రోహిత్‌ ఆత్మహత్య : ఒక సరికొత్త / పాత సందర్భం – భాస్కరం కల్లూరి

హైదరాబాద్‌ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి వేముల రోహిత్‌ ఆత్మహత్య అంతఃకరణను కలచివేసే ఒక భావోద్వేగ సందర్భం. అదే సమయంలో లోతుగా తరచి చూసి అర్థం చేసుకోవలసిన ఒక సరికొత్త/పాత సందర్భం కూడా. ఒక తెలుగు రాష్ట్రానికి చెందిన ఒక దళిత విద్యార్థి ఆత్మహత్య వార్త జాతీయ మీడియాలో ప్రముఖంగా ప్రసారం కావడం చూసి ఒకింత ఆశ్చర్యం కలిగింది. సాధారణంగా దక్షిణాది రాష్ట్రాల వార్తలు మరీ ముఖ్యమూ, సంచలనాత్మకమూ అయితే తప్ప జాతీయ మీడియాలో ప్రముఖంగా రావు. ఆపైన రోహిత్‌ ఆత్మహత్యపై దాదాపు అన్ని జాతీయ వార్తా చానెళ్లూ చర్చ జరపడం ఆశ్చర్యాన్ని పెంచింది. ఆ చర్చ వరసగా కొన్ని రోజులపాటు జరగడం ఆశ్చర్యాన్ని రెట్టింపు చేసింది. దాంతోపాటు ఆలోచనలనూ రేకెత్తించింది.

దేశవ్యాప్తంగా జరుగుతున్నట్టే, నిన్నటి అవిభక్త, నేటి విభక్త తెలుగు ప్రాంతాలలోనూ ఆత్మహత్యలు, దళితులపైన హింస ఎంతోకాలంగా జరగుతూనే ఉన్నాయి. రైతుల ఆత్మహత్యలు, తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన ఆత్మాహుతులు తెలిసినవే. దళిత హింసకు వస్తే; కారంచేడు, చుండూరు, పదిరికుప్పం; మహారాష్ట్రలో ఖైర్లాంజీ లాంటి ఘటనలను ఎన్నైనా చెప్పుకోవచ్చు. స్థూలంగా చెప్పుకుంటే, ఆ క్రమంలో రోహిత్‌ ఆత్మహత్య పునరావృతమైన ఒక పాత సందర్భమే అవుతుంది. అయితే, రోహిత్‌ ఆత్మహత్య జాతీయస్థాయిలో చర్చనీయం అయినంతగా పైవేవీ కాలేదు. అప్పటికి మీడియా వ్యాప్తి ఇంత లేకపోవడం ఒక కారణం అనుకున్నా; ఇప్పటికీ జాతీయ మీడియా వింధ్య అవతలి ప్రాంతాలపై, ముఖ్యంగా ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాలపై పెడుతున్నంత ఫోకస్‌; వింధ్య ఇవతలి ప్రాంతాలపై పెట్టడం లేదన్న వాస్తవాన్ని గుర్తిస్తే రోహిత్‌ ఆత్మహత్యపై దాని స్పందన విలక్షణంగానే కనిపిస్తుంది. ఆ విధంగా అదొక సరికొత్త సందర్భం. వెరసి అదొక సరికొత్త/పాత సందర్భం.

ఇలా రోహిత్‌ ఆత్మహత్యను కొత్త సందర్భంలోకి తీసుకొచ్చినది సాక్షాత్తూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, దాని భావసారూప్య వర్గాలే. అందుకు కారణం, అవి అనుసరించే ఒక నిర్దిష్ట భావజాలం. కానీ విచిత్రమేమిటంటే, రోహిత్‌ ఆత్మహత్య పాత సందర్భానికి కొనసాగింపు మాత్రమే తప్ప కొత్త సందర్భం ఎంతమాత్రం కాదని అవి నొక్కి చెబుతున్నాయి. కాంగ్రెస్‌ పాలనలో దళితుల ఆత్మహత్యలు లేవా అని ప్రశ్నిస్తున్నాయి. ఒక దళిత విద్యార్థి ఆత్మహత్యను జాతీయస్థాయికి పెంచి మీడియా రభస చేయడం వెనుక మోడీ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే కుట్ర ఉందని ఆరోపిస్తున్నాయి. మోడీ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ జరుగుతున్న మతపరమైన ఘటనలు, అసహనం పెరిగిపోవడం గురించిన ఆరోపణల విషయంలోనూ బీజేపీ, దాని మిత్రవర్గాలూ ఇదే ఆరోపణ చేస్తూ వచ్చాయి. అధికారపక్షాన్ని ఇరుకున పెట్టే అవకాశాన్ని ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉన్నా వదలుకోదన్న కోణంలో చూస్తే ఇది నిజం కావచ్చు కూడా. అయితే బీజేపీ, దాని మిత్రవర్గాలు ప్రస్తుతం తామున్న ఒక విలక్షణ పరిస్థితిలో; జరుగుతున్నవన్నీ పాతసందర్భానికి కొనసాగింపులే తప్ప కొత్తవి కావని చెప్పడానికి కూడా దీనిని తెలివిగా వాడుకుంటున్నాయి.

అయితే, వాటి అసలు లక్ష్యం దేశాన్ని పాత సందర్భం నుంచి తప్పించి కొత్త సందర్భంలోకి తీసుకెళ్ళడం! ఎందుకంటే, వాటికి తమవైన నిర్దిష్ట భావజాలమూ, ఆచరణా ఉన్నాయి. ఆ భావజాల అవసరాల రీత్యా కుల (దళిత)-మత (ముస్లిం) పరమైన అస్తిత్వాలకు కొత్త నిర్వచనం ఇచ్చి, కొత్త సందర్భంలోకి తీసుకురావడమనే ఒక ముఖ్యమైన అజెండా వాటికి ఉంది. దీనిని వారు కూడా కాదనరు. అధికారంలో ఉండడం ఆ అజెండా అమలుకు మంచి వెసులుబాటు తమ భావజాల అజెండాను అమలు చేయలేనప్పుడు అధికారంలో ఉండడమే అర్థరహితం అవుతుంది. అయితే, విచిత్రంగా అవి చేస్తున్నదేమిటంటే; దేశాన్ని కొత్త సందర్భంలోకి తీసుకురావడమనే తమ అసలు లక్ష్యాన్ని తమే కప్పి పుచ్చుకుంటూ; తమ అజెండా అమలును పాత సందర్భానికి పొడిగింపుగానే అవి చెబుతున్నాయి. చాలా విషయాలలో అవి చేసే వాదనలో ఇదే వైరుధ్యం కనిపిస్తుంది. ఆయా కుల, మత అంశాలను కొత్త సందర్భంలోకి తీసుకురావడంలో తమకు దేశవ్యాప్తంగా ఏర్పడే ప్రతికూల వాతావరణంలో ఒకవైపు ఆత్మరక్షణలోకి జారిపోతూనే; ఇంకోవైపు కిందపడినా పైచేయి మాదే నని చెప్పుకోవడానికి అవి ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికలలో ఎదురుదెబ్బలు తగిలినప్పుడు, దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తూనే, మరో ఎన్నికల తరుణంలో మళ్ళీ అదే అజెండాను పైకి తీస్తున్నాయి. అలాగే, అధికారపక్షంగా ఒకవైపు రాజ్యాంగ పరిధిలో పని చేయవలసి రావడం, ఇంకోవైపు కొత్త సందర్భంలోకి దేశాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో ఆ రాజ్యాంగ పరిధిని లేదా స్ఫూర్తిని తనే దాటడం అనే జోడు గుర్రాల స్వారీ చేస్తున్నాయి. ఇప్పుడున్న ఎన్నికల రాజకీయాల చట్రంలో అవి దళిత, ముస్లిం ఓటర్లను పూర్తిగా దూరం చేసుకోలేవు కనుక; ఒకవైపు కుల, మతపరమైన ఆ గుర్తింపులను దృష్టిలో ఉంచుకుంటూ తమ బ్రాండ్‌ ‘సంతుష్టీకరణ’ విధానాలను అనుసరించక తప్పదు. మరోవైపు, అలాంటి గుర్తింపులకు అతీతంగా ఒక ఏకశిలా జాతీయతను నిర్మించడమనే తమ భావజాల లక్ష్యంవైపు అడుగులు వేయకతప్పదు.

ఈ విధంగా వాటిది అనేక వైరుధ్యాలు నిండిన దాగుడు మూతలాట. మోదీ అధికారంలోకి వచ్చిన గత ఇరవై మాసాలుగా ఈ దాగుడుమూతల ఆట వివిధ రూపాలలో సాగుతూనే ఉంది. ఒక ప్రభుత్వంగా మోదీ ప్రభుత్వం పాత సందర్భానికి కొనసాగింపుగా కనబడడానికి ప్రయత్నిస్తుంది. కానీ పార్టీ, దాని భావజాలవర్గాలు దేశాన్ని కొత్త సందర్భంలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఇందుకు ప్రభుత్వం పైకి నిశ్శబ్ద ప్రేక్షకరూపంలోనూ; అది సరిపోనప్పుడు లోపాయికారీగా ఇతరేతర రూపాలలోనూ ప్రోత్సాహం అందిస్తూ ఉంటుంది. రోహిత్‌ ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితుల నేపథ్యం వాస్తవానికి గత ఇరవై మాసాలుగా సాగుతున్న ఈ దాగుడుమూతల ఆటకు కొనసాగింపే.

రోహిత్‌ అంబేద్కర్‌ విద్యార్ధి సంఘంలో పనిచేస్తున్నాడు. ఆ యూనివర్సిటీలో అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్‌ (ఏబీవీపీ) సహా మరికొన్ని విద్యార్థి సంఘాలు పనిచేస్తున్నాయి. భావజాల విభేదాలు ఉన్న విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణలు జరుగుతుండడం, అవి ఒక్కోసారి హింసాత్మకం కావడం దాదాపు అన్ని యూనివర్సిటీలలో మామూలే. వాటి పరిష్కారాలు, శిక్షలు యూనివర్సిటీ నాలుగు గోడల మధ్యా; ఇంకా అవసరమైతే శాంతి భద్రతల పరిధిలో జరిగిపోతూ ఉంటాయి. అలా చూసినప్పుడు ఇది పాత సందర్భం. కానీ బీజేపీతో భావజాల మైత్రి కలిగిన ఏబీవీపీ దానిని కొత్త సందర్భంలోకి తీసుకురావడానికి ప్రయత్నించింది. విద్యార్థి రంగంలో దళిత/దళితేతర కులాల గుర్తింపులకు అతీతంగా హిందూత్వ ప్రాతిపదికపై అన్ని కులాలను కూడగట్టడం; హిందూ యేతర మతాలను కట్టడి చేయడం దాని లక్ష్యం. పాత సందర్భానికి అదనంగా ఇప్పుడు ఏబీవీపీకి ప్రభుత్వం అనే కొత్త అండ ఉంది. దానిని వాడుకోడానికి ప్రయత్నించింది. ప్రభుత్వం కూడా అందుకు సిద్ధంగానే ఉంది. దాని ఫలితమే ఏబీవీపికి అనుకూలంగా కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతి ఇరానీల జోక్యం. యూనివర్సిటీ పాలక సంస్థ తన ప్రత్యేక ప్రతిపత్తిని పక్కనపెట్టి ఆ జోక్యానికి దారి ఇచ్చింది. రోహిత్‌ ఆత్మహత్యతో ఇవన్నీ బయటపడేటప్పటికి ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. ఎప్పటిలా, ఇది పాత సందర్భానికి కొనసాగింపే తప్ప, కొత్తగా జరిగింది ఏమీలేదని తనను సమర్థించుకునే ప్రయత్నం చేసింది. అది విఫలయత్నంగానే పరిణమించింది. ఇలా ఆత్మరక్షణలో పడిపోవడం – ఏదో విధంగా సమర్థించుకోవడం గత ఇరవై మాసాలుగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఒక స్క్రీన్‌ ప్లే. ఎన్ని సార్లైనా దీనిని పునరావృతం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది తప్ప మడమ తిప్పే ఉద్దేశంలో లేదు. ఎందుకంటే, దాని అంతిమ లక్ష్యం తన భావజాలాన్ని జనంలోకి తీసుకువెళ్లి, దేశాన్ని తను కోరుకునే కొత్త సందర్భంలోకి తీసుకువెళ్ళడం. లోక్‌సభలో తిరుగులేని మెజారిటీ, మోదీ లాంటి వ్యక్తి నాయకత్వమూ అందుబాటులో ఉన్న ఈ తరుణంలో ఈ పని చేయలేకపోతే ఇంకెప్పుడూ చేయలేమని అది భావించడంలో ఆశ్చర్యం లేదు. ఈ విధంగా దానిది విజయమో, వీరస్వర్గమో తేల్చుకోవలసిన పరిస్థితి.

ఈ పరిస్థితిలో ప్రభుత్వాన్ని రాజ్యాంగ నియమ నిబంధనలు, ఔచిత్యాల వంటి రకరకాల హద్దులను దాటిస్తే తప్ప పని జరగదు. ప్రభుత్వమూ, పార్టీ, దాని భావసారూప్య వర్గాలూ పూర్తి స్పృహతో, ఏకీభావంతో ఈ హద్దుల ఉల్లంఘనకు సిద్ధమయ్యాయి. ఎంతోకాలంగా  సాగుతున్న ఆత్మహత్యలు, దళిత హింసకు భిన్నంగా, రోహిత్‌ ఆత్మహత్య జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశం చేసింది ఇదే. నిజానికి కులవివక్షకు, దళిత హింసకు కాంగ్రెస్‌తో సహా దాదాపు ప్రధాన స్రవంతి పార్టీలు ఏవీ అతీతం కావు. వ్యవస్థాపరంగా చెబితే కులదాష్టీకాన్ని అణువణువునా జీర్ణించుకున్న భూస్వామ్యంతో స్వాతంత్య్రం తర్వాత కూడా అన్ని ప్రధాన పక్షాలూ మమేకమై దానిని భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నాయి. అయితే, సూత్రరీత్యానైనా కులమత వివక్షలేని లౌకిక ప్రజాస్వామిక రాజ్యాంగ ప్రక్రియకు గత ఆరు దశాబ్దాలుగా మనం అలవాటు పడ్డాం. భూస్వామ్య శక్తులు పూర్తి బలంతో తెరముందుకు రాకుండా ఈ ప్రక్రియ, మళ్ళీ సూత్రరీత్యానైనా వీలైనంతవరకు నిరోధిస్తూ వచ్చింది. ఇంతవరకు అధికారంలో ఉన్న సోకాల్డ్‌ లౌకిక పక్షాలు రాజకీయంగానూ, లోపాయికారీగానూ కులమత ఆధిపత్య శక్తులతో అంటకాగుతూనే, ప్రభుత్వస్థాయిలో తగుమేరకు తటస్థ పాత్ర పోషిస్తూ వస్తున్నాయి. కోర్టులు, చట్టాలు, విద్యాసంస్థలు, ఇతర బహిరంగ వ్యవస్థలు పోషించవలసింది అటువంటి తటస్థ పాత్రేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కనుక ఇన్నేళ్లలో కుల, మత హింస చెలరేగినప్పుడల్లా ప్రభుత్వాన్ని కాక, తెరవెనుక శక్తులను దోషులుగా నిలబెట్టడం జరుగుతూ వచ్చింది. ఆయా ప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యవస్థలు భిన్న, పరస్పర శత్రుత్వపూరిత భావజాలాల అభివ్యక్తికి స్వేచ్ఛనిస్తూనే వాటిని రాజ్యాంగం, చట్టాల పరిధి దాటకుండానూ; శాంతి భద్రతల పరిధిలోనూ నియంత్రిస్తూ యథాశక్తి తటస్థ భూమిక పోషిస్తూ వస్తున్నాయి.

ఇప్పుడు బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వమూ, దాని భావసారూప్య వర్గాలూ ఈ తటస్థత అనే పలచని పొరను కూడా తొలగిస్తున్నాయి. రోహిత్‌ ఉదంతంలో జరిగింది అదే. ఫలితంగా, ముక్కూ, మొహం లేని వ్యవస్థ స్థానంలో; రాజ్యాంగబద్ధంగా వ్యవహరించవలసిన, స్పష్టమైన రూపురేఖలు కలిగిన ఒక ప్రభుత్వం ఇందులో దోషిగా నిలబడింది. రోహిత్‌ ఆత్మహత్య జాతీయ స్థాయికి ఎక్కవలసిన తీవ్ర పరిణామం అయినది అందుకే. అయినాసరే, ఎంత అప్రతిష్టపడినా, ఎన్నికల ఓటమి రూపంలో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా, ఎన్నిసార్లు ఆత్మరక్షణలో పడవలసివచ్చినా ఈ తటస్థత అనే పొరను ఎన్ని సార్లైనా ఉత్తరించడానికి బీజేపీ, దాని ప్రభుత్వమూ, దాని భావసారూప్య వర్గాలూ కంకణం కట్టుకున్నాయి. ఎలాగైనా సరే తమ భావజాలాన్ని నెగ్గించుకుని, దేశాన్ని ఎప్పటికైనా పూర్తిగా కొత్త సందర్భంలోకి తీసుకువెళ్ళే కృతనిశ్చయంతో ఉన్నాయి. తటస్థ ప్రదేశంలోకి ప్రభుత్వం చొచ్చుకు వెళ్లడానికి ప్రయత్నించిన ఉదాహరణలు ఈ ఇరవై మాసాలలో ఇంకా చాలా కనిపిస్తాయి. ప్రజాస్వామిక లౌకిక రాజ్యాంగం కల్పించిన తటస్థభూమిక ఎప్పుడైతే బలహీనపడిపోతుందో అప్పుడిక ఈ దేశంలో ఎంతో చరిత్ర కలిగిన రకరకాల శత్రు పక్షాలూ భావజాలాలూ బలాబలాలు తేల్చుకోడానికి పూర్తి శక్తియుక్తులతో, అత్యంత నగ్నంగా యుద్ధక్షేత్రంలోకి అడుగుపెట్టడం సహజ పరిణామం. వివిధ భావజాలాలను హద్దుల్లో ఉంచుతూ నియంత్రణ పాత్రను పోషించే ‘రిఫరీ’ అదృశ్యమైనప్పుడు అప్పుడిక చీశీ నశీశ్రీసర దీaతీతీవస!

ఇప్పుడు అదే జరుగుతోంది. చూస్తున్నది, చూడబోతున్నది కచ్చితంగా వందలు, వేల సంవత్సరాల చారిత్రక నేపథ్యం కలిగిన ఒక సంకుల సమరం. అక్షరాలా భిన్న భావజాలాల మధ్య జరుగుతున్న కురుక్షేత్రం. పాత/కొత్త సందర్భాల మధ్య అమీతుమీ తేల్చుకోడానికి పెద్ద ఎత్తున జరుగుతున్న, ఇంకా ముమ్మరం కాబోతున్న పెనుగులాట. ఈ క్షణాన ఢిల్లీలో జరుగుతున్నది దేశగమనాన్ని గత ఆరుదశాబ్దాల అనుభవానికి భిన్నమైన మలుపు తిప్పగల ఒక అతి పెద్ద రాజకీయ, సామాజిక, సాంస్కృతిక ప్రయోగం! ఇది ఎలా పరిణమిస్తుందన్నది కాలానికి విడిచిపెట్టవలసిన ప్రశ్న.

(సారంగ వెబ్‌ మేగజైన్‌ సౌజన్యంతో)

Share
This entry was posted in Uncategorized and tagged . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో