బీజింగ్‌ కార్యాచరణ వేదిక

1981 సెప్టెంబరులో CEDAW ఒక శక్తివంతమైన అంతర్జాతీయ ఒప్పందంగా అమలులోకి వచ్చిన తర్వాత 1995లో  బీజింగ్‌లో ప్రపంచ మహిళా సదస్సు జరిగింది. ఈ సదస్సు గుర్తించిన కీలకాంశాలలోని సమస్యను గుర్తించి, కొన్ని లక్ష్యాలను పెట్టుకొని వీటిని సాధించడం కోసం ప్రభుత్వాలు, స్త్రీలు, స్త్రీల సంఘాలు, ప్రజా సంఘాలు పని చేయాలని బీజింగ్‌ కార్యాచరణ వేదిక నొక్కి చెప్పింది.

కీలక ప్రకటన :

1. స్త్రీలను శక్తిమంతులను చేసేందుకై యేర్పరుచుకున్న ఎజెండా కార్యాచరణ వేదిక. స్త్రీల అభివృద్ధి కోసం ప్రగతి శీలమైన ఆలోచనలను, వేగంగా, త్వరితంగా ఆచరణలోకి తేవాలనే వుద్దేశంతో యేర్పరుచుకున్నది. స్త్రీలు ఇంటా, బైటా అన్ని రంగాలలో చురుగ్గా పాల్గొనేందుకున్న అన్ని అడ్డంకులనూ, అవరోధాలనూ తొలగించటమే దీని వుద్దేశం.

ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక విషయాలలో, నిర్ణయాలు చేయటంలో, స్త్రీల పాత్ర వుందనీ, వుండాలనీ నొక్కి చెబుతుంది. ఇంట్లోనూ, పని చేసే చోటా, జాతీయ, అంతర్జాతీయ సమూహాలలో బాధ్యతనూ, అధికారాన్నీ, స్త్రీ పురుషులిద్దరూ పంచుకోవాలనే మౌలిక సూత్రాన్ని స్థిరపరిచేందుకు కార్యాచరణ వేదిక ప్రయత్నిస్తుంది.

2. స్త్రీల, బాలికల, మానవ హక్కులు వేరు చేయలేనివనీ, విశ్వమానవ హక్కులో భాగమనీ, వాటినెవరూ లాక్కోలేరనే వియన్నా మానవ హక్కుల ప్రకటనలోని మౌలిక సూత్రాన్ని కార్యాచరణ వేదిక తిరిగి గట్టిగా మరొకసారి నొక్కి చెబుతుంది.

3. స్త్రీలందరికీ అవసరమైన అంశాలు పురుషులతో భాగస్వాములుగా పని చేయటం ద్వారా మాత్రమే పరిష్కారమవుతాయనే విషయాన్ని కార్యాచరణ వేదిక గుర్తిస్తుంది. స్త్రీల స్థితిగతుల్లో, పరిస్థితుల్లో వుండే తేడాలనూ, భిన్నత్వాన్నీ గుర్తిస్తూ స్వయం శక్తివంతులయ్యేందుకు కొందరు స్త్రీలకు మరిన్ని ఎక్కువ అవరోధాలున్నాయని గుర్తిస్తుంది.

4. ప్రజలందరూ మానవహక్కుల్నీ, స్వేచ్ఛనూ, ఆనందించే శాంతియుత మానవీయ సమాజాన్ని సృష్టించేందుకు అందరితో కలిసిన ఐక్య కార్యాచరణ అవసరమని భావిస్తుంది.

5. కార్యాచరణ వేదిక విజయం సాధించటమనేది – ప్రభుత్వాలూ, అంతర్జాతీయ సంస్థలు, అన్ని స్థాయిలలోనూ జరిగే వనరుల సమీకరణ, అన్ని స్థాయిల్లో బాధ్యతగా వుండే యంత్రాంగాన్ని యేర్పరచి, బలపరచటం – యివన్నీ స్త్రీల అభివృద్ధి కోసం, అంకితమై పని చేయటం మీదనే ఆధారపడి జరుగుతుంది.

6-8. కార్యాచరణ వేదిక సీడాను ముందుకు తీసుకువెళ్తుంది. నైరోబీ సదస్సులోని పురోగామి ఆలోచనలనూ, ఐక్యరాజ్య సమితి ఆర్థిక సాంఘిక కౌన్సిల్‌ తీర్మానాలనూ, ఇంతకుముందు జరిగిన అన్ని ఐక్యరాజ్య సమితి ఒప్పందాలనూ, శిఖరాగ్ర సభలూ సమావేశాలలోని తీర్మానాలనూ పరిగణలోకి తీసుకుని, వాటి మీద ఆధారపడి కార్యాచరణ వేదికను తయారు చేశారు. ఇది రాబోయే ఐదు సంవత్సరాలలో ముఖ్యంగా చేయాల్సిన పనులను ఒక కనీస గ్రూపుగా యేర్పరచి స్థిరపరుస్తుంది.

9. కార్యాచరణ వేదిక ముఖ్య వుద్దేశం స్త్రీలను స్వయంశక్తివంతులను చేయటమే. దానికై స్త్రీలకు హక్కులూ, మౌలికమైన స్వేచ్ఛ అవసరమని గుర్తిస్తుంది.

అన్ని మతాలకూ, నైతిక, సాంస్కృతిక విలువలకూ, పూర్తి గౌరవాన్నిస్తూ రాజకీయ, సాంఘిక విధానాలు యేవైనప్పటికీ, స్త్రీల మానవ హక్కుల్నీ, స్వేచ్ఛనూ రక్షించటం, స్త్రీలు సమానత్వాన్ని, అభివృద్ధినీ, శాంతినీ సాధించగలరనే హామీ యివ్వటం ప్రభుత్వాల విధి.

10. 1985వ సంవత్సరంలో నైరోబీ సదస్సు జరిగిన తర్వాత, ఆ సదస్సులోని ప్రగతిశీల ఆలోచనలను అంగీకరించాక, ప్రపంచంలో చాలా స్పష్టమైన రాజకీయ, ఆర్థిక సాంఘిక మార్పులు వచ్చాయి. ఈ మార్పులలో స్త్రీలకు అనుకూలమైనవీ వ్యతిరేకమైనవీ వున్నాయి. అంతర్జాతీయంగా యివాళ ప్రధానోద్దేశంగా వుండాల్సిందేమిటంటే స్థానిక గ్రామీణ స్థాయి నుంచీ, ప్రపంచ స్థాయి వరకూ అన్ని చోట్లా రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక రంగాలలో స్త్రీల భాగస్వామ్యం సమానంగా, సంపూర్ణంగా వుండాలి.

అంతర్జాతీయంగా వుండాల్సిన మరో అతి ముఖ్య ఉద్దేశం లింగ వివక్షను పూర్తిగా నిర్మూలించాలి.

11. అగ్రరాజ్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ముగిసినప్పటికీ, దౌర్జన్యంతో కూడిన యుద్ధాలు, సాయుధ సంఘర్షణలు, అంతర్యుద్ధాలు, తీవ్రవాదం ప్రపంచంలో అనేకచోట్ల చెలరేగుతూ స్త్రీల మానవ హక్కుల్ని కాలరాస్తున్నాయి. హరించి వేస్తున్నాయి. వారిపై లైంగిక అత్యాచారాలూ, హత్యలూ, హింసా జరుగుతున్నాయి. జాతి పవిత్రతను కాపాడటం పేరుతో స్త్రీలు బలవంతపు గర్భాలను భరిస్తున్నారు. బలవంతపు గర్భస్రావాలకు గురి అవుతున్నారు.

12. స్త్రీల, బాలికల మానవ హక్కుల పరిరక్షణకు శాంతి అనేది చాలా కీలకం. అత్యవసరం.

13. మిలటరీ అవసరాల కోసం చేసే ఖర్చూ, ఆయుధాల వ్యాపారం, ఆయుధాల ఉత్పత్తి, యివన్నీ సాంఘికాభివృద్ధికున్న వనరులను తగ్గించి వేస్తాయి.

నూతన ఆర్థిక విధానాలు కూడా సాంఘికాభివృద్ధి మీద చెడు ప్రభావాన్ని కలగజేస్తున్నాయి. బీదరికంలో బతికే ప్రజల సంఖ్య పెరుగుతోంది.

14. అభివృద్ధికి వున్న సాంఘిక కోణాన్ని నొక్కి చెప్పటం చాలా అవసరం. ఆర్థిక పెరుగుదల దానంతట అది, ఆటోమాటిక్‌గా ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరచదు. పైగా ఈ ఆర్థిక పెరుగుదల వల్ల తరచుగా సాంఘిక అసమానతలు పెరుగుతాయి. కాబట్టి సమగ్ర అభివృద్ధి కోసం కొత్త మార్గాలను, ప్రత్యామ్నాయ మార్గాలను వెతకటం అవసరం.

స్త్రీ పురుష సమానత్వానికీ, సాంఘిక న్యాయానికీ, స్వయం పోషకత్వానికీ, శాంతికీ, మానవ హక్కుల పట్ల గౌరవభావానికీ ఈ మార్గాలు ప్రాధాన్యతనివ్వాలి.

15. ప్రజాస్వామ్య సాధనకు ప్రపంచ వ్యాప్తమైన వుద్యమం వున్నప్పటికీ, స్త్రీలు పురుషులతో సమాన భాగస్వామ్యంతో అన్ని రంగాల్లో పాల్గొనాలనే లక్ష్యాన్ని యింకా సాధించాల్సే వుంది.

16. ఆర్థిక వెనుకబాటుతనం, రాజకీయ అస్థిరత, అభివృద్ధిని కుంటుపరచి బీదరికాన్ని పెంచుతాయి. ప్రపంచంలో ఒక బిలియన్‌ ప్రజలు పూర్తిగా బీదరికంలో మగ్గుతుంటే అందులో అత్యధిక సంఖ్యాకులు స్త్రీలే. నూతన ఆర్థిక విధానం స్త్రీలపై బలహీనవర్గాలపై వచ్చే వ్యతిరేక ఫలితాలను తగ్గించేలా రూపొందించబడలేదు.

17. బీదరికం, స్త్రీలపైనే ఎక్కువగా పడుతున్న బీదరికం, నిరుద్యోగం, పర్యావరణ కాలుష్యం, స్త్రీలపై హింస, మానవ జాతిలో సగాన్ని అధికారం నుంచీ, పాలన నుంచీ మినహాయించటం, యివి చూస్తుంటే అభివృద్ధి కోసం, శాంతి భద్రతల కోసం అన్వేషించాల్సిన అవసరం ఎంతైనా వుందని అర్థమవుతుంది. ఆ అన్వేషణలో మానవ జాతిలో సగం మాత్రమే పాల్గొంటే అది విజయవంతమవుతుందా అనేది ప్రశ్న. కాబట్టి ప్రభుత్వాల మధ్యా, ప్రజల మధ్యా అంతర్జాతీయ సహకారం, స్త్రీ పురుష సంబంధాలలో సంపూర్ణ సమాన భాగస్వామ్యం వున్న నూతనయుగం మాత్రమే 21వ శతాబ్దపు సవాళ్లను మనం ఎదుర్కునేందుకు తోడ్పడుతుంది.

18-22. అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధి స్త్రీలమీద చెడు ప్రభావాన్ని చూపింది. కనీస సాంఘిక సేవల బాధ్యత ప్రభుత్వాల నుండి స్త్రీల మీద పడింది. ఆర్థిక మాంద్యం స్త్రీల వుద్యోగవకాశాల్ని తగ్గించి వాళ్ళని వుద్యోగ భద్రత లేని పనులకూ, యింట్లో కూర్చుని చేసే పనులకూ లేదా వలస పోయేందుకూ తరుముతోంది. ఇది స్త్రీల పనిభారాన్ని పూర్తిగా పెంచుతుంది.

ఆర్థిక విధానాలు, నూతన ఆర్థిక కార్యక్రమాలూ కలిసి స్త్రీల, బాలికల దరిద్రాన్ని పెంచుతున్నాయి. వాళ్లని ఆర్థికంగా వెనకబాటుతనంలోకీ, సాంఘికంగా విలువలేనితనంలోకీ నెడుతున్నాయి.

ఆర్థికరంగంలో స్త్రీలకు కీలకమైన పాత్ర వుంది. జీతం వున్న పనులూ, జీతంలేని పనులూ చేస్తూ, దరిద్రంతో యుద్ధం చేస్తున్నారు.

ప్రపంచంలో నాల్గోవంతు కుటుంబాలు స్త్రీలు బాధ్యత వహించటం వల్ల నడుస్తున్నాయి. మిగిలినవి స్త్రీలు తెచ్చే ఆదాయం మీద ఆధారపడి నడుస్తున్నాయి. కుటుంబాలు విచ్ఛిన్నమవటం, వలస పోవటం, అక్కడక్కడ చెల్లాచెదరై పోవటం, యుద్ధం యివన్నీ కూడా స్త్రీలపై పూర్తి కుటుంబ బాధ్యతను పడవేశాయి.

23. శాంతి ప్రధానంగా పనిచేసేది స్త్రీలే. ఎందుకంటే ఆర్థిక, సాంఘిక అభివృద్ధికి ముందు కావలసింది శాంతి.

24. ఆలోచించుకునే స్వేచ్ఛ. యిష్టమైన మతాన్ని యెంచుకునే స్వేచ్ఛ యివి విశ్వమానవ హక్కులు.

మతం, విశ్వాసాలు యివి స్త్రీ పురుషులకు వారి నైతిక ఆధ్యాత్మిక అవసరాలను పరిపూర్ణం చేసుకోవటానికి అవసరమైతే, అతివాదం అనేది స్త్రీలకు హాని చేస్తుందనీ, అది హింసకూ, వివకక్షూ దారి తీస్తుందనీ గుర్తించాలి.

25. నాల్గవ అంతర్జాతీయ మహిళా సదస్సు – 1975ను అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ ప్రకటించిన నాటినుండీ జరిగిన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి.

26. ఎన్జీవోలు, ముఖ్యంగా స్త్రీల సంఘాలు, ఫెమినిస్టు గ్రూపులూ, మార్పుకోసం పనిచేసే చోదకశక్తులవలే పనిచేయాలి. స్త్రీలు ఎన్జీవోల ద్వారా జాతీయ, ప్రాంతీయ, ప్రపంచ వేదికలనూ అంతర్జాతీయ వేదికలనూ ప్రభావితం చేయాలి.

27. 1975 నుండి స్త్రీ పురుషుల మధ్య సమానత, విద్య ద్వారా, ఉద్యోగావకాశాల ద్వారా అందించబడుతోంది. పురుషుల రంగాలని పేరుపడిన ప్రాంతాలలో స్త్రీలు ప్రవేశించారు. పురుషులు యింటిపనిలో, పిల్లల సంరక్షణలో బాధ్యత తీసుకుంటున్నారు. ఐనా స్త్రీ పురుషులు సాధించే దానిలో వున్న తేడా వాళ్ళకు నిర్దేశించిన, సాంఘికంగా నిర్మాణమైన, విధుల వల్లనే గాని, వారి శరీర నిర్మాణాల్లో వున్న తేడాల వల్ల కాదనే విషయాన్ని యింకా గుర్తించలేదు.

28. నైరోబీ సదస్సు జరిగి పది సంవత్సరాలు గడిచినా ప్రపంచంలో పదిశాతం మంది స్త్రీలే శాసన సభ్యులుగా ఎన్నికయ్యారు. ఐక్యరాజ్య సమితితో సహా జాతీయ, అంతర్జాతీయ పరిపాలనా నిర్మాణాల్లో వారికి ప్రాతినిధ్యం చాలా తక్కువ.

29. సమాజంలో ముఖ్యమైన యూనిట్‌గా చూసే కుటుంబంలో స్త్రీలు కీలకమైన పాత్ర పోషిస్తారు. కుటుంబ సంక్షేమంలో, సాంఘికాభివృద్ధిలో స్త్రీల పాత్రను గుర్తించి చెప్పాలి. స్త్రీల సంతానోత్పత్తి పాత్ర వారిపట్ల వివక్షకు కారణం కాకూడదు.

30. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 40-50% జనాభా 15 సంవత్సరాలలోపు వయసున్న వాళ్ళున్నారు. 2025వ సంవత్సరం నాటికి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 72 శాతం ప్రజలు 60 సంవత్సరాలు పైబడిన వారే వుంటారు. ఇందులో సగంపైగా స్త్రీలే ఉంటారు.  పిల్లల సంరక్షణ, జబ్బు పడినవారి, వృద్ధుల సంరక్షణ భారం ప్రధానంగా స్త్రీల మీదనే పడుతుంది. ఎందుకంటే స్త్రీ పురుషుల మధ్య సమానత్వం లేదు. వారి మధ్య శ్రమ విభజన సమానత్వంపై ఆధారపడి జరగదు.

31. జండర్‌తో పాటు యింకా చాలా విషయాలలో స్త్రీలు వివక్షకు గురవుతున్నారు. మానవ హక్కుల నిరాకరణ, అవిద్య, శిక్షణ లేకపోవడం, నిరుద్యోగం వీటివల్ల స్త్రీలు ప్రధాన స్రవంతిలో నిర్ణయాలు చేసే పనిలో పాల్గొనలేక పోతున్నారు.

32. ఆదివాసి స్త్రీలు తమ సమూహాలును బలోపేతం చేసి, కొనసాగించే పని చేస్తున్నా స్త్రీలుగానూ, ఆదివాసులుగానూ కూడా వివక్షకు గురవుతున్నారు.

33. స్త్రీలు సాంకేతిక రంగాలలో నిర్ణయాలు తీసుకునే స్థాయిలో పాల్గొనాలి.

34. పర్యావరణ కాలుష్యం మానవుల జీవితాన్నంతా ప్రభావితం చేస్తున్నా స్త్రీలు అందరికంటే ఎక్కువగా బాధకు గురవుతారు. కాలుష్యం వల్లా, అడవులను నరికివేయటం వల్లా, తీరప్రాంతాలలో వనరులు తగ్గిపోవటం వల్లా, వారి ఆరోగ్యం, జీవనోపాధి నాశనమవుతాయి.

35. బీదరికం వల్ల పర్యావరణం కొంత దెబ్బతినవచ్చు గానీ, పారిశ్రామిక దేశాల వినిమయ పద్ధతుల వల్ల దరిద్రం పెరుగుతుంది.

36. గ్లోబల్‌ విధానాలు కుటుంబ నిర్మాణాన్ని మార్చాయి. పెద్దఎత్తున వలసపోవటం, చెల్లా చెదురవటం వల్ల వచ్చే ఫలితాల్లో, వాటిని అనుభవించటంలో, స్త్రీలకూ, పురుషులకూ మధ్య తేడా వుంది. స్త్రీలు మరింతగా లైంగిక దోపిడీకి గురవుతారు.

37. 2000వ సంవత్సరానికి ఎయిడ్స్‌ కేసులు 20 మిలియన్లకు పెరుగుతాయని అంచనా వేసారు. సుఖ వ్యాధులు, ఎయిడ్స్‌, అభివృద్ధి చెందుతున్న దేశాలలో వ్యాప్తి చెందుతున్న తీరు స్త్రీలకూ, బాలికలకూ భయం గొలిపేదిగా వుంది.

38. సాంఘిక దృక్పధాల వల్లా, సాంఘిక ఆర్థిక నిర్మాణాల వల్లా, వనరులు లేకపోవటం వల్లా, స్త్రీలు జీవితాంతం వివక్షకు గురవుతూనే వున్నారు. వారి జీవితాలలో అతి ప్రాథమికదశ నుంచీ దీన్ని గుర్తింపజేసి, ఆలోచింపజేయాలి.

39. జీవితంలో సమాన భాగస్వామ్యం కావాలంటే – యివాళ్టి బాలికలు, అంటే రేపటితరం స్త్రీలు ఒక మంచి వాతావరణంలో వాళ్ళ శక్తులన్నిటినీ సంపూర్ణంగా అభివృద్ధి చేసుకోవాలి. బాలికల గౌరవం, మానవహక్కులు, ప్రాధమిక స్వేచ్ఛా వీటన్నిటినీ గుర్తించాలి. పోషకాహారం, వైద్యం, విద్య ఆమెకు అందుబాటులో వుండేలా చేయాలి. ఆమెను లైంగిక, ఆర్థిక దోపిడి నుంచి రక్షించాలి.

40. ప్రపంచంలో 85% పైగా యువతరం (ప్రపంచంలో సగం జనాభా) అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నివసిస్తున్నారు. యువతులకు నాయకత్వంలో చురుగ్గా పాల్గొనేందుకు అవసరమైన శిక్షణ దొరికేలా చూడటం చాలా ముఖ్యం.

సమానత్వం అనే సూత్రం సామాజికీకరణ క్రమంలో అంతర్భాగమైపోవాలి.

కీలకాంశాలు :

1. స్త్రీల మీద నిరంతరం పెరుగుతున్న బీదరికపు పెనుభారం.

2. విద్య, శిక్షణలో అసమాన అవకాశాలు, చాలని అవకాశాలు.

3. ఆరోగ్యానికి, దానికి సంబంధించిన యితర సేవలలో అసమానతలు, చాలీచాలని అవకాశాలు, అసమాన అవకాశాలు.

4. స్త్రీలపై హింస.

5. స్త్రీలపై సాయుధమైన, యితరమైన ఘర్షణల ప్రభావం. విదేశీ ఆక్రమణల్లో వున్న దేశాలలో స్త్రీలపై అక్కడ జరిగే సంఘర్షణల ప్రభావం.

6. ఆర్థిక నిర్మాణాల్లో, విధానాల్లో, అన్ని రకాల ఉత్పత్తి కార్యక్రమాల్లో వనరుల అందుబాటులో వున్న అసమానతలు.

7. అన్ని స్థాయిల్లో అధికారాన్నీ, నిర్ణయాలు చేసే అధికారాన్నీ పంచుకోవటంలో స్త్రీ పురుషుల మధ్య వున్న అసమానతలు.

8. స్త్రీల అభివృద్ధికీ, పురోగమనానికీ అన్ని స్థాయిల్లోని చాలీచాలని యంత్రాంగాలు.

9. స్త్రీల మానవహక్కులపై గౌరవం లేకపోవటం, ఆ హక్కులను ముందుకు తీసికెళ్ళే, రక్షించే విధానాలు లేకపోవటం.

10. స్త్రీలను మూసపాత్రల్లో కుదించటం, అన్ని కమ్యూనికేషన్‌ విభాగాలూ స్త్రీలకు అందుబాటులో లేకపోవటం, వాటిలో స్త్రీల పాత్ర లేకపోవటం. ముఖ్యంగా ప్రసారసాధనాలలో స్త్రీలకు సరైన స్థానం లేకపోవటం.

11. సహజ వనరులను, పర్యావరణాన్నీ పరిరక్షించుకోవటంలో స్త్రీ పురుష అసమానతలు.

12. బాలికల పట్ల సడలని వివక్ష, బాలికల హక్కుల వుల్లంఘన.

పెట్టుకున్న లక్ష్యాలు – చేయాల్సిన పనులు

45. ప్రతి కీలకాంశంలోనూ సమస్యను గుర్తించటం. ఆ తర్వాత లక్ష్యాలను ప్రతిపాదించుకోవటం, వాటిని సాధించటం కోసం యెవరెవరు యే యే పనులు చేయాలో గుర్తించి ఆ పనులు జరిగేలా చూసుకోవాలి.

46. సంపూర్ణ సమానత్వం, అభివృద్ధి సాధించటంలో స్త్రీలకు అడ్డంకులు వున్నాయని కార్యాచరణ వేదిక గుర్తిస్తుంది. జాతి, వయసు, సంస్కృతి, మతం మొదలైన అడ్డంకులతో పాటు ఆదివాసి స్త్రీలకు ఆ కారణంగా మరో అడ్డంకి తోడవుతుంది. కుటుంబ హోదా, జీవన పరిస్థితులు, అంతర్గతంగా చెల్లాచెదురైన కుటుంబాలు, పర్యావరణం, జబ్బులు, హింస వీటివల్ల కూడా స్త్రీలు బాధలకూ, హింసకూ గురవుతున్నారు.

A. స్త్రీలు – బీదరికం

1. బీదరికంలో మగ్గుతున్న స్త్రీల అవసరాలకూ, వారి కృషికీ తగిన విధంగా ఆర్థిక విధానాలనూ, అభివృద్ధి పథకాలనూ సమీక్షించుకుని, తయారు చేసుకుని, అమలు చేయాలి.

2. ఆర్థిక వనరులు స్త్రీలకు అందుబాటులోకి వచ్చేలా చట్టాలనూ పరిపాలనా పద్ధతులనూ తిరిగి మార్చుకుని స్త్రీల సమానహక్కులకు హామీ యివ్వాలి.

3. స్త్రీలు పొదుపు చేసుకునేందుకు, రుణాలు పొందేందుకు వీలుగా సంస్థలనూ, యంత్రాంగాన్నీ యేర్పరచాలి.

4. దరిద్రం స్త్రీలనే యెక్కువ చుట్టుముట్టటానికి గల కారణాలను గురించి పరిశోధన చేయాలి.

జండర్‌ ఆధారంగా రూపొందిన పద్ధతులను అభివృద్ధి చేయాలి.

B. స్త్రీలకు విద్య – శిక్షణ

1. చదువుకునేందుకు సమాన అవకాశాలు కల్పించాలి.

2. స్త్రీలలో నిరక్షరాస్యతను నిర్మూలించాలి.

3. వృత్తి విద్యలలో శిక్షణకు, శాస్త్ర, సాంకేతిక రంగాలలో విద్యను నిరంతరం అభివృద్ధి చేసుకునేందుకు స్త్రీలకున్న అవకాశాలను మరింతగా మెరుగుపర్చాలి.

4. వివక్షతకు తావులేని చదువుని, శిక్షణని అభివృద్ధి చేయాలి.

5. విద్యా సంస్కరణలను అమలు చేసి, వాటిని పర్యవేక్షించటానికి తగినన్ని నిధులను కేటాయించాలి.

6. బాలికలకూ, స్త్రీలకూ చదువుకునేందుకు శిక్షణ పొందేందుకూ తగిన అవకాశాలు కల్పించాలి.

C. స్త్రీల ఆరోగ్యం

1. స్త్రీలకు తమ జీవితంలోని అన్ని దశలలోనూ తమకు తగిన, తాము అందుకోగలిగిన, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను, ఆరోగ్య సమాచారాన్ని, ఆ రంగంలో యితర సేవలను పొందే అవకాశాలనూ బాగా పెంచాలి.

2. స్త్రీల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే రోగ నిరోధక కార్యక్రమాల్ని మరింత యెక్కువగా చేపట్టాలి.

3. జండర్‌ని దృష్టిలో వుంచుకుని సుఖ వ్యాధులు, ఎయిడ్స్‌ వంటి వ్యాధుల గురించి, లైంగిక, సంతానోత్పత్తికి సంబంధించి, ఆరోగ్య విషయాల గురించి కార్యక్రమాలను చొరవగా ముందుకు తీసుకెళ్ళాలి.

4. స్త్రీల ఆరోగ్యం గురించి పరిశోధనను పెంచి ఆ సమాచారాన్ని స్త్రీలందరికీ చేరేలా చూడాలి.

5. స్త్రీల ఆరోగ్యం కోసం కేటాయించిన నిధులను పెంచి, అవి సద్వినియోగం అవుతున్నాయా లేదా అని పర్యవేక్షించాలి.

D. స్త్రీలపై హింస

1. స్త్రీలపై జరిగే హింసను పూర్తిగా నిరోధించటానికీ, తుడిచిపెట్టటానికీ అవసరమైన సమగ్ర కార్యక్రమాలను చేపట్టాలి.

2. స్త్రీలపై జరిగే హింసకు కారణాలనూ, ఆ హింసా ఫలితాలనూ అధ్యయనం చేసి, హింసను నిరోధించటానికి రూపొందించుకున్న కార్యక్రమాలు యెంతవరకూ సరైనవో సరిచూసుకోవాలి.

3. స్త్రీల శరీరాలపై జరిగే వ్యాపారాన్ని నిర్మూలించి, ఆ వ్యాపారంలోనూ, వ్యభిచారంలోనూ హింసకు గురైన బాధితులకు సహాయాన్ని అందించాలి.

E. సాయుధ సంఘర్షణలో స్త్రీలు

1. సంఘర్షణలను ఆపేందుకు జరిగే ప్రయత్నాలలో, నిర్ణయాలు చేసే స్థాయిలో, స్త్రీలను ఎక్కువగా పాల్గొనేలా చేసి వారి పాత్రను పెంచాలి. సాయుధ సంఘర్షణల్లో, విదేశీ ఆక్రమణలలో జరిగే సంఘర్షణలలో బతుకుతున్న స్త్రీలకు తగిన రక్షణ కల్పించాలి.

2. అమితంగా పెరుగుతున్న మిలటరీ ఖర్చులను తగ్గించాలి. ఆయుధాలు దొరికే అవకాశాలు లేకుండా నియంత్రణ విధించాలి.

3. సంఘర్షణలు నివారించేటపుడు అహింసా మార్గాలను అభివృద్ధి చేసి – సంఘర్షణ సందర్భాలలో మానవ హక్కుల వుల్లంఘన జరిగే సంఘటనలను తగ్గించాలి.

4. శాంతియుతమైన సంస్కృతిని రూపొందిం చడంలో స్త్రీల పాత్రను పెంచాలి.

5. శరణార్థులైన స్త్రీలకూ, అంతర్జాతీయ రక్షణ అవసరమైన స్త్రీలకూ రక్షణ, సహాయం, జీవనోపాధికి అవసరమైన శిక్షణ కల్పించాలి.

6. వలస ప్రాంతాల్లోని స్త్రీలకూ, తమ జాతీయ పరిపాలనలో లేని ప్రాంతాల్లోని స్త్రీలకూ సహాయాన్ని కల్పించాలి.

F. ఆర్థిక రంగంలో స్త్రీలు

1. స్త్రీలకు వుద్యోగావకాశాలు, పనిచేసే చోట సరైన వాతావరణం, ఆర్థిక వనరులపై కంట్రోలు వీటన్నిటితో కూడిన ఆర్థిక హక్కులనూ, స్వేచ్ఛనూ స్త్రీలకు కల్పించాలి.

2. వనరులను పొందటానికి, వుద్యోగాలలో, మార్కెట్‌లో, వ్యాపారంలో తగిన, సమానమైన చోటుని స్త్రీలకు కల్పించాలి.

3. వ్యాపార సేవలు, మార్కెట్‌లో ప్రవేశానికి అవకాశాలు, శిక్షణ సమాచారం, సాంకేతిక నైపుణ్యం స్త్రీలకు కల్పించాలి. ముఖ్యంగా ఆర్థికంగా వెనకబడిన స్త్రీలకు కల్పించాలి.

4. స్త్రీల ఆర్థిక సామర్థ్యాన్నీ, వ్యాపార నెట్‌వర్కులనూ పెంచాలి.

5. వృత్తులలో విభజననూ, వుద్యోగాల్లో అన్ని రకాల వివక్షతలనూ నిర్మూలించాలి.

6. స్త్రీ పురుషుల మధ్య వుద్యోగాలలోనూ, కుటుంబ బాధ్యతల నిర్వహణలోనూ సహకారాన్నీ, సుహృద్భావ వాతావరణాన్నీ పెంచాలి.

G. నిర్ణయాలు చేసే అధికారంలో స్త్రీలు

1. అధికార నిర్మాణాలలో, నిర్ణయాలు చేసే స్థాయిలో స్త్రీలు పూర్తిగా పాల్గొనేందుకు సమాన అవకాశాలను స్త్రీలకు కల్పించేందుకు కావలసిన యేర్పాట్లన్నీ చేయాలి.

2. నిర్ణయాలు చేయటంలో, నాయకత్వంలో స్త్రీలు భాగస్వామ్యం వహించేందుకు వారికి కావాల్సిన శక్తి సామర్థ్యాలను పెంచాలి.

H. స్త్రీల అభివృద్ధి కోసం సంస్థాగతమైన యేర్పాట్లు

1. స్త్రీల అభివృద్ధి కోసం జాతీయ స్థాయిలో యంత్రాంగాన్నీ, ప్రభుత్వ సంస్థలనూ యేర్పరచి వాటిని బలోపేతం చేయాలి.

2. చట్టాలలో, పబ్లిక్‌ విధానాలలో, కార్యక్రమాలలో ప్రాజెక్టులలో జండర్‌ దృష్టిని కలగలపాలి.

3. ప్రణాళికలు రూపొందించేటపుడూ, ఫలితాలను అంచనా వేసేటపుడూ జండర్‌ని దృష్టిలో వుంచుకుని సమాచారాన్ని సేకరించి పంచాలి.

I. స్త్రీల మానవ హక్కులు

1. స్త్రీల మానవ హక్కులను రక్షించి అభివృద్ధి చేయాలి. దానికోసం మానవ హక్కులను అమలు పరిచే సాధనాలను ముఖ్యంగా సీడా   వంటి వాటిని ఉపయోగించుకోవాలి.

2. చట్ట ప్రకారం, ఆచరణలో సమానత్వాన్నీ, వివక్షతలేని పద్ధతుల్ని కల్పించాలి.

3. చట్టాల గురించిన పరిజ్ఞానాన్ని కల్పించాలి.

J. ప్రసార సాధనాలు

1. ప్రసార సాధనాల ద్వారా, కమ్యూనికేషన్‌ రంగంలో వచ్చిన కొత్త సాంకేతిక మార్గాల ద్వారా, స్త్రీలు తమ అభిప్రాయాలను చెప్పుకోవటానికీ, ఆయా రంగాలలో నిర్ణయాలు చేయటానికీ వున్న అవకాశాలనూ, వారి పాత్రనూ పెంచాలి.

2. ప్రసార సాధనాల్లో స్త్రీల చిత్రణ ఔచిత్యంతో, నమూనాలకూ, మూసపాత్రలకూ భిన్నంగా జరిగేలా చూడాలి.

K. పర్యావరణం – స్త్రీలు

1. అన్ని స్థాయిల్లో పర్యావరణానికి సంబంధించిన నిర్ణయాలు చేయటంలో స్త్రీలు చురుగ్గా పాల్గొనేలా చేయాలి.

2. స్వయం పోషకత్వ పద్ధతిలో అభివృద్ధి కోసం జరిగే కార్యక్రమాల్లో రూపొందించే విధానాల్లో, జండర్‌ పరమైన దృష్టినీ, దృక్పథాన్నీ జాగ్రత్తగా కలపాలి.

3. జాతీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో స్త్రీల గురించి జరిగే అభివృద్ధి పథకాలనూ, పర్యావరణాన్ని గురించిన పాలసీలను రూపొందించి బలపరచాలి.

L. బాలికలు

1. బాలికల పట్ల అన్ని రకాల వివక్షతలనూ నిర్మూలించాలి.

2. బాలికల పట్ల సాంస్క ృతిక పరంగా వున్న వ్యతిరేక ధోరణులనూ, ఆచారాలనూ, అలవాట్లనూ నిర్మూలించాలి.

3. బాలికల హక్కులను రక్షించి, పెంచి, వారి అవసరాలనూ వారి శక్తులను గురించిన చైతన్యాన్ని పెంచాలి.

4.  చదువులో, నైపుణ్యాన్ని పెంచే శిక్షణలో బాలికల పట్ల వున్న వివక్షతను నిర్మూలించాలి.

5. ఆరోగ్యంలో, పోషకాహారాన్ని అందించటంలో బాలికల పట్ల వున్న వివక్షతను నిర్మూలించాలి.

6. బాలికల శ్రమను దోచుకోవటాన్ని నిరోధించి, యువతులకు పనిచేసే చోట రక్షణ కల్పించాలి.

7. బాలికలపై జరిగే హింసను అరికట్టాలి.

8. బాలికలకు సాంఘిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో ఆసక్తినీ, చైతన్యాన్నీ పెంచి వారు వాటిలో పాల్గొనే అవకాశాలను కల్పించాలి.

9. బాలికల స్థాయిని మెరుగుపర్చటంలో కుటుంబ పాత్రను చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. కుటుంబంలో బాలికల పట్ల వివక్షత లేకుండా సమాన స్థాయిని కల్పించాలి.

Share
This entry was posted in ప్రత్యేక సంచిక - స్త్ర్లీలు - చట్టాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో