ఎర్రుపాలెం మండలం(ఖమ్మం) సంపూర్ణ హెచ్.ఐ.వి / ఎయిడ్స్ అవగాహన, చైతన్యయాత్ర ఒక అనుభవం

-సీతారాం

‘ఆశ’ కార్యక్రమం ఉమ్మడి ప్రయత్నానికి ఉద్యమ రూపం’ అని రాష్టమ్రంతటా నినదించింది. గ్రామీణ ఎయిడ్స్ అవగాహనా క్లబ్ సభ్యులు ఈ స్ఫూర్తిని అందుకున్నారు. ఆశలోని sustain అన్న పదానికి ఉదాహరణగా ఎర్రుపాలెం మండలాన్ని నిలపాలని భావించారు. నిజానికి ‘ఆశ’ ఒకరోజుకు, ఒక నెలకో పరిమితమైంది కాదు. క్లబ్ సభ్యులతో ఏం చేద్దాం అనే చర్చ వచ్చినప్పుడు ఆదివారం, ఇతర సెలవు రోజుల్లో మండలంలో ఏదో ఒక గ్రామంలో ఎప్పుడూ చైతన్య కార్యక్రమం ఉండాలని అభిప్రాయపడ్డారు. క్లబ్ సభ్యులందరిలోనూ ఒకే భావన కలిగింది. దసరా సెలవులను వృధా పోనీయకుండా ఉపయోగించుకోవాలని నిశ్చయించుకున్నారు. సెలవుల్లో ఒక చైతన్య కార్యక్రమం తప్పకుండా చేపట్టాలని అందరమూ అనుకున్నాం.

చురుకుగా ఉన్న సభ్యులు, నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్న యువత ఉన్నచోట ఏ పనైనా సజావుగా సాగిపోతుంది. ఎర్రుపాలెం మండలంలో అక్టోబర్ 2005న అదే జరిగింది.

అక్టోబర్ 9 నుంచి 16 వరకు దసరా సెలవులు వచ్చాయి. సంపూర్ణ హెచ్.ఐ.వి / ఎయిడ్స్ అవగాహన చైతన్య యాత్రకు మౌఖిక ప్రణాళిక సిద్ధమైంది. అప్పటికే మండలంలో 80 మంది పీర్ లీడర్ శిక్షణ ఎపిఎస్ఎసిఎస్ ద్వారా పొంది ఉన్నారు. అప్పటినుంచి మండలంలో మరికొంతమంది పీర్ లీడర్ శిక్షణ కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నారు. తరచుగా అడుగుతూ ఉన్నారు. మరికొంతమందికి మూడు రోజుల శిక్షణ ద్వారా క్లబ్లు పటిష్టమవుతాయి. కార్యక్రమం చేపట్టే ఉత్సాహం పెరుగుతుంది. అలాగే సభ్యుల సంఖ్య కూడా పెరుగుతుంది. మొత్తం మీద క్రియాశీలకంగా యువత ఉండేందుకుగాను ఒకవైపు మూడు రోజుల శిక్షణతో పాటుగా, యాత్రను చేపట్టాలని భావించాం. మండలంలోని పలు గ్రామాలనుంచి యువకులు వస్తారు శిక్షణ నిమిత్తం. చైతన్య యాత్ర మరోవైపు సాగుతూ ఉంటుంది. మూడు రోజుల శిక్షణ ముగిశాక – వీరిని చైతన్య యాత్ర బృందంలో జత కలప వచ్చు.ఇందువల్ల కొత్తగా శిక్షణ తీసుకున్న వారికి తమ తమ గ్రామాల్లో ఏయే కార్య క్రమాలు ఎట్లా చేయాలో తెలిసివస్తుంది. ఒక అనుభవం వారికి వస్తుంది.ఈ ఆలోచనలోనే కొంచెం కష్టమైనా రెండూ ఒకేసారి మొదలు పెట్టాం.

క్లబ్ సభ్యుల ఉత్సాహం చూసి తీరాల్సిందే. ఉమ్మడిగా ప్రయత్నించటంలో ఎంత గొప్పదనం ఉందో యాత్ర పూర్తయ్యే లోపు అందరికీ అర్థమైంది. మొత్తం మండలాన్ని నాలుగు క్లస్టర్స్ గా విభజించాం. ఒక్కొక్క క్లస్టర్‌లో 7 నుంచి పది గ్రామాలు, లేదా పది గ్రామ పంచాయితీలుంటాయి. ఒక్కొక్క క్లస్టర్కు 30 నుంచి 40 మంది వాలంటీర్లు. వారికి ఒక తాత్కాలిక టీం లీడర్‌తో పాటు మరో సహాయక లీడరు కూడా ఉంటారు.

నాలుగు మార్గాల నుంచి బయలుదేరిన టీంలు అక్టోబర్ 15, 2005 రాత్రికి గానీ 16 అక్టోబర్ ఉదయానికి గానీ జమలాపురం చేరుకోవాలి. అక్టోబర్ 9న మండల కేంద్రమైన ఎర్రుపాలెం నుంచి యాత్ర మొదలవుతుంది. ఈ యాత్ర ప్రారంభానికి స్థానిక ఎమ్ఎల్ఎ కట్టా వెంకట నర్సయ్య వచ్చారు. మీడియా గట్టి మద్దతు ఇచ్చింది. మండల స్థాయి అధికారులు సానుకూలంగా స్పందించారు. మండలం ప్రముఖులు, పలు గ్రామాల సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు ఆమోదం తెలిపారు.

ఒక్కొక్క రూట్‌లో ప్రతి గ్రామంలోని వాలంటీర్లు ఒక రాత్రి, ఒక పగలు బస చేయాలి. ప్రతి టీం మళ్ళీ నాలుగు ఉప బృందాలుగా విడిపోయి ఆ గ్రామంలోని ప్రజలందరికీ ఎయిడ్స్ గురించి తెలియజెప్పాలి. ఎవరు ఏం చేయాలన్నది ముందుగానే స్థూలంగా ఖరారయ్యింది.

ఐఇసి మెటీరియల్ మొత్తం మండలానికి ముందుగానే చేరింది. ఆశ బుక్లెట్స్ ఒక లక్షా ఎనభై వేల కండోమ్‌లు, ఇతర పాంప్లెట్స్, హెచ్ఐవి నిర్ధారణ పరీక్షలు చేసే కేంద్రాల వివరాలు ఇట్లా అవసరమైన ప్రతిదీ చేర్చుకున్నాం స్కిట్స్, పాటలు, ఇతర కళారూపాలు అన్నీ తయారయ్యాయి. ప్రతి సభ్యుడిలోనూ ఒక సమరోత్సాహం తొంగి చూసింది. వ్యక్తి నుంచి వ్యక్తికి తెలియ జెప్పటం, బృందంగా ఇంటింటికీ తిరిగి చెప్పటం హెచ్ఐవి నిర్ధారణ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం, గర్భిణీ స్త్రీలు పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన అవసరం, సుఖ వ్యాధుల చికిత్స ఎట్లా హెచ్ఐవి నుంచి కాపాడుతుంది. కండోమ్ వాడకం వల్ల ప్రయోజనాలు, రిస్క్ ప్రవర్తనలున్న సమూహాలను సంబోధించాల్సిన పద్ధతులు, హెచ్ఐవి పాజిటివ్‌లపట్ల చూపాల్సిన ఆదరణ మొదలైన అన్ని అంశాలపైనా చైతన్య యాత్రలో పాలు పంచుకునే సభ్యులకు సవివరంగా అవగాహన కలిగించాం. ఎనిమిది రోజుల యాత్రలో ఆ మండలంలో లక్షా యాభై వేల కండోమ్‌ల పంపిణీ జరిగింది. మండలం మొత్తం జనాభా 48, 715 మాత్రమే. కనీసం రెండొంతులు అధికంగా కండోమ్‌ల పంపిణీ జరిగింది.

ప్రజాస్పందన:

ఒక్కొక్క గ్రామం స్పందించిన తీరుకు సభ్యులు మరుసటి రోజు నుంచే ఆశ్చర్యపోవటం మొదలు పెట్టారు. చేస్తున్న పనిలో స్వచ్ఛందత ఉంటే సమాజం ఎలా ఆదరిస్తుందో సభ్యులు గమనించారు. అక్టోబర్ నెలలో గ్రామాలన్నీ తలమునకలుగా వ్యవసాయ పనుల్లో ఉన్నాయి. అయినా ‘ఆశ’ వాలంటీర్లు చెప్పిన విషయాలను అమిత శ్రద్ధతో విన్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు జరగాలన్నారు. గ్రామ సర్పంచ్ మొదలుకొని ఊరి చివర ఇంటిలోన ఒంటరి మనిషి దాకా అంతా ఒకే స్పందన. తమ మండలానికి చెందిన పిల్లలు ఎంతో బాధ్యతాయుతమైన పని చేస్తున్నప్పుడు, తద్వారా వారి గ్రామాలకు, కుటుంబానికీ, మండలానికి ఎంతో కొంత మేలు జరుగుతున్నప్పుడు, మండలం పేరును ఆంధ్రరాష్ట్రం ప్రత్యేకంగా ప్రస్తావించడాన్ని మీడియా ద్వారా చూసిన ప్రజలు చైతన్య యాత్రను ఆదరించారు. మాకు రెండో రోజుకల్లా యాత్ర సాఫల్యం దిశగా అడుగులు వేస్తున్నదని అర్థమైంది.

పనిచేసిన తీరు:

మండల యువతలో కలిగిన ఏకాభిప్రాయం ఏమంటే మన మండలాన్ని మనమే పూర్తిగా చైతన్య పరచుకోవాలి. సెలవుల రూపంలో దొరికిన సమయాన్ని వృధా చేయకూడదు. దొరికిన వెసులుబాటును, ముందుకొచ్చిన ఈ మహత్తర అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలి. ఈ ఎనిమిది రోజులు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరూ పని చేయాలి. హెచ్ఐవి / ఎయిడ్స్ గురించి తెలియని వారంటూ మండలంలో మిగలకూడదు. చైతన్య యాత్రను వారు own చేసుకున్న తీరు చూస్తే తప్పకుండా అభినందిస్తారు. యువతలోని నిస్వార్థ, స్వచ్ఛంద సేవా భావాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నప్పుడు నాకు ప్రతి యువకుడిలోనూ ‘దివ్యాగ్ని’ కనిపించింది. ప్రతి యువకుడూ ఓ వివేకానందుడి లాగానే కనిపించాడు.

ఈ యాత్ర కారణంగా సభ్యులు తమ మండలంలోదే అయినా ప్రక్క గ్రామం గురించి పూర్తిగా అర్థం చేసుకోవడం సాధ్యమైంది. అప్పటికి పూర్తిగా తమ సమీప గ్రామం గురించి తెలియని యువతకు ఒక రోజంతా గ్రామంలో బస చేయడం వల్ల బాగా తెలుసుకునే వీలు చిక్కింది. అదే విధంగా హెచ్ఐవి / ఎయిడ్స్ గురించి ఆయా గ్రామాల ప్రజలకున్న చైతన్యం ఏమిటో తెలుసుకోగలిగారు. ఏయే వయో వర్గాల వారి వైఖరులు ఎట్లా ఉన్నాయో అర్థం చేసుకున్నారు. ప్రతి గ్రామమూ తమకు ఒక కొత్త అనుభవాన్నిచ్చిందని యాత్రలో పాల్గొన్న యువకులు పేర్కొన్నారు. అసలు తమ గ్రామమే తమకు కొత్తగా పరిచయం అయ్యిందని చెప్పారు. 8 రోజులు సాగిన ఈ యాత్ర వారికి ఎంతో విలువైన క్షేత్ర సమాచారాన్నిచ్చింది. వారి నిబద్ధతను పెంచింది. సమస్య తీవ్రత, లోతు అవగతం అయ్యాయి. మనుషుల మనస్తత్వాలు తెలిశాయి. అవరోధాలు ఎక్కడున్నాయో, ఎందుకున్నాయో గుర్తించగలిగారు. వాటిని అధిగమించడం ఎలాగో నేర్చుకున్నారు. ఈ యాక్టివిటి ద్వారా వారు నేర్చుకున్న విషయాలు వారికే కాకుండా తమ చుట్టూ ఉన్న సమాజానికీ ఉపకరించేవిగా మారాయి. నేను గమనించినంతవరకు వారిలో కృతనిశ్చయం, పట్టుదల పెరిగింది. ఇంతకుముందు జరిగిన కార్యక్రమాలకు యాత్ర అనంతరం జరుగుతున్న కార్యక్రమాలకు మధ్య ఒక గుణాత్మక మార్పును చూస్తున్నాను. సెల్ఫ్ మోటివెషన్ లెవల్ పెరగటం ఒక శుభపరిణామం.

యాత్ర వెనుక వ్యూహం:

ఈ చైతన్య యాత్ర పైకి కేవలం హెచ్ఐవి/ఎయిడ్స్ చైతన్యం కోసం ఉద్దేశించబడినట్లు కనిపించినా అంతర్లీనంగా రెండు ముఖ్య ప్రయోజనాలను సాధించడం కోసం ఉద్దేశించబడింది. హెచ్ఐవి/ఎయిడ్స్ గురించి మనం ఎంత విస్తృతంగా ప్రచారం చేసినా, ఎంత డబ్బు ఖర్చుపెట్టి చేసినా, ఎన్నెన్ని కార్యక్రమాలు చైతన్యం దిశగా సాగిన కమ్యూనిటీ ఓనర్షిప్‌ను పాదుకొల్పక పోయినట్లయితే, అది చైతన్య స్థాయిలోనే వ్యక్తులకు పరిమితమై ఆగిపోతుంది. మాకు కావలసింది ఇది కాదు. ఆచరణాత్మకమైనదే అసలు చైతన్యం అని నిరూపించదలచుకున్నాం. కేవలం వ్యక్తిగత స్థాయిలోనే చైతన్యం ఆగిపోతే నివారించడం, ఆరికట్టడం అనేవి అర్థం లేని డొల్లపదాలవుతాయి. లేదా దీర్ఘకాలం పట్టే సమస్యలుగా మారతాయి. ఇటు యాత్ర చేస్తున్న బృందాలకు అటు గ్రామ ప్రజానీకానికి అర్థం కావలసిన విషయం ఒకటి వుంది. ‘ఎయిడ్స్ మనందరి సమస్య. మనందరికీ సమస్య’ అని బోధించగలగాలి. ఇది తెలియజెప్పాలి అంటే అన్నీ మనమే సమకూర్చి ఇస్తే దానిని కేవలం నిర్వహించి పెట్టే అద్దె మనుషులం అనే భావన సభ్యులకు కలుగుతుంది. ఇది రేపు ఎటువైపుకైనా దారితీయవచ్చు. వారిలోని స్వచ్ఛందత అనే పార్శ్వం కనుమరుగు కావచ్చు. ప్రస్తుత పరిస్థితులలో చుట్టూ ఉన్న సమాజం స్వలాభాన్వేషణలోనే ఉంది కనుక వీరూ ఆ ఉచ్చులో తెలియకుండానే పడిపోయే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితి వీరికి ఎదురు కాకూడదు. అందుకే ప్రతి గ్రామంలోనూ వారికి భోజన వసతిని కల్పించే బాధ్యతను ఆయా గ్రామాల్లోని సర్పంచ్లకు, గ్రామ పెద్దలకు, పరపతిగల ముఖ్యులను చూడవలసిందిగా కోరాం. మేమొక సాహసానికి పూనుకున్నామని మాకు తెలుసు. ఆచరణలో ఇది ఎన్నో ఇబ్బందులకు బృందాలను గురి చేస్తుందని తెలుసు. అసలు ఆ ఇబ్బంది ఎట్లా ఉంటుందో తెలియజెప్పడమే మా లక్ష్యం కనుక అలాగే కొనసాగాలని భావించాము. భోజన సదుపాయం బృందాలకు కల్పించటంలో అంతా సానుకూలంగానే స్పందించినా పాక్షికంగానే మేము సఫలమయ్యాం. ఎన్నో సమస్యలు, సవాళ్ళు మా ముందుకొచ్చాయి. ఆటంకాలు ఎదురయ్యాయి. అయినా ఒక learning experience గా దీన్ని ఆ తరువాత యాత్రా బృందానికి విశ్లేషించి వారి ముందు విషయాన్ని ఉంచాను.

ఉదాహరణకు చైతన్య యాత్ర బృంద సభ్యులు ఒక 30 మంది ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి చేరుకుందనుకుందాం. మరో గ్రామానికి చేరుకోగానే ఒక అరగంట ఒక చోట బృంద సభ్యులు సమావేశమవుతారు.

సభ్యులంతా నాలుగు ఉప బృందాలుగా ఈ సమావేశం తరువాత విడిపోతారు. ఒక బృందం గ్రామ సర్పంచ్‌ను, గ్రామ కార్యదర్శిని, గ్రామ పెద్దలను, ముఖ్యులను, పరపతి గలవారిని కలుస్తుంది. హెచ్ఐవి / ఎయిడ్స్ చైతన్యయాత్ర గురించి వివరిస్తుంది. ఆ తరువాత సర్పంచ్‌ను ఆశ్రయిస్తుంది. భోజన సదుపాయం కొరకు అడుగుతుంది. ఇక ఆ సర్పంచ్ వీరికి భోజన సదుపాయం చూసేందుకు ఎవరినో ఒకరిని పురమాయిస్తాడు. ఆ పురమాయింపు మరికొంత మందిని దీన్లో భాగస్వాములు అయ్యేట్లు చేస్తుంది.

అదెలా జరుగుతుందో నేనొక గ్రామంలో చూసిందాన్ని మీకు వివరిస్తాను. గ్రామంలోకి వచ్చిన బృందం గ్రామ పంచాయితీ ఆఫీసులో సర్పంచ్‌గారి అధ్యక్షతన సమావేశం అయ్యింది. బృందం చేస్తున్న యాత్ర లక్ష్యం, వచ్చినపని, ప్రక్క గ్రామంలో ఎదురైన అనుభవం బృందనాయకుల క్లుప్త ప్రసంగాలలో సర్పంచ్కు, ఇతరులకు వివరించారు.

ఆ తరువాత సర్పంచ్‌ను మాట్లాడమన్నారు. ఆయన హెచ్ఐవి / ఎయిడ్స్ గురించీ, యువ బృందాలు చేస్తున్న ప్రశంసనీయ కృషి గురించి మాట్లాడారు. తమనుంచి కూడా పూర్తి మద్ధతు ఉంటుందని తెలిపారు. ఆ వెంటనే ఇద్దరు గ్రామస్థులను పిలిపించారు. ఒక మోతాదుకు పని అప్పగించారు. ఏ సమయానికి భోజనం పూర్తి కావాలో కూడా ఆదేశించారు సర్పంచ్. ఇక ఆ తరువాత జరిగిందేమిటో చూడండి సర్పంచ్ అప్పగించిన బాధ్యతను ముగ్గురు నిర్వర్తించే పనిలో పడ్డారు.

గ్రామంలో కనీసం పది ఇళ్ళకు వెళ్ళారు. ఒకసారి వంట చెరుకు నిమిత్తం రెండు, మూడిళ్ళు తిరిగారు. 30 మంది చైతన్య యాత్ర బృందం మనూరు వచ్చింది. ఎయిడ్స్ గురించి ఇల్లిల్లూ తిరిగి చెపుతారు అని ఆ ఇంట్లో వారికి తెలియపరిచి సర్పంచ్‌గారు కట్టెపుల్లలు,పేళ్ళు ఇమ్మన్నారు అని అడిగారు.గమనించండి ఇక్కడ జరుగుతున్న దేమిటో! అలాగే మరో వ్యక్తి బియ్యం కోసం బయలు దేరాడు. ఇంకోవ్యక్తి కూరగాయల కోసం సమీప పొలంలోకి వెళ్ళాడు. అక్కడ పచ్చిమిర్చి, టమాటాలు తీసుకున్నాడు. అవి ఎందుకు అవసరం పడ్డాయో ఆ పొలం యజమానికి, అక్కడే పనిచేస్తున్న వారందరికీ చెప్పాడు. ఆ ముగ్గురిలోనే మరో వ్యక్తి విస్తరాకుల కోసం, వంట పాత్రల కోసం తిరిగాడు. ఇట్లా ఆ ముగ్గురూ ఆ గ్రామంలో బృందానికి అవసరమైన వాటిని సమకూర్చేందుకు వాటిని గురించి ఎవరెవరి దగ్గర ప్రయత్నించారో, ఆయాచోట్ల ఈ విషయం ప్రస్తావిస్తూనే ఉన్నారు.

అంటే చైతన్య యాత్ర బృందంతో పాటుగా ఆ గ్రామంలో మరికొందరు కూడా ఎయిడ్స్ గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు. బృందం ఆ గ్రామంలో తాను చేయవలసిన పని చేస్తూనే ఉంటుంది. సెలవుల వల్ల పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులు ఇంటిపట్టున్నే ఉంటారు. లేదా వ్యవసాయ పనుల్లో పాలుపంచుకొంటూ ఉంటారు. అందువల్ల చైతన్యయాత్రలో ఎక్కువగా యువతకు బోధించే అవకాశం కూడా చిక్కింది. చదువు కుంటున్న విద్యార్థులను గ్రామంలో ఒకచోట చేర్చి ఒక గ్రూపు పని చేయడం మొదలు పెట్టింది. ఈ ఉపబృందం చేసిన పనల్లా ఎయిడ్స్ గురించి చెప్పటం, గ్రామాల్లో వ్యాప్తి తీవ్రతను వివరించడం, రిస్క్ ప్రవర్తనల గురించి ఒక ఎరుకను కలిగించడం మొదలు పెట్టారు. జీవన నైపుణ్యాలు, ఆరోగ్యకర అలవాట్లు, ఆలోచనలు పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ వారి సంభాషణల్లో ప్రస్తావనకు వచ్చాయి. అదే విధంగా యువతకున్న శక్తియుక్తులు ఆ గ్రామానికి ఎలా ఉపయోగపడితే బావుంటుందో కూడా సూచించగలిగారు. ముఖ్యంగా యువత ‘ఆశ’ కేంద్రాల స్థాపన – ఎయిడ్స్ సమాచార కేంద్రాల నిర్వహణ గురించి చెప్పి ప్రేరణ కలిగించారు.

ఇదే సమయంలో మరొక ఉపబృందం ఇంటింటికీ తిరుగుతూ ఆశ పుస్తకాల పంపిణీ చేపట్టింది. హెచ్ఐవి /ఎయిడ్స్ గురించిన విషయాలను వ్యవసాయ పనులకు పోకుండా ఇంటిదగ్గరే ఉండిపోయిన వారికి చెప్పడం మొదలు పెట్టారు. మరొక బృందం వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసే వారి దగ్గరకు వెళ్ళారు. మొత్తం మీద గ్రామాన్ని నాలుగు వైపులనుంచి చైతన్యంతో చుట్టుముట్టినట్లయ్యింది. ఇవి ఒకవైపు జరుగుతూ ఉండగానే బృందాలు తమ వెంట తెచ్చుకున్న పోస్టర్‌లను (ఐఇసి) గ్రామంలో ప్రధాన స్థలాల్లో పలుచోట్ల అంటిస్తారు. ఇక సాయంత్రం ఏడు గంటల తరువాత ఈ బృందం తమకు తెలిసిన సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు. ఎయిడ్స్ చైతన్య గీతాలు, స్కిట్స్, రోల్ప్లే మొదలైవి ప్రదర్శనల్లో చోటు చేసుకున్నాయి.

ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి చేరుకునే సమయంలో దారి పొడవునా పొలాల్లో పనిచేస్తున్న వారికి ఎయిడ్స్ గురించి చెపుతూ సాగింది బృందం. ఇట్లా ఒక్కొక్క గ్రామం పూర్తి చేసి ఇంకొక గ్రామానికి చేరుకునేటప్పటికే, ప్రక్క గ్రామంలో ఏం జరిగిందనేది కొత్త ఊరుకు కూడా తెలుస్తుంది. ఇదంతా ఒక చెయిన్ పద్ధతిలో సాగే ప్రక్రియ. అందుకే చైతన్య యాత్ర అంతగా సఫలమైంది.

చైతన్య యాత్ర అసలు వ్యూహం సమస్యను ప్రజలు తమదిగా గుర్తించేట్లు చేయడం. కమ్యూనిటీ ఓనర్షిప్‌ను పెంచటం. ఒక్కరోజు గ్రామంలో 30 మంది దాకా వాలంటీర్‌లకు భోజనం ఏర్పాటుకు ఏ సర్పంచ్ వెనుకడుగు వేయడు. అదే మూడు వందల అరవై ఐదు రోజులు 10 మంది హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తులు తమ గ్రామంలోనే ఉంటే వారికి ఆ స్థానిక సమాజం ఆసరా ఇవ్వగలుగుతుందా? వారి పోషణ భారం, బాధ్యతలు ఎవరు వహిస్తారు? ఇట్లాంటి ఆలోచనాత్మక ప్రశ్నలను వేసి గ్రామ సర్పంచ్, మరి యితర గ్రామ ముఖ్యులకు సమస్య స్వరూపం వివరించి చెప్పే ప్రయత్నం జరిగింది.

హెచ్ఐవి/ఎయిడ్స్ సమస్య ఆర్థిక వ్యవస్థను ఏవిధంగా దెబ్బతీయగలిగే అవకాశం ఉందో దానిని ఎత్తి చూపేందుకు కృషి జరిగింది. ప్రస్తుత యాత్ర ఒక స్వచ్ఛంద తాత్కాలిక కార్యక్రమం కనుక సర్పంచ్ మరితరులు ముందుకొచ్చి తమ వితరణను ప్రదర్శించారు. మరి అదే తమ సమీప కుటుంబాలు హెచ్ఐవి బారిన పడితే వారి పరిస్థితిని ఎట్లా చక్కదిద్దాలి. ఎవరు ముందుకొస్తారు. కాబట్టే హెచ్ఐవి పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. రాబోయే ముప్పును ముందే గుర్తించాలి. తీరా ప్రమాదం ముంచుకొచ్చి మీద పడ్డాక మాకేమీ బాధ్యత లేదని చెప్పటం భావ్యం కాదు. ఒక విధంగా గ్రామాన్ని మానసికంగా సంసిద్ధపరచడం లాంటిది ఇది.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద హెచ్ఐవి చూపబోయే ప్రభావాలు ఎలా ఉంటాయో చెప్పేందుకు ఈ వ్యూహాన్ని అనుసరించాము. గ్రామానికి సంపూర్ణ ఎయిడ్స్ అవగాహన అవసరం, హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తులపట్ల ఆదరణ, సంరక్షణను స్థానికంగానే చూపగలగాలి అని వివరించడం ద్వారా గ్రామ ప్రథమ పౌరుడితో పాటుగా మరికొంత మంది గ్రామస్థులలో కూడా కదలిక తెచ్చే చిన్న చర్య సఫలమైంది.

దీనికి మరో కోణం కూడా ఉంది కేవలం చైతన్యం వస్తే సరిపోతుందా? గ్రామీణ యువత చొరవతో సమస్యను పరిష్కరించేందుకు నాయకత్వ భూమికను పోషించాల్సిన పని లేదా? ఉంది అని ఈ బృందాలు స్వీయానుభవం ద్వారా గ్రహించేట్లు చేయగలిగాము.

తాము గ్రామంలో చైతన్య కార్యక్రమం చేస్తున్నారు. అదీ స్వచ్ఛందంగా. కానీ భోజన సదుపాయం ఇతరుల ఔదార్యం మీద ఆధారపడి ఉంది. తమకు ఆ గ్రామం ఒకరోజు భోజనం పెడుతుంది. లేదా ఒక వారం పెట్టగలుగుతుంది. కానీ సదా వారికి ఆ సౌకర్యం ఇవ్వగలుగుతుందా? రాబోయే కాలంలోతల్లిదండ్రుల్ని కోల్పోయి అనాధలయ్యే పిల్లల్ని గానీ, వృద్ధుల్ని గానీ హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తుల్ని గానీ చుట్టూ ఉన్న సమాజం ఆదుకోగలుగుతుందా? పోషించే ఆర్థిక శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటుందా? ఇట్లాంటి అనేక ప్రశ్నలకు సమాధానాన్ని వారి అనుభవమే చెప్పింది.

హెచ్ఐవి/ఎయిడ్స్ వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను అత్యంత సన్నిహితంగా బృందం దృష్టికి తీసుకొచ్చి, వారి అనుభవ కోణం లోంచి విశ్లేషించి ముందుంచడం ద్వారా గ్రామీణ యువతకు తమ కర్తవ్యం ఏమిటో చాలా చక్కగా బోధ పడింది. సంపూర్ణ ఎయిడ్స్ అవగాహన, చైతన్య యాత్ర ముగిశాక క్లబ్ సభ్యుల ఆలోచనలో, దృక్పథంలో, వ్యవహారశైలిలో, కార్యశీలతలో సర్వత్ర ఒక మార్పును స్పష్టంగా చూడగలిగాం.

యువతను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయడం ద్వారా ఎయిడ్స్ సృష్టించగల మహా విధ్వంస స్వరూపం ఏమిటో తేటతెల్లం చేయగలిగాం. అయితే గ్రామస్థులకు ఈ సమస్యను తమ సమస్యగా గుర్తింప జేయటమొక్కటే చాలదు. వారిలో మరికొంత కదలిక రావాలి. కమ్యూనిటీలో మరింత చైతన్యం కోసం ఈ బృందంలోని సభ్యులు ఆయా గ్రామాల్లో ప్రయత్నం విడివిడిగా చేస్తూనే ఉన్నారు.

అనుభవం:

– పాఠశాల భవనం లేదా పంచాయితీ ఆఫీసు భవనాలు యాత్ర బృందాలకు వసతికోసం ముందుగానే సిద్ధం చేసుకోవాలి.
– చాలా గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం రాత్రి పూట లేని కారణంగా బృందాలు ఇబ్బందులు పడ్డాయి.
– బృందం వెంట కొవ్వొత్తులు తప్పకుండా ఉండాలి.
– దోమలు ఉన్నందున మస్కిటో కాయిల్స్ లేక బృందం ఇబ్బందులు పడుతుంది. కాబట్టి ప్రతి బృందం వెంట మస్కిటో కాయిల్స్ తప్పనిసరి.
– పలు గ్రామాల్లో మంచినీటి సౌకర్యం లేకపోవటం వల్ల బృందాలు – నీటి మార్పు వల్ల జలుబు, జ్వరం ఇతరత్రా స్వల్ప అనారోగ్యాలకు గురయ్యారు.
– ప్రతి బృందం వెంట తగినన్ని యాంటి బయాటిక్స్, యాంటి పైరిటిక్ మాత్రలు తప్పనిసరి.
– యాత్రలోని బృంద సభ్యలను పర్యవేక్షకు లు రోజుకు ఒక్కసారైనా ఏదో ఒక సమయంలో కలిసి మాట్లాడు తుండాలి.
– యాత్ర మొత్తం కాలినడక ద్వారానే సాగుతుంది. కొన్ని గ్రామాలు బహు దూరంగా ఉంటాయి కనుక రవాణా సౌకర్యాలు అంతగా ఉండని గ్రామాలకు ముందస్తు ఏర్పాట్లు చూసుకోవాలి.
– అనారోగ్యానికి గురైన సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తతోపాటు సబ్‌స్టిట్యూట్ లేదా రిజర్్వ టీమ్ ఒకటి సిద్ధంగా ఉంచుకోవాలి.
– ప్రతి బృందాన్ని తమ దిన చర్యను నమోదు చేయమని అడగాలి. వీలున్న సమయంలో ఆనాటి అనుభవ విశేషాల సమీక్ష ఆయా గ్రామాల్లోనే బృంద సభ్యులు జరుపుకోవాలి. ప్రత్యేక విషయాలు దృష్టికి వస్తే వాటిని నమోదు చేయించాలి.
– పాజిటివ్ వ్యక్తులు గ్రామాల్లో తగిలితే వారికి ఏ విధమైన సహాయ సహకారాలు అవసరమో, అవి ఎక్కడ ఎవరి ద్వారా అందుతాయో బృంద సభ్యులకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి.
– హెచ్ఐవి నిర్ధారణ పరీక్షలకు సిద్ధపడిన వారి వెంట బృంద సభ్యులు ఎవరైనా ఒకరు విసిటిసిలకు వెళ్ళే వెసులుబాటు ఉండాలి.
– కండోమ్‌ల కొరత ఉండకుండా చూసుకోవాలి. కండోమ్ బాక్స్ ల ఏర్పాటుకు ప్రత్యేక వనరులు అవసరం.
– ఐఇసి మెటీరియల్ ఇతర ప్రచార సామాగ్రి కొరత బృందాలకు రాకుండా ఏర్పాట్లు చూసుకోవాలి.
– ‘యాత్ర’లు సెలవు దినాల్లో మాత్రమే జరగాలి.
– ‘యాత్ర’ జరిగిందన్న దానికి గుర్తుగా ఆ గ్రామంలో ప్రధాన సెంటర్ దగ్గర ఏదైనా ఒక చిహ్నం తప్పకుండా ఏర్పాటు చేస్తే బావుంటుంది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.