ఈ నేరం – దేవి

మీడియా మొత్తం గొంతు చించుకుని అరచి అరచి ఈ దేశాన్ని కొన్ని విషయాలు నమ్మించినట్టే కనబడుతుంది. ఒకటి నిర్భయ హంతకుల్లో ఈ మైనర్‌ వ్యక్తే అతి క్రూరుడు అని దీనికి వారికి గల ఆధారం ఏమిటో ఎవరికీ తెలియదు. మైనర్‌లపై జరిగే విచారణ వివరాలు గోప్యంగా ఉంచాలనేది చట్టం కాబట్టి ఈ వివరాలు వారికి అందే అవకాశమే లేదు. కాని ఈ పుకారుని నిజంగా నమ్మించడంలో మీడియా సఫలం అయ్యింది. ఇక రెండోది అతన్ని విడుదల చేస్తే నిర్భయకు న్యాయం జరగనట్టే అని. న్యాయం అంటే నిందితులను శిక్షించడం మాత్రమే అనే పరిమితార్థం ఎంత పాతుకు పోయిందో ఇపుడు అర్థం అవుతుంది. కంటికి కన్ను రక్తానికి రక్తం అనే ఆటవిక న్యాయం మాత్రమేనా? నిర్భయ తల్లిదండ్రులు ఈ ”భ్రమ” నుండి బయట పడటానికి వారికి కౌన్సిలింగ్‌ సహాయం యిచ్చారా? నిర్భయ స్నేహితుడికి కౌన్సిలింగ్‌ యిప్పించారా? ఆ కుటుంబం మామూలు జీవితం గడపడానికి పునరావాస ఏర్పాట్లు ఏం జరిగాయి? మీడియాలో నిరంతరం కనబడ్డం వారి గాయాల్ని మళ్ళి మళ్ళి కెలకటం అవదా? వారి ప్రతిస్పందననీ, దుఃఖాన్ని, కన్నీళ్ళని ప్రదర్శనా వస్తువులుగా మీడియా రేటింగ్స్‌ పెంచుకోవటం లేదా? ఏకాంతంలో వారిని కనీసం కరువుతీరా పాడవనిచ్చారా? న్యాయం అంటే ప్రతీకారంగా శిక్ష విధించడమేనా? ఉరి పడితే న్యాయం జరిగినట్టేనా? న్యాయం అంటే చనిపోయినవారి జ్ఞాపకానికి యిచ్చే బలి వంటిదా? లేక అటువంటి  ఘటనలు పునరావృతం కాకుండా ఆధునిక వ్యవస్థ తీసుకునే చర్యలా? న్యాయం అంటే బతికున్న వారికి ఓదార్పు సాంత్వన, సాధారణ జీవితం మళ్ళీ ప్రారంభించడానికి సహకారంగా మందుకు చూడటం లేదు.

ఏ శిక్షా లేకుండా వదిలేసి వారు తిరిగి పశ్చాత్తాపం లేకుండా నేరాలు చేసే అవకాశం యివ్వమని ఎవరూ కోరరు. తాము దారుణంగా ప్రవర్తించిన తీరు తమను జీవితాంతం శిక్షిస్తుందని వారికి తెలియాలి. అందులో సందేహం లేదు. కాని తాము చేస్తున్నది అర్థం అయినా తమాయించుకునేందుకు అవసరం అయిన వ్యవస్థలు మెదడులో ఇంకా అభివృద్ధి కాని వయస్సు వారిని ముదిరిపోయిన హింసాప్రవృత్తి కలవారితో సమంగా చూడటం ఏ న్యాయం అవుతుంది. చట్టాలు శిక్షల లక్ష్యం నేరం పునరావృత్తం కాకుండా చూడటం – కరుడు గట్టిన నేరస్తుల్ని ఉత్పత్తి చేయటం కాదు.

అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో 10 సం||రాల వయస్సు వారిని కూడా పెద్దల కోర్టుల్లో విచారించే వీలుంది. యూరపులో వివిధ దేశాల్లో వివిధ వయస్సుల వారిని పెద్దల కోర్టుల్లో విచారించే చట్టాలున్నాయి. అయితే 90వ దశకం ప్రారంభం నుండి కౌమార వయస్కులకు కఠిన శిక్షలు విధిస్తామనే సందేశం యివ్వడం వలన ఏ ఫలితం వచ్చింది. 40-50% నేరాలు చేసేవారు కౌమార వయస్సులో చేసిన చిన్న పెద్ద నేరాలకు పెద్దలతోపాటు జైలు అనుభవించి నేర మాఫియాగా బైటికి వస్తున్నారు. కనుక ఇపుడు జైళ్ళకి పెట్టే ఖర్చును మళ్ళించి కౌమార వయస్కులను సామాజిక శిక్షల ద్వారా సరిచేయాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి.

అభివృద్ధి చెందిన దేశాల్లో బిడ్డల సంక్షేమానికి కేటాయించే విధులు, అమలు చేసే కార్యక్రమాలు మనలాంటి దేశాలు చూసి నేర్చుకోవల్సింది ఎంతవుందో అర్థం అవుతుంది.

కొత్తగా బాలల న్యాయ చట్టానికి సవరణలు చేసినా అవి నిర్భయ కేసుకు వర్తించదని చట్టంతో ఏపాటి పరిచయం గల వారికయినా తెలుస్తుంది ఈ చట్ట సవరణలు జరగడానికి ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని చిత్రించడంలో మీడియా సఫలం అయ్యింది. అంతేకాకుండా ఈ చట్ట సవరణలు జరిగితే ఇక బాలికలకూ స్త్రీలకు రక్షణ లభించినట్టేనని కూడా భారీ ప్రచారం జరిగింది. ఈ సవరణలు వ్యతిరేకించిన వారంతా అత్యాచారపరులుగా స్త్రీల గురించి లక్ష్యం లేనివారుగా ప్రకటించడం కూడా జరిగింది. రాజకీయ పక్షాలకు స్త్రీల సమస్యలు పట్టవు అనడానికి గత 70 సం||లు పార్లమెంటులో స్త్రీల స్థితిగతులపై ఒక్కసారయినా సమగ్ర చర్చ జరగకపోవడం కంటే నిదర్శనం అక్కరలేదు. కాంగ్రెస్‌, బిజెపి, సమాజవాది, జనతా వంటి పార్టీలు రిజర్వేషన్లపై అనుసరిస్తున్న వైఖరిచాలు. అయితే ఈ సందర్భంలో ఈ వాస్తవాలని చాలా తప్పుగా రెచ్చగొట్టడానికి వాడారు.

అసలు స్త్రీలపై జరిగే నేరాలలో 1.6 శాతం మాత్రమే 16 – 18 సం||ల వారు చేస్తున్నారు. పార్లమెంటులో దీన్ని 3 శాతంగా శ్రీమతి మేనకాగాంధీ పేర్కొన్నారు. అవి అన్ని రకాల నేరాలు కల్పి అనే విషయం అశ్వత్థామ హతఃకుంజర అయ్యింది. ముఖ్యంగా బాలికలపై అత్యాచారాలుగా పేర్కొన్న వాటిలో 34% 18 సం||రాలలోపు వారు ప్రేమికులుగా సంబంధాలు పెట్టుకున్నపుడు లేదా కల్సి పారిపోయినపుడు పిల్ల తల్లిదండ్రులు పెట్టిన కిడ్నాప్‌, రేప్‌ కేసులు, కులాంతర, మతాంతర ప్రేమలే కాదు మామూలుగా కూడా ప్రేమ అంటే పరువుపోవడంగా భావించే మన కుటుంబ పెద్దలు అమ్మాయి యిష్టపూర్వకంగా వెళ్ళిందని తెలిసి ఈ కేసులు బనాయిస్తున్నారు. అమ్మాయిల వయస్సు తప్పుగా మైనర్‌ అని రాస్తున్నారు. వయస్సు నిరూపితం కాగానే ఈ కేసులు కొట్టివేస్తున్నారు. ‘పరపతి’ గల కుటుంబం అయితే కేసులు వత్తిడితో కొనసాగిస్తున్నారు. లవ్‌ జిహాద్‌ ప్రారంభించిన సంస్థలు, ఖప్‌ పంచాయితీలు ఇటువంటి కేసులు నడిపించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.

మరి మిగిలిన 98.4 శాతం అత్యాచారాలు చేస్తున్న పెద్దల విషయంలో నేర విచారణ, నేర నిరూపణ సక్రమంగా జరిగి శిక్షలు పడటానికి జస్టిస్‌ వర్మ సూచించిన పోలీసు, న్యాయ వ్యవస్థ సంస్కరణలు గురించి ఎందుకు అధికారపక్షం మాట్లాడటం లేదు? కార్పొరేటు సంస్థలల్లో అంతర్గత ఫిర్యాదు కమిటీలు (లైంగిక వేధింపుల ఫిర్యాదు కొరకు) చట్టప్రకారం ఏర్పాటు చేయాలి. అది జరగటం లేదు అని శ్రీమతి మేనకాగాంధి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి లేఖ వ్రాసారు. ”అది కోరదగినది కాదు వారినుండి” అని ఘనత వహించిన అమాత్యుల జవాబు. అంటే దేశాభివృద్ధికి పాటుబడే ఈ గొప్ప విదేశీ కార్పొరేట్లను ఈ దేశ చట్టం పాటించమని అడగటం అనుచితం అనా? వారు లైంగిక నేరాలు చేయని పవిత్రులనా? వారు ఏ నేరం చేసినా, స్త్రీలపై కార్పొరేటు కంపెనీల్లో ఏ అకృత్యాలు జరిగినా అది వారి అంతర్గత విషయం అనా? మన దేశంలో కంపెనీ పెడితే మన చట్టం పాటించమంటే వారు అలిగి వెళ్లిపోతే అభివృద్ధి ఆగిపోతుందనా? అంటే అభివృద్ధి చక్రాల కింద స్త్రీల శరీరాలు నుజ్జు నుజ్జయినా ఫర్వా లేదనేగా? మైనర్స్‌కొక న్యాయం కార్పొరేట్లకు మరొక న్యాయం.

ఈ నిర్భయ కేసు మైనర్‌ పశ్చాత్తాప పడలేదని అతని కౌన్సిలర్‌ చెప్పాడని చెబుతున్నారు. ఏ కౌన్సిలర్‌ అయినా తన పేషెంటు వివరాలు లోకానికి వెల్లడిచేయటం నమ్మక ద్రోహం. ఏ ఆధారాలతో అతను అట్లాటి నిర్ణయానికి వచ్చాడోగాని అతను బట్టలు కుట్టడం, వంటచేయటం, పెయింటింగ్‌ నేర్చుకున్నాడని అతని శిక్షకులు చెబుతున్నారు. ఒకవేళ అతను సంస్కరింపబడకపోతే తాను చేసిన దారుణం ఏమిటో అతనికి అర్థం కాకపోతే ఈ మూడేళ్ళు ఆ కౌన్సిలర్‌, స్పెషల్‌ టీమ్‌ ఏం చేస్తున్నట్టు? ఇటువంటి కేసుల్లో 3 ఏళ్ళు చాలక పోవని అనుకుంటే ఆ కాలం పెంచవచ్చు. తీవ్ర మానసిక పరిస్థితి అదుపులోకి వచ్చేందుకు అవసర చర్యలు ప్రతిపాదించి అమలు చేయవచ్చు. 16-18 సం||రాల వయస్సు కాదు ఏ వయస్సులోనయినా తమాయించుకోలేని వారు, ఇతరులను గుడ్డిగా అనుకరించేవారు తాము అనుభవించిన హింసవల్ల మనుషులపై నమ్మకం పోయిన బాలల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయవచ్చు.

పెద్దల కోర్టుల్లోనే విచారించి పెద్దల జైలుకే ఎందుకు పంపాలి? పెద్దల జైలుకి వెళ్లిన పెద్దలు నేరాలు మానేసే శిక్ష అక్కడ వుందా? ఈ మైనర్‌ పరమ కిరాతకంగా బాధితురాలిపై దాడిచేసివుంటే ఈ వికృత మానసిక స్థితికి మానసిక వైద్యం చేయించాలి. ఆ మేరకు అతనికి పరీక్షలు జరిపారా? అదేం లేకుండా విడుదల అయ్యేతేదీ 3 ఏళ్ళ క్రితమే తెల్పినా చివరి నిమిషంలో ఈ డ్రామాలు దేనికి? అందుకే సుప్రీంకోర్టు ఏ చట్టప్రకారం అతని విడుదల ఆపాలి? మీకు కావల్సింది అతను మారడమా అతన్ని నిర్భందించడమా అని ప్రశ్నించింది.

ఇంకొక విచిత్ర వాదన ఏమంటే మూడేళ్లే కదా శిక్షాకాలం అని మైనర్లు నేరాలు చేస్తూ రెచ్చిపోతున్నారట. పరమ దారిద్య్రం, విచ్ఛిన్నమయిన కుటుంబాలు, వలస బతుకులు, ఆగిపోయిన చదువులు, తిండి లేక వీధుల్లో హింసనూ, ఛీత్కారాలను భరించే ఈ బాల  (నేరస్తు)లకు చట్టం అంతబాగా తెలుసన్నమాట. ఇది అసలు తలకాయ గల వాదనేనా? అది కాదు వారిని ఉగ్రవాదులు ఉపయోగించుకుంటున్నారు. మూడేళ్ళ శిక్షాకాలం ఏముంది అని మైనర్లకు నూరి పోస్తున్నారు. అట్లా ఈ బాల ఉగ్రవాదులు శిక్షలు లేకుండా బయటకు పోయి దేశంపై దాడి చేస్తున్నారట. ఇపుడు 16-18 సం||రాల వారిని జైలుకి పంపితే మరి వాళ్ళు 10 సం||రాల వారిని ఉపయోగించుకుంటే? ఉగ్రవాదానికి ఏ వయసయినా ఫర్వాలేదు గదా! చర్య తీసుకోవల్సింది ఉగ్రవాదంపైనా? బాలలపైనా? మత విద్వేషాలు రెచ్చగొట్టి మానవత్వం మరిచేలా చేస్తున్న వారికై ఏ చర్యలు తీసుకుంటారు?

ఇక జువెనైల్‌ హోమ్స్‌, స్పెషల్‌ హోమ్స్‌ నిర్వహణ ఎట్లా వుంది. ఉన్న 812 హోమ్స్‌లో 35 వేల మంది ఉంచాల్సిన చోట లక్షా 70 వేల మందిని కుక్కారు. వీరిలో 55 శాతం మంది కుటుంబాదాయం 25 వేల లోపు, 60 శాతం మంది పైగా దళితులు. ఈ హోమ్‌ దాటాక వారి పునరావాస ఏర్పాట్లు లేదా వృత్తి నైపుణ్యాలు నేర్పడం ఏమయినా వున్నాయా? వారు తిరిగి నేరాలు చేస్తూనే బతకాలా? ఇక ఈ సంస్థలు, అత్యాచారాలు, హింస, మాదకద్రవ్యాలు, దోపిడీ నిలయాలుగా ఉన్నాయని జస్టిస్‌ వర్మ పేర్కొన్నారు. ఆ బాలల ఇంటర్వ్యూలను కూడా తమ నివేదికలో చేర్చారు. వాటి మెరుగుదలకు గత మూడేళ్ళలో ఒక్క చర్యయినా చేపట్టారా?

ఆడుతూ పాడుతూ చదువుకుంటూ హాయిగా బతకాల్సిన బిడ్డలకు ఆహారం, రక్షణ కల్పించలేక వారు వికృత మనస్కులుగా, నేరస్థులుగా మారడానికి వేదిక కల్పించి మళ్ళీ వారిని కఠినంగా శిక్షించడం ఏ న్యాయం? వ్యవస్థలు బాల నేరస్తుల్ని సంస్కరించడం అంటే తమ సామూహిక వైఫల్యాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవటం లాంటిది. వారిని కఠినంగా శిక్షించడం అంటే తమ ఆ నేరంలో బాధ్యత నుండి వైదొలగడం అన్నమాట.

ఈ కాలం పిల్లలకు చాలా తొందరగా మానసిక పరిణతి వస్తున్నదట. ఈ పరిణతకి కారణం మీడియా అట. మీడియా ద్వారా వచ్చేది మానసిక పరిణతి అని ఎవరయినా భావిస్తే వారికి పరిణతి లేదని అర్థం. మీడియాలో నీలి చిత్రాలు, అసత్య దృశ్యాలు, అశ్లీల సంభాషణలు, నేరాలు, అకృత్యాలు పసివాళ్ళే కాదు పెద్దవారు కూడా చూడకూడనంత హింస ఉంటున్నది. దీని ప్రభావంతో పెడిఫెలి (పిల్లలపై లైంగిక చర్యలు) వంటివి పెరుగుతున్నాయి. వికృత చేష్టలు జరుగుతున్నాయి. ఇక విచక్షణా జ్ఞానం ఏర్పడని పిల్లలు యివి చూస్తే నిజంగానే ఆ ప్రభావం దారుణంగా వుంటుంది. మంచి చెడుల విచక్షణ రాని వయస్సు వారిని వీటినుండి దూరంగా ఉంచడానికి ప్రభుత్వం సమాజం ఏ జాగ్రత్తలు, ఏ నియంత్రణలు పాటిస్తున్నాయి? ఈ ప్రభావంవల్ల వారి ప్రవర్తనల్లో జరిగే ”అతి”ని పరిణతి అనవచ్చా?

”కౌమార వయస్కులలో భావోద్వేగాలు చాలా తీవ్రంగా పనిచేస్తాయి. లైంగిక కోర్కెలు కలుగుతాయి. అయితే సామాజిక నియమాల ప్రకారం ఆరోగ్యకరంగా కోర్కెలు తీర్చుకునే అవకాశం లభించేదాకా నిగ్రహం పాటించడం మంచిది. అలా జరగాలంటే వారిని రెచ్చగొట్టే దృశ్యాలు, సంఘటనలు, సంభాషణలు వారికి దూరంగా ఉండాలని” వందేళ్ళ క్రితం బెబెల్‌ రాశారు.

సెక్స్‌ను రెచ్చగొట్టి బతుకుతున్న మీడియా వారు రెచ్చిపోయారు కాబట్టి శిక్షించండి అంటున్నది. భేష్‌. బాలలకు నియంత్రణ లేదు సరే. మీరు ఏ విచక్షణ నియంత్రణా పాటిస్తున్నారని మీడియాను ఎవ్వరూ ప్రశ్నించరా? మీరు లాభాల కోసం, వ్యాపారాల కోసం బాల్యాన్ని బలిపెట్టే నేరానికి మీడియాకు ఎటువంటి శిక్షలు అమలు చేయాలి?

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో