కష్టేఫలి

తమ్మెర రాధిక

సీతమ్మ వీథి వాకిలివైపు విసుగు విరామం లేకుండా చూస్తోంది.

 పగలు పన్నెండు కావొస్తోంది.

 పల్లెటూరు కావటాన్నేమొ ఊళ్ళో జనాలు చేలకు చెలకలకు పోవటాన బావురుమంటున్నది.

 పెసరకాయ ఏరేకాలం ఆడాళ్ళంతా తట్టా బుట్టా నెత్తిన పెట్టుకొని వెళ్ళిపోయారు.  ఇళ్ళలో వుండేవాళ్ళు చాలా తక్కువ.  ఆమెకు ఆకలి చెరిగేస్తున్నది.  చేతిలో వున్న కొబ్బరి చిప్పల్ని తినాలని పదిసార్లు అనుకున్నా, భర్త వస్తే బియ్యం తెస్తాడే! అప్పుడు పచ్చడి చేస్తే  సరిపోతుందని ఆశ నిలువరిస్తోంది.  ఒకవేళ భర్త ఉత్త చేతుల్తో వస్తే ఇవి తిని నీళ్ళు తాగాలి.  రాఘవశాస్త్రి వచ్చే బస్సు ఇవ్వాళ అరగంట లేటు.
పన్నెండున్నరకు రానే వచ్చాడు.  అప్పుడే కన్నంటుకుంటున్నదామెకు.  ”ఎప్పుడూ ఆ నిద్రేమిటే దేభ్యం.  అసలు మనింటికి ఆ నిద్రే పెద్ద దరిద్రమైపోయింది.”  చేతి సంచి విసురుగా బల్లమీద పెట్టి దొడ్లోకి నడుస్తూ కసురుకున్నాడు.  సీతమ్మ ఏమీ పట్టించుకోలేదా మాటలకు.  గబగబా సంచి కుమ్మరించింది.  సంబారాలు పెద్దగా ఏం లేవు.  పసుపు కుంకాల పొట్లాలు, ఎండు కొబ్బరిచిప్ప, దోసెడు పసుపు కలిపిన బియ్యం.
”భారీగా దొరుకుతాయన్నారుగా ఇవ్వాళ. ఇవ్వేనా?” ఆమె వెటకారానికి బదులివ్వకుండా జేబులోంచి డబ్బులు తీసాడు.
”ఇవ్వాళ సరుకేం వద్దన్నా.  హాయిగా కొనుక్కు తిందాం.”
సీతమ్మ పొయ్యిలో పిడక వేసి నిప్పు రాజేసి ఎసరు పడేసే వరకు కూరల, బియ్యం పట్టుకొచ్చాడు భర్త.  సొరకాయ పొట్టు తీసి కూటుకు తరిగాడు.  ఎసట్లో బియ్యం ఉడుకుపడుతుంటే బంగాళదుంపలు పచ్చిమిరపకాయలు తరుక్కుని, తిరగమూత గింజలు కలుపుకుంది.  నాలుగు ఎండు మిరపకాయలు గూట్లో వుంటే ఏరి తుంపి పోపుల డబ్బాలో పడేసి, ”నేను రెడ్డి దగ్గరకు పోయి పంచెలచాపు పట్టుకొస్తా త్వరగా వడ్డించెయ్‌” అంటూ రాఘవయ్య బైట తలుపు దగ్గరికి చేరేసి వెళ్ళిపోయాడు.
రాఘవయ్య దానాలు పట్టే బ్రాహ్మడు.  శని దానాలు, చావు దానాలు పడతాడు.  పెద్ద శాస్త్రులు గారితో కల్సి తద్దినాలకూ భోక్తగా పోతుంటాడు.
సీతమ్మ వంట పూర్తి చేసి దొడ్డి వెనక్కి వచ్చి తులసమ్మకి నీళ్ళు పోసి, చిన్న బెల్లంముక్క నైవేద్యం పెట్టి, మందారపువ్వు కొప్పులో తురుముకుని తలెత్తి చూసింది.  బట్టలారేస్త అవతల రెడ్డిగారి భార్య సీతమ్మనే చూస్తోంది.
”పనైందా దొర్సానీ?” సీతమ్మ పలకరించింది.
”ఆ అయింది.  పని పిల్లని గంజి చీరెలు ఆరెయ్యమంటే మర్ల బడ్తాంది…గీ కాలం పోరలు బద్మాషులైతండ్రు.  పంతులుగా రొచ్చిండ్రా… సాపాటు చేసిండ్రా?” ప్రశ్నించింది.
”బైటికి పోయిండు.  ఇప్పుడే బియ్యం దెస్తే వంట చేసిన.”
”తిన్లేదాను…మరి చల్ల బొట్టున్నది పొయ్యనా?”
ఆ మాటకు సీతమ్మ తలపి గిన్నె పట్టుకొచ్చింది.  దొర్సాని దొడ్డంతా కూరల పాదులే.  ఆకుకూరల మళ్ళు,  మునగచెట్లు, నేరేడు చెట్లు, నిమ్మ, దబ్బ చెట్లు.  చెట్టు చెట్టుకూ బర్లు కట్టేసి వున్నయి.  పాడి పుష్కలం.  చల్ల గిన్నెలోకి వొంచి ”పంతులు గార్తోని కాస్త చెప్పుండ్రి… పొలం కొన్నం… మంచి ముహూర్తం చెప్తరు… దున్నకానికి…” అన్నది.  ఇందుకాను చల్లబొట్టు దానం అనుకుంది సీతమ్మ.  ఈ పల్లెటర్లో కాపురానికొచ్చి పాతికేళ్ళు దాటుతోంది.  చిన్న వంటగది-ముందు నలుగురు కూర్చునే వసారా, నాలుగు తడికెలు అడ్డం కట్టి దాన్నే గదిగా పర్చుకున్నారు.  పెరడు పెద్దగా లేదు.  బావి, బాదం చెట్టు, చెట్టు చుట్ట కొద్దిగా జాగా.  దాంట్లోనే బచ్చలి, కాకర తీగెలు వేసింది.  దొర్సాని లాగా చెట్లు వేసుకోవాలని ఆరాటం వున్నా స్థలం లేదు.  ఇంటి ముందు కొద్ది ఖాళీ జాగ అమ్మి కూతురు పెళ్ళి చేసి పంపేటప్పటికి పదివేలు అప్పుపడింది.  ఏరోజూ మడ్డి కొట్టి నోట్లో వేసుకోవడమే.  పదికీ, పరకకూ కార్యాలు చెయ్యడం, మందెక్కువైన కొద్దీ మజ్జిగ పల్చనలా కుర్ర బ్రాహ్మలంతా మొపెడ్లు, సైకిళ్ళు వేసుకు తిరుగుతూ పన్లు దక్కించు కోవడంతో ఆదాయం మరీ పడిపోతోంది.
”మరీ నిద్రమొహంలా కూర్చోకపోతే ఏదైనా పదిపైసలు సంపాయించే ఆలోచన చెయ్యకూడదు?” సీతమ్మ దిగులుగా వున్నప్పుడు రాఘవయ్య దెప్పుతుంటాడు.
”చదువా? సంధ్యా? నాకెవడిస్తాడు పని?”
”సంపాయించడమంటే ఉద్యోగం కాదే దేభ్యం!  ఇంట్లో వుండే సాపాటుకు లోటు లేకుండా చూసుకోవచ్చు.”
”ఎట్ల?” ఆశ్చర్యపోయింది సీతమ్మ.
”నేను మొదట్నించి చెప్తూనే వున్న.  వైద్యం తెల్సాయె.  గచ్చాకో పుచ్చుకో ఇచ్చి నాలుగు సరుకులు సంపాయించలేవాయె”. ”ఆ మందులు ఇయ్యబట్టే కదా, ఉప్పు చింతపండు ఫ్రీగ ఇస్తున్నపుడు షావుకారు” చేతులు తిప్పిందామె.  ఆమె తండ్రి ఇంట్లో మందులు తయరుచేసి, దీర్ఘరోగుల్ని కొంతమందిని చేతులో పట్టుకొని వైద్యం చేస్త పొట్ట పోసుకునేవాడు.  ఆ ఒడుపు ఆమెకు పట్టుపడ్డది.  పక్క బస్తీలో పెళ్ళిళ్ళకు విస్తళ్ళు కావల్సి వచ్చినప్పుడు ఇరవయ్యి ముప్ఫై కట్టలు సప్లై చేసేది.  రాఘవయ్య కల్యాణ మండపం ఓనరుతో మాట్లాడి బేరం తేగానే వంద విస్తళ్ళు ఒక కట్ట లెక్కన కట్ట పంపేది.  క్రిందా మీదా పడితే గానీ, నాలుగు వేళ్ళు లోపలికి పోవట్లేదు.  రాఘవయ్యకు కూడా వెనకట్లాగా బేరాల్లేవు.  అందుకే దానాలు కూడా పడ్తునే ఉన్నాడీ మధ్య.  యిద్దరకూ వాదనలో వుండంగనే షావుకారు వచ్చిండు.
”సీతమ్మక్కా ఏం జేస్తున్నావ్‌? అరే బావ గడ వున్నడు గదా! మంచి టైంకే వచ్చిన…” గోడకు చేరేసిన పీట వాల్చుకోని కూచున్నడు.
”ఏందో పని?” పంచాంగం పక్కన పెట్టి, చాప మీంచి లేచి కూర్చున్నాడు రాఘవయ్య.
”అక్కతోనే పని… అక్కా నీతోని చెప్పిన ఓపాలి.  ఇస్తరాకుల మిషన్‌ తెస్తనని.  ఇప్పుడు మా చుట్టపాయన తెచ్చిండు.  ఊర్కె చేతులు నొవ్వంగ కుట్టుడు కంటె, మిషన్‌ మీద దబదబ కుట్టొచ్చు.  పైసలు కూడ శాన కండ్ల జూస్తం.  ముందుగాల నీకే అవకాశం ఇద్దమని నీకాడికి వచ్చిన”.  సీతమ్మకు అర్థం కాలే, అర్థం అయిన రాఘవయ్య దవడలు బిగుసుకున్నయిమాట్లాడనీకే.  ”కూలి బాగనే గిడ్తదంటవ్‌!” మాటలు కూడదీసుకుని పలికిండు రాఘవయ్య.
”అట్లనకు బావా…అక్క ఎన్ని కట్టలు కుడితే అన్నింటికి కమీషన్‌ అనుకోరాదు.  ఆకులు ఎట్లయిన అక్కే తెప్పిస్తది.  దానికి కూడ డబ్బులు కట్టేస్తే అయిపాయె.”
సీతమ్మ కండ్లకు నీళ్ళు తిరిగినయి.  తటాలున లేచి లోనకు పోబోయింది.
”ఏందక్కా?” షావుకారు ప్రశ్నకు ”వక్క తెస్త తమ్మి” అన్నది.
గట్లో వక్క ఎండు ఖర్జరం వెతికి, కళ్ళు తుడుచుకోని, అవి తెచ్చి షావుకారు కిచ్చింది.
”ఆలోచించుకోండ్రిద్దరు.” పక్కేసుకోని, పీట తీసి గోడకు చేరేసి వెళ్ళిపోయిండు.
”సంపాయించు… సంపాయించు అన్నవ్‌ గదా! కూలిదాన్ని చేసిండు తమ్ముడు.  రేపట్నించి సీతమ్మ కూలిపని చేస్తదంటరు.”
”ఛత్‌… దొర్సాని చేస్తున్న పనేంది?  కూరగాయలమ్ముతది, జీతగానికి కూరగాయలిచ్చి బస్సుకు తోల్తది.  వాడు పట్నం అమ్ముకొస్తడు.  ఆ పైసలు బెట్టి సొమ్ములు చేయిస్తది.  నిమ్మకాయలు, దబ్బకాయలు అన్ని అమ్మిస్తది.  ఎన్నడన్న, ఎవడికన్న పుణ్యానికి పెట్టంగ చూసినవా?  గీపని కూడ అటువంటిదే నీ కష్టం వానికి అమ్ముతున్నవు, డబ్బులు తీసుకుంటవ్‌… బస్‌…” అతని కంఠంలో అసహనం, బాధ దాచుకున్న దాగట్లేదు.
సీతమ్మ విస్తళ్ళు కుట్టాలనే నిర్ణయించుకుంది.  చీరలు కూడా లేవు కట్టుకోవడానికి, ఈ దరిద్రాన్ని ఈరోజే వదిలించు కోవాలి.  ఇంట్లో వుండి చేసుకునే పని నాదానేం లేదు అని అనుకున్నప్పుడు మనసు కుదుటపడింది.  అయినా కూలీకి కుదిరాను అన్న ఆలోచన ములుకులా గుచ్చుకుంటనే వుంది.  నెలనాడు షావుకారు పైసలు లెక్కసరి చూస్తున్నప్పుడు ఊరిజనాలు పదిమంది దాకా ముహూర్తాలు చూపించుకోవడానికి కూర్చుని ఉన్నారు.
”ఇస్తార్లు కుడ్తాంది అమ్మగారు” గుసగుసలు పోయారు.
”ఇద్దరేనాయె… పైసలన్ని ఏం జేస్తాండో? ఇంక గీ పనెందుకు?”
ఇంట్ల కూర్చొని అవి లేవు ఇవి లేవు అని బాధపడినన్నాళ్ళు అంతా దరిద్రమే.  ఇప్పుడు విస్తళ్ళు కుడుత డ్వాక్రా గ్రూప్‌లో చేరింది.  మొదట్లో అంతా ముక్కున వేలేసుకున్నా, అలాంటి వారికే లీడరయ్యింది.  ప్రశ్నించడం నేర్చుకున్నాక తెలిసినవాళ్ళని పెసర్లు కందులు కాయ అడగడం, వారి సమస్యలకు తనకు తెలిసిన వైద్యం చెయ్యడం మొదలుపెట్టింది.  భార్యలో ఇన్నాళ్ళు స్థబ్తుగా వున్న చైతన్యం చూసి రాఘవయ్య ఆశ్చర్యపోయాడు.  ఖాళీగా వున్నప్పుడు పెసళ్ళు ఎండబోసి ఎవరికోసమైనా ఎదురుచూసేది.  పనిమీద ఎవరైనా రాంగానే విసుర్రాయి ముందు కూర్చోబెట్టి మాటాముచ్చట మొదలుపెట్టేది.  పప్పులు విసిరించుకోవడం, కాస్తో కూస్తో ముహూర్తాలు చెప్పడం, డ్వాక్రా లీడరొస్తే టీలవీ పోసి, వాళ్ళతో అన్ని వ్యవ హారాలు చర్చించడం క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నది.  చంటిపిల్లని తీసుకొని, కూతుర్ని వెంబడి పెట్టుకొని బండి దిగాడో రోజు రాఘవయ్య.  నీళ్ళాడి వెళ్ళినాక నిద్ర చేయించాలని కూతుర్ని తీసుకొచ్చారు.  తల్లిలోని మార్పు ఆ అమ్మాయికి ఆశ్చర్యం అన్పించింది.  తడిక చాటు నుంచి మాట్లాడుత, ఎప్పుడ తనలో తాను కుమిలిపోతు దీనంగా వుండే అమ్మేనా అని!
”అమ్మా డ్వాక్రా లోన్స్‌లో చిప్స్‌ చేసే మిషన్‌ తీసుకోరాదు.  దాంతో ఎవరికైనా పని కల్పించొచ్చు, నీకూ ఆదాయం వుంటుంది” అందో రోజు.  ”లేదు లేవే కలర్‌ కవర్స్‌లో వచ్చే చిప్సే అందరు కొంటారు.  మనం ఎట్లా చెయ్యగలం అంత భారీ ఎత్తున?”
”చుడువాగానీ  కారాగానీ చెయ్యమ్మా ఎవరన్నా పిల్లని పెట్టుకోని.  ప్యాకెట్స్‌లో వేసి బస్తీకి పంపు.  నాన్నారికి తెల్సిన మ్యారేజి హాలు వుంది కదా!  వాళ్ళకు చెప్పినా సరే”. సీతమ్మకు ఈ వ౦ట నచ్చింది.  గ్రూపులోని అందర్నీ కలుపుకొని తన పథకం చెప్పింది.  అంతా ఒప్పుకున్నాక మంచిరోజు చూసి, సామాను తెప్పించి, అందరు కల్సి కారా తయరుచేసి పాకెట్స్‌లో నింపారు.  రాఘవయ్య వాటన్నింటినీ ఆటోలో వేసుకొని బస్తీకెళ్ళాడు.  తెల్సిన షాపులో అరువుకైనా అడిగినన్ని ఇచ్చాడు.  మిగిలినవి ఏం చెయ్యలో అర్థం కాలేదు.  అటు ఇటూ తిరిగిన కాస్త శ్రమకే చికాకు పడిపోయడు.  సీతమ్మ ఎంత కష్టపడుతోందో?  ఎలా నిర్వహించుకొస్తోందో?  ఇంటికొచ్చినాక భార్య కాళ్ళకు నీళ్ళిస్తుంటే పరీక్షగా చూసాడామెని.  శ్రమైక సౌందర్యం!
పీటవాల్చి విస్తరి వేసి, రాగి చెంబు లో నీళ్ళు చల్లి విస్తరి దులిపి మళ్ళీ వేసి మామిడికాయ పప్పు, ఉప్పు మిరపకాయలు, వడియాలు వడ్డించింది.  వంకాయ పచ్చడి రాతి జాడీలోంచి విస్తట్లో వేస్తె ”రేగుపళ్ళ పచ్చడిలా పట్రావే అమ్మలు” అంటుంటే కష్టంలోని ఆనందం రేగుపళ్ళ పచ్చడిలా పుల్లగా, తియ్యగా, కారంగా ఇష్టంగా అన్పిస్తుంటే నెయ్యి వేసుకొని సుష్టుగా తిన్నాడు రాఘవయ్య.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో