మాలసుబ్బి బాప్టీజము – శ్రీమతి మరుపూరు వేంకటసుబ్బమ్మగారు

నెల్లూరు జిల్లా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని మొత్తం ఆస్తిని ఉద్యమానికి అర్పించిన త్యాగశీలి శ్రీమతి పొంకా కనకమ్మ గారు. జిల్లాలో అత్యంత ధనికులైన మూడు కుటుంబాల్లో కనకమ్మ గారిదొకటి. కనకమ్మ గారి ఏకైక సంతానం వెంకట సుబ్బమ్మ. కనకమ్మ తన కుమార్తె వివాహాన్ని తన పెదతమ్ముడు మరుపూరు పిచ్చిరెడ్డిగారితో జరిపించారు.

వెంకట సుబ్బమ్మ తల్లి అడుగు జాడలలో దేశసేవికగా, సంఘసేవికగా ఉదారభావాలున్న రచయిత్రిగా ఎదుగుతున్న తరుణంలోనే, ఇరవై ఆరేళ్ల వయసులో (1935) విధి ఆమె జీవితాన్ని నిర్దాక్షిణ్యంగా చిదిమివేసింది. ఆమె చాలా నిరాడంబరంగా, నిర్మలంగా, వినమ్రంగా కనిపించేదని, పేదలపట్ల ఎంతో దయచూపేదని, తల్లి త్యాగగుణాన్ని, ఆదర్శాలను పుణికి పుచ్చుకొన్నదని ప్రత్యక్షంగా ఎరిగిన ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మగారు రాశారు. గాంధీజీ నెల్లూరు వచ్చినపుడు వెంకటసుబ్బమ్మ తన ఒంటిమీది 20 సవరల బంగారు నగలు ఇచ్చివేసింది. అనారోగ్యంతో ఉండికూడా కాంగ్రెసు సభ్యత్వ నమోదు కార్యక్రమంలోను, రాయలసీమ క్షామనిధి వసూళ్లకు తీవ్రంగా కృషిచేసింది.

ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో మరుపూరు వెంకటసుబ్బమ్మ రచనలు రెడ్డిరాణి, గృహలక్ష్మి, సుబోధినిలో అచ్చయ్యాయి. ఈమె రచించిన ‘ఇందిర’ కథ 1930 ఫిబ్రవరి రెడ్డి రాశిలో, ‘మాలసుబ్బి బాప్టీజంలో ప్రవేశం’ గృహలక్ష్మి 1930 అక్టోబరు సంచికలోను అచ్చయ్యాయి. అస్పృశ్యతను గురించి వెంకటసుబ్బమ్మ అభిప్రాయాలు ‘మాలసుబ్బి బాప్టీజంలో ప్రవేశం’ కథలో వ్యక్తమయ్యాయి. సవర్ణులు అస్పృశ్యతను పాటించటంవల్లే ‘మాలలు’ క్రైస్తవంలో ప్రవేశిస్తున్నారని, హిందూ సమాజంలోని అజ్ఞానం, మూఢవిశ్వాసాలు సమాజాభివృద్ధికి ఆటంకంగా నిలుస్తున్నాయని ఈ రచనలో ప్రతిపాదించింది.                        - కాళిదాసు పురుషోత్తం

ఒకటో రంగము
(రామాబాయమ్మ నీళ్లబిందె తీసికొని ప్రవేశించుచున్నది. ఆవైపుననే సుబ్బి అను 18 ఏండ్ల మాల పిల్ల పోవుచున్నది.)
రామా : దూరం! దూరం! మీదకొస్తావేం? కళ్లకు పొరలు గ్రమ్మినవాయేం?
సుబ్బి : అమ్మా! మీరెవరు! నాకు మీకు యెంతో దూరం ఉన్నదే. ఎందుకిలా అంటారమ్మా!
రామా : ఓసీ! నేనెవరైనది కనబడుటలేదా! నాకులమడుగుదానవు నీవా? దూరమైన నీచకులము దానవు.
సుబ్బి : అమ్మా! నే దూరముగానడుచుటకు నాయందు దోషమేమి? నేను మీవంటిదానను గానా? ఏందుకమ్మా! మమ్ములచూచిన యీ నిరసనభావము? మమ్ముల ఏ దేవుడు చేసినాడో మిమ్ము ఆ దేవుడే చేసినాడు. మీకు యెంత బుద్ధిజ్ఞానములున్నవో మాకు అంత వున్నవి. తల్లీ! ఎందుకిలా కోపపడెదరు? నాయందు యేనీచ గుణము కనిపెట్టితిరి? మీలాటివారు ఇట్లు చూచుటచే మాబోటి అనాధలు క్రిష్టియనులో కలుస్తున్నారు. భిన్నాభిప్రాయములతో నైకమత్యములేక మీమతమూ క్షీణించిపోతున్నదే! దానికైనా కంటతడి పెట్టరాదా?
రామా : ఏమే! ఎట్లెట్లు! నీ మెట్టవేదాంతములిక చాలింపు. నీబోటి మహాత్మురాండ్రను చేరతీసిన మా మతముండును. లేనియెడల క్షీణించునా? ఏమిమాయలమారి మాటలు నేర్చితివే? గొడ్లు తిను చండాలులైన మీకు కూడా ఇంత తెలివా? ఎప్పుడు వినని మాటలాడుతున్నావు. ఇక చాలు నడువు.
సుబ్బి : అమ్మా! మీవంటివారు చేరదీసి యిటువంటి నీచకృత్యములు చేయవద్దని మందలించి మాకింత బ్రతుకు తెన్ను
చూపిన యికనట్లు చేయుదుమా? మీరు మా జోక్యము కలిగించుకొనక యెచ్చటనో వూరిబయలున ఒక మారుమూల వుండమని మా ముఖము చూచిన పాపమని మీరనుకొనుట చేతనే మేము జీవనాధారము లేక మనకు బ్రహ్మలలాటమున వ్రాసిన విధియిదేకాబోలని గొడ్లను భక్షించి వాటి చర్మము చెఫ్పులు మొదలగునవి చేసుకొని వాటిని మీలాంటివారికి తక్కువమొత్తమునకు అమ్మి ఆ డబ్బుతో క్షుద్భాధ తీర్చుకొనుచున్నాము. ఇందు మాదోషమేమున్నది? అలాంటివి మంచివికావని చెప్పినచో మేము వినకున్న మమ్ము నిరసనభావముతో చూడవలెగాని ఇట్లు నిష్కారణముగా మమ్ములనిందించుట న్యాయమా?
రామా : ఆహా! యేమి శ్రీరంగనీతులే! యెంతలేసినీతులు చెప్ప మొదలు పెట్టితివే! మీజన్మతో పుట్టిన నీచగుణములు ఒకరు చెప్పిన మానుదురా?
(ఇంతలో ఝాన్సీ బడికెళ్లుచు, ప్రవేశము)
ఝాన్సీ : అక్కా! యేమిటీ గోల? రోడ్డుపై మనుష్యులు వెళ్లకుండా చేస్తావాయేమి? అది యెక్కడనో అంతదూరములో నిలుచుకొనివుంటే దానితో నీకెందుకీతగవు? అధవా మనిషి నీకెదురు గావచ్చినదిపో, నీవు తొలగివెళ్లిన లోపమేమి?
రామా : చాలునమ్మా! మీకిష్టమైతే ఆ నీచకులము వారిని నెత్తికెక్కించుకోండి. మీకున్న ఓర్పు నాకు లేదు. ఈ కాలమువారి బుద్ధులన్నియు యిట్లామండిపోతున్నాయి. క్రిష్టియను బళ్ళలో యప్ఫే, బియ్యే చదువుతూ వారి సహవాసము చేస్తే ఈలాంటి బుద్ధులు కాక మంచివి వస్తవా? రామ! రామ! కాలమెట్టి కలికాలమో కదా!
ఝాన్సీ : అంటే కోపమొస్తుంది కాని యేమెడ్రాసు నుంచో, బొంబాయి నుంచో ఒక మాలవాడు వచ్చి హోటలు పెట్టిన
మనమగవారు పోయి అక్కడ కాఫీ ఫలహారము తీసుకోవడము లేదా? సోడాషాపులో క్రిష్టియన్సు సోడాబుడ్డి కొట్టియిచ్చిన తాగడము లేదా? తురకవాడు ఇచ్చిన తాగడము లేదా? ఇవన్ని రోజురోజు బావగారు, అన్నగారు పరమానందముతో చేసేవేకదా! యేమాలవాడో కలెక్టరు గానుంటే నౌకరీకొరకు వాని కాళ్లమీదపడి ప్రాధేయపడవచ్చును. ఇంతెందుకు మొన్న మా చెల్లెలికి జబ్బు చేస్తే అమెరికన్‌ ఆసుపత్రికి పోతే ఒక క్రిష్టియన్‌ నరుసు వచ్చి మమ్ములను తాకి మందు యివ్వలేదా? దీనికంతా మూఢత్వమే కారణము అక్కా!
రామా : చాలు లేవమ్మా! వాళ్లని వీళ్లని ఒకటే చేస్తావా?
ఝాన్సీ : అవునులే అక్కా! వారు వీరు ఒకటెందుకవుతారు. ఈ మాలవారే మతములో కలిసి కొద్ధో గొప్పో చదువుకొని డాక్టరులుగా వస్తేనో, లేక నర్సులుగా వస్తేనో వారికి వంగివంగి సలాములు చేయవచ్చును. కాని ఇప్పుడైతే అంటుగాదూమరి?
(ఇంతలో బడిగంటవినబడును.)
ఝాన్సీ : అక్కా! బడిటైమయింది. వెళ్లుతాను. దానితో నీకిష్టము లేకపోతే చూచిచూడనట్టు పోవాలగాని తగవులు పెట్టుకొని కూర్చుంటే ఏమి మర్యాద.
(అంటూ ఝాన్సీ వెళ్లును.)
రామా : అమ్మయ్య! ఇప్పటికి పెద్దలకు పంగనామాలు పెట్టేది బయలుదేరింది. ఎట్లాగయితేనేమి ఎఫ్ఫే చదువుతోంది. 19 యేండ్లున్నాయి. చిన్నా పెద్దా లేకుండా యింతవరకు చదువుతూ వుంటే యిలాంటి విపరీత బుద్ధులు కాక మరేమి పట్టుబడతాయి. (సుబ్బివంక చూచి) ఏమే యికనైన వెళ్లుతావా లేదా? నీ మూలాన యెంత ఆలస్యమైనదే! బిడ్డ యేడుస్తుందేమో?
సుబ్బి : అమ్మా! మిమ్ముల నడ్డుపెట్టవలెనని నాకు మాత్రముందా? మీరు అక్కడ నిల్చుంటే యింకొకళ్లు వచ్చి దారి తొలగమంటే మీ కెంత అవమానముగా ఉంటుందో యోచించుకొండి (అంటూ ప్రక్కకు తొలగును.)
రామా : యేమిటీ వెధవగోల?
(అంటూ ధుమధుమలాడుచూ యింటివైపు వెళ్లును. సుబ్బి తనపరాభవమును గుఱించి దుఃఖించుచూ వెళ్లును.)
రెండో రంగము
(సుబ్బి దీనవదనముతో ఒక యింటి అరుగు మీద కూర్చోని ఉండును.)
సుబ్బి : (తనలో) రేపు ఆదివారము బాప్టీజమిప్పించెదమని మిరియమ్మగా రనుచున్నారు. క్రీస్తు మతమునందు నాకంతనమ్మకము లేదు కాని పొట్టకూటికై చేరవలసివచ్చుచున్నది. ఆనాడు ఆమె అన్న మాటలు నా హృదయమున ములుకులవలె నాటుకొని ఈ తుచ్ఛజన్మ మేలవచ్చినదా అని చింతించుతూ ఈ దారిన వెళ్లుతున్న దేవుడంపిన దూతవలె నా పాలిటికి ఈ మిస్సమ్మ అగపడి పాఠశాలలు తెరచిన చేర్పించెదనని చెప్పినది. ఆవల డాక్టరు పరీక్షకు పంపెదనని చెప్పినది. దేవుని కటాక్షమువల్ల ఐదు సంవత్సరములు గడచి గట్టెక్కిన అదృష్టవంతురాలినే! మాబోటి దీనులకు పరోపకారము చేయుటకంటే యింకేమి కావలెను యీమిషనీరలకు.
మూడోరంగము
(ఆరేండ్లు గడచినవి. అమెరికన్‌ ఆసుపత్రి. రామాబాయమ్మ పండుకొనివుండును. ప్రక్కన ఝాన్సీ, డాక్టరు కూర్చోని ఉందురు.)
డాక్టరు : అమ్మా! యిప్పటికి మీ బాధ కొంత తగ్గినదని తలుస్తాను.
రామా : తమ దయవల్ల యిప్పటికి కొంత తగ్గినది. ఇంటికి వెళ్లుటకు తమ సెలవుకొరకు నిరీక్షిస్తున్నాను.
డాక్టరు : ఇప్పుడు తమరు లేచి తిరుగకూడదు. కాన, యింక పదిరోజులుదాక యింటికి వెళ్లుట మంచిది కాదు.
రామా : డాక్టరు గారు నే వచ్చినప్పటినుంచి నాకొక సందేహము గానున్నది. తమరిని యెచ్చటనో చూచినట్లున్నది. తమ పేరేమమ్మా!
డాక్టరు : అదేనా సందేహము? ఆనాడు తమచే అనరానిమాటలనిపించుకున్న సుబ్బిని కదా! యింతలోనే మరచితిరా? ఇదంతా మీ ధర్మమే!
రామా : (ప్రక్కమీదనుంచి త్రుళ్లిపడి) యేమి? అవును, ఈ మధ్య యెవరో మాలపల్లిలోనుంచి ఒకామె క్రిష్టియన్సులో కలసి చదువకోను వెళ్లినట్లు విన్నాను. నీవేనా? చాలా సంతోషమమ్మ.
డాక్టరు : అవునండి తమబోటివారంత మాపై బహిష్కారాయుధమును ఝులిపింతురు; కాననే మా స్థితి అధోగతి పాలగుచున్నది. ఆ మరియమ్మకున్న కరుణ మీబోటివారలకు లేకపోయినందులకు చింతించుతున్నాను. ఆమె దయవల్లనే ఇప్పుడు నేను పదిపావులు తెచ్చుకొని గౌరవంగా బ్రతుకుతున్నా.
రామా : నేనొక్కర్తెను యేమి చేయగలను సంఘమంత అలా గోషిస్తుంటే?
ఝాన్సీ : అక్కా! నేనొక్కటి చెప్పుతా; ఎంతకాలము ప్రతి వ్యక్తి మతమును, ప్రతిమానవుని శ్రేయమును సర్వజనమతముగను, సర్వజనశ్రేయముగను భావింపమో అంతకాలము హిందూదేశము బాగుపడుట దుస్తరము; సుఖదుఃఖములను హానివృద్ధులను పరస్పరము పంచుకొననిచో మన మెట్టి అభ్యుదయమునుగాని అధిష్టింపజాలము. అన్యోన్యకలహము మొదలగునవియే ఆర్యావర్తప్రాచీనరాజ్యభ్రష్టతకు, దాస్యమునకును ప్రబలకారణములు. సోదరుల అంతఃకలహములే కుటుంబము యొక్క అధికారమును, పలుకుబడిని, గౌరవమును నశింపజేయుచున్నవి. అన్యోన్య కలహమేకదా కురుపాండవులను, యాదవులను నశింపజేసినది? ప్రాణమానభంగకరమగు ఆఘోరవ్యాధియే మన ఆర్యావర్తజనుల పట్టి పీల్చి పిప్పిచేయుచున్నది. అది యెప్పటికైన మనలను విడిచిపోవునో, లేక మన సౌఖ్యములను శాశ్వతదుఃఖకూపమున బడద్రోయునో తెలియకున్నది.

డాక్టరు : ఇన్నియేల దీనికంతయు హిందువులకు విద్యాభావమే కారణము. మరియు పండితుల మూర్ఖత. మంచిగాని చెడ్డగాని బిడ్డస్వభావనిర్ణయమునకు తల్లియే బాధ్యత వహించును. బిడ్డలను బాగుచేసి వృద్ధికి తెచ్చునది, పాడుచేయునది తల్లియే. అట్టి తల్లికి విద్యాగంధమున్నచో దైవసమముకాగలదు. బిడ్డకు ఆది నుండియే సమభావమును తల్లి గరపిన పవిత్రమైన హిందూమతము అనుదినము ఇట్లు క్షీణించిపోదు. ఇప్పటి హిందూమతోద్ధార కులమనుకొను ఛాందసులు యీ సూక్ష్మమును గ్రహించిన దేశమాత ధన్యము కాగలదు!

Share
This entry was posted in నాటకం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>