తెలుగు మైనారిటీ కథాసాహిత్యంలో ముస్లిం మహిళల ఆవేదన చిత్రణ- డాక్టర్‌ తన్నీరు కళ్యాణ్‌ కుమార్‌

సాంస్కృతికంగా, తెగలపరంగా, జాతిపరంగా ఒక పెద్ద సంఘంలో ప్రత్యేకమైన స్వభావాలతో జీవిస్తున్న వారిని మైనార్టీలు అంటారు. జాతిపరంగా, భాషాపరంగా, సాంస్కృతిక సంప్రదాయ కట్టుబాట్ల పరంగా, ఆర్థిక – రాజకీయ – సామాజికపరంగా ఇతరులకంటే భిన్నంగా పరిగణించబడుతున్న ముస్లింలు మైనార్టీలుగా సంఘంలో గుర్తింపబడుతున్నారు. సంఘంలో జీవిస్తున్నప్పటికీ ఏరకమైన గుర్తింపు లేకుండా తమ ప్రాతినిధ్యం లేకుండా పోవడాన్ని ముస్లింవాదం ప్రశ్నిస్తుంది. ముస్లింల అస్తిత్వం ముస్లింవాదంలో ముఖ్యాంశం. 1985కు పూర్వం సాహిత్యపరంగా ప్రత్యేకించి మైనారిటీ భావజాలంతో సాహిత్యం సృజించబడలేదు. ఎవరి సమస్యలను వారు చిత్రించుకోవడం ఇటీవలి సాహిత్య పరిణామం. తమ సమస్యలను తామే స్పందించి రాయడం వల్ల అలా రాసిన సాహిత్యంలో వాస్తవికత, నిజాయితీ బలంగా వ్యక్తపరచడానికి అవకాశం ఉంటుంది. ముస్లిం కుటుంబాల స్థితిగతులు, వారి ఆర్థిక – సామాజిక జీవన విధానానికి సంబంధించిన అనేక అంశాలు ముస్లింలచే సృజించబడిన సాహిత్యానికి వస్తువులైనాయి. ముస్లిం జన జీవిత సంఘర్షణ తెలుగులో ముస్లిం సాహిత్యం ఎంతో ప్రభావపూరితంగా చిత్రించింది.

మొదట ఒకరిద్దరితో ప్రారంభమైన మైనారిటీ సాహిత్యోద్యమం ఆ తరువాత బలం పుంజుకుంది. స్మైల్‌, దిలావర్‌ లాంటి రచయితలు ముస్లిం జీవితాలపై కథలు సృజించిన తొలి తరం కథకులు. స్కైబాబా, షాజహానా, అన్వర్‌ లాంటి వాళ్ళు మైనారిటీ జీవితాలపై అద్భుతమైన కథలు రాశారు. తమ కథలలో ముస్లిం జీవితాలను సంస్కృతిని ఉన్నతీకరిస్తూ కథలు రాస్తూ ఒక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్ళారు. స్కైబాబా, షాజహానాల నిరంతర కృషి వల్ల ‘వతన్‌’ ముస్లిం వాద కథా సంకలనం వెలుగుచూసింది. ముస్లిం జీవితాల్లోని కష్టసుఖాలను, ఉత్తాన పతనాలను, జీవన వైవిధ్యాన్ని, జీవన విషాదాన్ని తెలిపే అద్భుత కథా సంకలనం ఇది. ఈ సంకలనంలోని కథలు అన్ని కోణాల్లోంచి ముస్లిం జీవితాలను ఆవిష్కరించాయి. హైదరాబాద్‌ ప్రాంత ముస్లిం జీవితాలను నెల్లూరి కేశవస్వామి రాసిన చార్‌మినార్‌ కథలు వెల్లడిస్తాయి. రహమతుల్లా ‘బా’ కథా సంపుటి, ఖదీర్‌ బాబు ‘దర్గామిట్ట కతలు’, షేక్‌ హుస్సేన్‌ సత్యాగ్ని ‘పాచికలు’ తదితర కథా సంకలనాలు తెలుగు ముస్లిం కథా రచయితల చేతి నుండి జాలువారిన చక్కని సంకలనాలు. మహమ్మద్‌ ఖాజా రాసిన ఇండియా వర్సెస్‌ పాకిస్తాన్‌ ముస్లిం జీవిత చిత్రణలో ముందున్న కథలు. ఈ సంకలనాలలోని కథలు ముస్లిం మహిళల సామాజిక స్థితిని, సాంఘిక స్థితిని, ఆర్థిక స్థితిని, కుటుంబ స్థితిని వెల్లడించే ప్రయత్నం చేశాయి.

భారతీయ సమాజంలో ఎక్కువ అణిచివేతలకు గురవుతున్న స్త్రీలు ముస్లిం కుటుంబాలకు చెందినవారే. మతం తాలూకు, జెండర్‌ తాలూకు రెండు విభిన్న అణిచివేతలకు, సంఘర్షణలకు ముస్లిం మహిళలు గురి అవుతున్నారు. ముస్లిం స్త్రీలు బురఖా లేకుండా లోకానికి కనిపించకూడదనేది వారి సంప్రదాయం. మతపరమైన కట్టుబాట్లు, సంప్రదాయాలు, చైతన్యరాహిత్యం, అజ్ఞానం, పురుషాధిక్యత, కుటుంబపరమైన అణిచివేత అన్నీ కలసి ముస్లిం స్త్రీలు చీకటి గుహల్లో, పరదాల్లో మగ్గిపోవడాన్ని చిత్రించడం అనేక కథలలో కనిపిస్తుంది. ఇంటి నుండి బయటకు వెళ్ళనివ్వని ఛాందస సంప్రదాయాల మధ్య ముస్లిం స్త్రీలు ఎంతగా నలిగిపోతున్నారో షాజహానా రాసిన ‘సండాస్‌’ కథ తెలియజేస్తుంది. కట్టుబాట్ల కారణంగా ముస్లిం స్త్రీలు మిగిలిన అందరు స్త్రీల్లా మలవిసర్జనకు బయటకు వెళ్ళరు. ఇంటి పెరట్లోనే సండాస్‌ (గుంతలాంటిది) ఏర్పాటు చేసుకుంటారు. అవి ఎంత భయంకరంగా ఉంటాయో, ఎంతటి అసహ్యాన్ని కలిగిస్తాయో ఈ కథలో రచయిత తెలిపిన తీరు ముస్లిం మహిళలపై సానుభూతి కలిగించకమానదు.

ఆచారాలు, సంప్రదాయాలు కలిసి ముస్లిం సమాజంలో స్త్రీలను బయటికి రానీకుండా అడ్డుపడుతూ, బయట ప్రపంచంతో సంబంధం లేకుండా చేస్తున్నాయి. ఈ పరిస్థితుల నుండి బయటపడాలని ఆశ ఉన్నా వీలులేక, ఎటూ తోచని స్థితిలో ముస్లిం స్త్రీలు దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారు. పేద ముస్లిం స్త్రీలైతే జీవచ్ఛవాలే అనాలి. రహమతుల్లా రాసిన ‘నర్గీస్‌’ కథలో నర్గీస్‌ భర్త తమ నలుగురు కూతుళ్ళకు చదువులు, పెళ్ళిళ్ళు, పురుళ్ళు…ఎలా నిర్వహించాలో తెలియక ఆ భయంతో, బాధతో ఆత్మహత్యకు పాల్పడతాడు. దీంతో కుటుంబ భారం నర్గీస్‌పై పడుతుంది. బాల్యం నుండి బయట ప్రపంచంతో సంబంధం లేని ముస్లిం సామాజిక కుటుంబ నేపథ్యంలో పెరిగిన నర్గీస్‌ బయట ప్రపంచంలో ఇమడలేక నానా అవస్థలు పడుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగంలో చేరిన నర్గీస్‌ ఆఫీసుకు వెళ్ళి ఫైళ్ళతో, పురుషులతో కలిసి పని చేయాల్సి రావడం ఆమెను అయోమయంలోకి పడేస్తుంది. కనీసం స్కూటర్‌ ఎలా ఎక్కి కూర్చోవాలో కూడా ఆమెకు తెలియదు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూసి ఏవేవో ఊహించుకుని ఆవేదన చెందటం ఆమెకు పరిపాటి అవుతుంది. సంస్కృతి, మతం, ఆర్థిక పరిస్థితులు, తండ్రి, భర్త …. తదితర కారణాలు ఇంతకాలం తనను చీకట్లో మగ్గిపోయేలా చేశాయనే ఆవేదన ఆమెలో వ్యక్తమవుతుంది.

ముస్లిం స్త్రీలు సంఘంలోని అన్ని వర్గాల స్త్రీల కంటే అధికంగా అణిచివేతకు గురి అవుతున్నారు. వీరు కుటుంబానికే పరిమితమై ఉంటారు. బిడ్డలు భగవంతుని ప్రసాదాలు కనుక దాన్ని నిషేధించకూడదన్నది ముస్లింల నమ్మకం. దీని వల్ల స్త్రీలను శారీరకంగాను, మానసికంగాను హింసకు గురి అవుతున్నారు. ఎక్కువమంది సంతానానికి తగిన వసతులు కల్పించడం సాధ్యం కాకపోవడంతో అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ముస్లింలకు గల మరో సంప్రదాయం బురఖా. ముస్లిం కుటుంబాల్లో స్త్రీలు బయటికి వచ్చి కనిపించరు. పర పురుషుడిని చూడటం కూడా పాపంగానే భావించబడుతుంది. వీరు ప్రార్థనా స్థలాలకు రావడం కూడా నిషిద్ధమే. బురఖాలను తప్పనిసరిగా ధరించాల్సిందే. ఈ సంప్రదాయం ఎంత దారుణమైనదో, ముస్లిం మహిళలను ఎంతటి బాధకు గురి చేస్తుందో ఖాజా రాసిన ‘హరాం’ అనే కథ తెలియజేస్తుంది. ఈ కథలోని ఇల్లాలు బురఖా వేసుకొని బస్సులో వెళ్తుండగా, బురఖాలో ఉంది ఎవరో తెలియక ఆడపిల్లే అన్న ఆలోచనతో తన్ను తాకాలని ఆమె కొడుకే ప్రయత్నిస్తాడు. ఈ సంఘటన ఆ తల్లిని ఎంతో క్షోభకి గురిచేస్తుంది. బురఖా వేసుకోవడం వల్ల కన్న కొడుకే ఆమెని గుర్తించక అసభ్యంగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ బురఖాను మంటల్లో వేస్తుంది.

భారతదేశ జనాభాలో అత్యధిక శాతం ముస్లింలు పేదరికాన్ని అనుభవిస్తున్నారని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అధిక సంతానాన్ని కలిగి ఉండటం ముస్లిం కుటుంబాల్లోని ప్రధాన సమస్య. ముస్లిం కుటుంబాల దారిద్య్రాన్ని గూర్చి, కుటుంబంలోని స్త్రీల దుస్థితిని గూర్చి ఖదీర్‌ బాబు ‘జరీనాంటీ స్పెషల్‌ సెలవల కత’ అనే కథ స్పష్టం చేస్తుంది. ఈ కథలో జరీనా బేగం అనే మహిళ ప్రతిరోజు భర్త జేబులో డబ్బులు తీస్తూ, అతనితో చావుదెబ్బలు తింటుంటుంది. డబ్బులు తాను తీయలేదని ఒట్లు పెడుతూ, దెబ్బలు తిని ఏడుస్తుంటుంది. ఆమె ఎందుకు ఆవిధంగా ప్రవర్తిస్తుందనే ప్రశ్నకు ఆమె ఇచ్చే సమాధానం ఎంతటి వారినైనా చలింపజేస్తుంది. ఇంటి ఖర్చులకు భర్త ఇచ్చే కొద్ది డబ్బు ఏమాత్రం సరిపోకపోవడం వల్ల, బిడ్డల్ని పస్తులు పెట్టకుండా చూడడానికే తాను భర్త జేబులో డబ్బును తీస్తున్నానని చెబుతుంది. బిడ్డల ఆకలిని తీర్చడానికి ఆ తల్లి పడిన తాపత్రయం ఈ కథలో హృదయ విదారకంగా రచయిత చిత్రించారు.

అట్లే ‘మాయమ్మ పూలయాపారం’ కథలో భర్త చాలీచాలని జీతం కుటుంబానికి సరిపోకపోవడం వల్ల కుటుంబాన్ని పోషించడానికి ఆ ఇంటి ఇల్లాలే నడుంబిగించడం ఈ కథలో కన్పిస్తుంది. ఈ కథలో సర్తాజ్‌ బీ తన ఇంట్లో ఉన్న సన్నజాజి మొక్కకి టీ అంగట్లో పారేసే టీ పొడి, ఎర్రమట్టి వేసి చెట్టుకు పూసిన పూలు అమ్మి కుటుంబాన్ని పోషిస్తుంది. ఈ విధంగా సర్తాజ్‌ బీ చదువు లేకపోయినా తను ఇంట్లో ఉంటూ చేయగలిగిన పని చేస్తూ కుటుంబాన్ని ఆదుకుంటుంది. పాఠకుల్ని కదిలించే మరో కథ ఖదీర్‌ బాబు రాసిన ‘దూద్‌ భిక్ష్‌’ అనే కథ. ఈ కథలో నజీర్‌ భర్త వ్యవసాయంలో ఘోరంగా విఫలం కావడం వల్ల కుటుంబం అప్పుల పాలవుతుంది. ఇలాంటి తప్పనిసరి పరిస్థితుల్లో నజీర్‌ తన పధ్నాలుగేళ్ళ కొడుకు షఫీని పనిలోకి పంపుతుంది. వయస్సుకు మించిన పని భారం వల్ల పిల్లవాడికి టి.బి. వచ్చి చనిపోతాడు. అంతిమ సంస్కారానికి తరలించడానికి ముందు దూద్‌ భిక్ష్‌ పెట్టడానికి నజీర్‌ అంగీకరించదు. ”పధ్నాలుగేళ్ళ పసివాడి ఎముకలు జుర్రి రక్తం తాగి వాడి ప్రాణాలను కాజేశాను” అంటూ గుండెలు పగిలేలా ఏడుస్తుంది. అదే విధంగా ‘అమ్మీజాన్‌’ కథలో ఫాతిమా భర్త కుటుంబ భారాన్ని మోయకుండా వదిలి వెళ్ళిపోతే, అన్నీ తానే అయి కుటుంబాన్ని నడుపుతుంది.

ముస్లిం కుటుంబాల్లో పెళ్ళి తంతు చాలా ఖర్చుతో కూడుకొని ఉంటుంది. వధూవరులిద్దరూ పరస్పరం ఫోటో కూడా చూసుకునే పరిస్థితి ఉండదు. పెళ్ళిలో వరుడికి ఇచ్చే జహేజ్‌ (సారె) చాలా ఘనమైనది. ఇంటి సామాన్లు చివరికి స్ఫూన్‌తో సహా ఇవ్వాల్సి ఉంటుంది. జహేజ్‌ అడిగినంతా ఇవ్వకపోవడం వల్ల జరిగే గొడవలకు పురుషులు స్త్రీలనే బాధ్యులు చేసే వైనాన్ని ‘పల్లెటూరి షాదీ జజ్జనక’ కథలో కన్పిస్తుంది. ఆడపిల్లలకు వివాహం చేయడమనేది ముస్లిం కుటుంబాలలో ఎంతటి భారమో ఈ కథలో అద్భుతంగా చిత్రించబడింది. పితృస్వామ్య సమాజంలో ముస్లిం మహిళల ఆవేదనను ఈ కథ బలంగా చిత్రించింది. అదే విధంగా కుటుంబ విచ్ఛిన్నం తలాక్‌ పేరుతో జరగడం బిడ్డలకి – తల్లికి మధ్య ఎడబాటు, ఒక్క పురుషుడు ఎన్ని వివాహాలైనా చేసుకోవడం, దీని వల్ల స్త్రీలు ప్రత్యక్ష నరకాన్ని అనుభవించడం షేక్‌ హుస్సేన్‌ సత్యాగ్ని ‘పాచికలు’ కథల్లో చక్కగా చిత్రించే ప్రయత్నం చేశారు. గీతాంజలి రాసిన ‘బచ్చాదాని కథ’ మైనారిటీ మహిళల జీవితాలకు భాష్యం చెప్పిన చక్కని కథ. ముస్లిం మహిళల జీవితాల్లోని వివిధ దశలను, దుర్భర పేదరికాన్ని, మూఢ నమ్మకాలను, విషాదాలను అక్షరీకరిస్తూ అనేక కథలు వెలువడ్డాయి.

ముస్లిం కుటుంబాలలోని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలనుండి బయటపడాల్సిన ఆవశ్యకతను తెలియజేసి, వాళ్ళను ప్రగతిపథం వైపుకు నడిపించాలనే సాధికారత లక్ష్యంతో ముస్లిం మైనారిటీ కథా రచయితలు – రచయిత్రులు నేడు రచనలు చేస్తున్నారు. ఈ సాధికారత వైపు ముస్లిం మహిళ ఎంతవరకు వెళ్ళగలుగుతుంది అన్నది పరిశీలిస్తే ఇప్పుడిప్పుడే తమ సమస్యలను గుర్తించి బయటపడే ప్రయత్నం జరుగుతోందనేది వాస్తవం. ఇటీవల కాలంలో వెలువడిన కొన్ని మైనారిటీ కథల్లో స్త్రీల సమస్యల్ని, వారి స్థితిగతుల్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించే ప్రయత్నం జరుగుతోంది. సనాతన సంప్రదాయాలు, కట్టుబాట్లు, పురుషాధిక్య సమాజ ఆధిపత్యం తదితర సంకెళ్ళ నుండి విముక్తి పొంది సాధికారత వైపు ముస్లిం మహిళా లోకం ముందుకుసాగాలి. ఆ దిశగా ముస్లిం మైనారిటీ కథా రచయితలు – రచయిత్రులు పదునైన కథలను సృజించాలి. ఆలోచనాపరులైన ముస్లిం రచయితలు, మేధావులు, ఇతర మేధావులు ముస్లిం స్త్రీల జీవన మూలాలపై దృష్టి సారించి ఆలోచింపజేసే కథలు రాయాలి. రానున్న రోజుల్లో ముస్లిం మైనారిటీ కథా సాహిత్యం సరికొత్త కాంతులు విరజిమ్ముతూ ముస్లిం మహిళా లోకాన్ని చైతన్యపథం వైపుకు పయనింపజేయగలదని మనసారా ఆశిద్దాం.

 

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.