భారతదేశంలో త్వరిత మరియు బాల్య వివాహాలు ఒక ల్యాండ్‌ స్కేప్‌ విశ్లేషణ- నిరంతర్‌ టీమ్‌ అనువాదం: పి.ప్రశాంతి

భారతదేశంలోని త్వరిత మరియు బాల్య వివాహాలపై అమెరికన్‌ జూయిష్‌ వరల్డ్‌ సర్వీసెస్‌ (AJWS) సహకారంతో ‘నిరంతర్‌ ట్రస్ట్‌’వారు 2014లో నిర్వహించిన అధ్యయనం ఆధారంగా ఒక విశ్లేషణాత్మక ఓవర్‌ వ్యూని ఈ నివేదిక అందిస్తుంది.

త్వరిత మరియు బాల్యవివాహాలకు ముగింపు పలకడానికి, ఆచరణాత్మక వ్యూహాలను అమలుపరచేందుకు భారతదేశంలోని ప్రభుత్వేతర సంస్థలు, పౌర సమాజపు సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు చాలా ఏళ్ళుగా చెప్పుకోదగ్గ రీతిలో కృషి చేసాయి. ఈ కృషిని కార్యక్రమాలను, మరింత లోతుగా అర్థం చేసుకోడానికి గాను ‘నిరంతర్‌’ ఆయా సంస్థలతో ఒక సమగ్రమైన సర్వేని నిర్వహించింది. వీటిని పరిశోధకులు కూడా విమర్శనాత్మక దృష్టితో పరిశీలించి వాటిలోని బలాలు మరియు బలహీనతలను అంచనా వేశారు. తద్వారా అవసరమైన మార్పులు చేర్పులు చేసేందుకు ఉన్న అవకాశాలను, అవసరాన్ని గుర్తించారు.

ముఖ్యంగా, జెండర్‌ మరియు లైంగికత పట్ల ఉన్న సామాజిక సాంస్కృతిక విలువలు ఏ రకంగా త్వరిత మరియు బాల్య వివాహాల ఆచారాన్ని రూపొందిస్తున్నాయో, ప్రభావాన్ని చూపిస్తు న్నాయో అనేది ఒక స్త్రీవాద కోణం నుండి విశ్లేషించడం ఈ నివేదిక ఉద్దేశ్యం. అలాగే ఆయా కార్యక్రమాలు బాలికలు వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకునేలా వారిని స్వశక్తులను చేయగలిగాయా అనే విషయాన్ని కూడా ఈ నివేదిక అంచనా వేస్తుంది.

క్షేత్రస్థాయి నుండి ఆలోచనలను, ఆధారాలను సేకరించి నిధులను సమకూర్చే సంస్థలకు, స్వచ్ఛంద సంస్థలకు, సంకీర్ణ భాగస్వాములకు మరియు విధాన నిర్ణేతలకు అందించడం ఈ నివేదిక ముఖ్యలక్ష్యం. దీనిని ఉపయోగించుకుని బాలికలను స్వశక్తివంతులను చేసేందుకు త్వరిత మరియు బాల్య వివాహాలను నిర్మూలించేందుకు అవసరమైన చర్చలు చేపట్టేలా, విస్తృతంగా కేటాయింపులు జరిగేలా మరియు కార్యక్రమాలను రూపొందించాలనేది మా ఉద్దేశ్యం. ఈ రోడ్‌మ్యాప్‌ ద్వారా – మరియు భారతదేశంలోను, ప్రపంచ వ్యాప్తంగాను నిబద్ధత పెరగడం ద్వారా ఈ అంశంలో లోతైన మార్పును తీసుకురాగలుగుతామని మేము గట్టిగా నమ్ముతున్నాము.

నేపథ్యం:

యూరప్‌, అమెరికా మరియు మధ్యప్రాచ్య దేశాలతో సహా ప్రపంచ వ్యాప్తంగా చరిత్రలో వివిధ సమయాలలో త్వరిత మరియు బాల్య వివాహాలు ప్రబలంగా ఆచరణలో ఉండేవి. భారతదేశంలో దీని మూలాలు ప్రాచీన కాలంలో ప్రారంభమై నేటికీ కొనసాగు తున్నాయి.

త్వరిత మరియు బాల్య వివాహాలను అరికట్టేందుకు భారత ప్రభుత్వం, పౌర సమాజం గత 140 సంవత్సరాలకు పైగా ప్రయత్నం చేస్తున్నాయి. 2006 సంవత్సరంలో భారత ప్రభుత్వం తన ప్రయత్నాలను పునరుద్ధరించి బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని చేసింది. ఇందులో భాగంగా బాల్య వివాహ వేడుకను నిర్వహిస్తే విధించే జరిమానాలను పెంచడం, వివాహ వయస్సు వచ్చాక రెండేళ్ళ సమయంలో ఒక వివాహ విందు ఇవ్వడం ద్వారా బాల్యంలో జరిగిన వివాహాన్ని పునర్ధురించుకోవడం, అలాగే ఇలాంటి కేసులలో కోర్టులు జోక్యం చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది. అంతేకాక, 2012 సంవత్సరంలో ఢిల్లీలో జరిగిన రేప్‌ కేసుకు స్పందిస్తూ 2013 సంవత్సరంలో భారతప్రభుత్వం స్త్రీల విషయంలో లైంగిక సంబంధానికి సమ్మతి తెలిపే వయసు పరిమితిని వివాహ వయసుతో సమానంగా పెంచడం జరిగింది.

ఈ న్యాయ చట్రాలు కూడా ఈ అంశంపట్ల ప్రభుత్వానికి, ప్రజలకు ఉన్న ఆందోళనలను ప్రతిబింబిస్తాయి కాని అవి అరుదుగా అమలు పరచబడతాయి. అలాగే అవి త్వరిత మరియు బాల్య వివాహాలవంటి సంక్లిష్టమైన, సమాజంలో పాతుకుపోయిన పద్ధతులలో మార్పు తెచ్చేందుకు తగినట్లుగా లేవు.

ఇటీవలి కాలంలో భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ నిర్వహించిన జాతీయ స్థాయి సర్వే (2005-06) ప్రకారం, 58% బాలికలు 18 ఏళ్ళు రాకముందే పెళ్ళి చేసుకుంటున్నారు, 74% మందికి 20 సం||లు నిండక ముందే పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. భారతప్రభుత్వం ఈ సర్వేని ఆరోగ్య సంబంధిత డాటాలో కాలక్రమేపీ వస్తున్న మార్పులను గమనించే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ద్వారా దేశమంతటా నిర్వహించింది.

త్వరిత మరియు బాల్య వివాహాల ఆచరణ ఎంత విస్తృతంగా ఉందో ఈ డేటా తెలియచేస్తున్నా దీనిపట్ల ఆశావహంగా ఉండటానికి ఒక కారణం కనిపిస్తోంది. అదేంటంటే అత్యంత చిన్న వయసులో జరిగే పెళ్ళిళ్ళ సంఖ్య పెద్ద ఎత్తున పడిపోయింది. ఇటీవలి జాతీయ గణాంకాల ప్రకారం 20 ఏళ్ళలోపు పెళ్ళైన భారతీయ మహిళల్లో కేవలం 12% మంది మాత్రమే 15 సంవత్సరాలలోపు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. 1990ల ప్రారంభం నుండి 15, 18, 20 ఏళ్ళ వయసులో పెళ్ళి చేసుకుంటున్న మహిళల సంఖ్య క్రమేపీ తగ్గుతూ వస్తోంది.

ఈ పరిణామాలు మా పరిభాషనూ ప్రభావితం చేసాయి. సగటు వివాహ వయస్సులో పెరుగుదల ఈ అంశం ముఖ్యంగా కౌమార వయసులోని మరియు యుక్తవయసులోని వ్యక్తులపైనే ఎక్కువ ప్రభావం చూపుతోందని సూచిస్తోంది. వీరి అవసరాలు చిన్నపిల్లల అవసరాలకన్నా భిన్నంగా ఉంటాయి. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితులను సూచిస్తుంది కనుకే నిరంతర టీమ్‌ ఈ అంశాన్ని ”బాల్యవివాహం” అని వాడడంకన్నా ”త్వరిత మరియు బాల్య వివాహాలని” అనడానికే ప్రాధాన్యతనిస్తోంది.

భారతదేశంలో ప్రస్తుతం ఆచరణలో ఉన్న త్వరిత మరియు బాల్య వివాహాల ఆచరణ కఠినమైన సామాజిక విలువలలో పాతుకుపోయింది. ఇవి దీర్ఘకాలంగా కొనసాగుతున్న సామాజిక అసమానతలు మరియు అధికార నిర్మాణాలను అలాగే కొనసాగేందుకు దోహదపడ్తున్నాయి. చిన్న వయసులో జరిగే పెళ్ళిళ్ళు బాలబాలికలను తమ జీవితాలలో కీలక నిర్ణయాలు తీసుకోడంలోనూ, ప్రాథమిక స్వేచ్ఛను పొందడానికి వారొక శక్తిగా పనిచేయడం నుండి నిరోధిస్తుంది. అది వారు వారి విద్యావకాశాలను పొందడం నుండి, సుస్థిర జీవనోపాధులను పొందడం మరియు లైంగిక ఆరోగ్యం, హక్కులను అందుకోవడం వంటి వాటి నుండి కూడా నిరోధిస్తుంది. స్థూలంగా చెప్పాలంటే, ఈ త్వరిత మరియు బాల్య వివాహాలు సమాజంలో స్త్రీ, పురుషుల మధ్య మరియు వివిధ కుల, వర్గ, మత, జాతి సమూహాల మధ్య ఉన్న అసమానతలను మరింత బలోపేతం చేస్తున్నాయి.

త్వరిత మరియు బాల్య వివాహాలకున్న కారణాలను పూర్తిగా అర్థంచేసుకోడానికి, తగిన పరిష్కారాలను చూపించాలంటే జెండర్‌, విద్య, లైంగికత, జీవనోపాధులు, సంస్కృతి వంటి అంశాలపట్ల అత్యంత లోతైన అవగాహన అవసరం. ఇలాంటి వివాహాలకు సంబంధించిన కారకాలను దేనికది విడివిడిగా చూడడం వీలవ్వదు. ఇవి ఒక దానితో ఒకటి ఎలా పెనవేసుకుపోయాయో, ఒకదాన్ని మరొకటి ఎలా ప్రభావితం చేస్తున్నాయో పరిశీలించాల్సి ఉంది. అలాగే ఇవి కులం, మతం, పేదరికం, వలస, ప్రపంచీకరణ వంటి సామాజిక ఆర్థిక కారకాల వల్ల ఈ అంశం మరింత సంక్లిష్టం ఎలా అవుతోందనేది కూడా అధ్యయనం చేయాలి.

పరిశోధనా ప్రశ్నలు:

త్వరిత మరియు బాల్య వివాహాల ల్యాండ్‌ స్కేప్‌ని అర్థం చేసుకోడానికి అధ్యయనజట్టు ఈ క్రింది ప్రశ్నలను రూపొందించి అధ్యయనం చేయాలనుకుంది:

1. భారతదేశంలో త్వరిత మరియు బాల్య వివాహాల విస్తృతి మరియు ప్రాబల్యం ఎంత? (భౌగోళికంగా, సామాజిక ఆర్థిక స్థితి, జాతి గుర్తుంపు మరియు ఇతర అంశాల ద్వారా)

2. త్వరిత మరియు బాల్య వివాహాలు చేయడానికి నిర్ణయం తీసుకునేలా ప్రేరేపిస్తున్న కారకాలేంటి? ఈ ప్రక్రియలో కీలక పాత్రదారులెవరు?

3. ఈ వివాహాలకు గల మూల కారణాలు ఏంటి? క్షేత్రస్థాయిలోని కీలక పాత్రదారులు ఈ మూల కారణాలను ఎలా అర్థం చేసుకుంటున్నారు?

4. త్వరిత మరియు బాల్య వివాహాలపై సంస్థలు ఎందుకు పని చేస్తున్నాయి? వారు దీనినెందుకు వ్యతిరేకిస్తున్నారు? వారు ఎటువంటి మార్పును కోరుకుంటున్నారు? (వారు ఆశిస్తున్న మార్పు, చూస్తున్న దృష్టికోణం)

5. ఈ వివాహాల పట్ల సంస్థలు అవలంబించే విధానం ఏంటి? అనుసరిస్తున్న వ్యూహాలేంటి?

6. ప్రస్తుతం అమలులో ఉన్న కార్యక్రమాలలో లోపాలే మున్నాయి? ఎటువంటి వ్యూహాలు ఆశాజనకంగా ఉన్నాయి?

7. ఈ అంశంపై ప్రగతిని అర్థవంతంగా పర్యవేక్షించడం మరియు మూల్యాంకన చేయడం ఎలా?

అధ్యయన పద్ధతి:

మా పరిశోధనలో ఐదు భాగాలున్నాయి.

1. త్వరిత మరియు బాల్య వివాహాలకు సంబంధించి అందుబాటులో ఉన్న సాహిత్యాన్ని సమీక్షించడం. ఇందులో ముఖ్యమైన అధ్యయనాలు, విద్యా సంబంధమైన వ్యాసాలు, నివేదికలు మరియు విధాన పత్రాలు కూడా ఉన్నాయి.

2. ఈ అంశంపై విస్తృతంగా పని చేసిన నిపుణులను ఇంటర్వ్యూ చేయడం. వీరిలో విద్యావేత్తలు, పరిశోధకులు మరియు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నవారు ఉన్నారు. వీరు మా ఈ నివేదిక యొక్క సైద్ధాంతిక మరియు మేధోపరమైన పునాదులను బలోపేతం చేశారు. అలాగే అమలులో ఉన్న చట్టాలు, ప్రభుత్వ వ్యూహాలు, వాటిలోని ఖాళీలపై ఒక ఓవర్‌ వ్యూని ఇచ్చారు.

3. మా పరిశోధన బృందం ‘మార్పు సిద్ధాంతాన్ని’ అభివృద్ధి పరిచారు. ఇది స్త్రీవాద సిద్ధాంతాలు మరియు క్షేత్రస్థాయిలో పనిచేసిన అనుభవాల ఆధారంగా మేము అర్థం చేసుకున్నదాన్ని, సమస్య వ్యక్తీకరణను, మొత్తంగా కలపుకుని తెలియజేస్తుంది. క్షేత్రస్థాయిలో గమనించిన అంశాల ఆధారంగా రూపొందిన దీర్ఘకాలిక లక్ష్యాలు, విధానాలు మరియు వ్యూహాలు అన్నింటిని కలగలుపుకుని తయారు చేసినది ఈ నివేదిక.

4. ప్రాథమిక సమాచారాన్ని (డేటాని) త్వరిత మరియు బాల్య వివాహాలు అంశంపై భారతదేశంలో ఏడు రాష్ట్రాలలో (రాజస్థాన్‌, జార్ఖండ్‌, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ మరియు కొత్త ఢిల్లీ) పనిచేస్తున్న 19 సంస్థలను సందర్శించి సేకరించాము. మా ఈ క్షేత్ర సందర్శనలలో కౌమార వయసు బాల బాలికలతో, మహిళా బృందాలతో, తండ్రులతో ఇష్టాగోష్ఠి, ప్రత్యేక బృందాలతో చర్చలు మరియు సామూహిక ఇంటర్వ్యూలు చేశాము. అలాగే ఉపాధ్యాయులు, పోలీసు, ప్రభుత్వ అధికారులు, మతపెద్దలు మరియు స్థానిక పంచాయితీలకు ఎన్నికైన ప్రతినిధులతోనూ (గ్రామస్థాయి స్థానిక పరిపాలన ప్రతినిధులు) సంభాషించాము. ఇంకా, 19 సంస్థల సిబ్బందితోను నిరంతర్‌ బృందం విస్తృతమైన చర్చలు నిర్వహించింది.

5. దేశవ్యాప్తంగా 38 సంస్థల నాయకులతో కలిపి 40 మంది ప్రతినిధులలో ఒక రెండు రోజుల జాతీయ సదస్సును నిర్వహించాము. ఈ సదస్సు ఆయా సంస్థల ప్రతినిధులు ఈ అంశంపై పనిచేస్తున్నపుడు ఎదురౌతున్న సవాళ్ళు, అనుభవాలు, పర్యవేక్షణ మరియు మూల్యాంకనలో ఎదురౌతున్న ఇబ్బందులు, ముందుకు సాగడంలో అవసరమైన వాటి గురించి నిజాయితీగా మాట్లాడు కోడానికి ఒక అవకాశాన్ని కల్పించింది.

పరిశోధకుల గురించి:

నిరంతర ట్రస్ట్‌ 1993లో స్థాపించబడిన ఒక జెండర్‌ మరియు విద్యా కేంద్రం. ఇది భారతదేశంలోని అట్టడుగు వర్గాల నుండి స్త్రీలు మరియు బాలికలు వారి సాధికారత కోసం విద్యా అవకాశాలు కీలకమైనవిగా భావించి వాటిని అందుకునేలా చేయడం ముఖ్య ఉద్దేశ్యంగా ఏర్పడింది. సమాజంలోని నాయకులు,
ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల సిబ్బంది, ప్రభుత్వ కార్యక్రమాల సిబ్బంది వంటి వివిధ వర్గాల వారికి సామర్థ్యాలను పెంచడానికి నిరంతర్‌ పనిచేస్తుంది. అలాగే విద్యాపరమైన మెటీరియల్‌ను రూపొందించడానికి, విద్య ద్వారా సాధికారత దిశగా పరిశోధనలు మరియు అడ్వకసీ చేపట్టడం కూడా చేస్తుంది. గత ఏడు సంవత్సరాలుగా నిరంతర్‌ వివిధ స్థానిక సంస్థలకు వారు స్త్రీలతోను, కౌమారదశలోని బాలబాలికలతోను పనిచేసే క్రమంలో వారి పనిని బలోపేతం చేసుకునేందుకు సహకారాన్నందించింది. అలాగే యుక్తవయసు మరియు లైంగికత అంశాలపై దృష్టి పెట్టి పనిచేసింది.

మార్పుకోసం అవసరమైన సిఫార్సులను చేయడం ముఖ్య ఉద్దేశ్యంగా భాగస్వామ్య విధానంలో, బహుళ పద్ధతులనుపయోగించి పరిశోధనలు చేపట్టిన విస్తృత అనుభవం నిరంతర్‌కి ఉంది. క్షేత్రస్థాయిలో పనిచేయడం ద్వారా బలమైన కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, క్షేత్రస్థాయి వాస్తవాల పట్ల స్పష్టమైన అవగాహన ఏర్పడతాయి. త్వరిత మరియు బాల్య వివాహాలను అధ్యయనం చేసేందుకు ఈ రెండూ అవసరం. ప్రస్తుత పరిశోధనలో ఉన్న ఒక కీలకమైన పరిమితి ఏంటంటే, లైంగికతపై పూర్తిస్థాయి ప్రాధాన్యత లేకపోవడం. లైంగికత యొక్క ప్రాధాన్యతను గుర్తించిన కొద్ది సంస్థలు కూడా ఈ అంశంపై ముక్కుసూటిగా, నిజాయితీగా చర్చలు చేపట్టడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. అదీ ముఖ్యంగా పెళ్ళిళ్ళ గురించి మాట్లాడటానికి సిగ్గుపడే బాలికలతో చర్చించడంలో మరింత ఇబ్బంది ఎదురౌతుంది. లైంగికత చుట్టూ ఉన్న మౌనాన్ని ఛేదించడంలోనూ, జెండర్‌ చుట్టూ ఉన్న రాజకీయం మరియు లైంగికతల మధ్య ఉన్న సంబంధాలను గుర్తించాల్సిన అవసరంపై నొక్కివక్కాణించిన అనుభవాల వల్ల ఈ అంశాలపై మేము ప్రత్యేక సామర్థ్యాలను సాధించాము. స్త్రీలు, బాలికల జీవితానుభవాలకు సంబంధించిన విద్యపై పనిచేసిన అనుభవం, సంపూర్ణ అవగాహన కలిగిన సంస్థగా, భారతదేశంలో త్వరిత మరియు బాల్య వివాహాల ల్యాండ్‌ స్కేప్‌పై అధ్యయనం చేయడానికి మేము సరిగ్గా సరిపోతాము.

గుర్తించిన అంశాలు:

ఇప్పుడు ల్యాండ్‌స్కేప్‌ విశ్లేషణ ద్వారా గుర్తించిన ముఖ్యాంశాలను మీతో పెంచుకుంటాం. మొదటిది త్వరిత మరియు బాల్య వివాహాల చారిత్రక వారసత్వం. రెండోది, మూల కారకాలు మరియు ప్రభావాలకు సంబంధించి మేము గమనించినవి. మూడు, అధ్యయన భాగస్వామ్య స్వచ్ఛంద సంస్థలు చేపట్టిన క్షేత్ర స్థాయి కార్యక్రమాల విశ్లేషణకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు. గుర్తించిన అంశాలలోని అనేకం భారతదేశంలో త్వరిత మరియు బాల్య వివాహాలపై అప్పటికే ఉన్న విషయ జ్ఞానాన్ని బలపరుస్తుండగా మరికొన్ని సరికొత్త విషయాలు. ఇవి ఈ అంశంపై పని చేస్తున్నవారి ఆలోచనలకు పదునుపెట్టేందుకు ఉపయోగపడ్తాయని ఆశిస్తున్నాము.

చారిత్రక వారసత్వం:

భారతదేశం వలస రాజ్యంగా ఉన్నప్పుడే త్వరిత మరియు బాల్య వివాహాల అంశం మొదటిసారిగా పరిశీలనకు వచ్చింది. యూరోపియన్‌ ప్రభుత్వాలు దీనిని ఉపయోగించుకుని భారతదేశంలో ఇటువంటి ”అనాగరిక పద్ధతుల”ను ఉద్ధరించే నాగరికులుగా తమ పాత్రను సమర్థించుకున్నారు. బ్రిటీష్‌ ప్రభుత్వం ఇలా ఒక ”నాగరీకులుగా చేసే పని” పెట్టుకున్నప్పటికీ వివాహ వ్యవస్థలో కనీసం జోక్యం చేసుకోడానికి ఏ మాత్రం ఇష్టపడలేదు. భారతదేశంలో పెరుగుతున్న జాతీయ ఉద్యమకాలంలో ఇటువంటి జోక్యం మరింత వ్యతిరేకతను పెంచుతుందని బ్రిటిష్‌ అధికారులు భావించారు. సంఘ సంస్కర్తలు బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని సంప్రదించగా వారు వారి ప్రయత్నాలను సంచలనాత్మక అంశాలైన బాల్యంలోనే కాపురానికి పంపడం మరియు బాల్యంలోనే గర్భధారణ వంటి బాల్య వివాహాలవల్ల వెంటనే జరిగే చెడు పైనే దృష్టిపెట్టారు. కాని దీర్ఘకాంలో సమాజంపై పడే ప్రభావాన్ని గురించి పట్టించుకోలేదు. బాల్య వివాహాల చుట్టూ ఉన్న అనేక అంశాలను వదిలేసి కాపురానికి పంపేందుకు కనీస వయసును నిర్ణయించే దిశగా 1891లోఒక ప్రయత్నం చేసారు.

వయసుపైనే దృష్టిపెట్టిన ఈ వలస రాజ్య వారసత్వం త్వరిత మరియు బాల్య వివాహాలపై ఈనాడు జరిగే చర్చలనీ ప్రభావితం చేస్తోంది. వందేళ్ళ క్రిందట జరిగిన చర్చలకీ, ఈనాడు జరుగుతున్న చర్చలకీ మధ్య స్పష్టమైన సారూప్యత కేవలం యాదృచ్ఛికం కాదు. ఈ అంశంపై మనం ఎలా పని చేస్తాం అనేదానిలో మూడు ముఖ్యమైన వారసత్వాలను అంది పుచ్చుకున్నాము. అవి ఆరోగ్యం, వయసు, చట్టంపై పరిమిత దృష్టి కలిగి ఉండడం. ఈ వారసత్వాలు త్వరిత మరియు బాల్య వివాహాలపై పనిచేయాల్సిన అవసరాన్ని పూర్తిగా ఒక చట్టపరమైన లేదా రాజ్యాధికార విషయంగా చూడడం కాకుండా దీనిలో స్త్రీల సాధికారత పాత్ర, వయసుతో నిమిత్తం లేకుండా ఒప్పుదల, ఛాయిస్‌కి సంబంధించిన అంశాలు, మరియు ఇది ఒక సామాజిక, రాజకీయ అంశంగా చూడాల్సిన అవసరాల నుండి దృష్టి మళ్ళించాయి. భారతదేశంలో స్వాతంత్య్రానంతరపు రాజకీయ

ఉద్యమాలు, ప్రత్యేకించి స్త్రీల ఉద్యమం త్వరిత మరియు బాల్య వివాహాల అంశంపై దృష్టి సారించకపోవడానికి ఇదీ ఒక కారణమే.

అభివృద్ధి రంగంలో వివిధ స్థాయిల్లో దీనిపై చర్చలు ఆశించినంతగా జరగట్లేదు. అంతర్జాతీయంగాను, భారతదేశంలో కూడా త్వరిత మరియు బాల్య వివాహాలను ”ప్రాంతీయ పద్ధతి”గానే చూపించే ధోరణి కనిపిస్తుంది. ఇది దక్షిణ భూగోళ ప్రపంచాన్ని పీడిస్తున్న సమస్యగా, విద్యాలేమి, భిన్న సంస్కృతి ఉన్న వారి సమస్యగా, లేకపోతే ”ఇతరుల” సమస్యగా మాత్రమే చూసే ధోరణి కనిపిస్తుంది. ఇలా చూడడం వల్ల ఈ అంశంలో అంతర్లీనంగా

ఉన్న కారణాలు, సంక్లిష్ట పరిస్థితులను (కౌమారదశలో గర్భధారణ వంటివి) అన్నింటిని ఒకే రాటకు కట్టేసినట్లవుతుంది. కాని ఇవి ప్రపంచమంతటా కనిపిస్తున్న అంశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఎలా ఉందో ఉత్తర భూగోళ ప్రపంచంలోనూ అలాగే

ఉంది. ఇలాంటి చరిత్ర నుండి నేర్చుకోవాల్సిన కీలక విషయం ఏంటంటే, త్వరిత మరియు బాల్య వివాహాలను గతంలో చూసినట్లు కాక ప్రస్తుతం జరగాల్సిన చర్చలను విస్తృత పరిధిలో చూడాల్సివుంది. మా వాదన ఏంటంటే, ఈ అంశం దాని మూలకారణాలతో ముడి పడుంది. కనుక దీనిని విభిన్నంగా చూడాలి. అలాగే ఈ విషయంలో కీలకమైన సామాజిక మార్పును తీసుకొచ్చేలా యువతను స్వశక్తివంతులను చేసే దిశగా దృష్టి పెడుతూ ఆయా మూల కారణాలపై విమర్శనాత్మకంగా పనిచేయాల్సి వుంది. దీనిపై మేము తర్వాతి భాగాలలో సాక్ష్యాధారాలతో విశదీకరించాము.

మూలకారణాలు:

త్వరిత మరియు బాల్య వివాహాలనేవి ఛిద్రమైన మరియు అసమాన సమాజపు లక్షణం. ప్రజలు తమ పిల్లలకు చిన్న వయసులోనే పెళ్ళిళ్లు చేయడానికి ఎందుకు నిర్ణయించుకున్నారని అడగగా ‘వరకట్నం’, ‘పేదరికం’, ‘లైంగిక హింస జరగవచ్చనే భయం’ వంటి కారణాలను పేర్కొన్నారు. అయితే పెళ్ళికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో ఇవి కారకాలు కావచ్చు కాని ఇవే మూలకారణాలు కాదు. సామాజిక అసమానతలు, ప్రత్యక్ష నిర్ణయాలు తీసుకోలేకపోవడం మాత్రమే అసలైన మూల కారణాలు. వరకట్నం వంటి ఇతర వివరణలన్నీ చివరకి ఇతర లోతైన సమస్యల లక్షణాలు మాత్రమే అవుతాయి. ఈ అంతర్లీనమైన నిర్మాణాలన్నీ పితృస్వామ్యం, కుల, వర్గ, మత, లైంగికత వంటి వాటి పరస్పర చర్యలే. ఇవి నిర్ణయాలను ఫ్రభావితం చేసే సంక్లిష్ట వాస్తవాలకు దారితీస్తున్నాయి.

ఈ నివేదికలో మేము త్వరిత మరియు బాల్య వివాహాలకు గల ఏడు మూల కారణాలను గుర్తించాము: పెళ్ళికి సంబంధించిన ఆర్థిక అంశాలు; లైంగికత; జెండర్‌ విలువలు మరియు పురుషత్వం; విద్యాపరమైన మరియు సంస్థాగతమైన లోపాలు; వివాహం కేంద్ర బిందువుగా ఉండడం; పొంచి ఉన్న ప్రమాదం, వల్నరబిలిటీ మరియు అనిశ్చితి; వయసు ఒక అధికారపు ఇరుసు. వీటిలో కొన్ని ఈ అంశంపై ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో భాగమైనప్పటికీ మిగిలినవి ఈ అధ్యయనం ద్వారా చేర్చబడినవి.

పెళ్ళికి సంబంధించిన ఆర్థిక అంశాలు:

మన జీవితాలలోని అనేక కోణాల మాదిరిగానే వివాహం కూడా అనేక విధాలైన ఒక ఆర్థిక లావాదేవి. ఇటువంటి లావాదేవీలన్నీ కొన్ని నిబంధనలు మరియు అంచనాల ద్వారా నిర్వహించబడతాయి. వివాహ లావాదేవీలకు సంబంధించిన నియమాలన్నీ అసమానతల ఆధారంగా నిర్ధేశించబడతాయి, వాటినే తిరిగి కల్పిస్తాయి. ఉదాహరణకి, పితృస్వామిక భారతీయ సమాజంలో స్త్రీ ఒక ఆర్థిక భారంగా చూడబడుతుంది. వివాహం ద్వారా ఈ భారం అత్తారింటికి బదిలీ అవుతుంది. కాబట్టి ఈ భారాన్ని భరించడానికిగాను మద్దతుగా అమ్మాయి కుటుంబం నుండి వరకట్నం ఆశించడం జరుగుతుంది. పేదరికంలో కొట్టు మిట్టాడుతున్న కుటుంబాలకు ఈ ఒక్కసారే పెట్టాల్సిన ఖర్చు చాలా ఎక్కువనిపిస్తుంది. ఈ ఖర్చును తగ్గించుకోవాలన్న కోరిక ఆధారంగానే అమ్మాయి పెళ్ళికి సంబంధించిన నిర్ణయాలు జరుగుతాయి. పెళ్ళికి పెట్టే ఖర్చులను కూడా ఇలానే చూస్తారు. అందుకే ఖర్చుల భారాన్ని తగ్గించుకోవాలనే ఆశతో అక్కా చెల్లిళ్ళకు ఒకే వేడుక ద్వారా పెళ్లి చేయాలని చూస్తారు.

వివాహ ఆర్థిక అంశాల వెనక ఉన్న ప్రాథమిక అంచనాలకు గల కారణం ఆర్థిక అసమానతలు మరియు పితృస్వామ్య వ్యవస్థ. ఇందులో కుటుంబంలోని శ్రమ విభజనలలోని అసమానతలు మరియు స్త్రీల వివాహ విషయమై నిర్ణయాలు తీసుకోడంలో ఆమె శ్రమశక్తి పాత్ర కూడా భాగమై ఉంటాయి. ఆర్థిక లావాదేవీలలో, అమ్మాయి మరియు ఆమె కుటుంబం యొక్క బేరమాడగల శక్తిని తక్కువ చేసేందుకు పెళ్ళి కూతురు శ్రమకు తక్కువ విలువ కట్టడాన్ని పితృస్వామ్య వ్యవస్థ నిర్థారిస్తుంది. కుటుంబ ఆర్థిక వ్యవస్థకు నవవధువు యొక్క ఉత్పాదక శక్తి కీలకమన్న వాస్తవం తెలిసినప్పటికీ ఇలాగే చేస్తారు. ఆమెను వేతనం లేని సంరక్షణ పనికి నియోగిస్తారు. మిగిలిన కుటుంబ సభ్యులంతా వారి భూముల్లో పనిచేసుకుంటారు లేదా వేతన పనికి వెళ్తారు.

లైంగికత:

పితృస్వామ్య విలువలతో కూడి, కుల మరియు వర్గాలుగా విభజించబడ్డ సమాజంలో స్త్రీల లైంగికతను నిరోధించటం కీలకంగా ఉంటుంది. వారసత్వ ఆస్తుల పంపకాన్ని తగ్గించడానికి మరియు ”కుల పవిత్రత”ను నిలిపి ఉంచడానికిగాను స్త్రీల లైంగికతను, పునరుత్పత్తి సామర్థ్యాన్ని నిలువరించడం ద్వారా ఈ పరిధులు కల్పించబడ్డాయి. ఇది యుక్తవయసు స్త్రీల కన్యాత్వం మరియు పవిత్రతకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తుంది. తద్వారా, బలవంతపు లైంగిక చర్యకు లోనయినా ఆమె చెడిపోయిందని ముద్రవేసి, పెళ్ళికి పనికిరానిదిగా చూడడం జరుగుతోంది.

మొత్తంమీద సమాజంలో లైంగికత పట్ల ఒక ప్రతికూల దృక్పథం ఉంది. కౌమార వయసులోని లైంగికత, కోరికలను ఒప్పుకోక పోవడంతో పాటు అది తలవంపులుగాను, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసిందిగాను చూడబడుతుంది. ఈ వైఖరుల అర్థం కౌమార దశలోని బాలబాలికలు పెళ్ళికి ముందు సెక్స్‌ గురించి ఆలోచన చేయకూడదు, కనుక అనేక సందర్భాలలో వారి కోరికలను సంతృప్తి పరచుకోడానికి మార్గంగా చిన్న వయసులోనే పెళ్ళి చేసుకోడానికి సిద్ధమవుతున్నారు. కొంతమంది కౌమార వయసులోని బాలబాలికలు పెద్దలు కుదిర్చిన పెళ్ళికాకుండా ఒకర్నొకరు ఇష్టపడి ఇళ్ళ నుండి పారిపోతున్నారు. అనేక సందర్భాలలో వీరు వారి వారి కుటుంబాలతో తెగతెంపులు చేసుకోడానికి కూడా వెనుకాడట్లేదు. కాని చాలా మంది ఎటువంటి తీవ్ర పరిణామాలు లేకుండా వారి కోరికలను సంతృప్తి పరచుకునేందుకు వారి తల్లిదండ్రులు నిర్ణయించిన వివాహాన్ని చేసుకుంటున్నారు. ఈ నియమాలు ఒక కఠినమైన వాతావరణాన్ని కల్పిస్తాయి కనుక, నియంత్రణను కోరుకుంటున్న తల్లిదండ్రులకు, వారి లైంగిక ప్రాధాన్యతను కోరుకుంటున్న బాలబాలికలకు కూడా పెళ్ళి తప్ప మరో మార్గం లేదు.

జెండర్‌ నియమాలు మరియు పురుషత్వం:

సమాజంలో స్త్రీలు ఒక కుమార్తెగా, ఒక కోడలిగా, ఒక భార్యగా, ఒక తల్లిగా వారి ముఖ్యమైన పాత్రను నిర్వహించడంలో ఎవరో ఒకరితో సంబంధంలోనే ఉండాలని నమ్మేలాగే పెంచబడ తారు. ఈ నియమాలు స్త్రీలను పెళ్ళిని మించిన ఆకాంక్షలుండకుండా నియంత్రిస్తున్నాయి. అలాగే ఒక పురుషునికి, జెండర్‌ నియమాలన్నీ పురుషత్వం చుట్టూనే నిర్మించబడ్డాయి. ఒక పురుషుని యొక్క నేను అనే భావన తను స్త్రీని, ముఖ్యంగా కూతుళ్ళలను నియంత్రించే సామర్థ్యంపై, ఆధారపడి ఉంటుంది. కుమార్తె యొక్క వివాహమ య్యేంతవరకు ఆమె రక్షణ, పవిత్రత తండ్రి యొక్క పురుషత్వం మరియు గౌరవానికి గుర్తుగా చూడబడతాయి. కుమార్తెపై నియంత్ర ణని కోల్పోవడమంటే పురుషుడు అవమానాన్ని, సంఘం నుండి బహిష్కారాన్ని ఎదుర్కోవలసి వస్తుంది కనుక వారు కూతుళ్ళకు త్వరగా పెళ్ళి చేసేసేందుకు తొందరపడేలాచేస్తుంది.

మగపిల్లల తండ్రులూ ఇటువంటి సందిగ్ధాలని ఎదుర్కొం టున్నారు. పురుషత్వ నియమాలను పట్టించుకోని, స్వేచ్ఛగా తిరిగే మగపిల్లలకు త్వరగా పెళ్ళిళ్లు చేసేస్తారు. ఇది అతనిపై భార్యా, పిల్లల అదనపు బాధ్యతలను మోపడం ద్వారా కొడుకుపై తండ్రి నియంత్రణని బలోపేతపరచే మార్గంగా చూడబడుతుంది. ఇలా కొడుకు తండ్రిపై ఆధారపడేలా చేయడం ద్వారా కొడుకు, కోడలు కుటుంబంలో ఆదేశాలను పాటించేలా చేస్తుంది. ఇలా తను, తన భార్య ఇద్దరూ క్రమశిక్షణతో మెలగాల్సిన భాధ్యత అంతా ఆ యువకుడి పై మోపబడుతుంది. ఒక వేళ విఫలమైన పక్షంలో తనకుతానే సమర్థించుకునేందుకు సిద్ధపడాల్సి వస్తుంది. ఈ పితృస్వామ్య జెండర్‌ నిబంధనలు పెళ్ళికి సంబంధించిన నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి.

విద్యాపరమైన మరియు సంస్థాపరమైన లోపాలు :

తమ కుమార్తెలను బడికి పంపాలనుకునే తల్లిదండ్రులకు, చదువుకోవాలనుకునే బాలికలకు విద్యను అందుకోవడం అన్నిసార్లూ తేలిక కాదు. కట్టుబాట్లు, నిబంధనలకు తోడు చదువుకోడానికి బాలికలు చాలా సార్లు ఎంతో దూరం ప్రయాణం చేయాల్సివస్తోంది. కొన్నిసార్లు బడులు అందుబాటులో లేకపోవడం వల్ల బాలికలు చదువు ఆపేయాల్సివస్తోంది. విద్యా సంస్థలు అందుబాటులో లేకపోవడం అనేది బాలికల చదువు కన్నా ఇంటి పనికే ప్రాధాన్యత నిస్తున్నారన్న వాస్తవాన్ని డొంకతిరుగుడుగా చెప్పడం జరుగుతోంది. ఇది బాల్య వివాహాలను వ్యతిరేకించడంలో, ప్రత్యామ్నాయ వ్యాపకాలను, ఆకాంక్షలను ఏర్పరచుకోవడంలో బాలికల బేరమాడే శక్తిని తగ్గించేేస్తుంది.

తమ చదువులను కొనసాగించాలనుకునే వారికి తమ తల్లిదండ్రులతో ఈ స్వేచ్ఛ కోసం చర్చలు జరపడం తప్పని సరవుతుంది. అమ్మాయి పై చదువులు చదువుకోడానికి ”అనుమతి” పొందాలంటే ”మంచి అమ్మాయి” నియమాలను పాటించాలి, ”మంచి పనులు” చేస్తుందని నమ్మకం కలిగించాలి, ”మంచి మార్గం”లోనే ఉంటుందని నమ్మించాలి. దీని అర్థం అమ్మాయిలు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలని మరియు వారి జీవితాలలోని ఇతర అంశాలపై నియంత్రణను వదులుకున్నారని. అంతేకాక ప్రధాన స్రవంతి విద్యా విధానంలోని విద్యాంశాలలో మరియు బోధనాంశాల్లో బాలికల సాధికారతపై దృష్టిలేదు. అలాగే అమ్మాయిలు వారి పెళ్లికి సంబంధించి సంప్రదింపులు జరిపేలా సహాయం చేసేలాంటి ఆలోచనలను ఇచ్చేదిగా కూడా లేదు.

వివాహమే కేంద్ర బిందువుగా ఉండడం:

అన్ని సామాజిక హద్దులలోకి, యుక్తవయసు వ్యక్తుల జీవితాలలో పెళ్ళి అనే హద్దు అత్యంత ప్రధానమైనదిగా భావించడం జరుగుతుంది. అయితే స్త్రీలు, పురుషులు కూడా చిన్న వయసు నుండే వారి వారి స్వంత ధోరణాల్లో వివాహం పట్ల కలలుకనేలా ప్రోత్సహించబడతారు. వివాహం యొక్క ఈ కేంద బిందువుకు పెళ్ళి చుట్టూ ఉన్న ఇతర ప్రత్యేక నిబంధనలు కూడా తోడయ్యాయి. ఈ నిబంధనలే ఏది ”ఆదర్శ” వివాహం ఏది కాదు అనేది నిర్ణయిస్తాయి. సామాజిక నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకోవాల్సిందే కనుక, ఈ పెళ్ళిళ్ళు కఠిన నియమాల ప్రకారం నడవాలి కనుక తమ బిడ్డది ”ఆదర్శ” వివాహం అవదేమో అని, ”ఆదర్శ” జోడి కుదురదేమో అని కుటుంబాలు భయపడతుంటాయి. ఇటువంటి సందర్భాలలో పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి చిన్న వయసులో పెళ్ళి చేసేయడమే మార్గంగా తల్లిదండ్రులు భావిస్తున్నారు. నిజానికి, పెళ్లి ఎంత కేంద్రబిందువుగా ఉందంటే చాలాసార్లు యువత కూడా దీనికోసం ఆత్రుతతతో ఎదురుచూస్తుంటారు. కొంతమందైతే ”ప్రేమ వివాహం” గురించి కలలుకంటుంటారు. కాని చాలామందికి పెళ్ళంటే శారీరక అవసరాలను తీర్చేది లేదా పెద్దవారికి దొరికే స్వేచ్ఛాచలనం మరియు స్వాతంత్య్రం దొరకడం. దీనితోపాటు, చాలాసార్లు పెళ్ళితో, ఆ ఆచారాలతో ముడిపడున్న శృంగారం పట్ల తీవ్రకోరిక కూడా కనిపిస్తుంది. చాలాసార్లు, యువత యొక్క కలలు, కోరికలు పెళ్ళి ద్వారా అందుకోగల వాటి వరకే పరిమితమై ఉంటాయి.

ప్రమాదం, బలహీనత (వల్నరబిలిటీ) మరియు అనిశ్చితి:

ప్రస్తుతం పెరుగుతున్న అనిశ్చితిలో బ్రతుకుతున్న అనేక కుటుంబాలకు భవిష్యత్‌పట్ల ”రేపు ఏం జరుగుతుందో” అనే భావనతో కూడిన తీవ్ర ఆందోళన ఉంది. పేదరికం, వ్యవసాయ సంక్షోభం, వలస వంటి వ్యవస్థాగత అంశాలు కుటుంబాల యొక్క వల్నరబిలిటీని మరింత ఉధృతం చేసి తీవ్రమైన, జీవితాలను మార్చేసే పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నాయి. ఇటువంటి సందర్భాలలో, పెళ్ళి అనేది అస్థిర వాతావరణంతో ఉన్న జీవితంలో ఒక నిలకడను, రక్షణను తెచ్చేదిగా చూడబడుతుంది. ఈ కారణంగా కూడా వలసకు పోయే కుటుంబాలు, మతకల్లోలాల భయం ఉన్న లేదా వరదలవంటి ప్రకృతి వైపరీత్యాలకు గురయ్యే ప్రాంతాలలో నివసించే కుటుంబాలు తమ పిల్లలకు చిన్నతనంలోనే పెళ్ళి చేసే అవకాశాలు ఎక్కువ. సామాజిక సంబంధాలను బలపరచుకోడం ద్వారా అనిశ్చితిని దూరం చేసేదిగాను, ప్రమాద తీవ్రతను తగ్గించే మార్గంగాను పెళ్ళి చూడబడుతుంది.

వయసు ఒక అధికారపు ఇరుసు:

యువజనం, ముఖ్యంగా పిల్లలు, వారివారి జీవితాలను మలచుకోగల సామర్థ్యం లేని అమాయకులుగా, ఏమీ తెలియని వారుగా చూడబడతారు. అందుకే సమాజం వారికి ప్రమాదాలు, హాని నుండి రక్షించే విధానాలను ఏర్పాటు చేస్తుంది. చాలా సందర్భాలలో, వారి ఇష్టప్రకారం చిన్న వయసులో పెళ్ళి చేసుకోవాలనుకునే యువ జంటలను విడదీయడానికి ఈ వివరణనే ఉపయోగిస్తారు. అయితే, ఇదే కనుక పెద్దల అంగీకారంతో, సామాజిక కట్టుబాట్లు, నిబంధనల పరిధికి లోబడి జరిగినట్లైతే అది సమస్యాత్మకం కాదు. ఈ తేడా ద్వారా యువతలో మంత్రాంగం లేకపోవడానికి కారణం వారు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల కాదని, అది వయసుతో వస్తుందని తెలుస్తోంది: వయసులో వారు సాధారణంగా నిర్ణయాలు తీసుకునే శక్తిని కలిగి ఉంటారు. వయసు, వయసుల్లో తేడా ఒకరితో ఒకరు ఎటువంటి సంబంధం కలిగి ఉంటారనే దానిపై ప్రభావాన్ని చూపుతుంది కనుక, వివాహానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ నుండి దూరంగా

ఉంచబడుతున్నారు కనుక, వయసనేది ఒక కీలక ఇరుసుగా చూడవచ్చు.

ప్రభావాలు:

త్వరిత మరియు బాల్య వివాహాలు యువతపెన వారి కుటుంబాలపైన అనేక ప్రతికూల ఫలితాలను చూపిస్తాయి. వీటిలో, అభివృద్ధి రంగం ప్రస్తుతం రెండు ప్రాథమిక ప్రభావాలపై దృష్టి పెట్టింది: ఒకటి విద్య – బడి నుండి మధ్యలో మానేయడానికి బాలికలపై ఒత్తిడి ఉండడం; రెండోది యుక్త వయసు మహిళల ఆరోగ్యం – ప్రత్యేకించి చిన్న వయసులో గర్భధారణకు సంబంధించి. ఈ రెండు సమస్యలకు పరిష్కారాలు చూడడం తప్పనిసరి, కాని ముఖ్యమైన ఇతర ప్రభావాలు కూడా ఉన్నాయి. మూల కారణాలను పరిశీలించడం ద్వారా త్వరిత మరియు బాల్య వివాహాల ప్రభావం చదువు మరియు ఆరోగ్యంపై చూపిస్తున్న ప్రభావం పట్ల మనము విస్తృత అవగాహన పొందాము కాని జెండర్‌ మరియు లైంగికత, జీవనోపాధులపై కూడా అవగాహన వచ్చింది. త్వరిత మరియు బాల్య వివాహాల సమస్యపై మాట్లాడడంలో ప్రభావాల పరిధిని విస్తృత పరచడం ఎందుకు ముఖ్యమో, ఇవి తిరిగి దీర్ఘకాలిక లక్ష్యాలు, వ్యూహాల పరిధిని ఎలా ప్రభావితం చేస్తాయో ఈ నివేదికలో వివరించాము. ఇలా చేయడం ద్వారా, యుక్త వయసు బాలబాలికల జీవితాల్లో అదృశ్యంగా ఉన్న అంశాలు తెరపైకి వస్తాయి –

ఉదాహరణకు, బాల్యంలో గర్భం దాల్చడాన్ని దాటుకుని చూడడం వల్ల బాలవధువులు సామాజిక మద్దతు కొరేలా, వివాహమయ్యాక జీవనోపాధి అవకాశాలను పొందేలా సహాయపడతాయి. ప్రస్తుతం, ఈ లోపాలను గమనించినప్పటికీ క్షేత్రస్థాయి సంస్థలు వీటిపై పనిచేయలేకపోతున్నాయి. కారణం విస్తృత స్థాయిలో జరుగుతున్న చర్చలు ఈ అంశంపై వారి పని పరిధిని పరిమితం చేస్తున్నాయి.

కార్యక్రమాలు:

మేము 19 సంస్థలను సందర్శించి 50 మందికి పైగా వ్యక్తులను ఇంటర్వ్యూ చేశాము. త్వరిత మరియు బాల్య వివాహాల అంశంపై ముందు పేర్కొన్న జాతీయ సదస్సులోనూ చర్చించాము. ఇక్కడ క్షేత్రస్థాయిలో ఈ అంశంపై పనిచేస్తున్న ఆ యా సంస్థల పరిచయాన్ని ఇస్తున్నాము. నిజానికి, ఈ సంస్థల మధ్య అపారమైన విభిన్నత ఉంది; ఏ రెండు సంస్థలూ ఒకలా లేవు. ‘మార్పు సిద్ధాంతం’ (ుష్ట్రవశీతీవ శీట జష్ట్రaఅస్త్రవ) యొక్క నిర్మాణం ఈ సంస్థలకు సంబంధించి మా విశ్లేషణకు ఒక ఫ్రేంవర్క్‌ను అందిస్తుంది. ఈ వివిధ క్షేత్రస్థాయి సంస్థలలోని రెండు భిన్నత్వాలపై ఉన్న రెండు విభిన్న సిద్ధాంతాలను అందిస్తున్నాము. ఒకటి వివాహ వయసుపై దృష్టి పెట్టగా, రెండోది సాధికారితపై దృష్టి పెట్టింది. ఏ సంస్థా పూర్తిగా ఏదో ఒక వర్గానికి చెందినది కాదు. ఒక్కో సంస్థ త్వరిత మరియు బాల్య వివాహాల పట్ల, వీటిలో ఏదో ఒకటి కలిగి ఉన్నదని చెప్పొచ్చు. ఇది ఆ యా సంస్థల క్షేత్రస్థాయి పనులకు సంబంధించిన పంథాలకు తావు కల్పించే నమూనాలను తయారు చేస్తుంది. ఈ నమూనాలు సంస్థలతో ‘మార్పు సిద్ధాంతం’పై చేసిన కసరత్తు ఆధారంగా తయారు చేయబడ్డాయి: త్వరిత మరియు బాల్య వివాహాలు ఎందుకు ఒక సమస్య అయిందో, దీనిని పరిష్కరించడానికి వారి దీర్ఘకాల లక్ష్యా లేంటో, ఈ అంశం పట్ల వారి విధానం ఎలా ఉండాలనుకుంటున్నారో, వారి వ్యూహాలు, వారు పనిచేస్తున్న అంశాలేవో సంస్థలను చెప్పమని కోరాము.

ఈ కసరత్తువల్ల త్వరిత మరియు బాల్య వివాహాలపై పనిచేస్తున్న సంస్థలన్నీ ఆ అంశాన్ని యథాతథంగా మాట్లాడటం లేదనేది అర్థమయింది. వారి వ్యక్తీకరణ ఆ యా సంస్థల దీర్ఘకాలిక పరిష్కారాల దృష్టిపై ఆధారపడి ఉంది. ఇది తిరిగి సమస్య పరిష్కారానికి వారి విధానాలను, వారు అవలంబించే వ్యూహాలను, వారు పనిచేసే అంశాలను ప్రభావితం చేస్తుంది. ఏ ఒక్క సంస్థ కూడా ఏదో ఒక నమూనాలోకి ఇమడటంలేదు కాని ఈ నమూనాలు కార్యక్రమాల ల్యాండ్‌ స్కేప్‌ను మెరుగ్గా అర్థం చేసుకోడానికి

ఉపయోగపడతాయి.

నమూనా 1 : వివాహ వయస్సుపై దృష్టి

సమస్య – చట్టపరంగా వివాహ వయసుకు ముందే పెళ్ళి (బాలికలకు 18 ఏళ్ళు, బాలురికి 21)

లక్ష్యాలు – బాల్య వివాహాలను ఆపటం, మరియు / లేదా బాల్య వివాహ రహిత ప్రాంతాలను ఏర్పాటు చేయటం.

విధానాలు – పెళ్ళిని నివారించేందుకు ప్రత్యామ్నాయ ప్రదేశాలను సానుకూలంగా వాడుకోవడం; ప్రవర్తనా మార్పులపై దృష్టి; వివాహాన్ని వాయిదా వేసుకున్న వారిని ఆదర్శ వ్యక్తులుగా ప్రదర్శించడం; లక్షణాల ద్వారా తెలుసుకోవడం; బాలలు కేంద్ర బిందువు.

వ్యూహం – చట్టం మరియు ఇతర అధికారులను పాల్గొనేలా చేయడం; చైతన్య ప్రచారాలు;

నేపథ్య అంశం – మీడియా, ప్రభుత్వం, విద్య

నమూనా 2 : సాధికారతపై దృష్టి

సమస్య – బాల్య వివాహాలు పెళ్ళికి సంబంధించిన సమస్యలను ఉధృతం చేస్తాయి.

లక్ష్యాలు – వారి జీవితాలలో ముఖ్యమైన నిర్ణయాలలో తమ మంత్రాంగాన్ని వాడుకో గలిగిన సాధికార యువజనులు.

విధానాలు – సాధికార పరచేది; యువజనులు కేంద్ర బిందువు; మూలకారణాలు మరియు స్థానిక వాస్తవాల ద్వారా తెలుసుకోవడం; సమూహాలు మరియు బృందాలపై దృష్టి.

వ్యూహం – యువజనులకు ప్రత్యామ్నాయ స్థలాలను ఏర్పాటు చేయడం; ప్రత్యామ్నాయ జీవన ఎంపికలు మరియు ఆకాంక్షలను కల్పించడం.

నేపథ్య అంశం – జీవనోపాధులు, విద్య, లైంగిక మరియు పునరుత్పత్తి ఆరోగ్యం మరియు హక్కులు, ప్రసార మాధ్యమాలు, క్రీడలు, కళలు.

సమస్య వ్యక్తీకరణ:

మేము సందర్శించిన సంస్థలన్నీ ప్రతికూల పరిస్థితుల్లోనూ ఎంతో విలువైన పనిని చేస్తున్నాయి. రెండు విభాగాలలోని సంస్థలు త్వరిత మరియు బాల్య వివాహాలను ఒక తీవ్రమైన సమస్యగా చూస్తున్నాయి. అలాగే వారందరూ ముఖ్యమైన సమస్యగా చూస్తున్న వాటి పరిష్కారాలకై నిజాయితీగా పనిచేస్తున్నాయి. ఈ రెండు నమూనాల మధ్య ఉన్న ముఖ్యమైన భేదం వారు దేనిని సమస్యగా చూస్తున్నారనేదే. వివాహ వయసు ప్రాథమిక అంశంగా పనిచేస్తున్న సంస్థలకు, బాలికలకు చట్టపరంగా వివాహ వయసైన 18 ఏళ్ళకు ముందే పెళ్ళి జరగడం పరిష్కరించాల్సిన సమస్య. కాగా, సాధికారత నమూనాతో పనిచేస్తున్న సంస్థలకు యుక్తవయసు వ్యక్తుల్లో వారి వివాహ వయసును నిర్ణయించుకోవడం వంటి ఎరుకతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం నుండి నిలువరించే విరోధమైన సాంఘిక పరిస్థితుల్లో కలసికట్టుతనం మరియు ఛాయిస్‌ లేకపోవటం అనేది పరిష్కరిం చాల్సిన సమస్యగా చూస్తున్నాయి.

వివాహ వయసు చట్రంలో తమ సమస్యను వ్యక్తీకరించే సంస్థలు క్షేత్రస్థాయిలోని సంక్లిష్ట వాస్తవాలతో నిమగ్నమై పనిచేయడానికి అవకాశాలు తక్కువ. వీరు ఎక్కువగా రాజ్యం మరియు అభివృద్ధి రంగం (ఫండింగ్‌ సంస్థలతో సహా) యొక్క అధికారిక చర్చలనే అనుసరించడానికి అవకాశం ఉంది. వీరు ప్రతి రాష్ట్రంలోను అన్ని వివాహాలు 18 ఏళ్ళపైబడే జరిగేలా చూసి బాల్య వివాహాలు జరగని ప్రాంతాలను సాధించాలని ఆశిస్తారు. వీరు చేపట్టే కార్యక్రమాల ద్వారా ఆ ప్రాంతంలో ఎన్ని బాల్య వివాహాలను ఆపగలిగారు లేదా బాల్య వివాహాల శాతం ఎంత పడిపోయింది అని లెక్కించడంపై ఎక్కువ శ్రద్ధ పెడ్తారు. ఈ సంస్థలు త్వరిత మరియు బాల్య వివాహాలు ఎందుకు సమస్యగా అనుకుంటున్నారన్న దాన్లో విభిన్న వ్యక్తీకరణలున్నాయి. వీటిలో కొన్ని పూర్తి సమాచారం లేని వ్యక్తీకరణలైతే మరి కొన్ని వారు పనిచేస్తున్న కమ్యూనిటీ ఆధారంగా వ్యూహాత్మకంగా పరిమితమైన వ్యక్తీకరణలు. చాలాసార్లు ఒక సంస్థ సమస్యను దృఢంగా వ్యక్తీకరించగలిగినా, ఒక ప్రత్యేక కమ్యూనిటీపై ప్రభావం చూపాలనుకుంటున్న సందర్భంలో ఆ కమ్యూనిటీ యొక్క వాస్తవాలతో అనుసంధానమవ్వరు. కమ్యూనిటీతో వారి సంభాషణల్లో ఈ సంస్థలు రాజ్యం మరియు అభివృద్ధి రంగాల సందేశాలను వక్కాణించేందుకు మొగ్గు చూపుతాయి – ఉదా: అనారోగ్యం (ముఖ్యంగా లైంగిక మరియు పునరుత్పత్తి), బడి మధ్యలో మానేయడం. ఇది బాధిత కమ్యూనిటీ సమస్యల నుండి, క్షేత్రస్థాయి అనుభవాల నుండి వచ్చిందికాక, అభివృద్ధి రంగం నుండి అరువు తెచ్చుకున్న వ్యక్తీకరణ కనుక అది సమూహాలతో సంబంధం లేకుండా సంస్థలే పునర్నిర్మించాయి, కాని ఇవి క్షేత్రస్థాయి వాస్తవాలను ఏమాత్రం ప్రతిబింబించవు.

రెండవ నమూనాను పాటించే సంస్థలలో వైవిధ్యతకు ఎంతో చోటుంది: ఈ వర్గంలోని కొన్ని సంస్థలు, ఉదాహరణకు, త్వరిత మరియు బాల్య వివాహాలు యువజనుల ప్రాథమిక మానవ హక్కుల ఉల్లంఘన చేసే సమస్యగా చూడగా, మరికొన్ని సంస్థలు మొత్తం మీద వివాహ వ్యవస్థపైనే విమర్శనాత్మక వ్యక్తీకరణను ఇచ్చాయి.

లక్ష్యాలు:

మొదటి వర్గంలో ఉన్న చాలా సంస్థలకు వారి పనిలోని ఇతర అంశాలకన్నా సంఖ్యాపరమైన కొలతలు, టార్గెట్లు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. చాలాసార్లు ఇది ఆయా సంస్థల ఇష్టాలకు వ్యతిరేకంగా కూడా చేయాల్సొస్తోంది. నిధుల కోసం ఇబ్బంది పడుతున్న క్షేత్రస్థాయి సంస్థలు ”బాల్య వివాహాల ఆచారాన్ని అంతం చేయాల”నే అభివృద్ధి రంగం యొక్క దృష్టి కోణంతో వారు కూడా కలవాల్సిన ఒత్తిడికి గురవుతున్నారు. రెండో వర్గంలో ఉన్న సంస్థలు యువజనులంతా వారి ప్రాథమిక మానవ హక్కులను అందుకునేలా చేయడానికి లేదా వారి జీవితాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేం దుకు వారి మంత్రాంగాన్ని వినియోగించుకునేలా యువతని సాధికారపరచే లక్ష్యంతో వారి దృష్టి కోణాన్ని ఏర్పాటు చేసుకునేందుకు మొగ్గుచూపుతాయి.

దృక్పథాలు :

మొదటి వర్గంలోని సంస్థలు అభివృద్ధి రంగం యొక్క చర్చాంశాలనే అనుసరిస్తున్నాయి. కనుక, ఈ అంశంపట్ల వారి దృక్పథం సమస్య యొక్క మూలకారణాల ఆధారంగానో లేక వారు పనిచేస్తున్న ప్రాంతంలోని నిర్ధిష్ట సందర్భాల ఆధారంగానో

ఉండటంలేదు. అంకెలు, లెక్కలపై ఎక్కువ ప్రాధాన్యత ఉండడం వలన ఈ సంస్థలు సాధారణంగా ఆలోచనా దృక్పథంలో మార్పుపై కన్నా ప్రవర్తనలో మార్పుపైనే దృష్టిపెడ్తాయి. అలాగే ఈ సంస్థలు వ్యక్తులను ఆదర్శంగా చూపించి ఆ విధంగా నడుచుకునేలా ఇతరులను చైతన్యపరుస్తాయి. ఈ సంస్థలు వివాహ వయస్సును అమలు చేయడానికి వివిధ స్థాయిల్లో ముఖ్యంగా చట్టాన్ని

ఉపయోగిస్తాయి లేదా చట్టంపై అవగాహన కల్పించడానికి, త్వరిత మరియు బాల్య వివాహాలపై సాధారణంగా అందరూ వ్యక్తీకరించే ప్రభావాలను తెలియచేయడానికి ప్రచారాలను చేపడ్తాయి. రెండో వర్గంలోని సంస్థలు సమస్యని కౌమారదశ కోణం నుండి చూస్తాయి. యువజనులకు పిల్లల కన్నా భిన్నమైన హక్కులు అవసరమని అర్థం చేసుకుని, హక్కులను అందుకోగలిగిన కొద్దిమందిని ఆదర్శంగా చూపించడానికి ప్రాధాన్యతనివ్వడం కాకుండా ఈ హక్కులపై సంభాషణాత్మక చర్చలకు అవకాశం కల్పించేందుకు సమూహాలతో పని చేయడానికి ప్రయత్నిస్తాయి. వీటిలో కొన్ని సంస్థలు, యువజనులు తమను అశక్తులను చేస్తున్న సామాజిక నిర్మాణాలను అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే సాధికారిత సాధించగలరన్న అవగాహన కలిగి వున్నారు. ఈ అవగాహన ముందు ముందు సామూహిక సంభాషణలు, చర్చలు మరియు పోరాటాల దిశగా అభివృద్ధి చెందే అవకాశముంది. వీరు కౌమార దశలోని బాలబాలికలకు వారి వారి స్వంత అభిప్రాయాలను, నమ్మకాలను, కోరికలను వినిపించేలా అవకాశాలు కల్పిస్తారు. వీరు ఈ యువజనుల కోరికలన్నీ నెరవేరాల్సినవికావని అర్థం చేసుకోవడమే కాక వారు ఆ కోరికల నుండి బైటపడేందుకు వారికి కౌన్సిలింగ్‌ కూడా ఇస్తారు. ఎక్కడా అధికారాన్ని కాని, బలాన్నికాని వినియోగించరు.

వ్యూహాలు:

ప్రతి సంస్థకు ఒక ‘మార్పు సిద్ధాంతం’ ఉనికిలో ఉండాలని లేదు. ఏది ఏమైనా, సంస్థలకు కొన్ని నిర్ధిష్ట ప్రశ్నలను వేయడం ద్వారా వారు ఆశిస్తున్న ఫలితాలను చేరుకోడంలో అనుసరిస్తున్న వివిధ వ్యూహాల గురించి మనం అర్థం చేసుకోవచ్చు. ఇవి త్వరిత మరియు బాల్య వివాహాల యొక్క హానికర ప్రభావాలపై అవగాహన కల్పించడంతో మొదలుబెట్టి బాల్య వివాహ నిరోధక చట్టం – 2006 యొక్క మెరుగైన అమలుకై ప్రోత్సాహించడం వరకు ఏదైనా కావచ్చు. ఇవి ప్రత్యక్ష వ్యూహాలు కాగా, చాలా సంస్థలు పరోక్ష మార్గాలను

ఉపయోగిస్తాయి. అది యుక్త వయసు బాలలకు వారి ప్రత్యామ్నాయ జీవన ఆకాంక్షల గురించి మాట్లాడేందుకు సహకరించడం లేదా బలవంతపు పెళ్ళిళ్ళను కాదని వచ్చేసే యువతకు ఒక సంరక్షణా స్థలాన్ని ఏర్పాటు చేయడం వంటివి. అలాగే, కొన్ని వ్యూహాలు సమా జంలో భయాన్ని కల్పించడం ద్వారా వారు కోరుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుండగా, మరికొన్ని సంస్థలు సముదాయాల ద్వారా సంభాష ణలు జరిగేలా ప్రయత్నించడమో లేదా యువజనులకు ప్రత్యామ్నాయ స్థలాలను, జీవన అవకాశాలను కల్పించడానికి ప్రయత్నించడమో చేస్తున్నాయి.

నేపథ్యాలు:

నేపథ్య అంశాలు అనేకం. వీటిలో విద్య నుండి లైంగిక మరియు పునరుత్పత్తి ఆరోగ్య హక్కుల వరకు, చట్టం నుండి జీవనోపాధుల వరకు, హింస నుండి మీడియా వరకు అన్నీ

ఉన్నాయి. ఇటు సాహిత్యంలోను, అటు క్షేత్రస్థాయిలోను విద్య అనేది త్వరిత మరియు బాల్య వివాహాలను నివారించేందుకు ఒక ప్రతిభావంతమైన పరికరంగా చూడబడుతుంది. ఇది సాధారణంగా బాలికలకు చర్చల ద్వారా తమ వివాహ వయసును పెంచుకునే శక్తినిచ్చే పరికరంగా గ్రహించబడుతుంది. అయితే విద్యాధారిత కార్యక్రమాల పరిమితుల్లో ఒక మూలకం ఏంటంటే, అవి ”మంచి బాలిక”, ”మంచి బాలుడు” అనే విలువలను బలోపేతం చేసేవిగా ఉంటాయి.

ఆరోగ్య అంశాలపై పనిచేస్తున్న ఒక సంస్థలోని సిబ్బందిని వారు బాలికలు 18 ఏళ్ళు నిండాకే పెళ్ళి చేసుకోవాలని ఎందుకనుకుంటున్నారని అడగగా 18 ఏళ్ళు నిండే సరికి బాలికల శరీరము, మనసు ”సిద్ధం” అవుతాయని చెప్పారు. ఇది చాలాసార్లు వినబడే ఆలోచనేకాని దీనికి వారివద్ద సరైన వివరణ లేదు. హింస అంశంపై పని చేస్తున్న దాదాపు అన్ని సంస్థలు పెద్ద వయసు వారితో పోల్చుకుంటే చిన్న వయసులో పెళ్ళి చేసుకున్న బాలికలు ఎక్కువ హింసను ఎదుర్కుంటున్నారనేది అంగీకరించాయి. అయితే దీని ద్వారా బాలికలతో వారు చేస్తున్న పని లేదా విధానం గురించి తెలియదు. క్షేత్రస్థాయితో ఈ అంశంపై నిజంగా పూర్తిస్థాయిలో పనిచేస్తున్న లేదా మాట్లాడుతున్న సంస్థ ఏదీ మాకు కనబడలేదు. బాలికలు వారి అత్తవారింట్లో ఏదైనా విషయానికి అసమ్మతి తెలిపినా లేదా వారి భర్తలతో లైంగిక సంబంధానికి ఒకప్పుకోకపోయినా వారు శారీరక, మానసిక, భావోద్వేగ, లైంగిక హింసలను ఎదుర్కోవలసి వస్తుంది. అయినప్పటికీ ఈ సంస్థలు త్వరిత మరియు బాల్య వివాహాలపై పెరిగిన హింస, లైంగిక మంత్రాంగం లేకపోవడం లేదా పెద్దవారిపైపడే భారాలకు బదులుగా బాల్యంలో గర్భధారణ మరియు పునరుత్పత్తి ఆరోగ్యం వాదననే ఇంకా వాడుతున్నారు.

అమలులో ఉన్న కార్యక్రమాలలోని ఖాళీలు (+aజూర):

త్వరిత మరియు బాల్య వివాహాలపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పనిచేస్తున్న వివిధ రకాల సంస్థలను విశ్లేషించిన మీదట కొన్ని స్థూల ఖాళీలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మేము మరోసారి చెప్తున్నదేంటంటే, ఈ ఖాళీలను పూడ్చడంకోసం ఆ యా సంస్థలు కష్టపడి పని చేయడంలేదని చెప్పడం కాదు. ఈ సంస్థలు కష్టపడి చేసే పని మధ్య మా యీ పరిశీలనలు భవిష్యత్తులో చర్చలకు అవకాశాలు కల్పిస్తాయనే ఆశతో అందిస్తున్నాము.

వ్యక్తీకరణలో ఖాళీలు:

కేవలం కొన్ని సంస్థలే ఎంపిక హక్కు (=ఱస్త్రష్ట్ర్‌ ్‌శీ షష్ట్రశీఱషవ) మరియు వివాహ నిర్ణయాలలో సమ్మతివంటి అంశాలను గుర్తించారు. నిజానికి అతికొద్ది సంస్థలు మాత్రమే పెళ్లిని ఒక అసమానతలను పునర్నిర్మించే సామాజిక వ్యవస్థగా విమర్శనాత్మకంగా చూస్తున్నాయి.

దీర్ఘకాలిక లక్ష్యాలలో ఖాళీలు :

యువజనుల సాధికారత, వారి ఎంపికను తెలియచేసే సామర్థ్యం మరియు సమ్మతిని చెప్పగలగడం వంటి వాటిని అంతిమ లక్ష్యంగా పెట్టుకున్న సంస్థలు లేనేలేవు.

విధానాలలో ఖాళీలు:

క్షేత్రస్థాయిలో సంస్థలు ప్రస్తుతం దృక్పథాలలో మార్పుదిశగా ప్రయత్నం చేయడానికి బదులు ప్రవర్తనా మార్పును తీసుకువచ్చే దృష్టితో సమస్యను చూస్తున్నాయి. ఈ విధానాలు సర్వసాధారణంగా బాల్యవివాహాలను నివారించడంపైనే దృస్టిసారించారు ుకాని సాధికారితపై కాదు.

నేపథ్య అంశాలలో ఖాళీ:

మగపిల్లలు, పురుషత్వం, మరియు బాల్య వివాహాలను కలుపుకుంటూ పనిచేయడం దాదాపు జరగట్లేదనే చెప్పాలి. లైంగికత, పునరుత్పత్తి ఆరోగ్యంపై చేసే పని చాలాసార్లు లైంగికతను పరిమిత లేదా వ్యతిరేక విధానంలో చూడడం జరుగుతోంది. ఇది యువజనుల కోరికలకు సంబంధించిన సంభాషణలను పూర్తిగా వదిలేస్తోంది. యువతను సాధికారపరచేదిగా విద్యను తయారు చేయడానికి ప్రత్యామ్నాయ విద్యావిధానాలను కల్పించే బదులు (లేదా ఉన్నవాటిపై పనిచేసే బదులు) విద్యాకార్యక్రమాలు చాలాసార్లు మార్పుకు కారకాలుగా మాత్రమే వాడబడుతున్నాయి. జీవనోపాధులపై పనిచేసే సంస్థలు ప్రత్యక్ష నైపుణ్యాలను అందించగల్గుతున్నాయి కాని, యువజనులు వీటిని

ఉపాధికి, ఆర్థిక స్వావలంబనకి వినియోగించుకునేలా సాయపడడంలో విఫలమవుతున్నాయి. అసలు ప్రాథమికంగా కెరీర్‌ కౌన్సిలింగ్‌ కూడా ఉండటంలేదు. కళలు, క్రీడలను ఉపయోగిస్తున్న సంస్థలున్నా, విజయవంతంగా తామ ఆశిస్తున్న లక్ష్యాలను చేరుకోగల్గుతున్నా, ఇలా వినూత్న నేపథ్య అంశాలతో పనిచేస్తున్న, సామాజిక మార్పు కోసం పనిచేయగల శక్తికలిగిన సంస్థలు అతి తక్కువగా ఉన్నాయి.

చాలా సంస్థలు వివాహ వయసును ఆలస్యం చేయడంపై అత్యధిక దృష్టి పెట్టడంవల్ల ఒకసారి ఒక బాలికకు చిన్న వయసులో పెళ్ళైపోతే ఆమె ఎలా మర్చిపోబడుతుందనే దానికి ఉదాహరణ హింసకు సంబంధించిన సమస్యలపై పనిచేయకపోవడం. బాల్య వివాహాలు మరియు గృహహింసకు మధ్య ఉన్న సంబంధాన్ని ఎన్నోసంస్థలు అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. ఇది కేవలం ఈ అంశం చుట్టూ ఒక వాదనని నిర్మించడానికి మాత్రమే కాదు, హింసను అనుభవిస్తున్న చిన్నారి వధువులకు సహకారాన్ని అందించడనాకి కూడా. మూల కారణాలకు, ప్రభావాలకు కీలకం లైంగికతే అయినా సంస్థలు లైంగిక హింసను దాటి (అసలంటూ ఈ అంశంపై పనిచేస్తుంటే) లైంగికతపై పనిచేయడం జరగటంలేదు.

పర్యవేక్షణ మరియు మూల్యాంకన:

ప్రస్తుతం పర్యవేక్షణ మరియు మూల్యాంకనను (M&E) అర్థం చేసుకున్న విధానం, అమలు చేస్తున్న పద్ధతి అమలులో ఉన్న కార్యక్రమాలపై వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తున్నాయి. సంఖ్యాపరమైన సూచికలని, ఇతర లక్ష్యాలని (goals) చేరుకోవాలన్న ఒత్తిడి పెరగడంతో శీఘ్ర పరిష్కార వ్యూహాలని ప్రోత్సహించడంతో సంస్థలు, సముదాయాల మధ్య సంభాషణ విస్తృతమవ్వడానికి బదులు కుచించుకుపోతోంది. పర్యవేక్షణ మరియు మూల్యాంకనకు సంస్థల సమర్థతపై తెచ్చే ఒత్తిడి వల్ల సంస్థలు ఎదుర్కునే సవాళ్ళను తక్కువ చేసి చూస్తారు – ఇది ఎప్పటికీ పెరుగుతూ ఉండే సమస్య. ఎందుకంటే, ఒక సంస్థ ఈ సమస్యలపై ఎంతకాలంపాటు మాట్లాడకుండా ఉంటే నిజాయితీగా సంభాషించేలా చేయడం, తిరిగి చూసుకునేలా చేయడం అంత కష్టం. చివరిగా, ఉన్న సమస్యలను నేరుగా, సులువుగా అర్థం చేసుకోవడంపై నొక్కి వక్కాణించడం ద్వారా (వాటిని సులువుగా పర్యవేక్షించేందుకు) ఈ విధానం బ్యాండ్‌-ఎయిడ్‌ పద్ధతి వంటి పరిష్కారాలకు దారి తీస్తుంది కాని సమస్యల బహుళత్వాన్ని, సంక్లిష్టతను పరిష్కరించటంలో విఫలమవుతుంది.

సిఫార్సులు:

ల్యాండ్‌ స్కేప్‌ విశ్లేషణలో చేపట్టిన విస్తృతమైన పరిశోధన ఆధారంగా భారతదేశంలో త్వరిత మరియు బాల్య వివాహాల అంశంపై పనిచేయడానికి ఆసక్తి కలిగి ఈ అంశాన్ని ప్రభావవంతంగా మరియు సుస్థిరంగా పరిష్కరించాలనుకునే సంస్థలకు ఈ క్రింది సిఫార్సులను సూచిస్తున్నాము:
* జెండర్‌, లైంగికత, పెళ్ళి కేంద్రబిందువుగా మరియు సమాజంలోని హింసకు సంబంధించిన అంశాలను త్వరిత మరియు బాల్య వివాహాల సమస్యను నిర్వచించే, వ్యక్తీకరించే విధానాన్ని విస్తృత పరచాలి.
* యువజనుల సాధికారతపై దృష్టి సారించాలి. త్వరిత మరియు బాల్య వివాహాలను తగ్గించడం ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా ఒక అడుగు మాత్రమే.
* జెండర్‌ మరియు పురుషత్వం, లైంగికత మరియు వివాహం అంశాలపై పరిశోధన, విజ్ఞానాన్ని పెంపొందించడంపై పెట్టుబడి పెట్టాల్సిన అవసరం వుంది.
* పెళ్ళి చుట్టూరా లోతుగా పాతుకుపోయిన సామాజిక నియమాల లో సుస్థిర సామాజిక మార్పు తెచ్చేందుకు ఒక మార్గంగా విమర్శనాత్మకంగా నిమగ్నమై పనిచేయాలి.
* త్వరిత మరియు బాల్య వివాహాలను ఆపేందుకు చేసే పనిలో యువజనులు కీలక భాగస్వాములయ్యేందుకు వారి అవసరాలు మరియు ఆకాంక్షలపై ఆధారపడి ఇతర అవకాశాల గురించి ఆలోచించడానికి, అందుకోడానికి వారిని సాధికారపరచాలి.
* త్వరిత మరియు బాల్య వివాహాలపై చేపట్టే కార్యక్రమాలలో మూలకారకాలను (ఉదా: కఠినమైన జెండర్‌పాత్రలు, లైంగికతపై నియంత్రణ, మొ||) అర్థంచేసుకుని, పరిష్కరించేలా నిర్థారించుకోవాలి.
* ప్రస్తుతం అమలులో ఉన్న కార్యక్రమాలలోని లోపాలను గుర్తించి, వాటిపై పని చేయడానికిగాను సంస్థల సామర్థ్యాలను పెంచాలి.
* ముఖ్యమైన ప్రవర్తనా ఫలితాలను మాత్రమేకాక సముదాయాల లోపల విలువలు మరియు దృక్పథాలలో వస్తున్న మార్పులను కొలవడానికి, అంచనా వేయడానికిగాను పర్యవేక్షణ, మరియు మూల్యాంకన పద్ధతులను తిరిగి అంచనా వేయాల్సి ఉంది. ఈ విధంగా, త్వరిత మరియు బాల్య వివాహాల మూలకారణాలను మెరుగ్గా పరిష్క రించడానికిగాను సంస్థలను ఫండింగ్‌ ఏజన్సీలు సాధికార పరచాలి.

ముగింపు:

ప్రస్తుతం త్వరిత మరియు బాల్య వివాహాల అంశంపై అంతర్జాతీయంగా కుతూహలం పెరుగుతోంది. ఈ సంప్రదాయంపై పని చేయడానికి అవసరమైన కార్యక్రమాలను రూపొందించడానికి సముదాయాలు, ప్రభుత్వాలు, ఫండర్లు ఎదురు చూస్తున్నారు. కనుక ఈ నివేదికలో కనుగొన్న విషయాలు వారి ఆలోచనలకు ఒక దారి చూపిస్తాయని మేము ఆశిస్తున్నాం.

భారతదేశంలోని త్వరిత మరియు బాల్య వివాహాలు బహుళ మరియు ఒకదానితో ఒకటి ముడిపడున్న మూలకారణాలు, సంస్థాగత అసమానతల లక్షణం. ఈ సంక్లిష్టమైన సమస్యకు ప్రభావవంతమైన, సుస్థిరమైన పరిష్కారాలన్నీ ఈ ఆచారాన్ని శాశ్వత పరుస్తున్న అనేక కారకాలన్నింటితో కలిసి పనిచేయాల్సుంది. ఈ దిశగా చేపట్టే కార్యక్రమాలు యువజనాన్ని వారి సంస్కృతిలో వివాహంపై స్వాభావికంగా ఉన్న సామాజిక నియమాలను విమర్శించేలా, వారి వారి విస్తృత సముదాయాలలో ఒక సామూహిక మార్పు ప్రక్రియ కోసం వాదించడంలో భాగస్వాములయ్యేలా సాధికార పరచాలి.

ఈ అంశంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ భారతదేశం లోను, ప్రపంచమంతటా కూడా త్వరిత మరియు బాల్య వివాహాలకు ఆలోచనాత్మక, స్వల్ప భేదాలతో కూడిన, సాధికారపరచే పరిష్కారా లను రూపొందించడంలో కలిసివస్తారని మేము ఆశిస్తున్నాం.

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో