గర్భధారణపై స్త్రీ సాధికారిత – డా|| శివుని రాజేశ్వరి

గర్భధారణ చుట్టూ అల్లుకున్న ‘మిత్‌’ను బట్టబయలు చేసింది ‘పుట్టని బిడ్డకు తల్లి ఉత్తరం’ లేఖ. మాతృత్వం ‘అద్భుతం’ అంటుంది పితృస్వామ్యవ్యవస్థ. కాదు ‘త్యాగం’ అన్న విషయాన్ని చాటి చెప్పింది ఈ లేఖ. ఒక తల్లి గర్భంలోని బిడ్డతో తన మనోభావాలను పంచుకోవడమే ‘పుట్టని బిడ్డకు తల్లి ఉత్తరం’.

ఇటలీకి చెందిన ఒరియానా ఫాలసి రాసిన ఈ సుదీర్ఘలేఖకు ఓల్గా అనువాదం. పాశ్చాత్యదేశాల్లోని స్త్రీల అనుభవాలను పరిచయం చేస్తుంది. సమాజం, పితృస్వామ్య భావజాలం, సాంకేతిక పరిజ్ఞానం, వైద్యం, చట్టం, మతం వీటన్నింటి ద్వారా సమాజం స్త్రీల పునరుత్పత్తి శక్తిని ఏ విధంగా నియంత్రిస్తుందో మనకు అర్థమవుతుంది. ఈ పరిస్థితి కొద్ది తేడాలతో ప్రపంచంలోని స్త్రీలందరికీ సమానమే. పిల్లల్ని కనడం, కనకపోవడం నిర్ణయించుకోవలసింది, ఆ గర్భంపై సాధికారత స్త్రీలదేనని ఈ లేఖ చాటి చెప్పింది. పునరుత్పత్తి స్వేచ్ఛ కావాలనుకునే స్త్రీలు సంఘటితం కావడానికి దోహదం చేసే రచన ఇది. దీనిని ఫెమినిస్టు స్టడీ సర్కిల్‌ వారు తెలుగులోకి అనువదించి, స్త్రీవాద భావజాలానికున్న భాషావరోధాన్ని తొలగించారు.

మూడువారాల బిడ్డ పిండదశలో ఉన్నపుడే తల్లి మాత్రమే ఆ కదలికలను గుర్తించగలదు. ఆ పిండం ఆడదైనా, మగదైనా సమాజంలోకి వచ్చాక ఏయే సమస్యల్ని ఎదుర్కోవాలో తెలియచెపుతూ వాటిని అధిగమించడానికి కావలసిన మనోధైర్యాన్ని ఆ తల్లి పిండానికి నూరిపోసింది. తన గురించి పరిచయం చేసుకుంది. తను ఒంటరిగా బతకాలని నిర్ణయించుకున్న స్త్రీ కావడం వలన వైవాహిక బంధంలో ఇమడడానికి ఇష్టంలేకపోవడం వలన సమాజంలో తాను ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలియచెప్పింది. తనతో లైంగిక సంబంధం ఉన్న వ్యక్తి, తన గర్భాన్ని పరీక్షించిన డాక్టరు, తన పై అధికారి, తన స్నేహితులు, పరిచయస్థులు అందరూ తనను దోషిని చేసి చూడడాన్ని, గర్భం తీయించుకోమని సలహాలివ్వడాన్ని బిడ్డకు చెపుతుంది. కానీ తానాపని చేయనని హామీ ఇచ్చింది. బిడ్డను కనడానికి చాలా ఉత్సాహాన్ని చూపిన ఆమెకు ఊహించని సమస్య ఎదురయ్యింది. ఆమె గర్భం బలహీనంగా ఉండడం వలన కొన్ని నెలల పాటు కదలకుండా పడుకోమన్నారు డాక్టరు. ఆమె కొద్దిరోజులు డాక్టరు సలహా పాటించింది. అయినా డుపులో నొప్పి తగ్గలేదు. బెడ్‌రెస్ట్‌ మాత్రమే కాదు, ఆలోచనలు ఆందోళనల్ని కంట్రోల్‌ చేసుకోమన్నారు డాక్టర్‌. అది ఆమెవల్ల కాలేదు. ఉద్యోగాన్ని వదులుకుని, టీ.వీ.లో వార్తలు చూడకుండా, పేపరు చదవకుండా, కేవలం జబ్బు మనిషిలాగా ఎవరితో మాట్లాడకుండా ఖైదీలాగా ఆ బెడ్‌మీద కదలకుండా పడుకోవడం అంత నరకం ఇంకోటి లేదు. అపుడే ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది.

తనకు ఇంకా పుట్టని ఆ బిడ్డ మొదట తన శరీరం మీద, తన కదలికలపైనే కాక గుండెను, మెదడును కంట్రోల్‌ చేయాలని ప్రయత్నిస్తోంది. తన స్వేచ్ఛనే నియంత్రిస్తోంది. తన చిన్నపొట్టలో ఆ బిడ్డ తన ఉనికి కోసం ఏ విధంగా కష్టపడుతుందో ఈ సమాజంలో తాను తన ఉనికికోసం అంతే తాపత్రయపడుతోంది. ఇద్దరి పోరాటం ఒకటే బతకడానికి. అపుడు ఎవరూ ఎవరినీ ఇబ్బంది పెట్టుకోకూడదు అనుకుని చివరికి ఉద్యోగంలో చేరింది.

ఆమె బలహీన శరీరంలో ఆ బలహీనపు పిండం ఇమడలేకపోయింది. ఇంకా పిండరూపాన్ని వదులుకోకుండానే వచ్చిన చోటికి వెళ్ళిపోయింది. అయితే చిత్రంగా అంతవరకు ఆ పోరాటంలో ఆ తల్లికి సహాయపడని పై ఆఫీసరు, డాక్టరు, ఆ బిడ్డ జన్మకు కారణమైన మగవాడు, సమాజం, చట్టం అన్నీ ఆమెను నిందించాయి. ఆమెను హంతకురాలిని చేసి బోనులో నిలబెట్టాయి. ఆమె పేదరికంతోనో, సమాజంలో గౌరవంకోసమో, సాంఘిక నియమాలకోసమో ఈ నేరం చేసింది అని నిందించాయి. ఆమె తరపున ఆమె స్నేహితురాలు లేడీ డాక్టరు వాదించింది.

”ఈమె బిడ్డ చావును కోరుకోలేదు. తన బతుకును కోరుకుంది. దానిని ఆత్మరక్షణ అంటారు” అని వాదించింది. ”మాతృత్వం కోసం ఓ స్త్రీ తొమ్మిది నెలలు ఎంత కష్టపడుతుందో, పురిటినొప్పులతో ఎంత నరకయాతనకు గురవుతుందో, పాలిచ్చి పెంచుతూ నిద్రలేని రాత్రులతో ఎంత అలసిపోతుందో వివరించింది. పితృత్వం కోసం అన్ని హక్కులు ఆ బిడ్డపై పొందుతూ మీరు ఏ మూల్యం చెల్లిస్తున్నారు?” అని ప్రశ్నించింది.

”ప్రతి స్త్రీలోను మీరు తల్లిని వెదుకుతున్నారు. తల్లి పేరుతో ఆ స్త్రీతో సేవలు చేయించుకుంటున్నారు. మీరు ముసలి వాళ్ళయినా చిన్న పిల్లలుగానే ఉంటారు. మీకు వండి తినిపించాలి. గుడ్డలు ఉతకాలి. సేవలు చేయాలి. సలహాలివ్వాలి. ఓదార్చాలి. వేల సంవత్సరాల నుంచి మీకు తల్లులుగా సేవలు చేసి అలసిపోయాం. కూతురిగా, కోడలిగా, మనవరాలిగా చాకిరీ చేసి విసిగిపోయాం. మాకు గర్భాశయం మాత్రమే కాదు, మెదడు కూడా ఉంది. మాతృత్వం కేవలం నైతికబాధ్యతే కాదు. అది ఆమె శరీరానికి సంబంధించిన విషయం కూడా. అది ఆమె నిర్ణయించుకోవాల్సిన విషయం” అని తేల్చి చెప్పింది.

ఆమెను గర్భాన్ని తీయించుకోమని ప్రోత్సహించిన మీరే, గర్భం తీసుకోనందుకు ఆమెను అవమానించిన మీరే ఈనాడు గర్భశోకంలో ఉన్న ఆమెను హంతకురాలని నిందిస్తున్నారు. మీ నాలుకకు రెండు వైపులా పదును ఉంది. ఇదెక్కడి న్యాయం అని నిలదీసింది.

గర్భంలో పిండం చనిపోయినా అది పడిపోలేదు. లేడీ డాక్టరు అబార్షన్‌ చేస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు. చివరికి ఆమెకు సెప్టిక్‌ అయ్యి ప్రాణాపాయస్థితిలోకి వెళ్లడంతో ఆ ఉత్తరం ముగిసింది. ఒక స్త్రీ మాతృత్వపు మాయాజాలంలోంచి బయటపడడానికి చేసిన పోరాటాన్ని ”పుట్టని బిడ్డకు తల్లి ఉత్తరం” అద్భుతంగా ఆవిష్కరించింది.

”పుట్టని బిడ్డకు తల్లి ఉత్తరం” చర్చకు తెచ్చిన అంశాలు మూడు.

1. తన శరీరం మీద, తన గర్భం మీద ఎవరి పెత్తనం ఉండకూడదని, బిడ్డని కనాలో? వద్దో? నిర్ణయించుకునే అధికారం సంపూర్ణంగా తనదేనని చెప్పింది ఈ లేఖ.

2. స్వేచ్ఛకోసం చేసే పోరాటం బయట వ్యక్తులతోనే కాక, సమాజంతోను, చివరికి తన పొట్టలోని శిశువుతోకూడా ఉంటుందని తనుకూడ రాజీపడకూడదని తేల్చి చెప్పింది.

3. పురుషుడు స్త్రీని తల్లిగా చూడడంలోని ఆంతర్యం ఆమెను గౌరవించడానికో, ప్రేమించడానికో, సేవలు చేయడానికో కాదు. కేవలం తానూ చిన్నబిడ్డలాగా మారి, ఆమెతో సేవలు చేయించుకోవడానికే అన్న నగ్నసత్యాన్ని బయట పెట్టింది ఈ లేఖ.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో