ముఖ్య అతిథి- డా. నీరజ అమరవాది

తన కోరిక ఇన్నాళ్లకు తీరబోతున్నందుకు అలివేలుకి చాలా ఆనందంగా ఉంది. భర్త దయానందం అధికారపార్టీ ఎమ్‌.ఎల్‌.ఎ. గా గెలిచినప్పటి నుండి తనకు ఎమ్‌.ఎల్‌.ఎ భార్యగా సన్మానాలు, సత్కారాలు జరుగుతాయని ఎదురుచూస్తోంది. అంతగా చదువుకోకపోయినా అలివేలుకి లోకజ్ఞానం బానే ఉంది. రోజూ దినపత్రికలు, దూరదర్శన్‌లో వచ్చే రకరకాల కార్యక్రమాలు చూడడం అలవాటే. సినిమా తారల తరువాత అంతటి పేరు ప్రఖ్యాతులు రాజకీయనాయకుల భార్యలకే అని గ్రహించింది.

దినపత్రికలలో ఫలానా మంత్రిగారి భార్య కళాశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా వెళ్లారనో, లేదా గవర్నరు గారి సతీమణి చేనేత వస్త్రప్రదర్శనని ప్రారంభించారనో, లేక ఎమ్‌.ఎల్‌.ఎ గారి అర్థాంగి శిల్పారామంలో జరిగే వర్కషాప్‌కు గౌరవఅతిథిగా వెళ్లారనో, వారి ముఖచిత్రాలతో పాటు రాసే కథనాలను చదివేది. ఛానళ్లలో ప్రసారమయ్యే ప్రత్యేక వార్తా విశేషాలను చూసేది. తాను ఈ వయసులో సినీతారలలాగా ఖ్యాతి గడించకపోయినా, ఎమ్‌.ఎల్‌.ఎ గారి భార్యగా ఏదో ఒక వార్షికోత్సవానికో, ప్రారంభోత్సవానికో అతిథిగా ఎవరో ఒకరు పిలవకపోతారా, తన ముఖచిత్రం కూడా దినపత్రికలలో చూసుకోకపోతానా అని ఆశగా ఎదురు చూస్తోంది.

అలివేలు భర్త దయానందం ఎమ్‌.ఎల్‌.ఎ గా ప్రమాణస్వీకారం చేసి సంవత్సరం దాటుతోంది. భర్తతో పాటు ఉత్సవాలకి, మఠాధిపతుల సందర్శనాలకి వెళ్తూనే ఉంది. కాని తాను మాత్రమే ముఖ్య అతిథిగా వెళ్లడానికి, తగిన ఆహ్వానం కోసం చెప్పుల్లో కాళ్లు పెట్టుకొని నిరీక్షిస్తోంది. అలాంటి సువర్ణావకాశం రానే వచ్చింది. స్థానిక జూనియర్‌ బాలికల కళాశాల వారు అలివేలును తమ కళాశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి, వార్షికపరీక్షలలో అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థినులకు బహుమతులను అందజేయవలసిందిగా ఆహ్వానించారు.

ఆ రోజు సాయంత్రమే అలివేలు కాలేజీకి అతిథిగా వెళ్లబోయేది. తానే ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించినంత ఆనందపడుతోంది. చాలా పనులున్నాయనుకుంటూ, ఇంకా పూర్ణ రాలేదేంటా అనుకొని గుమ్మం వైపు చూస్తోంది. పూర్ణ ఆ ఇంటి పనిమనిషి అయినా, సొంత మనిషి లాగా అన్ని పనులు చేస్తుంది. ఒకవేళ తాను పనిలోకి రాలేకపోయినా పిల్లలని పంపుతుంది.

పూర్ణ ఒక విషయంలో అలివేలుకి నచ్చదు. సాయంత్రాలు పనికి పిల్లలని పంపుతుంది. ఒక పిల్ల మెళ్లో శిలువ వేసుకొని వచ్చింది. మర్నాడు పూర్ణని మీరు క్రైస్తవులా అని అడిగితే, మరియ వాళ్ల నాన్న కిరస్తానం అంది. ఇంకోరోజు మరో పిల్ల పెద్ద బొట్టుతో వచ్చింది. వాళ్ల నాన్న హిందువు కాబోలని అలివేలు మనసులోనే అనుకుంది. రంజాను నాడు పూర్ణ, ఈ రోజు పండుగ కదమ్మా! సాయంత్రం పనికి రాను అంది. అంటే మీరు ముస్లిములా అంటే రీమ్‌, సాదియా వాళ్లు ముస్లిములు కదమ్మా! అంది. ఆ మాటతో పూర్ణ ఎంతమందిని చేసుకుందనే అనుమానం అలివేలుకి వచ్చింది. అదే విషయాన్ని అడుగుదామనుకొనే లోపు, వాళ్ల సంభాషణ వింటున్న అలివేలు భర్త దయానందం లోపల నుండి గట్టిగా అరిచినట్లు పిలిచి, పనిమనుషుల కులాలు, మతాలు నీకెందుకు? ఈ చర్చ ఆపు. ఎవరైనా వింటే రచ్చ అంటూ అలివేలు నోటికి అడ్డుకట్టవేశాడు.

ముఖ్యఅతిథి అలివేలు ముసిముసి నవ్వులతో ముస్తాబవుతూ చీరల ఎంపికలో తలమునకలవుతోంది. ఒక పక్క పూర్ణ పనిచేస్తున్న శబ్దాలు వినిపిస్తున్నాయి. అలివేలుకి తన గొప్పతనాన్ని పూర్ణకి చెప్పాలనిపించింది. అంట్లు తోముకునే పూర్ణకి కాలేజీకి అతిథిగా వెళ్తున్నట్లు చెప్పినా ఎంత అర్థమవుతుందిలే అనుకొంది. అయినా దాని ముఖంలో కూడా ఆనందాన్ని చూడాలనుకున్న అలివేలు, ఎప్పుడూ పాతవో, చిరిగిన చీరలో ఇచ్చే పూర్ణకి ఓ మంచి చీర బహుమానంగా ఇచ్చింది. పూర్ణ దాన్ని చూసి ఎగిరి గంతులేసి తనను పొగడాలనుకుంది. కాని పూర్ణ చీరని చూసి చూడనట్లు చూసి, మంచిదమ్మా, నాకు చాలా పని ఉందంటూ హడావిడిగా వెళ్లిపోయింది. దాన్ని చూసి తెల్లబోవడం అలివేలు వంతు అయింది.

అనుకున్న సమయానికి అలివేలు కళాశాలను చేరుకుంది. ప్రధానోపాధ్యాయురాలు ఎంతో ఆదరంగా అలివేలుని లోపలికి తీసుకెళ్లింది. కార్యక్రమం మొదలైంది. ఎమ్‌.ఎల్‌.ఎ దయానందం గురించి నాలుగు మంచిమాటలు చెప్పి, వారి సతీమణి అలివేలును వేదిక మీదికి ఆహ్వానించారు. ముఖ్యమైన ప్రసంగాల తరువాత బహుమతి ప్రదానాల కార్యక్రమం మొదలైంది. ప్రిన్స్‌పాల్‌ తమ కళాశాల విద్యార్థిని పద్మిని గురించి చెబుతూ ”నిరుపేద కుటుంబం నుండి వచ్చి, స్కాలర్‌షిప్‌లతో చదివి, ఇంటర్‌లో మంచి మార్కులు సాధించడమే కాక, మెడిసిన్‌లో కూడా ర్యాంక్‌ సాధించిందని, ఆ విద్యార్థిని తమ కళాశాలలో చదవడం ఎంతో గర్వకారణమని, ఇతర విద్యార్థులకు ఆదర్శప్రాయమని, పై చదువులకు ఉపయోగకరంగా ఉంటుందని నగదు బహుమతిని ఇస్తున్నామని” దానిని అలివేలు గారిని అందజేయమని కోరారు. ఆ తరువాత ఎంతో కష్టపడి చదివించిన పద్మిని తల్లికి మా జోహార్లు అంటూ, ఆవిడను పూలమాలతో అలివేలు గారు సత్కరిస్తారని, పద్మిని తల్లిని కూడా వేదిక మీదకు ఆహ్వానించారు.

పద్మిని తన తల్లిని చేయి పట్టుకొని వేదిక మీదకు తీసుకొచ్చింది. అందరూ కరతాళధ్వనులు చేస్తుండగా, అలివేలు పూలమాలను పద్మిని మెడలో వేస్తూ ఆమెవైపు చూసింది. ఆమె పూర్ణ! అలివేలు ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోయింది. ఇంట్లో పడి ఉన్న పాత పుస్తకాలను, కాయితాలను, పెన్సిలు ముక్కలను పారేయకుండా పూర్ణ ఇందు కన్న మాట తీసికెళ్లేదని అలివేలు మనసులో అనుకుంది. మొన్నటికి మొన్న అలివేలు పెద్దకూతురు మెడిసిన్‌ కోచింగ్‌కి వెళ్లింది. దానితో పాటు వేలకివేలు పోసి స్టడీ మెటీరియల్‌ని కొన్నది. తీరా చూస్తే అనుకున్న ర్యాంక్‌ రాలేదని, ఫోటోగ్రఫీ కోర్స్‌ నాకు ఇష్టం అంటూ దానిలో చేరింది. ఆ స్టడీ మెటీరియల్‌ని అమ్మితే సగం ధర వస్తుందని డ్రైవర్‌ తీసికెళ్తుంటే పూర్ణ అడ్డుపడి పుస్తకాలు నాకు ఇవ్వండమ్మా అంది. ఇస్తే తప్ప ఏదీ అడగని పూర్ణ, పుస్తకాలు అడిగితే అలివేలు కాదనలేకపోయింది. పూర్ణ వెళ్లిన తరువాత అక్కడే ఉన్న డ్రైవర్‌ ”అమ్మా! అది అమ్ముకోడానికే తీసుకెళ్లింది. ఎందుకు అని అడక్కుండా, మారుమాటాడక ఇచ్చేసారు. అయినా మీ ఇష్టం” అంటూ గొణుక్కుంటూ వెళ్లాడు.

అంతలో ప్రిన్స్‌పాల్‌ పూర్ణని రెండు మాటలు మాట్లాడమని కోరారు. పూర్ణ మైకు ముందుకు వచ్చి, ఇది ఆడపిల్లల కళాశాల కనుక ఇక్కడ ఉన్న ఆడపిల్లల తల్లిదండ్రులకు నమస్కారం అంటూ ప్రసంగాన్ని మొదలుపెట్టింది. ”ఆడపిల్లలని కూడా మనసున్న మనుషులుగా చూడండి. వాళ్ల పెళ్లి కోసం దాబే డబ్బుని చదువు కోసం ఖర్చు పెట్టండి. అక్షరజ్ఞానాన్ని సంపాదించిన ఆడపిల్లలు తమ కాళ్లపై తాము నిలబడడమే కాక కొడుకుల కన్నా మిన్నగా తల్లిదండ్రులను చూసుకుంటారు అని చెప్పి, తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ, తాను తొమ్మిదో తరగతిలో ఉండగానే పెళ్లిచేశారని, చదువుకుంటానంటే వాళ్ల నాన్న నాకు చదివించే స్తోమత లేదు. ఎంత చదివించినా పెళ్లి ఖర్చు తప్పదంటూ, మూడుముళ్లు వేయించాడని, పెళ్లైన రెండేళ్లకే భర్త చనిపోతే, తన అక్క దగ్గరకు వచ్చానని, ఆ అక్క కూతురే పద్మని అని చెప్పింది. పద్మినికి మూడేళ్లు ఉన్నప్పుడే ప్రమాదంలో అక్కా, బావ ఇద్దరూ ఒకేసారి పోయారని, అప్పటి నుండి నాలుగిళ్ళల్లో కష్టం చేసుకుంటూ పెంచానని చెప్పింది. తన చుట్టూ ఉన్న సమాజంలోని ఆడపిల్లలకి చదువు కన్నా వివాహానికే అధిక ప్రాధాన్యం ఇస్తూ వాళ్ల బతుకులను బుగ్గిపాలు చేయడాన్ని గమనించి పెద్దలతో పోరాడి ఆ పిల్లలకు ఆసరా ఇస్తున్నానని చెప్పింది. చిన్నారులను డబ్బు కోసం అమ్ముకునే తల్లుల నుండి కాపాడి అక్కున చేర్చుకున్నానని అలా తామంతా కలిసి సుమారు పాతిక మంది ఉన్నామని చెప్పింది. చేతనయినంత పని చేసుకుంటూ, బడికి పంపలేక పోయినా పిల్లలకు అక్షరాలను నేర్పిస్తాము. కనిపించిన ప్రతి పుస్తకము మాకు పాఠ్యపుస్తకమే. మా పిల్లలందరూ తెలివికలవారే. ప్రిన్స్‌పాల్‌ గారింటికి పద్మిని పనికి వెళ్లినప్పుడు, దాని తెలివితేటలు చూసి పదో తరగతి పరీక్షలను ప్రైవేటుగా కట్టించారు. దాని మార్కులు చూసి ఫీజు కూడా లేకుండా ఈ కాలేజీలో చదివించారు. మన ఎమ్‌.ఎల్‌.ఎ అమ్మగారు పద్మినికి ఎంట్రన్స్‌ పుస్తకాలు ఇవ్వడమే కాక ఎంతో ప్రోత్సహించారు. ఇలాంటి తల్లుల దయ ఉంటే మన పిల్లలందరు డాక్టర్లుగా, లాయర్లుగా, నాయకులుగా సమాజానికి సేవచేసి దేశానికి గర్వకారణమౌతారు. దయచేసి ఆడపిల్లలని విజ్ఞానజ్యోతులకు దూరం చేయకండి. కంటివెలుగులను ఆర్పేసుకోకండి” అంటూ ప్రసంగాన్ని ముగించింది.

పూర్ణ మాటలనే గుర్తుచేసుకుంటూ అలివేలు ఇంటికి వచ్చింది. భర్త దయానందం ఎదురుగా వచ్చి ”నీ మొదటి కార్యక్రమం విజయవంతంగా జరిగింది చాలా సంతోషం! ఆ సభలో నాగురించి మా పార్టీ గురించి కూడా చెప్పారుగా. టి.వి.లో ప్రత్యక్షప్రసారం చేశారు. ఎమ్‌.ఎల్‌.ఎ భార్యవి కదా మీడియా వాళ్లు బాగా కవర్‌ చేశారు. ఇప్పుడే మంత్రిగారు వచ్చే ఎన్నికల్లో నీ భార్యకు కూడా పార్టీ టికెట్‌ ఇస్తానంటూ ఫోన్‌ చేశారు. నేను ఎమ్‌.ఎల్‌.ఎ గా ఉన్నా నీకు మంత్రి పదవి రావచ్చు” అంటూ ఎంతో ఉత్సాహంతో చెప్పాడు.

అలివేలు ముఖ్య అతిథులంటే నిజంగా సమాజానికి సేవ చేసే పూర్ణలాంటి వారేనని భావించింది. ఏ పదవి లేకుండా తన చుట్టూ ఉన్న పూర్ణ లాంటి వాళ్ల కష్టసుఖాల్లో పాలు పంచుకొని ముందు తాను మనిషిగా ఎదగాలనుకుంది. దినపత్రికలో తన ముఖచిత్రం చూసుకోవడం కన్నా, ఆపదలో ఉన్న వాళ్లని ఆదుకుంటూ వారి మనసులలో స్థానం సంపాదించుకోవాలని నిశ్చయించుకొని, ఆ దిశగా అడుగులు వేయడానికి సిద్ధమైంది.

Share
This entry was posted in కధానికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో