కేదలా బొగ్గు గనుల దగ్గర మొదటి మీటింగు – రమణిక గుప్తా , అనువాదం: సి. వసంత

1968 సం|| డిసెంబరు 5న మీటింగ్‌ జరపాలని ప్రకటించారు. బెంగాల్‌ నుండి ఒక సమాజవాది నేత (ఇప్పుడు ఆయన పేరు నాకు గుర్తు లేదు.) నాతో వస్తానన్నారు. హజారీబాగ్‌ ప్రెస్‌ రిపోర్టర్‌ రాజేంద్ర రాణా (సర్చలైట్‌), బర్రీబాబు (టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా) అభిజిత్‌ సేన్‌ (పి.టి.ఐ), బ్రజ్‌మోహన్‌ బాబు (ఆద్యావర్త్‌), గడీబాబు (అమృత బజార్‌) మొదలైనవారు మీటింగుకి వచ్చారు. కేదలా కార్మికులకు మా అడవి పోరాటం గురించి తెలుసు. టాటా కంపెనీ వెస్ట్‌ బొకారో ఘాటో గనుల యాజమాన్యం వ్యతిరేకంగా స్కూల్‌కోసం చేసిన ఉద్యమం, కలిగిన విజయం, వాళ్ళకు తెలుసు. 144 సెక్షన్‌ కింద కేసు నమోదు అయినా నేను ప్రకటించిన తిథి ప్రకారం స్కూల్‌కి పునాది రాళ్ళు వేయడం అయింది. 20, 25 గ్రామాల ప్రజలు కూడా కార్మికులకి సపోర్టుకి వచ్చారు. నేతల శక్తి వాళ్ళలో ఉన్న పోరాటం చేయాలి అన్న తపనలను చూసి కార్మికులు వాళ్ళని ఎంతో నమ్ముతారు. ఒక్కసారి నమ్మకం కలిగిందా వాళ్ళకోసం ప్రాణాలు సైతం ఇవ్వడానికి సిద్ధం అవుతారు. వాళ్ళు తమ నేతలని తొందరగా మరచిపోరు.

డిసెంబరు 5 న మీటింగు పెట్టాలని నిర్ణయించాం. మా ఎదురుకుండా మూడే మార్గాలు ఉన్నాయి. మీటింగ్‌ అన్నా పెట్టాలి. లేకపోతే చావనైనా చావాలి. లేకపోతే పారిపోనైనా పోవాలి. మీటింగ్‌ జరిపించాలి అంటే యూనియన్‌ని పెట్టడమే. చావడం అంటే పారిపోవడం అంటే ఇక అక్కడ ఏ యూనియన్‌ ఏర్పాటు కాదు. చీకటి పడసాగింది. మేం అందరం వేదిక మీద ఉన్నాము. చౌక్‌లో మూడువైపులా కార్మికులు ఉన్నారు. మూడు మార్గాలు మూసివేయబడ్డాయి. ఏ దుకాణాదారుడు కూడా కాంట్రాక్టర్ల భయంవలన కనీసం లాంతర్లు కూడా ఇవ్వలేదు. చలిబాగా పెరిగింది. చిన్న పిల్లలను ఒళ్ళో పెట్టుకుని వేదికముందు స్త్రీ కార్మికులు కూర్చున్నారు. వేదిక చాలా చిన్నది. వెనక మొగవాళ్ళు కూర్చుని ఉన్నారు. కొంతమంది కార్మికులు దూరంగా నిల్చున్నారు. మెల్లి, మెల్లిగా జనం ఎక్కువ కాసాగారు. రెండువేలమంది దాకా జనం వచ్చారు. పహల్‌వాన్లు గుడిసెల వెనక, దుకాణాల వెనక ఒక వరసలో కార్మికుల వెనక నిల్చున్నారు. వాళ్ళ చేతుల్లో బరిసెలు, దుడ్డు కర్రలు, గొడ్డళ్ళు ఉన్నాయి. పోలీసులు కూడా వచ్చారు. రామ్‌గఢ్‌ నుండి ఇన్‌స్పెక్టరు శ్రీకొవార్‌, పిస్తోళ్ళతో తయారుగా ఉన్న టోలీని తీసుకుని మేజిస్ట్రేట్‌తో పాటు ఆచోటికి వచ్చారు. పాత్రికేయులు కార్మికుల సంకల్పాన్ని చూసి ఆశ్చర్యపోయారు. చుట్టుపక్కల బొగ్గుల కుంపట్లు మండుతున్నాయి. వీటి వెలుతురు అప్పుడప్పుడు రావడం వలన కొంచెం వెలుతురుగా ఉంది. దూరంగా గనుల దగ్గర భట్టీలు ఉండటం వలన మంటలు లేస్తున్నాయి. మధ్యమధ్యలో పోలీసులు ఎంతమంది పహల్‌వాన్లు ఉన్నారో, ఎన్ని గుంపులు ఉన్నాయో చూడడానికి టార్చ్‌ వేసేవారు. టార్చ్‌ మీద పడగానే వాళ్ళందరు ముఖాలకు చేతులు అడ్డం పెట్టుకునేవారు. వీళ్ళకి చీకట్లో ఉండటం అలవాటు. వెలుతురు పడేసరికి ఇంకా ఎక్కువ చీకటిగా అనిపిస్తుంది. దుకాణాలలో దీపపు బుడ్డీలు మిణుకు మిణుకుమంటూ వెలుగుతున్నాయి. గాలి వీస్తోంది కనక వాటిని బయట పెట్టలేదు. ఒక దుకాణంలో లాంతరొలోని దీపం వెలుగుతోంది. దాని నీడ ఉండి ఉండి పెద్దదవుతూ ఉంది.

కార్మికులలో ఎన్నో సంవత్సరాల నుండి లోపల పాతుకుపోయిన భయం, ఏళ్ళతరబడి ఉన్న బానిసత్వపు అలవాట్లు వెట్టి చాకిరీ చేసే స్వభావం ఈ రోజున అన్నీ చెలియలి కట్టలను, కంచెలను తెంచుకుని చీకటిలో పూర్తిగా లీనం అయిపోయినందుకు చీకటి ఇంకా చిక్కపడ్డది. డిసెంబరు 5 వాళ్ళ సంకల్పానికి గీటురాయి. బానిసత్వం నుండి విముక్తి, యూనియన్‌ను నిలబెట్టడం, లేకపోతే మళ్ళీ బానిసత్వంలోకి రావడం – నిర్ణయం జరిగే రాత్రి ఆ రాత్రి. పదివేలమందిలో రెండువేల మంది దాకా వచ్చారు. ఏమైనా అదొక వెల్లువ. ఈ రెండువేల సంఖ్య రెండు మూడొందల మంది చిరుకాంట్రాక్టర్ల సంఖ్య కన్నా పెద్దదే. అందువలన ఆ సభలో నేను చద్దిమూట లాంటి మాటలు మాట్లాడాను. ”మీరందరు అసలైన పహల్‌వాన్లు, ఇదిగో ఈ బరిసెలు దుడ్డు కర్రలు – కటారులు తీసుకుని నిలబడ్డారే వాళ్ళందరు కిరాయి పహల్‌వాన్లు, గుండాలు. మీతో ఎవరూ పోటీకి రాలేరు.”

బాగా చలిగా ఉంది. అందరు ముడుచుకుని-ముడుచుకుని కూర్చున్నారు. నేను ఎప్పుడు స్వీట్‌ ఇస్తానా అని అందరు ఎదురు చూస్తున్నారు. వెనక నిల్చుని ఉన్న గుండాల చేతులలో గొడ్డళ్ళు తళ-తళ మెరిసిపోతున్నాయి. కూర్చున్న వాళ్ళందరికి ఆ మెరుపులు తమ గొంతును నులిమేస్తున్నాయి అన్నట్లుగా అనిపించింది. ఒక్కసారిగా వాళ్ళల్లో ఒణుకు పుట్టింది. కాని వెంటనే వాళ్ళను వాళ్ళు సంబాళించుకున్నారు. ధైర్యం తెచ్చుకున్నారు. అక్కడ కూర్చున్న స్త్రీలు – పురుషులు ఆ గుండాల చేతుల్లోని పదునైన బరిసెలు, ఈటెలు  తమకి, తమ పిల్లల గుండెల్లో గుచ్చుకున్నట్లుగా ఊహించి వాటిని, తమలోని భయాన్ని పిడికిటిలో కాగితాన్ని నలిపి పారేసినట్లుగా ఊహాలోకంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళందరు తమని తాము సంబాళించుకుంటూ పిల్లలని గుండెలకి హత్తుకోసాగారు. భయం, సంకల్పం, యుద్ధం జరుగుతునే ఉంది. ఏదైనా అనుకోని విధంగా అలజడి కలిగితే వాళ్ళు వెంటనే తలలు పైకి ఎత్తి గుండాలవైపు చూసేవాళ్ళు. వాళ్ళ కళ్ళల్లో యుద్ధానికి సిద్ధం అన్న సంకల్పం కనిపించేది. నిజానికి వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఆయుధాలు లేవు. ఆడ కూలీలు తమ తమ సంచులలో రాళ్ళను నింపుకున్నారు. పోలీసులు స్టేజి మీదకి వచ్చి మేజిస్ట్రేట్‌ ఇచ్చిన సందేశాన్ని చెప్పారు – సెక్షన్‌ 144 అమలు అయింది. మీరు గుంపులు గుంపులుగా ఉండటానికి వీలు లేదు. ఈ మీటింగు జరపడానికి వీలు లేదు. అందరు వెళ్ళిపోండి.

ఎవరు వెళ్ళిపోలేదు. స్టేజిమీద కూర్చున్న వాళ్ళలో కాని ఎదురుకుండా కూర్చున్న వాళ్ళలోకాని ఒక్కరు కూడా లేవలేదు. వాళ్ళ పట్టుదలకు జోహార్లు. లోయవాసులు మాత్రం భయపడ్డారు.

నేను స్టేజిమీద నుండే ప్రభుత్వానికి జవాబు చెప్పాను- ”144 సెక్షన్‌ కేవలం మాకోసమే కాదు. ఎదురుకుండా ఉన్న గుండాల దగ్గర ఆయుధాలు ఉన్నాయి. ముందువాళ్ళను అరెస్ట్‌ చేయండి. తరువాత మమ్మల్ని. మేం అందరం శాంతి పూర్వకంగా కూర్చున్నాము. ఈ చౌక్‌లోనే ఎప్పుడూ కూలీలు సమావేశమౌతారు. కానీ అనుకున్నంత సంఖ్యలో లేరు. మేం మీటింగ్‌ చేస్తాము. శాంతి భంగం అయితే యాక్షన్‌ తీసుకోండి. స్టేజీమీద నలుగురే ఉన్నారు. వాళ్ళని అరెస్ట్‌ చేయండి చూద్దాం.”

ఇన్‌స్పెక్టర్‌కి తెలుసు అరెస్ట్‌ చేయడమంటే ఏమిటో. సంఖ్యలో ఆ పోలీసులు, గుండాలకంటే మా సంఖ్యే ఎక్కువగా ఉంది. వాళ్ళు కూలీలలోని పట్టుదలని పసికట్టారు. కూలీలు ఒక్కసారిగా ఎలుగెత్తి జయఘోష చేసారు – ‘మీటింగు జరిగి తీరుతుంది’. మేజిస్ట్రేట్‌ మౌనంగా ఉండిపోయాడు.

పోలీసులు వెనక్కి వెళ్ళి నిల్చున్నారు. ప్రెస్‌వాళ్ళు నన్ను చుట్టుముట్టారు. కూలీలను వాళ్ళు ప్రశ్నించారు – ‘పిల్లలను ఇంత చలిలో ఎందుకు తీసుకు వచ్చారు?’

ఆడవాళ్ళు జవాబు చెప్పారు – ‘ఆ కాంట్రాక్టర్లు మీటింగుకి వచ్చిన వాళ్ళను అక్కడే చంపేస్తాం అంటూ మమ్మల్ని బెదిరించారు. చస్తే అందరం కలిసే చద్దాం అని మేము పిల్లల్ని కూడా తీసుకు వచ్చాం. మేము సంచులలో రాళ్ళను తీసుకు వచ్చాం. మేము చచ్చేముందు ఓ ఇద్దరు ముగ్గురిని చంపి మరీ చస్తాం.’

రాత్రి పదకొండు గంటలయింది. మీటింగు జరిగింది. ”మీకు ఎలుకల్లా గిల గిలా కొట్టుకుంటూ చావాలని ఉందా లేకపోతే బయటకి వచ్చి స్వేచ్ఛకోసం పోరాడి జీవించాలని ఉందా?” నేను ప్రశ్నించాను.

కూలీలందరు పోరాటం జరపాలనే నిర్ణయం తీసుకున్నారు.

మీటింగు జరిగింది. కాని ఇప్పుడు నేను ఈ కేదలా నుండి సురక్షితంగా ఎట్లా బయట పడగలనా అన్న ప్రశ్న తలయెత్తింది. కేదలా నుండి నన్ను సురక్షితంగా పరేజ్‌ బంగ్లా దాకా ఘాటో-చరహీ రోడ్డు వరకు తీసుకు వెళ్ళడానికి పోలీసులు తయ్యారు. కాని కూలీలకు వాళ్ళమీద నమ్మకం లేదు. చివరికి కూలీలు పిల్లా-జెల్లాతో ఏడు కిలోమీటర్లు ఎముకలు కొరికే ఆ చలిలో నడిచి నన్ను పరేజ్‌ రోడ్డు దాకా వదిలిపెట్టి మళ్ళీ నడుచుకుంటూ వెనక్కి వెళ్ళిపోయారు. నేను సురక్షితమైన చోటుకి చేరాకే కూలీలు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు పిలవని పేరంటానికి వచ్చిన అతిథులలాగా వెనక వెనక నడిచారు. వాళ్ళు కూలీలలో ఉన్న పట్టుదలని చూసి ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోవడమే కాదు భయభీతులు అయ్యారు కూడా.

డిసెంబరు 5, 1968 కేదలా కూలీల చరిత్రలో ఒక మరపురాని సంఘటన. ఈ సంఘటన చరిత్రాత్మకమైనది. దీని తరువాత మేం ఎవరు మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. ముందంజే మా సంకల్పం. మా ప్రాణం. పోరాటాలు, ఉద్యమాలు, నిరాహారదీక్షలు, హింస హత్యల షడయంత్రాలను ఛేదించడం… కోర్టులను ముట్టడించడం… జడ్జిని ముట్టడించడం… రాజ్యసభలో యాచిక సమితి దగ్గర సాక్ష్యాలు… కేసులు… బొగ్గుగనుల మూసివేత… ఆకలి… కాల్పులు… అన్నింటినీ ఎదిరిస్తూ ముందడుగు వేసాం… ఎక్కడ తలవంచలేదు. కూలీల సంఘం చుట్టుపక్కల ఊళ్ళల్లో దొరికే ఆకులు – అలములను ఉడికించి తిని ఆకలి తీర్చుకుంది. ఎలుకల బొరియలలో దొరికిన ధాన్యాన్ని ఉడికించి తిని ఆకలి మంటలను ఆర్పుకుంది. ప్రేత వస్త్రాలకోసం పలువైపుల పరపరివిధాల పరుగెత్తి డబ్బులను చేకూర్చుకుంది… అంతేకాని కించిత్‌ కూడా తన మనోబలాన్ని కోల్పోలేదు. మా మనోబలాన్ని కూడా కోల్పోకుండా చూసుకుంది. ఉద్యమంపై వాళ్ళకెంత నమ్మకమో… అసలు ఈ పోరాటం చరిత్రకే వన్నె తెచ్చింది. వేజ్‌ బోర్డు షరతులు ఇవి – కాంపెన్‌సేషన్‌ పొందడం, హాజరీ తీసుకోవడం, బోనస్‌ పొందడం, ఒక సంవత్సరం దాకా గ్యారంటీగా పని ఇవ్వాలి. గుర్తింపు కార్డు, సి.ఎమ్‌.పీ.ఎఫ్‌ లో సభ్యత్వం, ఈ బొగ్గుగనులన్నింటిని కోకింగ్‌ కోల్‌కింద ప్రభుత్వం తీసుకోవడం, దీని కోసం కోర్టులకు వెళ్ళివచ్చినా వెనకంజ వేయకుండా ఉండటం, గవర్నమెంట్‌ సూచికలో ఈ కేదలా గనులను తిరిగి చేర్చడం. ప్రతీ విషయంలోను కూలీ సంఘాలదే విజయం.

బొగ్గు గనులన్నీ నేషనలైజ్‌ అయ్యాక కూడా కూలీల నియామకంలో భయంకరమైన సంఘర్షణ చేయాల్సివచ్చింది. కాంట్రాక్టర్లు వీళ్ళ రికార్డులను మాయం చేసారు. జాలీ రికార్డులను తయారుచేసి తమ బంధువులకు ఉద్యోగాలను ఇప్పించాలని పన్నాగాలను పన్నడం మొదలు పెట్టారు. వాళ్ళకోసం కొత్తనేతలు కూడా తయారయ్యారు. ఈ దొంగ కూలీల కోసం వాళ్ళు పోరాటం మొదలు పెట్టారు. 1968 నుండి 1976 వరకు కేదలా పోరాటం జరుగుతూనే ఉంది, ఆయా క్షేత్రాలలో శ్రామిక వర్గాల పోరాట చరిత్ర ఇది. ఈ ఉద్యమాల గురించి రాబోయే అధ్యాయాలలో చెబుతాను. శ్రామికుల ద్వారా ఈ బంజరు భూమిపై విత్తనాలను నాటడం కోసం జరిపిన సంఘర్షణ, నాగలితో దున్నడం కోసం వాళ్ళు పడ్డపాట్ల గురించిన వివరణ ఈ అధ్యాయంలో ఉంది. నిజానికి ఇది భూమిక మాత్రమే. రాక్షసుల కబ్జాలో అన్ని భూములను విడిపించడం కోసం వాళ్ళు ఎంతో సాహసం చేసారు. డిసెంబరు 5 న కూలీలు పొలంలో నాగలిని చేతబట్టారు. తరువాత విత్తనాలు వేసారు. దీని తరువాత ప్రారంభం అయింది పోరాటం… ఉద్యమాలు.. యాత్రలు… నిరంతరం సాగాయి. సంగ్రామం అవిరామంగా జరిగింది.

ఆ దిశవైపు – వందల అడుగులు

లెక్కలేనన్ని పోరాటాలు చేసాం. ఏ ఉద్యమం చేయాలన్నా వెనుకంజ వేయలేదు. ఈ సంఘటనలలో కొన్ని అవిస్మరణీయంగా ఉండిపోయాయి. 1969 సం||లో మా యూనియన్‌ ఏర్పడ్డాక కేదలాలో ఒక ఆఫీసుని తెరిచాము. పి.డి. అగ్రవాల్‌, గోపాల్‌ ప్రసాద్‌ (ఆ రోజుల్లో మగధ యూనివర్సిటీలో వైస్‌ ఛాన్సలర్‌గా పనిచేసే వారు) ల 3 నంబర్‌ బ్లాక్‌ల బొగ్గుగనులలో పనిచేసే కూలీలు కూడా మా సంఘటనలో చేరిపోయారు. కేదలా చెక్‌పోస్ట్‌ దగ్గర కీరత్‌రామ్‌ ఇంట్లో యూనియన్‌ కార్యాలయాన్ని తెరిచారు. యూనియన్‌ జెండాని ఎగరేసారు. కాని ఝూర్‌ఖండ్‌ శివరామ్‌సింహ్‌ కంపెనీ వర్కర్లని యూనియన్‌ అని అనవద్దని అన్నారు. ఇక నా పేరెత్తే పనేలేదు. యూనియన్‌కు ప్రవేశం దొరకకుండా తను కొందరు కొత్త ఏజంట్లను తీసుకువచ్చాడు. యూనియన్‌ నేతలు వర్కర్లను కలవకుండా ప్రతి ఇంటి ముందు గుండాలను పెట్టారు. అక్కడి వర్కర్లు ‘రాహీ’ బజారునుండి కేదలా వర్కర్ల ద్వారా ఝూర్‌ఖండ్‌లో యూనియన్‌ని ఏర్పాటు చేయమని సందేశం పంపించారు. ఒకసారి అర్థరాత్రి కేదలా ఆఫీసులో మీటింగు పెట్టారు. అక్కడ కరెంటు లేదు. దీపం వెలుతురు కూడా కొంత తక్కువగానే ఉంది. అందరు గుసగుసలు మొదలు పెట్టారు. కాంట్రాక్టర్లకు మా ప్లాన్‌ గురించి తెలియకూడదని మా ప్రయత్నం. వర్కర్లు ఒక్కసారిగా ఝార్‌ఖండ్‌కి వెళ్ళాలనుకున్నారు. మీతారామ్‌ ఆయన భార్య మోలామతిబాయి, వర్కర్లు ఝార్‌ఖండ్‌ చేరగానే ప్లాను ప్రకారం జెండా ఎగరేయాలని, ఒకవేళ ఎవరైనా అడ్డువస్తే వాళ్ళమీద రాళ్ళు విసరాలని అనుకున్నారు.

అనుకున్న టైమ్‌కి మేం అందరం వర్కర్లను తీసుకుని కేదలాకి బయలుదేరాము. నేను కారులో కూర్చున్నాను. మైదానం అంతా ఎర్రజెండాలతో నిండిపోయింది. అడవిలో అగ్నిపూల ఎర్రరంగు అంతా వ్యాపించింది. కేదలానుండి ఝార్‌ఖండ్‌ వెళ్ళే మార్గం అంతా నల్లగా అర్థనగ్నంగా ఉన్న స్త్రీ-పురుషులతో నిండిపోయింది. టెంట్‌లలోనుండి వర్కర్లు బయటికి వచ్చి ముందుకు నడిచారు. వందల వందల అడుగులు ఒకటే దిశవైపు పడుతున్నాయి. కొత్త మార్గాన్ని నిర్మిస్తూ అడుగులు ముందుకు పడుతున్నాయి. యూనియన్‌లు తమ శక్తిని చూపుతున్నాయి.

రామానంద్‌ మనుషులు నేను పోయేదారిలో మందుపాత్రలు పెడుతున్నారు. నేను జీపులో వెళ్తున్నాను. నన్ను చంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వర్కర్లందరికి తెలిసిపోయింది. ప్రెస్‌లో పనిచేసే రాణా, అభిజిత్‌ సేన్‌ గౌడ్‌ మొదలైనవారు నాతో వస్తున్నారు.

చెక్‌పోస్ట్‌ దగ్గర వరుసలలో కర్రలు, కఠారులు, గొడ్డళ్ళు, గునపాలు పట్టుకుని గుండాలు నిల్చున్నారు. వాళ్ళతోపాటు రామ్‌పాల్‌ సింహ్‌ ఏజెంట్లు, మేనేజరు ఎస్‌.ఎల్‌.సింహ్‌, తెల్లటి ధోవతి-కురతా, పైజమాలు ధరించిన చిన్న పెద్ద కాంట్రాక్టర్లు, గుమాస్తాలు కూడా ఉన్నారు. పోలీసు ఇన్‌స్పెక్టర్‌ శ్రికోనార్‌, కొందరు కానిస్టేబుళ్ళు, చెక్‌పోస్ట్‌ బారియర్‌ లోపల ఉన్నారు. వర్కర్లు మమ్మల్ని కలవకూడదని గుండాలు ఎంతో జాగ్రత్తపడ్డారు.

రామ్‌కృపాల్‌ చిన్న-చితకా గుండాలను తమ వర్కర్లు అని చెబుతూ వాళ్ళని అధికారుల దగ్గరికి తీసుకు వచ్చారు. ప్రెస్‌ వాళ్ళ ఎదురుకుండానూ తీసుకు వచ్చారు. యూనియన్‌కి వ్యతిరేకంగా స్టేట్‌మెంటు తీసుకోవాలని ప్రయత్నం చేసారు.

చెక్‌పోస్ట్‌ దగ్గర మా కారుని ఆపారు. ”రమణిక గుప్త చెక్‌పోస్ట్‌లోకి రావడానికి వీలు లేదు. కేవలం శ్రీకృష్ణ సింహ్‌ లోపలికి రావచ్చు”. అని చెప్పారు.

రామ్‌గోపాల్‌ సింహ్‌ ఆయనని ఎంతో ప్రేమతో ఆదరంగా లోపలికి తీసుకు వెళ్ళారు. ఒకే కులం వాళ్ళు గౌరవాన్ని కాపాడుకోవాలి కదా! నన్ను ఆపేసారు. నా ఎదురుకుండా ఐదు వరసలలో గోడల్లా గుండాలు నిల్చుని ఉన్నారు. వాళ్ళ చేతుల్లో కర్రలు, గొడ్డళ్ళు, గునపాలు ఉన్నాయి. నిర్ణయం తీసుకోవాల్సిన ఘడియలు వచ్చాయి. టు బి ఆర్‌ నాట్‌ టు బి… నేను బయట నిల్చుని ఆలోచిస్తున్నాను. ‘శ్రీ బాబు (శ్రీ కృష్ణ సింహ్‌ని అందరు శ్రీబాబు అని పిలుస్తారు) తో అక్కడ జరుగుతున్న నాటకం చూడనా? కూలీల పోరాటాన్ని ఎటువంటి బేరసారాలు లేకుండా ముందే అఖాడాలోకి దూకి వాళ్ళని రక్షించాలా? కూలీలలో ఆవేశం కట్టలు తెంచుకుంటోంది.

ఒక ఆడకూలి నా దగ్గరికి వచ్చి చెవిలో చెప్పింది – ”అమ్మగారూ! ఆజ్ఞ ఇవ్వండి. చెక్‌పోస్ట్‌ దగ్గర అడ్డుకర్రను విరగగొట్టి అవతల పడేస్తాం. కూలీలందరి ఉద్దేశ్యం కూడా ఇదే.”

నేను సరే అని అనడం ఆలస్యం కూలీలు చెక్‌పోస్టు అడ్డకర్రను విరిచి పడేస్తారు. ఈ పని జరగగానే గుండాలు మా మీద విరుచుకు పడతారు. పోలీసులు రంగంలోకి దిగుతారు. అందువలన ఆలోచించా – ‘ఆగండి ముందు ఈ జెండా తీసుకురండి’ అని అంటూ నేను జీప్‌ నుండి కిందికి ఒక్క ఉదుటున దుమికి, చెక్‌పోస్ట్‌ అడ్డుకర్ర కింద నుండి కరెంట్‌ అంత తీవ్రగతితో శ్రీబాబు ఎక్కడ నిల్చుని ఉన్నారో అక్కడికి వెళ్ళాను. రామ్‌కృపాల్‌ తీయటి మాటలతో ఊరేగింపును వెనక్కి తీసుకువెళ్ళమని చెబుతున్నారు. గుండాగిరి చేసే ఒక బాబూ సాహెబ్‌ అశ్లీలంగా వాగుతూ నా చేయి పట్టుకుని చెక్‌పోస్ట్‌ బయటకి పంపించేయాలని ప్రయత్నించాడు. అంతే వాడి చెంపన బలంగా చెంపదెబ్బ కొట్టాను. అక్కడ ఉన్న కూలీలు అట్టహాసం చేస్తూ చప్పట్లు కొట్టారు. వాళ్ళ ముఖాల్లో సంతోషం. ఒకవేళ నేను చెంపదెబ్బ కొట్టకపోతే ఆ గుండాల పొగరు రెట్టింపయ్యేది. కూలీలకు నామీద నమ్మకం లేకుండా పోయేది. శ్రీబాబు ఆ కాంట్రాక్టర్లతో తీయతీయగా మాట్లాడుతూ తన అభిమానం పోగొట్టుకుంటున్నాడు. నేను ఈ కూలీల సైకాలజీని కొంత తెలుసుకున్నాను. గుండాల భయం వలన యాజమాన్యంతో ఏదో ఒక ఒడంబడిక చేసుకోవడం వాళ్ళు ఎంతమాత్రం సహించరు. వాళ్ళు తమ నేత ధైర్యంగా వాళ్ళని ఎదిరించడంలో దిట్ట అయి ఉండాలని అభిప్రాయ పడతారు. ఫలితం ఏమైనా ఫరవాలేదు. ఒకవేళ నేను ముందంజ వేసి ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే యూనియన్‌కే ప్రమాదం. టేబుల్‌ దగ్గర మాట్లాడాలి. అఖాడాలో కాదు. నేను కొట్టిన చెంప దెబ్బకి గుండాలతో సహా అక్కడ ఉన్న వాళ్ళందరు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇంతలో ఒక గుండా గొడ్డలి తీసుకుని నావైపుకి వచ్చాడు. వెంట్రుకవాసిలో ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా ఇన్‌స్పెక్టర్‌ కోవార్‌ తన కర్రతో ఆ గుండా చెయ్యిమీద ఒక్క దెబ్బ వేసాడు. గొడ్డలి కింద పడిపోయింది. ఒక్క నిమిషం అంతటా నిశ్శబ్దం. నేను పరుగెత్తి గుండాల దగ్గరికి వెళ్ళాను. పెద్దగా అరవడం మొదలు పెట్టాను- ”ధైర్యం ఉంటే కొట్టండిరా! కొట్టండి. అమ్మపాలు తాగిన వాళ్ళైతే రండిరా… రండిరా… ఎవడి దగ్గర ఉంది బలం నన్ను ఆపడానికి. కూలీల గుడిసెల్లోకి వెళ్తున్నాను. మీరు అక్కడ కట్టిపడేసిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను.” రామ్‌గోపాల్‌ సింహ్‌లో గాభరా మొదలైంది. శ్రీకృష్ణసింహ్‌ నాకు అడ్డంగా నిల్చుని రెండు చేతులు జోడించి ప్రార్థించసాగాడు- ”ఇటువంటి పరిస్థితులలో ఎవరు ఎవరితోనూ మాట్లాడలేరు.” కంపెనీ వాళ్ళ ద్వారా నన్ను చంపించలేదు. ఘోరంగా నరసంహారం జరిగేది ఏదైనా జరిగితే అది వర్కర్లమీదకి రాదు. యజమానులే కారణం అవుతారు. పోలీసులేకాదు ప్రెస్‌వాళ్ళు కూడా ఉన్నారు.

ఇంతలో ఒక బాణం వచ్చి పడ్డది. గుండాలు పేట్రేగిపోయారు. వీళ్ళు బాణాలకు భయపడతారు. విషబాణాలు మనిషిని గిలగిల కొట్టుకునేంత బాధపెడతాయి. కూలీలు రాళ్ళ వాన కురిపించడం మొదలు పెట్టారు. పోలీసులు లాఠీ చార్చి చేసారు. ఖైదీలైన ఝార్‌ఖండ్‌  వర్కర్లు గుండాలను తోసుకుంటూ మా దగ్గరికి వచ్చారు. రామ్‌ కృపాల సింహ్‌ నా రక్షణ గురించి ఆలోచించారు. విజయం మా చేతుల్లో ఉంది.

వరుసల్లో నిల్చుని ఉన్న గుండాలను తప్పించుకుని బయట పడ్డాము. నిజానికి ఈ విజయం మా ఆత్మాభిమానాన్ని ఇంకా పెంచింది. నేను జీపులో కూర్చున్నాను. శ్రీబాబు కూడా జీపులోకి వచ్చి నా పక్కన కూర్చున్నారు. వర్కర్లు అరవడం మొదలు పెట్టారు- ‘విరిగింది భాయి విరిగింది. ఝార్‌ఖండ్‌ గేటు విరిగింది. ‘విరిగింది భాయీ ఇనప గేటు విరిగింది’ ఝార్‌ఖండ్‌ చెక్‌పోస్ట్‌ దగ్గర ఉన్న ఈ గేటుని దాటి యూనియన్ల నేతలైనా, వర్కర్లయినా వెళ్ళకూడదు. దీన్నిదాటి వెళితే తన్నులైనా తినవల్సి వస్తుంది, చావనైనా చావాల్సి వస్తుంది. ఇంతకు ముందు ఎన్నడూ విరగని గేటు ఈనాడు విరిగింది. కూలీల సంతోషం గురించి ఇక చెప్పనఖ్ఖరలేదు. మళ్ళీ తప్పకుండా ఇక్కడికి రావాలి అని సంకల్పం చేసుకుని మేము వెనక్కి వెళ్ళిపోయాము. నన్ను చేసిన అవమానం వాళ్ళకి ద్రౌపదిని వస్త్రాపహరణం చేసి అవమానించినట్లుగా అనిపించింది. వాళ్ళు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. కాంట్రాక్టర్లు నన్ను తిట్టిన తిట్లను వాళ్ళు భరించలేకపోయారు. వాళ్ళ రక్తం ఉడికి పోయింది. ఆ గుండా నా చేయి పట్టుకోవడం వాళ్ళు సహించలేకపోయారు. వాళ్ళ కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి. ఏమైనా ఆ రోజు మాత్రం మేం వెనక్కి వచ్చేసాం.

ఝార్‌ఖండ్‌ గనిలో వర్కర్లు తమ ఇళ్ళమీద జెండా ఎగరవేసేందుకు అనుమతి లేదు. కాని రోకపోకలకి మాత్రం కొంత సడలింపు వచ్చింది. యూనియన్‌లో ఎవరైనా సరే సభ్యులు కావడానికి కూడా అనుమతి తీసుకోవాలి. సభ్యత్వంపై ఆంక్షలు చాలా పెరిగాయి. వర్కర్లు బజార్లకి వచ్చి మమ్మల్ని కలిసే ప్రయత్నం చేసేవాళ్ళు. శివరామ్‌ సింహ్‌ కంపెనీ గోడలలో పగుళ్ళు వచ్చాయి. కాని గోడలు పూర్తిగా పడిపోలేదు. కంపెనీ నామీద కేసు ఎత్తెయ్యలేదు. ఎస్‌.డి.వో కోర్టులో నా వ్యతిరేకంగా కేసు నమోదు అయింది. అల్లర్లకు ప్రేరేపించడం, దొంగతనం, హత్యాప్రయత్నాలు, దోపిడి, అబెంట్‌మెంట్‌ మొదలైన కేసులు నామీద పెట్టారు. 13, 107, 116 సెక్షన్లు మా మీద అనునిత్యం పెడుతూనే ఉంటారు. కాని సెక్షన్‌ 326-నిజానికి ఇదొక విచిత్రమైన సెక్షను – కింద నామీద కేసు పెట్టారు. ఎస్‌.డి.వో. కోర్టులో కేసు నడిచింది. ఆ గుండా దైత్యుడు లాయరు నామీద అపరాధం మోపాడు. నేను ఆ గుండాగాడి పరువు తీసే ప్రయత్నం చేసాను, అని అన్నాడు. కోర్టులో అందరు పెద్దగా నవ్వారు. కోర్టు వాళ్ళు అడిగారు- ”మహిళ మొగాడి పరువు తీసే ప్రయత్నం చేసిందా? అసలు ఇట్లా అనడానికి మీకు సిగ్గులేదు?” కేసు ఎత్తేసారు. ఆ రోజు శ్రీఖత్రీ ఎస్‌.డి.వో. కుర్చీమీద కూర్చుని కేసు విషయంలో ప్రశ్నలు అడిగారు. ఝార్‌ఖండ్‌ గుండాలకి ఆరోజు కోర్టు చెంపపెట్టు పెట్టినట్లు జవాబు చెప్పింది. కూలీలకి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. మా విషయంలో శివరామ్‌ సింహ్‌ పప్పులు ఉడకలేదు.

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.