మహిళలకు సమానత్వంతోపాటు స్వేచ్ఛ కావాలి – సిహెచ్‌. మధు

సమానత్వముంటే చాలని, మగవాళ్లకంటే ముందుకు పోతే చాలని మహిళలు పొంగిపోతున్నారు కానీ స్వేచ్ఛ లేని సమానత్వమెందుకో అర్థం కాదు. మహిళలు అన్ని రంగాలలో ముందుకు పోతున్నారు. అందనంతగా ఎదిగి పోతున్నారు. ఒక ఛాలెంజ్‌గా అభివృద్ధివైపు దూసుకెళ్తున్నారు. మగవాళ్లకంటే తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు. అంతా బాగానే వుంది. పొంగి పోవల్సిన విషయమే, గర్వపడాల్సిన దేశమే. కానీ స్వేచ్ఛలేని సమానత్వమెందుకో? స్త్రీ విద్యలో, విజ్ఞానంలో మగవారికంటే ఎక్కువ పరుగు తీసినా స్వేచ్ఛలేదు. తన యిష్టారాజ్యంగా బ్రతికే హక్కు లేదు. మిగతా రంగాల సంగతి అలావుంచితే రాజకీయ రంగంలో మరీ పరిస్థితి అధ్వాన్నంగా వుంది. అయినా మహిళలు ఇంతగా ఎదిగినా, ఆకాశంలోకి దూసుకెళ్లినా, పేరు వెనుక ఆ తోకలెందుకో అర్థం కాదు. పేరు వెనుక మగని పేరు తగిలించుకోవటమెందుకో తెలియదు. అలా తగిలించుకోవటం స్వేచ్ఛకు ప్రతీక కాదు. అది ప్రేమకు ప్రతీకా? గౌరవానికి ప్రతీకా? మానసిక లొంగుబాటుకు ప్రతీకా?

మహిళలకు సమానత్వమనేది రాజకీయ నినాదంగా మారకూడదు. రాజకీయాల కొరకు సమానత్వం కాదు. అన్ని రంగాలలో మగవారితోపాటు పనిచేయటం కాదు. మహిళలు ఏ రంగంలోనయినా పనిచేయటం, ఆత్మవిశ్వాసంగా పైకి కనిపించినా సమాజంలో స్వేచ్ఛ లేనంతసేపు ఈ సమానత్వం, ఆత్మవిశ్వాసం అంతా బోగస్‌. స్త్రీలపై చిత్రహింసలు, రేప్‌లు, మానభంగాలు మామూలుగా జరుగుతున్న ఈ వ్యవస్థలో స్త్రీకి సమానత్వం లభించిందని గొప్పలు చెప్పుకోవటం వట్టి బోగస్‌. స్వేచ్ఛలేని సమానత్వమెందుకూ?

నిజంగానే నేటి మహిళలలో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. మగవాళ్లతో విజ్ఞానంలో, జ్ఞానంలో, ఉద్యోగాల ఏలికలో, ప్రతిభలో పరిపాలనలో వారితో సమానంగా కూర్చోగలుగుతున్నారు, పనిచేస్తున్నారు, వాదిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. వారితో సమానంగా, ఎక్కువగా సంపాదిస్తున్నారు ఇదంతా నిజమే.. కాదనలేని పరిస్థితి. సమానత్వంలో జెండా ఎగరేసారు. అయితే స్వేచ్ఛ వుందా? – స్వేచ్ఛగా పనిచేయటానికి అవకాశాలున్నాయా? ఇంకోమాట ఇక్కడ ప్రస్తావించాలి. ఇది ఆత్మపరిశీలనకు, ఆత్మవిమర్శకు దోహదం కల్గిస్తుంది. ఎంత ప్రభావవంతంగా స్త్రీ పనిచేసినా, ప్రతిభావంతురాలని అంగీకరించినా ఆమె చెప్పినట్టుగా వినటానికి మగపురుషులు సిద్ధంగా వున్నారా? ఒక స్త్రీ చెపుతుంటే మేము వినాలా? మేము పురుషులం అనే భావబాదకం ఇంకా ఇంకా పటిష్టం కావటం లేదా? ఒక విషయం చెప్పాలి. ప్రతిభావంతురాలైన స్త్రీ అజమాయిషీ స్థాయిలోకి వచ్చిన తర్వాత ఆ ఆజమాయిషీని పురుషులు మనసారా అంగీకరిస్తున్నారా? లేక తప్పనిసరి అయి తనమాట వినేలా ఆ నాయకత్వ మహిళ పావులు కదుపుతుందో? తప్పనిసరి అయిపోయింది. ”తాను మహిళను తన మాటను వింటారా?” అనే అనుమానం, బలహీనత స్త్రీలో వుంది. ”ఆమె స్త్రీ- నేను పురుషుణ్ణి, నేను ఎక్కువ, ఆమె మాట వినాలా?” అనుకునే పరిస్థితి పురుషులలో వుంది. ఆమె ప్రతిభతో, దక్షతతో ఈ హోదా సాధించుకుంది, తాను మనసారా అభినందించాలి, అనుసరించాలి అనే దృష్టి పురుషునిలో లేదు. నేను దురదృష్టవంతుణ్ణి, ఆమె అదృష్టవంతురాలు” అనుకుంటున్నాడు. ఇది సమానత్వానికి సంకేతం కాదు. మానసిక స్వేచ్ఛకు ప్రతీక కాదు.

”మహిళలు – సమాన అభివృద్ధి” అంటే అర్థమేమిటి? ‘ఆకాశంలో సగం’ అంటే ఎలా అర్థం చేసుకోవాలి? పురుషులతోపాటు సమానంగా అంటే ఎలా ఆచరణలో వుండాలని? ఈ ప్రశ్నలకు సమాధానాలు చాలా అవసరం.

ఒక విషయం ముందు చెప్పాలి, అది చాలా అవసరం. అందరమూ ఆత్మపరిశీలన- ఆత్మవిమర్శ చేసుకోవల్సిన అంశం. ఇరువది, ముప్పది సంవత్సరాల క్రితం ఇప్పటిలాగా మహిళలు చదువుకోలేదు. ఉద్యోగాలు చేయలేదు. రాజ్యాలేల లేదు. అన్ని రంగాలలో పురుషులతో పాటు పరుగు తీయలేదు. వంటిల్లు, పిల్లల జాగ్రత్త- అప్పుడు శ్రామిక జనమున్నారు. శ్రామిక మహిళలున్నారు. అయినా జనాభాలో సగమైన స్త్రీలు ఇప్పటిలాగా కృషి చేయలేదు. పనితనం లేక కాదు. ప్రతిభ లేక కాదు. అవసరం పడక.. ఒక మగవాడు పనిచేస్తే సంసారం వెళ్లేది. అప్పు సప్పు వుండేది కాదు. ఇంతలా జీవన అల్లకల్లోలం వుండేది కాదు. ఇంతటి జీవన సమరం వుండేది కాదు. ఇంత క్రూరంగా జీవన పరుగు వుండేది కాదు. ఇంత విషాదంగా జీవితం యంత్రంగా తయారు కాలేదు. ఇప్పుడు మహిళ చదివింది, ఎదిగింది. ఉద్యోగాలలో రాణిస్తుంది. రాజ్యాలేలుతూ వుంది. ఏ రంగంలో కూడా పురుషునికంటే తక్కువగా లేదు. ఇలా చెప్పినప్పుడు ఇంకో మాట చెప్పాలి. ఇప్పటి పరిస్థితి ఏమిటి? ఇరువది సంవత్సరాల క్రితం శ్రామిక మహిళలు పనిచేసేవారు. మధ్యతరగతి మహిళలు పనిచేసేవారు కాదు. నిజానికి ఇప్పుడు మధ్యతరగతి లేదు. వున్నా ఉద్యోగ మహిళలు మాత్రమే. సమాజం అలా మారిపోయింది. ఇపుడు ధనవంతుల కుటుంబాలు తప్ప మిగతా కుటుంబాల ఆలుమగలు రాత్రింబగళ్ళు పనిచేస్తే తప్ప బ్రతకలేని పరిస్థితి వచ్చింది. ఇపుడు స్త్రీ చదువుకుంది. ఉద్యోగం చేస్తుంది. శ్రమ చేస్తుంది. ఒక రకంగా పురుషునితో సమానంగా వుంది. ఇందుమూలంగా కుటుంబాలకొచ్చిన లాభంకానీ- సమాజానికి వచ్చిన లాభం కానీ ఏమైనా వుందా? దేశాభివృద్ధి ఏమైనా పెరిగిందా? ఇరువది సంవత్సరాల క్రితం మగవాడు పని చేస్తే కుటుంబం హాయిగా వుండేది. సమాజం శాంతిగా వుండేది. దేశం చిక్కుల్లో వుండేది కాదు. పురుషునితోపాటు మహిళ ఎదిగి

సమానంగా కృషి చేస్తే- వచ్చిన ఫలితం ఎవరి దోపిడికి గురి అయినట్టు? ఎవరు దోచుకుంటున్నట్టు? అంటే స్త్రీ పురుషునితో సమానంగా ఎదిగిన అభివృద్ధిని ఎవరు సొమ్ము చేసుకున్నారు? ఇందులోనే పెద్ద కుట్ర వుంది. ఈ కుట్రలో భాగమే అభివృద్ధి చెందిన స్త్రీకి స్వేచ్ఛ లభించకపోవటం. ఇందుకు ఉదాహరణగా ఎన్నో చెప్పవచ్చు కానీ ఒకటి చెప్పి ఈ వ్యాసం ముగిస్తాను. అన్ని రంగాలకంటే రాజకీయ రంగం ఉన్నతమైందని భావిస్తాం. రాజకీయ రంగంలో మహిళలు రాణించాలని పురుషులతో సమానంగా వుండాలని ఉద్యమాలు చేసారు. పోరాటం చేసారు. అందులో భాగంగానే రిజర్వేషన్‌లు లభించాయి. రిజర్వేషన్‌లలో భాగంగా మహిళలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు. ఇది ఒక రకంగా పురుషులతో సమానమే! సాధించుకున్న విజయమే. అయితే ఈ విజయమిచ్చిన ప్రతిఫలం ఏ విధంగా వుంది? మహిళలు పేరుకే ప్రజాప్రతినిధులు, పెత్తనమంతా మగవారిదే. రిజర్వేషన్‌ ద్వారా ప్రజా ప్రతినిధులుగా వచ్చిన మహిళలు కుర్చీలో కూర్చుంటారు. సంతకాలు చేస్తారు. అంతవరకే… పనులన్నీ భర్తలు, తండ్రులు, కొడుకులు. పేరుకే మహిళలు, పెత్తనమంతా పురుషులదే… ఇంకెందుకు ఈ రిజర్వేషన్‌? ఇంకెందుకు ఈ స్వేచ్ఛలేని పెత్తనం… స్థానిక సంస్థలలో ఇది నూటికి నూరు పాళ్లు కనిపిస్తుంది.

స్వేచ్ఛలేని సమానత్వం మూలంగా స్త్రీకి ఒరిగేదేమీ లేదు.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో