నాలుగువేలకి పైగా మహిళలకి కుట్టుపనిని నేర్పిన శైలాబాయి – టి.సంపత్‌ కుమార్‌ & టి. మాధవి లత

పూర్తిపేరు : శైలాబాయి హన్మంతరావ్‌ థోబ్బి. ఏడు పదుల వయస్సు. స్వస్థలం కర్నాటకలోని బీజాపూర్‌, ఎలాంటి సమస్యలులేని ఆరోగ్యం. చురుకైన జీవితాన్ని గడుపుతోంది. ముగ్గురు పిల్లలు. ఒక కుమారుడు అమెరికాలో, రెండవతను బెంగుళూర్లో. కూతురు దిల్లిలో. మనవరాళ్ళు ఒకరు ముంబైలో వుంటే మరొకరు అమెరికాలో. ఈ పరిచయం మనదేశంలో ఎందరికో వర్తిస్తుంది. విశేషమేమి లేదు. మరి శైలాబాయికున్న విశిష్టత ఏంటి? ఆవిడకి కుట్టుపని అంటే చిన్నప్పటి నుండి ప్రాణం. నేర్చుకోవాలన్న తపన. దాన్ని నలుగురికి నేర్పడంలో ఆమెకి అమితానందం. తన ముప్పైయవ ఏట కుట్టు పనిని మొదలుపెట్టి ఇప్పటికి నాలుగువేలకి పైగా మహిళలకి శిక్షణనిచ్చారు. దీంట్లో అన్ని వర్గాలకి చెందిన చదువుకొనే విద్యార్థినిలు కాక ఇంటి పట్టున వుండే అమ్మాయిలు, గృహిణులు వున్నారు. సగానికిపైగా ముస్లిం కుటుంబాల నుండి వచ్చారు. ఇంతమందికి ఈ పనిని నేర్పిన ఘనత సచిన్‌ టెండూల్కర్‌ పరుగుల రికార్డులకి తక్కువేమీ కాదు సుమా!

ఎలా మొదలయ్యిందంటే?

శైలాబాయికి చిన్నప్పటి నుండి కుట్టుపనిపైనున్న మక్కువ పెళ్లితో ఆగిపోలేదు. బీజాపూర్లో సాంసారిక జీవితం చేస్తున్న శైలాబాయి, భర్త హన్మంత్‌ రావ్‌ థోబ్బి ప్రోత్సాహంతో, పేరున్న స్థానిక టేలర్‌ మాస్టర్‌ ముకుంద్‌ భిడే దగ్గర రెండు సంవత్సరాల శిక్షణ పూర్తి చేసి పాలిటెక్నిక్‌ కాలేజీలో పరీక్షకి కూచోని టేలరింగ్‌లో డిప్లొమా సర్టిఫికెట్టుని సంపాదించారు. భర్తది టీచర్‌ ఉద్యోగం. ముగ్గురు పిల్లలు. భర్త అన్నదమ్ములు మంచి ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా బలపడి వున్నారు. ఈ నేపధ్యంలో శైలాబాయి ఒక పెద్ద ఆశయాన్ని పెట్టుకొన్నారు – ఎలాగైనా ఇద్దరు కొడుకులని ఇంజనీర్లని చేయాలని. కుటుంబ ఆదాయాన్ని పెంచేందుకు, కుట్టు మషీన్ని నమ్ముకొని చంద్ర బాల టేలరింగ్‌ క్లాసెస్‌ పేరుతో శిక్షణా క్షేత్రాన్ని ఆరంభించారు. పిల్లలు కాస్త పెరిగాకే శైలాబాయి తన ముఫ్పైయవ ఏట ఈ రంగంలోకి దిగారు. ఒక మషీన్‌తో మొదలు పెట్టి రోజుకి రెండు గంటల శిక్షణ ఇవ్వడంతో మొదలయ్యింది. అతి తక్కువ కాలంలో శైలాబాయి పేరు అందరికీ తెలిసిపోయింది. శిక్షణ కోసం వచ్చే వారి సంఖ్య పెరిగింది. మషీన్ల సంఖ్య నాలుక్కి చేరింది. మొదట్లో నెలకి ఐదు రూపాయలు ఫీజు తీసుకొనే వారు. చదువుకొనే అమ్మాయిలు వేసవి సెలవుల్లో శిక్షణకి రావడంతో రద్దీ బాగా పెరిగేది. వారి వారి అవసరాలని బట్టి ప్రాథమిక, స్వల్ప, దీర్ఘ కాలిక శిక్షణ కార్యక్రమాలని రూపొందించారు. డిప్లొమా పరీక్ష ఇచ్చే వారికి ప్రత్యేక శ్రద్ధ చూపేది. ఆదాయం క్రమేణా పెరుగుతూపోయింది.

కుటుంబ సభ్యుల సహకారం ఎంతో అవసరం

శైలాబాయి మంచి శిక్షణనిస్తుంది అన్న పేరు రావడంతో అన్ని వర్గాల మహిళలు వచ్చేవారు. ఇంటికి రద్దీ పెరిగింది. భర్త సంపూర్ణ సహకారం ఎప్పుడూ ఉండేదని ఎంతో గర్వంగా చెప్పింది. బాగా అర్థం చేసుకొని తాను ఇచ్చే శిక్షణలో ఎలాంటి లోపాలు రాకుండా చూసుకొని ఇంటి పనుల్లో తోడ్పడే వారట. అయితే మషీన్లు చేసే శబ్దం వల్ల పిల్లల చదువులకి అసౌకర్యం కలగడంతో, వారికోసం ఇంటికి దగ్గరలో ఒక గదిని అద్దెకి తీసుకొని అంతరాయన్ని తొలగించి చదువు సాఫీగా సాగేట్టుగా చూశారు. దురదృష్టవశాత్తు భర్త 1992లో హఠాత్తుగా చనిపోయారు. ఈ పెద్ద దెబ్బ నుండి కోలుకోవ డానికి కొంత సమయం పట్టినా శిక్షణ సంబంధిత పనితో ఉపశమనం కలిగింది. శిక్షణ ఎప్పటిలాగానే కొన సాగింది. కొడుకులిద్దరూ ఆశయం ప్రకారంగా ఇంజనీర్ల య్యారు. ఒక కొడుకు అమెరి కాలో స్థిరపడితే, మరో కొడుకు బెంగుళూర్లో వుంటున్నారు. భర్త పోయాక కూడా శిక్షణని కొన్ని సంవత్సరాలు బీజాపూర్లో కొనసాగించారు. వయస్సు పెరుగుతోంది. పిల్లలు పలు చోట్ల వుంటున్నారు. అందరికీ అనుకూలంగా అవసరాల ప్రకారంగా అన్ని చోట్లకి వుత్సాహంగా ప్రయాణం చేస్తూ వారితో గడపడం ఆమె వార్షిక ప్రణాళికలో ముఖ్యభాగాలు. దేశ విదేశీ విమానాల్లో ఒంటరిగా ప్రయాణాలు చేశారు.

సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగాయి

శిక్షణలో క్రమశిక్షణ, నాణ్యతలు పాటించి అందరితో ఆప్యాయంగా వ్యవహరించడంతో శైలాబాయికి చిన్న పట్టణమైన బీజాపూర్లో గౌరవ మర్యాదలు పెరిగాయి. కేవలం మహిళలకే శిక్షణని పరిమితం చేయడంతో తల్లితండ్రులు కూతుళ్లని ఎలాంటి సంకోచం లేకుండా శిక్షణ కేంద్రానికి పంపించేవారు. శైలాబాయిని అందరూ ఆప్యాయంగా ‘మేడమ్‌’ అని సంబోదించే వారు. ఎక్కువ మటుకు పెళ్ళికాని అమ్మాయిలే తన స్టూడెంట్స్‌ కావున శిక్షణ అయ్యాక ఆ అమ్మాయిలు తమ పెళ్ళిళ్ళకి ఆహ్వానించేవారు. అలా ‘మేడమ్‌’ ఎన్నో పెళ్ళిళ్ళకి హాజరయ్యారు. తనని గమనించగనే, ‘మేడమ్‌ వచ్చింది’ అంటూ తోవనిచ్చేవారని గతంలోకి వెళ్ళి ఎంతో సంతోషంతో ఈ విషయాన్ని పంచుకొన్నారు. ఆ రోజుల్లో టేలరింగ్‌ డిప్లొమా పరీక్ష ఇవ్వడానికి తన దగ్గరికి వచ్చే వారి పేదరికం వల్ల ఫీజు కట్టలేక సర్టిఫికెట్టులు పొందలేక పోయారని బాధపడ్డారు. ఈ ఒక్క అడ్డంకి లేకపోతే ఇంకా చాలా మంది డిప్లొమాని సంపాదించుకొని జీవితాల్లో పైకివచ్చే వారని తెలిపారు.

శిక్షణ యాత్ర (పాత్ర) కొనసాగుతూనే వుంది

శైలాబాయి జీవిత యాత్రలో మలుపులు వచ్చాయి. అది అందరికీ సహజమే! పరిస్థితుల రీత్యా స్వస్థలమైన బీజాపూర్‌ వదలాల్సివచ్చింది. క్రమబద్ధంగా జరిగే శిక్షణ కార్యక్రమాల్ని ఆపివేయాల్సి వచ్చింది. కానీ శిక్షకురాలిగా మాత్రం తన పనిని ఆపలేదు. అమెరికా వెళ్ళినా, దిల్లీలో వున్న కూతురు దగ్గరికి వెళ్లినా, బెంగుళూరులో కాలు పెట్టినా కావలసిన వారికి ఉచితంగా శిక్షణనివ్వడం, సందేహాలు తీర్చడం, సలహాల్ని ఇవ్వడం, డెమోలు మషీన్‌ నడుపుతూ ఇచ్చి అర్థం చేయించడం… ఇలా తన జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని అందరికీ ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఉత్సాహంతో ఇంకా పంచుతూనే వుంది. ఆహారవిషయంలో మాత్రం ఖచ్చితమైన క్రమశిక్షణని పాటించు కొంటూ ఆరోగ్యాన్ని కాపాడుకొంటున్నారు. సచిన్‌ టెండూల్కర్‌ తన పరుగులకి ఫుల్‌ స్టాప్‌ పెట్టినా, శైలాబాయి స్కోరు మాత్రం ముందుకు పోతూనే వుంది. తన దగ్గర నేర్చుకొన్న వారిలో రెండు వందల మంది మహిళలు టేలరింగ్‌లో డిప్లొమా తీసుకొన్నారు. నాలుగు వేలకుపైగా తమ అవసరాలకనుకూలంగా శిక్షణ తీసుకొన్నారు. చిన్న పట్టణం నుండి మహా నగరాల వరకు విస్తరించిన శిష్యులు పలురకాలుగా లాభం పొందుతున్నారు. కన్నడ, మరాఠి, ఉర్దూ, హిందీ, తమిళ భాషల్లో మాట్లాడగలుగుతారు కావున భాష ఎప్పుడూ అడ్డంకి కాలేదు. ఒకసారి దిల్లి పక్క రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ (నోయిడా)లో కూతురి దగ్గర కొన్ని నెలలు ఉండవలిసి వచ్చినప్పుడు అక్కడ కూడా ఓ అయిదుగురికి శిక్షణనిచ్చింది. తన కుటుంబ సభ్యులున్న చోటికి వెళ్లినా ప్రతిచోటా వారి వారి సోషల్‌ సర్కిల్‌ ద్వారా శైలాబాయి వచ్చిన విషయం తెలిసి శిక్షణ, డెమో, సలహాల సెషన్స్‌ వివిధ రూపాల్లో రూపం పోసుకొంటాయి. చిరునవ్వుతో జీవన యాత్రతో పాటు శిక్షకురాలిగా తన పాత్రని ఇంకా కొనసాగిస్తూనే ఉంది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో