మేమూ అంతే…! మీరూ అంతేనని భావిస్తూ …- రేకా కృష్ణార్జునరావు బొర్రా గోవర్ధన్‌ గోలి సీతారామయ్య

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హేతువాద సంఘం అధ్యక్షులుగా మాకు రిజిష్టర్‌ ఉత్తరం పంపిన శ్రీ ఎన్‌.వి.సుబ్బయ్య గారికి …

– మీ ఉత్తరంలోని విషయాల గురించి మా వివరణ ఇది….

– బౌద్ధానికి మహిళల పట్ల, వారి సమస్యల పట్ల సానుకూల వైఖరి ఉంది. మహిళా సాధికారత గురించి 2500 సం||రాల నాడే బుద్ధుడు ప్రబోధించాడు. ఆడపిల్లల చదువు విషయంలో ఎంతో ప్రోత్సహించాడు. చదువులో గానీ, ఇతర విద్యల్లో గానీ శిక్షణ ఇస్తే మగపిల్లల వలె ఆడపిల్లలు కూడా గొప్పగా రాణిస్తారని చెప్పాడు. కుటుంబ వ్యవహారాల్లో స్త్రీకి సమున్నత స్థానం ఉండాలని చెప్పాడు. భార్యను గానీ, కోడలిని గానీ, అత్తగారిని గానీ, అక్క చెల్లెళ్ళను గానీ అగౌరవంగా చూడకూడదని, వారిని నీచమైన పదాలు ఉపయోగించి మాట్లాడకూడదని హితోపదేశం చేశాడు. ఆడవారిని సమాజంలో సగ భాగంగా భావించాలని, ప్రపంచ అభ్యున్నతికి ప్రధాన కారకులుగా గుర్తించాలనీ… ఇలా… బౌద్ధంలో ఎన్నో చోట్ల స్త్రీల గురించి బుద్ధుడు చేసిన వ్యాఖ్యానాలు ఉన్నాయి. అంతేకాదు… ఆడవారికి ఒక సంఘం ఉండాలనీ, వారికి తాత్త్విక, ధార్మిక, నైతిక శిక్షణ అవసరం అని ఈ ప్రపంచంలో మొట్టమొదటిగా ‘భిక్షుణీ (మహిళా) సంఘాన్ని’ స్థాపించిన తొలి సామాజిక విప్లవకారుడు కూడా బుద్ధుడే.

కాబట్టి, బౌద్ధులుగా, బౌద్ధాభిమానులుగా మేము మహిళా స్వేచ్ఛను మనఃపూర్వకంగా కోరుకుంటాం. ఆ స్వేచ్ఛకు అడ్డుతగిలే దేన్నయినా నిరసిస్తాం. అలాగే మహిళా ఉద్యమానికి మద్దతుగా జూలై ‘బుద్ధభూమి’లో ఇరవై సంఘాలతో మహిళా రక్షణ కోసం ఉన్న ఏకైక క్రిమినల్‌ చట్టం 498 (ఎ)ని సమర్థిస్తూ సంఘీభావ ప్రకటన వెలువడింది. ఆ ప్రకటన ఆయా సంఘాలకు సంబంధించిన

ఉమ్మడి ప్రకటన అది. అయినప్పటికీ సామాజిక బాధ్యతగల బౌద్ధులుగా మీకు కలిగిన అపార్థాన్ని తొలగించేందుకు కొంత వివరణ ఇవ్వటం మంచిదని భావించి క్రింది విషయాలు తెలియపరుస్తున్నాం.

బుద్ధుడు ఏదో ఒక మూల కూర్చొని ప్రబోధించిన ప్రవక్త కాదు. కార్యాచరణలో కార్యకారణ సంబంధాన్ని (హేతువాదాన్ని) సమాజంలో పరీక్షించి చూసిన శాస్త్రవేత్త. అలాగే … ఆయన కేవలం హేతువాది మాత్రమే కాదు. ఆయన ప్రబోధాలకే పరిమితమైతే కేవలం హేతువాదిగానే మిగిలేవాడేమో? కానీ, సమాజ క్షేత్రంలో హేతువాదాన్ని పరీక్షించినవాడు కాబట్టి, హేతువాదం ఎంత ముఖ్యమో, ‘నైతిక’ విలువలు కూడా అంతే ముఖ్యం అని గ్రహించాడు. అందుకే బుద్ధుడు నైతిక హేతువాది – ఆచరణాత్మక మానవతావాది – పరిపూర్ణ ధర్మవాది.

బౌద్ధం స్త్రీల పట్ల ఒక బాధ్యత కల్గిన ధార్మిక సిద్ధాంతం. ఆ దృష్టితోనే మేము మా సంఘీభావ ప్రకటన ఇచ్చాం.

– గత సంవత్సరం ఒక నాస్తిక హేతువాద పత్రిక (వాయిస్‌ ఆఫ్‌ చార్వాక)లో మహిళల గృహహింస నివారణ కోసం వచ్చిన 498-ఏ చట్టం మీద కొన్ని వ్యాసాలు ముద్రితమయ్యాయి. ఆ చట్టం ‘తీవ్ర దుర్వినియోగం అవుతుందనే’ వ్యాసాలతో పాటు, అదే ధోరణితో సంపాదకీయం కూడా వచ్చింది. అంటే … ఆ పత్రిక 498-ఏ చట్టాన్ని ‘అనవసరం’ అని చెప్పకనే చెప్పింది. ఆ పత్రికలో వచ్చిన విషయాల్ని నిరసిస్తూ అనేక మహిళా సంఘాలు తీర్మానాలు చేశాయి. అవి అనేక పత్రికల్లోనూ వచ్చాయి.

ఇక్కడ మనం ఇలాంటిదే మరో విషయాన్ని కూడా ఆలోచించాలి…

కృత యుగం, త్రేతా యుగం, ద్వాపర యుగం, కలి యుగం – ఇన్ని యుగాలుగా (పురాణాల ప్రకారం కొన్ని లక్షల సంవత్సరాలుగా) ‘అంటరాని వారని’ హింసించిన ‘మను’ విధానం మన దేశంలో ఉంది. కానీ ఆ ‘అంటరాని వారు’ గత పది, పదిహేను ఏళ్ళుగా తమకు కల్పించిన ప్రత్యేక చట్టంతో ఎంతో కొంత రక్షణ పొందుతుంటే – ఈ యుగాల్ని, యుగ ధర్మాల్ని నమ్మే వాళ్ళు – ‘అది దుర్వినియోగం అవుతుందని’ గుండెలు బాదుకుంటున్నారు. గగ్గోలు పెడుతున్నారు. ఆ మనువాదులతో కొందరు ఆధునికులూ గొంతు కలుపుతున్నారు. గోల పెడుతున్నారు.

ఈ దళితులు గతంలో అగ్రకులాల వారి లాగా ఎవ్వర్నీ కొట్టి, కాల్చి, నరికి చంపడం లేదు. తమ జోలికి రాకుండా ఆ చట్టాన్ని ఒక కవచంగా ఉపయోగించుకుంటున్నారు. ఈ కొద్దిపాటి దానికే ‘దుర్వినియోగం’ అని గుండెలు బాదుకుంటున్నారు గదా! మరి, తరతరాలుగా అణగారిన వారు … వీరిలా ఆలోచిస్తే …!

ఒకసారి ఒక వ్యక్తి గాంధీ గారి దగ్గరకు వచ్చి, ”ఏమండీ! గాంధీ గారూ! మీరు ఇలా మౌనంగా ఉంటే ఎలా? ఒక వైపున అంబేడ్కర్‌ అగ్ర కులాల్ని తెగ విమర్శిస్తున్నాడు” అన్నాడట.

అప్పుడు గాంధీజీ – ”చూడు నాయనా! ఇంతకాలంగా వారికి మనవాళ్ళు చేసిన అన్యాయానికి, వారు మన తలలు పగలగొట్టనంతవరకు మనం వారిని తప్పుబట్టలేం” అని సమాధానం చెప్పాడు. ఎంత చారిత్రక విజ్ఞత…!

చరిత్రను హీనంగా ఆలోచించే వారికి ఈ విజ్ఞత అలవడదు. ఈ యస్‌.సి అట్రాసిటీస్‌ నిరోధక చట్టం లాంటిదే, ఈ 498-ఏ కూడా …

– బుద్ధుడు ఒకసారి చించ అనే స్త్రీకి తన సంఘంలో ప్రవేశం కల్పించాడు. కుళ్ళుబోతులైన కొంతమంది అన్యమతస్తులు ప్రేరేపించగా ఆమె ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసి ”తన గర్భానికి బుద్ధుడే కారణం” అని అందరి ముందు అబద్ధం చెప్పింది. కొందరు సాక్షుల్ని కూడా తెచ్చుకుంది. ఆ ఒక్క సంఘటన వల్ల ‘ఛీ … ఆడవారంతా ఇంతే … వారు అట్టడుగున మగ్గాల్సిందే’ అని బుద్ధుడు భావించలేదు. ఆమెను కరుణించాడు. ఆమె అలా ప్రవర్తించడానికి కూడా ఆమె అజ్ఞానమే కారణం అని భావించాడు. ఆమె మీద కారాలు మిరియాలు నూరిన తన శిష్యులను ”స్త్రీల పట్ల అలా దురుసుగా ప్రవర్తించకూడదు. అవమానకరంగా మాట్లాడకూడదు” అని చెప్పాడు. ఇది సంస్కారవంతుల పని.

అంటే … ఆమె, ఆయనిచ్చిన అవకాశాన్ని ‘దుర్వినియోగం’ చేసినా కూడా ఆ ఒక్కరి తప్పును మొత్తం స్త్రీ సమాజానికి అంటగట్ట లేదు. అది ఒక్కరికి సంబంధించిన వ్యక్తిగత తప్పుగానే చూశాడు. అది వారి అజ్ఞానంగానే భావించాడు. అదీ శాస్త్రీయత అంటే …

– అలాగే సర్వోన్నత సామాజిక వ్యవస్థ కోసం బౌద్ధాన్ని స్వీకరించిన అంబేడ్కర్‌ మహాశయునికి కూడా మహిళల పట్ల ఎనలేని ప్రేమాభిమానాలు ఉన్నాయనడానికి ఎన్ని ఉదాహరణలైనా చెప్పవచ్చు. ఒక్క బుద్ధుడు, అంబేడ్కర్‌ అనే కాదు, మార్క్స్‌, లెనిన్‌, మావో, పూలే, పెరియార్‌…ఇలా ప్రపంచ మేధావులు-మహనీయులు ఎందరో మహిళా స్వేచ్ఛను కాంక్షించారు. వారి వికాసానికి ఎంతగానో కృషి సలిపారు. ఒక్క మనువాదం తప్ప మానవీయ భావాలు గల ఏ అభ్యుదయ సిద్ధాంతమూ మహిళల రక్షణకు-ప్రగతికి అడ్డుపడదు.

కొన్ని దుర్వినియోగ సంఘటనలు ఉన్నాయని మొత్తం చట్టాన్నే ఎత్తి వేస్తే లక్షలాది మహిళలకు అన్యాయం చేసినట్టే అవుతుంది – దుర్వినియోగం అవుతుందనే పేరుతో మహిళల రక్షణ కోసం వచ్చిన చట్టాన్ని ఎత్తి వేస్తే… ఇక ఈ దేశంలో (ప్రపంచంలోనే) ఏ చట్టమూ ఉండదు. మనందరం తిరిగి … ఆటవిక దశలోకి వెళ్ళిపోవాల్సిందే!

సమాజాన్ని ‘వెనక్కి’ నడపడం శాస్త్రీయం కాదు. హేతువాదం కాదు అనుకొంటున్నాం. కాబట్టే అడపా దడపా ‘రక్షించే’ చట్టాలు దుర్వినియోగం అయినా, వాటిని పూర్తిగా ఎత్తివేయాలని మేము భావించడం లేదు. అయితే, వాటిని అవసరమైన మేరకు సవరించి దుర్వినియోగం కాకుండా చూడాలని కూడా కోరుకుంటున్నాం.

ఇక – మేము మా సంఘీభావ ప్రకటనలో మొదటి పేరాలోనే ఇలా రాశాం.

”ఇటీవల కాలంలో 498-ఏ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ వివిధ మహిళా సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాదులో సమావేశాలు, సదస్సులు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో విద్యార్థి, యువజన సంఘాలు, అభ్యుదయ, ప్రగతిశీల సంఘాలు, పలు హక్కుల సంఘాలు, హేతువాద సంఘాలు పాలుపంచుకుంటున్నాయి …” – అని – కాబట్టి మేము ఎక్కడా హేతువాదుల్ని కించపరచలేదు – కించపరచం కూడా. ఎందుకంటే బౌద్ధులుగా మేము బౌద్ధ వ్యాప్తిని కాంక్షిస్తాం. బౌద్ధ వ్యాప్తికి అంధ విశ్వాసాలు పెద్ద ప్రతిబంధకాలుగా ఉంటాయి. అంధ విశ్వాసాలు ఎంతగా సడలుతూ ఉంటే బౌద్ధ వ్యాప్తి అంతగా విస్తృతమవుతుంది. అంధ విశ్వాసాలపై సమరశంఖాన్ని పూరించే హేతువాద ఉద్యమాలు పరోక్షంగానే అయినా బౌద్ధ వ్యాప్తికి దోహదపడతాయి. అందువల్ల మాకు హేతువాదుల పట్ల గానీ, హేతువాద ఉద్యమాల పట్ల గానీ గౌరవభావం ఉంటుందే తప్ప మీరు అపోహ పడినట్లు అగౌరవభావం ఎంత మాత్రం ఉండదు.

ఇక మేము పరిశీలించిన మేరకు స్వేచ్ఛాలోచన, జనపథం, హేతువాదం, హేతువాది, సైన్సు హేతువాదం, భూమిక, మాతృక, మానవి, స్త్రీ విముక్తి, ప్రజాసాహితి మొదలైన ప్రజాతంత్ర హేతువాద భావాలున్న పత్రికలన్నీ 498-ఏ ని సమర్థించాయి. 498-ఏ కు వ్యతిరేకంగా అవి ఎలాంటి ప్రకటనలూ, నిర్ణయాలూ చేయలేదు.

అలాగే … మీరు కూడా (మీ హేతువాద సంఘం) స్త్రీల రక్షణకు, స్త్రీలపై జరిగే గృహహింసకు, దాని కోసం వచ్చిన 498-ఎ చట్టానికి అనుకూలురనే భావిస్తున్నాం. కాబట్టి మీరు ‘ముసుగులో ఉన్న హేతువాదులుగా’ మేమైతే భావించడం లేదు. ఐతే – మీరు మాకు ప్రత్యేకంగా ఉత్తరం పంపారు కాబట్టి, ‘మీరు 498-ఏ కు అనుకూలురో? వ్యతిరేకులో? మాకు తెలియజేస్తే సంతోషం. తెలియజేయకపోతే … మీరు ఈ మహిళా చట్టానికి అనుకూలురేనని భావిస్తాం.

అయినా … ఈ ‘దుర్వినియోగాల మీద వచ్చిన గొడవంతా, చేస్తున్న గగ్గోలంతా ఒట్టి తాటాకు చప్పుళ్ళే. ఈ చప్పుళ్ళను ‘భేరీ’ నాదాలనుకుని మనం మోసపోకూడదు. ఐతే … ఒకటి … దేశంలో ఏ చట్టం వచ్చినా, ఏ ఒక్కరి కోసమో (వ్యక్తుల కోసం) రాదు. అలాగే … ఏ ఒక్కరికో నష్టం కాబట్టి పోదు. చట్టాలు సమాజం కోసం, సామూహిక అవసరాల కోసం వస్తాయి!

మనం ఒక కర్ర పుల్లను పట్టుకుంటాం. దాన్నిండా చీమలుంటాయి. ఒక చీమ కుడుతుంది. వెంటనే మనలో క్రూరస్వభావం మేల్కొని చీమలన్నింటినీ చంపేస్తాం –

బౌద్ధం – ఇలాంటి ప్రవృత్తిని ఒప్పుకోదు. కాబట్టి 498-ఏ అనేది ఒక సామాజిక అవసరం కోసం ఏర్పాటు చేసిన చట్టంగానే దాన్ని గౌరవిస్తుంది. బౌద్ధులుగా మేమూ అంతే …. హేతువాదులుగా మీరూ అంతేనని భావిస్తున్నాం.

చివరగా ఒక్కమాట … మేము హేతువాదుల్ని కించపరచామనే అపోహతో మీరు ఉత్తరం రాశారు.

అసలు హేతువాదులంటే ఎవరు? హేతువాదులంటే కేవలం హేతువాద సంఘాల్లో ఉండేవాళ్ళు మాత్రమే కాదు. బౌద్ధులమైన మేమూ హేతువాదులమే. అలాగే అంబేడ్కర్‌ వాదులు, మార్క్స్‌వాదులు కూడా హేతువాదులే. అంతేకాకుండా ఏ సంస్థలతో సంబంధం లేని హేతువాదులు సమాజంలో ఎన్నో వేలమంది ఉన్నారు. వీరంతా సామాజిక బాధ్యతను గుర్తించినవారే, సామాజిక రుగ్మతలను అంగీకరించినవారే. అదే విధంగా మీరు కూడా సమాజంలో నిత్యం లక్షలాది మంది మహిళలు పలు రూపాల్లో ఘోర హింసల పాలవుతూ ఉంటే వాటిని సహించక ఇతర ప్రగతిశీల శక్తులు, హేతువాదులు, హేతువాద సంఘాల మాదిరిగానే 498-ఏ కి మహిళలకు, మహిళా ఉద్యమాలకు మీరు, మీ హేతువాద సంఘం అండదండలుగా ఉండే వుంటారని భావిస్తున్నాం. ఇకపై అలాగే ఉంటారని కూడా ఆశిస్తున్నాం.

Share
This entry was posted in స్పందన. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.