రైతాంగ సమస్యలు – మూలాలు – పరిష్కారాలు- తుమ్మల మోహనరావు

నేడు రైతాంగం అనేక సమస్యలతో సతమతమవుతూ, ముఖ్యంగా మన తెలంగాణాలో రైతులు ఆత్మహత్య చేసుకోని రోజంటూ లేదు. అందరికీ అన్నం పెట్టే రైతన్న పరిస్థితి అత్యంత తీవ్ర సమస్యగా ముందుకు వచ్చింది. దీనికి పరిష్కారమేమిటనేది సమస్య మూలాల్లోకి వెళ్లి పరిష్కార మార్గాలు వెతకాల్సి వుంటుంది.

స్వాతంత్య్రానంతరం మొదటి పంచవర్ష ప్రణాళిక నుంచి వ్యవసాయానికి, పరిశ్రమలకు ప్రాధాన్యతనీయబడింది. 60వ దశకంనుంచీ, మన రాష్ట్రంలోనే చూసుకొంటే నాగార్జున సాగరు, శ్రీశైలం, పోచంపాడు లాంటి బహుళార్థసాధక ప్రాజెక్టులు, అనేక మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులు రావటం జరిగింది. సమాంతరంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడులతో బిహెచ్‌ఇయల్‌, ఐడిపిఎల్‌, హెచ్‌ఏయల్‌, హెచ్‌యంటి, ఇసిఐఎల్‌, యన్‌ఎఫ్‌సి, హెచ్‌సిఎల్‌, డిఆర్‌డిఎల్‌, డియంఆర్‌ఎల్‌, బిడిఎల్‌, ఐఎన్‌పిబి, ఆర్‌ఎఫ్‌సి, ఓఎఫ్‌, ఎన్‌టిపిసి, బిహెచ్‌పివి, షిప్‌ బిల్డింగ్‌, విఎస్‌పి లాంటి అనేక పరిశ్రమలు, కార్పొరేషన్లు స్థాపించబడి లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి. వ్యవసాయంలో ఆహార పదార్థాల స్వావలంబన సాధించాము. 80వ దశకం నాటికి ప్రయివేటు పెట్టుబడిదారులు బాగా బలపడి ప్రభుత్వ రంగాన్ని నాశనం చేయటంలో భాగంగా 90వ దశకంలో సంస్కరణలు ప్రవేశపెట్టించి కృతకృత్యులయ్యారు. సంస్కరణలలో భాగంగా ఉత్పత్తి రంగాలయిన వ్యవసాయం, పారిశ్రామిక రంగాలకు ప్రాధాన్యత తగ్గించి సర్వీసు రంగాలకు పెట్టుబడులు పెంచిన ఫలితంగానే వ్యవసాయం దెబ్బతిని రైతు ఆత్మహత్యలు నిత్యకృత్యమయినాయి. లక్షలాది చిన్న, పెద్ద పరిశ్రమలు మూతపడి రైతులు, ఉద్యోగులు కడు దుర్భర పరిస్థితిలోకి నెట్టబడ్డారు. పెద్ద పెద్ద పెట్టుబడిదారులు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారు. రైతులు, కార్మికులు, చేతివృత్తులు, నిరుద్యోగుల పరిస్థితి ”నానాటికి తీసికట్టు నాగంభొట్లు” అన్నట్లు తయారయినది.

వ్యవసాయరంగాన్నే తీసుకుంటే దుక్కి దున్ని విత్తనం వేసే దశ నుంచీ పంట చేతికొచ్చి అమ్మి పైసలు చేతికొచ్చే వరకు గ్యారంటీ లేదు. గతంలో ప్రతి రైతు తాను పండించిన పంటలో కొన్ని విత్తనాలు అట్టి పెట్టుకొని తదుపరి పంటకు వాడుకొనేవాడు. కానీ నేడు ఆ పరిస్థితి పోయి విత్తన సంస్థలమీద ఆధారపడుచున్నాడు. అధికధర, విత్తన లభ్యత లేమి, నాసిరకం విత్తనాలతో పంటనష్టం జరుగుచున్నది. కావున ప్రభుత్వం, వ్యవసాయ విశ్వవిద్యాలయాలవారు, సంయుక్తంగా మండల, జిల్లా స్థాయిలో విత్తన ఉత్పత్తి చేయించి రైతుకు నాణ్యమయిన విత్తనాలు సరసమయిన ధరకు అందించాలి. ఏ ప్రాంతం ఏ పంటకు అనుకూలం, ఏ పంటకు ఎంత డిమాండు వుంది, అత్యవసర పంటలేవి, కానివి ఏవి అని వర్గీకరించి ప్రభుత్వం సరియైన ప్రణాళికతో రైతులు పంటలు పండించేటట్లు చూడాలి.

ఎరువులు, పురుగు మందులు విచక్షణా రహితంగా వాడబడుచున్నవి. ఏ పంటకు ఎప్పుడు ఏ ఎరువు ఏ మోతాదులో వేయాలి. ఏ పురుగుకు, ఏ తెగులుకు ఏ మందు ఎంత డోసు వేయాలి అనే అవగాహన లేకపోవటంతో ఎరువుల షాపువాడు ఇచ్చిందే వాడటం జరుగుచున్నది. యూరియా ఎరువు అతి తక్కువ నీటిలో వేయాలి. గుళికలు ఎక్కువ నీరు కట్టివేయాలి. కానీ జింకు లోపమున్న పొలాలకు యూరియా, గుళికలు (ఫోరేట్‌, కార్బోఫ్యురాన్‌) కలిపి వాడటం జరుగుచున్నది. రోగమొకటయితే మందొకటి వేసినందువలన అధిక ఖర్చు, పంట నష్టం జరుగుచున్నది. కావున ప్రతి ఒకటి, రెండు గ్రామాలకు వ్యవసాయ పట్టభద్రుని నియమించి సలహాలు, సూచనలు ఇచ్చేటట్లు ప్రభుత్వం చూడాలి. నేడు శాస్త్ర, సాంకేతిక రంగాలు ఎంతో అభివృద్ధి అయినా, అవి సామాన్య రైతుకు చేరటం లేదు. పెద్ద కామందులు, కార్పొరేట్లు మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. వ్యవసాయంలో ముందు జాగ్రత్తలు అవసరం. ఎర పంటలు, రిబ్బన్లు, లింగాకర్షక బుట్టలు, సామూహిక ఎలుకల నివారణ, వేసవి దుక్కులు, స్వాభావిక ఎరువుల వాడకం, జీలుగలాంటి పంటలను భూమిలో కలియదున్ని భూసారం పెంచటం లాంటివి చేయాలి. దీనితో పురుగు మందుల వాడకం తగ్గించవచ్చును. భూసారం పెంచవచ్చు.

గతంలో వర్షాకాలం రాగానే ప్రతిగ్రామంలో మెట్ట పంటలు పండించేవారు. అపరాలు, తృణధాన్యాలు పండించేవారు. వరిపంట తక్కువ వుండేది. నేడు కరంటు పగలు, రాత్రివేళల్లో రావటంతోను, మాగాణి పెరగటంతోను వరిపంటనే ఎక్కువ పండిస్తున్నారు. వైవిధ్య పంటలు తగ్గిపోయినవి. ఆహార అలవాట్లలో మార్పులు వస్తున్నవి. పట్టణీకరణ పెరగటంతో శారీరక శ్రమ తగ్గి స్థూలకాయం పెరుగుచున్నది. జంక్‌ ఫుడ్స్‌ పెరుగుచున్నవి. కావున ప్రభుత్వం రాయితీలతో తృణ ధాన్యాల, వైవిధ్య పంటలను ప్రోత్సహించాలి. సుమారు ఐదు ఎకరాలపై బడిన రైతు ఒకే పంట కాకుండా 2, 3, 4, 5, 6 రకాల పంటలు వేయాలి. ఒకటి రెండు పంటలు దెబ్బతిన్నా, గిట్టుబాటు ధర రాకున్నా, మిగతా పంటల్లో లాభం వచ్చి, నష్టానికి ఆస్కారం వుండదు. అలాగే ప్రతి రైతు పొలం చుట్టూ ఒకటి రెండు వరుసల్లో సరివి, సుబాబుల్‌, వేప, వెదురు, తాడి, పనస, చింత, జామ, నేరేడు, టేకు లాంటి చెట్లు పెంచినట్లయితే ఆకులు ఎరుపుగా ఉపయోగపడి, 3 సం||లకు, 7-8 సం||లకు, 12-15 సం||లకు 20-25 సం||లకు గుండుగుత్తగా లక్షల్లో ఆదాయం వస్తుంది. ప్రతి పది ఎకరాలకు ఒక ఎకరం పచ్చిగడ్డి పెంచి పశువులకు మేపి అదనపు ఆదాయం రాబట్టాలి. ఎరువుకోసమయినా ఎకరానికి ఒక పశువు చొ||న పెంచి నేలలో సారం తగ్గకుండా చూడాలి. దాదాపు సంవత్సరం పొడుగునా ఏదో ఒక పని జరుగుతూ, పంట పండుతూ ఆదాయం వచ్చేటట్లు ప్లాను చేసుకోవాలి. కూలీల సమస్య లేకుండా చూడటం కోసం ప్రతి రైతు ఎకరానికి ఒకరు చొప్పున జోడీలను నెలజీతంతో పొలంలోనే మకాం ఏర్పాటు చేసి పనిచేయించుకోవాలి. దాదాపు 70-80 శాతం పనిని క్యాంపు లేబరుతోనే చేయించగలగాలి. గ్రామంలోని కూలీలకు కూడా సంవత్సరమంతా పని దొరుకుతుంది. కూలీలు పట్టణాలకు వలసలు నివారింపబడతాయి. ఇలా చేస్తే రైతుకు లాభం గ్యారంటీ అవుతుంది.

వ్యవసాయంలో నీటిపారుదల వ్యవస్థ అత్యంత కీలకం. ప్రతి రైతు తన పొలం సైజును బట్టి కొంచెం ఎత్తులో నీళ్ళ ట్యాంకులు నిర్మించుకొని కరంటు ఎప్పుడు వచ్చినా నీళ్ళు ట్యాంకులో పడేటట్లు, అవసరమయినప్పుడు గ్రావిటేషను ద్వారా పారకం చేసుకునే ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు సంవత్సరమంతా ఏదో ఒక పంట పండించ వీలవుతుంది. ప్రతి పది ఎకరాలకు ఒక ఎకరంలో ద్రాక్ష పందిరి లాంటిది వేయించాలి. పందిరిపైన క్రింద ఒకేసారి రెండు పంటలు పండించవచ్చును. పందిరి, నీళ్ళ ట్యాంకు ఏర్పాటు చేసుకున్న ప్రతి రైతుకు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలి.

నేడు మనదేశం, అవసరమయిన వంట నూనెలను దిగుమతి చేసుకుంటున్నది. కానీ వేలు, లక్షల ఎకరాల్లో అవసరంకాని పూలు పండించి చెత్తపాలు చేస్తున్నాం. కోట్లు ఖర్చు చేసి గ్రీన్‌ హౌస్‌లు, పాలి హౌస్‌లలో పూలు పండిస్తున్నాం. అదే ఖర్చు వంట నూనెలు, ఉల్లిగడ్డలు, ఇతర ఆహార పంటలపై పెడితే విదేశీమారకం మిగులుతుంది. పైన తెలిపిన సూచనలు ప్రకారం వ్యవసాయం చేస్తూ, శాస్త్ర, సాంకేతికాలను ఉపయోగించుకుంటే ఉత్పాదకత పెరుగుతుంది. మన ప్రక్కనే వున్న చైనా మనకంటే రెట్టింపు పంట పండిస్తున్నది.

విత్తనాలు, ఎరువులు, పరికరాలు, మందులు, లాంటివన్నీ రాయితీతో ప్రభుత్వం సప్లయి చేయాలి. స్వామినాథన్‌ కమీషను చెప్పినట్లు ఖర్చుమీద 50 శాతం లాభం వుండేటట్లు, రాబోయే సంవత్సరానికి పంట ధర ప్రభుత్వం నిర్ణయించి, పంట రాగానే ప్రభుత్వమే కొనాలి. మధ్య దళారీల విధానం రూపుమాపాలి. ప్రతి మండలానికి గిడ్డంగులు, శీతల గిడ్డంగులు ప్రభుత్వం ఏర్పాటు చేసి, రైతు తన పంటను నిలువచేసుకుని మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకునే అవకాశం కల్పించాలి. ప్రతి రైతుకు పరపతి సౌకర్యం కల్పించాలి. ప్రయివేటు వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల నుంచి విముక్తి చేయాలి. అలాగే కౌలుదారులను గుర్తించి వారికి ఋణాలు, సబ్సిడీలు, అందేటట్లు చూడాలి.

ప్రభుత్వం వారు ఆకాశ హర్మ్యాలు, మల్టీ లెవల్‌ ఫ్లై ఓవర్లు, మెట్రోలు, రిమోట్లు లాంటి వాటిమీదే దృష్టి పెట్టకుండా, వ్యవసాయానికి బడ్జెట్టు పెంచాలి. సోలార్‌ పంపుసెట్లు, బిందుసేద్యం, పాలిహౌస్‌, ట్రాక్టర్లు, పరికరాలకు ఇచ్చే సబ్సిడీ బడ్జెట్టును మండల, గ్రామాల వారీగా విడగొట్టి గ్రామంలోని రైతులను వర్గీకరించి వారి పేరు మీద లాటరీ తీసి రాయితీలు అందేటట్లు చేయాలి. నీళ్ళ ట్యాంకులు, పందిళ్ళకు కూడా సబ్సిడీ ఇవ్వాలి.

రైతులు చెరకు, కంది, ప్రత్తి, పొగాకు, ఆముదం, కాయగూరల కంపను పంట తరవాత తగులబెట్టుచున్నారు. ఇందువల్ల గాలి కాలుష్యం అవుతున్నది. అదే కంపను క్రషర్ల ద్వారా చిప్స్‌/పొడి చేసి పొలంలో వేసి కలియ దున్నితే భూసారం రక్షింపబడుతుంది. అందుకు ప్రభుత్వం చిన్నపాటి క్రషింగు మిషన్లను ప్రతి గ్రామానికి అందుబాటులోనికి తేవాలి. మిర్చి డ్రైయర్లు, గానుగ మిషన్లు, విత్తన శుద్ధిలాంటి అగ్రో ఇండస్ట్రీస్‌ను అందుబాటులోనికి తేవాలి.

ప్రభుత్వం బహుళార్థక భారీ, మధ్య, చిన్న నీటి ప్రాజెక్టులు నిర్మించి నదులనుంచి ఒక్క చుక్క నీరు కూడా సముద్రంపాలు కాకుండా చూడాలి. సాగునీరు, తాగునీరు అందించాలి. ముందుగా గోదావరి నదికి సంబంధించిన వాగులు, వంకలు, ఉపనదులపై వీలయినన్ని ఎక్కువ కత్తవలు (అడ్డుగోడలు) 15-20 అడుగుల ఎత్తులో నిర్మించాలి. ఒక్కొక్క కత్తవకు మహాఅయితే 2, 3 కోట్ల ఖర్చు కావచ్చును. ప్రతి కత్తవ క్రింద చిన్న చిన్న కాలువల ద్వారా సాగు చేయవచ్చు. చుట్టుపట్ల గల బావులు, బోర్లలో ఊట పెరుగుతుంది. కొన్ని గ్రామలకు మంచినీరు అందించవచ్చు. సుమారు 2,000 కోట్లతో వందల్లో కత్తవలు నిర్మించి లక్షల ఎకరాలకు నీరు అందించవచ్చు. లక్షల మందికి పని దొరుకుతుంది.

మన విద్యావిధానం లోప భూయిష్టంగా వుంది. తండ్రి రైతు. కొడుకు ఎస్‌ఎస్‌సి, ఇంటర్‌, డిగ్రీ చదివిన వాడయినా, ఏ పంటకు ఏ ఎరువు ఎంత వేయాలి, ఏ రోగానికి ఏ మందు చల్లాలి అని సలహా ఇచ్చే పరిస్థితి లేదు. కొడుకు జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం గూర్చి కూలంకషంగా చదివిన వాడే. కానీ అన్నం పెట్టే వ్యవసాయం, పశుపోషణ గూర్చి తెలిసింది శూన్యం. కావున విద్యలో వ్యవసాయ శాస్త్రాన్ని సిలబస్‌లో చేర్చితే రైతుకు ఉపయోగపడతాడు. ఉద్యోగం దొరకకపోయినా శాస్త్రీయంగా వ్యవసాయం చేసుకునైనా బ్రతుకుతాడు. ప్రతి సంవత్సరం లక్షల్లో ఇంజనీర్లు తయారగుచున్నారు. 60 శాతం జనాభా ఆధారపడే వ్యవసాయ రంగానికి అగ్రికల్చర్‌ బి.యస్‌సి చేసిన వారు ఎందరు బయటకు వస్తున్నారు? కావున వ్యవసాయ పట్టభద్రుల సీట్లు ఇతోధికంగా పెంచాలి. గతంలో గణితంలో రెడీ రెకోనర్లు వుండేవి. అలాగే వ్యవసాయ రడీరెకోనర్లు తయారుచేసి అందించాలి. ఏ ఎరువులు, ఏ పంటకు ఏ మోతాదుల్లో వేయాలి లాంటి వివరాలు వుండాలి.

పైన తెలిపిన సూచనలు పాటిస్తే వ్యవసాయం దండుగకు బదులు వ్యవసాయమే రక్ష కాగలదు. ఇందుకు ప్రధానంగా ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు ఆదేశిత సంస్కరణలు వదలి, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు ప్రాధాన్యతనీయాలి.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో