జ్వలిత… నిర్వేదం – డా|| మల్లెమాల వేణుగోపాలరెడ్డి

మదర్స్‌ హోం… శరణాలయం
చలవ పందిరి కింద… విద్యుత్‌ తోరణాలు రంగు రంగుల పూలతో అలంకరించిన వేదిక… వివాహ వేదిక… పెళ్లికళ శోభిస్తూ…

బ్యాక్‌ డ్రాప్‌లో… ఫ్లెక్సీ…
”వివాహ ఆహ్వానం”
వధువు : చి||సౌ|| మాలిని
వరుడు : చి|| కళ్యాణ్‌
పెద్దల ఆశీస్సులు… వధూవరులకు కోటి వరాలు

ముఖ ద్వారం వద్ద అతిథులందరినీ ఆహ్వానిస్తూ… మదర్స్‌ హోం నిర్వాహకురాలు మిస్‌ మనోరమ, కార్యదర్శి మిసెస్‌ రమణి, జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, జిల్లా జడ్జి, వైస్‌ ఛాన్సలర్‌, డి.ఎం.హెచ్‌.ఓ. వంటి ప్రముఖుల ఆగమనం.

పందిరి కింద కుర్చీల నిండా ఆహుతులైన నగర ప్రముఖులు.
మిస్‌ మనోరమ వేదిక నుండి స్వాగతం పలికింది.
ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ని ఎస్‌కార్ట్‌ చేస్తూ హోం ముఖ్య సలహాదారు నారాయణ, వేదిక మీద ఆసీనులను చేసాడు.

వధూవరులనూ సాదరంగా వేదిక మీదికి, ఎస్‌కార్ట్‌ చేస్తూ తీసుక వచ్చింది కార్యదర్శి.
పెండ్లిండ్ల రిజిష్టార్‌ కూడా వేదిక పైన…
వధువు మాలిని మల్లెపూవులాంటి తెల్లని జార్జెట్‌ వస్త్రాలలో, వరుడు కళ్యాణ్‌ గోధుమ రంగు చుడీదార్లో… చున్నీ జారుతూ… కళ్యాణ్‌ తల్లి శ్రీమతి తులశమ్మను సాదరంగా వేదిక మీదికెక్కించారు.

మిస్‌ మనోరమ స్వాగత వచనాలు పలుకుతూ
”మా ఆహ్వానాన్ని మన్నించి ఈ వివాహ వేడుకకు విచ్చేసిన ముఖ్య అతిథి, గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్‌ గారికి, ఆహ్వానితులైన ఇతర ఆత్మీయ అతిథులకు, ఆహుతులైన పెద్దలందరికీ మా హృదయపూర్వక స్వాగతం – ఈనాటి వివాహ వధువు మా హోంలో పెరిగిన అమ్మాయి. మంచి గర్ల్‌… వరుడు సంఘ సేవకుడు. ఒక నేషనల్‌ బ్యాంక్‌లో క్యాషియర్‌. వారిద్దరిని గురించిన పరిచయం మా హోం కార్యదర్శి మిసెస్‌ రమణి చేస్తారు”

రమణి మైక్‌ అందుకుంది. పరిచయ ప్రశంస చేస్తూ ”ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్‌ గారికి, ఆత్మీయ అతిథులు, పెద్దలకు మా హోం తరపున శుభాభి వందనాలు. కుమారి మాలిని మా హోం ముద్దుల పట్టి. హోంలో ఆమె చేరిక ఒక విశేష సంఘటన… కర్నూల్‌ జనరల్‌ హాస్పిటల్‌లో కాన్పుల వార్డు మెట్ల మీద పడేసి వెళ్లిన ఓ జాలిలేని తల్లి, రక్తం పంచుకుని పేగు తెంచుకుని పుట్టిన శిశువును, మాకు తెలిసి మేమెళ్లి నెల రోజుల పసికందును తెచ్చి మా ‘శిశువిహార్‌’లో మిగిలిన పిల్లలతోటి పెంచాం. ప్రేమతో అక్కున చేర్చుకున్నాం. అమ్మాయి చాలా తెలివైనది. గుణవంతురాలు. చదువుల సరస్వతిగా రూపొంది బి.టెక్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా మీ ముందున్న వధువు… మా మాలిని….

”కుమారి మాలినీ!
మాలిని లేచి సవినయంగా సభకు నమస్కరించి కూర్చుంది.
రమణి కొనసాగిస్తూ…

ఇక కల్యాణ్‌… మా హోం సేవా కార్యక్రమాలకు సహాయ సహకారాలందిస్తుంటారు. మృదుస్వభావి. ఒక రోజు మా మేడమ్‌ని కలిసి తన అభిప్రాయాన్ని తెలియ బరిచాడు.

”మేడమ్‌! మాది పల్లెటూరు రైతు కుటుంబం. తండ్రి చనిపోయాడు. అమ్మ నన్ను టౌన్‌కి తీసుకొచ్చి చదివించింది. ఉద్యోగమొచ్చింది. మా అమ్మ నాకు పెండ్లి సంబంధాలు చూస్తుంది. ఒక అనాథగా హోంలో చేరి, మీ మన్ననలని పొంది, బాగా చదువుకొన్న మాలిని నన్నాకర్షించిన ఆమె అంగీకరిస్తే, మీ ఆదరాభిమాన ఆశీస్సులతో ఆమెను నేను పెళ్లి చేసుకుంటాను.”

మాలినిని మేం అడిగాం…

”నేనెవరినో నాకు తెలియదు. నేను కన్ను తెరిచినప్పటినుంచీ నాకు వెలుగును ప్రసాదించిన మీరే నా ప్రత్యక్ష దేవతలు. నా బాగోగులు మీకంటే ఎవరికి ఎక్కువ తెలుసు… మీ నిర్ణయమేదైనా శిరసావహిస్తాను” అంది మాలిని.

ఆ విధంగా ఈ వివాహం నిశ్చయమైంది. కల్యాణ్‌ కోరిక మేరకు సాంప్రదాయకంగా కాకుండా పెళ్లి రిజిష్టర్‌ మ్యారేజిగా అరేంజ్‌ చేసాం. కల్యాణ్‌ని మీకు పరిచయం చేస్తున్నాను.

”కల్యాణ్‌!”
కల్యాణ్‌ లేచి తలవంచి రెండు చేతులూ జోడించి సభకు నమస్కరించి కూర్చున్నాడు…
సభలో కరతాళ ధ్వనులు
”గౌరవ కలెక్టర్‌ గారిని వారి ఆశీఃభాషణం చేయవల్సిందిగా మనవి”
కలెక్టర్‌ మైక్‌ అందుకున్నాడు

”నా అనుభవంలో ఇదొక విశేషం… ఆదర్శ వివాహం… యువత, ముఖ్యంగా యువకులు వరకట్నాలలో బందీలై విలాస వ్యసనాలలో మునిగి పోతున్నారు. ఇలాంటి వేదికలు ప్రస్తుత సమాజంలో నూతన జీవిత ప్రమాణ స్ఫూర్తినిస్తాయి. మతాంతర, కులాంతర ప్రేమ వివాహాలు ఈమధ్య కాలంలో జరుగుతున్నాయి. సామాజిక జీవన పరిణామాన్నీ, ఔన్నత్యాన్ని చాటుతున్నాయి. చాలా అభినందించ వలసిన విషయం. ఈ వివాహం చట్టబద్ధం చేయబడుతూంది. ఎక్కడో పుట్టిన ఆ శిశువు అనాథ కాదు, మేమున్నామని మదర్స్‌ హోం నిర్వాహకులు ఆమెను గుండెకు హత్తుకుని పెంచి విద్యాబుద్ధులు గరిపి, ఆదర్శ వివాహాన్ని ఏర్పాటు చేసినందుకు వారిని నేను అభినందిస్తున్నాను. ప్రశంసిస్తున్నాను. కల్యాణ్‌ లాంటి ఉన్నత భావాలు కలిగిన యువకులు మరెందరో ముందుకు రావాలి. తమను తాము సంస్కరించుకుంటూ సమాజాన్ని సంస్కరించాలి. ఈ కల్యాణ దంపతులను నేను హృదయ పూర్వకంగా అభినందించి ఆశీర్వదిస్తూ; వారి దాంపత్య జీవితం సుఖశాంతులతో విలసిల్లాలని ఆశిస్తున్నాను.

మరొక మాట…
ఆదర్శ వివాహాలుగా నమోదైన చాలామంది నిజ దాంపత్య జీవితంలో సఫలురు కావడం లేదు. ఈమాట సర్వత్రా వినిపిస్తూ ఉంది. ఆత్మాభిమానం, స్వాతిశయం, న్యూనతలతో ఒకరినొకరు అర్థం చేసుకుని, సర్దుబాటు ధోరణిని అవలంబించలేక పోవడంతో ఎన్నో వివాహాలు వివాదాస్పదమై విడాకులకు దారితీస్తున్నాయి. వాటికి అతీతంగా మాలిని, కల్యాణ్‌లు మసలుకొని ఆదర్శ దంపతులుగా పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను”

రమణి కార్యక్రమం కొనసాగిస్తూ…
”ఇప్పుడు కల్యాణ్‌ తల్లి గారైన శ్రీమతి తులశమ్మ గారిని ఆమె సందేశాన్ని ఇవ్వవలసినదిగా కోరుచున్నాను”.
తులశమ్మ ముందు మైక్‌ పెట్టింది.

”ఏమోనమ్మా! నాకు మాటాడ్డం చేతకాదు. మావోణ్ణి కష్టపడి బాగా చదివించాను. ఉజ్జోగం వచ్చింది. మంచి కట్నం ఇస్తామని సమ్మందాలొచ్చాయి. వీడేమో ఈ పిల్లనిష్టపడ్డాడు. రిజిష్టరు పెళ్లన్నాడు. సరే… ఎంత ప్రాప్తమో అంతే! కానీయండి” మనసులో ఏదో అసంతృప్తి… కంఠంలో జీర. కళ్లు తుడుచుకుంది.

”ఇప్పుడు కల్యాణ్‌ మాట్లాడుతాడు”
కల్యాణ్‌ మైక్‌ అందుకున్నాడు

”పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మొదట మదర్స్‌హోం తల్లి మనోరమ గారికి, కార్యదర్శి రమణి గారికి నా మనస్సుమాంజలులు. ఇది ఆదర్శ వివాహమని అభినందనలను కురిపిస్తున్నారు. నాకు ఇబ్బందిగా ఉంది. మాలినిని కొద్దిరోజులుగా అబ్‌జర్వ్‌ చేస్తున్నా. ఆమెలోని చురుకుదనం, సుగుణాలు నన్నాకర్షించాయి. మంచి క్రమశిక్షణలో పెరిగిన ఆమెను నేను వివాహం చేసుకోవాలనుకున్నాను. పెద్దలు ఆశీర్వదించారు. సంబరంగా ఈ వివాహ వేదిక తయారైంది. మీ పెద్దల ఆశీస్సులతో నేను మాలినిని జీవితాంతం మర్యాద మన్ననలతో నాలో సగభాగంగా అర్థాంగిగా ఆమెను చూసుకుంటానని ప్రమాణం చేస్తున్నాను.”

మళ్లీ చప్పట్లు
మాలిని మైకు అందుకుంది
”అందరికీ వందనాలు. నేనెవరో నాకు తెలియదు. ఏ విపరీత పరిస్థితుల్లో, విధి వంచితురాలైన నా కంటికి కనిపించని ఆ తల్లి నన్ను దిక్కులేని దానిని చేసి వెళ్లిందో తెలియదు. సూర్యోదయంతో బాలభానుని సాక్షిగా మదర్స్‌ హోం నన్ను అక్కున చేర్చుకొని, వారి లాలనలో వారు నూరి పోసిన ఆత్మవిశ్వాసంతో పెరిగి పెద్దదాన్నయ్యాను. వారే నాకు దశ, దిశ నిర్దేశం చేసారు. కల్యాణ్‌ ఒక ఆశయంతో నన్ను స్వీకరిస్తున్నాడు. మా దాంపత్య జీవితంలో అన్ని ఒడిదుడుకులను ఇద్దరం సమానంగా స్వీకరించి, నిర్వర్తించి ‘ఆదర్శం’ అనే పదానికి ఓ కొత్త భాష్యం… కొత్త నిర్వచనం చెప్పగలమని ఆశిస్తున్నాను.

నా జీవితంలో ఇంకొక కొత్త అధ్యాయం మీ ఆశీస్సులతో సుఖమయం చెయ్యగలమని, అందుకు తగిన శక్తియుక్తులను ఆ ఆదిపరాశక్తిని ప్రసాదించవలసినదిగా ప్రార్థిస్తున్నాను.

అందరూ లేచి నిలబడి కరతాళ ధ్వనుల మధ్య తమ ఆనందాన్ని వ్యక్త పరిచారు.
వధూవరులు పూలమాలలు మార్చుకున్నారు. వివాహం రిజిస్టరైంది… అతిథులందరూ పూలరేకులతో ఆశీర్వదించారు. దంపతులు తులశమ్మ పాదాలకు నమస్కరించారు. ఆమె అన్యమనస్కంగానే పెదవి విప్పలేదు. గిఫ్ట్స్‌ ప్రెజెంట్‌ చేసారు మదర్స్‌ హోం తరపున మిస్‌ మనోరమ గారు.

—-
మాలినిని కాపురానికి పంపాలి

మనోరమ మేడమ్‌ మాలినికి కొన్ని మంచి మాటలు చెప్పింది.

”మాలూ! మా అందరి మధ్య కలివిడిగా తిరిగి పెరిగిన నీకు ఈ మ్యారేజ్‌తో కొంత స్వేచ్ఛ హరించుకు పోతుంది. సంసార భారం పడుతుంది. స్త్రీకి ప్రస్తుత మన సమాజం సంపూర్ణ స్వాతంత్య్రం కరువే. ఇక్కడే, ఇప్పుడు నువ్వు నీవుగా నీ ఆదర్శాలను ప్రూవ్‌ చేసుకోవాలి. ఎప్పుడూ ఆవేశానికి గురికావద్దు. కల్యాణ్‌ మంచివాడుగానే కన్పిస్తున్నాడు. అయినా ఈ పురుషాధిక్య సమాజంలో స్త్రీని అణిగి మణిగి ఉండమని శాసిస్తుంది. పరిస్థితులను అవగాహన చేసుకుని, చిన్న విషయాలను పెద్ద సమస్యలు చేసుకోకుండా అన్యోన్యంగా జీవించండి. మన హోం తలుపులు మీ కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఎలాంటి నైతిక సహాయం కావల్సినా యధేచ్ఛగా రావచ్చు. గాడ్‌ బ్లెస్‌ యూ మై డియర్‌ చైల్డ్‌”

హోంలోని ప్రతి ఒక్కరు నిండు హృదయంతో, ఉప్పొంగే ఆనందంతో మాలినిని మరో జీవిత ప్రస్థానంలోకి సాగనంపారు.

భాగ్యనగర్‌ కాలనీలో ఒక రెండు బెడ్రూం పోర్షన్‌లోకి కల్యాణ్‌ వెంట నడిచి క్రొత్త సంసారంలోకి అడుగుపెట్టింది మాలిని. అత్తగారి ఆశీర్వాదం తీసుకుంది.

”అమ్మా! నువ్వేమీ కష్టపడకు… మేం హోటల్లో భోంచేసి నీకు క్యారియర్‌ పట్టుకొస్తాం”
”అంతే లేరా! ఏదో ఒకటి” ముక్తసరిగా తులశమ్మ.
కొడుకు పెళ్లి ఒక అర్థాంతర తంతుగానే ఆమె భావిస్తుంది.
ఆ సాయంత్రం

”ఒరే అబ్బీ! నేను మనూరెళ్లొస్తారా! గుత్తలు వసూలు చేసుకుని, కొత్త గుత్తలు కుదుర్చుకొని వస్తా.. ఒక నెల పడుతుంది. రేపు పొద్దటి బసుకెక్కించు. నీ పెళ్లాంతో సెప్పు”

అమ్మకు ఎదురు చెప్పలేదు కల్యాణ్‌
మాలినికి టాటా కన్సల్టింగ్‌ సర్వీసులో ముంబైలో ఉద్యోగమొచ్చింది.

”నో! నో! మాలా! నువ్వెక్కడికీ వెళ్లొద్దు… ఇక్కడే స్పెన్సర్స్‌లో కంప్యూటర్‌ ఆపరేటర్‌ కమ్‌ అకౌంటెంట్‌ ఉద్యోగం ఉందట, ఇప్పిస్తానన్నాడు నా ఫ్రెండ్‌”

మాలినికి ఛాయిస్‌ లేదు స్పెన్సర్స్‌లో చేరింది. ఉదయం పది నుండి మధ్యాహ్నం రెండు వరకు, తిరిగి సాయంత్రం నాలుగు నుండి ఎనిమిది వరకు డ్యూటీ.

ఇంటిపని, వంటపని, జాబ్‌… క్షణం తీరిక లేదు.
అలవాటులేక అలిసిపోతూంది…
ఎక్కడో విని గుర్తుంచుకున్న ఒక పద్యం
”అత్త మామల సేవ అతి ముఖ్యమైనది
పతిని దైవమ్మని మతిసేయవలయు
మంచి గృహిణిగ తాను మసలవలయు
అదియె ఆదర్శమగును అతివకెపుడు”
సాంప్రదాయపు తత్వబోధ…. చెవిలో పోరు పెడుతూంది అన్ని బాధ్యతలూ నెత్తినేసుకుని ”సూపర్‌ ఉమెన్‌ సిండ్రోమ్‌”లో అసంకల్పితంగానే చిక్కుకుంది మాలిని. రోజూ ఇంటినుండి కిలోమీటర్‌ దూరం నడవాలి స్పెన్సర్‌కు.

తులశమ్మనుండి కబురు తెచ్చాడు చిన్నబ్బి… పొలం గట్టుమీద నుండి పడి ఆమెకు కాలు విరిగిందట. కొడుకును రమ్మని కబురు

కల్యాణ్‌ వెళ్లి తల్లిని అంబులెన్స్‌లో తీసుకొచ్చి పుత్తూరు కట్టు కట్టించాడు. ఆమె మంచమెక్కింది. వాకర్‌ మీద నడక.

”ఒరే అబ్బీ! నీ పెళ్లాం ఉజ్జోగం మానిపించరా! ఇంటి పని వంట పని సూస్కుంటే సాల్దా! నీ జీతం, గుత్తలు మనకు సరిపోవా?”

”అమ్మా! ఆ అమ్మాయి బాగా చదువుకుంది. అప్పటికీ ఇది సరైన ఉద్యోగం కాదు. అయినా చేస్తూంది. వద్దంటే ఎలా?”

”అంతే లేరా! నీ పెళ్లాం మాటే నీకూ. నా సౌక్యం మాట లేదా? పెద్ద కట్నాలిచ్చి కొంచెం సదువుకున్న అమ్మినిస్తానని వస్తే కాదంటివి… ఊరూ, పేరూ లేని, కులమూ గోత్రం తెలియని బైసాలిని తెచ్చుకుంటివి”

”ఎందుకమ్మా నిష్ఠూరపు మాటలు. నీ ఆశీర్వాదంతోనే కదా పెళ్లి జరిగింది”

”అదొక పెళ్లా? మేళ తాళాలు లేవు, పసుపు పారాణి లేదు, మంతరాలు లేవు… ఊ!! నన్ను దీస్కెల్లి కలెకటేరు, పోలీసోళ్ల ముందుకు తోస్తివి.. ఒప్పుకోక సస్తానా?”

తల్లీ కొడుకుల మధ్య ఇలాంటి సంభాషణలు అప్పుడప్పుడూ వింటూ ఉంది మాలిని.
”అమ్మ మాటల్ని పట్టించుకోవద్దు మాలా! వయసు ముదిరింది… ఏదో అంటుంటుంది”
”ఏంలేదు… నాకు బాధగా లేదు. నేను అర్థం చేసుకోగలను కల్యాణ్‌”
”నిజమే కానీ మంచిమాటలైతే పదిమంది ముందు చెప్పినా ఫరవాలేదు.. చెడ్డమాటలు చెవిలో చెప్పాలి అంటారు పెద్దలు. ఆమె మాటల్లో నిజం కంటె నిష్టూరం ఎక్కువ”

మాలిని తల దించుకుంది…

—–

మాలిని తెలుగు సాహిత్యాన్ని బాగా చదువుకుంది. చలం, గురజాడ, శ్రీశ్రీ ఆమె అభిమాన రచయితలు- వీరి రచనల్లో కొన్ని వాక్యాలు కంఠస్తం చేసింది… ఇప్పుడు చదివే తీరిక లేదు.

మాలిని ఆలోచిస్తూ వుంది…
గురజాడ కన్యాశుల్కంలోని కొన్ని మాటలు గుర్తుకొచ్చాయి.
గిరీశం తన శిష్యుడు వెంకటేశంతో
”దేవుడు ఆడవాళ్లను ఎందుకు పుట్టించాడురా” అడిగాడు
వెంకటేశం తడబడకుండా ”వంట చెయ్యడానికి” అంటాడు
వాడి అల్పబుద్ధికి తోచిన సమాధానమది-
”కాదురా వెధవాయ్‌! పెళ్లిచేసుకుని పిల్లల్ని కనడానికి”
”అవునా గురూ!” నోరెళ్లబెట్టాడు వెంకటేశం
ఇంకోచోట, మధురవాణి నోట.. కాబోలు.
”ఇండ్లలో వంట చేయడం నిషేధించాలి
వీధి వీధికొక భోజనశాల వుండాలి
శుభ్రంగా అక్కడే భోంచేసి వస్తే
ఈ వంట జంజాటం వుండదు”

ఇన్నేళ్ల తర్వాత కూడా గురజాడ మాటలో మార్పులేదు. సమాజం మారలేదు… ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు ఎన్ని వచ్చినా ఇంటి ఇల్లాలికి వంట చాకిరీ తప్పలేదు.

—–

కాలం గడిచిపోతూంది. మాలిని తల్లి అయింది. పాప పుట్టింది… తులశమ్మకు ఆడపిల్ల ఇష్టం లేదు. మనవడు కావాలి… ఆమేరకు సూటిపోటి మాటలు. సమయం దొరికితే దెప్పి పొడుపులు.

అన్నింటినీ విని మాలిని భరిస్తూంది… బాధగానే ఉంది. అయినా ఎవరితో చెప్పుకోవాలి… ఎవరితో బాధను పంచుకోవాలి?

తల్లా? తండ్రా, తోబుట్టువులా?

మదర్స్‌ హోంలో ఆత్మీయానురాగాల మధ్య పెరిగింది. ఎప్పుడూ ఒంటరితనం లేదు. అంతా తనకు తానై అందరితో కలివిడిగా ఉండేది.

కల్యాణ్‌కు విజయవాడ ట్రాన్స్‌ఫర్‌ అయింది. పాపకు రెండేళ్లు. పాప ముద్దు ముచ్చటకు కల్యాణ్‌ దూరమయ్యాడు. ఓన్లీ ఫోన్లోనే ముచ్చట్లు.

గత కొన్ని రోజులుగా ఆ ముచ్చట్లూ లేవు… మందు, మగువల మత్తులో ఉన్నట్లున్నాడు. ఫోన్‌ చేయడు. ఫోన్‌ చేస్తే స్విచ్‌ ఆఫ్‌…  కాలలోలకం గంటలు కొడుతూనే ఉంది… దుఃఖంలో ఉన్నప్పుడు క్షణమొక యుగంగా గడుస్తుంది. సంతోషంగా ఉన్నపుడు యుగమొక క్షణంగా పరుగెడుతుంది. మాలినిని ముసురుకున్న ఆలోచనలు… నిద్ర పట్టనివ్వడం లేదు. శక్తిని కృంగదీస్తున్నాయి. ఎంతగా ధైర్యాన్ని కూడగట్టుకున్నా… సాధ్యపడడం లేదు. అశక్తత ఆవహిస్తూ వుంది.రాత్రి పది గంటలైంది. పాపను నిద్ర పుచ్చింది. వీధిలో కుక్కలు కొట్లాడుకుంటున్నాయి. పెద్ద శబ్దాలు… పాప ఉలిక్కిపడి లేచింది. జడుసుకుంది. పెద్దగా గుక్కపెట్టి ఏడుపు. పాపను భుజం మీద వేసుకుని జోకొట్టింది… ఏడుపు మానలేదు.

పక్క గదిలో నుండి తులశమ్మ లేచి వచ్చింది.

”ఏమి సోద్దెమే తల్లీ! పిల్లని సముదాయించలేని దానివి దాన్ని ఎందుక్కనినట్టూ… తల్లికి దగ్గ పిల్ల… మాల మాదిగ గోల… ఇదిగో! దానికి ఏదైనా తినిపించు. నిద్ర మందు పోసయినా నిద్ర పుచ్చు”

కల్యాణ్‌తో మాట్లాడ్డానికి ఫోనెత్తింది… అటువైపు స్విచ్‌ ఆఫ్‌…

పాపను జోలపాట పాడి నిద్రబుచ్చింది…

మంచం మీద కూర్చుని తన జీవిత పుటలోని సంఘటనలను నెమరు వేసుకోసాగింది.

”తండ్రి ఎవరో! తల్లి ఎవరో తెలియని అనాథనైన తనను దేవుడు మదర్స్‌ హోంకు చేర్చాడు.. అక్కడ ఎంతో లాలనగా పెరిగింది. ఒంటరితనం ఎప్పుడూ అనుభవించలేదు. నాకందరూ ఉన్నారనే భావనే ఉండేది.

ఇప్పుడు పాపకు తండ్రి ఉన్నాడు. తల్లిని నేనున్నాను. అయినా అనాథే… ఆదరణ కరువైంది.
కళ్లు మూసుకుంది… కనురెప్పల క్రింద రీలు తిరుగుతూంది.

ఆనాటి పెళ్లి సంబరాలు… ప్రముఖుల ప్రసంగాలు.. కల్యాణ్‌ చేసిన పెళ్లినాటి ప్రమాణాలు… ఏమయ్యాయి? గాలివాటమై పోయాయా? నేనిప్పుడెవరికి చెప్పుకోవాలి? కలెక్టర్‌కా? ఎస్పీకా? వాళ్లిప్పుడు లేరు. ఉన్నా నా ఘోష పట్టించుకుంటారా?

కళ్లు తెరిచింది. అంతా శూన్యం… లేచి కిటికీ తెరిచింది. అంతా చీకటి. అమావాస్య చీకటి. గాఢాంధకారం… ఆలోచనలు…

వేల సంవత్సరాలుగా సమాజంలో స్త్రీ అణచివేతకు గురియైపోతూంది. స్త్రీవాదంపై ఎందరు ఉద్యమాలు నిర్వహించినా స్త్రీని సమున్నత స్థానంలో నిలబెట్టలేకున్నాయి.

తులశమ్మ, కల్యాణ్‌, ఉద్యోగం, పాప- అన్నీ తన బాధ్యతలేనా? ఈ ప్రశ్నలకు సమాధానం ఎక్కడ? ఎక్కడ వెదకాలి, ఎక్కడో నర్మగర్భ ఆలోచనలనుండి… కొత్త శక్తి… అదృశ్యంగా ధైర్యాన్నిస్తున్న భావన… ఆ భావన కంటికి కనిపిస్తున్న దుష్టశక్తుల్లో బందీనైన తనను ఆ శృంఖలాలనుండి విడిపించగలదా? బయట పడేయగలదా?

”నా పాప అనాథ కారాదు. నా పాపే కాదు ఏ ఇతర పిల్లలు కూడా అనాథలు కారాదు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని గమ్యం చేరగల శక్తియుక్తులను కూడగట్టుకోవాలి… చేస్తాను చేస్తాను.. ఎదిరిస్తాను. పోరాడుతాను”

కళ్లు తుడుచుకుంది. పాపను హత్తుకుని కునుకు తీసింది.

తెల్లవారింది. తూర్పున సూర్యుడు లోకంలోకి వస్తున్నాడు. మాలిని నుదురుపై నులివెచ్చని కిరణాల వెలుగు… కొత్త ఆశయాలపై ప్రసరిస్తూంది.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో