తొలి ఉపాధ్యాయుడు – చింగీజ్‌ ఐతమాతోవ్‌- ఉమా నూతక్కి

తిలక్‌ కవిత ”ఆ రోజులు” చదివారా. కొన్ని పుస్తకాలు చదివినప్పుడు తిలక్‌ రాసిన ”ఆ రోజులు” గుర్తొస్తాయి. ముఖ్యంగా రష్యన్‌ పుస్తకాలు. ఆ రోజుల్ని తలచుకున్నప్పుడలా ఆనందం లాంటి విచారం కలుగుతుంది … అంటూ ఇంకా ఇలా గుర్తు చేసుకుంటాడు తిలక్‌… ఆ కవితలో

పచ్చని పచ్చికల మధ్య

విచ్చిన తోటల మధ్య

వెచ్చని స్వప్నాల మధ్య

మచ్చిక పడని పావురాల మధ్య

మనం చెప్పుకున్న రహస్యాలు

మనం కలలుగన్న ఆదర్శాలు..

పాత రష్యన్‌ పుస్తకం ఏది దొరికినా ఆ కవిత గుర్తు వస్తుంది. పుస్తకాలతో ఊయలూగిన బాల్యం.. ఆ రోజులు మళ్ళీ రమ్మన్నా రావు. గోర్కీ సాహిత్యం.. మార్క్స్‌, ఏంగిల్స్‌ జీవిత చరిత్రలు.. అదే ఊపులో సోవియట్‌ విప్లవ గాధలూ.. పిల్లల జానపద కథలూ.. ఒక్కటేమిటి కనిపించిన ప్రతీ సోవియట్‌ పుస్తకాన్నీ ఇష్టంగా చదివేసి సోవియట్‌లో జరిగిన విప్లవం ఇక్కడా పునరావృతం కావాలన్న కలలూ.. కలలూ.. అదే అప్పటి జీవితం.

టాల్‌స్టాయ్‌ ”యుద్ధమూ – శాంతీ” గోర్కీ ”అమ్మ” వీటి కోవల్లోకే వస్తాయి చింగీజ్‌ ఐతమాతోవ్‌ రచనలు. చింగీజ్‌ ఐతమాతోవ్‌ – కిర్గిస్తాన్‌కు చెందిన రచయిత. రష్యన్‌, కిర్గిజ్‌ భాషల్లో రచనలు చేసినా ఆయన రచనలు వందపైచిలుకు భాషల్లోకి అనువాదం అయ్యాయి. ఆయన రాసిన పుస్తకాలు ”జమీల్య”, ”తల్లి భూదేవి”తో పాటు అత్యంత ఆదరణ పొందిన ఇంకో పుస్తకం ఈ నెల మీకు పరిచయం చేయబోతున్న ”తొలి ఉపాధ్యాయుడు”.

toliupadhyayudu-cover copy

మారుమూల కిర్గీజ్‌ ప్రాంతంలో తొలి పాఠశాలను స్థాపించి… నవ సమాజ నిర్మాణం కోసం ఒక యువ ఉపాధ్యాయుడు పడ్డ తపనను, ఆ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్ళను మనసుకి హత్తుకునేటట్లు హృద్యంగా చెప్తారు రచయిత. 150 సంవత్సరాల క్రితం ఐత్‌మాతోవ్‌ రాసిన రచనలు ఇప్పటికీ వన్నె తగ్గకుండా సమకాలీన రచనల్లా అలరించడానికి కారణం ఆయన స్పృశించిన సార్వజనీన, మానవీయ భావనలే కారణం. అంతే కాక ఆయన జీవితాన్నీ… సామాజిక పునాదులను కుదిపేసిన అప్పటి కాలాన్ని కూడా మనం తరచి తరచి గుర్తు వేసుకోవాలి. అందుకే ఒక అనామక ప్రాంతంలో అత్యంత అనామకంగా పుట్టి పెరిగి కేవలం తన రచనల ద్వారానే విశ్వవ్యాప్త ఖ్యాతి పొందుతూ కిర్గిస్తాన్‌ జాతిపితగా ప్రజల గుండెల్లో చిరస్థాయి పొందారాయన.

ఇక కధలోకి వెళ్తే, కధ ఒక చిత్రకారుడి కథనంతో మొదలవుతుంది. కిర్గీజ్‌ దేశంలో కుర్కురేవు కొండ దిగువన ఉన్న విశాల పీఠభూమి కింద అతని ఊరు ఉంటుంది. జలజల ప్రవహించే సెలయేళ్ళు, పల్లె లోతట్టున విస్తరించి ఉన్న పసిమి లోయ, సైప్‌ మైదానం గురించి చెప్పాలంటే మన మాటలు చాలవు. రచయిత వర్ణన చదవాల్సిందే. పల్లెకు ఆనుకుని ఉన్న దిబ్బ మీద రెండు పోప్లార్‌ వృక్షాలు ఉంటాయి. ఆ దిబ్బ పేరు ”డ్యూషన్‌ బడి” దిబ్బ. పేరు వినడమే తప్ప ఆ డ్యూషన్‌ ఎవరో ఆ పిల్లలకు తెలియదు. అసలు అలాంటి బడి ఒకటి ఉండేదని కూడా ఎవరూ నమ్మరు.

అలాంటి రోజుల్లో ఒకనాటి శరత్‌ కాలంలో గ్రామ సమిష్టి క్షేత్రం స్వంతంగా ఒక అధునాతన పాఠశాల నిర్మించుకుంటూ.. ఆ ప్రారంభోత్సవానికి రమ్మని చిత్రకారుడికి కూడా ఆహ్వానం వస్తుంది. ఆహ్వానితులలో కిర్గీజ్‌ దేశపు అత్యుత్తమ విద్యావేత్తలలో ఒకరైన అల్తినాయ్‌ కూడ ఉన్నట్లు అతనికి తెలుస్తుంది. అల్తినాయ్‌ కూడా ఆ ప్రాంతానికి చెందిన మహిళే. ప్రారంభోత్సవం నాడు అల్తినాయ్‌కి గ్రామస్థులు సన్మానం చేస్తారు. సన్మాన కార్యక్రమం జరుగుతుండగా… డ్యూషన్‌ అనే ఒక ముసలి వయస్కుడు ఆ ఊరి పోస్ట్‌మెన్‌గా పనిచేస్తున్నాడని అల్తినాయికి తెలుస్తుంది. బడి ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చిన టెలిగ్రాంలు అందచేయడానికి ఎంతో శ్రమపడి సమయం మించిపోకుండా వచ్చాడనీ .. చదువంటే అతనికి ఎంతో అభిమానం అనీ అందరూ అనుకుంటుంటే అతనే తమ తొలి ఉపాధ్యాయుడనీ గుర్తిస్తుందామె. అయితే ఎవరికీ ఆ విషయం చెప్పకుండా అర్ధాంతరంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక పశ్చాత్తాపంతో తన గత చరిత్ర చెప్తూ మన చిత్రకారుడికి ఒక లేఖ వ్రాయడంతో అసలు కథ మొదలవుతుంది.

1924 సంవత్సరంలో జరిగిన కథ అది. మారుమూల

ఉన్న కిర్గీజ్‌ దేశపు ఒకానొక పల్లెటూరిలో అసలు చదువు, బడి అంటే విడ్డూరంగా ఉండే రోజులవి. ఇంకా పురాతన ఫ్యూడల్‌ పద్ధతులు రాజ్యమేలుతున్న రోజులవి. కుటుంబానికి ఒకరు చెప్పున తప్పనిసరిగా యుద్ధానికి యువకులంతా వెళ్ళాల్సిన రోజుల్లో ఆధునికతకూ, సాంప్రదాయాలకూ మధ్య తలెత్తే వైరుధ్యాలూ… ఒత్తిళ్ళూ అన్నీ ఇన్నీ కావు. అల్తినాయ్‌ కుటుంబం కూడా అందుకు అతీతం కాదు. అలాంటి ఆనంద రహిత జీవితాల్లోకి ఒక రోజు డ్యూషన్‌ దిగివస్తాడు.

పిన్నలనీ పెద్దలనీ… బ్రతిమిలాడి భయపెట్టీ చదువు నేర్పిస్తాడు. మొదటి రోజు బడికి వచ్చిన పిల్లలకు లెనిన్‌ చిత్తరువు చూపించడం… లెనిన్‌ గొప్పదనం తెలియచెప్పడం… ఓనమాలతో పాటు పిల్లలకు విప్లవం అన్నపదాన్ని ముందుగా నేర్పడం ఈ క్రమం అంతా మాటల్లో చెప్పలేం చదివి తీరాల్సిందే. చదువులో చురుగ్గా

ఉన్న అల్తినాయ్‌ని పై చదువుల కోసం పట్టణం పంపాలని కలలు కంటాడతను. అయితే అల్తినాయ్‌ మారుటి తల్లి ఆమెకి ఒక దుష్టుడితో బలవంతంగా పెళ్ళి చేయడానికి నిర్ణయిస్తుంది. పెళ్ళికి ఒప్పుకోని అల్తినాయ్‌పై అత్యాచారం చేస్తాడు ఆ దుర్మార్గుడు. ప్రాణాలను ఫణంగా పెట్టి ఆమెని రక్షించిన డ్యూషన్‌ ఆమె పై జరిగిన దౌర్జన్యం కేవల శారీరకమైన గాయం అనీ… అన్నీ మర్చిపోయి ధైర్యంగా చదువుకోమనీ… చెప్పి రహస్యంగా రైలు ఎక్కించి ఆమెను పట్టణం పంపిస్తాడు.

ఆ క్షణంలో అంతటి దుఃఖంలో అల్తినాయ్‌ మనసులో అవిష్కృతమయిన అందమైన భవిష్యత్తూ… ఆ స్వేచ్ఛా ప్రియురాలి మనస్సులో నెలకొన్న ఆత్మాభిమానమూ… ఆ యవ్వన హృదయంలో తొలివలపు భావాలూ… ఇవన్నీ రచయిత చెప్పే పద్ధతి అపురూపం. ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా తాను పెద్దగా చదువుకోకపోయినా కేవలం లెనిన్‌ స్ఫూర్తితో తన తరువాతి తరం అయినా మంచి చదువులు చదవాలన్న డ్యూషన్‌ పాత్ర చిత్రీకరణ ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతం. ఇంతా సాధించీ చివరకు ఎవరూ గుర్తు పట్టని అనామకుడిగా అత్యంత సాధారణంగా ఒక పోస్ట్‌ మేన్‌గా మిగిలిపోయిన డ్యూషన్‌… తాను చదివించి ప్రయోజకురాలిని చేసిన అల్తినాయ్‌ ముఖ్య అతిథిగా వచ్చిన స్కూల్‌కి అభినందనల టెలిగ్రాంలు ఇచ్చి నిర్వికారంగా వెళ్ళిపోవడం మన మనసుల్ని మెలిపెడుతుంది.

”లెనిన్‌ని గౌరవించినట్లుగా మనం సామాన్య వ్యక్తులను గౌరవించే గుణాన్ని ఎప్పుడు పోగొట్టుకున్నాం” అంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ అల్తినాయ్‌ వ్రాసిన ఉత్తరాన్ని మనమూ కన్నీళ్ళతోనే చదువుతాం. డ్యూషన్‌ గురించి తమ గ్రామానికే కాక దేశానికి తెలియవలసింది చాలా ఉందనీ… తమ తొలి ఉపాధ్యాయుడు డ్యూషన్‌కు గౌరవంగా తమ స్కూల్‌ పేరు డ్యూషన్‌ స్కూల్‌గా నామకరణం చేయమనీ అల్తినాయ్‌ కోరడంతో కథ ముగుస్తుంది. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా తమ తమ సమాజాలకి ఎంతో మేలు చేసిన అజ్ఞాత మహానుభావులు ఎందరో ఈ పుస్తకం చదివాక మనకి గుర్తుకు రాక మానరు.

తాను రాసిన లేఖ చివర్లో అల్తినాయ్‌ ఇలా అంటుంది.

”కొండల్లో నీటి బుగ్గలు ఉంటుంటాయి. కొత్త రోడ్డు వేసినప్పుడు, నీటి బుగ్గకు వెళ్తూండిన బాట మరుగున పడిపోతుంది. బాటసార్లు దాహం తీర్చుకోవడానికి వెళ్ళడమూ తగ్గిపోతుంది. అందరూ దాని గురించే మర్చిపోతారు. ఎప్పుడో ఒకసారి ఎవరో ఒక బాటసారి అక్కడకు వెళ్తాడు. ఆవంతైనా బురద లేకుండా… స్వచ్ఛంగా ఉన్న ఆ నీటి బుగ్గని చూసి ఆశ్చర్యపోతాడు. ఇలాంటి ఒక స్థలం ఉందనీ… దాని గురించి ప్రపంచానికి తెలియకపోవడం పాపం అనీ అనుకుంటాడు. నా తొలి ఉపాధ్యాయుడి గురించి ప్రపంచానికి తెలియకపోవడమూ అంతే”

ఐతమాతోవ్‌ రచనా కౌశలాన్ని చెప్పడానికి పై పదాలు చాలు. ”రచయిత తన అంతరాత్మను ఆవిష్కరించడం కన్నా తన సమాజం అంతరాత్మగా ప్రతిధ్వనించడమే ముఖ్యం” అన్న గోర్కీ మాటలను ఆయన శిరసావహించారు. ఒక రచయిత నిబద్ధతకు ఎటువంటి భేషజాలూ లేకుండా మార్పును ఆహ్వానించడం, ఆవిష్కరించడమే నిజమైన కొలమానమని వ్యాఖ్యానించేవారాయన. అందుకే ఆయన సోవియట్‌ వాస్తవికతలోని చీకటి కోణాలనూ నిష్కర్షగా తన రచనల్లో ఆలోచనాత్మకంగా ప్రతిబింబించారు. యుద్ధం సామాన్యుల జీవితాల్లో రేపే సంఘర్షణ ఆయన రచనల్లో అత్యంత సహజంగా చిత్రీకరించబడుతుంది.

అందుకే కిర్గీజ్‌ జాతిపితగా పేరు పొందిన ఆయన రచనలను ఆ దేశంలో ప్రతీ కుటుంబం మళ్ళీ మళ్ళీ చదువుతుంది. తన రచనల ద్వారా ఆ దేశానికి గుండె ధైర్యం నూరిపోసారాయన. కళాత్మకమైన దార్శనికతతో ఎంత సాధించవచ్చో, దాని శక్తి సామర్థ్యాలేమిటో ప్రపంచానికి నిరూపించిన రచయిత ఐతమాతోవ్‌. అందుకే ఆయన రచనలు అందరం చదివితీరాలి.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

One Response to తొలి ఉపాధ్యాయుడు – చింగీజ్‌ ఐతమాతోవ్‌- ఉమా నూతక్కి

  1. వనజ తాతినేని says:

    పుస్తక పరిచయం చాలా ఆసక్తిగా ఉంది . చదవాలి . థాంక్ యూ ఉమా గారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>