బిజిలీ.. బుజ్జి .. బిడ్డ- వి. శాంతి ప్రబోధ

అది అడవిగుండా సాగే బళ్ల బాట. ఎత్తు పల్లాల గతుకుల బాటలో 108 వాహనం దుమ్ము లేపుకుంటూ పోతోంది. ఆ వాహనంలో ఉన్న యువతికి తోడుగా వెళ్లే ఆమె అత్త 65 ఏళ్ల బిజిలీ మనసులాగే .. ఆ దారిలాగే వారి జీవితాలూ… ఆమె శరీరపు ముడుతల మడతల్లో పేరుకుపోయిన ఎన్నో అనుభవాల్లా.. రాళ్ళూ రప్పల తాకిడికి తనువంతా అవుతున్న గాయాల్ని తనలోనే ఇముడ్చుకుంటూ సాగిపోతున్న 108 అంబులెన్స్‌…

ఆ అంబులెన్స్‌లోని స్ట్రెచర్‌పై ఉన్న యువతి బుజ్జి పురిటి నొప్పులు పడుతోంది. ఆ పక్కనే ఉన్న పొడవాటి సీటుపై ఆశావర్కర్‌తో పాటు బిజిలీ కూడా కూర్చొని వుంది. డ్రైవర్‌ సీటు పక్కన ఆ యువతి భర్త కీమ్యా కూర్చున్నాడు.

రోహిణి పోయి మృగశిర వచ్చినా వేసవి తాపం పోలేదు. దారి పొడవునా పసుపు పచ్చ గుత్తులతో అందాన్ని, ఆహ్లాదాన్ని పంచే రేలపూలు .. చిగుర్లు తొడిగిన తునికి ఆకులు.. రాలుతున్న విప్పకాయలు.. అన్నిటినీ ధూళితో పాటు వారి ఆలోచనల మేఘం కమ్మేస్తూ.. అడవిలోకి పోతున్న మేకల మందల అరుపులు.. వాటి కాపర్ల కేకలు.. ఆ మందలతోనే సాగే యజమానిని అనుసరించే కుక్కల భౌవ్‌ భౌవ్‌లు .. అన్నీ ఆ వాహనం చేస్తున్న రొదలో కలసిపోతూ.. సాగిపోతూ ..

ఈ సారన్నా మగ పిల్లవాడు పుడతాడో లేదోనన్న బెంగ బిజిలీలో.. మనసులో భయం. ఆరుగురు ఆడపిల్లల తర్వాత పుట్టిన ఒక్కగానొక్క కొడుక్కు కొడుకులు లేకపోతే ఎట్లా … ఈ వంశం ముందుకు పోయేదెట్లా … ఆమెకు ఆలోచనలతో తల వేడెక్కుతోంది. ఆమెను కృంగదీస్తోంది. తలపై కప్పుకున్న వోణి తీసి నుదుటి మీదుగా చెవుల వెనుకనుండి తిప్పి కప్పింది. ఆమె మెడలో ఉన్న రంగు రంగుల పూసల దండలు అటూ ఇటూ కదిపింది సరి చేసుకుం టున్నట్లుగా.

కుదుపులకు పురిటి నెప్పులు మరింత ఎక్కువయ్యాయేమో ‘అమ్మా.. అమ్మా..’ మధ్య మధ్యలో బాధగా అరుస్తోంది బుజ్జి.

‘కాస్త ఓర్చుకోమ్మా .. ఓర్చుకో’ ఆమె చేయి పట్టుకుని ధైర్యాన్నిస్తూ ఆశావర్కర్‌ సునీత.

దరిద్రపు మొఖంది, కోరికోరి పైస కట్నం లేకుండా చేసుకొని ఇంటికి తెచ్చుకుంటే ఆడపిల్లల్నే కంటాంది. ఇంట్లో ఇప్పటికే ఇద్దరున్నారు. మళ్ళీ ఆడపిల్లయితే పెంచేదెట్లా .. పెద్ద చేసేదెట్లా .. ఆ రోజుల్లంటే ఎట్లనో అట్లా తను ఆరుగురికి పెళ్ళి చేసి పంపింది. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో వాళ్ళ పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలి ..? ముందటి రోజులు ఇంకా ఎంత హీనంగా ఉంటాయో .. అందుకే మరో ఇద్దరు ఆడపిల్లల్ని పుట్టగానే హాస్పిటల్‌ నర్సు, ఆయమ్మలకి అప్పచెప్పేసింది. ఏమి చేశారో.. ఉన్నారో పోయారో తెలియదు. కానీ బిడ్డలు పుట్టగానే చనిపోయారని చెప్పారు అందరికీ. ఈసారి కడుపులో ఉన్నది ఆడపిల్లో, మగపిల్లాడో ఫోటోతీసి చూడమని డాక్టర్‌ నడిగితే తిట్టారు. బతిమాలింది. ఎన్ని పైసలైనా పెడతానంది. ఇంకా ఎక్కువ మాట్లాడితే జైలుకు పంపుతామని బెదిరించారు. ముంబాయి పనులకోసం పోయిన కేవళ్యానాయక్‌, తుల్జాబాయి వాళ్ళకోడలికి కంప్యుటర్‌లో ఫోటో తీపిచ్చి చూస్తే ఆడపిల్ల అని చెప్పారట. కడుపులోనే ఆ బిడ్డని కరిగించేశారట అని ఎవరో చెప్పగా విని నా కోడల్ని డాక్టర్‌ దగ్గరకు తీసుకుపోయి అడిగితే తననే పోలీసులకు పట్టిస్తానన్నాడు అని తిట్టుకుంది. తన బాధ వాళ్ళకేం తెలుసని కోడలికేసి తీక్షణంగా చూస్తూ మూగగా వాపోయింది బిజిలీ.

ఎడమ వైపు కిటికిలోంచి కదిలే పచ్చని అడవి కేసి చూస్తూ తల్లీ ఇన్ని రకాల మొక్కలకు నారుపోసి పెంచుతున్నవే .. నా భార్య కడుపున ఒక మగ బిడ్డని వేయొచ్చుగా.. అంటూ కనిపించని దేవతలకి మనసులోనే ఆర్దిస్తూ .. బుజ్జి గర్భవతి అయిన ప్రతిసారీ కొడుకు పుడతాడేమోనన్న ఆశ తన్నుకొస్తుంది. కానీ మఖలో పుట్టి పుబ్బలో సచ్చినట్లు అయిపోతుంది .. ఈ సారి కొడుకయితేనే ఇంటికి తెచ్చేది ఖరాఖండీగా అనుకున్నాడు కీమ్యా .. లేకుంటే ..? ఆ ఆలోచన రాగానే ఏమీ అర్థంగాక దుమ్ముతో మసకబారిపోతున్న చెట్లు చూస్తూ .. కిటికిలోంచి తలవంచి కాండ్రించి ఉమ్మేశాడు.

పురిటి నెప్పుల కంటే అత్త మాటలు ఎక్కువగా బాధపెడ్తున్నాయి బుజ్జిని. ఈసారి కొడుకుని కనకుంటే ఇంట్లోకి రానిచ్చేది లేదని అంబులెన్సు ఎక్కినప్పుడు కూడా అన్నది. అత్త మొండితనం తనకు తెలియనిదా..! తను అనుకున్నది చేసి తీరుతుంది. మొగుడు బీమారయి పోయినా అంత మంది పిల్లలతోని సంసారం నెట్టుకొచ్చింది. కష్టం సుఖం ఏదయినా తన కడుపులోనే పెట్టుకునేది. ఇప్పుడు ఇట్లా మాట్లాడిందంటే… రేపు తన పరిస్థితి ఏమిటో .. తల్లి మాటే తన మాట అంటాడు భర్త. అసలు అతని మాటలే ఆమె నోట వస్తాయేమో..! అనుకుంది బుజ్జి.

పుట్టుకతోనే తను దురదృష్టవంతురాలు. పుట్టిన యాడాదిలోపే తల్లిదండ్రులు ఏడుపాయల జాతరకు పోయి ఏట్లో కొట్టుకుపోయారు. నాన్నమ్మ బాగానే చూసుకునేది. 15 ఏళ్ళ వయసులో పాతికేళ్ళ కీమ్యాతో రెండో పెళ్లి. మొదటి భార్య కడుపుతో ఉన్నప్పుడు వాతం వచ్చి తల్లి, బిడ్డ చనిపోతే తనను కట్నం లేకుండా చేసుకున్నారు. పెళ్లయిన వెంట వెంటనే పిల్లలు. కొడుకు కావాలన్న కోరిక తీర్చడంలేదని అంతవరకూ బాగానే చూసుకున్న అత్త

ఆరళ్ళు. ఎత్తిపొడుపులు .. తనకు ఎవరున్నారు? అత్తిల్లయినా .. అమ్మ ఇల్లయినా ఇదే కదా .. ఎక్కడికి పోతుంది బిడ్డతో? నా తల్లి ఉంటే .. ఆమె కూడా కోడలితో ఇట్లానే ఉండేదా.. ఏమో..! కడుపులో కదలికలు, నొప్పి ఉధృతమవుతుండగా సాగుతున్న బుజ్జి ఆలోచనలు.

‘దేవుడా నాకు మనవడినివ్వు. నా కొడుక్కు రెక్కాసరా ఇవ్వు’ మనసులో అనుకున్న మాటలు అప్రయత్నంగా పైకి వచ్చేశాయి బిజిలీ నోటివెంట.

అప్పటివరకూ కునికిపాట్లు పడుతున్నట్లు బుజ్జి చేయి పట్టుకుని కళ్ళు మూసుకుని కూర్చున్న ఆశావర్కర్‌ సునీత ‘ఏం బుజ్జీ .. ఆడపిల్ల అయితే ఏమ్జేస్తవ్‌’ నవ్వుతూ అడిగింది. అసలే నొప్పుల బాధతో నీరసపడి, వడలిపోయిన బుజ్జి మొహం నెత్తురు చుక్క లేనట్లు పాలిపోయి, ఆమె ఒంటిని కప్పిన వెలిసిపోయిన గులాబీ రంగు చీరతో పోటీపడుతుండగా.. నోట మాట రాక బిత్తరపోయి కళ్ళలో నీరూరుతుండగా అత్త వైపు ఓ సారి చూసి కళ్ళ మూసింది.

‘దీన్ని, పుట్టినదాన్ని ఆడనే ఇడ్సి పోత’ స్థిరంగా బిజిలీ కంచుకంఠం తరుముకొచ్చింది. ‘ఏందమ్మ .. అప్పటికెల్లి జుస్తాన్న నీ కోడల్ని బెదిరిచ్చుడు ..’ గదిమింది ఆశావర్కవర్‌ సునీత.

‘ఆమె ఆడబిడ్డని కన్నా .. మగబిడ్డని కన్నా దానికి కారణం ఆమె కాదు నీ కొడుకు. నీ కొడుకును రానీయకు ఇంటికి.’ కొంచెం గట్టిగానే అన్నది.

‘అవ్‌ గట్లన్టవ్‌ .. అది కంటే నా కొడుకు నంటవ్‌ ..’ సునీత కేసి కోపంగా చూసి, బుజ్జి కేసి కోపం అసహ్యం మిళితమైన చూపు విసురుతూ అరిచింది బిజిలీ. తప్పు చేసినదానిలా తెరవబోయిన కళ్ళు గట్టిగా మూసుకుంది బుజ్జి. ఆమె కన్నుల్లోంచి తడి సన్నగా పక్కకు జారుతూ.

తల్లి గొంతు విన్నాడేమో కాబిన్లో కూర్చున్న కీమ్యా వెనక్కి తిరిగి అద్దంలోంచి లోపటికి చూశాడు.

బిజిలీ కోపాన్ని అర్థం చేసుకున్న సునీత ‘చేను చెల్క ఉన్నదా ..’ చాలా సౌమ్యంగా అడిగింది.

‘ఆ.. జరంత ఉన్నది? అదిడువు.. నేనోటి అంటే నువ్వెందో అడ్గుతవ్‌..?’ కటువుగా బిజిలీ స్వరం

‘అరె, యాడి.., అట్ల గుస్సా ఎందుకయితవ్‌.. అదే జెప్తాన్న .. జర తీరెం విను. చేన్ల నువ్వు వడ్లు నాటితే జొన్నలొస్తయా ..?’ అడిగింది.

