ఓల్గా తీరం వెంట…- డా|| శిలాలోలిత

ఓల్గా ప్రముఖ స్త్రీవాద రచయిత్రి. రష్యన్‌ నదీ ప్రవాహ రూపమైన ‘ఓల్గా’ తన లలిత స్వరంతోనే తెలుగు సాహిత్యంలో స్త్రీ వాద ఉద్యమ స్పృహను, స్ఫూర్తిని, వ్యాప్తిని కలిగించింది. 80’ల తర్వాత స్త్రీవాద ఉద్యమ స్ఫూర్తికి ఓల్గా చేసిన కృషి ఎన్నటికీ మరువలేనిది. గత నాలుగు దశాబ్దాలుగా ప్రతిక్షణం ఆమె స్త్రీల పక్షం వహించి, చైతన్యవంతమైన ఆలోచనలు చేసింది. స్త్రీల సాధికారత కోసం పురుష ప్రపంచంతో పోరాడింది. అనేక కోణాలతో స్త్రీల స్థితిని వివిధ ప్రక్రియల్లో చర్చించింది. అందుకే ఆమె ఒక యాక్టివిస్ట్‌గానే కాకుండా ఒక ఉత్తమ శ్రేణి సృజనకారిణి అయింది. స్త్రీ పురుషుల మధ్య, మానవీయమైన, ప్రజాస్వామిక సంబంధాలేర్పడాలని ఆమె ప్రయత్నించింది.

వామపక్ష ఉద్యమాల్లోంచి సాహిత్యంలోకి వచ్చిన వ్యక్తి ఓల్గా. 1972 ఆ ప్రాంతంలోనే, ఆ ఉద్యమ స్ఫూర్తితోనే ‘పంచాది నిర్మల వారసురాల్ని’, ‘ఆకలే మిగిలింది’ లాంటి కవితలు రాసింది. 1972 నుంచి 2009 వరకు అంటే 37 సంవత్సరాలపాటు రాసిన 48 కవితలతో ‘ఓల్గా కవితలు కొన్ని’ (2011లో) అనే కవితా సంకలనాన్ని ప్రచురించింది. కథలు, నవలలు, నాటికలు, ఏకాంకికలు, విమర్శావ్యాసాలు, సిద్ధాంత గ్రంథాల అనువాదాలు, స్త్రీవాద సిద్ధాంత వ్యాప్తికై రచించిన నృత్యరూపకాలు, సంపాదకత్వం వహించిన ‘మీకు గోడలులేవు’, ‘నీలిమేఘాలు’, ‘మహిళావరణం’ వంటివి 10కి పైగా పుస్తకాలు, కథా సంకలనాలు, ప్రసంగాలు, ఉపన్యాసాలు, సెమినార్లు, రచయిత్రులతో నిర్వహించిన సెమినార్లు, ఇతర భాషా రచయిత్రులను సైతం కలుపుకొని అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటుచేసిన కార్యక్రమాలు, దర్శకురాలిగా చేసిన సినీరంగ ప్రవేశం, స్క్రిప్ట్‌ రైటర్‌గా ఇటు టి.వి. సీరియల్స్‌, అటు సినిమాలకు చేసిన కృషి ఇలా ఒకటేమిటి? బహురూపాల్లో ఆమె సాహిత్యకృషి నిరంతరం కొనసాగుతూనే ఉంది.

పి.జి నుంచి పాఠ్యాంశాలుగా ఓల్గా రచనలు ఉండడం వల్ల, విద్యార్థులు సైతం ఓల్గా రచనలకు ఆకర్షితులై ఉత్తేజితు లవుతున్నారు. గ్రూప్స్‌కి ప్రిపేర్‌ అవుతున్న విద్యార్థులు సైతం, ఓల్గా ఫోన్‌ నంబర్‌ ఇవ్వగలరా? అని ఫోన్లు చేస్తూ ఉంటారు. వాళ్ళలోని పఠనాసక్తి, స్త్రీవాద అవగాహన కోసం పడుతున్న తాపత్రయం, ఓల్గా పట్ల వారి కేర్పడిన గౌరవం నన్నెంతో సంతోషానికి గురిచేస్తుంది. ఒక తరాన్ని ప్రభావితం చేసిన అపురూపమైన వ్యక్తి ఓల్గా. 1993లో తీసుకొచ్చిన ‘నీలిమేఘాలు’ ఒక అద్భుతమైన కృషి. కవయిత్రులందరూ ఏక కంఠంతో నినదించిన సందర్భమది. స్త్రీవాద ఉద్యమ స్ఫూర్తికి ప్రతిఫలం అది. మళ్ళీ అలాంటి ప్రయత్నం ఇప్పుడు కూడా జరిగితే చాలా బాగుంటుంది. ఈ కాలానికి అవసరం కూడా. స్త్రీలకు తమ గొంతులను స్వేచ్ఛగా వినిపించే అవకాశాన్ని ఆ సంకలనం కలిగించింది. నీలిమేఘాలపై యూనివర్సిటీల స్థాయిలో పరిశోధనలు కూడా చాలా జరిగాయి.

స్త్రీ మనసుకీ, స్త్రీ భావాలకు, అనుభూతులకు స్థానం లేని సమాజం మీద, ఒక వేళ స్థానం వున్నా స్త్రీని భోగవస్తువుగా చేసి శృంగార స్థాయిలోనే ఆమెను నిలిపి ఉంచడం పట్ల ‘అందమైన దోపిడి’ కవితలో (ఓల్గా – అందమైన దోపిడి, జీవనాడి 1974) తీవ్రమైన నిరసనను తెలియజేస్తుంది. ప్రబంధ కాలపు స్త్రీకి, నేటి స్త్రీకి తేడా ఏమీ లేదని, ఆనాటి కంటే నేడే హీనదృష్టితో స్త్రీని చూస్తున్నారని భావించింది.

”నేను స్త్రీని

సెక్స్‌ వికృత స్వరూపాన్ని

ఈ ఆధునిక సమాజపు అంగడిలో

షోకేస్‌లో అమర్చబడిన బొమ్మని”

దీన్లో ఓల్గా స్త్రీని వ్యాపార వస్తువుగా చేసిన సంస్కృతి పైన తిరుగుబాటు చేసింది. స్త్రీలందరి గొంతుల్ని, బాధల్ని తన స్వరంలోంచి వినిపించింది. ఇదే వ్యాపార సంస్కృతి జీవితంలోని కళాత్మక విలువల్ని ఆపాదిస్తుందని, సభ్యసమాజం కూడా ఈ వైఖరిని ఆమోదిస్తుందని చెబుతూ, ”సౌందర్యారాధన పేరుతో / ఈ వ్యాపార ప్రపంచంలో / నా అంగాంగ ప్రదర్శనలు / రకరకాల సరుకుల అమ్మకాలలో / తార్పుడుకై నా అవయవాలు / ఆధునిక హోటళ్ళలో / నాగరిక వ్యక్తుల పార్టీలలో / నా దిగంబర నాట్యాలు / చెప్పుకింద మల్లెపువ్వు నా జీవితం” చివరి చరణంలో స్త్రీ స్థానం ఎక్కడుందో చాలా స్పష్టంగా చూపించి, వ్యవస్థ చేతిలో కీలుబొమ్మలై, దిగంబర నృత్యాలు చెయ్యాల్సిన స్థితిలో స్త్రీలు బతకవలసి రావడం, నాగరిక సమాజ పతనాన్నే సూచిస్తోంది అన్న వాస్తవాన్ని వివరించింది. తరతరాలుగా స్త్రీ పడుతున్న కష్టాల్ని చెప్పుతూ –

”అందమైన దోపిడీకి / పవిత్రమైన హింసకు, న్యాయమైన దాస్యానికి, బలైపోయిన భారత స్త్రీని / కొంతకాలం పతివ్రతని, కుష్ఠురోగాల ఎంగిళ్ళ కుక్కని / అనుమానాలు అవమానాలు / అగ్నిజ్వాలలకు ఆహుతిని / సహగమన జ్వాల శలభాన్ని – (‘ఓల్గా’ – ప్రతి స్త్రీ ఒక నిర్మల కావాలి, – ‘ప్రభంజనం’ – 15.10.72) అంటూ అనాదిగా స్త్రీపై జరిగిన అత్యాచారాన్ని కళ్ళకు రూపుకట్టిస్తుంది. గత వర్తమానాలకు పరిస్థితిలో మార్పేమీ లేదని చెప్తూ –

”కొంతకాలం ప్రబంధకన్యని / నోరూరించే పంచదార చిలకని / రాజుల కోసం రోదించిన కోయిలని / స్థనాల బరువుతో చచ్చిన శవాన్ని / మనిషిని కాను అష్టమభోగాన్ని” – ఇలా ఉన్న స్త్రీ స్థానాన్ని వివరిస్తూనే, బాల్య వివాహాల వల్ల స్త్రీకి జరిగే అన్యాయాన్ని గురించి చెబ్తూ –

”పుట్టు వితంతువుని / మొగుడు చచ్చిన ముండని / ఎందుకు పుట్టానో ఎందుకు పెరిగానో / ఎవరి కోసం జీవిస్తున్నానో / తెలియని వెర్రి తల్లిని / వెలివేయబడ్డ బ్రతుకుని” –

– అని స్త్రీల పట్ల సమాజం చూపుతున్న వివక్షతను, పితృస్వామ్యం స్త్రీ ఇష్టానిష్టాలతో ప్రమేయం లేకుండా సాగిస్తున్న అధికారానికి, స్త్రీల జీవితాలు ఏ విధంగా చీకట్లోకి నెట్టవేయబడుతున్నాయో, సవిమర్శకంగా నిరూపిస్తుంది. ఉన్నత వర్గ స్త్రీ పైకి స్వేచ్ఛను అనుభవించినట్లు కనిపించినా అది నిజమైన స్వేచ్ఛ కాదని, ఆమె జీవితం ఆమె ఇష్టానుసారంగా కాక పురుషుడి ఆదేశానుసారం నడుస్తుందని, అందువల్ల మానసిక స్వేచ్ఛ లేని ఆమె రెక్కలు విరిగిన పక్షిలాంటిదని చూపుతూ –

”భర్తల హోదాల, అధికారుల / కార్లకు బార్లకు బంధీని / ఫేషన్‌ పెరేడ్‌ బంధాలలోపడి / నలిగి పోవడమేగాని / స్వేచ్ఛ లేని విహంగాన్ని / ధనికవర్గపు దరిద్రాన్ని” – అంటూ ఉన్నత వర్గానికి చెందిన స్త్రీ మనోవేదనను కూడా చిత్రిస్తుంది.

మధ్యతరగతి మహిళ జీవితంలోని యాంత్రికతను చెపుతూ – ”తినటం, పిల్లల్ని కనటం తప్ప / మరేదీ పట్టని / పట్టించుకోవడానికి తీరని / మర చక్రాన్ని / మధ్య తరగతి మహిళని” – అంటూ శ్రామిక వర్గ స్త్రీని చిత్రిస్తూ, ఆ స్త్రీ ఎదుర్కొంటున్న పేదరికాన్ని గురించి –

”పొద్దస్తమానం పనిచేస్తే / వచ్చిన ‘ఆడకూలి’ డబ్బులతో / పిల్లలకింత గంజైనా పోద్దామంటే / తాగి మొగుడి తన్నులకు / ఆగని బిడ్డల ఏడుపును / భరించలేక / కన్నబిడ్డలకు విషం పెట్టిన / పవిత్ర మాతృదేవతని” –

పశ్చాత్తాపంతో కూడిన స్త్రీ అంతరంగాన్ని ఆవిష్కరించింది. ఇందులో పురుషుడితో సమానంగా కష్టించిన్నప్పటికీ తగిన వేతనం రాక, బాధ్యతల్ని తప్పించుకొని తిరిగే భర్త వల్ల ఎదురైన కష్టం, వీటికి తోడుగా కన్న బిడ్డలకు కడుపు నింపలేని నిస్సహాయస్థితిని దీనిని చూపించింది. అయితే తల్లిపడే మానసిక క్షోభ, జీవితం మీద ఆగ్రహానికి దారితీసి, పిల్లల్ని చంపుకున్న పవిత్ర మాతృదేవత నయ్యానని తననుతాను నిందించుకుంటూ ఉండటం కనిపిస్తుంది. ఈ విధమైన సంఘర్షణల మధ్య నలుగుతున్న స్త్రీలు చేయవలసిన పోరాటం గురించి చెపుతూ –

”రేపు నేను / పతివ్రతామ తల్లినికాను / ప్రబంధ కన్యనుకాను / పంచదార చిలకను కాను / పసిపాల చంపే పాపిని కాను / పంచాది నిర్మల వారసురాల్ని” – అంటూ పోరాటాన్ని ఆశ్రయించమంటుంది.

ఇలా మొదలైన ఓల్గా కవిత్వాన్ని పరిశీలిస్తే, ఒకనాటి ప్రాచీన ధోరణి కనుమరుగై, భావకవితా ఛాయలు కొంతసడలి, అభ్యుదయ ధోరణితో ఆలోచన మొదలై, తామూ మనుషులమే నన్న స్పృహ మొదలై, ఎవరు, ఏమిటి, ఎందుకు, ఎలా అనే అస్తిత్వ వేదన చెంది, అందులో నుండి పుట్టిన విప్లవ ధోరణితో, సమాజపు వైఖరిని, కూలంకషంగా అర్థం చేసుకొని సమానత్వ సాధనకై, తమ ఉనికికై చేసే పోరాటాన్ని స్వేచ్ఛా ధోరణిలో కొనసాగిస్తూ, సామాజిక మార్పుల అన్వేషణకై, స్త్రీల సమానత్వ సిద్ధికై, సాహితీ ప్రక్రియను చేపట్టాలన్న ఒక నిబద్ధత ప్రారంభమై, స్త్రీ వాద ఉద్యమ ధోరణే కవిత్వోద్దేశ్యంగా రూపుదిద్దుకుంది అనిపిస్తుంది.

ఐతే, ఓల్గా కవిత్వంతో మొదలైందే కానీ, అక్కడే ఆగిపోలేదు. తనలోని అంతర్గత వేదనకు కవిత్వం వాహికైంది. ఇంకా ఎక్కువమంది దగ్గరకు తాను రచనై వెళ్ళాలనుకుంటే కథ, నవల లాంటి ఇతర ప్రక్రియల్లో చెప్పగలిగితే బాగుంటుందని ఆమె భావించడంతో పాటు విస్తృతంగా రచించారు. రచనను ఒక బాధ్యతగా, రాజకీయ అవసరంగా భావించారు. ఒక కమిట్‌మెంట్‌ ఉన్న రచయిత్రిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.

‘నిజానికి స్త్రీవాద కవిత్వాన్ని కవిత్వం కాదన్న వాళ్ళు లేరు. అది కవిత్వమేననే భావనతోనే చర్చ ప్రారంభమైంది. అంటే, స్త్రీవాదులు యుద్ధం ప్రారంభించకముందే సాధించిన ఒక విజయమిది’ అన్నారు ‘చేరా’. స్త్రీవాద కవిత్వంలో కవిత్వపు విలువలు సమకాలికమైన ఇతర ధోరణులలో కన్నా తక్కువేమీ కాదనీ, ఆ మాటకొస్తే, ఇతర కవుల కొన్ని సంపుటాలతో సాధించిన గుర్తింపును కవయిత్రులు కొన్ని ఖండికలతోనే సాధించారని గ్రహించటం కష్టం కాదు అని కూడా అన్నారు చేరా.

స్త్రీవాద సిద్ధాంత భావజాలంతో, ధిక్కార స్వరంతో ఓల్గా కవ్వితముంటుంది. తాను నమ్మిన సిద్ధాంత వ్యాప్తికై విశేషమైన కృషి చేసింది. ‘స్వేచ్ఛ’ నవల ఎంతోమందిని మార్చింది. ఆలోచనా దృక్పథాలలో పెనుమార్పులను తీసుకొచ్చింది అనడంలో అతిశయోక్తి కాదు. తన రచనల ద్వారా స్త్రీల స్థితిలో మార్పు, సమానత్వం రావాలని, ప్రజాస్వామిక పద్ధతుల్లో స్త్రీ గుర్తింపబడాలని స్త్రీల పక్షాన నిలబడి పోరాడుతున్న విప్లవ వనిత ఓల్గా. ఒక తరాన్ని మొత్తం (నాతో సహా) ఆమె రచనలు ప్రభావితం చేశాయి.

విద్యార్థినిగా ఉన్నప్పటి నుంచీ ఓల్గా విప్లవ రాజకీయాలతో ఉన్న చైతన్యం వల్ల ఆ క్రమంలోనే స్త్రీల జీవితాలను పరిశీలిస్తూ, స్త్రీవాద ఉద్యమంలో ప్రవేశించారు. ”ఒక రాజకీయ అవసరం కోసమే నేను రచయితనయ్యాను” అంటారామె. ‘మెహందీ స్త్రీలకు విజ్ఞప్తి’ ఓల్గా రాసిన కవితల్లో బలమైన కవిత-

”చావడానికి మాదగ్గరికి రాకండి

బతకడానికి నానా చావూ చస్తున్నవాళ్ళం’-

వాడెవడో వచ్చి ఒళ్ళోపడి చనిపోతే, జాలిపడి ఆస్పత్రిలో చేరిస్తే, విషాహారం వల్ల వాడు చనిపోయాడని పోలీసులు వాళ్ళపై జరిపిన హింసను చూసి ఓల్గా విచలితమై రాసిన కవిత అది.

ఇంటిపని అనేది సహజమైనదిగా, స్త్రీలు నిర్వహించవలసినదిగా, అది స్త్రీల బాధ్యతగా భావించటం వల్ల స్త్రీల అణచివేతకు ఒక భౌతిక ఆధారాన్ని పురుష స్వామ్యం కల్పించిందని ఫెమినిస్టులు పేర్కొంటారు. స్త్రీని ‘గృహలక్ష్మి’గా గౌరవిస్తూనే, పురుష స్వామ్యం ఏవిధంగా అణచివేస్తుందో వివరిస్తూ ఓల్గా-

రుబ్బుడు పొత్రంలా / తల తిరుగుతూనే వున్నా / ఆలోచనల పప్పు మెదగదు… నడుం బండకేసి బాదినా / కాటుక కంటనీరు జాడించినా / మనసుల మురికి వదలనే వదలదు.

స్త్రీ నిర్విరామంగా చేసే ఇంటిపనిని చిత్రించింది. ఆమె పనిచేసే యంత్రంగానే మిగిలిపోతున్న స్థితిని చూపించింది. పనిచేసే వస్తువులతో తనని తాను పోల్చుకుని, తాను ఒక పరికరంగా భావించుకునే స్త్రీని ఆవిష్కరించింది. చివరకు తన కలలు తుంపరలు ‘హృదయ పెనం’ పై పడి ఆవిరైపోతున్నాయని చెపుతుంది. ఇంటిపనులనేవి స్త్రీలలో ఎంతగా జీర్ణించుకు పోయాయో చెపుతూ, వీటితోపాటుగా ప్రకృతిసిద్ధంగా పునరుత్పత్తి శక్తి వల్ల తల్లి అయినందుకు ఆ పనిభారం కూడా మీద పడటాన్ని సూచిస్తూ –

అలుగ్గుడ్డల పీతిబట్టల / పరిమళంలో పునీతమవుతున్నా / జీవితం ఎందుకో ఎప్పుడూ / కాటువాసన వేస్తుంటుంది. స్త్రీకి జీవితం పట్ల కలిగే విసుగునూ అసంతృప్తినీ ప్రకటిస్తుంది.

ఓల్గా ఇల్లు, ఇంటిపని, వస్తువులు, గృహాలంకరణలూ, ఈ ఆధునిక జీవిత వేగంతో స్త్రీపై ఎంతటి ఒత్తిడిని తెస్తాయో వివరించింది. స్పందనలకు దూరమై శరీరమెంత మొద్దుబారిపోతుందో వివరిస్తుంది. అలాగే ఎన్నాళ్ళకీ తరగని ఇంటిపనిపై విసుగును వ్యక్తపరుస్తుంది. అలసట అనేది లేకుండా షోకేస్‌ బొమ్మలా ఉండలేని తన నిస్సహాయత్వాన్ని క్షమించమని కోరుతూ, తానెందుకు జడంగా మారిపోయిందో, యాంత్రీకరణలు తననెంత గాయపర్చాయో విడమరుస్తుంది. పనులు చేసిచేసి విసుగొచ్చి నిద్రగన్నేరయింది మనసు అంటుంది. ‘సూపర్‌ ఉమెన్‌ కాలేను – ఈ వస్తు సమస్తాన్ని ధ్వంసం చేసి నన్నందుకో నేస్తం’ – అంటుంది (సూపర్‌ ఉమెన్‌ కాలేను)

‘ఆకలే మిగిలింది’ – కవితలో శ్రామికురాలిపై లైంగిక హింసలు ఎలా ఉంటాయో, ఆర్థిక దోపిడీని గురించీ, బలవంతపు మాతృత్వాలు ఆకలి ఆక్రోశాన్ని గురించీ వినిపించారు.

‘రెక్కలు ముక్కలు చేసుకొనీ / పొద్దస్తమానం ఎద్దులా పనిచేసి / ఈ భూమిని చెమటతో తడిపాను / ఏపుగా పెరిగిన పైరును / నిండు యవ్వనంలోని నన్ను ఒక కంటితో కామందు చూచినప్పుడు / గుండె పగిలేలా ఏడిస్తే ఆ కన్నీళ్ళు ఈ భూమినే తడిపాయి’ / – అంటుంది.

తరతరాలుగా భూస్వామ్య వ్యవస్థ, ఆడదాన్ని ఆస్థిగా భావించే సంస్కృతీ, ఆమెనొక వస్తువనీ, ఉపయోగించుకునే హక్కు, మగతనం ఉన్నాయనే క్రౌర్యానికి నిదర్శనమిది.

ఓల్గా, గుంటూరు ఎ.సి. కాలేజీలో డిగ్రీ చదివే రోజుల్నించీ కవిత్వం రాస్తూనే ఉంది. 1971 ఆ ప్రాంతంలోనే ‘పైగంబరకవులు’గా ఏర్పడి తమని తాము ప్రకటించుకున్నారు. కవిత్వ సంకలనాలు తీసుకొని వచ్చారు. దేవీప్రియ, సుగమ్‌బాబు, ఓల్గా, కిరణ్‌బాబు, కమలాకాంత్‌లు గ్రూప్‌గా ఏర్పడి కవిత్వం రాశారు. నక్సల్బరీ, శ్రీకాకుళ ఉద్యమ ప్రభావంతో, విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొంటూ విరసంలో 1975 వరకూ సభ్యురాలిగా ఉంది. తర్వాత జనసాహితిలో ఉన్నారు. శ్రీశ్రీ అంటే చాలా ఇష్టంగా ఉండి వైజాగ్‌లో జరుగుతున్న శ్రీశ్రీ షష్టిపూర్తికి వెళ్ళడంలో ఎంతో ఉద్వేగానికి గురయ్యానని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

‘రాత్రి’ కవితలన్నీ ఒక దీర్ఘ కవితలోని అధ్యాయాల్లా ఉంటాయి. ప్రణాళికతో రాసినవి కాదు. ఒక మౌలికమైన సమస్యను దశాబ్దాలుగా, పలుకోణాల్లో మానసికంగా, భావోద్వేగంతో అనుభవించి పలవరించి బేరీజు వేసుకొని రాస్తే తప్ప ఇలాంటి కవితలు రావు. కొందరు పురుషులు భావించినట్లు స్త్రీవాదం ఒక కంప్లైంట్‌ కాదు. ఒక విశిష్ట జీవన విధానం. స్త్రీ పురుషులిద్దరూ కోల్పోతున్న ఒక అనర్ఘ అనుభూతుల మాలిక. చీకటిని చీకటిగా గుర్తించని కళ్ళకు సరికొత్త వెలుగు దీపిక. ఈ తెలివిడి కలగాల్సింది ముందుగా పురుషులకే. స్త్రీల షికాయతు కేవలం షికాయతు కాదనే దానికి ఆస్కారం లేనట్లయితే ఈ జీవితం ఎంతో ఉజ్జ్వలంగా ఉండి ఉండేదనిపిస్తుంది. తాను పొందాలనుకుంటున్నది ఒట్టి డొల్ల ఆశ, పురుషుడు రసప్రపూర్ణమైన జీవన భాండాన్ని కోల్పోయాడనీ అర్థమౌతుంది’ అని యన్‌.గోపీ అన్నారు. (ముందు మాట-యన్‌.గోపి – ఓల్గా కవితలు కొన్ని – సంకలనం)

‘కిష్వర్‌ నషీద్‌’ ఉర్దూలో రాసిన కవిత్వము ‘నిన్ను ప్రేమించే వాళ్ళెంత పిచ్చివాళ్ళు’ – అనే పేరుతో ఓల్గా అనువదించింది. ప్రేమిస్తున్నామనుకుంటూ స్వేచ్ఛకు ఎంత దూరం చేస్తారో ఈ కవిత చెబుతుంది.

‘జీవితం’ – కవితలో – చివరికెప్పుడో తెలుస్తుంది / నిన్ను ప్రేమించే వారికంటే / నువ్వు ద్వేషించే వారినే / మిక్కిలి ఎక్కువగా ప్రేమించావని – అనే నగ్నసత్యాన్ని చిన్నమాటలో చెప్పేసింది. చదివిన వాళ్ళం ఒక్క క్షణం ఉలిక్కిపడ్తాం, నిజమే కదా అని.

‘దాంపత్యం’ – కవితలో ఆదర్శ దంపతులుగా బతుకుతున్న వారి మానసిక ద్వారాలు తెరిస్తే, ఎన్ని బాటలో, ఎంత బోలుతనమో, ఎంత వంచనో చాలా వ్యంగ్యంగా చెప్పిన కవిత ఇది.

ఓల్గా స్నేహమయి, ప్రేమమయి. అందుకే తాను కన్న ‘కల’ కవితలో ‘లక్ష నక్షత్రాల రాత్రి’లో అసంఖ్యాక స్నేహ సమూహాన్ని గుర్తు చేసుకుంది.

రావిశాస్త్రిగారి మీద జాలిపడి రాసిన కవిత ‘ఔను మేం గయ్యాళులమే!’ చాలా పవర్‌ఫుల్‌ పోయెం ఇది.

‘నూరేళ్ళ క్రితం మధురవాణి మృదువైన మందలింపులు / మీ దళసరి చర్మాలకు ఆననప్పుడు / మేం ఈటెల్లాంటి మాటలతోనే పొడుస్తాం…. / సుతిమెత్తగా ప్రేమ పలుకులు పలుకుతామా? / మేం గయ్యాళులమే కాదు భయంకర కాషళులం, – అని గర్జించడంతోపాటు ‘ఇన్నాళ్ళూ మీరు చెప్పినట్లు నడిచి, మా ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా మీదైన అహంకారాన్ని ఎదుర్కోవడానికి, మా ఆక్రోశమంతా అరుపుకాక తప్పదు’. అని చాలా స్పష్టంగా చెప్పింది.

‘రొటీన్‌’ కవితలో స్త్రీ తన ఇంట్లోనే తన స్వయంగా ‘పాడె’ను కట్టుకుంటూ శవప్రాయంగా బ్రతుకీడుస్తోందంది.

‘జ్వాలే నన్ను మెలకువగా ఉంచుతుంది / నిలువెల్లా మండుతున్నా దహనం కాకుండా / ఆ జ్వాలే నన్ను కాపాడుతుంది’ / – అంటుంది ‘జ్వాల’ – కవితలో.

లయాత్మకంగా, పాటలా ప్రవహించిన కవిత – ‘మహిళల హక్కులు – మానవ హక్కులు’.

1998లో చైనాలో షియాన్‌ నగరాన్ని చూసి అక్కడి ప్రసిద్ధ కవి యాంగ్‌ విషన్‌ని కలిసినప్పటి అనుభూతిని ‘షియాన్‌కి ప్రేమతో’ – అంటూ కవిత రాసింది. – ఇక్కడ ‘మెర్సీబుద్ధా’ను స్త్రీ రూపంలోని / దేవతగా కొలుస్తారని తెలుసుకున్నాను’ – అంటుంది.

పత్తి రైతుల ఆత్మహత్యల గురించి ఎందరెందరో కవితలు రాశారు. ఆగ్రహం, ఆవేదనలు కలగలిపి. కానీ ఓల్గా ప్రత్యేకత వేరు. ఆ రైతు భార్య జీవతమేమిటి అన్న ప్రశ్న మొదలై, ‘చావుని కాదు బతుకుని’ – అని కవిత రాసింది. ముద్దకే కాదు / యుద్ధానికి పిడికిలి బిగించాలని / నా పిల్లలకు నేర్పడానికి / నేను బతికి తీరతాను / చావునుకాదు- / బతుకును కావలించుకుంటాను / బతుకు పోరును/ చావునుకాదు- / బతుకును కావలించుకుంటాను / బతుకు పోరును కావిలించుకుంటాను / అనే నిర్ణయ ప్రకటనను చేయిస్తుంది.

గుజరాతీ భాషలో – ‘లావేజ్‌ కాన్‌ పరియా’ రాసిన కవితను ‘మరో దారివైపు చూస్తూ’ – అనే కవితగా అనువదించింది. ‘గమ్యం ఎంతదూరమో అంత చేరువ’ – అనే దార్శనిక సత్యాన్ని ఈ కవితలో చెప్పింది.

‘యాక్టివిస్ట్‌ యాతన’ – కవితలో ‘ఎవరెవరి ఏకాకితనాలకో / నేను పూచీ పడటంతో / గుండెకు ఒంటరితనపు వైరస్‌ సోకుతుంది!’ అని విషాద స్వప్న శకలాన్ని కవితలో కళ్ళకు కట్టినట్లుగా వర్ణించింది.

‘హింస’- కవిత అద్భుతమైన కవిత. తన జీవనానుభవం, రాజకీయానుభవం, సాహిత్యానుభవం, పాండిత్యానుభవం అంతా ఒకచోట కలిస్తే, అక్షరాలై పుష్పిస్తే పుట్టిన కవిత అది.

అర్జెంటీనా కవి రాబర్టో జుర్రాజ్‌ రాసిన కవితను ‘నేను’ అనే కవితగా అనుసృజించింది. అనుసృజన అని ఎందుంటున్నానంటే, అంత సహజంగా తెలుగు కవితలా వుంది – ‘నేను చచ్చిపోతే / నా గురించి తలుచుకోటానిక / నేను కూడా ఉండను / … నాకు నేనే అనుకోటానికి / అప్పుడు నేను ఉండను కదా / నేను లేకుండా పోయి / ప్రతిదాన్నీ లేకుండా చేస్తాను / అందుకే కాబోలు / మనం మన గురించి కాకుండా / ఇంకొకర్ని గురించి ఆలోచిస్తే / వాళ్ళను రక్షించిన / అనుభూతేదో కలుగుతుంది’. – ఈ కవితను మనం ఎంతైనా విశ్లేషించుకోవచ్చు. ఒక్కొక్కపదం, భావం దిగంతాల కావల అర్థాల్ని మనదాకా మోసుకొని వస్తుంది.

‘అద్వైతసిద్ధి కోసమని తెలియని / ఒక ఉన్మాదపు వెతుకులాటని’ – ‘కిశోరనిశ’లో ప్రతిబింబించింది. రసఝరీ ప్రవాహంలో అన్వేషణా స్థాయిని తెలిపింది.

దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ శతజయంతి సందర్భంగా రాసిన కవిత ‘ప్రవాహ సౌందర్యం’ – స్త్రీలందరి పక్షాన సివంగులమ వుతామని తెలియజేస్తూ ప్రవహించిన కవిత ఇది.

ఓల్గాకు రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ అంటే చాలా ఇష్టం. ఎంతిష్టమంటే, ‘స్వేచ్ఛాగీతం’ పేరుతో అనువదించడమే కాక, చాలామంది దగ్గరకు ఆ కవిత వెళ్ళేలా శ్రమ పడింది. నాకొక మిత్రుడు కూడా ఈ కవితను ఫ్రేం కట్టించి నూతన సంవత్సరపు బహుమతిగా ఇచ్చారు.

‘ఎక్కడ మనస్సు నిర్భయమో

ఎక్కడ శిరస్సు సమున్నతమో

ఎక్కడ జ్ఞానం స్వతంత్రమో

ఎక్కడ పరిపూర్ణత అవిశ్రాంత అన్వేషితమో

ఎక్కడ వాక్కులు సత్య సంజనితములో

ఎక్కడ సహేతు స్వచ్ఛ ప్రవాహం

మృత ఆచారపు టెడారి దారుల ఇంకనిదో

ఎక్కడ ఆలోచన ఆచరణముల మేధస్సు నిత్య విస్తారితమో

తండ్రీ ఆ స్వేచ్ఛా తీరంలోనికి

మేల్కొలుపు నా దేశాన్ని!

‘రాత్రి’లోని చీకటిని, దుఃఖాన్ని, నిర్మలతను, నిశ్శబ్దాన్ని, విశాలత్వాన్ని, వేకువతత్వాన్ని అలవర్చుకొని, వెన్నెలను తోడు తెచ్చుకుని అమావాస్యపు చీకట్లను పారద్రోలే నల్లని రాత్రంటే ఓల్గాకు చాలా ఇష్టం. అందుకే ఈ పుస్తకంలో 15 రాత్రులపై కవితల్ని రాసింది. ఒకదానికొకటి పొంతనలేదు. విలక్షణమైన విభిన్న రూపాలివి – ప్రేమ రాహిత్యపు రాత్రి, నిశాప్రసవం, మారాత్రులు మాకు కావాలి, రాత్రులకు వందనం, రాజకీయరాత్రులు, పంతపు రాత్రి, మృత్యుహిమరాత్రి, కలలులేని రాత్రి, ఒంటరి రాత్రి, రెండు రాత్రులు, ప్రశ్నలరాత్రి, చిన్ననాటి రాత్రులు, కిశోరనిశ, విజయోన్నత రాత్రి, అస్తిత్వరాత్రి.

కవిత్మ నిర్మాణంతో చెక్కిన కొన్ని మంచి కవితలివి – మాతృత్వం, వసంతకాల మేఘగర్జన, గర్భాశయానికి వీడ్కోలు, మాటలు, ఋతువులు లేని కాలం, ఒంటరి, సాఫల్యం మొదలైనవి.

మొత్తమ్మీద ఓల్గా కవిత్వ సంద్రంలో మునకలేసిన తర్వాత ఆ సాగర ప్రవాహ ఉధృతిలో కొట్టుకుపోక తప్పదు. తన జీవన పరిణామ క్రమమంతా కవిత్వంలో గోచరించింది. అభ్యుదయవాదిగా, విప్లవవాదిగా, స్త్రీ వాదిగా ఓల్గా సాగించిన సాహితీ ప్రయాణం ఆమెను మనీషిని చేసింది. తత్కాల జీవన నేపథ్యాలు, జీవనావసరాలు, స్త్రీలకు ఆత్మ విశ్వాసం కలగడానికి దోహద పడే దిశగా చేసిన సాహిత్య కృషి ఎన్నదగినవి. ఓల్గా గురించి ఇంతరాసినా నాకింకా అసంతృప్తిగానే వుంది. ఇంకా రాయాల్సినది ఎంతో ఉంది. కానీ ఓల్గా పట్ల నాకున్న అపారమైన గౌరవమే నన్ను రాయించింది.

ఇలా ఓల్గా తీరం వెంట… కవిత్వ కెరటాల్ని మోసుకొని ఎంతదూరం ప్రయాణించినా అలసటే రాదు. ఒక్కో కవితా జీవన దార్శనికతకు నిదర్శనం. స్త్రీవాద ఉద్యమం ఓల్గా కొక దిక్సూచిలా సాహిత్య యాత్రను కొనసాగిస్తూ ఉంది. ‘కొండ అద్దమందు కొంచెమై ఉండదా’ – అన్నట్లుగా ఓల్గాను నేను వివరించాలని అనుకున్నా అది సాధ్యమయ్యే పనికాదు. ఇంకా… ఇంకా… ఎంతో మిగిలిపోయేవుంది. ప్రస్తుతానికి ఒక కామాపెట్టి ఆపుతున్నాను.

ఉపయుక్త గ్రంథసూచి :

1. కవయిత్రుల కవిత్వంలో స్త్రీ మనోభావాలు – పి. లక్ష్మి (యం.ఫిల్‌. సిద్ధాంత గ్రంథం)

2. కవయిత్రుల కవితా మార్గం – శిలాలోలిత (పిహెచ్‌.డి. సిద్ధాంత గ్రంథం)

3. ఓల్గా కవితలు కొన్ని – ఓల్గా

4. ‘భూమిక’ – స్త్రీవాద పత్రిక – వర్ధమాన లేఖ – జూన్‌ 1915.

5. ‘ముందుమాట’ – ఓల్గా కవితలు కొన్ని – యన్‌.గోపి

6. ‘మాకు గోడలులేవు’ – వ్యాస సంకలనం – ఓల్గా

7. గురిచూసి పాడే పాట – స్త్రీవాద కవితా సంకలనం

8. ‘నీలి మేఘాలు’ – స్త్రీవాదకవితా సంకలనం – 1993

9. కుటుంబ వ్యవస్థ – మార్క్సిజం – ఓల్గా – విరసం ప్రచురణలు

10. పాలిటిక్స్‌కు కొత్త నిర్వచనం – స్త్రీవాద ఉద్యమం 1 వ్యా ‘నలుపు’ – పత్రిక లలిత.కె.

11. చేరాతలు – చేరా – ఆంధ్రజ్యోతి 30, జూలై 1990

12. ‘సంతకాలు’ – నవంబరు – 1992 – సూపర్‌ ఉమెన్‌ కాలేను – కవిత – ఓల్గా.

13. చేరా – సాహితీ గవాక్షం – ఆంధ్రప్రభ – డైలీ – ఇంకా పదునెక్కని స్త్రీవాద విమర్శ – ఆదివారం – జూన్‌ 16 – 1996

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

One Response to ఓల్గా తీరం వెంట…- డా|| శిలాలోలిత

  1. RAKUMARI says:

    శిలాలోలిత గారు ధన్యవాదాలు ఈ సాహిత్యం అంత కొనుక్కోవాలి కొన్ని చోట్ల కొన్నే ఉంటున్నాయి అన్ని కావాల్లి ఎక్కడ దొరుకుతాయో చెప్పండి అన్ని కావాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో