశాలలు, ఇతర ప్రాంతాలకు సందర్శనలు, విజ్ఞానయాత్రలు, అధ్యయన పర్యటనలు, పరిశోధనా సంస్థల అధ్యయనాలలో భాగస్వామ్యం వంటి వాటి ద్వారా సాంకేతిక సమాచారం అందించడం కూడా జరిగింది. ఇవి కేవలం పొలాల బైట చేపట్టిన కార్యక్రమాలుగా కాక పొలాలలో కూడా నేర్చుకునే ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగింది. సమత ధరణి ప్రాజెక్ట్‌ ప్రభావం : ఈ ప్రాజెక్ట్‌ ద్వారా వివిధ కోణాలలో అనేక  సత్ఫలితాలు వచ్చాయి. దీని ద్వారా మహిళా రైతుల్లో సంఘీభావం గట్టిపడింది. మరో విషయం కూడా స్పష్టమయింది. అదేంటంటే, కలిసి పని చేయడం వలన కేవలం ఆర్థిక ప్రయోజనాలేకాక మహిళా రైతుల మధ్య ఒక గట్టి బంధం ఏర్పడడం ద్వారా వ్యవసాయంలో విత్తనాలువేయడంతో మొదలుపెట్టి పంటకోయడం, మార్కెట్‌కు తరలించడం, ధర నిర్ణయించడం వంటి అన్ని విషయాలలోను సరైన నిర్ణయాలు తీసుకోగలిగారు. గ్రామంలోని కుటుంబాల మధ్య అన్యోన్యత, పరస్పర ఆధారంతోపాటు శ్రమ పంపిణీకి, దిగుబడి (పంట), సమాచారం, జ్ఞానం వంటిని పంచుకొనే వాతావరణం ఏర్పడింది. ఇది ఉమ్మడిగా ఆకలి పరిస్థితుల నుండి బైటపడడంలో, ఆర్థిక హెచ్చుతగ్గులను తగ్గించుకోడంలో, వైఫల్యపు ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడింది. ఇతరులపట్ల దయ : సంఘం స్త్రీలు ప్రాజెక్ట్‌ ప్రారంభంలో వారి స్వంత ఆహార భద్రత పైనే దృష్టి కేంద్రీకరించారు. కాని తదుపరి సీజన్‌లలో కూడా ప్రాజెక్ట్‌ కార్యక్రమాలను కొనసాగిస్తున్న క్రమంలో గ్రామంలోని ఇతర నిరుపేద కుటుంబాలపై దృష్టి సారించారు. ప్రాజెక్ట్‌లో భాగంకాని, మనుగడకై పోరాడుతున్న అతిపేద కుటుంబాల ఆహార అవసరాలకు సహాయమందించారు. చాలా గ్రామాలలో సంఘం స్త్రీలు వారి పంటలో కొంత భాగాన్ని వయసు మీద పడి పనిచేయలేని పరిస్థితుల్లో ఉన్న భార్యాభర్తలకు, ఒంటరి వ్యక్తులకు జీవించి ఉండటానికి అవసరమైన కనీస ఆహారం అందేలా చూసుకున్నారు. కొద్ది సందర్భాలలో సంఘం స్త్రీలు నిరుపేద కుటుంబాలలోని ఆడపిల్లలకు కరువు కాలంలో పెళ్ళిళ్ళు జరిగినపుడు బియ్యం, పప్పు, కూరగాయ లను అందజేసి ఆదుకున్నారు. ఇలాంటి సందర్భాలలో సంఘం స్త్రీలు ఆయా కుటుంబాలతో చర్చించి కేవలం దగ్గరి బంధువులను మాత్రమే పెళ్ళికి పిలవడం ద్వారా పెళ్ళి ఖర్చులను తగ్గించుకునేలా, పెళ్ళి బట్టలపై ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఉండేలా ఒప్పించ గలిగారు. తద్వారా ఆ కుటుంబం అప్పులపాలు కాకూడదన్నదే వారి ఉద్దేశ్యం. ఈ పెళ్ళిళ్ళలో గ్రామంలోని అన్ని కుటుంబాలు పాల్గొని, పెళ్ళికయ్యే ఖర్చులలో ఒక్కొక్కరు ఒక్కొక్కటి పంచుకుని తక్కువ ఖర్చులో పెళ్ళి జరిగేలా దోహదపడ్డారు. ఇలాంటి సందర్భాలలో సంఘం స్త్రీలకు పంటలు బాగా పండో లేక లాభాలు గడించో ఇలా చేయలేదు. కేవలం అత్యవసరాల్లో ఉన్న సాటి మనుషుల పట్ల దయతో మాత్రమే వారికున్న దాన్లో కొంతభాగాన్ని పంచారు. దీన్ని వారు ‘ఇతరులకు సహాయపడడమంటే తమకి తాము సహాయపడడమే’ అని అంటారు. ఈ అనుభవలన్నీ  ప్రజా సంస్థలతో చర్చించడం, మార్కెట్‌ స్థలాలు, బ్యాంక్‌, ఇతర ప్రభుత్వ వ్యవస్థలతో పనిచేయడం, వాటిని అందుబాటులోనికి తెచ్చుకోవడం వంటి అవసరాలవల్ల వారిని ప్రజావరణాల్లోకి వచ్చేలా చేశాయి. ఇది వారు, వారి కుటుంబాలు కరువు పరిస్థితుల్లోను, పంటలు విఫలమైన సమయాలలోను అలాంటి కఠినమైన పరిస్థితుల్ని తట్టుకుని నిలబడ్డంలోనే స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ జిల్లాలలోని ఇతర ప్రాంతాలలో కరువు కాలంలో రైతుల ఆత్మహత్యలు నమోదయ్యాయి కాని సమతా ధరణి ప్రాజెక్ట్‌ గ్రామాలలో అటువంటి సంఘటన ఒక్కటి కూడా జరగలేదని గట్టిగా చెప్పగలం. దీనికి కారణం సమత-ధరణి ప్రాజెక్ట్‌ సంఘం స్త్రీలను వారి కుటుంబ సభ్యులను సంఘటిత పరచడంవల్ల, వ్యవసాయ దిగుబడిని పంచుకోడం ద్వారా ఇలాంటి కరువు పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు దోహదపడిందని చెప్పవచ్చు. మహిళా రైతులుగా గుర్తింపు : వ్యవసాయ పద్ధతులకు సంబంధించి స్త్రీల జ్ఞానం, అవగాహన చెప్పుకోదగ్గ విధంగా పెరిగాయి. వీరు నేర్చుకున్న అంశాలను ఆచరణలో పెట్టగలిగారు. ఇది వారు సేంద్రీయ ఎరువులను, వానపాముల ఎరువును, వేప కషాయం, వేప చెక్క వంటి క్రిమి సంహారకాలను సమయానుకూలంగా తయారుచేసి వినియోగించిన తీరులో సుస్పష్టమయింది. సంఘం స్త్రీల ఉత్సుకత, ఉత్సాహం గమనించిన క్రీడా (జ=Iణూ – మెట్టభూముల వ్యవసాయపు పరిశోధనా కేంద్రం) కొంతమంది మహిళా రైతులకు మెట్టభూములలో వ్యవసాయంపై వారి సామర్థ్యాలను పెంచేందుకు వ్యవసాయ భూములలోనే శిక్షణా కార్యక్రమాల్ని నిర్వహించింది. వ్యవసాయ కార్యక్రమాలే కాక సంఘం స్త్రీలు గ్రామాభివృద్ధికై వారు చేపట్టే కార్యకలాపాలలో భాగంగా గ్రామసభలలోను, పంచాయితీ సమావేశాలలోను, జన్మభూమి, పల్స్‌పోలియో, మళ్ళీ బడికి వంటి కార్యక్రమాలలో విస్తృతంగా పాల్గొన్నారు. అంతేకాక, వారు మురుగునీటి కాల్వల నిర్మాణం, రోడ్లు వేయడం వంటివి కూడా చేపట్టి వ్యవసాయ పనులు లేని కాలంలో కూడా ఆదాయ మార్గాలను సాధించారు. వీరు ప్రభుత్వ పథకాలను అందుకోడంతో పాటు రేషన్‌ కార్డులు, ఇళ్ళు, తగ్గింపు ధరల్లో విత్తనాలు, యంత్రాల వంటి వాటిని పొందగలిగారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వ్యవసాయశాఖ కూడా వీరి సంఘటిత శక్తిని గుర్తించి 5 జిల్లాల్లో కలిపి 104 మల్టీక్రాప్‌ త్రెషర్స్‌ను, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలలోని మహిళా రైతులకు 34 మొక్కజొన్న గింజలు తీసే యంత్రాలను అందించారు. పంటనూర్పిడి, గింజలను వేరు చేయడం వంటి పనులలో స్త్రీలదే ముఖ్య పాత్ర ఉంటుంది కనుక ఈ యంత్రాలు వారి చాకిరి తగ్గడానికి ఉపయోగపడ్డాయి. సమత-ధరణి కార్యక్రమం వల్ల గ్రామాలలో సంఘం స్త్రీలకు మంచి గుర్తింపు వచ్చింది. దీనివల్ల నూతన వ్యవసాయ పద్ధతులు అందుకోగలగడం, వాటిపట్ల జ్ఞానం, నియంత్రణ, నిర్ణయాధికారం కూడా కలిగి ఉండడానికి దోహదపడింది. దీనితో వారి కుటుంబాలకు పోషకాహార భద్రతను కల్పించగలగడం, అతిపేదలకు ఆహార భద్రత కల్పించడం, మహిళా రైతులుగా గుర్తింపు పొందడం సాధ్యమైంది. జెండర్‌ మూస ధోరణులను ఛేదించడం : ఈ ప్రాజెక్ట్‌ ద్వారా మహిళలు నాగళ్ళు, కొడవళ్ళు, గొర్రు, విత్తన మరియు ఎరువుల డ్రిల్‌, మెట్టభూముల్లో కలుపుతీసే చేతి యంత్రం, పురుగుమందులు కొట్టే చేతిపంపు వంటి అభివృద్ధి పరచిన వ్యవసాయ పనిముట్లను పొందగలిగారు. ఇది కేవలం వారి పనిభారాన్ని తగ్గించడం కోసం మాత్రమేకాక సాంకేతిక పరిజ్ఞానాన్ని, మెరుగైన వ్యవసాయ పద్ధతులను వారికి అందుబాటులోకి తేవడానికి కూడా ఉద్దేశంగా ఉంది. అదనంగా (మల్టీక్రాప్‌ త్రెషర్‌లు) బహుళ పంటల నూర్పిడి యంత్రాలు, మొక్కజొన్న గింజలు తీసే యంత్రాలు కూడా క్లష్టర్‌ గ్రామాలకు ఇవ్వడం జరిగింది. వీటన్నింటిని సంఘం స్త్రీలు సమత ధరణి భూములలోను, వారి కుటుంబ భూములలోను వాడుకోడంతోపాటు గ్రామంలోని ఇతరులకి కిరాయికి కూడా ఇస్తున్నారు. దీని ద్వారా వారు వ్యవసాయ దిగుబడితోపాటు అదనంగా కొంత ఆర్థిక లబ్ధిని కూడా పొందగల్గుతున్నారు. కొన్ని సంఘటనల్లో ఈ పెద్ద, మెరుగుపరచబడ్డ యంత్రాలను చూసి, వాటి ఉపయోగాలను గ్రహించి ప్రేరేపితమైన కొందరు గ్రామస్థులు వారి స్వంతంగా కూడా కొనుక్కోవడం కనిపించింది. ఈ యంత్రాల పూర్తిస్థాయి వినియోగానికై సంఘం స్త్రీలు/మహిళా రైతులు వారంతటవారే కొన్ని నియమ నిబంధనలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ యంత్రాలను స్వంత అవసరాలకు వినియోగించుకునేవారు నిర్ణీత మొత్తాన్ని అద్దెగా డబ్బు రూపంలోకాని, ధాన్యం రూపంలోకాని చెల్లించాలని నిర్ణయించుకున్నారు. ఇలా వసూలైన డబ్బు లేదా ధాన్యం ఈ యంత్రాల నిర్వహణకయ్యే ఖర్చులకు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఇతర కుటుంబాలకు సహాయాన్నందించడానికి ఉపయోగిస్తారు. మిగిలిన మొత్తాన్ని మహిళా రైతుల అత్యవసర అవసరాలకు వినియోగించుకోడానికిగాను క్లస్టర్‌ స్థాయిలో కార్పస్‌కు జమ చేస్తారు. వానపాముల ఎరువు యూనిట్లు : ప్రాజెక్ట్‌ కార్యక్రమాలలో భాగంగా కొన్ని సంఘాలు ప్రారంభంలో చిన్న గుంటల్లో వానపాముల ఎరువు తయారీని చేపట్టారు. ఒకసారి దీన్ని వాడగా వచ్చిన ఫలితాలను చూసి పెద్ద గుంటలను శాశ్వత ప్రాతిపదికన నిర్మించుకోడానికి ముందుకు వచ్చారు. ఇలా వచ్చిన ఎరువును వారి వారి పొలాల్లో పంటలకు వాడుకోవడంతో పాటు గ్రామంలోను, పొరుగు గ్రామాల్లోని ఇతర రైతులకు అమ్మారు. తద్వారా సంఘం సభ్యులకు అదనపు ఆదాయానికై ఆర్థిక కార్యక్రమంగా చేపట్టేందుకు అవకాశం కల్గింది. విత్తన భాండాగారాలు : విత్తన భాండాగారాల నిర్మాణంవల్ల వారి మిగులు దిగుబడిని నిల్వచేసుకోడానికి అవకాశం కల్పించడంతోపాటు ఈ భాండాగారాలను నిర్మించుకునేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, ఆచరణాత్మక జ్ఞానం పొందడానికి సహాయపడింది. ఈ సందర్భంగా ఒకే పంటకాలంలో వచ్చిన రెండు రకాల ధాన్యాలను ఒకే భాండాగారంలో నిల్వచేయడానికి అవసరమైన విధంగా దీని నిర్మాణం ఎలా ఉండాలని యోచించడం, ప్రయత్నించడం ఒక అనుభవం. దీని ఫలితంగా భాండాగార డిజైన్‌ మార్చి అవసరాలకు సరిపోయేలా రెండు అవుట్‌లెట్స్‌ ఉన్న భాండాగారాలను క్రీడా/మేనేజ్‌ సంస్థల సహకారంతో రూపొందించాల్సి వచ్చింది. అయితే, ఇది అంత విజయవంతం కాలేదు. కారణం ఒక్కో సీజన్‌లో వచ్చిన పంట సభ్యులందరూ పంచుకున్న తర్వాత భాండాగారంలో నిల్వ చేసేంత ధాన్యం మిగలకపోవడం. అసలు డిజైనే సరిగా లేకపోవడం రెండో కారణం. ఈ భాండాగార కట్టడాలలోనుండి ధాన్యాన్ని బైటకి తీసుకోడంలోని అసౌకర్యం, నిల్వచేసిన ధాన్యం తేమని పీల్చుకుని పాడైపోవడం జరిగింది. దీనివల్ల సంఘం స్త్రీలు సాంప్రదాయ పద్ధతుల్లో ఇంటివద్దే ధాన్యాన్ని నిల్వచేసుకోవడంవైపే మొగ్గు చూపారు. విత్తన బ్యాంక్‌లు : వరుసగా కరువు పరిస్థితులను ఎదుర్కొన్న మహిళా రైతులు ఈ పరిస్థితులను తట్టుకునే శక్తి ఉన్న స్థానిక రకం విత్తనాలపైనే దృష్టి పెట్టారు. ఈ దిశగా వారు వారి పంట దిగుబడి నుండి ఆరోగ్యమైన విత్తనాలను వేరుచేసి నిల్వచేయనారంభించారు. అయితే, దీనిని పెద్ద ఎత్తున సంఘటితంగా చేపట్టలేదు. ఈ సమయంలో ప్రాజెక్ట్‌ కార్యక్రమాలలో భాగంగా విత్తన బ్యాంకులను ప్రారంభించడం వల్ల ఆ ఖాళీ పూరించినట్లైంది. 500 గ్రామాలకు కలిపి 1500 విత్తన డబ్బాలను పంపిణీ చేయడం జరిగింది. వీటిలో సంఘం స్త్రీలు ముఖ్యంగా పెసర్లు, మినుములు, కందులు వంటి విత్తనాలను వచ్చే పంటకాలానికి వినియోగించుకోడానికి దాచుకోనారంభించారు. దీనితో ఇవి విత్తన బ్యాంకులుగా రూపొందాయి. మార్పు దిశగా : సమత ధరణి కార్యక్రమం సంఘాల అనుభవాలనుండి ఉద్భవించి ఒక నిర్ణీత కాలవ్యవధిగల ప్రాజెక్ట్‌గా రూపొందింది. ప్రాజెక్ట్‌ యొక్క నిర్దేశించిన కాలవ్యవధి పూర్తయినా కూడా సంఘాలు తమ తమ రెగ్యులర్‌ కార్యక్రమాలలో భాగంగా కొనసాగించడానికి యోచించారు. ఈ ప్రాజెక్ట్‌ యొక్క విజయం ముఖ్యంగా సంఘం స్త్రీల కుటుంబ సభ్యుల వైఖరుల్లో వచ్చిన మార్పులో గోచరమవుతుంది. వీరు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని వారికి ఆహార భద్రతను చేకూరుస్తున్న కుటుంబమంతటికీ సంబంధించినదిగా చూడనారంభించారు. సవాళ్ళు : ్న తక్కువ వర్షపాతం, సాగునీటి సదుపాయం లేకపోవడం,చీడపీడలవల్ల పంట దెబ్బతినడం ్న భూమిని కౌలుకిచ్చిన భూస్వాములు/యజమానులు కౌలుకిచ్చిన భూమి సారవంతమయ్యాక ఆ భూమి కౌలుకి కొనసాగించడానికి ఒప్పుకోకపోవడంతో కౌలు భూమిని నిలుపుకోవడం కష్టమవుతుంది. ్న మంచి దిగుబడి సాధించడానికిగాను డిపార్ట్‌మెంట్‌ నుండి అవసరమైనప్పుడు సాంకేతిక సహకారాన్ని పొందలేకపోవడం ్న విత్తన బ్యాంక్‌, ధాన్యపు భాండాగారాల వినియోగాన్ని స్థిరీకరించుకోలేకపోవడం ్న వాతావరణ మార్పులకు సంబంధించిన విషయాల పట్ల అవగాహన, పరిజ్ఞానం లేకపోవడం ్న ఎప్పటికప్పుడు మారిపోతున్న మార్కెట్‌ ధరలు ్న గ్రూప్‌ డైనమిక్స్‌, మహిళా సభ్యుల పాత్రల్లో మార్పు ్న మహిళా రైతులకు సానుకూల వాతావరణం కల్పించేలా ప్రభుత్వ వ్యవస్థల్లో జెండర్‌ స్పృహను కల్పించడం. ప్రభావం – ప్రస్తుత పరిస్థితి: ‘మహిళా సంఘాలచే మెట్ట భూముల్లో సంఘటిత వ్యవసాయం’ అమలయిన గ్రామాలలోని సంఘాల స్త్రీలు ఇలా వివిధ కార్యక్రమాలను చేపట్టిన క్రమంలో ఎన్నో ఆర్థిక, సామాజిక, వాతావరణ సమస్యలను ఎదుర్కొన్నారు. ఒక రకంగా వరస కరువు పరిస్థితులలో కాలానికి ఎదురీదారు. ఎన్నో సవాళ్ళను దాటుకుని వారి పట్టుదల, కృషితో పాటు సంఘటిత బలం వల్ల ఇదొక విజయవంతమైన ప్రక్రియగా మలచగలిగారు. కాబట్టే 12వ పంచవర్ష ప్రణాళిక రూపొందించే క్రమంలో వీరి అనుభవాలనుండి నేర్చుకున్న పాఠాల ఆధారంగా విధానాల రూపకల్పన జరిగింది. అయితే అవన్నీ ఆచరణలోకొచ్చే వరకు ఫలితాలన చూడలేం. ఈ లోగా, సమత ధరణి చేపట్టిన 500 సంఘాలకు గాను సుమారు 250 సంఘాలలోని సంఘం స్త్రీలు ఎటువంటి తదుపరి సహకారం లేకున్నా ఇప్పటికీ వారి వారి ప్రయత్నాలను కొనసాగిస్తూ క్లిష్ట పరిస్థితులను, వ్యవసాయ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగల్గుతున్నారు. కొద్ది భూమిలోనైనా సంఘటితంగా పండించుకున్న పంటను, కూరగాయ లను, పెంచుకుంటున్న కోళ్ళు, పశువులు, చిన్న జీవాల నుండి వస్తున్న ఉత్పత్తులను వినియోగించుకుని ఆహార భద్రత, పోషక భద్రతతో పాటు మెరుగైన ఆరోగ్యం ఆదాయాలతో వ్యవసాయ ప్రపంచానికి నేటికీ ఒక ఉదాహరణగా నిలుస్తున్నారు. ముగింపు : భారతదేశం వ్యవసాయాధారిత సమాజం కనుక దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలకపాత్ర పోషిస్తోంది. ముద్రిత సమాచారం ప్రకారం దాదాపు 80% భూమి చిన్న, సన్నకారు రైతుల ఆధీనంలో ఉంది. ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలున్న ప్రస్తుత సందర్భంలో చిన్న కమతాలలో వ్యవసాయం లాభదాయకం కాదు. పంటల విధానంలో కూడా ఎంతో మార్పు వచ్చింది. వ్యవసాయంలోని విధానాలు మద్ధతిచ్చేవిగా లేకపోవడంవల్ల రైతులు వారి దృష్టి ఆహార పంటలనుండి వాణిజ్యపంటలవైపు మరల్చారు. ఇది ఆహార ధాన్యాల ఉత్పత్తిపై చెడు ప్రభావాన్ని చూపించడంతో ఆహార అభద్రతకు దారి తీస్తోంది. దీనికి ప్రత్యామ్నాయం భూ వ్యర్థాన్ని తగ్గించి పూర్తిస్థాయిలో ఆదాయాన్ని పొందడానికిగాను సంఘటిత/సహకార వ్యవసాయం చేపట్టడం లేదా భూమిని పెద్ద కమతాలుగా చేయడం. ఏ దేశానికైనా ఆర్థికాభివృద్ధి ఆ దేశపౌరుల ఆరోగ్యంపై ఆధారపడి ఉంది. ఇది తిరిగి ఆ ప్రజలు తీసుకునే ఆహారపు పరిమాణం, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఇది పూర్తిగా పోషకాహారం ఒక సుస్థిర పద్ధతిలో లభించడం, అందుబాటు, తినడం, జీర్ణించుకోవడంపై ఆధారపడి ఉంది. మనదేశంలో పౌరులందరికీ ఆహారభద్రత అందించడానికి, ఆకలిలేని సమాజాన్ని సాధించ డానికిగాను అనేక పథకాలు, కార్యక్రమాలు ప్రారంభించ బడ్డాయి. అయినాకూడా చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది. బరువు తక్కువ శిశువులు, కుపోషణ, స్త్రీలలోను యుక్తవయసు బాలికల్లోను నెలకొన్న తీవ్రరక్తహీనత, సామాజిక ఆర్థిక అసమానతలు, లింగవివక్ష వంటి సమస్యలనుండి ఇంకా బైటపడాల్సి ఉంది. పై సమస్యలను తీర్చుకోవడంలో స్త్రీల పాత్ర అత్యంత కీలకమవుతుంది ఎందుకంటే ఇందులో వారే ముఖ్యమైన భాగస్వాములు కనుక. మనదేశంలో లోతుగా పాతుకుపోయిన పితృస్వామ్య విలువలు, నిబంధనలు స్త్రీలు స్వశక్తి సాధించడంలో పెద్ద అడ్డంకిగా ఉన్నాయి. దీనిలో మార్పు రానంతకాలం స్త్రీల పరిస్థితిలో మెరుగుదల కనబడదు. ఈస్థితిలో ఆహార మరియు పోషక భద్రతలను సాధించాలంటే స్త్రీలను సంఘటిత పరచి వారి పరిజ్ఞానాన్ని పెంచడం ద్వారానే సాధ్యమవుతుంది. ఇది పరీక్షలకు నిలిచి, విజయవంతమైన, ఒక ఫలవంతమైన వ్యూహం అవుతుంది, అది వ్యవసాయంలో కానీ ఇతర జీవనోపాధుల్లో కానీ లేదా కుటుంబ స్థాయిలోకానీ. ఈ దిశగా ప్రస్తుతం ఉన్న విధానాలలో తగిన మార్పుతోపాటు ప్రభావవంతంగా అమలు జరగడానికి, తద్వారా ఆశించిన లక్ష్యాలను సాధించడానికిగాను సమానత్వపు దృష్టికోణంతో కూడిన బలమైన రాజకీయ  సంకల్పం అవసరం.

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో