స్త్రీ విముక్తి ఉద్యమ చోదక శక్తులు – దళిత స్త్రీలు- సుజాత

ప్రపంచంలో ఎక్కడాలేని కుల వ్యవస్థ భారత సమాజంలో వేళ్ళూనుకొని వుంది. ఇది కొన్ని ప్రత్యేక లక్షణాలను కూడా కలిగి ఉంది. అవి – మనిషి విలువను పుట్టుకతోనే ముడిపెట్టడం, పుట్టుకతోనే వృత్తిని నిర్దేశించడం, ఏ కులంలోని వారు ఆ కులంలోనే పెండ్లి చేసుకోవాలనే అంతర్వివాహ పద్ధతి. హిందూ మతానికి దొంతర్ల దారి కుల వ్యవస్థ పునాదిగా వుంటూ వస్తుంది. సామాజిక అసమానత హిందూమత లక్ష్యం. దళితులు కుల అణచివేతను, వివక్షతను, అంటరానితనాన్ని ప్రశ్నిస్తూ, సంఘటితమౌతూ ఆత్మ గౌరవం కొరకు ఉద్యమిస్తున్నారు. దళితుల ఐక్యతను సహించలేని అగ్రకుల దురహంకారులు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. బెల్చి, పిప్రార, పారస్‌బిగా, కిలవేణ్మని, కంచికచెర్ల, కారంచేడు, తిమ్మసముద్రం, చుండూరు, మద్దికెర సంఘటనల దారుణమారణ కాండలను మనం చూసాము. ఈ అగ్రకుల వికృత స్వభావం తన ఫాసిస్టు రూపాన్ని ప్రదర్శిస్తూనే వుంది. ఈ దాడులన్నింటిలో దళిత స్త్రీలు అగ్రకుల పితృస్వామ్య అత్యాచారాలకు, దుర్మార్గాలకు బలి చేయబడ్డారు. టంగుటూరి ఇందిర, చీమకుర్తి ఏసమ్మ, అంజమ్మ, రాములమ్మ, ముత్తమ్మల సంఘటనలు మెదులుతూనే ఉన్నాయి. బ్రాహ్మణ కుటిల మేధావి మనువు స్త్రీలను, దళితులను బానిసలుగా, అంటరానివారుగా కొనసాగేందుకు పకడ్బందీగా సూత్రీకరణలు చేసి తాత్వీకరించాడు. బ్రాహ్మణ సమాజం వీటిని అమలు చేస్తుంది. తరతరాలుగా భారత సమాజంలోని కులాల విభజన వర్గాల విభజనలో భాగంగా కొనసాగుతూ వస్తోంది. సాధారణంగా పీడిత కులాలే పీడిత వర్గాలుగా, పీడించే కులాలే దోపిడి వర్గాలుగా ఉనికిలో వున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో కులాలను పరిశీలిస్తే పీడిత కులాలుగా డక్కలి, మాస్టి, సింది, యానాది, మాదిగ, మాల, చాకలి, మంగలి, ముదిరాజు, పద్మశాలి, కుమ్మరి, కమ్మరి, గౌడ, గొల్ల, గంగపుత్ర, ఎరుకల తదితర కులాలు ఉనికిలో వున్నాయి. వీరు కులాల వారిగా వృత్తులు చేస్తూ సాంప్రదాయసేవా కులాలుగా కొనసాగుతున్నారు. తెలంగాణా పోరాటానికి పూర్వం అగ్రకులాల దొరల దగ్గర, ఒక్కొక్క కులం వారు ఒక్కొక్క వృత్తిని వెట్టిచాకిరి చేసేవారు. అంటరాని కులాలు, నిమ్నకులాల ప్రజలతో దొరలు శ్రమ చేయించుకునేటప్పుడు స్త్రీలతో అదనంగా చేయించుకునే వారు. పురుషులతో సమానంగా ఎట్టి చేస్తూ భర్త కాక, బానిసకొక బానిసగా బ్రతికేది. దొరలు చెప్పే ఎలాంటి పనినైనా వేళగాని వేళల్లో కూడా పని చేసేవారు. దొరల దగ్గరకు బయట నుండి పెద్దలు, అధికారులు వచ్చినప్పుడు వంటల కోసం సామాను సిద్ధం చేయడం, దొర, ప్రభుత్వాధికారుల సామాన్లను ఒక ఊరు నుండి మరో ఊరికి మోసేవారు. వీరి భర్తలు సం||ల తరబడి దొరల వద్ద ఎట్టి చేస్తూ వుంటే వీరు కోడి కూయకముందే దొరమేడ కడిగి, తుడిచి, ముగ్గులు వేసి, పిండి, పసుపు, కారం పొడులు విసిరి, పరుగులు పెట్టి, బాసండ్లుతోమి, బట్టలుతికి, వడ్లు దంచి బియ్యం తయారు చేయడం లాంటి అనేక పనులు కేవలం ఒక్క పూట తిండి కోసం చేసే వారు. వీరి చాకిరీకి గంటల లెక్క లేదు. రోజుల లెక్క లేదు. దొర దగ్గర నుండి మరొక దొర దగ్గరికి వెళ్తే ద్రోహంగా, నేరంగా పరిగణించే వాళ్ళు. పిడికెడు మెతుకుల కోసం బ్రతికినంత కాలం ఎట్టి చేసే తక్కువ కులాల స్త్రీలపై అత్యాచారాలకు పాల్పడడం, లైంగిక వేధింపులకు గురి చేయడం, అవమాన పర్చడం అగ్రకుల దొరలు తమ జన్మహక్కుగా భావించే వారు. తక్కువ కులాల కుటుంబాలలోని అమ్మాయిలు కొత్తగా పెళ్ళయిన తర్వాత మొదటి రాత్రి దొర దగ్గర గడిపే పద్ధతి కొనసాగింది. ఈ స్త్రీలు అందంగా ఉండడానికి వీలులేదు. ఇష్టం వచ్చిన మంచి పేరు పెట్టుకోడానికి వీలులేదు. పురిటిలోని పసికందులకు దొర ఏ పేరు పెట్టమంటే ఆ పేరు పెట్టేవారు. వీరి పుట్టుక దొరల కోసమన్నట్లు ఉండేది. వీరి పేరు ఎల్లమ్మ, మల్లమ్మ ఉంటే ఎల్లీ, మల్లీ అని పిలిచేవారు. తక్కువ కులాల స్త్రీలకు నైతిక విలువలతో బ్రతికే హక్కు నిరాకరించబడింది. తమ శరీరాల మీదా, పిల్లల మీదా, కట్టూ బొట్టూ అలంకరణల మీదా దొరల ఆధిపత్యం చలామణి అయ్యేది. ఈ విధంగా కుల అణచివేత జీవితంలోని ప్రతి రంగంలోనూ ఒక్కొక్క నిర్దిష్ట రూపంలో వ్యక్తం అయ్యేది. అంటరాని కులాల స్త్రీలపై లైంగిక హింసకి సమాజామోద యోగ్యమైన పద్ధతులే జోగిని, బసివి, మాతంగి, ఏర్పుల వంటివి. ఈ పద్ధతుల్ని వారి కుటుంబ పెద్దలు అంగీకరించే స్థితికి నెట్టబడ్డారు. దేవుని పేరుతో పెళ్ళి చేసి ”వూరుమ్మడి భార్యలుగా” కొనసాగేటట్లు చేసి అమాయకపు స్త్రీలను లైంగిక హింసకు బలిచేయటం ఒక పద్ధతిగా కొనసాగుతుంది. ఈ పద్ధతి ఆ స్త్రీల నైతిక పతనానికి దారితీసింది. ఆత్మగౌరవ చైతన్యాన్ని నీరుగార్చే కుట్రతో అగ్రకుల బ్రాహ్మణవాదం జోగిని పద్ధతిని బలవంతంగా అంటరాని కులాల స్త్రీలపై రుద్దింది.

ఈ కుల అణచివేతకు దళిత స్త్రీలే గాక అగ్రకులాల స్త్రీలు ఏ విధంగా గురవుతున్నారో డా|| అంబేద్కర్‌ ఇలా చెప్పారు – కుల పవిత్రతను, పురుషాధిక్యతను కాపాడుటకు బ్రాహ్మణవాదం కొన్ని పద్ధతులు ఎంచుకొంది. వాటికి కులాలలోని స్త్రీలను బలి చేశారు. సతీసహగమనం, నిర్బంధ విధవత్వం, బాల్యవివాహాలు ఈ మూడు ఆచారాలు కులవ్యవస్థ పరిరక్షణావశ్యకత నుండి పుట్టుకొచ్చాయి. ఈ అణచివేత రూపాలు ప్రప్రథమంగా అగ్రకులాల్లోనే అమలైనవి. కుల సమాజంలో అదనపు పురుషుడు, అదనపు స్త్రీ సమస్యలను పరిష్కరించడానికి, తద్వారా అంతర్వివాహ విధానాన్ని కాపాడుకొనుటకు, ఈ విధానం కులవ్యవస్థ పరిరక్షణకు ప్రత్యేక రూపం సంతరించుకుంటే, ఈ ప్రత్యేక రూపమే మూఢాచారాలుగా రూపాంతరం చెందింది. వీటన్నిటికి అగ్రకుల స్త్రీలే బలౌతున్నారని వివరించడం వాస్తవం.

స్వాతంత్య్రోద్యమం, కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన అనేక పోరాటాలు, బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా వచ్చిన చార్వాకులు, లోకాయితుల పోరాటాల కొనసాగింపుగా జ్యోతిబాఫులే, అంబేద్కర్‌ చేపట్టిన కులనిర్మూలనా పోరాటాలు, అనేక సంస్కరణవాద

ఉద్యమాల ఫలితంగా అగ్రకుల దోపిడీ పాలకవర్గాలు అనేక చట్టాలు, సవరణలు చేసింది. అందులో భాగంగానే సతీ నిషేధ చట్టం, వెట్టిచాకిరీ నిర్మూలనా చట్టం, వరకట్న నిషేధం, వ్యభిచార నిషేధం, సమాన పనికి సమాన వేతనం లాంటి చట్టాలు వచ్చాయి. అయితే ఇంత వరకు ఏ ఒక్క చట్టాన్ని సక్రమంగా అమలుచేయలేదు.

భారత సామాజిక వ్యవస్థలో కులవ్యవస్థ ఉనికిలోకి వచ్చి శతాబ్దాలు దాటినా ఈ వ్యవస్థలో ఏమాత్రం మార్పులేదు. నాటి వెట్టిచాకిరీ పద్ధతి నేటికీ అనేక రూపాల్లో కొనసాగుతూంది. నిమ్నకులాల ప్రజలు వారి జీవనాధారమైన కులవృత్తులు కోల్పోయారు. ఎంతో కొంత భూమి కలిగి ఉన్న మధ్యతరగతి రైతులు భూములను కోల్పోయి కూలీలుగా మారిపోయారు. మౌలికంగా

ఉత్పత్తి విధానం, ఉత్పత్తి సంబంధాల్లో మార్పులు వచ్చిన కారణంగా దోపిడీ పద్ధతులు మారాయి. నిమ్నకులాలవారు, అంటరానివారు ఆనాడు ఒక భూస్వామికి, దొరకు ఎట్టి చేసేవారు. నేడు మాత్రం అనేకమంది దోపిడీదారులకు ఎట్టి చేస్తున్నారు. భూస్వాములకు, పెట్టుబడిదారులకు, పాలకవర్గాలకు, వ్యాపారులకు ఎట్టిచాకిరీ చేస్తున్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో దళిత స్త్రీలు వ్యవసాయ కూలీలుగా, ప్రాజెక్టు నిర్మాణాల్లో, రైల్వే నిర్మాణంలో కూలీలుగా, మున్సిపాల్టీ కార్మికులుగా, తాపీ కార్మికులుగా, అగ్రకుల దొరల ఇండ్లలో పనిమనుషులుగా, హమాలీ కూలీలుగా, బీడీ కార్మికులుగా, అనేక అసంఘటిత రంగాల్లో శ్రమ చేస్తున్నారు. ప్రాథమిక విద్య దళిత విద్యార్థినులకు నామమాత్రంగా కూడా అమలు జరుగుటలేదు. ఉన్నత పాఠశాలకు చేరుకొనేవారి సంఖ్య చెప్పనక్కరలేదు. సంక్షేమ వసతి గృహాల్లో చదివే ఈ విద్యార్థినులు అభద్రతకు, లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు, బెదిరింపులకు అనునిత్యం గురౌతున్నారు. ఫలితంగా చదువులు మానుకొనే స్థితికి నెట్టబడుతున్నారు. కొంత చదివినవారు 4వ తరగతి ఉద్యోగాలకే పరిమితం చేయబడుతున్నారు. దళితులకు, స్త్రీలకు, నామమాత్రమైన రిజర్వేషన్లుంటే, ఇక దళిత స్త్రీల సంగతి చెప్పనక్కరలేదు.

మొత్తంగా సమాజంలోని దళిత స్త్రీలు భారత ఆర్థిక రంగంలో పునాది శ్రామికులుగా శ్రమ చేస్తున్నారు. ”దళిత స్త్రీలే సాధారణంగా శ్రామిక స్త్రీలుగా ఉన్నారు” భారత ఆర్థికవ్యవస్థలో ప్రధానమైన వ్యవసాయ రంగంలో, వస్తూత్పత్తి రంగంలో దళిత స్త్రీలు శ్రమ చేస్తున్నారు.

ఈ స్త్రీలు ఆర్థిక పీడనకు, లింగ వివక్షతకు, అదనంగా కుల అణచివేతకు గురౌతున్నారు. పై అణచివేతలో ఉత్పత్తి రంగాలే గాక, రాజకీయ రంగం, రాజ్యాంగ యంత్రాంగాల్లోని కోర్టులు, చట్టాలు, శాసనాలు కూడా భాగాలే.

దళిత స్త్రీలపై అత్యాచారాలు, దాడులు జరిగినపుడు, ఋజువులతో సహా కోర్టుకు వెళ్లినా నిందితుల శిక్షాకాలం తగ్గించడమో, శిక్ష లేకుండా చేయడమో అనేకసార్లు జరగడం మామూలు విషయం. పరారియా జిల్లాలోని దళిత స్త్రీల సంఘటన వల్ల కోర్టు తీర్పు. గుంటూరు జిల్లా పూలమ్మ సంఘటనలు దీనికి

ఉదాహరణలు. దొరల లైంగిక కోరికను తిరస్కరించిన దళిత స్త్రీలను కక్ష గట్టి దౌర్జన్యంగా బలాత్కరించడం, హింసించడం, వికలాంగులుగా చేయడం మామూలుగా జరుగుతుంటాయి. ఇంతేకాకుండా మంత్రాలు, బాణామతులు, చేతబడుల నెపంతో నేరస్తురాలిగా నిలబెట్టి చెట్టుకు కట్టేసి కొట్టడం, సజీవ దహనం చేయడంలాంటి దుర్మార్గాలకు పాల్పడతారు. కులాంతర వివాహాలకు సహకరించారనే నెపంతో నగ్నంగా ఊరేగించి శారీరక హింసకు గురిచేయడం లాంటి అనేక సంఘటనలలో టంగుటూరి ఇందిర, చలకుర్తి ముత్తమ్మలు ఆందోళనల ఫలితంగా వెలుగులోకి వచ్చిన వారు మాత్రమే.

దళిత స్త్రీలపై ఈ అణచివేత రూపాలు, అగ్రకుల పితృస్వామ్య వికృత రూపాలను ఋజువు చేస్తున్నాయి. కులసంఘాల్లో స్త్రీలకు సభ్యత్వం ఉండదు. కుల పంచాయతీల్లో స్త్రీలనే నేరస్థులను చేసే పద్ధతులే అవలంబిస్తారు. మగవారి తప్పులు ఋజువైతే సర్దుకుపోవాలని తీర్పులిస్తారు. మగవాళ్లు లేని కుటుంబాల్లో భూమి తగాదాలున్నప్పుడు అనేక వేధింపులకు గురిచేయటం, కులపెద్దలు అధిక సంఖ్యలో లంచాలు వసూలు చేసి మానసిక వేదనకు గురిచేసి తనకు తాను, ”మొగదిక్కులేనిదాన్ని నా బ్రతుకు ఇంతే” అనే మాటలు అనుకునేలా చేస్తారు. ఇలాంటి వారిపై అనేక సందర్భాలలో నేరాలు మోపి కుల బహిష్కరణకు గురిచేస్తారు. ఈ కుల బహిష్కరణ, కుల పంచాయతీలు స్త్రీలను కించపరిచేవి. పదిమందిలో మాట్లాడి, చర్చించి చొరవను దెబ్బదీసి, మానసిక వేదనకు, పరాధీనతకు గురిచేసి, చైతన్యాన్ని, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేవిగా ఉంటాయి.

కులవ్యవస్థ పరంగా ఉన్న సాంఘిక దురాచారాలు, సతి, జోగిని వంటివి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వీటి నిర్మూలనా చట్టాలు చేసినప్పటికీ తెలంగాణా జిల్లాలలో గ్రామ గ్రామాన ఇద్దరు, లేక ముగ్గురు జోగినీలు తప్పనిసరిగా ఉంటారు. నిజామాబాద్‌ జిల్లా బినోలిలోనే రెండువందలమంది జోగినిలు యిప్పటికీ ఉన్నారు. కోస్తా జిల్లాలలో మాతంగిల పేరుతో పదహారువందల మందికిపైగా కొనసాగుతున్నారు. ఈ వృత్తి పేరుతో శారీరక హింసకు గురై అనేక రోగాలకు బలి కాబడుతున్నారు. జాతరలు, తిరుణాళ్ళలో ”సిడి” అనే సాంప్రదాయ పద్ధతి అమలులోఉంది. గ్రామాల్లో ఎలాంటి కార్యాలు, ఉత్సవాలు జరిగినా అందులో దారి పొడవునా నాట్యం చేస్తున్నప్పుడు చిల్లర డబ్బులు నేలపై పెట్టి నోటితో, కళ్ళతో, మోచేతితో అందుకోవాలని, కల్లు సీసా పెట్టి నోటి పళ్ళతోటే అందుకోవాలని ఆంక్షలు పెడితే అందుకోవడానికి అనేక పాట్లుపడి అలసిపోయి, శారీరక హింస అనుభవిస్తారు. కులవ్యవస్థతో ముడిపడి ఉన్న ఈ సాంఘిక దురాచారాలు పైపై చట్టాలతో, పథకాలతో పోవు అనేది స్పష్టం. మౌలికంగా కులనిర్మూలనా చర్యలు చేపట్టకుండా సాంఘిక దురాచారం పోదు అనేది వాస్తవం. అగ్రకుల దొరల దగ్గర దళిత స్త్రీలు వెట్టిచేసే పద్ధతి నేటికీ గ్రామాలలో కొనసాగుతున్నది. తన కొడుకో లేక తన భర్తో దొర దగ్గర పాలేరుగా ఉంటే ఈమె అంటుకూలీ పేరుతో దొర వద్ద కూలి చేస్తుంది. వేరే పొలంలో ఎక్కువ కూలీ డబ్బులు ఇచ్చే అవకాశమున్నా, వెళ్ళడానికి వీలులేదు. ఎంత తక్కువ ఇచ్చినా అక్కడే కూలి పని చేసే పద్ధతి కొనసాగుతుంది. దళిత కుటుంబాలలో పెళ్ళిళ్ళు జరిగితే పెళ్ళి రోజు మొదట కర్నం, పటేలును బ్యాండు మేళాలతో ఊరేగించుకు రావాలి. పెళ్ళి తర్వాత నూతన దంపతులు ఒక రోజంతా అగ్రకుల దొరల ఇల్లిల్లు తిరిగి గడపకు పూజలు చేసి ‘ఇడిము’ ఇచ్చే సంప్రదాయం ఉంది. నాడు కొత్తగా పెళ్ళయిన అమ్మాయిని దొర మొదట వాడుకోవడం అనే పద్ధతికి ఆనవాలుగా ‘ఇడిము’ పద్ధతి సాంప్రదాయం పేరుతో యింకా కొనసాగుతోంది.

ఉద్యమాల ద్వారా రాజకీయ రంగంలో, విద్యారంగంలో సాధించబడిన రిజర్వేషన్లు నామమాత్రంగా అమలు జరుగుతున్నాయి. శాసనాలు మొదలైనవాటిని చేయడంలో అగ్రకుల దోపిడీదారులు కీలకమైన పాత్ర వహిస్తూ వీరు చేసే ప్రతి కుటిల శాసనాలకు దళిత నాయకులు, స్త్రీలు తలకాయలూపేటట్లు మలచుకోవడం జరుగుతుంది. వీరి పరిస్థితే ఈ విధంగా కొనసాగుతుంటే దళిత స్త్రీ విషయం ఏమిటి? పాలక, ప్రతిపక్ష పార్టీల నాయకత్వాలలో, శాసనాలు, ప్రణాళికలు, చట్టాలు, సవరణలు రూపొందించడంలో దళిత స్త్రీలు లేరు.

దళిత కులాలకు చెందిన స్త్రీలపై దాడులు జరిగినా, అత్యాచారాలు జరిగినా, గుండాలు ఇండ్లు కూల్చినా పోలీసు యంత్రాంగం చూసీ చూడనట్లు ఉండి పట్టించుకోదు. ఈ స్త్రీలు దాన్ని పోలీసుల దృష్టికి తీసుకుపోతే సమస్యను పరిశీలించే ప్రయత్నం కూడ చేయకుండా కులం పేరుతో బూతులు తిట్టడం ప్రధానంగా చేస్తారు. స్త్రీల సమస్యలపై అత్యాచారాలకు వ్యతిరేకంగా మహిళా ఉద్యమాల్లో పనిచేసే సభ్యులను, కార్యకర్తలను, నాయకులను కులం పేరుతో తిడతారు. మాలా, మాదిగ ముండలకు పోరాటాలు కావాలా? థర్డు క్లాస్‌ ముండలని, సోషల్‌ వెల్ఫేర్‌ లంజలని తిడుతూ అవమానపరిచి, చిత్రహింసలకు గురిచేయడం మామూలు విషయమైంది. పోరాట ప్రాంతాలలో పోరాటాలను అణిచివేయడంలో భాగంగా పోలీసులు గ్రామాలపై దాడులకు పాల్పడేటపుడు గ్రామానికి తూర్పుదిశగా దూరంగా ఉన్న మాదిగ, మాల వాడలపై మొదట దాడి చేసి మగ, ఆడవారిని చితకబాదుతారు. స్త్రీలను క్రూరంగా అణిచివేస్తారు. అవమానపరుస్తారు. లైంగిక అత్యాచారాలకు పాల్పడతారు. హత్యలు కూడా చేస్తారు. నిన్నగాక మొన్న అసెంబ్లీ ఎన్నికల సమయంలో పంజాబ్‌ కమెండోలు మంథని ప్రాంతంలో మాదిగ కులానికి చెందిన వృద్ధురాలిని హత్య చేశారు. పోచంపాడులో పోచమ్మ అనే మైనర్‌ బాలికను చిత్రహింసలు పెట్టి చంపివేశారు. రంగారెడ్డి జిల్లాలోని వికారాబాదులో పార్వతమ్మపై పోలీసులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె న్యాయం కోసం కోర్టుకు వెళితే తక్కువ కులానికి చెందిన స్త్రీ తిరుగుబోతు, వ్యభిచారి కనుక నిందితులకు శిక్ష లేకుండా చేశారు. పైన పేర్కొన్న సంఘటనలు కేవలం వెలుగులోకి వచ్చినవి మాత్రమే. వెలుగు చూడనివెన్నో.

దళిత ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కోసం అగ్రకుల దొరలు స్త్రీలపై లైంగిక అత్యాచారాన్ని ఆయుధంగా ఉపయోగించుకోవడం ఒక పద్ధతిగా ఎంచుకున్నారు. రాజ్యాంగ యంత్రాంగం కూడా ప్రజా పోరాటాలను అణచివేయడం కోసం యిదే పద్ధతి అవలంబిస్తోంది. కుదురుపాక రాజవ్వ, బండలింగాపురం రమణక్క, మెడెం రామక్క, మద్దికెరలో ఇద్దరి స్త్రీలపై జరిగిన అత్యాచారాలు మరిచిపోలేము. అగ్రకుల దొరలు, పోలీసు యంత్రాంగం పాల్పడే అత్యాచారాలకు వ్యతిరేకంగా, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు అనేక సందర్భాలలో జరిగాయి. 70 సంవత్సరాలుగా కమ్యూనిస్టు విప్లవకారులు నిర్వహిస్తున్న పోరాటాలలో, కుల నిర్మూలనా దృక్పథంతో బ్రాహ్మణీయ సామాజిక వ్యవస్థ నిర్మూలనకై జ్యోతిబాఫూలే, డా|| అంబేద్కర్‌, పెరియార్‌ల నాయకత్వాన జరిగిన పోరాటాలలో సగభాగం స్త్రీలు, ప్రధానంగా దళిత స్త్రీలు పునాదిగా ఉంటూ పాల్గొన్నారు. పాలకుర్తి ఐలమ్మ, ఎలీసమ్మ, సావిత్రిబాయి మొదలగువారు ఈ పోరాటాలలోనే అమరులైనారు. వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగే పోరాటాలలో పాల్గొంటున్నారు. ఈ పోరాటాల కొనసాగింపుగా ఆంధ్రప్రదేశ్‌లో చారిత్రాత్మకమైన సారా వ్యతిరేక పోరాటం ముందుకొచ్చింది. అంతేకాక దళిత స్త్రీల పోరాటంగా రూపుదాల్చింది.

20వ శతాబ్దాన్ని మనం భారత సమాజంలో విముక్తి పోరాటాల యుగం అంటున్నాం. దోపిడీ పాలక వర్గాలకు వ్యతిరేకంగా పీడిత వర్గాలు, అగ్రకుల భూస్వాములకు వ్యతిరేకంగా దళితులు, పితృస్వామ్య పీడనకు వ్యతిరేకంగా స్త్రీలు, దోపిడి పాలకులకు, సామ్రాజ్యవాద దోపిడికి వ్యతిరేకంగా గిరిజన తెగలు, హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా మైనారిటీ ప్రజలు నిర్వహించే పోరాటాలు నిర్దిష్ట రూపాలుగా ఉవ్వెత్తున ముందుకొస్తున్నాయి. అంతిమంగా బ్రాహ్మణీయ, పితృస్వామ్య దోపిడి వ్యవస్థను కూల్చేందుకు ముందుకొస్తున్నాయి. ఈ ఉద్యమాలన్నింటిలో సగభాగంగా స్త్రీలు పాల్గొంటున్నారు. చోదక శక్తులుగా దళితులు, దళిత స్త్రీలు పాల్గొంటున్నారు.

పీడిత వర్గాలలో భాగంగా రాజకీయ, ఆర్థిక, సాంఘిక దోపిడీలతోపాటు అదనంగా స్త్రీలు పితృస్వామ్య పీడనను ఎదుర్కొంటు న్నారు. ఈ ప్రత్యేక పీడనకు వ్యతిరేకంగా నిర్మాణాత్మకమైన

ఉద్యమాలు నిర్మిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే 1994 జనవరిలో తిరుపతిలో జరిగిన అఖిల భారత మహిళా సదస్సు దళిత స్త్రీల గూర్చి చర్చించి వీరు రాజకీయ, ఆర్థిక, పితృస్వామ్య పీడనతోపాటు అదనంగా కుల అణచివేతకు గురవుతున్నారు అని ప్రకటించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని దళిత, గిరిజన మహిళల పోరాట దినంగా ప్రకటించి నిర్వహించాలని పిలుపునివ్వడాన్ని అభివృద్ధికరమైన ముందడుగుగా భావించాలి.

ఉద్యమాలకు చోదక శక్తులైన దళిత స్త్రీలకు ఆత్మగౌరవ చైతన్యాన్ని అందించి స్త్రీ విముక్తి ఉద్యమాల్లో కలుపుకు రావాల్సిన అవసరమెంతైనా ఉంది.    (భూమిక జనవరి – మార్చి 1993)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.