ఇది విభిన్న కోణాల నిర్వచనం – దేవి, సాంస్కృతిక కార్యకర్త.

”దేశమును ప్రేమించుమన్నా” అంటే ”ఏ దేశాన్ని” అని అడిగితే నీవు పుట్టిన దేశాన్ని అనే జవాబు తేలికే కాని పుట్టింది అమెరికా, తల్లిదండ్రులు భారతీయులు. లేదా పుట్టింది ఈ దేశంలో కాని స్థిరపడింది వేరే దేశంలో… రెండు దేశాలకు విభేదం వస్తే ఎటు పక్షం వహించాలి? వాళ్ళంటారు తినేది మా సొమ్ము, విశ్వాసం అటువైపా? అని. వీరంటారు నీ రక్తంలో గంగానది ఉందని. సంక్లిష్టతల్లో గుర్తింపు కోసం తపనలో విదేశాల్లో మైనారిటీలయిన తక్కువ చూపు చూడబడే భారతీయులు ఇక్కడా అక్కడా నిరంతరం దేశభక్తిని నిరూపించుకుంటూ ఉండాల్సిందే. గుర్తింపు కోసం కాలం చెల్లిన క్రతువులను వైభవోపేతంగా నిలబెట్టుకుని సాంస్క ృతిక ఆధిపత్యం కోసం పెనుగులాడ్డం తప్పనిసరే. దేశాన్ని సరిహద్దుల కాలమానంతో ప్రేమించాలా? దేశాల సరిహద్దులు మారాయి, మారుతున్నాయి. మారుతూనే ఉంటాయి. గజం నేల కోసం రక్తం ప్రవహిస్తూనే వుంది. నాడు రాజుల భూ దాహమో, ధనవ్యామోహమో, కీర్తి కండూతి కోసమో జరిగే యుద్ధాల్లో సైనికుల, సామాన్యుల ప్రయోజనాలేం వుండవు. దేశభక్తి ఉండే అవకాశమే లేదు రాజభక్తి తప్ప. పురుషోత్తముడు అలెగ్జాండర్‌తో యుద్ధం చేయటం అతని మనుగడ కోసం మాత్రమే. ఎందుకంటే ఒక అమూర్త భావనగా కూడా భారతదేశం ఆనాడు లేదు. రాజులకు తమ స్వప్రయోజనాలు దాటి ఆలోచించే అలవాటూ లేదు. ఏ రాజయినా యుద్ధం చేయటం, ఆలయాలు నిర్మించడం, కూలగొట్టడం ఎప్పుడూ దేశభక్తికో, దేశద్రోహానికో నిదర్శనం కాదు.

దేశభక్తి భావన పై చర్చంతా అస్పష్టంగా ప్రశ్నించరాని ఒక పవిత్ర భావనగా జరుగుతోంది. అది ఉద్దేశ పూర్వకంగానే జరుగుతున్నది. అది అస్పష్టంగా నిలిపినంత కాలం మన ప్రయోజనాలకు అడ్డం పడే ప్రతిదానికి దేశద్రోహం ముద్రవేయటం చాలా తేలిక. జెండాలు, నినాదాలు, పాటలు, దేశమాత చిత్రపటాలు దేశభక్తిలో చాల చిన్న భాగమయిన ప్రతీకలు. అది చాలా సంకుచితంగా కుదించబడిన ప్రతీకాత్మకత మాత్రమే. మిలటరీని దేశభక్తికి ప్రతీకగా చూపడం దీనిలో భాగమే… ప్రజలకు భద్రత యివ్వాలని పోలీసుగాను, దేశాన్ని రక్షించాలని మిలటరీలోకి భర్తీ అయ్యేవారి సంఖ్య అత్యల్పం. పేద వర్గాల వారికి అదో స్థిర ఉపాధి. కాని దానికో గొప్ప ఘనత ఆపాదిస్తే చేరిన వారికి తృప్తి, గౌరవం లభిస్తాయి. కాని రిటైరయిన మిలటరీ వారి దేశభక్తి అవసరం లేనిది కాబట్టే వారికి బతికేందుకు అవసరం అయిన కోర్కెలు తీర్చడం భారం అయ్యింది.

పాశ్చాత్య దేశాలలో పారిశ్రామిక యుగంతో స్థిరపడిన సరిహద్దులు, జాతీయతలు ఆ దేశాల్లో ఉన్న వారందర్నీ కలుపుకునే విశాలతత్వంతో లేవు. ఆ జాతీయతకు ఆధిపత్యం వర్ణం రెండూ ఉన్నాయి. చివరికి మితిమీరిన ఆ దేశ భక్తి మిలటరీ మార్చింగ్‌ సాంగ్స్‌, వైభవోపేత గత వర్ణనలు, జెండాలు, మైనారిటీల ఊచకోతలతో విరాజిల్లింది. రెండు ప్రపంచ యుద్ధాలలో మానవ హననం చేసిన జాతీయ వాద నియంతల్ని సృష్టించింది. ఈనాటి యూరపులో వలస నియంత్రణకు కఠిన చట్టాల డిమాండు వెనుక ఈ సంకుచిత జాతీయతే దాగి వుంది. ఆర్థిక సంక్షోభంలో యిటీవల వస్తువులను కొని మార్కెట్‌ను నిలబెట్టడమే దేశభక్తి అని అమెరికా అధ్యక్షులు కోరేదాకా ఆర్థిక దేశభక్తి మారింది. అయితే అమెరికా వియత్నాంపై చేసిన యుద్ధానికి భరత వాక్యం యూనివర్సిటీల నుండే మొదలయ్యింది. ఇరాక్‌పై దాడిని ప్రశ్నించిన పౌరుల్ని, విద్యార్థుల్ని వారు దేశద్రోహులనే సాహసం చేయలేదు. కాని మిలటరీయే దేశభక్తి అయితే సెనేటర్లు, సంపన్నుల బిడ్డలు మిలటరీలోనూ, యుద్ధంలోనూ ఎందుకు లేరని అక్కడ నిలదీసారు. ఇక్కడ కూడా నిలదీయాలి. ఎవరి దేశభక్తి ఎన్ని పాళ్లుందో లెక్కలు తేల్చాలి.

మన దేశభక్తికి ఒక విచిత్ర లక్షణం ఉంది. రిటైల్‌ రంగంతో సహా విదేశీ కొర్పొరేట్లకు దేశాన్ని కట్టుబెట్టడానికి స్వదేశీభక్తి అడ్డం రావడం లేదు. దేశీయ వృత్తులు, మార్కెట్‌ సర్వనాశనం అవుతున్నా వారికి ఏ రక్షణా కల్పించకుండానే స్వేచ్ఛా బజారుకు సరిహద్దులు చెరిపి వేయడానికి దేశభక్తి ఆటంకం కావటం లేదు. కాని ప్రార్థనా స్థలాల్లో మహిళల ప్రవేశం కావాలంటే అది జాతిద్రోహం అని ఏకకంఠంతో ధ్వజం ఎత్తుతున్నారు. దైవభక్తికీ దేశభక్తికీ మధ్య విభజన రేఖల్ని చెరిపేసి రెండూ ఒకటే అనే ఎడతెగని ప్రచారం చేస్తున్నారు. ఛాందస హిందూత్వమే దేశభక్తికి కాలమానం అంటున్నారు.

పూర్తిగా అగ్రవర్ణ హిందూ అలంకరణలతో జెండా పట్టుకున్న దేశమాత ఆదివాసీలకూ, దళితులకూ, మైనారిటీలకు స్వంత మాత భావన కలిగించగలదా? భిన్న రకాల సాంప్రదాయిక వేషధారణలు గల దేశంలో హిందూ దేవతల్లాగే దేశమాత ఎల్లప్పుడూ ఉండాలా? ఒడీషా ఆదివాసీ కట్టులోనూ, అస్సాం చేనేత దుస్తులలోనూ, కాశ్మీరు శిరసాలంకరణ తోనూ అపుడపుడయినా ఎందుకుండదు? బహుముఖ సంస్కృతులు గల దేశానికి మాత బహు రూపాల్లో ఎందుకు కనబడదు? ఎందుకంటే మిగిలిన వాటన్నింటినీ కాలరాసి ఆధిపత్య సంస్కృతిని జాతీయ సంస్కృతిగా చేస్తున్నారు కాబట్టి.

వీరపుత్రుల్ని కని రక్షణ పొందే వీరమాత ఈ దేశమాత… కూతుళ్ళకు వీరత్వం పొందే యోగ్యత లేదు. స్త్రీల దేశభక్తికి ఏకైక నిరూపణ కొడుకుల్ని కని వీరులుగా తీర్చిదిద్దడమే. గ్రామ దేవతల మాదిరి, సమ్మక్క సారక్కల మాదిరి తాను యోధగా బరిలోకి దిగడం కాదు. ఒకవేళ యుద్ధం చేసినా ఝాన్సీలాగ కొడుకు వారసత్వం నిలబెట్టడానికి చేయాలి. బేగం హజ్రత్‌ మహల్‌ అదే పనిచేసినా మతం వల్ల ఆమె యుద్ధం గుర్తింపుకు నోచుకోదు. కనుకనే బ్రిటిష్‌పై స్వయంగా తుపాకి పట్టిన కెప్టెన్‌ లక్ష్మి, నైజాంకు గోరీ కట్టిన వీరనారులు ఈ దేశమాతతో ఐడెంటిఫై కాలేకపోయారు. దేశమాత గురించి గుండెలు బాదుకునేవారు కన్హయ్యలాల్‌ తల్లిని బూతులు తిడతారు. రోహిత్‌ తల్లిని బోనులో నిలబెడతారు. భిన్నాభిప్రాయాలు ప్రకటించిన స్త్రీలందరిపై సామూహిక లైంగిక అత్యాచారాలు, యాసిడ్‌ దాడులు, బెదిరింపులతో సోషల్‌ మీడియా నిండిపోతుంది.

మన వలస పాలన వ్యతిరేక పోరాటం అనేక ధారలుగా పాయలుగా ప్రవాహాలుగా సాగింది. దేశవిముక్తికి స్వాతంత్య్రానికి ఎవరి నిర్వచనం వారిచ్చారు. తెల్లదొరల హేతువాద ఆలోచనే హిందూ మూఢాచారాలకు అడ్డు కట్ట వేస్తుందని నమ్మిన రాజా రామ్మోహన్‌ రాయ్‌కి దేశ భక్తి లేదా? అగ్రకులాల పెత్తనం పోగొట్టడం ముఖ్యం అనుకున్న జ్యోతిబాకు దేశభక్తి లేదా? బాలికల చదువు, వితంతు పునర్వివాహాలకు అంకితం అయిన వీరేశలింగం పంతులుగారి కృషి దేశ దాస్య విముక్తిలో భాగం కాదా? వీరందరినీ మ్లేచ్చులనీ బ్రిటిష్‌ తొత్తులని తెగనాడింది హిందూ ఛాందసులు కాదా? గురజాడ గేయం జాతిగీతిక కావడం (జనగణమన కంటే) సరైందని, నజ్రుల్‌ ఇస్లాం ప్రబోధ గీతాలు వందేమాతరం కంటే శక్తివంతం అని ఎవరయినా అంటే నోరు నొక్కేయడమే దేశాభిమానం అవుతుందా? హిందీని, సంస్కృతాన్ని రుద్దవద్దంటే తమిళులు విదేశీ భావజాల బానిసలవుతారా?

దేశం హిందూ మత దేశంగానో, ఇస్లాం స్థావరంగానో, ఖలిస్తాన్‌ గానో కావాలనుకున్న వారు స్వాతంత్య్ర పోరాటం నుండి నేటిదాకా వున్నారు. అయితే వారెప్పుడూ మైనారిటినే. ఈ ఉపఖండంలో ఏ జాతి, ఏ మతం, ఏ కులంలోని సామాన్యులు వారిని ఆమోదించ లేదు. రకరకాల ప్రజల సమిశ్రిత వైవిధ్యభరిత సంస్కృతులు సమాంతరంగా సుసంపన్నం అయిన దేశం ఓ హరివిల్లు. పరస్పర విరుద్ధాంశాలు, పాత కొత్తలు ఏక కాలంలో మనుగడ సాగించే అల్లిక ఈ దేశపు గొప్ప సంస్కృతి. ఒకే లక్ష్యం కోసం విడి విడిగా పోరాడ్డం ఓ ప్రత్యేక చరిత్ర. గదర్‌ వీరులు, చిట్టగాంగ్‌ పోరాటం, మీరట్‌ కుట్రకేసు, కొమరం భీం ప్రాణార్పణ, ఆజాద్‌ హింద్‌ ఫౌజు దానికి ఉదాహరణ. వీటన్నింటికీ గాంధీజీ ఆమోద ముద్ర లేనంత మాత్రాన వాటిని ప్రజలు తిరస్కరించ లేదు.

ప్రాచీన కాలం నుండి ఈ సమాంతర ధారల్ని అర్థం చేసుకున్న వారు అశోకుడో.. అక్బరో గొప్ప పరిపాలకులుగా ఇతిహాసం స్వీకరించింది. విభజించి కల్లోలం రేపింది తెల్ల వలస వాదులే. ఆ వలస వాదుల తాబేదారులే హిట్లరు నుండి అరువు తెచ్చుకున్న ఏకజాతి భావనకు భక్తి వ్యాపారం, కార్పొరేట్ల స్వేచ్ఛాభివృద్ధి కలిపి కాక్‌టెయిల్‌ దేశభక్తి తయారించారు. ఎపుడయినా ఎక్కడయినా లాభం తగ్గని వ్యాపారం భక్తి, సెక్స్‌.

ఈ దేశపు చెత్తకుప్పల మధ్య ప్రమాదకర వ్యర్థాలను ఏరే అసంఖ్యాక బాలలు దేశభక్తులేనా? స్వచ్ఛ భారత్‌ వారినెపుడు కాపాడుతుంది? జంతు చర్మాలను శుభ్రం చేసేవారు, మానవ మలాన్ని చేతులతో ఎత్తిపోసే వారూ దేశభక్తి పతకాలకు అర్హులేనా? పురుగు మందుల చల్లింపులోనో, వ్యవసాయ సంక్షోభంలో ప్రాణాలు కోల్పోయిన వారికి వీరచక్ర ఉందా? జెండాలెత్తి పూనకాలతో నినాదాలు చేయక పోతే వీరికి దేశభక్తి లేనట్టేనా?

దేశభక్తిని ఒక మూఢ భక్తిగా ప్రశ్నించరానిదిగా అధికారంలోని వారి గుత్త సొమ్ముగా భావించడం, చాలా ప్రమాదకరం. దేశభక్తికి సంకుచిత నిర్వచనాలు, ఓటు ప్రహసనాలు ప్రజలకు హానికరం. అధికారానికి, నాడు ప్రచారంలో ఉన్న ఆధిపత్య భావజాలానికి (స్వార్థ ప్రయోజనాలు ఉన్నా లేకున్నా,) పల్లకీ మోయడం తేలికయిన పని… ప్రాపకం పొందే వ్యవహారం. పల్లకీల మోతవల్ల ప్రజలకు వీసమెత్తు ప్రయోజనం లేదు. ఆచారపుటెడారిలో యింకిపోయిన మేధస్సు వ్యర్థ పదార్థం.

ప్రజలపట్ల ప్రేమ నిజంగా వుంటే అధిపత్యాల్ని అణచివేతల్ని ధిక్కరించాలి. దేశంపట్ల నిబద్ధత ఉంటే అన్యాయాలకు ప్రతికూలత అణువణువూ నిండాలి. దోపిడీని నిలవరించాలంటే జనంపై అపార ప్రేమ వుండాలి. ధిక్కార స్వరాలే విజ్ఞానానికి, ప్రగతికీ, సృజనకూ, సంక్షేమానికి పునాదులు వేసాయి. అమలులో వున్న అజ్ఞానాన్ని, స్వార్థాన్ని ప్రశ్నించిన వారెప్పుడూ అల్పసంఖ్యాకులుగానే ప్రారంభం అయ్యారు. వారిని ఏ కాలంలోనూ ఏ మతం, ఏ రాజ్యం ఉపేక్షించలేదు. వెలివేసింది, వేటాడింది, విషం యిచ్చింది, ఉరి వేసింది, సజీవ దహనం చేసింది, చిత్ర హింసలు పెట్టి కాల్చి చంపింది. సామాజిక ప్రగతి చక్రాలు ప్రశ్నించిన వారి ప్రాణార్పణ బాట మీదే సాగాయి. ప్రశ్నించిన వారే ముందుకు నడిపించగలరు. వారికి కితాబులు, కీర్తి నాదాలు, వీర పతకాలతో పనిలేదు. వారు జీవితాన్ని ప్రేమించారు.

దేశభక్తి ఒక కార్పొరేటు బ్రాండ్‌ కాదు. మిలటరీ బ్యాండ్‌ కాదు. శాశ్వత శిలాఫలకం కాదు. కాలాన్ని బట్టి, సారాంశాన్ని బట్టి అవసరాల్ని బట్టి మారుతుంది. ఈ నిజం జీర్ణం కాని వారికీ, అంగీకరించలేని వారికి ఒక అతీత అమూర్త దేశ భావనపై భక్తి ఉండొచ్చు కాని దేశం పట్ల ప్రేమ ఉండటం సాధ్యం కాదు. దేశం పట్ల ప్రేమాంకితం అయిన వాళ్ళు తోటి మనిషిని ఆహారం గురించో ఆహార్యం గురించో తోడేళ్ళ మందలాగ చీల్చి చంపలేరు. నిజంగా దేశాన్ని ప్రేమించే వారు గురజాడ లాగ, మగ్ధూం లాగ అన్ని రకాల వైరుధ్యాలు వైవిధ్యాలు గల ప్రజల పట్ల భక్తి కలిగి వుంటారు. అంబేద్కర్‌ లాగ దిక్కుల్ని, దేవుళ్ళనీ కదిపేసే చర్చల్ని ఆవాహన చేస్తారు.

 

Share
This entry was posted in గౌరవ సంపాదకీయం. Bookmark the permalink.

One Response to ఇది విభిన్న కోణాల నిర్వచనం – దేవి, సాంస్కృతిక కార్యకర్త.

 1. శ్రీనివాసుడు says:

  సామాజిక కార్యకర్త దేవి గారికి నమస్సులు,
  వార్తా మాధ్యమాల్లో మీ అభిప్రాయాలను, మీ విశ్లేషణలను విని, చదివి అవగాహన, జ్ఞానం పొందుతున్న మీ వేలాది అబిమానుల్లో నేనొకడిని.
  ఈ క్రింది విషయమై మీ పరిశీలనను తెలుసుకోగోరుతున్నాను. తొందరేం లేదు, మీకు ఆసక్తి, తీరిక వున్నప్పుడే వీలుంటే స్పందించగలరు.
  మధుకిష్వర్ గురించి మీరు వినేవుంటారు. వారి జాలగూడు http://www.manushi.in. ఇది మీరు ఇదివరకే చూసివున్నట్లయితే సంతోషం.
  వారి జాలగూటిలో 8 భాగాల ఒక నివేదికాత్మక వ్యాసాన్ని వ్రాసారు. దాని విశ్వసనీయతను తెలుసుకోగోరుతున్నాను.
  http://www.manushi.in/articles.php?articleId=1685&ptype=&pgno=1

  Hate Modi Campaign or Hurt India Agenda?

  Narendra Modi through the Eyes of Gujarati Muslims,Christians and…

  దీని గురించి ఆవిడ ఒక సవాల్ కూడా విసిరారు. -‘ సైద్ధాంతిక వాగ్వివాదాలుగాక మీకు తెలిసిన వాస్తవాలను నాకు చెప్పండి, నన్ను నేను దిద్దుకోడానికి సిద్ధంగా వున్నాను’, అని. గమ్మత్తేమిటంటే ఖాప్ పంచాయత్లను కూడా వీరు సమర్థిస్తున్నారు. రెండో వైపు కూడా చూడాలి, ఆలోచించాలి, చదవాలి అన్న నా అభిప్రాయంతో మీరు కూడా ఏకీభవిస్తారనే అనుకుంటున్నాను.

  Manushi Intervention in the Supreme Court Stalls Unconstitutional Law Demanded by NGOs to Ban Khaps

  http://www.manushi.in/articles.php?articleId=1680&ptype=campaigns

  మప్పిదాలతో,
  శ్రీనివాసుడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో