ఆర్‌. వసుంధరాదేవి రచనల్లో తాత్వికదర్శనం

రచన, సేకరణ : పుష్పాంజలి


వసుంధరాదేవి కథలు సుందర ప్రకృతికీ మానవ సహజ నైజాలకు ప్రతికృతులు.  జర, రుజ, మరణాలకు అర్థం వెదికే అన్వేషణలు.  సృష్టి రహస్యాన్ని చేధించే పరిశోధనలు. 

 ఈమె కథల్లో తాత్వికచింతన అంతర్గత ప్రవాహంలా సాగుతుంటుంది.  జీవితంలో జరిగే అతిసాధారణమైన సంఘటనల నుంచి మానవనైజాలను వెదికే కథలవి.  హృదయంతరాళ జిగిబిగి ఆలోచనల చిక్కు ముళ్లు విడదీసే ప్రయత్నాలివి.  లౌకిక సంఘటనల నుంచి ప్రగాఢమైన అలౌకికతను ప్రతిబింబిస్తాయి వసుంధరాదేవి కథలు.
”పంచభూతముల తోలుబొమ్మతో ప్రపంచమాయెనట” అంటూ సృష్టిరహస్యాన్ని పాటగా పాడే పాత్రలూ, ”ఎక్కువ తక్కువల లోకానికి మూలతత్వం వినాశం.  వాస్తవికతను నిరాకరించి అవాస్తవిక లోకాన్ని సృష్టించడం.  కనిపించేదాన్ని నాశనం చెయ్యడం” అంటూ గొప్పదనాన్ని కొలిచే ప్రమాణం ఎక్కడుందని ప్రశ్నించే పాత్రలు, ”నీడకీ నిజానికీ వెనుకనున్న తత్వం అందుకొన్నవారికి జీవితం ఒక ఆట” అని చెప్పే సందర్భాలూ, ”పరిస్థితులు అనివార్యంగా ముందుకు జరిగాక అనుభవం ఒక్కటే మనిషికి పాఠం నేర్పగల శక్తి గలది.  జీవితం అనే కొలిమిలో, తను కోరుకోని అనుభవాల సమ్మెటపోట్లతో, తన కోరికలతో, ఆలోచనలతో సంబంధంలేని కొత్తరూపం దిద్దుకుంటాడు జీవి.  ఆ జీవికే అనుభవం అవసరమో అది నిర్దేశించే జీవశక్తికే బాగా తెలుస్తుంది…” లాంటి ఆత్మజ్ఞాన విశ్లేషణలూ,
”టెక్నాలజీ పెరిగిపోయిన నాగరికతకు నిదర్శనమేగాని మూర్తీభవించిన మానవత్వానికి కాదు” అన్న నగ్నసత్యాల,
”ఈ బాగోగుల మనస్సు ఎలా ఏర్పడింది?  ఆలోచనలు, కోరికలు, ఆశలు అన్నీ అబద్దాలేనా?” అని ఆత్మపరిశోధన చేసుకునే పాత్రలూ,
”ఇది కష్టపడేవాళ్ల సమాజం కాదు,  సుఖపడేవాళ్లదీ కాదు, ఇది నశించిపోయేది” మనిషికుండే పరిమితులు, జీవితానికర్థం, స్వేచ్ఛ అన్నీ ద్వంద్వ స్వరూపమైన మనసుకు సంబంధించిన ప్రశ్నలు.  అనవసరమైన ఆలోచనలు.  కాలం కూడా మనసుకు సంబంధించేగాని సత్యంకాదు. 
నలభై ఎనిమిది కమ్మని కథలను కలిగిన వీరి కథాసర్వస్వం ”ఆర్‌. వసుంధరాదేవి కథలు” అన్న పేరుతో వెలువడింది.  వీటిలో తొమ్మిది కథలు ‘గాలిరథం’ పేరుతోను, పన్నెండు కథలు ‘నీడలు’ పేరుతోను సంకలనం చేయబడినవి.  మిగతావన్నీ ఎక్కువభాగం వివిధ పత్రికలలో ప్రచురితమైనవే.  వీరి ‘రెడ్డమ్మగుండె’ నవల ‘భారతి’ మాసపత్రికలో ధారావాహికంగా వచ్చినదే.  వీరి కథల్లో ‘మాస్టర్‌పీసెస్‌’ అనదగినవెన్నో ఉన్నా మిగతాకథల్లో ఏ ఒక్కటి కూడా పాఠకునిచే ఆత్రంగా చదివించలేనిది మాత్రం కాదు.
‘పెంజీకటి కావల’, ‘చెరువు దగ్గర’, ‘పిచ్చిగీతలు’, ‘జాన్‌పాల్‌ చేసిన బీరువా కథ’, ‘అమ్మా! ఇక శెలవు’ ఇంకా అనేకం ఒకసారి చదివితే మరింక మరచిపోలేనివి.
‘పెంజీకటి కావల’ కథలో జయలక్ష్మి ఆరోగ్యంగా ఉన్నపుడు మరణాన్ని తలచుకొని భయపడ్తూ ఉంటుంది.  తనని బ్రతికించమని భగవంతుని ప్రార్థిస్తూ ఉంటుంది.  నిరంతరం ఇదే ఆలోచనలు ఆమెను నలిపివేస్తూ ఉంటాయి.  చిట్టచివరికి తనకే కేన్సర్‌ అని తెలుసుకోగానే ఆమెలో ‘సెల్ఫ్‌రియలైజేషన్‌’ ఆరంభమౌతుంది.  ఆ స్థితిలో ప్రపంచంలో ఎన్నో ఆనందాలున్నాయని తను లేకపోయినా ఈ ఆనందాలన్నీ అలాగే ఉంటాయని గ్రహించాక ఆమె ఆనందంగా బ్రతకడం ప్రారంభిస్తుంది.
 ‘నీడలు’ కథ మనసును అనుక్షణం చుట్టే అనుమానాలను, ఆలోచనలను హృద్యంగా విశ్లేషించింది.  అనేక కథల్లో పనిమనుషులకు యజమానులకు మధ్య నిరంతరం కొనసాగే ‘సీ-సా’ (ఊగుబల్ల) రిలేషన్సు వసుంధరాదేవి గారిలాగా మరెవరూ అనలైజ్‌ చేయలేరేమోననిపిస్తుంది.
 ‘అమ్మా! ఇక శెలవు’ హృదయాలను కదిలించి మనసుని కరిగించే కథ.  ”ఐదు నక్షత్రాల వైద్యశాలలు పెరిగిన నాగరికతకు నిదర్శనాలేగాని మూర్తీభవించిన మానవత్వానికి కాదు” అన్న ఓ గొప్ప సత్యం మనముందు సాక్షాత్కరింపజేశారు.  అక్కడ సిబ్బంది హృదయమూ, బాధ్యతా రెండూ లేకుండా వ్యవహరించిన తీరును తర్పారబట్టిన కథ ఇది.  తన అదుపులోనుంచి అంచెలంచెలుగా క్షణక్షణానికి జారిపోతున్న అమ్మ ప్రాణానికి సాక్షిగా నిలిచిన ఒక కూతురి ఆత్మఘోష ఈ కథ.
 ‘పిచ్చిగీతలు’లో జీవనరేఖలు పిచ్చిగీతలే గాని వేరు గాదు.  మానవ జీవితాల్లో అనేక సంఘటనలు యదృచ్ఛికాలు.  ”జీవితం ఋజుమార్గంలో ఎప్పుడూ ఉండదు.  జీవితాలను నిర్దేశించి రేఖలేవైనా ఉంటే అవన్నీ పిచ్చిగీతలే.”  ఇలా ప్రతి కథనూ విశ్లేషిస్తూ పోతే కమనీయ సత్యాలే ఎదురౌతాయి.  నిజానికి వసుంధరాదేవిగారి భావంతో చెప్పాలంటే ఏది సత్యం? ఏదసత్యం? అన్న ఆలోచన రాక మానదు.  ఆమె తార్కికతతో పాఠకుడు ఏకీభవించక మానడు.
 వీరి కథల్లో మరొక ప్రత్యేకత కథలపై దేశకాలపరిస్థితుల ఛాయ.  తనెక్కడ ఉంటే, అక్కడి ప్రాంతాలను, అక్కడి నాగరికతలను, సాంప్రదాయలను, సాంఘికజీవనాన్నీ, ఊర్లపేర్లను, పాత్రలను ఎన్నుకొని కథలుగా మలిచారు వసుంధరాదేవిగారు.  రాజమండ్రి, నెల్లూరు, అనంతపూరు, మదనపల్లి ఇత్యాది ప్రాంతాల్లోని పాత్రల వాటి స్వభావాలు, ఆయ ప్రాంతాలకనుగుణంగానే సాగినవి.
 ప్రఖ్యాత సాహితీవేత్త, విమర్శకుడు శ్రీ ఆర్‌.యస్‌. సుదర్శనం గారు వీరి భర్త.  ఐనప్పటికీ తన సాహిత్యంపై వీరి ప్రభావం లేదంటారు వసుంధర గారు.  తనకిష్టమైన పుస్తకం ”త్రిపురారహస్యం” అనీ, గురజాడవారి ‘పూర్ణమ్మ’ కథ ఎన్నిసార్లు చదివినా తన కళ్లవెంట నీరొలుకుతుందనీ చెప్పారు.  వీరు పుట్టినది గుంటూరు జిల్లా రేపల్లె.  మెట్టినది చిత్తూరు జిల్లా మదనపల్లె.  సుదర్శనం గారు స్వర్గస్థులయ్యాక మదనపల్లెలో స్వంత ఇంట్లోనే ఉంటున్నారు.  ప్రస్తుతం కొంతకాలంపాటు అమెరికా వెళ్లారు వసుంధరాదేవి.
 మనిషిలో నిద్రాణంగా ఉన్న తాత్వికచింతనను తట్టిలేపి, సత్యాన్వేషణ వైపు, ఆత్మజ్ఞాన విశ్లేషణ వైపు నడిపించే కథలు వీరివి.  ఈ కథలు సాధారణ మానవునికి సాంత్వన కలిగిస్తాయి.  రచయితలకు, రచనారీతులెలా ఉండాలో నేర్పిస్తాయి.  వారాశించినట్లు ”రచన ప్రయెజనం సహృదయులైన పాఠకుల ముందుకు వచ్చి వారి జ్ఞాపకాల్లో నిలవడమే” అయితే ఆ ప్రయోజనం పుష్కలంగా నెరవేర్చుకున్న పుస్తకం ఇది.
 సార్వజనీన సాహిత్యాన్ని వెలువరించి రాయలసీమ రచయితలలో ప్రత్యేకస్థానం పొందిన వసుంధరాదేవి గారి సాహిత్యాన్ని ప్రతి ఒక్కరూ చదవాల్సిన అవసరం ఎంతో ఉంది.

 

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

4 Responses to ఆర్‌. వసుంధరాదేవి రచనల్లో తాత్వికదర్శనం

 1. malathi says:

  సమీక్ష బాగుంది. తాత్త్వికచింతనతో కథలు రాసిన స్త్రీలు మనకి ఇద్దరే, వసుంధరాదేవి గారూ, ఆచంట శారదాదేవి గారు.
  వసుంధరాదేవి గారి అన్ని కథలూ పట్టి చదివిస్తాయని చెప్పలేను కానీ మీరు ఉదహరించిన కథలు చాలావరకు నాక్కూడా ఆలోచనలు రేకెత్తించేవిగానే అనిపించాయి. అభినందనలు.

 2. rathnam.sjcc says:

  శరీరము తొమ్మిది ద్వారములు కలిగిన ఒక పురము. అందులో ఆత్మ ఉంటుంది. యోగులు ఆ ఆత్మఅమృతము అంటారు. ఆత్మ తత్వమును సత్కర్మలు చేస్తూ వైరాగ్యముతో జీవించే యోగి మాత్రమే తెలుసుకోగలడు. అటువంటి యోగులకు కామము, క్రోధము, భయము, నిద్ర, లోభములు ఉండవు. యోగులు వాటిని వదిలి వేస్తారు. పండితుడు కామ సంబంధిత కోర్కెలను సంకల్పములను వదిలి కామమును జయిస్తాడు. సత్వగుణ సంపదతో నిద్రను, మోహమును జయిస్తాడు. గురువులను, పెద్దలను, పండితులను పూజించడము వలన లోభమును వదిలి వేస్తాడు. ఇంద్రియములను మనసు వాయివునిగ్రహించి జయిస్తాడు.

 3. జొన్నవిత్తుల says:

  ఆర్. వసుంధరాదేవి గారి సాహిత్య సృజనని అద్దంలో పట్టి చూపించారు.
  పొరపాట్న ” రెడ్డెమ్మ గుండె ” అని అచ్చొత్తడం జరిగినట్టుంది.
  అది, ” రెడ్డెమ్మ గుండు”.
  ఆ నవల పేరుని చూసినవాళ్ళు రెడ్డెమ్మ గుండు అనుకుంటారుగానీ, చిత్తూరు జిల్లాలో అతి పెద్ద బండని ” గుండు ” అంటారు. కాబట్టీ రెడ్డెమ్మ గుండు అంటే, దాన్ని మనం రెడ్డెమ్మ బండ అని అర్ధం చేసుకోవాల్సి వుంది.
  ఆ నవల ఒక రచయిత్రి రాసిన తొలి అన్వేషణా పూరితమైన అంతరార్ధ రస్తూచ
  మానవుని ఆత్మికతకీ ఆధ్యాత్మికతకీ మధ్య లంకె కుదిర్చే ప్రయత్నం చేసే ఊకుడు కథే రెడ్డెమ్మ జీవిత చరిత్ర.. శ్రీశైల భ్రమరాంబికా దేవి కథని పోలివుండే ఆ రెడ్డెమ్మ కథని నేపథ్యంగా తీసుకున్న వసుంధరా దేవిగారు చారిత్రక ఆధారాలతో వర్తమానాన్ని నిర్వహిస్తూ దాన్ని జీవన వాస్తవికతతో అనుసంధానిస్తూ తెలుగు సాహిత్యానికి కొత్త తాత్విక భూమికని సమకూర్చారు.
  పుష్పాంజలి గారు దీనికి సంబంధించి మరింత లోతయిన వ్యాసం రాయాల్సి వుంది. ఎందుకంటే, దాని గురించి జరగవలసినంత చర్చ జరగలేదు. ఇప్పుడయినా జరిగితే, అది భావి సాహిత్యకారులకీ పరిశోధకులకీ ఎంతయినా ఉపయోగించగలదు.
  – జొన్నవిత్తుల.

 4. జొన్నవిత్తుల says:

  ఆరో వాక్యం ” ఆ నవల ఒక రచయిత్రి రాసిన తొలి అన్వేషణా పూరితమైన అంతరార్ధ నవలగా పరిగణించవలసి వుంటుంది. ” అని చదువుకోవలసిందిగా ప్రార్ధన.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో