పి. సత్యవతిగారి ఇల్లలకగానే… కథలు – కుటుంబం స్త్రీ – డా|| ఓరుగంటి సరస్వతి

తెలుగులో అభ్యుదయ సాహిత్యోద్యమం తర్వాత పేర్కొనదగ్గ బలమైన సాహిత్యోద్యమాల్లో స్త్రీవాద సాహిత్యోద్యమం ఒకటి. సమాజంలోనూ, కుటుంబంలోనూ, పనిలోనూ స్త్రీలు గురౌతున్న అణచివేత దోపిడీకి సంబంధించిన అవగాహన కల్గి ఉండి ఈ పరిస్థితి మార్చడానికి స్త్రీలూ, పురుషులూ కలిసి చేసే చైతన్యవంతమైన కార్యక్రమమే ”ఫెమినిజం”.

స్త్రీ, పురుషుల అసమానతలకు మూలాలేమిటో గుర్తించి ఆ వెలుగులో సకల మానవ సంబంధాలను రాజకీయ, ఆర్థిక, సాంఘిక, మత, తాత్త్వికాంశాలను అర్థం చేసుకోవటం నూతన సంస్కతి నిర్మాణానికి కావాల్సిన భావజాలాన్ని, చైతన్యస్థాయిని అభివృద్ధిపరచడం స్త్రీవాద ఉద్యమం యొక్క విస్తృత పరిధిగా చెప్పవచ్చును. స్త్రీవాద భావజాలం స్త్రీ పురుషుల జీవితాల్ని, తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసింది. స్త్రీలకు మాత్రమే సంబంధించిన సమస్యల స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి, వ్యక్తీకరించడానికి తమదైన పరిధిలో విముక్తి సాధించడానికి తగిన అవగాహనను అందించడం స్త్రీవాద దృక్పథం చేసిన పని. స్త్రీవాదం సాహిత్యంలోకి ప్రవేశించక ముందు స్త్రీల చైతన్యానికి దోహదం చేసే కథలు ఎన్నో వచ్చాయి. గురజాడ, చలం, కొడవటిగంటి కుటుంబరావు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, ఆచంట శారదాదేవి, రంగనాయకమ్మ, కె. రామలక్ష్మి, చాగంటి తులసి, ఆర్‌. వసుంధరాదేవి, డి. కామేశ్వరి వంటి రచయితలు ఎన్నో కథలు రాశారు. ఐతే అందరి దృష్టికోణం ఒక్కటికాదు. తమదైన అనుభవ దృష్టికోణం నుండి వీరు కథలు రాశారు. మాతృత్వం, వివాహం, విడాకులు వంటి అంశాలను చిత్రించారు. పితృస్వామ్య సమాజం స్త్రీలను అణచివేస్తున్న తీరును చూపించారు. వైవాహిక జీవితంలోను, సమాజంలోను ఆడవాళ్ళ అణచివేతకు గల మూలాల్ని ఒక్కొక్కరు ఒక్కోకోణంలో వారి కథల్లో చిత్రించారు.

ఆంధ్రదేశంలో స్త్రీవాదోద్యమానికి 1973వ సంవత్సరంలోనే బీజాలు పడ్డాయని చెప్పవచ్చును. 1980 తర్వాతనే కవిత్వంలోగానీ, వచన సాహిత్య ప్రక్రియల్లో గానీ బలమైన స్త్రీవాద దృక్పథం కలిగిన రచనలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఎన్నో స్త్రీవాద కథలు వచ్చాయి. ఆ కోవలోనే బలమైన స్త్రీవాద కథలు రాసిన స్త్రీవాద రచయిత్రులలో పి. సత్యవతిగారు ఒకరు.

పి. సత్యవతిగారు జూలై 1940న గుంటూరు జిల్లాలో జన్మించారు. ”ఇల్లలకగానే”, ”మంత్రనగరి” వంటి కథా సంపుటాలను రచించారు. నాలుగు నవలలు రాశారు. అనేక కథల్ని, వ్యాసాల్ని, ఇంగ్లీషు నుంచి తెలుగులోకి అనువాదం చేశారు. వీరి కథలు ఇతర భాషల్లోకి కూడా అనువాదమయ్యాయి. 1995వ సంవత్సరంలో ”ఇల్లలకగానే…” కథల సంపుటి వెలువరించిన తర్వాత ఆమెకు ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆమె ”ఇల్లలకగానే….” కథల సంపుటిలో ముందుమాట రాస్తూ, ”ఈ అసమ సమాజంలో స్త్రీగా జీవించడం ఎంత క్లిష్టంగా వుంటుందో, ఆ క్లిష్టతలో నుంచి ఒక సంపూర్ణ మానవిగా స్త్రీ ఎదగడానికి ఎంత శ్రమపడాలో, త్యాగం చెయ్యాలో ఆలోచించిన కొద్దీ ఆమె జీవితం అంత సంక్లిష్టం కావడానికి కారణాలు తెలిసిన కొద్దీ పడిన ఆవేదనే బహుశా నన్ను ”స్తీ” తప్ప మరో విషయం మీద వ్రాయనీయడం లేదేమో” అని చెప్పారు.

పి. సత్యవతిగారి ”ఇల్లలకగానే…” కథల సంపుటిలో మొత్తం 15 కథలున్నాయి. మొదటి కథ ”ఆకాశంబున నుండి…” స్త్రీ అస్తిత్వాన్ని కోల్పోకూడదని తెలియచేసే కథ.

ఈ కథలో సూరీడు అనే అమ్మాయి తల్లి చనిపోతూ మేనమామకు అప్పగిస్తుంది. అతని పేరు నారాయణ. నారాయణ సూరీణ్ణి పెళ్లి చేసుకుంటాడు. రిక్షా తొక్కే నారాయణకు తోడుగా కుటుంబాన్ని నెట్టుకురావడానికి ఇండ్లల్లో పనిచేస్తుంది. పనిచేసేచోట యజమాని లైంగిక వేధింపులను తట్టుకోలేకపోతుంది. చివరకు నారాయణకు చెప్తుంది. పని మానేస్తుంది. కానీ భర్త నారాయణ సూరీణ్ణి మొదట చూసుకున్నంతగా ప్రేమగా చూసుకోడు. చీటికీ మాటికీ తిడ్తాడు. అలా భర్త దగ్గర ప్రేమ కరువైన సూరీడుకి అప్పలకొండ అనే వ్యక్తి పరిచయంలో ప్రేమను పొంది, అతనితో వెళ్ళిపోతుంది. అతనితో వెళ్ళిన సూరీడు మోసపోతుంది. తర్వాత భగవాన్‌దాస్‌ అనే వ్యక్తి దగ్గరికి చేరుతుంది. అతడు కూడా సూరీడుతో వ్యభిచారం చేయించాలనుకుంటాడు. అందుకు ఒప్పుకోని సూరీణ్ణి హింసలు పెట్టి చివరికి ఒప్పిస్తాడు. గిల్టు మంగళ సూత్రాలు, నల్లపూసలు మెళ్ళో వేసుకుని గృహిణిలా కన్పిస్తూ ఇష్టం లేకపోయినా తప్పని పరిస్థితుల్లో లొంగిపోతుంది. ఒకరోజు అలా వెళ్తున్న క్రమంలో సూరీడు తన భర్త నారాయణ రిక్షాలోనే వెళ్తుంది. సూరీడు గమనించదు. నారాయణ సూరీడుని మొదట గుర్తించక అసహ్యించుకుంటాడు. ఆమెవైపు చూస్తాడు. రిక్షా దిగి వెళ్తున్న క్రమంలో ఎడమ చెంపమీద ఉన్న పుట్టుమచ్చను చూసి, సూరీడని గుర్తు పడ్తాడు. కానీ ఏనాడో సూరీణ్ణి అర్థం చేసుకోకుండా ఉన్న నారాయణ, ఆమె వెళ్ళిపోయిన వెంటనే మరో పెళ్ళి చేసుకుంటాడు. సూరీడు ఇలా తయారవడానికి కారణం ఎవరన్నది ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే హృదయం ద్రవించక మానదు.

ఈ విధంగా కష్టపడి పనిచేసి కుటుంబానికి ఆసరాగా నిలబడాలనుకున్న స్త్రీల బతుకుల్ని, యజమానులు కామంతో

కళ్ళుమూసుకుపోయి, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారన్న సత్యాన్ని ఈ కథ ద్వారా తెలియజేశారు. స్త్రీలు ఎదుర్కొనే లైంగిక పీడనకు ఈ కథ మచ్చు తునక.

స్త్రీలకి పునరుత్పత్తి హక్కులేని వైనం, దానిపై కూడా పురుషుల అదుపు ఉంటుందన్నది సత్యం. చితికిపోయిన కుటుంబ ఆర్థిక పరిస్థితికి మొట్టమొదట బలయ్యేది స్త్రీలే అన్న నగ్నసత్యాన్ని ఈ కథలో చిత్రించారు. పెళ్ళైనా తల్లి కావడానికి ఆ తల్లి ప్రమేయం లేకుండానే అబార్షన్‌ చేయించే వైనాన్ని, ఆడపిల్ల పుట్టుకనే శాపంగా భావించే వైనాన్ని పి. సత్యవతిగారు ”గోవు” కథలో చిత్రించారు.

గోమతికి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేక, పెళ్ళి వయసు దాటిన తర్వాత పెళ్ళై పిల్లలున్న లాయర్‌ సుందర్‌రావు అనే వ్యక్తితో పెళ్ళి చేస్తారు. ఆ ఇంట్లో సుందర్‌రావు అక్క స్వరాజ్యలక్ష్మి కూడా ఉంటుంది. గోమతి ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పటినుంచి ఒక పనిచేసే వ్యక్తిగానే చూస్తారు తప్ప ఇంట్లో మనిషిలా చూడరు. గోమతి తన పరిస్థితిని తలుచుకొని బాధపడ్తుంది. ఆ ఇంట్లో తనకు ఆప్యాయతను చూపించే మనుషులే కన్పించరు. ఆమెకు ఆమే తోడు. గోమతి తల్లికాబోతున్న విషయం తెలిసి బిడ్డను కనడానికి భర్త సుందర్‌రావు ఒప్పుకోడు. మొదటి బిడ్డలే చాలంటాడు. ”ఈ ఒక్కనలుసునీ నాకు దక్కనీయండి మిమ్మల్నేం అడగను” అని గోమతి ప్రాధేయపడ్తుంది. ఈ వయసులో పిల్లల్ని కంటే బాగుండదు కాబట్టి అబార్షన్‌ చేయించుకొమ్మంటాడు.

”ఈ వయసులో వయసొచ్చిన ఆడపిల్ల పడకగది పక్కన భార్యతో పడుకోవడం బాగుందా? ఈ వయసులో జుత్తుకి రంగువేసుకోవడం బాగుందా? వంటికి స్ప్రే, సెంట్లు కొట్టుకోవడం బావుందా?” అని గోమతి భర్తని అడగలేకపోతుంది. గోమతికి తెలియకుండానే మత్తిచ్చి హాస్పిటల్లో చేర్పించి అబార్షన్‌ చేయించారన్న విషయం తెలిసి గోమతి కుమిలిపోతుంది. ఆసుపత్రిలో గోమతి పక్క బెడ్‌లో ముగ్గురాడపిల్లలుండి, మగపిల్లాడి కోసం మళ్ళీ కాన్పుకి వచ్చిన పూచిక అనే ఇల్లాలు తన కథనంతా గోమతికి చెప్తుంది. ”ఏం చెయ్యను, ముగ్గురూ ఆడపిల్లలే! మా ఆయనకి మగపిల్లవాడు కావాలట. క్రిందటి కాన్పులో బాగా సుస్తీ చేసింది. చచ్చి బతికాను. మూడు వేలు ఖర్చయింది. గాజులమ్మేశాను.”

”మళ్ళీ ఏమవుతుందో! బ్రతుకుతానో, చచ్చిపోతానో! ముగ్గురు పిల్లల్ని ఏం చేస్తానో!” అని ఆ ఇల్లాలు తన ఆవేదనంతా గోమతితో చెప్తుంది. అంతలోనే పూచిక భర్త రావడం గోమతి చూస్తుంది. ”ఏమండీ! ఈసారి నేను బ్రతకనండి చచ్చిపోతాను!” అని పూచిక అంటుంది. ”ఛీ! అలా అశుభం పలకకు – ఈసారి నీకు సుఖప్రసవం అవుతుంది. పండంటి మగపిల్లవాణ్ణి కంటావు. నేను జపాలు – అభిషేకాలు చేయించానని” అంటాడు. ”ఈసారి కూడా ఆడపిల్ల పుడితే మళ్లీ…..” అన్న పూచిక మాటకు బదులుగా ”అదే వద్దన్నాను. ఇలా ఏడ్చి ఏడ్చి ముగ్గుర్ని కన్నావు” అంటాడు. ఇదంతా చూస్తున్న గోమతికి తనకు జరిగిన ఘోరానికి, పూచికకి జరుగుతున్న ఘోరానికి బాధపడ్తుంది. గోమతికి కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పి అబార్షన్‌ చేయించిన భర్త, ఆడపడుచు నైజానికి గోమతి ఏడుస్తుంది.

ఆస్పత్రి నుండి ఇంటికి వచ్చాక గోమతికి నిద్రపట్టక హాల్లోకి వచ్చి టీ.వి. చూస్తుంది. టీ.విలో ముగ్గురు ఆడవాళ్ళు… స్త్రీలు చాలా పురోగమించారని, ఇందిరాగాంధీ దానికి ఉదాహరణ అనీ, స్త్రీలు విమానాలు నడిపేస్తున్నారనీ, బిజినెస్‌ చేస్తున్నారనీ, స్త్రీలు గవర్నర్‌లు అయ్యారనీ, పదిమంది పేర్లని పదే పదే చెప్పి, ఈ పది మంది స్త్రీల ప్రగతే భారతదేశ స్త్రీల ప్రగతి అని నొక్కి వక్కాణించడం, ఇంకోకావిడ మీతో ఏకీభవిస్తున్నానని చెప్తుంది. మొత్తానికి అందరూ కలిసి, ప్రపంచం అంతా సుఖంగా ఉంది అని అంతా ప్రగతే అని అంటారు. నలభై కోట్ల స్త్రీ లోకంలో ఇరవైమంది అత్యున్నత స్థానంలో

ఉన్నారని మురిసిన స్త్రీలని చూసిన వెంటనే గోమతికి ఆస్పత్రిలో నాలుగో కాన్పులో తన బ్రతుకో, చావో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్న పూచిక గుర్తొస్తుంది. మాయ చేసి మత్తు పెట్టి అబార్షన్‌ చేయించిన తన స్థితి గుర్తొస్తుంది. సొంత కొడుకు ఇంట్లోనే పనిమనిషి కన్నా హీనంగా బతికిన గోమతి అమ్మ గుర్తొస్తుంది. నూతిలో పడి చనిపోయిన స్నేహితురాలు కాత్యాయిని గుర్తొస్తుంది. అభివృద్ధి, స్త్రీల ప్రగతి ఎక్కడ ఉంది అన్న ఆలోచన గోమతి మనసును ప్రశ్నిస్తుంది.

మర్నాడు ఆస్పత్రికి ఇంజెక్షన్‌కి వెళ్ళిన గోమతికి పూచిక గుర్తొస్తుంది. పూచిక బతికిందా! ఆమెకి మగపిల్లాడు పుట్టాడా? లేదా? అని ఆలోచిస్తుండగా పూచిక తల్లి మళ్ళీ ఆడపిల్లే పుట్టిందని, అల్లుడు నిన్నటి నుంచీ ఆస్పత్రి గుమ్మం తొక్కలేదని చెప్తుంది. ఆడపిల్లను కనడంలో పూచిక నేరమేమిటో గోమతికి అర్థం కాని ప్రశ్న. హైకోర్టులో పని ఉందని చెప్పి హైద్రాబాద్‌ వెళ్ళిన భర్త వేసక్టమీ చేయించుకోవడానికి వెళ్ళాడన్న నిజం తెలిసిన గోమతి తట్టుకోలేకపోతుంది. దాంతో గోమతి ఆ ఇంట్లో అందరిపై ప్రేమాభిమానాల్ని వదిలేసుకుంటుంది. తన పడకగదిలోకి భర్త సుందర్‌రావు ప్రవేశాన్ని నిషేధిస్తుంది.

మరో కథ ”తాయిలం”. భర్తకు అనుగుణంగా నడుచుకుంటూ, అతనికి కోపం వచ్చినపుడు అతని కోపాన్ని భరిస్తూ, అనుగుణంగా నడుచుకునే క్రమంలో తన ఇష్టాయిష్టాల్ని, కోర్కెల్ని కూడా పక్కకు పెట్టే ఇల్లాలు శారద గాథే ”తాయిలం” కథ.

శారద, రావు భార్యాభర్తలు. శారద భర్తకు, పిల్లలకు సేవ చేస్తూ అదే జీవితంగా ఉంటుంది. రావు మాత్రం ఎప్పుడూ ఆఫీసు వ్యవహారాలపైన తిరుగుతూ భార్యాపిల్లలతో తక్కువగా గడుపుతుంటారు. శారద వాళ్ళింట్లోని కిటికీలోంచి ప్రతీరోజూ పక్కనే కాస్త దూరంలో

ఉన్న టీ కొట్టుని గమనిస్తుంది. ఆ టీ కొట్టుకు నారాయణ ఓనరు. అందులో వెంకటేశం అనే కుర్రాడు పనిచేస్తుంటాడు. కొట్టు మూసే సమయంలో రోజూ నారాయణ వెంకటేశంకు ఒక చాక్లెట్‌ ఇస్తాడు. శారద వెంకటేశం పరిస్థితికి జాలిపడుతుంది. నారాయణని అసహ్యించుకుంటుంది. వెంకటేశం ఎంతో నిజాయితీగా కాళ్ళు అరిగేలా పనిచేస్తూ ఉన్నా ఫలితం ఉండదు.

ఒక రోజు శారద భర్త రావు క్యాంపు నుండి హుషారుగా ఇంటికి వస్తాడు. తన బాస్‌ తనని మెచ్చుకున్నాడని, ప్రతి మగాడు సమర్థవంతంగా పనిచేయడానికి భార్యే కారణమని, ఆఫీసులో పనిచేసే వాళ్ళందరికీ, వాళ్ళ భార్యలకి రిస్ట్‌ వాచీలు ఇచ్చారని చెప్పి, ఒక వాచీని శారదకిస్తారు. ఆ క్షణంలో శారదకు నారాయణ, వెంకటేశమే గుర్తుకు వస్తారు.

ఇంటిపనిలో స్త్రీని ఎంతగా కుటుంబం అణచివేస్తుందో తెలిపే కథ ”ఇల్లలకగానే…..” మెదడు కూడా ఇంటిపనితో నింపుకొని వ్యక్తిత్వాన్ని, అస్థిత్వాన్ని ఎలా పోగొట్టుకుంటుందో తెలియజేస్తుంది. ఇంటి చాకిరితో స్త్రీ తన అస్థిత్వాన్ని కోల్పోకూడదన్న సందేశాన్ని పి. సత్యవతి గారు ”ఇల్లలకగానే….” కథలో చిత్రించారు.

ఇల్లాలు కాకపూర్వం ఓ యువతి చదువు తెలివి, చాకచక్యం, అందం, సమయస్ఫూర్తి అన్నీ కల్గిన అమ్మాయి. ఆ అమ్మాయికి పెళ్ళవుతుంది. పెళ్ళైన నాటి నుండి ఆ ఇల్లాలు ఎప్పుడూ భర్త, పిల్లలు వారి సేవలోనే మునిగిపోతూ ఇంటిని చక్కగా అలికి, ముగ్గులు పెట్టుకోవడమే ధ్యేయంగా పెట్టుకుంటుంది. ఆ పనుల్లోనే సంతోషంగా ఉంటుంది. ఆ ఇల్లాలికి ఒకరోజు ఎదురింటివైపు

ఉన్న గోడపై ”మిసెస్‌. ఎం. సుహాసిని. ఎం.ఏ.పిహెచ్‌.డి…. ప్రిన్సిపాల్‌” అని బోర్డు కన్పించింది. అప్పుడు ఆలోచనలో పడిన ఇల్లాలికి తనకి ఒక పేరు, ఒక విద్యార్హత ఉండాలి కదా! అదేమిటన్నది తెలుసుకోవాలన్న ఆలోచనే తన మనసులో ఉంటుంది.

పనిమనిషిని నాపేరు తెలుసా అని అడగ్గా ”అమ్మగార్ల పేర్లతో నాకేం పని! మీరంటే మాకు అమ్మగారె” అని చెప్తుంది. పిల్లల్ని అడిగితే ”నువ్వు అమ్మవి, నీ పేరు అమ్మే” అనీ, నాన్నగారి పేరుతో ఉత్తరాలు వస్తాయి కనుక నాన్నపేరు తెలుసనీ, తన పేరు తెలియదని చెప్తారు. భర్తను అడిగితే ”అదేమిటోయ్‌ ఎప్పుడూ లేనిది ఇవాళ పేరు సంగతి ప్రస్తావిస్తున్నావు. పెళ్ళయిన నాటి నుంచి ”ఏమోయ్‌” అని పిలుస్తున్నా. అలా పిలవడం అలవాటై పోయింది. నిన్ను అందరూ మిసెస్‌ మూర్తి అంటారు కదా” అని అంటాడు. ”మిసెస్‌ మూర్తి కాదండి నా అసలు పేరు నాక్కావాలి” అని అంటుంది. చివరకు తన సర్టిఫికెట్స్‌పై తన పేరు ఉంటుందని, సర్టిఫికెట్స్‌ కోసం వెతుకుతుంది. బీరువాలో పట్టుచీరలు, వెండి కంచాలు, నగలు ఉంటాయి కానీ సర్టిఫికెట్స్‌ కన్పించవు. అనుకున్నదే తడవు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి తన పేరు అడుగగా వారు నీవు మా పెద్దమ్మాయివి అని సమాధానం చెప్తారు. చివరికి తన సర్టిఫికెట్స్‌ కోసం అటకమీద వెతుకుతుంది. ఎక్కడా కన్పించవు. ఆఖరికి తన స్నేహితురాలు ”ఒసేయ్‌ శారదా!” అని కేకలు పెట్టి కౌగిలించుకుంటుంది. ”స్కూల్లో ఫస్ట్‌ వచ్చావు, పాటల పోటీలో ఫస్ట్‌ వచ్చావు, బొమ్మలు గీసేదానివి” అని శారదను గురించి ఎన్నో చెప్తుంది.

శారద ఇంటికొచ్చి అటకమీదున్న ఫైళ్ళన్ని కిందికి దించి, దుమ్ము దులిపి తనకొచ్చిన ప్రైజులు, గీసిన బొమ్మలు, సర్టిఫికెట్లు తీసుకొని భర్త, పిల్లల దగ్గరికి వెళ్తుంది. శారద ఇంటికి వెళ్ళేసరికి పిల్లలు ఇంటిని చిందర వందర చేస్తారు. దుమ్ముధూళితో ఇల్లు నిండిపోయి ఉంటుంది. శారద అవన్నీ వదిలేసి, ఆ దుమ్ము, ధూళి నిండిన సోఫాలోనే కూర్చుని తన పిల్లలకి తను గీసిన బొమ్మలు, తనకొచ్చిన ప్రైజులు చూపించి వాటి గురించి చెప్తుంది. అంతలోనే శారద భర్త వచ్చి ”నువ్వు లేవు – ఇల్లు చూడెలా ఉందో – సత్రంలా ఉంది. అమ్మయ్య నువ్వొచ్చావు ఇంక మాకు పండగేనోయ్‌” అని అంటాడు. ”ఇల్లలకగానే పండగ కాదండీ – ఇక నుంచీ నన్ను ఏమోయ్‌ గీమోయ్‌ అనకండి నా పేరు శారద. శారదా అని పిలవండి” అని గర్వంగా చెప్తుంది.

మరో కథ ”ఇందిర”. పని పిల్లల జీవితాల్లోని విషాదాన్ని కళ్ళ ముందుంచిన కథ. అట్టడుగు వర్గపు స్త్రీల జీవితాల్లోని విషాదాన్ని, అటు పేదరిక భారం, ఇటు పితృస్వామ్య సంస్క ృతి ఎలా వారి బాల్యాన్ని వారికి దూరం చేస్తుందో, తెలియజేస్తూ, బాలికలపై ఉన్న ఆర్థిక దోపిడిని ఈ కథలో చిత్రించారు.

యాదగిరి, ఆదిలక్ష్మి భార్యాభర్తలు. యాదగిరి రిక్షా తొక్కుతుంటాడు. ఆదిలక్ష్మి నాలుగిళ్ళలో పాచిపనులు చేస్తుంది. యాదగిరి, ఆదిలక్ష్మిల పెద్ద కూతురు ఇందిర పట్టుమని పదేళ్ళు కూడా నిండని పిల్ల. తల్లి ఇంటికొచ్చేసరికి తమ్ముణ్ణి, చెల్లెల్ని చూసుకోవడమే కాదు, ఇంటి పనులన్నీ చేస్తుంది. ఒకరోజు ఆదిలక్ష్మి ఇంటికొచ్చేసరికి ఇందిర కన్పించదు. ఆదిలక్ష్మి కంగారు పడ్తుంది. వారం పదిరోజులు చూసి పోలీస్‌ కంప్లైంట్‌ ఇద్దామనుకునే సమయంలో యాదగిరి అసలు విషయం బయట పెడ్తాడు. యాదగిరి చేసిన అప్పులకి, ఇంట్లో ఖర్చులకి చేసిన అప్పులకి ఇందిరని హైద్రాబాద్‌లో ఓ పెద్దింట్లో పనికి పెట్టాడన్న విషయం తెలిసి ఆదిలక్ష్మి ఏడుస్తుంది. ఆరోజు నుంది ఆదిలక్ష్మి తన కూతురు ఇందిర కోసం ఎదురుచూస్తూనే ఉంది.

కొన్ని రోజుల తర్వాత వర్షంలో తడుస్తూ, చిరిగిన బట్టలతో, చిక్కిపోయిన శరీరంతో ఇంటికి వచ్చిన ఇందిరను ఆదిలక్ష్మి మొదట గుర్తు పట్టదు. తర్వాత గుర్తుపట్టి తన కూతురి అవతారాన్ని చూసి భోరున దుఃఖిస్తుంది. ఆ పదిరోజులూ ఇందిర అనుభవించిన నరకం మాటల్లో చెప్పలేం. ఆదిలక్ష్మి తన కూతురు ఇందిరను ఏమీ అడగదు. ఇందిర ఏమీ చెప్పలేకపోతుంది. ”ఆ కాలవ, ఆ గుడిసె-తమ్ముడు, తల్లీ, చెల్లీ ఇవన్నీ మళ్ళీ తనకు దక్కినందుకు బిడ్డ, పోయిన ప్రాణం తిరిగొచ్చినందుకు తల్లి ఒకర్నొకరు చుట్టుకొని తనివితీరా ఏడ్చి ఏడ్చి తృప్తి చెందారు”.

పై కథలో యజమానుల దుర్మార్గాలను, చాలీచాలని బతుకుల్లోని దైన్యాన్ని, కుటుంబంలోని స్త్రీలపై ఆ ప్రభావాన్ని, బాలికల దురవస్థను చిత్రించారు.

ఇంటి చాకిరితో సతమతమయ్యే ఇల్లాలి కథ. ఉద్యోగిని అయినా స్త్రీ ఇంటా బయటా చాకిరితో సతమతమయ్యే స్థితిని పి. సత్యవతిగారు ”చీమ” కథలో చిత్రించారు.

ఈ కథలో వందన భర్తతోపాటు ఉద్యోగం చేస్తుంది. ఇంట్లో పనిమనిషి వరుసగా రాకపోయేసరికి వందన ఇంట్లో పని చేసుకోలేక, సమయానికి ఉద్యోగానికి వెళ్ళలేక పనిమనిషిని తిట్టుకుంటుంది. ఆఫీసులో తోటి ఉద్యోగస్తురాలైన చందనకి ఇద్దరు పిల్లలు. అయినా ఎలాంటి టెన్షన్‌ లేకుండా ఆఫీసుకి రావడం చూసి, వందన ఆశ్చర్యపోతుంది. అదే విషయం చందనని అడుగుతుంది. దానికి సమాధానంగా ఇంట్లో ఎవరి పనులు వారు చేసుకొనేలా అలవాటు చేశానని, అందువల్ల తనకు పనిభారం లేకుండా, ఆఫీసుకి సమయానికి వస్తున్నానని చెప్తుంది. కానీ వందన అందుకు భిన్నంగా ఇంట్లో అందరి పనులు తానై చేయడం వలన సతమతమవుతుందన్న సత్యాన్ని తెలుసుకోలేక పోతుంది.

మూడురోజుల తర్వాత వచ్చిన పనిమనిషిని విషయం తెలియక తిడ్తుంది. పనిమనిషిని భర్త, భర్త అక్కా కలిసి కొట్టారని తెలిసి వందన బాధపడ్తుంది. ఆ దెబ్బలకు జ్వరం వచ్చి పనికి రాలేకపోయిందన్న విషయం తెలిసి వందన బాధపడ్తుంది. ఏ స్థాయిలో అయినా కుటుంబంలో స్త్రీనే బాధకు గురికావడం వందనను బాధిస్తుంది.

కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేక తన శరీరాన్ని పణంగా పెట్టి కుటుంబాన్ని నెగ్గుకొచ్చే మరో స్త్రీ గాథను పి. సత్యవతిగారు ”భద్రత” కథలో చిత్రించారు. స్త్రీల వలన అన్ని రకాల సుఖాలను పొందుతూ కూడా వారిని అవహేళన చేసే పురుష స్వభావాన్ని ఈ కథ స్పష్టం చేస్తుంది.

మోహన్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తాడు. ఆఫీస్‌ స్టాఫ్‌ అంతా భార్యలతో కలిసి మహాబలిపురం వెళ్ళాలనుకుంటారు. మోహన్‌ భార్య కూడా వెళ్తుంది. అక్కడ తన స్నేహితురాలు నీరజను ఒక పెద్దవయసు వ్యక్తితో బీచ్‌లో చూస్తుంది. నీరజ భర్తేమో అనుకుంటుంది మోహన్‌ భార్య. అక్కడ నీరజ మోహన్‌ భార్యను చూసి కూడా గుర్తుపట్టనట్లుగా, గమనించనట్లుగా ఉంటుంది. ఒకరోజు అనుకోకుండా నీరజతో కన్పించిన వ్యక్తి ఆఫీసువారందర్ని అతనింటికి ఆహ్వానిస్తాడు. అప్పుడైనా తన స్నేహితురాలు నీరజను చూడొచ్చుననుకుంటుంది. కానీ అక్కడికి వెళ్ళిన మోహన్‌ భార్యకి ఆ పెద్దమనిషి తన భార్యని కళ్యాణి అని పరిచయం చేయడంతో విషయం అర్థం కాదు. నీరజను గురించి ఆలోచిస్తుంది.

మోహన్‌ భార్యకి ఎలాగైనా తన స్నేహితురాలు నీరజను గురించి తెలుసుకోవాలనుకుంటుంది. ఒకరోజు నీరజ అనుకోకుండా దార్లో కన్పడుతుంది. నీరజ ఇంటికి వెళ్తుంది. ఇంట్లో నీరజ

ఉండదు. నీరజ తల్లి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. నీరజ ఆఫీసు పనిమీద క్యాంపుకి వెళ్ళిందని చెప్తుంది. ఆఫీసులో ఇలా నీరజకి క్యాంపులు వేస్తారట అని చెప్పడంతో మోహన్‌ భార్యకి స్నేహితురాలి విషయం అర్థమవుతుంది. నీరజ తన తల్లిని, చెల్లెల్ని పోషించుకోవడానికి పడే ప్రయత్నాన్ని దూషించలేకపోతుంది. కానీ అంతకు ముందు నీరజను గురించి మాట్లాడడం బాధని కల్గిస్తుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి ప్రభావం స్త్రీపై, వారి జీవితంపై పడే ప్రభావాన్ని రచయిత్రి పై కథలో చిత్రించారు.

ఇంకా ఈ సంపుటిలో ”ముసుగు”, ”గణితం”, ”దేవుడు”, ”గాంధారీరాగం”, ”పెళ్ళి ప్రయాణం” ”బదలీ” మొదలైన కథలున్నాయి. ప్రధానంగా ఈ కథలన్నింటిలోనూ అటు కుటుంబంలోనూ, ఇటు సమాజంలోనూ స్త్రీలు ఎదుర్కొంటున్న విభిన్న సమస్యల్ని, విభిన్న కోణాల్లో రచయిత్రి పి. సత్యవతి గారు చిత్రించారు. ఈ కథా సంపుటిలో ఒకటి, రెండు కథల్లో స్త్రీ పాత్రలు నిరాశ, నిస్పృహలు అనుభవించినా, ఎన్నో కథలు స్త్రీ చైతన్య భావాలతో తొణికిసలాడుతున్నాయి. స్త్రీ తన అస్థిత్వాన్ని కాపాడు కోవాల్సిన ఆవశ్యకతను ఈ కథా సంపుటి ద్వారా పి. సత్యవతిగారు సందేశాన్నిచ్చారు. స్త్రీలు తలదించుకోవాల్సిన అవసరం లేదని, న్యూనతతో బతకక్కరలేదనీ, ఈ కథల ద్వారా తెల్పారు. సంపూర్ణమైన స్వేచ్ఛతో జీవించడానికి వెతుకులాట అవసరం లేదన్న సత్యాన్ని ఈ కథల ద్వారా తెలియజేశారు. స్త్రీవాద దృక్పథంతో కథలు రాసిన వారిలో పి. సత్యవతి గారికి ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉందని చెప్పడానికి ఈ కథలు నిదర్శనాలు.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో