డాక్టర్‌ ఆనందీబాయి జోశి (స్త్రీ విద్యా విజయ దుందుభి!!!) – భండారు అచ్చమాంబ

గీ. తనసిరే వేల్పులందధి రత్నముల చేత

వెరచిరే ఘోర కాకోల విషము చేత

విడిచిరే యత్న మమృతంబు వొడము దనుక

నిశ్చితార్థంబు వదలరు నిపుణమతులు.

ఈ ఉత్తమకాంత క్రీ.శ. 1865 వ సంవత్సరం మార్చి నెల 31వ తేదీన పూనా పట్టణం నందు జన్మించింది. ఈమె తండ్రి పేరు గణపతిరావ్‌ అమృతేశ్వర్‌ జోశీ. ఈయన పూర్వులార్జించిన అగ్రహారములోని ధనం వలన జీవిస్తుండేవాడు. వీరి నివాస స్థలము కళ్యాణ పట్టణము. ఆయన భార్య పూనాకి పుట్టింటికి పురుడుకెళ్ళింది. కాబట్టి ఆనందీబాయి అక్కడే జన్మించింది. మన దేశంలోని ఆచారం వలన ఆడబిడ్డ పుట్టటం మన తల్లిదండ్రులకి, బంధువులకి, దుఃఖం కలిగేది. అదే ప్రకారంగా ఈమె తల్లిదండ్రులు కూడా విచార పడ్డారు. అప్పుడు ఈ బిడ్డ వలన తాము ప్రసిద్ధులమవుతామని వారికేం తెలుసు? దేశాచారం ప్రకారం పదకొండు రోజులు గడిచాక పన్నెండో రోజున బారసాల చేసి పిల్లకు యమున అని నామకరణం చేసారు. శిశువుకు మూడు నెలలు వెళ్ళగానే తల్లి కళ్యాణముకు వెళ్ళింది. యమున క్రమక్రమంగా బాలలీలలను చేస్తూ తల్లిదండ్రులను ఆనందసాగరంలో ముంచుతుండేది. ఈమె నాలుగైదు సంవత్సరాల వయసుకే మిక్కిలి తెలివికలదిగా ఉండేది. ఆ తర్వాత ఆ చిన్నది ఇంట్లో ఉంటే అల్లరి పనులు చేస్తుందని తల్లి దగ్గరలో ఉన్న బాలికా పాఠశాలకు ఆమెను పంపసాగింది. కాని చిన్నతనము వలన ఆ చిన్నది విద్యాభ్యాసంలో మనసు పెట్టేది కాదు. ఆమె తల్లి పిల్లలను గొడ్డులా బాదే మూర్ఖపు స్త్రీలలోనిది అవడం వలన ఆమె చిన్నతనంలో తల్లితో చనువు లేకపోగా ఎప్పుడూ శిక్షింపబడుతుండేది. ఆమె అమ్మమ్మ కూడా గణపతిరావ్‌గారి ఇంట్లోనే ఉండేది. కాబట్టి యమునని ఎవరేమన్నా ఆ ముసలమ్మ వారితో తగవులాడుతుండేది. యమున చిన్నప్పట్నుండి ఏదో ఒక పనిలేక కూర్చునే స్వభావము కలిగింది కాకపోవడంతో, ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే

ఉండేది. యమునకి ఏడు సంవత్సరాలు రాగానే తల్లిదండ్రులు ఆమెకు ఆమె వివాహం గురించిన ఆలోచన వచ్చింది. వారు అనేక చోట్ల వెతికి అనుకూలమైన వరుని చూస్తుండగా ఒక గృహస్థుడు ఠాణా అనే గ్రామం నుండి కళ్యాణంకు వచ్చాడు. ఆయనతో గణపతిరావు కుమార్తె వివాహ చర్చ తేగా ఆయన ”ఠాణా లోని పోస్ట్‌మాస్టరు గారి భార్య మరణించింది. మీరాయన వద్దకెళ్ళి విచారించండ”ని చెప్పాడు.

ఆయన చెప్పినవాడు గోపాల వినాయక జోశి సంగమనేర్‌ఖర్‌ గారు. ఈయన తన చిన్నతనంలో తన అక్క, తను చదువుకునే కాలంలో స్త్రీల తెలివి పురుషుల తెలివితో సమానంగా ఉంటుందని తెలుసుకున్నాడు. గోపాలరావుగారికి చిన్నతనంలోనే మొదటి వివాహమయ్యింది. ఆయన తన భార్యకు పై చదువులు చెప్పించి స్త్రీ విద్య వలన లాభాలను ప్రపంచానికి చూపించాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. అందువలన అతడు అనేక ప్రయత్నాలు చేసి తన భార్యకి విద్య నేర్పించసాగాడు. కాని ఆ చిన్నది అత్త, ఆడబిడ్డల పెత్తనంతో నలుగుతున్నందున విద్యాభ్యాసం చేయలేక పోయేది. ఇలా ఉండగా ఆ చిన్నదానికి పదమూడో యేట ఒక కుమారుడు పుట్టి తల్లిని స్వర్గానికి పంపాడు. ఆ చిన్నవాడి పేరు కృష్ణ. అతడిప్పటివరకు కూడా సుఖంగానే ఉన్నాడు. మొదటి భార్య చనిపోయిన తర్వాత గోపాలరావు ఎంతో ఉదాసీనుడై రెండో వివాహం చేసుకోనని నిశ్చయించుకున్నాడు. మొదటి భార్య ఉన్న కాలంలోనే అతనికి మొదట పూనాలో పోస్టాఫీసులో ఒక చిన్న జీతం కల పని దొరికి తర్వాత స్వతంత్రంగా ఠాణా లోని పోస్టు మాస్టరు పని దొరికింది. ఆయన తన మొదటి భార్య ఎదుర్కొన్న పెత్తనం చూసి చిన్నతనంలో వివాహం చేసి పిల్లల్ని అత్తవారింటికి పంపే తల్లిదండ్రులను, పరాయి పిల్లలని అతి క్రూరంగా చూసే అత్తలని బాగా దూషించేవాడు. ఇవన్నీ ఆలోచించి ఆయన రెండో పెళ్ళి చేసుకోడానికి ఇష్టపడలేదు. కాని గణపతిరావు ఆయన వద్దకొచ్చి తన కుమార్తెని చేసుకోవలసిందిగా అడగ్గా తానొక స్త్రీని సంపూర్ణ విద్యావతిని చేసి ప్రపంచానికి ఉదాహరణగా చూపాలనుకున్న వాడవటంతో, ‘నాభార్యకు నేను ఎలాంటి విద్య చెప్పించినా మీరు అడ్డుపడకుండా ఉండేట్లయితే నేను వివాహానికి ఒప్పుకుంటాన’ని అన్నాడు. గణపతిరావు గారు దానికి ఒప్పుకోవడంతో కొన్ని రోజులకి వివాహం జరిగింది. దేశాచార ప్రకారం వివాహానంతరం యమునాబాయికి ‘ఆనందీబాయి’ అని అత్తవారు పేరు పెట్టారు. పెళ్ళయిన తర్వాత గణపతిరావు గారి అనుమతి ప్రకారం గోపాలరావు రోజూ సాయంత్రం కళ్యాణ పట్టణానికి వచ్చేవాడు. ఆనందీబాయి కొంచెం చదువుకుందని తెలిసి గోపాలరావు మరాఠి పుస్తకాలు కొని తెచ్చి ముత్తవ్వ చేత ఆమెకి ఇప్పించి చదివేటట్లు చేసేవాడు. రెండో పెళ్ళివాడు కావటంతో పిల్లదానిని త్వరలో భర్తగారితో మాటలాడమని ప్రోత్సహించేవారు. కాని ఆనందీబాయికి ఆ కాలంలో భర్త అంటే ఒక పులిలా అనిపించటంతో ఆమె భయపడుతుండేది. గోపాలరావు ఆమెని ఎంతమాత్రం భయపెట్టక బుజ్జగించి చదువు మొదలైనవి చెప్తుండేవాడు.

గోపాలరావు ఆనందీబాయికి విద్య నేర్పించటం ఆయన మామగారికి ఏమాత్రం ఇష్టం లేదు. ఆయన అందుకు ఒప్పుకున్నవాడవటం వలన అల్లుడితో ఏమీ అనలేక ఇతరులతో స్త్రీ విద్యవలన కలిగే నష్టాల గురించి చెప్పించి మాన్పించాలని చూశాడు. కాని గోపాలరావు వారందరికీ తన సమాధానం చెప్పి పంపాడు. మామ గారి ఊరికి సమీపంలో ఉంటే భార్య విద్య సాగదని గోపాలరావు అల్లీబాగ్‌ అనే గ్రామానికి మారాడు. అక్కడికి ఆనందీబాయి తోపాటు ఆమె ముత్తవ్వ కూడా వెళ్ళింది. కాబట్టి పిల్లకి ఏ విధమైన భయము లేకపోయింది.

ఆ తర్వాత గోపాలరావు ఆమెకు విద్య వలన లాభాలని తెలియచేయగా ఆమె ఎంతో శ్రద్ధతో ప్రతి రోజూ తప్పకుండా పాఠాలు చదువుతుండేది. ఆమె చురుకుదనం చూసినకొద్దీ గోపాలరావుకు మరింత ఉత్సాహం కలిగి అతడు ఆమెతో అనేక సంగతులని ముచ్చటిస్తుండేవాడు. అందువల్లే ఆనందీబాయికి త్వరగా విద్యాసక్తి కలిగింది. పెళ్ళైన తర్వాత రెండు సంవత్సరాలలో ఆనందీబాయికి మహారాష్ట్ర భాష చక్కగా చదవటం, వ్రాయటం వచ్చింది. అంతలో భాషలోని వ్యాకరణం, భూగోళం, ప్రకృతి శాస్త్రం, గణిత శాస్త్రం మొదలయినవి గోపాలరావు గారు చక్కగా నేర్పించారు. అల్లీబాగ్‌లో ఉండే కాలంలోనే ఆనందీబాయి పుష్పవతి అవటంతో భార్యాభర్తలని ఒక్కటి చేసారు. వెంటనే ఆనందీబాయి గర్భవతి అయినందున ఆమె కళ్యాణంకి వెళ్ళింది. అక్కడ ఆమెకి కొడుకు పుట్టి పదో రోజున చనిపోయాడు. దీంతో ఆనందీబాయికి చిన్నతనంలోనే పుత్ర దుఃఖం కలిగింది. అందువలన కొన్ని రోజుల వరకు ఆమె విద్యాభ్యాసానికి భంగం కలిగింది. కాని ఆ తర్వాత మరల ఆమె చదువు చక్కగా సాగుతుండేది. కొన్ని రోజులలో ఆమెకు తన మనోగతాన్ని చక్కగా రాసి తెలియ చేసేంత ప్రజ్ఞ కలిగింది. అల్లీబాగ్‌లోని లోకులు ఆనందీబాయికి వచ్చిన విద్యను చూసి ఓర్వలేక గోపాలరావుని అనేక కష్టాలు పెడ్తుండేవారు. దాన్తో అక్కడ ఉండటం ఇష్టం లేక, కోలాపురంలో (కొల్హాపూర్‌) స్త్రీ విద్యకు అనుకూలంగా ఉండే వారున్నందున చాలా ప్రయత్నం చేసి గోపాలరావు గారు అక్కడకి మార్చుకున్నారు. కోలాపురంలో బాలికల పాఠశాల వీరింటికి దూరం అవటంతో ఆనందీబాయిని ఒక్కర్తెనే అంత దూరం కాలినడకన పంపే వీలు లేకపోయింది. పాఠశాలలో ఉపాధ్యాయినిగా ఉన్న మిస్‌. మాయసీ గారి ఇల్లు వీరి ఇంటికి దగ్గర్లో ఉండేది. ఆమె చాలా మంచిదని విని గోపాలరావు గారు ఆమెతో మాట్లాడటానికి వెళ్ళారు. ఆయన మాటల్లో ”నా భార్యని మీ బండిలో కూర్చోబెట్టుకుని వెళ్తారా” అని అడగగా ఆమె కొంత ఆలోచించి అలాగే అంది. ఆనందీబాయి కొన్నాళ్ళు అక్కడి పాఠశాలకి వెళ్ళేది. కాని ఆ తర్వాత మాయసీ తన బండిలో చోటివ్వక పోవడంతో ఆమె పాఠశాలకి వెళ్ళటం మానేయాల్సి వచ్చింది.

కోలాపురంలో ఈ దంపతులు ఫాద్రీల (క్రైస్తవ గురువులు) ఇళ్ళకి వెళ్తుండేవారు. ఫాద్రీ ఆడవారు ఆనందీబాయికి ఇంగ్లీషు రెండు మూడు పుస్తకాల వరకు నేర్పించారు. ఆనందీబాయి చిన్నవయస్కురాలయినా వారు చేసే మతబోధకాక కేవలం నీతి వాక్యాలనే గ్రహించుకునేది. వీరి వలననే ఈ దంపతులకి అమెరికాలోని సంగతులన్నీ వివరంగా తెలిసాయి. దీన్తో అమెరికా వెళ్ళి విద్యనభ్యసించాలని ఆనందీబాయికి అప్పట్నుండి కోరిక కలిగింది. 1879 వ సంవత్సర ప్రారంభంలో గోపాలరావు గారిని బొంబాయికి మార్చారు. అక్కడ ఉండే రోజుల్లో ఆనందీబాయి ొంతవరకు ఇంగ్లీషును, సంస్క ృతాన్ని నేర్చుకుంది. కాని అక్కడ కూడా లోకులు ఆమె విద్యాభ్యాసానికి అనేక ఆటంకాల్ని తెచ్చేవారు. ఇలా ఉండగా 1880 వ సంవత్సరంలో అక్కడినుండి భూజ (భుజ్‌) అనే గ్రామానికి మార్చటం వలన, ఆ దంపతులు అక్కడికి వెళ్ళారు. బొంబాయి నుండి భుజ్‌కి వెళ్ళేటపుడు ఆనందీబాయి ముత్తవ్వ ఆమెతో రానందున ఇంటి పనంతా ఆమే చేయాల్సి వచ్చేది. ఇంటి పనంతా చేసి ఆనందీబాయి భర్త దగ్గర ఇంగ్లీషు మాట్లాడటం చక్కగా నేర్చుకుంది.

గోపాలరావుగారు భార్యని పెద్ద చదువు చదివించాలని

ఉండడం ఒక వార్తాపత్రికలో చదివి అమెరికాలోని న్యూయార్క్‌ పట్టణ వాసి అయిన మిసెస్‌ బి.యఫ్‌. కార్పెంటర్‌ అనే ఆమె ఆనందీబాయికి సహాయం చేయాలనుకుని ఆమెకొక ఉత్తరం రాసింది. ఈమే ఆనందీబాయికి అనేక విధాలుగా సహాయం చేసి ఆమెని కూతురిలా చూసుకుంటుండేది. కాబట్టి ఆనందీబాయి కూడా ఆమె పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉండి ఆమెని పిన్నీ అని పిలుస్తుండేది. ఆమెకి ఆనందీబాయి రాసిన ఉత్తరాల వలన మన దేశంలోని స్త్రీలకి గల పరతంత్రత, దానిని వదిలించటానికి ఆనందీబాయికి గల అభిప్రాయాలు తెలుస్తున్నాయి. స్త్రీలకు పెద్ద చదువులు చెప్పించినా కూడా వారికి సాహిత్యం తెలియదని ఆమె నమ్మకం. ఇదంతా ఆమె తన అనుభవం ద్వారానే తెలుసుకుంది. ఇలా ఉత్తర ప్రత్యుత్తరాల వలన వారిద్దరి మధ్య సఖ్యత పెరిగింది.

తర్వాత గోపాలరావు గారిని కలకత్తాకు మార్చారు. అక్కడ ఉండే కాలంలో పోస్టాఫీసులో 30 రూపాయల వేతనం గల

ఉద్యోగం చేయడానికి ఆనందీబాయికి అవకాశం వచ్చింది. కాని ఉద్యోగంలో చేరి స్వతంత్రతను పోగొట్టుకోవడం ఇష్టంలేక, ఆమె దానిని స్వీకరించలేదు. ఆ తర్వాత ఆమెకు అమెరికాలో వైద్యవిద్య అభ్యసించాలన్న కోరిక అధికమయ్యింది.

కలకత్తా నుండి శ్రీరామపురం అను ప్రాంతానికి మార్చినందున ఆ దంపతులు అక్కడికెళ్ళారు. అక్కడికెళ్ళిన తర్వాత కొన్ని రోజులు సెలవు తీసుకుని వారు సమీపంలోగల జైపూర్‌, ఆగ్రా, గ్వాలియర్‌, లక్నో, కానాపూర్‌, ఢిల్లీ, ప్రయాగ, కాశీ మొదలగు ప్రసిద్ధ పట్టణాలను చూడడానికి వెళ్ళారు. అందువలన ఆనందీబాయికి కొంతవరకు ఇతర ప్రాంతాల స్థితిగతులు తెలిసాయి. వారు తిరిగి శ్రీరామపురానికి వచ్చిన కొన్ని రోజులలోనే రెండు సంవత్సరాల సెలవు తీసుకుని అమెరికా దేశానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. కాని ఇంతలో నీకు సెలవు ఇవ్వలేమని పైనుండి ఉత్తరం వచ్చింది. అందువలన ఆనందీబాయి ఒక్కర్తెనే అమెరికాకు పంపదలచి గోపాలరావుగారు ఆమెతో ఒక రోజు ఇలా మాట్లాడారు :-

గోపాలరావు : (విచారంగా) నువ్వు ఒంటరిగానే అమెరికా వెళ్ళరాదా? నాకిప్పుడు సెలవు దొరకదు. నీకిక్కడి నుండి విద్యాభ్యాసము జరిగే అవకాశం లేదు. కాబట్టి ఒంటరిగానైనా వెళ్ళడం అవసరం. మనమిద్దరం కలిసి వెళ్ళాలంటే ఇంకా రెండు సంవత్సరాలు పడ్తుంది. ఇంతలో అక్కడ నీ చదువు చాలావరకు అయిపోతుంది.

ఆనందీబాయి :- (ఏమీ అనకుండా భర్తవంక చూసి మీరేమంటారని అడిగినట్లు కనపడింది. అది చూసి)

గోపాలరావు : నేటివరకు బ్రాహ్మణ స్త్రీ పరదేశానికెళ్ళి విద్యనభ్యసించిన ఉదాహరణ ఎక్కడా కనపడదు. కాబట్టి నువ్వు వెళ్ళి చదువుకుని ఉదాహరణగా అవ్వు. స్త్రీలు సామర్థ్యం లేని వారన్న మాటని నువ్వు అబద్ధం చేయాలి. మన నడవడిని ఒదిలిపెట్టకుండా అమెరికా వారికి మన నడవడిని నేర్పించు. ప్రస్తుతం సంస్కరణ కావాలనేవారు చాలామంది పురుషులున్నారు. కాని వారి వల్ల కొంచెం కూడా సంస్కరణ జరగటం లేదు. నువ్వు స్త్రీవై కొంచెం సంస్కరణ చేసి చూపించావంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

అందుకు ఆనందీబాయి ఒప్పుకుని అంత దూర దేశ ప్రయాణానికి సాహసించింది! ఆమె తనకు ఎలాంటి కష్టాలొచ్చినా వెనకడుగేయక స్వదేశ సోదరీమణులకు ఒక ఉదాహరణను చూపించి వారికి మేలు చేయాలనుకుంది!!

ఇలా వారు కృతనిశ్చయులై ఆనందీబాయి కోసం అమెరికా లో వేసుకోడానికి అనుకూలంగా ఉండే బట్టలను కుట్టించి సిద్ధం చేసుకుంటున్నారు. ఆనందీబాయి పరదేశపు వస్త్రములు ధరించనని నిశ్చయించుకుని మనదేశంలోని ముతక బనాతు గుడ్డలతోనే దుస్తులను కుట్టించుకుంది. ఇది కదా స్వదేశాభిమానం! ఈమె అమెరికా వెళ్తుందని విని చాలామంది ఆక్షేపించారు. కాబట్టి వారందరికీ సమాధానంగా ఆనందీబాయి ఒక పాఠశాల మందిరంలో సభ చేసి గంట సేపు హూణ భాషలో ధారాళంగా ఉపన్యసించింది. అందువలననే ఆమెకు ఇంగ్లీషులో గల ప్రజ్ఞ, ఆమె యొక్క అప్రతిమ వక్తృత్వశక్తి కూడా తెలుస్తోంది. ఆ ఉపన్యాసం అత్యంత వినదగ్గదిగా ఉండడంవలన జనానా పత్రికలో ఇచ్చినది ఇక్కడ ఉదహరించు చున్నాను.

”నా అమెరికా దేశ యాత్ర గురించి వందలకొద్దీ ప్రశ్నలు నన్ను చాలామంది అడుగుతున్నారు. కావున నేనిప్పుడు అవకాశం కలగజేసుకుని వాటిలో కొన్నింటికి జవాబులు చెప్పదలచాను. అవి ఏమనగా :-

1. నేను అమెరికా దేశం ఎందుకెళ్ళాలి?

2. హిందూ దేశంలో కృషి చేయడానికి నాకు అవకాశాలు లేవా?

3. నేను ఒంటరిగా ఎందుకు వెళ్ళాలి?

4. నేను తిరిగి ఈ దేశానికి తిరిగి వచ్చినపుడు జాతిలోని వారి నుండి నాకు బహిష్కారం కలగదా?

5. ఏదైనా ఆపద సంభవిస్తే నేనేం చేయాలి?

6. స్త్రీలలో ఎవరూ చేయనివి నేనెందుకు చేయాలి? అనేవి.

మొదటి ప్రశ్నకు జవాబు :- నేను వైద్యము నేర్చుకోదలచి అమెరికా దేశానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. ఈ హిందూ దేశము నందు స్త్రీలకు చికిత్స చేయదగ్గ విషయ పరిజ్ఞానము లేని కారణంగా కలిగే బాధలను ఇప్పుడిక్కడికి వచ్చి ఉన్న నారీమణులకు బాగా తెలుసు. ప్రకృతి శాస్త్రములను, స్త్రీ విద్యను అందించడానికి ఈ దేశంలో వెలుస్తున్న సమాజములేవీ మన దేశపు యువతులనెవ్వరినీ, నాగరికతతో ప్రతిష్ఠనొందిన ఖండాంతరాలకు పంపించి వైద్యశాస్త్రంలో ప్రవీణులయ్యేలా చేసి, వారిచే ఇక్కడి స్త్రీలకు ఆ వైద్యశాస్త్రమును నేర్పించే కళాశాలలను స్థాపించాలని ఆలోచించకపోవడం నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తనకు గల లోపాలను వెల్లడి చేయక, వాటి నివారణార్థం అర్థింపక ఉపేక్షిస్తూ నిందాస్పదమైన దేశం ఈ హిందూదేశంకంటె మరొకటి ఏదీ లేదు. ఈ హిందూ దేశమంతటా స్త్రీ వైద్యులు లేని లోపమువల్ల కష్టమవుతోంది. యూరపు దేశపు నారీమణులు, హిందూ దేశపు సుందరీమణులు అవసరం వచ్చినపుడు పరపురుషులకు శారీరకపు స్థితిని వివరించి వారితో చికిత్స చేయించుకోడానికి సహజంగా ఇష్టపడట్లేదు. యూరపు, అమెరికా దేశాల నుండి ఇక్కడకు కొందరు స్త్రీ వైద్యులు వస్తున్నారు. కాని భాష, ఆచార మర్యాదలు క్రొత్తవవటంతో వారు మన స్త్రీలకంతగా ఉపయోగపడటం లేదు. తమ దేశమందు, తమవారి పట్ల నైసర్గికమైన ప్రేమగల హిందూ సుందరీమణులు పరదేశ యువతులతో కలిసి మెలగ లేరు. కావున వారి వలన ఏ సహాయ లాభము పొందలేక పోతున్నారు. ఈ హిందూదేశంలో, స్వదేశ స్త్రీ వైద్యుల అవసరం చాలా ఉన్నట్లు నాకు అనిపిస్తోంది.

(మిగిలిన భాగం వచ్చే సంచికలో…)

Share
This entry was posted in చరిత్ర చీకటిలో వెలుగు రవ్వలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.