ఇప్పుడు మౌనం మరణ సదృశ్యం – కె. సత్యవతి & పి. ప్రశాంతి

”చిన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు పాఠశాలలో జరిగే కార్యక్రమాల్లో ప్రార్థనలు, దీపాలు వెలిగించడం, సరస్వతీ పూజలు చేయడం వుండేది కాదు. కార్యక్రమాలన్నీ చాలా సెక్యులర్‌గా వుండేవి. ఇప్పుడలా లేవు. ప్రతి కార్యక్రమం హిందూమత ఆచారం ప్రకారమే వుంటుంది. లౌకికతత్వం మాయమైంది. ఇలాంటి వాటన్నింటిని మనం ప్రశ్నించకుండా మౌనంగా అంగీకరిస్తూ వచ్చాం. మతం చాపకింద నీరులా అన్ని రంగాలకి విస్తరించిపోయి ఇప్పటి వికృత రూపంతో మన మీద విరుచుకు పడుతోంది. దీనికి కారణం మన మౌనమే” ప్రొ. రమామెల్కొటే.

మతం వ్యక్తిగత పరిధిని దాటేసి బహిరంగంగా పబ్లిక్‌ స్థలాలు, పబ్లిక్‌ ఆఫీసులు ఆక్రమించుకుని చాలా కాలమే అయ్యింది. రాజ్యాంగంలోని లౌకిక స్ఫూర్తికి విరుద్ధంగా ప్రభుత్వ కార్యాలయాలు, కార్యక్రమాలు హిందూమత కర్మకాండలతో మునిగి పోవడానికి పరాకాష్టగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ అధికార కార్యక్రమాల్లోకి హిందూమత పీఠాధిపతుల్ని, భూమి పూజలూ, పవిత్ర జలాలు చల్లడాలు వగైరా ఫక్తు హిందూమత క్రతువుల్ని కలగలిపేయడం చూస్తున్నాం.

దేశంలోకానీ, రాష్ట్రాల్లోకానీ హిందూమతావలంబకులు మాత్రమే లేరు. వివిధ మతస్తులు వున్నారు. భిన్న ఆచార వ్యవహారాల సమ్మేళనం భారతీయ జీవన విధానం. ఒకే మతాన్ని ప్రోత్సహించడం ద్వారా మిగిలిన మతస్తుల్ని ఒక భయంకరమైన అభద్రతలోకి తోసేయడంతోపాటు ఇక్కడ హిందువులు మెజారిటీ… మీరు మైనారిటీ… మెజారిటీగా వున్న మేము చెప్పిందే శాశనం అంటూ ఒక పరోక్ష హెచ్చరికను… ప్రస్తుతం ప్రత్యక్ష హెచ్చరికలను పంపుతున్న వైనాలు చూస్తున్నాం. వీరికి రాజ్యాంగంపట్ల కానీ, న్యాయవ్యవస్థపట్ల కానీ ఏమాత్రం గౌరవం లేదు. గుండాగిరీ, భౌతికదాడులు, ఆఖరికి హత్యలు- ఇవే వీరి ఆయుధాలు. ఈ ఆయుధాలు ఇటీవల మరింత పదునెక్కి లౌకికవాదుల కుత్తుకలు తెగ్గోసే భయానక క్రీడకి తెరతీసాయి. ప్రశ్నని, ప్రశ్నించే తత్వాన్ని నిలువరించడానికి హత్యల్ని ఆయుధం చేసుకున్న ఈ మూకలు దేశమంతటా ఒక భీతావహ వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసాయి.

భిన్నత్వం విలసిల్లే విశాల భారతదేశాన్ని మతం ముసుగులో… శాసించాలని… తాము చెప్పిందే వేదమని… వేదంలో చెప్పారు కాబట్టి ప్రజలంతా ఆచరించాలని అడ్డగోలు వాదనలతో దూసుకొస్తున్న హిందూత్వ శక్తుల ఆగడాలకు ఇప్పటికే ఎందరో బలైపోయారు. కల్బుర్గి, దబొల్కర్‌లను హత్య చేయడం ద్వారా ‘మేము హేతువాదులను, నాస్తికులను వేటాడతాం, చంపేస్తాం… వారెవరైతే మాకేంటి? రచయితలైతే ఏంటి? వయస్సు మళ్ళిన వృద్ధులైతే మాకేంటి మేము చెప్పినట్టు వినకపోతే… అందరికీ ఇదే గతి పట్టిస్తాం’ అంటూ హూంకరిస్తున్న ఈ కిరాతక మూకల్ని అలాగే వదిలేద్దామా? పెచ్చరిల్లుతున్న మతోన్మాద శక్తుల రక్త చరిత్ర 2002 నుండి పేట్రేగి గుజరాత్‌ దాటి దేశపు అత్యుత్తమ పీఠం ఎక్కి గుడ్లురిమి చూస్తోంది.

భారతదేశం హిందూదేశం కాదు. హిందూ అనే పదం రాజ్యాంగంలో లేదు. ఒకే మతాన్ని అనుసరించే దేశాలు ప్రపంచంలో చాలా వున్నాయి. అది వాళ్ళ రాజ్యాంగం ప్రకారం కూడా అమలవుతుండొచ్చు. హిందూదేశంగా ప్రకటించుకున్న నేపాల్‌ రాజ్యాంగంలో ఇటీవల ‘సెక్యులర్‌’ అనే పదాన్ని పొందుపరచుకున్నారు. మనదేశంలో అయితే ‘సెక్యులర్‌’ అనే పదాన్ని రాజ్యాంగం నుండి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. లౌకికవాదం గురించి మాట్లాడుతున్న వాళ్ళని కుహనా లౌకిక వాదులని, సూడో సెక్యులరిస్ట్‌లని నిందిస్తున్నారు.

భౌగోళికంగా సువిశాలమైన భారతదేశంలో వున్న ఏకత్వం భారతీయత మాత్రమే. ఈ దేశంలో పుట్టిన వాళ్ళందరం ‘భారతీయులం’ అనేదొక్కటే మనల్ని ఏకత్వంతో కట్టి వుంచేది. మిగిలినదంతా భిన్నత్వమే… వైవిధ్యమే. అటు కశ్మీర్‌ నుండి ఇటు కన్యాకుమారి వరకూ మనకు కనబడేది… కట్టు, బొట్టు, తిండి, తిప్పలు, పూజలు, పునస్కారాలు, ఆచారాలు, వ్యవహారాలు, కట్టుబాట్లు, గుళ్ళు, గోపురాలు అన్నింటా అద్భుతమైన భిన్నత్వం విలసిల్లుతుంటుంది. కేరళలో వస్త్రధారణకి, కశ్మీర్‌లో వస్త్రధారణకి పొంతనే వుండదు. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్ర ప్రజల వస్త్రధారణ వైవిధ్యంగానే వుంటుంది. ఎక్కడా ఏకత్వం కానరాదు.

ఇంత భిన్నమైన వస్త్రధారణ విలసిల్లేచోట చీర మాత్రమే భారతీయ వస్త్రధారణ అని, సాంప్రదాయక వస్త్రధారణ అంటే చీర కట్టుకోవడమే అని చెప్పాలనుకోవడం పూర్తిగా అసంబద్ధం. చీర ముఖం చూడని, చీర కట్టడం నేర్వని ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తర ప్రాంతపువారు కశ్మీర్‌, పంజాబ్‌, హర్యానా ప్రాంతాల స్త్రీలు చాలా భిన్నమైన వస్త్రాలను ధరిస్తారు. దేశంలోని సగానికిపైగా మహిళలు కట్టని చీరని భారతీయ సంప్రదాయ వస్త్రం చీర అని ప్రకటిస్తే… మిగతా సగం మంది మహిళలు ధరించే వస్త్రం భారతీయ సంప్రదాయ వస్త్రం కాకుండా పోతుందా? భిన్నమతాలు, భిన్న సంస్క ృతులు, ఆచార వ్యవహారాలు, జీవన విధానాలున్న భారతదేశం భిన్నత్వంతోనే విలసిల్లాలి కానీ ఏకత్వంతో కాదు. కాకూడదు. మనదేశంలో ఆహారపుటలవాట్లు కూడా చాలా భిన్నమైనవి. ఆయా ప్రాంతాల్లో దొరికే ఆహార పదార్థాలు ఆయా ప్రజల తిండి తిప్పల్ని నిర్ణయిస్తాయి. పంజాబ్‌లో గోధుమలు తింటే పడమటి ప్రాంతాల్లో బియ్యం తింటారు. తీర ప్రాంతాల్లో నివసించేవారు, నదీతీర ప్రాంతాల్లో నివసించేవాళ్ళు మత్స్య సంబంధ ఆహారం మీద ఎక్కువ ఆధారపడతారు. కొనుగోలు శక్తి తక్కువగా వుండే అట్టడుగు వర్గాల ప్రజలు చౌకగా దొరికే మాంసపు ఆహారం మీద ఆధారపడతారు. అంతేకాదు శారీరక శ్రమ ఎక్కువ చేసే శ్రామిక జనం మాంసాహారం తీసుకోవడం తప్పనిసరి. వారు చేసే శ్రమకు, త్వరగా అరిగిపోయే ఆహారం కాక మెల్లగా జీర్ణమయ్యే మాంసాహారం చాలా అవసరమౌతుంది. అది వారి ఆహారం, వారి సంస్క ృతి, వారి జీవన విధానం… వద్దనే హక్కు ఎవ్వరికీ లేదు. మాంసాహారం మహాపాపం, జీవహింస మహానేరం అని చెప్పే హక్కు ఎవ్వరికీ లేదు. జీవహింస నేరమని చెబుతూ మనిషిని చంపే భయానక హింసకి పాల్పడుతున్న వీళ్ళ ద్వంద్వ వైఖరిని ఏమనాలి? గొడ్డును చంపితే నేరమట. మనిషిని చంపడం నేరం కాదట. ఇదెలాంటి న్యాయం? మేకను చంపొచ్చు, కోడిని చంపొచ్చు, చేపని చంపొచ్చు, పందినీ చంపొచ్చు – హాయిగా తినొచ్చు ఆవుని మాత్రం చంపకూడదు అని శాసించడం విడ్డూరం. ఆవు హిందూమతస్తులకి పవిత్రం కావొచ్చు. మిగిలిన మతస్తులకు ఆవుకూడా మేకో, గొర్రో లాంటిదే. మీ పవిత్రతలు, మీ భావోద్వేగాలు వాళ్ళకి ఎందుకుండాలి? విష్ణువు అవతారంగా, దశావతారాలుగా కీర్తించే చేపల్ని, పందుల్ని తింటారుగా… ఆవు దశావతారంలో కూడా లేదు. అయినా సరే గొడ్డు మాంసం తింటే ఖబడ్దార్‌ అని బెదిరిస్తున్నారు. హత్యలు చేస్తున్నారు. ఇది ఎలాంటి న్యాయమౌతుంది? ఇది తినాలి, ఇది తినకూడదు అని తీర్పులిచ్చే హక్కు ఎవరిచ్చారు? మామాట కాదని తింటే చంపేస్తాం అని బెదిరిస్తున్నారు. ఎంతమందిని చంపేస్తారు. గొడ్డు మాంసం తినే కోట్లాదిమంది దళిత, మైనారిటీ వర్గాల వాళ్ళందరినీ చంపేస్తారా? ఆకులు, అలములు తింటూ మీరు మాత్రమే ఈ నేలమీద శాశ్వతంగా బతికేస్తారా?

హేతువాదుల్ని, నాస్తికుల్ని చంపేస్తామని బెదిరించడమే కాక  కొంతమందిని చంపేసారు. ఆస్తికుల పక్కనే నాస్తికులుంటారు. వేలాది సంవత్సరాలుగా మత మౌఢ్యాన్ని ప్రశ్నిస్తూ హేతువాదులుంటూనే వున్నారు. మతం నమ్మకం, విశ్వాసం… హేతువాదం నమ్మకం కాదు సైన్సు ఆధారితం. దేవుడున్నాడని నమ్మేవాళ్ళున్నట్లే దేవుడి ఉనికిని నమ్మని, ప్రతీదాన్నీ ప్రశ్నించే నాస్తికులున్నారు. స్వర్గం, నరకం, పాపం, పుణ్యం, తలరాతలు, నుదిటి రాతలు లాంటి భయపెట్టే భావజాలాన్ని సృష్టించి, పునర్జన్మల మాయాజాలంలో సామాన్యుల్ని ముంచేసి మతం మత్తుమందును నషాళం దాకా నింపేసి పబ్బం గడుపుకుంటూ బతికే బ్రాహ్మణీయ భావజాలాన్ని వ్యతిరేకించే, ప్రశ్నించే హేతువాదులు, నాస్తికులూ భారతీయ సమాజానికి కొత్తకాదు. వివేకానందుడు మతమౌఢ్యాన్ని తూర్పారా పట్టాడు. సమాజాన్ని ముందుకు నడిపే శాస్త్ర, సాంకేతిక జ్ఞానం కావాలన్నాడు. యజ్ఞయాగాదులను, అనవసర క్రతువుల్ని కులమతాల అంతరాలను, మతమౌఢ్యాన్ని ఖండించిన బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం ఈ దేశంలోనే పుట్టాడు. సర్వమానవ సమానత్వాన్ని బోధించాడు. దైవభావనని వ్యతిరేకించిన సమానత్వాల్ని బోధించాడు. దైవభావనని వ్యతిరేకించిన బుద్ధుడిని దేవుడిని చేసి, విగ్రహారాధన కాదన్న బుద్ధుడికి దశావతారాల్లో ఓ విగ్రహం చేసేసిన ఘనులు మన దేశ బ్రాహ్మణీయ భావజాలకులు. దేవుడిని నమ్మి పూజించుకోవడం ఎలాంటి హక్కో, దేవుడిని నమ్మని వారి హక్కు కూడా అలాంటిదే. మీరు దేవుడిని ప్రశ్నిస్తే మిమ్మల్ని చంపేస్తామని హత్యలకి పాల్పడడం నేరం… ఈ నేరస్తులకు శిక్షలు పడాల్సిందే. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా కీర్తించబడుతున్న భారతదేశంలో వ్యక్తి స్వేచ్ఛను హరించే ఇలాంటి అమానుష చర్యలు అందరూ గర్హించాలి.

కర్ణాటక రాష్ట్రంలో పుట్టి కన్నడ భాషలో రచనలు చేసి, సాహిత్య అకాడమీ అవార్డును సాధించిన కల్బుర్గి సాహితీకారుడుగానే కాకుండా, మత మౌఢ్యాన్ని ప్రశ్నించినవాడుగా ప్రసిద్ధుడు. రచయితగా, దేనికీ భయపడకుండా, ఎవరికీ తలొంచకుండా తాను రాయదలిచింది రాసిన నిర్భీతిపరుడు. వయసు మళ్ళినవాడు. అలాంటి కల్బుర్గి హత్య ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపింది. ప్రముఖ సాహితీకారులందరినీ ఈ కుదుపు తాకింది. చాలామంది కోపోద్రిక్తులైనారు. రచయితల కోసమే ఏర్పాటైన కేంద్ర సాహిత్య అకాడమీ కల్బుర్గి హత్యను ఖండించక పోవడం, రచయితలను రక్షించడానికి ముందుకు రాకపోవడం వంటి కారణాలు సాహితీవేత్తల్ని తీవ్రంగా కలవరపరిచాయి. కఠినమైన నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపించాయి. నయనతార సెహగల్‌ దేశంలో కమ్ముకుంటున్న మత అసహనం మీద మండిపడుతూ అందుకు నిరసనగా తన అవార్డును కేంద్రసాహిత్య అకాడమీకి తిరిగి ఇచ్చివేస్తున్నట్టు ప్రకటించారు. కల్బుర్గి హత్య రేపిన కలవరం, ఆందోళనలో వున్న సాహితీవేత్తలకు నయనతార చర్య స్ఫూర్తి నిచ్చింది. తమ నిరసన తెలపడానికి తమ అవార్డునే ఆయుధంగా చేసుకుని ‘మమ్మల్ని రక్షించలేని మీ అవార్డు మాకొద్దు. మీకే ఇచ్చేస్తున్నాం తీసుకోండి’ అంటూ రచయితలు క్యూ కట్టారు. తమ సాహితీ కృషికి విలువకట్టి ఇచ్చిన విలువైన అవార్డులను తృణప్రాయంగా వదిలేసుకున్నారు. కల్బుర్గి హత్య, దాద్రిలో అక్లక్‌ హత్య మనసులను తీవ్రంగా కలిచివేయడం, దేశమంతా కమ్ముకుంటున్న మత అసహన మేఘాలు సాహితీ వేత్తలనే కాదు మిగిలిన ఎందరినో కదిలించాయి. ప్రభుత్వం ఇచ్చిన పద్మ అవార్డులను సైతం చాలామంది ప్రముఖులు వెనక్కి ఇచ్చేసారు. సినీతారలు కూడా వీరితో జత కలిసారు. తమ అవార్డులను వెనక్కి ఇచ్చేసారు. ఇది ఇంకా కొనసాగుతుంది.

ప్రభుత్వంపట్ల తమ నిరసనని తెలపడానికి అవార్డులు తిరిగి ఇచ్చివేసే కార్యక్రమం వీరు ఎంచుకున్న ఒక మార్గం, ఒక వ్యక్తీకరణ. ప్రభుత్వవర్గాలవారు వీరి నిరసనని పట్టించుకోకుండా ఈ నిరసనల వెనక రాజకీయ కారణాలున్నాయని, ఎవరో కుట్ర చేసి వీరందరినీ రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తోంది ప్రభుత్వం. వీరిపట్ల వ్యంగ్యంగా, వెటకార ధోరణితో మాట్లాడుతోంది తప్ప వీరి నిరసనలకు కారణమైన మత అసహనం గురించి పెదవి విప్పడంలేదు. దాద్రిలో అక్లక్‌ దారుణంమీద, హిందూత్వ ఎజండామీదా మాట్లాడడం లేదు. మత అసహన వాతావరణాన్ని విస్తరిస్తున్న హిందూమత సంస్థల మాటలకు, చేతలకు కళ్ళెం వేయడం లేదు. ఇవేమీ చేయకుండా అవార్డులను వాపసు ఇస్తున్న వారిమీద విరుచుకు పడడం, నిందించడం గమనిస్తూనే వున్నాం. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. ఈ ధోరణి గురించి మాట్లాడాల్సిన సమయం ఇది. ప్రజాస్వామిక వాదులు, లౌకికవాదులు గళం విప్పాల్సిన సందర్భమిది.

అన్ని మతాలవారం, అన్ని సంస్క ృతులవారం, మతం లేని వారం… భారతీయులమైన అందరం భిన్నత్వాన్ని గౌరవిస్తూ ఏకత్వంతో బతకాల్సిన అవసరాన్ని ఎలుగెత్తి చాటుదాం. ప్రకృతి ఎంత వైవిధ్యంతో వుంటుందో అంత వైవిధ్యంతో వుంటుంది భారతీయ జీవన విధానం. భిన్నత్వం కోసం, లౌకిక విలువల కోసం, మత అసహన హననం కోసం కలిసికట్టుగా గళమెత్తుదాం… కలాలను కదిలిద్దాం. కుంచెలనూ కదిలిద్దాం. సర్వకళలలో భిన్నత్వాన్ని రంగరించి చూపుదాం.

ఇపుడు మౌనం… మరణ సమానం…

గళమెత్తడమే… ఇప్పటి అవసరం…

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.