భయస్థుడు (ఫోమా గార్డియెవ్‌) – మాక్సిం గోర్కీ- ఉమా నూతక్కి

నిరాశ
కళ్ళముందు ఉరితాడై కదలాడినప్పుడు
నిస్పృహ
చావే పరిష్కారంగా చూపినప్పుడు
హఠాత్తుగా అతను గుర్తుకొస్తాడు.
చావును సవాల్‌ చేసిన ఆ ధిక్కార స్వరం గుర్తుకొస్తుంది.
పిడికెడు గోధుమ గింజల మీద
తన పేరు వెతుక్కోవడం కోసం ఉక్రెయిన్‌, క్రెమియా కానన్‌
రాష్ట్రాల గుండా అతను చేసిన యాత్రలే గుర్తుకొస్తాయి

అతనే ”మాక్సిం గోర్కీ”. గోర్కీ సామాన్యుల ఉద్యమోజ్వల రూపం. గోర్కీ వాక్యాల వెంట నడిస్తే చాలు అణువణువూ చైతన్య జలపాతాలు మనల్ని నిలువెల్లా ఉత్తేజంతో నింపివేస్తాయి. ప్రపంచ సాహిత్యక్షేత్రంలో గొప్ప రచయితగా నిలిచిన వ్యక్తి మాక్సిం గోర్కీ. రచయిత తన అంతరాత్మను ఆవిష్కరించడం కంటే సమాజపు అంతరాత్మగా ప్రతిధ్వనించడమే ముఖ్యమని నమ్మిన వ్యక్తి. అందుకే తన రచనల ద్వారా సాహితీ ప్రపంచాన్ని ఒక సునామీలా చుట్టేసాడు. మాక్సిం గోర్కీ పేరు వినగానే ముందు గుర్తుకు వచ్చే పేరు ”అమ్మ” నవల. అయితే అతను మొట్టమొదట వ్రాసిన పుస్తకం ఈ నెల మీకు పరిచయం చేయబోతున్న నవల ”ఫోమా గార్డియెవ్‌” తెలుగులో రెంటాల గోపాలక్రిష్ణ ”భయస్థుడు”గా అనువదించారు. బెల్లంకొండ రామదాసు గారు చేసిన అనువాదం కూడా ఉంది. 1901లో రచించిన ”ఫోమా గార్డియెవ్‌” ”ది మేన్‌ హు వజ్‌ ఎఫ్రైడ్‌”గా ఇంగ్లీషులోకి అనువదించబడింది. ఆ తర్వాత రామదాసు గారి ద్వారా తెలుగులోకి వచ్చింది. ప్రపంచ సాహిత్యంలో అప్పటికీ ఇప్పటికీ కలికితురాయిగా నిలిచిపోయింది. ఆనాటి రష్యన్‌ సమాజంలోని బూర్జువాల భూస్వాముల వర్గ దృక్పధాన్ని యధార్థంగా చిత్రీకరించిన నవల ఇది.

మాక్సిం గోర్కీ బాల్యం చాలా మందిలా మధురస్మృతి కాదు. అతను పసితనం నుంచే అనేక చేదు అనుభవాలతో గడిపాడు. ఐదేళ్ళ వయసులో అతని తండ్రి మరణించాడు. తరువాత తల్లి మరొక పెళ్ళి చేసుకుని వెళ్ళిపోవడంతో కర్కశ హృదయుడయిన తాత పెంపకంలో ఎంతో నిరాదరణకు గురయ్యాడు. అమ్మమ్మ చెప్పే కథలే అతనికీ కథనాశైలి అలవరచుకోవడంలో ఉపయోగపడ్డాయి. తొమ్మిదవ యేటనే అనాథగా మారిన గోర్కీ తన జీవన పోరాట క్రమంలో అనేక రకాల కూలిపనులు చేస్తూ రష్యా సామ్రాజ్యమంతా కాలినడకన తిరిగాడు. అతని మొదటి నవల ”భయస్థుడు”లో అతని చిన్నతనపు ఛాయలు మనకు కనిపిస్తాయి.

19వ శతాబ్దపు చివరి దశకంలోని రష్యన్‌ జీవితం… ముఖ్యంగా వాణిజ్య వర్గాల వ్యక్తిగత జీవితాలలో వెలుగు నీడలు ఇందులో కథావస్తువు. వ్యాపారులు స్వప్రయోజనాలకోసం ఎంతటి దుర్మార్గాలకయినా వెనుకాడరు. అలాంటి దుర్మార్గుడు, దురాశపరుడయిన ఇగ్నాట్‌ గార్డియేవ్‌ కొడుకు ఫోమా గార్డియెవ్‌. ఇగ్నాట్‌ దృష్టిలో తోటి మనుషులందరూ తన సంపాదనలో ఉపయోగపడే పావులు మాత్రమే. ”జీవితం అంటే ప్రేమగా చూసుకునే కన్నతల్లిలాంటిది కాదు. కొరడా ఝళిపించి లొంగదీసుకునే యజమాని లాంటిది” అని కొడుకుకు నూరిపోస్తుంటాడు ఇగ్నాట్‌. కాని మన కథానాయకుడు ”ఫోమా గార్డియెవ్‌” అలా కాదు. బాల్యం నుండి ఫోమా నిరాడంబరత్వాన్నే కోరుకుంటాడు. పేదలు, స్త్రీలు, కూలీ జనం భూస్వాముల పట్ల చూపే విధేయత కేవలం ఆర్థికపరమయినదని ఫోమా చిన్నతనంలోనే గ్రహిస్తాడు. ఈ నవలలో ధనవంతులు గ్రద్దల్లా పేదల్ని, వారి శ్రమని దోచుకునే తీరు గోర్కీ మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తాడు. ”సంపాదించడం, ఆ డబ్బుని చూసుకుని మురిసిపోవడం బాగానే ఉంటుంది. కానీ అది మనసుకి ఇచ్చే ఆనందం నిజమయినదీ, శాశ్వతమయినదా?”

ఇది ఆద్యంతం ఫోమాని వేదించే ప్రశ్న.

ఈ ప్రశ్నకు జవాబు కోసం ఫోమా పిచ్చివాడిలా అన్వేషిస్తాడు. ఒకసారి తండ్రితో కలసి స్టీమర్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక కూలీ పెట్టుబడిదార్ల గురించి చెడ్డగా మాట్లాడతాడు. విషయం తెలిసిన ఫోమా తండ్రి ఇగ్నాట్‌ ఆ కార్మికుణ్ణి చితకగొడతాడు. ఆ సంఘటనతో ఫోమా మనసు తీవ్రంగా గాయపడుతుంది. ”ధనికుల దృష్టిలో పేదలు జంతువుల కన్నా హీనం. ఎలాంటి దుర్భర జీవితమయినా గడుపుతాను తప్ప పెట్టుబడిదారుగా బతకనని” నిర్ణయించుకుంటాడు. సంపదని సృష్టిస్తున్నది పేదలే! కనుక వాళ్ళలో ఒకరిగా కలిసిపోవాలి. తండ్రి ఇగ్నాట్‌ గార్డియెవ్‌ మరణం తరువాత ఫోమా తన ఆస్థిని కాపాడుకోవటానికి ఎలాంటి ప్రయత్నం చేయడు. అలాగని తన తండ్రి బంధువర్గాన్ని, ఇతర పెట్టుబడిదారులను ఎదిరించి పేదల పక్షానా నిలవడు. ఫోమా ఒక భయస్థుడు. అతనిలో తెగించలేని మనస్తత్వం విపరీతమయిన ఘర్షణకి దారితీస్తుంది. సంపద కరిగిపోతుంటే సంతోషిస్తాడు. రష్యన్‌ బూర్జువా వర్గాన్ని ఆ విధంగా అభిశంసిస్తాడు.

పుస్తకం చివర్లో ఫోమా ఇలా అంటాడు. ”నేను అర్థం చేసుకున్నది ఇదీ! కొందరు పురుగులు మరికొందరు పిచ్చుకలు. ఆ పిచ్చుకలే వర్తకులు. వీళ్ళు ఆ పురుగులని ముక్కులతో పొడుచుకొని తింటారు. వీళ్ళు పుట్టిందే అందుకు. మరి నాలాంటివాళ్ళు ఎందుకూ కొరగారు. వ్యర్ధంగా అనాలోచితంగా జీవిస్తారు. మనం అప్రయోజకులం. మనం దుఃఖిస్తాం అంతే. దుఃఖాన్ని తీర్చలేం. సమస్యకి కారణం తెలిసీ స్పందించలేని నాలాంటి అప్రయోజకులే సమాజానికి నిజమయిన శత్రువులు”. పుస్తకం చదువుతున్నంతసేపూ ”ఫోమా గార్డియెవ్‌కు స్పందించే ధైర్యం వస్తే బాగుండు” అనుకుంటూ అతను నిస్సహాయుడిలా పిచ్చివాడైపోయినప్పుడు మనం వెక్కివెక్కి యేడుస్తాం.

మాక్సిం గోర్కీ అసలు పేరు ”అలెక్స్‌ మాక్సిమోవిచ్‌ పెష్కోవ్‌”. గోర్కీ అతని కలం పేరు. గోర్కీ అంటే చేదు అని అర్థం. నిజజీవితంలో చవిచూసిన చేదునే తన కలం పేరుగా పెట్టుకున్నాడు. జీవితంలో అతను ఎదుర్కొనే అనుభవాలు 21 సంవత్సరాలకే అతనిని సంచారజీవిగా మార్చాయి. రష్యా అంతటా సంచరించి పలుముఖాల జీవితాన్ని దర్శించాడు. పతితులనూ, భ్రష్టులనూ, తాగుబోతులనూ అవలోకించి వాస్తవాలను అవగతం చేసుకున్నాడు. ధనవంతులు మరింత ధనవంతులుగా, పేదవాళ్ళు మరింత పేదలుగా మారటం వెనక ఉన్న వివిధ కారణాలతోపాటు పేదల మానసిక దౌర్బల్యాన్ని నిశితంగా మనసుకి పట్టించుకున్నాడు.

అందువల్లనే గోర్కీ సాహిత్యంలో అత్యంత సహజంగా హద్దులూ, ఆనకట్టలూ లేని మానవశక్తి ఒక సముద్రఘోషలా మనకు వినిపిస్తుంది. బ్రతుకులోని అపశృతులన్నీ నిర్భయంగా మీటుతాడు గోర్కీ ”భయస్తుడు” నవలలో ఫోమా గార్డియెవ్‌ ఉజ్వల మానవతను ఉరితీస్తున్న సమాజం గురించి ప్రపంచానికి తెలియచెప్పాలని చూస్తాడు. సమాజంపై నేరం మోపుతాడు. కాని అతను భయస్తుడు. బలహీనుడు. ఏమీ చేయలేని అతని ఆవేశం అతనినే అగాధంలోకి తోసివేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఫోమా గార్డియెవ్‌ ద్వారా ఒక విప్లవకారుడు, ఒక ఆదర్శమూర్తి ఎలా బ్రతకకూడదో చెపుతాడు గోర్కీ. గోర్కీ ప్రఖ్యాత నవల ”అమ్మ” వ్రాయడానికి 7 సంవత్సరాలు ముందు రాసిన పుస్తకమిది. అతను మార్క్సిస్టుగా మారి పాఠకులని కూడా మార్క్సిజం వైపు ప్రభావితం చేయాలని చేసిన అద్భుతమయిన ప్రయత్నమిది.

ఈ విశ్వంలో మనుష్యులందరూ ఒకే పద్ధతిలో వచ్చినప్పుడు కొందరు బాధపడేవారుగానూ, మరికొందరు బాధపెట్టేవారుగానూ ఉండడం ఈ ప్రపంచానికే అవమానం అనే గోర్కీ ”ప్రతీ మనిషీ దీన్ని వ్యతిరేకించాలి. ఈ అసమానత్వాన్ని పారదోలడానికి ప్రయత్నించాలి. ఇది మానవత్వం”. ”శక్తివంతమయిన సోషలిస్టు మానవత్వం మాత్రమే ప్రపంచాన్ని ఆరోగ్యంగా ముందుకు తీసుకువెళ్తుంది” అంటాడు. గోర్కీ ఎక్కడా ప్రత్యక్షంగా రాజకీయ తాత్విక చర్చలో పాల్గొనలేదు. కాని తాను సృష్టించిన సాహిత్యం ద్వారా అతను ఆ పని చేసాడు. రష్యా సమాజం ఆ రోజుల్లో ఎదుర్కొంటున్న ఒక ప్రధాన తాత్విక, రాజకీయ సమస్యను గురించి చర్చ పెట్టాడు. ఇప్పటి మన సమాజం కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు. నేటి పెట్టుబడిదారి సమాజాలు సెజ్‌లు, స్మార్ట్‌సిటీలు అంటూ ప్రజలకు ఆకర్షణ చూపుతున్నాయి. ఎన్నెన్నో కలలు రేకెత్తిస్తున్నాయి. ఆయా సమాజాలు తమ ఆర్థిక ప్రయోజనాల కోసం వర్ధమాన దేశాలను తమ మార్కెట్‌ ఛత్రాధిపత్యంలోకి తెచ్చుకుంటున్నాయి. ఇలాంటి తరుణంలో గోర్కీ ఆలోచనలు, రచనలు, వాటిలోని రాజకీయ వైఖరులు తెలుసుకోవడం ఎంతైనా అవసరం.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.