ఇదేంటి అర్థం లేని ప్రశ్న అన్నట్లు ఆశావర్కర్‌ కేసి చూస్తూ ‘అట్ల ఎవరన్న జూసిన్రా..’ బిజిలీ ఎదురు ప్రశ్న.

‘లేదు, ఏ విత్తనమేత్తే ఆ మొక్క మొలుత్తది కదా ..’ అంటూ బిజిలీ కళ్ళలోకి సూటిగా చూసింది సునీత.

అవునన్నట్లు చూసింది తలదించుకుని ఏదో బోధ పడినట్లయి ఆలోచనలో పడింది ఆమె. బుజ్జి తన మనసు, శరీరం పెట్టే బాధని అదిమిపెడుతూ ఆశావర్కర్‌ చెప్పే మాటలకోసం ఆసక్తిగా చెవులు రిక్కించింది.

‘మరి ఇది సుత గంతే గదనే బాయీ.. నీ కొడుకు విత్తనం ఏత్తే కోడలు మొలకనిత్తది .. మక్కలేస్తే మక్కలయితయి గానీ .. వడ్లయితయా ..?’ మళ్లీ ప్రశ్నించింది సునీత. బిజిలీ నొసలు ముడిపడ్డాయి. జవాబు లేదు. బొడ్లో దోపిన సంచీ తీసింది. అది చాలా పాతదే అయినా దానికి కుట్టి ఉన్న నాలుగు పలకల అద్దాలు, వాటి చుట్టూ తెల్లటి పూసలు జిగ్‌జాగ్‌గా.. అందంగా.. అందులోంచి అడకత్తెర, వక్క తీసింది. వక్కని ముక్కలుగా కత్తిరించి ఒక ముక్క తీసి బుగ్గన పెట్టింది. తలెత్తి బయటకు చూస్తూ తీవ్రంగా ఆలోచిస్తోంది. కానీ జవాబు చెప్పలేకపోతోంది.

‘నీ మనసుల ఏమాలోచన చేత్తాన్నవో నాకర్తమయితాంది. నీ కొడుక్కు మారు మనువు జేయ్యాల్నన్న ఆలోచన జేస్తున్నవ్‌ .. గంతే గదా ..’ బిజిలీ మొహంలో కదలాడే భావాలు చదవడానికి ప్రయత్నిస్తూ సూటిగా ప్రశ్నించింది ఆశావర్కర్‌.

కదలిపోతున్న పచ్చదనాన్ని చూస్తున్న బిజిలీ, ఆ పచ్చదనం తన కుటుంబంలోకి ఎప్పుడు వస్తుందోనని ఆలోచిస్తోంది.

‘ఓ బిజిలీ మాటాడకచ్చినవ్‌..? పోయినేడాది కూడా నీ కోడలికి మా దవఖాన్లనే కాన్పు అయింది కద..’ గతం గుర్తుకు తెచ్చుకుంటూ అడిగింది సునీత.

‘ఆ .. అవును’, కొద్దిగా తొట్రుపాటు బిజిలీలో

‘బిడ్డ మంచి గున్నదా’ హాస్పిటల్‌లో ఉండడానికి అవసరమైన బట్టలు, సామాన్లు సర్దుకుని ఇద్దరు ఆడపిల్లల్ని పక్కింట్లో అప్పజెప్తూన్నప్పుడు చిన్నపిల్ల కనపడకపోవడం గుర్తొచ్చి అడిగింది ఆశావర్కర్‌.

గతుక్కుమన్న ఆమె ‘ఆ .. అదా … గప్పుడే జచ్చె’ బిజిలి స్వరంలో చిన్న తొట్రుపాటు తనకు గుర్తున్నంత వరకూ పుట్టిన బిడ్డ బాగానే ఉంది. ఆ తర్వాత ఏమైనా జబ్బు చేసిందేమో .. అడగబోతుండగా మోటారు వాహనాలు దగ్గరవుతున్న చప్పుళ్ళు.

మలుపు తిరిగి మోటరు సైకిల్లు, జీపులు, కార్లు ఎదురయినాయి. ఆ ఇరుకు దారిని మరింత ఇరుకు జేస్తూ..

‘అయ్యో ఏమయిందో .. ఏమో .. ముంగట వున్నవి మూడే తండాలు. ఇంకా ఆడ ఊర్లెడివి .. సుట్టుముట్టు గుట్టలేనాయె ..’ గాబరా పడింది బిజిలీ.

‘ఏమిగాలే .. ఇవ్వాళ మలావత్‌ పూర్ణ వస్తున్నది కదా అదే గావచ్చు’ అన్నది ఆశా వర్కర్‌.

‘పూర్ణనా అదెవరు ..?’

‘అయ్యో .. యాడీ .. పూర్ణ తెల్వదా .. తండా పిల్లన.ే మీ పక్క తండా పిల్లనే గద ..’ అంటూ పూర్ణ గురించి చాలా గొప్పగా చెప్పింది. ప్రపంచం అంతా ఆమెని ఎంత గొప్పగా పొగుడుతున్నారో చెప్పింది. తాడ్వాయి హాస్టల్‌లో ఉండి చదివే పిల్ల ఎంత ఘనకార్యం చేసిందో వివరించింది సునీత.

అవన్నీ ఏమోగానీ సర్కారు 25 లక్షలు ఇచ్చినదని, ఇంకా చాలా మంది చాలా నజరానాలు ఇస్తున్నారని మాత్రమే బిజిలి చెవిలో గింగురుమంటోంది.

‘ఆ… గుట్టలు కొండలు ఎక్కితే అంత పైసా ఎవరిస్తరు? మేం చిన్నగున్నప్పటికెల్లి పుల్లకు, పోర్కకు, కాయకు, పండుకు గుట్టలెక్కి దిగేటోల్లమే నయితిమి .. ఎన్నడన్న గిట్ల ఇచ్చిన్రా..’ అంది నమ్మలేనట్లు చూస్తూ.

‘పూర్ణ ఎక్కింది మామూలు గుట్టలు కాదు ఎత్తైన పర్వతాలు. ఆడపిల్లలని ఈసడించుకుంటున్నావు కానీ, ఆమెకు అవకాశమిస్తే ఆకాశమే హద్దు .. ఇప్పుడు పూర్ణను చూస్తే తెలుస్తలేదా.. ఆమె కూడా మీ తండాలల్లనే పుట్టింది. చెట్లు పుట్టలు పట్టుకొని తిరిగింది. కానీ, ఆడపిల్ల అని పని పాటలకు పెట్టకుంట బడికి తోలి చదివిపిత్తాన్రు ఆమె అమ్మానాన్న. అదే ఆమె బతుకు మార్చింది’ సునీత మాటలు వాహనాల, డప్పుల వాయిద్యాల చప్పుళ్ళ మధ్య బిజిలీకి ఏమి అర్థమయ్యాయో ..?

ఎదురుగా లంబాడా గిరిజన మహిళల నృత్యాలతో సాగుతున్న వారి ప్రయాణం నత్త నడక లాగా .. అంబులెన్స్‌ డ్రైవర్‌ అదేపనిగా చేసే హరన్‌ చప్పుడు .. ఎదురుగా వచ్చేవారికి దారి ఇవ్వాలన్నా ఇవ్వలేకుండా ఇరుకైన బాట .. సరిగ్గా వెళ్తే ఇంకో పదిహేనిరవయి నిముషాల్లో గమ్యానికి చేరతారు. కానీ ఇప్పుడు ఇంకెంత సమయం పడుతుందో .. బుజ్జికి నొప్పులు రాను రాను ఎక్కువవుతున్నాయి.. బాధతో అరుస్తోంది. వాటికి తోడు మనసులో ఆందోళనతో ఉన్న బుజ్జిని గమనిస్తూనే, ఆమెను ఓదారుస్తూనే ‘నిన్న మొన్నటిదాంక మీ పక్కూరి పూర్ణ, ఆమె తల్లిదండ్రులు, ఆమె ఊరు బయటోల్లెవరికన్న ఎర్కున్నదా.. గిప్పుడు జూడు దునియా అంత ఎర్కె. మలావత్‌ పూర్ణ ఇంటి దిక్కు ఆఫీసర్లు దారివట్టిన్రు. చీమల బారుల్లెక్క కార్లు, జీపులు, బండ్లు ఎట్లపోతున్నయో కండ్ల వడ్తాంది గద. ఆమెను హాస్టల్‌ల ఏసేతందుకు కులం సర్టిఫికేట్‌, ఆదాయం సర్టిఫికేట్‌ల కోసం ఆఫీసర్ల చుట్టూ కాళ్లరిగేటట్టు తిరిగిండు ఆమె నాయిన. ఇగ గిప్పుడు చూడు ఉల్టా.. ఆల్లె వీళ్ళిల్లు ఎతుక్కుంట అస్తున్నరు. ఊర్ల పెద్దలు, కలెక్టరు, ఎమ్మల్యే అంత పెద్ద పెద్దోళ్ళు అటే దారి పట్టి పోతున్నరు .. ఆమె ఇంకా ఊర్లె అడుగు పెట్టకుంటనే వాళ్ళింటికి పోయి పూర్ణ అమ్మానాన్నలను పలకరిచ్చి పోతున్నరు. ఆమె మెడల పూలదండలు, బహుమతులు, సన్మానాలు .. పేపర్లు .. టివి లల్ల అంతా .. దునియా అంతా ఆమె సుద్దేనాయే ..’

ఉద్వేగంగా చెప్పుకుపోతోంది సునీత.

ఆ మాటలు వింటున్న బిజిలీ కళ్ళు విప్పారుతూ .. ముడుతలు పడ్డ చర్మం నిక్కబొడుచుకుని నిగారింపు వస్తూ .. అంతలో వారి గమ్యం సిరికొండ దవాఖానా రానే వచ్చేసింది. హమ్మయ్య, వచ్చేశాం అని ఊపిరి పీల్చుకుంది ఆశా వర్కర్‌.

కొద్ది సేపటికే నార్మల్‌ డెలివరీ అయింది బుజ్జికి. ‘ఆడపిల్ల’ డాక్టర్‌ గొంతు వినగానే బుజ్జి వణికిపోయింది. ఒళ్ళంతా తడచిపోయింది. బిడ్డ ప్రాణం, తన ప్రాణం అప్పుడే అటే పోతే బాగుండుననుకుంది. విషయం తెల్సిన కీమ్యా ఆమె మొహం చూడకుండా భుజంపై ఉన్న కండువా తీసి విదిలించి మళ్ళీ మెడచుట్టూ వేసుకుంటూ బయటికి సరసరా నడిచి పోయాడు.

మనసులో ఏముందో గాని మోహంలో ఎలాంటి భావాలు కనిపించనీకుండా పురిటి బిడ్డని చేతుల్లోకి తీసుకుంది బిజిలీ .. భయంతో, బాధతో అత్తిపత్తిలా ముడుచుకుపోయిన బుజ్జికి. తలపై చేయివేసి నిమిరింది. ఆ స్పర్శలోని ఆప్యాయత ఆమెలో ఎవరెస్టు ఎక్కినంత సంతోషాన్నిస్తూ .. బతుకు పట్ల భరోసా ఇస్తూ .. బుజ్జి కళ్ళలో ఆశ్చర్యంతో పాటు ప్రసరిస్తున్న వెలుగు, మొహంలో పొంగుకొస్తున్న మెరుపు చూసి బిజిలీ మనసు నిండిపోయింది. అత్త భర్తకి నచ్చచెబుతుందన్న ధీమాతో తృప్తిగా నిట్టూర్చి అత్త చేతుల్లోని బిడ్డకేసి చూసింది బుజ్జి.. వారి కళ్ళు ఆశా వర్కర్‌ కోసం వెతుకుతూ ..

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

2 Responses to బిజిలీ.. బుజ్జి .. బిడ్డ- వి. శాంతి ప్రబోధ

  1. వనజ తాతినేని says:

    అజ్ఞానం లో ఉన్నాం . ఇలాంటి కథల అవసరం చాలా ఉంది . ప్రజలలోకి ఇలాంటి కథలు వెళ్ళాలి .

  2. Rajesh says:

    కథ హృద్యంగా ఉంది. అభినందనలు శాంతి గారూ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో